– డా।। చింతకింది శ్రీనివాసరావు

అందరూ అక్కడికి వెళ్లేసరికల్లా మేళం వేదిక ఎదురు మైదానంలో జనం పెద్దసంఖ్యలో గుండ్రంగా పోగుపడి కానవచ్చారు. తమ మధ్య వాదప్రతివాదాలు చేసుకుంటున్న రెండు వర్గాల వారినీ ఆసక్తిగా చూస్తున్నారు. కొందరయితే సరాసరి వేదిక మీదికే గుంపుగా చేరిపోయారు. ఒకరి భుజాలను మరొకరు కిందికి లాక్కుని మరీ విడ్డూరపడుతూ తగవును తిలకిస్తున్నారు. మేళం కట్టేందుకు సిద్ధపడి సకల అలంకరణలూ చేసుకున్న కులతిలక, ఆమె భోగ సమూహపు సభ్యులు చేష్టలుడిగినట్టుగా అయి పోయారు. వేదికకు అంటింపు చేసిన వెదురు చాపల మండపంలో నిశ్చేష్టులై ఉండిపోయారు. ఏదేదో ఊహించుకుని మిట్టలు పట్టిన కులతిలక, ‘అసలు మేళానికే వీలుకాని పరిస్థితి ఏర్పడింది.’ అనుకుంటూ మౌనంగా రోసిపోతోంది. అప్పటికే చీకటిరేఖలు ప్రసరించే సరికి లెక్కకు మిక్కిలిగా దివిటీలు ఆ ప్రదేశమంతా వెలిగిపోయాయి. రాత్రిని పగలు చేసి తీరుతామన్నట్టుగా ధీమాగా ప్రకాశమానమవు తున్నాయి.

ఈ సమయంలోనే సంజీవరాజు వడివడిగా కదులుతూ గుండ్రంగా దడికట్టినట్టుండే జనం వద్దకు చేరిపోయాడు. వాళ్లను మెల్లమెల్లగా పక్కకు జరుపు కుంటూ గుండ్రపు ముందు వరుసకు వెళ్లిపోయాడు. అతని పద్ధతిలోనే జాజిరాజూ అక్కడికి వెళ్లాడు. అంగరక్షకులూ చాకచక్యంగా ఆవృతపు మొగన, సంజీవుని దరిన, ఎవ్వరికీ ఎరుక లేకుండానే కూడు కుని రక్షణ సముదాయాన్ని నిర్మించేశారు.

అక్కడికి చేరాక కళ్లబడిన దృశ్యం సంజీవరాజును కదిలించి వేసింది. మండివలస కోలగాళ్ల ఆడబొట్టె లందరూ మైదానం మీద కూర్చుని ఏదో దీక్ష పాటిస్తు న్నట్టు గంభీరంగా ఉన్నారు. వాళ్ల వెనకాల ఆ గ్రామపు కోలయ్యలందరూ చేరి ఎదరి పక్షంతో వాదులాడుతూ కనిపించారు. ఆ వెనగ్గా నిలిచిన మండివలస పల్లె జనమంతా తమవారికి అండగా మాటలు జల్లుతున్నారు. వీళ్లందరితో పోట్లాటకు ఇటువైపునుంచి దిగింది వేరెవరో కాదు. నంద రాచమండలిలో ప్రముఖుడని చెప్పదగిన పెళ్ల మహా వీరుని పుత్రుడు తుం•జాలడు. మేళం మిట్టమీదికి రావడానికి కారణమూ ఇతగాడే. త•ండ్రితో కోట నాయకులకు చెప్పించుకుని, మిత్రులతో కలిసి రాచమండలి సభ్యులను ఒప్పించి, చివరికి సంజీవ రాజును సైతం బామాలుకుని మేళం మెరిపించాలను కున్నది ఈ తుంటడే. వీడు పేరుకు తగ్గట్టే తుంటరని అప్పటికీ సంజీవుడికి కొందరు చెప్పకపోలేదు. కానీ, వ్యూహాత్మకంగా మెలగాలనుకున్నందువల్లనే మేళానికి యువరాజు ఒప్పుకోవలసివచ్చింది.

‘ఇంతకీ ఈ తగవు దేనికి, అసలెందుకు ఘర్షణ మొదలైంది?’ పక్కనే ఉన్న ఎవరినో సంజీవరాజు వాకబు చేయబోతుండగానే వృత్తంలో చేరి ఒక వర్గానికి నాయకుడిగా వెలిగిపోతున్న తుంటజాలడు పెనుకేక పెడుతున్నట్టుగా,

‘‘మీరు కోలగాళ్లు. అంటే కడజాతిలో పుట్టిన వాళ్లు. ఇక్కడ ఏర్పాటయిన సానిమేళాన్ని అగ్రవర్ణాల వారే చూడాలి. అందుకే మీకెవరికీ అనుమతి లేదు. మేళం తిలకించడానికి మీరు అర్హులే కారు. వెనువెంటనే వెనక్కి వెళ్లకపోతే వెళ్లగొట్టవలసి వస్తుంది.’’ పెటేపకాయలా పేలిపోయాడు. ఆ వెంటనే మండివలస గ్రామస్తులు, వారికి మద్దతుగా నిలిచిన తీర్థప్రజలు,

‘‘ఆ మాట మేళం దండోరాలోనే చెప్పాలి. తీరా వచ్చాక ఇప్పుడు వెనక్కి వెళ్లమనడం దారుణం. అయినా తీర్థంలో తేడాలేంటి! పండగల్లోనూ పబ్బా ల్లోనూ కుల విచక్షణ ధర్మం కాదు. కావలిస్తే వెళ్లి మీ మహారాణీనే అడగండి. లేకపోతే ప్రభుత్వ పెద్దలను అడుక్కోండి.’’ కస్సుమన్నారు.

తల్లిపేరు, తన ప్రభుత సంగతి ఎప్పుడయితే ప్రస్తావనకొచ్చిందో సంజీవరాజు మరింతగా చలించాడు. అయినా నిబ్బరం వీడలేదు. ఇంతలోనే,

‘‘ప్రభుత్వం ఏమిటి? ఆ మాటకొస్తే నేనే ప్రభుత్వం. మా నాన్న రాచమండలి ముఖ్యుడు. పెళ్లమహావీరుడు. ఎక్కువగా మాట్లాడినవారికి కొరత వేయించి తీరుతా.’’ తుంటడు చెలరేగిపోయాడు. ఆ పట్టున వాడి పీక నొక్కిపారేయాలని అనిపించింది సంజీవుడికి. అయినప్పటికీ ఏం జరిగినా మంచికే అన్నట్టుగా ఓపిక పట్టాడు.

ఆదేవేళన తుంటజాలడి నోరుమూయించే విధంగా ఒక ఆడపిల్ల రివ్వున సెగరేగింది. మండివలస కోలగాళ్ల ఆడబొట్టెల మయాన కూర్చుని దీక్ష చేస్తున్న ఆ అమ్మాయి తాజుగా నిలుచుని,

‘‘ఎవడ్రా నీ నాన్న? నీ నాన్నయితే నీకు గొప్ప. మాకేం గొప్పరా! మీ అబ్బకి తోక ఉంటే వాణ్ణి ఊపుకోమను. మమ్మల్ని ఊపమంటే మేమెందుకు ఊపుతాం. రాచమండలి ముఖ్యుడైతే నువ్వూ, మీ బాబూ వెళ్లి కోటలో కోలాటాలు ఆడుకోండి. మా అందరినీ కడజాతి అనడానికి నీకు ఏ కోట అధికారమిచ్చిందిరా చెవలాయీ?’’ పెద్దపెట్టున స్వరం పెంచేసి తగులుతుంది. దెబ్బకి తుంటజాలడు అవాక్కయిపోయాడు.

అప్పటివరకూ ఎదరిపక్షం వారంతా ఏదేదో మాట్లాడుతున్నారుగానీ, ఇంతగా రగిలిపోయింది లేదు. ఉన్నట్టుండి ఒకానొక బొట్టె చెలంతానికి దిగడంతో అయోమయం పాలయిపోయాడు. ఆ పిల్ల మాటలకి బదులు చెప్పడం వాడికి చేతకాలేదు. ఇంతలోనే,

‘‘గొప్పగా మాట్లాడావే గంగూ. ఇంకా దంచి కొట్టు. మేం ఉన్నాం. నీకేం బాధలేదు.’’ పిల్లపక్కనే కూర్చున్న గరిక సహా మిగిలిన కోలబొట్టెలందరూ గలగలమన్నారు. కోలన్న, రేకమ్మలయితే మరేం ఫరవాలేదన్నట్టుగా

పిల్లవైపు ధైర్యం ఇస్తున్నట్టుగా చూశారు. ఇదంతా గమనిస్తున్న సంజీవరాజు,

‘ఓహో. ఈ పిల్లపేరు గంగమ్మా. భలే మాట్లాడు తోందే. గొప్ప తెగువతో తలపడుతోందే.’ అను కుంటూ ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత తను చెయ్య వలసిన పనేదో ఆ పిల్ల చేస్తోందన్నట్టుగా స్థిమిత పడ్డాడు. పక్కనే ఉన్న జాజిరాజు ముఖంలోకీ చూశాడు. అతగాడూ కనుబొమలు మీదికెత్తి బావుంద న్నట్టుగా సైగచేశాడు. ఈలోపుగానే తుంటజాలడు బరితెగించాడు. ఒరలోని ఖడ్గాన్ని ఒక్కసారిగా బయటకి లాగాడు. గయ్‌ ‌గయ్‌మంటూనే,

‘‘నువ్వెంత. నీ బతుకెంత. కిందిజాతి కోలవి. నన్నే ఎదరిస్తావా? ముక్కలు ముక్కలుగా నరికేస్తాను చూసుకో!’’ మండివలస జనంముందు ఒక్క ఎగురు ఎగిరాడు. గంగు మీదికి కరవాలంతోనే దూసుకు వెళ్లబోయాడు. వెంటనే గంగు సైతం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకే అడుగేసింది. కత్తి రాయుడైన తుంటడి ఛాతీని తన తలతో బలంగా ఢీకొట్టేసింది. దెబ్బకి వాడు తూలి పడబోయి ఆచుకున్నాడు. అనుకోని ఈ పరిణామానికి వాడికి దిక్కులు తెలియలేదు. దిమ్మదిరిగి నట్టయ్యాడు. మండివలస వాసులైతే హర్ష ధ్వానాలు చేశారు. తుంటడి నేస్తులు కోపంగా ఉరికిరాగా, ఇటువైపున్న మండివలస జనమూ ఎదరకి కదిలారు. రగడ మొదలైంది. ఠక్కున కొందరెవరో కలుగజేసుకున్నారు. ఇరుపక్షాల మధ్యకూ చేరిపోయి రెండువర్గాల వారినీ వెనక్కి వెనక్కి తోసేశారు.

అప్పుడే గంగమ్మ నోరు పెంచేసింది.

‘‘మేం మన్నచేడె పడుచులం. తక్కువ జాతి వాళ్లమని మీరన్నంత మాత్రాన అయిపోతామా? మేమెందుకురా మేళం చూడకూడదు! దండోరా వేసేది మేం. దండలు కట్టుకుని నిలబడేది మేం. మీ విలాసాలకు సర్వం సమకూర్చేది మేం. మీ పొలాల్లో పంటలు తీసేది మేం. మీకు కైవారాలు పలికేది మేం. మీరు ఛస్తే కాల్చేది మేం. మిమ్మల్ని వల్లకాట్లో పూడ్చేది మేం. మేమూ మీలాంటి మనుషుమేరా. మా చేత నానా చాకిరీ చేయించు కుని మా మీదే విరగబడతార్రా. మీ రోజులు దగ్గరపడ్డాయిరోయ్‌.’’ అపరకాళిలా వెల్లివిరిసి పోయింది. ఆ దెబ్బకి అక్కడి వారంతా విస్తుపోయినట్టయ్యారు. కొందరయితే నోట మాటరాక స్థాణువుల్లా ఉండిపోయారు. ఆ మీదట తుంటడి నేస్తులు కొందరు కర్రలతో మండివలసవారి మీద కలియబడబోయారు. సరిగ్గా ఆ సమయంలోనే,

‘‘చాలు. చాలు. జరిగింది చాలు. ఆపకపోతే అరదండాలే!’’ ఇకను జోక్యం చేసుకుని తీరవలసిందే నన్నట్టుగా తీవ్రస్వరంతో పలికాడు సంజీవరాజు. బరి మధ్యకి వచ్చిన సింహంలా వృత్తం నడుమ చేరి తీరుగా నిలుచున్నాడు. వెనువెంటనే జాజిరాజు చేతిమీద ఉన్న లోకరక్ష డేగ విసురుగా వచ్చి అతని భుం మీద వాలిపోయింది. అక్కడ చేరినవారిలో కొంతమంది హర్షధ్వానాలు చేశారు. సంజీవరాజుకు జేజేలు పలికారు. వచ్చింది యువరాజని తెలుసుకుని మిగిలినవారంతా మౌనంగా చూస్తుండిపోయారు. ఏం జరుగుతుందోననే ఉత్కంఠతో ఎదురుచూపులకు దిగారు. తుంటజాలడయితే ఉలిక్కిపడ్డాడు. తలవని తలంపుగా అక్కడికి వచ్చేసిన సంజీవుని చూసి నీరుగారిపోయాడు. చేతులు జోడిస్తూ యువరాజు ముందు తల వంచేశాడు. తుంటడి స్నేహితులూ అదే చేశారు.

అకస్మాత్తుగా అక్కడ చోటుచేసుకున్న పరిణామం గంగుకు అంతుపట్టలేదు. ఆమె నేస్తులయిన మిగిలిన కోలగాళ్ల ఆడబొట్టెలకూ ఏం జరుగుతోందో అర్థం కాలేదు. గంగు చుట్టూతా నిశ్శబ్దంగా వారంతా చేరిపోయారు. మండివలస వాసులంతా కళకట్టి కని పిస్తున్న సంజీవరాజు వదనాన్ని చూస్తూ నిలుచుండి పోయారు. రేకమ్మ, కోలన్న దంపతుల స్థితీ అదే. క్షణాల్లోనే వాతావరణమంతా అక్కడ చల్లబడినట్టుగా అయింది. నిశ్శబ్దంగానూ అయిపోయింది. చీమ చిటుక్కుమన్నా వినిపించేటట్టుగా ఉంది.

అలాంటివేళలోనే అలముకున్న చీకట్లన్నింటినీ చెండాడేందుకే అన్నట్టుగా ఇంకొన్ని దివిటీలూ అక్కడ వెలిగాయి. ఆ కాంతుల్లోనే సంజీవరాజు మరొక దివిటీలా మారిపోయి, ‘‘గంగు చెప్పిందే నిజం. అదే కచ్చితం. అదే మానవత్వం.’’ ఉచ్చస్వరమై వెల్లు వెత్తాడు.

యువరాజు మాటలకు కరఘోషతో ఆ ప్రదేశ మంతా మారుమోగిపోయింది. మరోసారి సంజీవుడి కంఠమే ఖంగుమంది.

‘‘మనుషులను విడదేసే కులాలు మనకెందుకు? మనమంతా ఈ భూమి బిడ్డలం. కోలగాళ్లంటూ కొంతమందిని అంటరానివారిగా చూడటం దుర న్యాయం. దీన్ని మా సింహాసనం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదు. ఇది మా రాజ్యపు మర్యాద కూడా కాదు. మనుషులంతా ఒక్కటే అనేది మా విధానం. అదే మా నినాదం.’’ సంజీవరాజు ఎప్పుడయితే ఈ తీరున విస్పష్టంగా తన భావాలను ప్రకటించాడో మండివలస వాసులకు ఎక్కడలేని ధైర్యమూ వచ్చేసింది. కోలగాళ్ల ఆనందానికయితే గట్టులేదు. మిగిలిన తీర్థప్రజల హృదయాలూ రాజు భాషణతో స్థిమితపడ్డాయి. వెనువెంటనే అందరూ కలిసి,

‘సంజీవరాజుకు జై.. సంజీవరాజుకు జై.. జై..’’ పెద్దపెట్టున నినదించారు.

అప్పటివరకూ యువరాజు పేరు వినడమేగానీ అతణ్ణి గంగు చూసిందిలేదు. చూసేందుకు ఆమెకు అసలు అవకాశమూ లేదు. అలాంటి సంజీవరాజు హఠాత్తుగా కళ్లబడటంతో ఉక్కిరిబిక్కిరయిపోయింది. ఇదంతా నిజమేనా! భ్రమా!! అనే సందేహంలో ఇరుక్కుపోయింది. ఆనక ఇదంతా వాస్తవమేనని గుర్తించి అబ్బురపడింది. అన్నింటికీ మించి కడ జాతిగా ముద్రపడ్డ తమను సమర్థిస్తూ సంజీవరాజు మానవత్వంతో మాట్లాడటం ఆమెను విస్మయ పరచింది. విస్తుపోయేలాచేసింది. ఎంతగానో ముచ్చట గొలిపింది. పరమానందాన్ని ప్రాప్తింప జేసింది. దివిటీకాంతుల్లో వేనవేల ప్రభాపుంజాలు విరబూయిస్తున్న సంజీవరాజు వదనం ఆమె మనో ఫలకం మీద ముద్రపడిపోయింది. గంగు అనే కాదు మండివలస ప్రజలందరూ తమ భావి ప్రభువును అప్పుడే చూశారు. కాబట్టే రెండుచేతులూ జోడించి అలా చూస్తూనే ఉండిపోయారు. ఆ సమయంలోనే మరోసారి సంజీవరాజు మాటలు దొర్లించాడు.

‘‘తీర్థంలోనే కాదు. నిత్య జీవితంలోనూ మానవు లంతా సమానమే అన్నట్టుగా మా రాజ్యాన అందరూ ఉండవలసిందే. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిన తుంటజాలడు నేరస్తుడు. అతగాణ్ణి బంధించి కారాగారంలో వేయండి. ఈ వివాదానికి కారణమైన సానిమేళాలను ఇకమీదట కొండల్లో నిషేధిస్తున్నాం. వడ్డాది మేళగాళ్లను గౌరవంగా వారి తావుకు పంపేయండి•. మండివలసవాసులనూ జాగ్రత్తగా వారి ఊరు చేర్చండి.’’ ఆదేశాలుగా పలుకుతూనే భుజాన ఉన్న డేగను ప్రేమగా నిమిరాడు.

ఆ ఆజ్ఞలు అమలు చేసేందుకు జాజి, అంగ రక్షకులు సిద్ధమైపోయారు. అక్కడ తనకిక పనేం లేనట్టుగా తలపోసి గబగబా జనంలోకి వెళ్లిపోయాడు సంజీవరాజు. అలా వెళుతూ వెళుతూ ఒక్కసారిగా గంగు మొహంలోకి చూశాడు. ఆమె కూడా అతని కళ్లల్లోకి చూడనే చూసింది. చుట్టుపక్కల దివిటీలన్నీ ఎందుకనో మరింతగా వెలిగాయి.

‘‘నందప్రభువు సంజీవరాజు వర్థిల్లాలి.. వడ్డాది వారసుడు సంజీవుడు వర్థిల్లాలి..’ పెద్దపెట్టున జనం వల్లింపుచేశారు.

———-

వంటలమామిడి వదిలిపెట్టి వచ్చినప్పటినుంచీ సంజీవరాజు మనుగడ తేడాగానే ఉంది. తినలేక పోతున్నాడు. తిరగలేకపోతున్నాడు. తలపోతలు చేయలేకపోతున్నాడు. వ్యూహం పన్నలేకపోతున్నాడు. తేగదుంపలు చేదుగా నోటికి తగులుతున్నాయి. కొర్రన్నం పులుపుగా అనిపిస్తోంది. పిట్టమాంసం వగరవుతోంది. ఇష్టంగా తినే వెదురుకొమ్ములూ నచ్చడం లేదు. కంటికి కునుకులేదు. చిత్తానికి శాంతిలేదు. ఒకవైపున రాజ్యంలో పెరుగుతున్న జాతి భేదాలు కంపరం పుట్టిస్తున్నాయి. మనుషుల్లో మానవత దూరమైపోతోందన్న బెగులుతో కడుపు దేవుకుపోతోంది. మరోవైపున కోలగాళ్ల పిల్ల గంగు అందరి ముందూ నిర్భయంగా నిలిచి మాట్లాడిన మాటలు సత్యప్రకటనలుగా బుర్రను తొలిచి వేస్తున్నాయి. ఇంకోవైపున ఆ పిల్ల గుణగణాలు, వాక్పటిమ, అందం, చందం మనసును ఆక్రమించు కుంటున్నాయి.

‘ఒక్కసారి గంగును చూస్తే చూపు తిప్పుకోగలరా ఎవరైనా! లావణ్యానికి మేధాసంపత్తి తోడయిన బాల ఎలా ఉంటుంది. మనోహరమై కానవస్తుంది. అచ్చం గంగమ్మలాగానే ఉంటుంది.’ సరిగ్గా ఈ మాటలనే గడచిన వారం రోజులుగా లక్షలసార్లయినా వల్లెవేసు కుని ఉంటాడు సంజీవుడు. ఈ విషయాలన్నింటినీ అమ్మ మోదమ్మతోనూ అప్పటికే పంచుకుని ఉన్నాడు.

పుట్టి, పురుముళ్లు పూర్తయి, పేరు పెట్టుకుని, పెద్దవాడయి, జ్ఞానం వచ్చాక, ఇప్పటివరకూ ఆ కొడుకు ఆ తల్లి వద్ద దాచింది ఏమీ లేదు. తల్లీబిడ్డలు అనేకంటే వీరిద్దరినీ మంచి మిత్రులనడమే సరైనది. ఇందువల్లనే మొట్టమొదటిసారిగా కొడుకు ఏదో అవస్థ పడుతున్నాడన్న సంగతిని చూసి గ్రహించ గలిగింది మోదమ్మ.

‘ఆ అవస్థ దేనికి సంబంధించినది! అది ప్రజల నడుమ నెలకొన్న తారతమ్యాలకు చింతపడుతున్న భావిప్రభువు వేదనా? లేక, ఈడయిన గంగును, ఆ పిల్ల తెలివిని తెలుసుకున్నవేళ పడుతున్న యవ్వనపు త్రొటుపాటా? ఈ రెంటిలో ఏది? లేకపోతే రెండూనా?’ ఏ విషయమూ ఒక నిర్థారణకు రాలేక పోతోంది. ఇంకా చెప్పాలంటే,

‘ఇరవైయ్యేళ్లకిందట విష్ణుభైరవస్వామి కోవెలమెట్ల మీద పెద్దదేశిరాజును చూసినప్పుడు తను పడిన కలవరం వంటిదేనేమో చూడగా చూడగా ఇప్పుడు సంజీవుడు పడుతున్నది.’ అనే యోచనా ఆమెను కమ్మేసింది. కొంచెం కలత పడింది కూడాను. కాలమే ఇలాంటివాటికి సమాధానం చెప్పగలదని తలచింది. నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోయింది.

About Author

By editor

Twitter
YOUTUBE