ఈ తీర్పు చరిత్రాత్మకం. గుణాత్మకం. నిజానికి ఆ ఐదు రాష్ట్రాలలో నాలుగింటిలో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయం గురించి అంచనా వేయడానికి ఈ మాటలు చాలవు. ఈ తీర్పులో ఒక మేలుకొలుపు ఉంది. ఒక చైతన్యం ఉంది. ఓటుకు ఉన్న సానుకూల శక్తి వెల్లడైంది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ‌గోవా, మణిపూర్‌, ‌పంజాబ్‌ … ఐదు రాష్ట్రాలు.. 690 అసెంబ్లీ స్థానాలు.. 18,29,22,674 మంది ఓటర్ల తీర్పు. బీజేపీకి 374 స్థానాలు ఇచ్చారు ప్రజలు. ఆ పార్టీతో కలసి కొన్ని చిన్న చిన్న పార్టీలు పోటీ చేశాయి. వైరి శిబిరం నుంచి కాంగ్రెస్‌, ‌తృణమూల్‌ ‌కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఎన్‌సీపీ, శివసేన, బీఎస్‌పీ, ఎస్‌పీ, అకాలీదళ్‌, ‌వీటి మిత్రులు బరిలో దిగారు. ఈ పార్టీలన్నింటికీ కలిపి ప్రజలు ఇచ్చిన స్థానాలు 316. ఔను, దేశంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక ప్రబలశక్తి. ప్రతి ఓటు సానుకూల ఓటే. ఉత్తరప్రదేశ్‌ ‌గెలుపు రేపటి భారతదేశ రాజకీయ చిత్రాన్ని  ఇప్పుడే ఆవిష్కరించింది. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ, మిత్రులకు 273 స్థానాలు దక్కాయి. వరసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఎన్నికల సమీకరణలకు సంబంధించి నిరంతరం ఉండే ఒక అవాంఛనీయ గందరగోళాన్ని తుడిచిపెట్టేసిన తొలి తీర్పు ఇది.

ఉత్తరప్రదేశ్‌లో సాధించే విజయం వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాలను, ఏర్పడబోయే ప్రభుత్వాన్ని శాసిస్తుంది. ఈసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా చేయ డానికి విపక్షాలు ప్రయత్న మారంభించాయి. అందుకు తొలిమెట్టు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీనీ, యోగి ప్రభుత్వాన్ని ఓడించడం. అందుకోసమే నిత్యం ఒక అబద్ధపు ప్రచారంతో ప్రతిపక్షాలు, సెక్యులరిస్టులు, ఒక వర్గం మీడియా బీజేపీ మీద క్రమం తప్పకుండా దాడి చేశాయి. రైతుల పేరుతో కిరాయి మనుషుల చేత అల్లర్లు చేయించాయి. స్వయం ప్రకటిత మేధావుల చేత లేఖలు రాయించాయి. అధికారం ఇస్తే బీజేపీ కంటే వేగంగా అయోధ్య రామమందిరం నిర్మిస్తామని రాత్రికి రాత్రి రాముడి మీద వీరభక్తిని చాటాయి. కులాల వారీగా ఓట్లు చీల్చడానికి ప్రయత్నించాయి. ఇక బుజ్జగింపు బేరం పరాకాష్టకు చేరింది. కానీ ఉద్దాలకుడి భార్యను గుర్తు చేస్తూ, తాము అన్నీ తల్లకిందుగా ఆలోచిస్తున్నామన్న ఇంగిత జ్ఞానం వదిలేశారు. మేం గూండాలనీ జైళ్లలో కూర్చోబెడతా మని బీజేపీ చెబితే, మేం వాళ్లని శాసనసభలో కూర్చోబెడతామని భీషణ ప్రతిజ్ఞ చేసింది సమాజ్‌వాదీ పార్టీ. ముస్లిం మతోన్మాదులను బీజేపీ అణచి పారేస్తామని చెబితే, ఎస్‌పీ అక్కున చేర్చుకుంటామని ప్రకటించింది. ముస్లింలంతా గంపగుత్తగా ఎస్‌పీ వెనక గుమిగూడడం వల్లనే దళితులు, ఓబీసీలు, హిందువులు బీజేపీ ఛత్రం కిందకి వెళ్లారని మాయావతి కూడా అంగీకరించారు. ఎస్‌పీ ఓడిపోయింది. ఇది ఎస్‌పీ ఓటమి మాత్రమే కాదు, ఒక వర్గం మీడియా అవాస్తవాల ప్రచారానికి చెంపపెట్టు కూడా. లఖింపూరీ ఖేరీ, హత్రాస్‌ల వివాదాలలో ఎస్‌పీ చేసినది కేవలం కాకి గోలేనని ఓటర్లు రుజువు చేశారు. ఆ ప్రాంతాలలో బీజేపీ విజయఢంకా మోగించింది. రైతుల పేరుతో కిరాయి మూకలను రెచ్చగొట్టారు. ఇప్పటికీ వాళ్లంతా రైతులేనంటూ, వాళ్లని అణచివేశారంటూ టీవీ చానెళ్లలో గొంతు పగిలేటట్టు అరిచే పిచ్చిమూకలకు లోటు లేకపోవడమే వింత. కరోనా వ్యాక్సిన్‌ ‌తీసుకోవద్దని బాహాటంగా ప్రకటించిన నాయకుడి పార్టీని ఈ దేశంలో ఒక వర్గం మీడియా ఎందుకు ఎత్తుకుంది? ఇది సిగ్గుచేటు కాదా? జైళ్లలో ఉన్న హంతకులకీ, గూండాలకీ టిక్కెట్లు ఇచ్చిన పార్టీని సమర్థించడం ఎందుకు? ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌పీ అధికారంలో ఉన్నప్పుడు 40 వరకు కీలక పదవులలో అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌కుటుంబీకులే తిష్ట వేశారని సాక్షాత్తు ప్రధాని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అది అబద్ధమైతే మీడియా, అఖిలేశ్‌ ‌ఖండించాలి. అదీ లేదు. అయినా ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి బీజేపీని ఓడించాలని మాట్లాడింది ఆ మీడియా.

ఈ ఎన్నికలు ఒక గొప్ప వాస్తవాన్ని ఆవిష్కరిం చాయి. అది హిందూ ఓటు ఏకీకృతమవుతున్న వాస్తవం. ఉత్తరప్రదేశ్‌లో 54 శాతం హిందూ ఓట్లు బీజేపీకి పడ్డాయి. ఇలాంటి ఒక పరిణామం, ముస్లిం ఓటు ఏకీకృతం కావడం పర్యవసానమేనని గమనించవలసి ఉంటుంది. సెంటర్‌ ‌ఫర్‌ ‌ది స్టడీ ఆఫ్‌ ‌డెవలపింగ్‌ ‌సొసైటీస్‌ అనే లోక్‌నీతి పోస్ట్ ‌పోల్‌ ‌సర్వే ఈ విషయం వెల్లడించింది. ఇప్పటికీ హిందూ ఓటు ఏకీకృతమైతే దానిని మత ఓటుగాను, ముస్లిం ఓటు ఏకీకృతమైతే సాధారణ విషయంగాను చెప్పడం మామూలైపోయింది. ఇప్పుడు ఈ అధ్యయనకర్తల భాష కూడా అలాగే ఉంది. ముస్లింలలో మూడింట రెండొంతులు సమాజ్‌వాదీ పార్టీకి ఓట్లు వేశారు. ఈ పార్టీకి 2017లో 46 శాతం ముస్లింలు ఓటు వేశారు. అదే ఇప్పుడు 79 శాతానికి పెరిగింది. రద్దయిన అసెంబ్లీలో 24 మంది ముస్లింలు ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 34కు పెరిగింది. వీరిలో 31 మంది ఎస్‌పీ నుంచి ఎన్నికై వచ్చినవారే. ఎస్‌పీకే కాదు, బీజేపీకి కూడా ముస్లిం ఓట్లు పెరగడం ఊహకు అందని విషయమే. 2017లో బీజేపీకి 5 శాతం, ఇప్పుడు 8 శాతం ముస్లిం ఓట్లు పడ్డాయి. బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా సీటు ఇవ్వలేదు. బీజేపీతో కలసి పోటీ చేసిన అప్నాదళ్‌ ‌నుంచి ఒక్క ముస్లిం సభ్యుడు ఎన్నికయ్యారు. గతంతో పోలిస్తే ఎస్‌పీకి పడిన హిందూ ఓటు కూడా పెరిగింది. బీజేపీకి 2017లో 47 శాతం హిందూ ఓటు పడింది. ఇప్పుడు 54 శాతానికి చేరింది. కాంగ్రెస్‌కు కేవలం రెండు శాతం హిందూ ఓట్లు పడడం అనేక ప్రశ్నలకు తావిస్తుంది. బీఎస్‌పీకి 14 శాతం హిందూ ఓట్లు వచ్చాయి. అంటే కాంగ్రెస్‌ ‌కంటే బీఎస్‌పీని విశ్వసించే హిందువులే ఎక్కువ.

 ఒక్క శాసనసభ స్థానానికీ, 12.8 శాతం ఓట్లకీ పరిమితమైన మాయావతి ఒక కఠోరవాస్తవాన్ని మాత్రం దేశం ముందు ఉంచారు. బీజేపీ మీద ద్వేషంతో ముస్లింలంతా సమాజ్‌వాదీ పార్టీ వెనుక గంపగుత్తగా చేరిపోయారు. ఇక ఎస్‌పీకి అధికార మిస్తే వచ్చేది ఆటవిక రాజ్యమేనన్న భీతితో దళితులు, హిందువులు, ఓబీసీలు బీజేపీకి ఓటేశారు. ముస్లింలే దన్నుగా ఉన్న ఎస్‌పీ అధికారంలోకి వస్తే జరిగే ప్రమాదం ఏమిటో మాయావతి స్పష్టంగానే చెప్పారు. ఇదొక వాస్తవికత. ఇది వెంటనే రుజువైంది కూడా. దుమ్రియాగంజ్‌ ‌నియోజకవర్గం నుంచి ఎస్‌పీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సయేదా ఖాటూన్‌ ‌చేసిన ఘనకార్యం మాయావతి మాటలు ఎంత సత్యమో చెబుతున్నది. పదో తేదీన ఫలితాలు వచ్చాయి. 12వ తేదీన సయేదా విజయయాత్ర చేపట్టారు. వెంట ఉన్నవారు భారతీయులో, పాకిస్తానీయులో మరి! చేసింది మాత్రం పాకిస్తాన్‌ ‌జిందాబాద్‌ ‌నినాదాలు. దీనితో పోలీసులు 15 మంది మీద కేసులు పెట్టారు. 111 స్థానాలు దక్కితేనే పాకిస్తాన్‌ ‌జిందాబాద్‌ అన్నవాళ్లు అధికారంలోకి వస్తే ఇది పాకిస్తాన్‌ అన కుండా ఎలా ఉంటారు? అయితే ఆ ఊరేగింపులో తాను మాత్రం లేనని సయేదా నెమ్మదిగా తప్పు కున్నారు. కాబట్టి ఎస్‌పీకి ముస్లింలు తోడైతే గాలికి నిప్పు తోడైనట్టని వాస్తవికంగానే మాయావతి చెప్పారు. ఇలా ముస్లింలు అఖిలేశ్‌ ‌చంకలో దూరితే గెలిచేది బీజేపీయేనని పరోక్షంగా మాయావతి చెప్పనట్టయింది. ముమ్మాటికీ ముస్లింలు ఈ విషయంలో తప్పు చేశారని కూడా ఆమె అన్నారు. రస్రా (బలియా జిల్లా) నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉమాశంకర్‌ ‌సింగ్‌ ‌బీఎస్‌పీ తరఫున గెలిచిన ఏకైక సభ్యుడు.

బీజేపీ ఐదు కారణాలతో గెలిచిందని చాలా మంది అభిప్రాయం. అవన్నీ ఎన్నికల విశ్లేషకులు సర్వసాధారణంగా చెప్పే కారణాలు. వాటికి విలువ లేదని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. అయితే మనోభావాల పునాదిగా వారు తీర్పును అంచనా వేసినప్పుడే వాస్తవం వెలుగు చూస్తుంది. భారతీయ సాంస్కృతిక అవసరాలు ఏమిటో బీజేపీకి మాత్రమే తెలిసినట్టు భారతీయులు ఇప్పుడు పూర్తిగా నమ్ముతున్నారని ఒక వాస్తవికమైన వ్యాఖ్య ఈ ఎన్నికల ఫలితాల తరువాత బయటకు వచ్చింది. ఇది బీజేపీకి సంబంధించి గొప్ప కితాబు. దీనిని పట్టించుకోకపోతే, విశ్లేషించడం దగ్గర విఫలమైతే బీజేపీ విజయం నిజంగా అర్థమైనట్టు కాదు. ఇంకా చెప్పాలంటే బీజేపీ ఆశయాలు, తాత్త్వికత ఎన్నికల రాజకీయాల ఆధారంగా నిర్మితమైనవి కావు, లేదా ఎన్నికల గెలుపోటములతో రూపు మార్చుకునేవి కూడా కాదు అన్న విషయం అర్ధం కాదు. అందుకే మిగిలిన రాజకీయ పార్టీల విజయాలను అంచనా వేసినట్టే బీజేపీ విజయాలను కూడా విశ్లేషకులు అంచనా వేస్తూ ఉంటారు. ఔను, బీజేపీ హిందువుల లోని హిందూత్వను మేల్కొల్పుతున్నది. దీనిని విపక్షాలు, ఉదారవాదులు, సెక్యులరిస్టులు ఎంత చౌకబారు పదజాలంతో విమర్శించినప్పటికి ఇది నేటి అవసరం. ఫలితాలు వచ్చి, అందులో బీజేపీ తిరుగులేని విజయం సాధించిన తరువాత కూడా, ఎస్‌పీ ఎమ్మెల్యే అనుచరులు పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు చేసి వీరంగం వేయడాన్ని భారతీయులు, అందులో హిందువులు ఎలా అర్థం చేసుకోవాలి? కర్ణాటకలో చెలరేగిన మతోన్మాద ఫలితం హిజాబ్‌ ‌రగడ అత్యంత హేయమైనది. హిజాబ్‌ను బీజేపీ వ్యతిరేకిస్తుంది కాబట్టి, యూపీలో బీజేపీ ఓడిపోవ డానికి అది చాలు అన్నాడు కర్ణాటక వీర సెక్యులర్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకుడు డీకే శివకుమార్‌. ‌హిజాబ్‌ అసలు ఇస్లాంలోనే అనివార్యమైన వేషధారణ కాదనీ, పాఠశాలల్లో ఏకరూప దుస్తులు వేసుకోవాలని అనడం సహేతుక ఆదేశమేనని ఆ రాష్ట్ర హైకోర్టు మార్చి 15న తీర్పు ఇచ్చింది. కానీ దీని కోసం గడచిన డిసెంబర్‌ ‌నుంచి దేశంలో ఎంత రగడ సృష్టించాలని చూశారు. హిజాబ్‌ ‌రక్షకురాలిగా కాంగ్రెస్‌ ఎలాగూ ముందుంటుంది. ఈ నూరేళ్ల పార్టీ వెనుక కమ్యూనిస్టులు, జేడీ(యు), ఎస్‌పీ అంతా బారులు తీరారు. కశ్మీర్‌ ‌ఫైల్స్ అనే సినిమాలో ముస్లింలు హత్యలు చేశారని చూపితే వారి మనోభావాలు దెబ్బతింటాయని, కాబట్టి నిలిపివేయాలని కోరితే హిందువులు దానిని ఎలా అర్ధం చేసుకుంటారు?  ఇలాంటి నేపథ్యంలో అయోధ్యలో మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పార్టీలో, ఇరుకు సందుల కాశీకి సదుపాయాలు కల్పించిన పార్టీలో, గంగను ప్రక్షాళన చేస్తున్న పార్టీలో హిందువులు తమ సాంస్కృతిక పరిరక్షకుడిని చూసుకోవడంలో వింతేముంది? కానీ బీజేపీ మతం ఆధారంగా ఈ ఎన్నికలలో ఓటు అడగలేదు. అయోధ్యను గాని, మధుర సమస్యనుగాని ఎన్నికల ప్రచారంలోకి తీసుకు రాలేదు. హిందుత్వతోపాటు మొత్తం ప్రజలందరి సంక్షేమం గురించి ఆ పార్టీ ఆలోచిస్తున్నది. ఈ కోణం నుంచి బీజేపీ సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించాలి. బీజేపీ గెలుపునకు దోహదపడిన ఐదు అంశాలుగా ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నవి అవే.

1.శాంతిభద్రతలు. మాఫియాలు, నేరగాళ్ల పట్ల యోగి అత్యంత కఠినంగా వ్యవహరించినమాట వాస్తవం. కానీ నేరగాళ్లకీ, మతోన్మాదులకీ హక్కులు ఉండవా అంటూ ప్రశ్నించేవాళ్లకి మాత్రం ఇది నచ్చడం లేదు. గడచిన ఐదేళ్ల బీజేపీ పాలనలో హత్యలు, కిడ్నాప్‌లు తగ్గాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, యోగి కూడా సగర్వంగా చెప్పుకున్నారు. కాబట్టి దేశంలో సెక్యులరిస్టులు, కమ్యూనిస్టులు, ఉదారవాదులు, సమాజ్‌వాదీలు కోరుకుంటున్నది- సాధారణ భారతీయుడు గుండె మీద చేయి వేసుకుని గడపడం కాదు. నేరగాళ్లు, హంతకుల హక్కుల రక్షణ గురించే. 2. కరోనా సమయంలో యోగి ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ చర్యలు తిరుగులేనివి. తిండి గింజలు ఇవ్వడంతో పాటు పీఎం కిసాన్‌ ‌నిధి (రైతుల ఖాతాలకు నేరుగా డబ్బు జమ చేయడం) పథకాన్ని కూడా సమర్ధంగా అమలు చేశారు. 3. హిందుత్వ నినాదం ఆ పార్టీలో అంతర్భాగం. ఎన్నికలలో గెలవడానికో, ఓడినప్పుడు వదిలివేయడానికో బీజేపీ హిందుత్వ నినాదాన్ని స్వీకరించలేదన్నది నిజం. అది పార్టీ శాశ్వత విధానం. ఈ ఎన్నికలు 80-20 శాతం మధ్య ఎన్నికలంటూ యోగి నిర్భయంగా చెప్పగలిగారు కూడా. 4. కరోనా ఆంక్షల మూలంగా భారీ ప్రచార కార్యక్రమాలు లేకున్నా, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగారు. సాక్షాత్తు అమిత్‌షా లక్నోలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. గడచిన ఆరుమాసాలుగా బీజేపీ నేతలు నియోజకవర్గాలలో పర్యటిస్తూనే ఉన్నారు. ఎస్‌సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు నిరంతరం చేరువగా ఉండడానికి సామాజిక్‌ ‌ప్రతినిధి సమ్మేళనాలు నిర్వహిస్తూనే ఉన్నారు. 5. విపక్షమనేది ఉత్తర ప్రదేశ్‌లో నానాటికీ తీసికట్టుగా తయారు కావడం కూడా బీజేపీ గెలుపును ఖాయం చేసింది. ఇది సాధారణ విశ్లేషణలో భాగంగా చెబుతున్నా, బీజేపీకి సానుకూల ఓటు ఉంది. ఎస్‌పీ గతం కంటే బాగా మెరుగు పడినప్పటికీ అధికారానికి సుదూరంగా ఉండిపోవలసి వచ్చింది. ఇక బీఎస్‌పీ, కాంగ్రెస్‌ ఎలాంటి ప్రభావాన్ని చూపే పరిస్థితిలో లేవు.

వీర సెక్యులరిస్టులు, దివాంధ ఉదారవాదులు గుర్తించినా గుర్తించకపోయినా రాజకీయ రంగంలోని కొన్ని మూఢ నమ్మకాలను కూడా బీజేపీయే పటాపంచలు చేసింది. ఉత్తరప్రదేశ్‌లో వరసగా ఏ ప్రభుత్వం (1985 నుంచి) అధికారంలోకి రాదు అన్న నవ మౌఢ్యాన్ని బీజేపీ బద్దలు కొట్టింది. స్వామి ప్రసాద్‌ ‌మౌర్య వంటి పదవీదాహంతో తపించి పోతున్నవారి వెర్రి సూత్రీకరణలను కూడా బీజేపీయే తుంగలో తొక్కింది. ఈ మౌర్య ఏ పార్టీలో చేరితే ఆ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందట. ఈ ప్రబుద్ధుడు ఎన్నికలకు కాస్త ముందు యోగి ఆదిత్యనాథ్‌ ‌మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి ఎస్‌పీలో చేరాడు. ఎస్‌పీ ప్రభుత్వం ఏర్పాటు చేయ లేదు. నొయ్‌డా వెళ్లిన ముఖ్యమంత్రి ఓడిపోతాడు అన్న నమ్మకం కూడా ఉంది. ఆ భయంతోనే వీర ప్రగతివాది అఖిలేశ్‌ ఎప్పుడూ అక్కడ అడుగు కూడా పెట్టలేదు. కానీ యోగి ఆరుసార్లు వెళ్లారు. కుల రాజకీయాల నుంచి యూపీని బీజేపీ ఇప్పటికి విముక్తం చేసింది. ఒకే సంస్కృతి, ఒకే జీవన విధానం, అందరికీ న్యాయం అన్న సూత్రంతో ముందుకు వెళుతున్న బీజేపీనే జనం నమ్మారు. ఇలాంటి నమ్మకం ఎస్‌సీ, ఎస్టీలతో పాటు కొందరు ముస్లింలలో కూడా కనిపించింది. మహిళలను చిన్నచూపు చూసే హిందుత్వకు ప్రాతినిధ్యం వహించే పార్టీగా ఉదారవాదులు చిత్రించిన పార్టీకే మహిళలు ఓటు వేశారు. కారణం, గూండాల రాజ్యంగా పేరు పడిన ఉత్తరప్రదేశ్‌కు యోగి కాలం గొప్ప వెసులు బాటు. విపక్షాల వైఖరిని మహిళలు సరిగానే అంచనా వేశారు. విపక్షాలకు మహిళ స్వేచ్ఛగా తిరగడం కాదు, గూండాలు, రోమియోలు స్వేచ్ఛగా తిరగడమే ముఖ్యం. కనుకనే వారిని మహిళలు నమ్మలేదు. ఉద్యమిస్తున్న రైతుల కారణంగా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోతుందని ఎందరో వేసిన అంచనా దారుణంగా విఫలమైంది. వాళ్లు రైతులైతే నిజమయ్యేదేమో! కానీ ఆ ఉద్యమకారులంతా కిరాయి మూకలే కాబట్టి విజయం బీజేపీకే దక్కింది. చిత్రంగా రైతుల ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న కాంగ్రెస్‌ ‌పార్టీయే కాదు, రైతుల కోసమంటూ బీజేపీని వీడిన అకాలీదళ్‌ ‌కూడా చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఏదీ రైతుల ప్రభావం? ఎక్కడ? కారు మీద కాల్పులు జరిగినా ఎంఐఎం నేత అసదుద్దీన్‌కు సానుభూతి దక్కలేదు. ఒక్క సీటూ రాలేదు. యోగి, మోదీ హిమాలయాలకో, మఠాలకో వెళ్లి పోతారని జోస్యం చెప్పిన ముస్లిం నాయకుడు ఇతడే.

2019 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ ఘన విజయాన్ని జీర్ణించుకోలేని వారు 2022లో జరిగే యూపీ ఎన్నికలే 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను నిర్ధారిస్తాయని వ్యాఖ్యానించారు. కాబట్టి వచ్చే లోక్‌సభ ఎన్నికలలో విజయం ఎవరిదో అప్పుడే చెప్పారు. చివరిగా, ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు హిందుత్వవాదం, సంక్షేమం, శాంతిభద్రతల పరి రక్షణకు, కష్టించే తత్త్వానికి అద్దం పడతాయి. బుజ్జ గింపు రాజకీయాలకు కాలం చెల్లిందని ప్రకటిం చాయి. కుటుంబ పాలనకు ఛీకొట్టాయి. అన్నింటికీ మించి హిందువు హిందువుగా ఆలోచించే శుభ ఘడియ మొదలైన సంగతిని చాటి చెప్పాయి.

About Author

By editor

Twitter
YOUTUBE