స్వాతంత్రోద్యమ కాలంలో క్విట్ ఇండియా ఉద్యమానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెల్లదొరలు ఈ దేశాన్ని వదలి వెళ్లిపోవాలని భారత జాతీయ కాంగ్రెస్ చేసిన తీర్మానం మేరకు మహాత్ముడు ఇచ్చిన పిలుపునందుకుని యావత్ దేశం కదలింది. స్వతంత్ర పోరాటయోధులే కాదు విద్యార్థులు, లాయర్లు, ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరూ కదలివచ్చారు. ఆనాడు ఆంధ్ర ప్రజలు కూడా రణోత్సాహంతో కదిలారు. తెలుగు గడ్డ మీద ఆనాడు క్విట్ ఇండియా ఉద్యమం ఎలా జరిగిందో తెలుసుకుందాం.
దేశాన్ని వదిలి వెళ్లండి అంటూ గాంధీజీ ఇచ్చిన పిలుపు, ఉద్యమాల నేపథ్యం ఏమిటి? 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో బ్రిటన్ అక్షరాజ్యాల కూటమిని ఎదుర్కొంది. విజృంభించిన జపాన్ ఆగ్నేయ ఆసియా రాజ్యాలను హస్తగతం చేసుకొంటూ 1942 మార్చి నాటికి భారత సరిహద్దులకు చేరింది. బ్రిటన్‌కు అవి గడ్డురోజులు. దీంతో భారతీయుల సంపూర్ణ సహకారం బ్రిటన్‌కు అవసరమైంది. ప్రభుత్వం ఒక రాజీ పథకం ప్రతిపాదించి సర్ స్టాఫర్డ్ క్రిప్స్‌ను భారతదేశానికి పంపింది. ఆ పథకాన్ని కాంగ్రెస్, ముస్లింలీగ్‌లు తిరస్కరించడంతో క్రిప్స్ రాయబారం విఫలమైంది. ఏప్రిల్ 6న కాకినాడ, విశాఖపట్నంలపై జపాను బాంబులు వేసింది. జపాను విజృంభణ కాంగ్రెసు ఆలోచనా విధానంలో మార్పు తెచ్చింది. 1942 ఆగస్ట్ 7, 8 తేదీలలో బొంబాయిలో సమావేశమైన అఖిల భారత కాంగ్రెస్ సంఘం చరిత్రాత్మక క్విట్ ఇండియా (ఇండియా వీడి పొండి) తీర్మానాన్ని ఆమోదించింది. గత 22 సంవత్సరాలుగా సమీకరించిన అహింసాత్మక శక్తినంతా ఉపయో గించి, పెద్దఎత్తున సామూహిక ఆందోళన చేపట్టాలని కమిటీ తీర్మానించింది. విజయమో, వీరస్వర్గమో (డు ఆర్ డై) అంటూ ఉద్యమకారులు ముందుకు కదిలారు. అదే సమయంలో ప్రభుత్వం కూడా మెరుపు వేగంతో కదిలింది. గాంధీజీ సహా జాతీయ నాయకులందరినీ మరుసటి రోజే నిర్బంధించింది.
నిషేదాజ్ఞలు ఉల్లంఘించాలని పిలుపు
‘క్విట్‌ఇండియా’ ఉద్యమ తీర్మానం ఆమోదించక ముందే ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘం జూలై నెలలో సంఘాలకు ఒక రహస్య సర్క్యూలర్ పంపింది. దీనిని కర్నూల్ సర్క్యూలర్ అంటారు. నిషేదాజ్ఞలు ఉల్లంఘించి సమావేశాలు, సభలు నిర్వహించమని, విదేశీ వస్త్ర విక్రయశాలల వద్ద, మద్య విక్రయశాలల వద్ద పికెటింగ్ జరపమని, రైళ్లను ఆపటం, టెలిఫోన్ తీగలు కత్తిరించటం వంటి శాసనోల్లంఘన కార్యక్ర మాలు చేపట్టమని ఆ సర్క్యూలర్‌లో ఆదేశించింది. క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించగానే ప్రభుత్వం ఆంధ్ర కాంగ్రెస్‌ను నిషేధిత సంస్థగా ప్రకటించింది. తెన్నేటి విశ్వనాథం, అయ్యదేవర కాళేశ్వరరావు, కళా వెంకట్రావు, వీవీ గిరి, మద్దూరి అన్నపూర్ణయ్య, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, దండు నారాయణరాజు, మాగంటి బాపినాడు తదితర నాయకులను అరెస్టు చేశారు. నాయకుల అరెస్టుతో ఉద్యమం చల్లబడిపోతుందన్న ప్రభుత్వ అంచనాలు పూర్తిగా తలక్రిందు లయ్యాయి. ఉద్యమాన్ని క్రమబద్ధంగా నడిపే నాయకులు లేకపోవటంతో, సామాన్య ప్రజలు ఎక్కడికక్కడే రంగంలోనికి దుమికి యావద్భారత దేశాన్ని రణరంగంగా మార్చివేశారు. నాయకుల అరెస్టుకు నిరసనగా ఆగష్టు 11న ఆంధ్రదేశంలోని అన్ని పట్టణాలలోనూ ఉవ్వెత్తున హర్తాళ్‌లు, ప్రదర్శనలు జరిగాయి.
తెనాలి : ఆగస్ట్ 12న కొత్తమాసు మోహనరావు, కోగంటి వెంకటరామయ్య తదితర విద్యార్థి నాయకుల నాయకత్వాన విద్యార్థులంతా సమ్మె చేశారు. కల్లూరి చంద్రమౌళి నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు, విద్యార్థులు కలిసి పట్టణమంతా తిరుగుతూ పూర్తి హర్తాళ్ జరిపారు. రైల్వేస్టేషనులో క్యాంటిన్ తెరిచినట్టు వార్త అందగానే వారంతా ప్రజలను వెంట తీసుకుని రైల్వేస్టేషన్ చేరారు. క్యాంటిన్ మూసివేయ టానికి తిరస్కరించటంతో ఘర్షణ మొదలైంది.
గుంటూరుకు బయలుదేరటానికి సిద్ధంగా ఉన్న రైలును నిలిపివేయమని ఉద్యమకారులు స్టేషను మాష్టరుపై ఒత్తిడి తెచ్చారు. స్టేషనుమాష్టరు వారి డిమాండ్‌ను తోసిపుచ్చి రైలు బయలుదేరడానికి అనుమతి ఇచ్చాడు. కోపోద్రిక్తులైన ప్రజలు ఆ రైలును నార్త్ కేబిన్ వద్ద ఆపివేశారు. డ్రైవర్‌పై రాళ్ల వర్షాన్ని కురిపించగా అతడు పారిపోయాడు. బోగీలన్నింటినీ కిరోసిన్ పోసి తగులబెట్టారు. రైల్వే సిగ్నల్స్‌ను ధ్వంసం చేశారు. రైల్వే ఉద్యోగులందరినీ తరిమివేసి రైల్వేస్టేషన్ దగ్ధం చేశారు. మద్రాసు నుండి వచ్చిన రైలు దక్షిణ కేబిన్ వద్ద ఆపి తగులబెట్టే ప్రయత్నం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్, పోలీసు బలగాలతో వచ్చి కాల్పులు జరుపవలసిందిగా ఆదేశించాడు. ఆ కాల్పులలో ఏడుగురు మరణించారు. 11 మంది గాయపడ్డారు.
చీరాల: అదే రోజున 500 మంది విద్యార్థులు ఊరేగింపుగా బయలుదేరి సబ్ మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లి, బలవంతంగా మూయించారు. తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుపైన, సేల్స్‌టాక్సు ఆఫీసుపైన దాడి చేశారు. అక్కడి నుండి ఊరేగింపుగా రైల్వే స్టేషన్‌కు వెళుతుండగా వేయిమంది ప్రజలు విద్యార్థులతో వచ్చారు. లక్ష రూపాయలకు పైగా రైల్వే ఆస్థుల్ని ధ్వంసం చేశారు. ట్రాలీపై వెళుతున్న సైనిక రిక్రూటింగ్ ఆఫీసర్‌ను, మరో రైల్వే అధికారిని ఆపుచేసి వారితో ‘గాంధీజీకి జై’ అని అనిపించి వదిలి వేశారు. పోలీసులు రావటంతో ఉద్యమకారులు చెదిరిపోయారు.
గుంటూరు: ఆగష్టు 13వ తేదీన గుంటూరులో విద్యార్థులు హిందూ కళాశాల వద్దకు చేరి పోలీసు లపై రాళ్లురువ్వారు. పోలీసులు వారిని తరమగా గాంధీ పార్కులోనికి పరుగెత్తారు. వెంబడించిన పోలీసులు విద్యార్థులపై కాల్పులు జరిపారు. తుపాకి గుళ్లు గుండెలలో దిగి ఇద్దరు అక్కడికక్కడే మరణిం చారు. అనేకమంది గాయపడ్డారు. ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్థానిక బార్ అసోసియేషన్, పోలీసుల చర్యలను ఖండించింది. విద్యాసంస్థలను వారంరోజులు మూసివేశారు.
ఉప్పులూరు : ఆగస్ట్ 14వ తేదీన కృష్ణాజిల్లా ఉప్పులూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఆందోళన కారులు రైల్వేపట్టా పీకి వేసినందుకు పోలీసు బలగం ప్రయాణం చేస్తున్న రైలు ప్రమాదానికి గురైంది.
అత్తిలి – రేలంగి : ఆగస్ట్ 15వ తేదీన యాగంటి చక్రపాణి నాయకత్వాన 500 మంది విద్యార్థులు అత్తిలిలో సమావేశమై ‘గాంధీజీకి జై’ అని నినదిస్తూ రైల్వేస్టేషన్‌లోని రికార్డులన్నింటినీ ప్లాట్‌ఫారంపై వేసి తగులబెట్టారు. స్టేషన్ మాష్టర్ పారిపోయాడు. టెలిఫోన్ వైర్లు కత్తిరించారు. తర్వాత రైలుపట్టాలపైన నడుచుకుంటూ రేలంగి రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. అప్పటికే స్టేషన్‌లో ఉంచిన కిరోసిన్ పోసి రేలంగి రైల్వేస్టేషన్‌ను తగలబెట్టారు.
వేండ్ర : ఆగస్ట్ 16వ తేదీ రాత్రి 200మంది ఉద్యమకారులు వేండ్ర రైల్వేస్టేషన్‌పై దాడిచేశారు. స్టేషన్‌మాష్టర్ నుండి బలవంతంగా తాళాలు తీసుకొని తలుపులు పగులగొట్టారు. రికార్డులను, టిక్కెట్లను ప్లాట్‌ఫారంపై వేసి కిరోసిన్ పోసి తగులబెట్టారు. సమీపంలో ఉన్న రైల్వే స్లీపరులను తగులబెట్టారు.
భీమవరంలో త్రివర్ణ పతాకం రెపరెపలు : కాల్పుల్లో నలుగురి మృతి
ఆగస్ట్ 17, 1942న భీమవరం ప్రజలు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చరిత్రాత్మక పోరాటం నిర్వహించారు. గోకరాజు శ్రీరామరాజు, గొట్టు ముక్కల రామచంద్రరాజు, అయ్యగారి సుబ్బ రాయుడు తదితరుల నాయకత్వంలో దాదాపు వేయిమంది ప్రజలు సమావేశమై భీమవరం బంద్ జరపాలని నిశ్చయించారు. నగరంలోని షాపులను మూసివేయిస్తూ, స్థానిక యుఎల్సీఎం స్కూలుకు వెళ్లారు. హెడ్మాష్టర్ ఎం శామ్యూల్ స్కూలు మూసి వేయటానికి నిరాకరించాడు. ఉద్యమకారులు స్కూలు బిల్డింగులోనికి దూసుకొని వెళ్లారు. విద్యార్థులందరిని బయటకు పంపించివేశారు. బల్లలు, కుర్చీలు విరగ్గొట్టారు. స్కూలు ముందున్న మర్రిచెట్టుపై కాంగ్రెస్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. విద్యార్థులు ఉద్యమకారులతో కలిసిపోయారు.
అక్కడి నుండి డివిజనల్ ఆఫీసుకు వెళుతుంటే మార్గంలో భూపతిరాజు సుబ్బరాజు, వేగేశ్న నారాయణరాజుల నాయకత్వంలో రెండువేల మంది ప్రజలు ఉద్యమకారులతో కలిశారు. భూపతిరాజు సుబ్బరాజు నాయకత్వంలో ఆర్డీఓ ఆఫీసుకు చేరారు. ఆందోళనకారులను చూడగానే ఆర్డీఓ రామానుజ దాస్ ఆఫీసు తలుపులు మూసివేశాడు. ప్రదర్శకులు తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆర్డీఓకు బలవంతంగా కాంగ్రెస్ జెండా ఇచ్చి నడిపించారు. అంతలో కొందరు వెనుక వెళ్లి ఆర్డీఓ ఆఫీసును, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఆఫీసును తగులబెట్టారు. అక్కడ నుండి ఉద్యమకారులు దేశభక్తి నినాదాలు చేస్తూ అర్బన్ బ్యాంకు, కృష్ణా కోపరేటివ్ బ్యాంకు, ఇంపీరియల్ బ్యాంకులను మూయించి శివరావుపేట రైల్వేస్టేషన్‌కు చేరారు. రైల్వేటికెట్లు, రికార్డులు, బెంచీలు తగులబెట్టారు.
జనం అంతకంతకూ వేలసంఖ్యలో వీరితో చేరారు. సుబ్బతాతరాజును అనుసరిస్తూ ఉద్యమ కారులు పోలీసుస్టేషన్‌ను చుట్టుముట్టారు. పోలీసు లతో బాహాబాహీ పోరాటం చేశారు. సబ్ ఇన్‌స్పెక్టర్ మాచ్యుస్ కాల్పులు జరపమని ఆదేశించాడు. పోలీసులు కాల్పులు జరుపుతున్నా లెక్కచేయక, ఆయుధాల వైపు వెళుతున్న ఆందోళనకారులపై సబ్ ఇన్‌స్పెక్టర్ కాల్పులు జరిపాడు. కాల్పులు కొనసాగిస్తే అతని భార్య, పిల్లలను చంపి వేస్తామని బెదిరించారు. అయినా లక్ష్య పెట్టకుండా విచ్చలవిడిగా కాల్పులు జరిపించాడు. కాల్పులలో గొట్టుముక్కల బలరామ రాజు, వేగేశ్న నారాయణరాజు, ఉద్దరాజు వెంకట రాజు, ఒక గుర్తు తెలియని బాలుడు మరణించారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉద్యమకారులు పోలీసుల ఇండ్లపై దాడి చేయగా, సబ్ ఇన్‌స్పెక్టర్ భార్యా, పిల్లలు తప్పించుకొని పారిపోయారు.
ఉండి : అదే రోజున భీమవరం సంఘటనలతో ప్రేరణపొంది ఇనపకులిక శివరామరాజు, చొక్కాకుల వెంకన్నల నాయకత్వంలో ఉండిలో 200 మంది ఆందోళనకారులు కర్రలు, కత్తులు ధరించి రైల్వే స్టేషన్‌పై దాడి చేశారు. టిక్కెట్లు, రికార్డులు, బెంచీలు, కుర్చీలు ధ్వంసం చేశారు. రైలు పట్టాలు పీకి వేశారు.
ఆకివీడు : భీమవరంలో జరిగిన సంఘటనలపై వేమూరి సీతారామయ్య అనే టాక్సీ డ్రైవరు ఆకివీడులో సభ జరిపి, ఆవేశంగా ప్రసంగించాడు. ఆగస్టట్ 17 సాయంత్రం 5 గంటల ప్రాంతంలో 3000 మంది ఉద్యమకారులు ఆకివీడు పోలీస్ స్టేషన్‌పై దాడిచేశారు. కానిస్టేబుల్‌ను కొట్టారు. తుపాకులు, లాఠీలు లాక్కొన్నారు. పోలీసు రికార్డులు, యూనిఫారంలను తగులబెట్టారు. తర్వాత రైల్వేస్టేషన్ పైబడి రికార్డులతో సహా స్టేషన్‌ను తగులబెట్టారు. అక్కడ ఉన్న రెండు వేగనుల ఆహార పదార్థాలను కొల్లగొట్టారు. తర్వాత 12 గ్రామాల కరణాలు కాపుర ముండే గ్రామకచేరీపై దాడిచేసి వారి ఇళ్లలో ఉండే రికార్డులన్నింటినీ కుప్పగా పోసి తగులబెట్టారు. పోస్టాఫీసు, పీడబ్ల్యూడీ సెక్షను ఆఫీసు కూడా ఆందోళనకారుల చేతిలో ధ్వంసమైంది. ఉప్పుటేరు వంతెనను కూడా తగులబెట్టారు.
పాలకొల్లు – లంకలకోడేరు: ఆగస్ట్17వ తేదీన పాలకొల్లులో సీతారామరాజు నాయకత్వంలో 2000 మందితో బహిరంగసభ, బంద్ జరిగాయి. పాఠ శాలలు 10 రోజులు బహిష్కరించాలని తీర్మానిం చారు. ఊరేగింపుగా బయలుదేరి పోలీస్‌స్టేషన్‌పై దాడిచేశారు. సబ్ జెయిల్ వద్ద ఉన్న కానిస్టేబుల్‌ను బయటకు లాగి చితగ్గొట్టారు. సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ క్వార్టర్లను తగులబెట్టారు. సబ్‌ట్రజరీపై దాడి చేసి విధ్వంసం చేసారు. అడ్డువచ్చిన పోలీసు లపై దాడిచేసి తుపాకులు లాక్కొన్నారు. పరిస్థితి అదుపు తప్పటంతో రిజర్వు పోలీసులు బలగాలు కాల్పులు జరిపారు. ఒక వ్యక్తి సంఘటనా స్థలంలోనే తుపాకుల గుళ్లకు బలైనాడు.
ఉద్యమకారుని మరణం ప్రజల్ని మరింత ఉద్యమించేటట్టు చేసింది. సుమారు 2000 మంది ‘క్విట్‌ఇండియా’ నినాదాలు చేస్తూ రైల్వేస్టేషన్‌వైపు నడిచారు. స్టేషన్ మాష్టారు భయంతో తలుపులు వేసుకొన్నాడు. తాటంకి నరసింహమూర్తి రైల్వేస్టోర్సు గది తలుపులు గునపంతో పగులగొట్టాడు. అందులో కిరోసిన్ తీసుకొని రైల్వే రికార్డులు, ఫర్నీచర్‌పై పోసి నిప్పంటించారు. స్టేషన్ కూడా చాలాభాగం కాలిపో యింది. తర్వాత గూడ్సుషెడ్డు అందులో ఉన్న బట్టల బేళ్లు తగులబెట్టారు. అదేరోజున లంకలకోడేరు రైల్వే స్టేషన్ కూడా ఉద్యమకారుల కోపాగ్నికి బూడిదైంది.
పెంటపాడు : ఆగస్ట్ 19న చేతిగుడ్డ సత్యనారా యణ రెడ్డి నాయకత్వంలో స్థానిక హైస్కూల్ విద్యార్థులు పీడబ్ల్యూడీ ఆఫీసును, అందులోని రికార్డులు, ఫర్నీచరును ధ్వంసం చేశారు. తర్వాత పోస్టాఫీసుపై దాడిచేసి రికార్డులన్నీ వీధిలో కుప్పగా వేసి నిప్పంటించారు. పోలీసులు కేసు పెట్టినా ఉద్యమకారులకు వ్యతిరేకంగా సాక్ష్యమివ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు.
దెందులూరు : ఆగస్ట్ 22వ తేదీ రాత్రి కొవ్వలి, దెందులూరు గ్రామాలకు చెందిన 150 మంది ప్రజలు వల్లభనేని కోటేశ్వరరావు, వడ్లగుల్లు మాణిక్యాలరావుల నాయకత్వంలో దెందులూరు రైల్వేస్టేషన్‌పై దాడిచేసి, కాపలా కాస్తున్న కానిస్టే బుళ్లను బంధించి, తుపాకులు లాక్కొన్నారు. తర్వాత స్టోర్సులో ఉన్న కిరోసిన్ పోసి రైల్వేస్టేషన్, సిగ్నల్ లైన్లను తగులబెట్టారు.
చంద్రగిరి : చిత్తూరు జిల్లాలో పానపక్కం- చంద్రగిరి మధ్య ఉన్న రైలు పట్టాలను ఉద్యమకారులు తొలగించిన కారణంగా ఆగస్ట్ 21వ తేదీన గూడ్సురైలు తలక్రిందులైంది.
జగ్గయ్యపేట : సెప్టెంబర్ 20వ తేదీ రాత్రి కృష్ణా జిల్లా కలెక్టరు జగ్గయ్యపేట రెడ్‌క్రాస్ సహాయార్ధం ఏర్పాటుచేసిన ‘చింతామణి’ నాటక ప్రదర్శన తిలకిస్తుండగా ఆయనపై ఉద్యమకారులు రెండు చేతి బాంబులు విసిరారు. కలెక్టరు గాయపడలేదు కాని ప్రేక్షకులలో ఆరుగురు గాయపడ్డారు.
పెద్దాపురం-రాజమండ్రి: పెద్దాపురం తాలూకా లోని ఎర్రవరం బ్రిడ్జిని పడగొట్టే ప్రయత్నం చేసినందున ఏచూరి సూర్యనారాయణతో సహా ఐదుగురిని రాజమండ్రి గోదావరి వంతెన కూల్చ ప్రయత్నించారనే నేరంపై డాక్టర్ ఏబీ నాగేశ్వర రావుతో సహా 9 మందిని అరెస్టు చేసి వివిధ శిక్షలకు గురిచేశారు.
సహాయాలు కోరటం
కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులను పదవులకు రాజీనామాలు చేయాలని కోరిన ఫలితంగా జైలుశిక్ష అనుభవించారు. విశాఖ పట్నం కలెక్టర్ పీఏకు, విశాఖ పోస్టుమాష్టర్‌కు, విజయనగరం డివైఎస్పీకి అలాంటి ఉత్తరాలు రాసినందుకు పి. వీరభద్రరావుకు 6 నెలల జైలుశిక్ష, రూ.500/- జరిమానా విధించారు. భీమవరం సబ్ మేజిస్ట్రేట్ వీరస్వామినాయుడు కోర్టు పనిని నిర్వహి స్తుండగా గోకరాజు వెంకాయమ్మ, వేగేశ్న సుభద్ర అనే యువతులు కోర్టులో ప్రవేశించి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా ఇమ్మని డిమాండ్ చేశారు. ఫలితంగా వారికి 6 నెలల కఠిన కారాగార శిక్ష విధించారు.
ఆంధ్రలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 1500 చోట్ల టెలిఫోన్, టెలిగ్రాఫ్ తీగలు కత్తిరించారు. 23 పోస్టాఫీసులు, 22 ఇతర ప్రభుత్వ ఆఫీసులు, 24 రైల్వేస్టేషన్లు ఆందోళనకారుల చేతిలో విధ్వంసానికి గురయ్యాయి. ఖైదు చేసిన వారిని దిగంబరులను చేసి బెత్తెపు, కొరడా దెబ్బలు కొట్టారు. సంఘటనా స్థలానికి సమీపంలో ఉండే గ్రామాలపై సామూహిక జరిమానాలు విధించారు. ఈ మొత్తం జరిగిన నష్టం కంటే రెట్టింపుగానే ఉండేది. గుంటూరు జిల్లా నుండి రూ.3,21,681లు, పశ్చిమగోదావరి జిల్లా నుండి రూ.2,48,285లు జరిమానా రూపంలో వసూలు చేశారు. ప్రభుత్వం అనుసరించిన పాశవికచర్యల వలన ఉద్యమం తగ్గింది.
– డా।। గాదం గోపాలస్వామి