చాలా చిన్నదీ, పరిమితమైనదీ తాత్కాలికమైనదీ అయిన ప్రయోజనం. కానీ అది ప్రపంచ పర్యావరణానికి పెను ముప్పు అవుతోంది. అది విశ్వమానవాళికి ప్రాణవాయువును ఇచ్చే సముద్రాలను అల్లకల్లోలం చేయగల ముప్పు. జీవ వైవిధ్యాన్ని పతనం అంచుకు నెట్టే ప్రమాదం. అంతిమంగా అది పర్యావరణ పరిరక్షణకు సవాలు. కొన్ని దశాబ్దాలకు గాని మట్టిలో కలవకుండా, నేలతల్లి గుండెల మీద భారంగా మారగలదు. ప్రత్యక్షంగా మట్టినీ నీటినీ, పరోక్షంగా పర్యావరణాన్ని నాశనం చేయగలదు. అదే ప్లాస్టిక్ వ్యర్థం. మనం బజారు నుంచి కొంచెం కూర, కొన్ని పళ్లు, ఇంకొన్ని సరుకుల మోసుకురావడానికి తెచ్చే ఆ ప్లాస్టిక్ సంచిలో అంత ప్రమాదం దాగి ఉంది. ప్రపంచంలో బాగా వెనుకబడిందని చెప్పుకునే ఆఫ్రికా దేశం కెన్యాలో ఈ ప్లాస్టిక్ వ్యర్థం మీద రణభేరి మోగింది. ఈ యుద్ధంలో ప్రపంచ పౌరులంతా సైనికుల్లా పనిచేయాలి. లేకపోతే రేపటి ప్రపంచం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు.
మారుతున్న పరిస్థితుల్లో మానవాళి మనుగడకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇవన్నీ మానవ కల్పితాలే. అంటే మనం చేతులారా చేసుకున్నవే. పర్యావరణ కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాల రూపంలో ఇప్పుడు ప్రజానీకం ప్రాణాంతకమైన సమస్యలను ఎదుర్కొంటోంది. పర్యావరణ సమతుల్యత లోపించిన కారణంగా కరవు కాటకాలు, వరదలు, తుపాన్లు వంటివి చోటుచేసుకుని అపార నష్టాన్ని కలిగిస్తున్నాయి. యుద్ధాలు వంటివి ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. ఆస్తుల విధ్వంసానికి దారితీస్తున్నాయి. ఈ ఉత్పాతాలను నివారించడం మన చేతుల్లోనే ఉంది. పకడ్బందీ కార్యాచరణతో వీటిని నివారించగలం. అటువంటి కార్యాచరణ లోపించడం అసలు సమస్య. దాని ఫలితాన్ని ఇప్పుడు ఈ దేశం, ఆ దేశం అనే తేడా లేకుండా యావత్ ప్రపంచం ఎదుర్కొంటోంది. అన్ని దేశాలూ కలసి వస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఈ విషయంలో అభివృద్ధి చెందిన దేశాల పాత్ర అత్యంత కీలకం. సమస్యకు చాలావరకు మూలకారణం అవే కాబట్టి పరిష్కార బాధ్యత వాటికే ఎక్కువ.
ఆధునిక సమాజంలో ప్లాస్టిక్ అత్యంత ప్రమాద కారిగా మారింది. అయినప్పటికీ ప్రమాద తీవ్రతను, దీనివల్ల కలిగే అనర్థాలను పూర్తిస్థాయిలో సమాజం గుర్తించిన దాఖలాలు లేవు. ఈ సమస్యపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన, చైతన్యం కొరవడిన మాట వాస్తవం. సమస్య గురించి ఇప్పుడిప్పుడే అనేక స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సదస్సులు, సమావేశాలు, సభలు, ర్యాలీల ద్వారా ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగిస్తు న్నారు. ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ప్లాస్టిక్ సమస్య ఇప్పుడు పల్లెలకూ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. వారూ, వీరూ, ఈ దేశం, ఆ దేశం అనే తేడా లేకుండా యావత్ సమాజానికి ప్లాస్టిక్ పెనుభూతంగా పరిణమించింది. ఏటా ప్రపంచవ్యాప్తంగా కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో పదిశాతం మాత్రమే పునర్ వినియోగమవుతోంది. మరికొంత దహనమవుతోంది. మిగిలిన భాగం భూమిలో, వాగులు, వంకలు, నదులు, సముద్రాల్లోకి చేరు తోంది. ప్లాస్టిక్ వ్యర్థానికి గల ఒక ప్రత్యేకత ఏమిటంటే అది అంత తేలిగ్గా నాశనమవదు. దాని జీవిత కాలం చాలా ఎక్కువ. ఆకలితో ఉండే అమాయక పశువులు అదేదో ఆహారం అనుకుని ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్నాయి. తరవాత చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. ఆ చెత్త జీర్ణమవక పశువులు చనిపోతున్నాయి. ప్లాస్టిక్ వల్ల కలుగుతున్న అనర్థాలు, నివారణ చర్యలపై చర్చించేందుకు కెన్యా రాజధాని నైరోబీలో గత నెల 28న ఒక అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. మార్చి 2 వరకు జరిగిన ఈ సదస్సులో వంద దేశాలకు పైగా ప్రతినిధులు పాల్గొని సమస్య లోతుపాతులపై చర్చించారు. సమస్యను వివిధ కోణాల్లో చర్చించి పరిష్కార మార్గాలపై అధ్యయనం చేశారు.
ప్లాస్టిక్ వినియోగం, పెరగడానికి ప్రధాన కారణం పట్టణీకరణ, పారిశ్రామికీకరణ అని చెప్పకతప్పదు. ఇటీవల కాలంలో పట్టణీకరణ, పారిశ్రామికీకరణ పెరగడంతో ఈ మేరకు ప్లాస్టిక్ వాడకం కూడా పెరుగుతోంది. సమస్యపై ఎంతో కొంత అవగాహన గల పట్టణ ప్రాంత ప్రజలు కూడా దాని వినియోగాన్ని పూర్తిస్థాయిలో నివారించలేక పోవడం ఆందోళనకరం. ఆహార పదార్థాల తయారీ, శుద్ధి, నిల్వ తదితర అంశాల్లో ప్లాస్టిక్ వినియోగం నానాటికీ అధికమవుతోంది. అదే సమయంలో దానివల్ల కలిగే అనర్థాలు ప్రజల ఆరోగ్యాలపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అందుకే ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని, లేదా దాని వినియోగాన్ని కనీస స్థాయికి తగ్గించాలని పిలుపు నిస్తున్నాయి. ఈ దిశగా భారత ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా ఒకసారి వాడేసిన ప్లాస్టిక్‌ను 2022లోగా రెండు దశల్లో నివారించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గత ఏడాది ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, సవరణ నియమాలను ప్రకటించింది. 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ సంచుల ఉత్పత్తి, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వాడకాలను నిషేధించింది. గత ఏడాది సెప్టెంబరు 30 నుంచే ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ సంచులను ఈ ఏడాది చివరి నుంచి నిషేధించాలని నిర్ణయించింది. ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, థర్మాకోల్ ఉత్పత్తుల వంటి ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌పై నిషేధం విధించేందుకు అనేక రాష్ట్రాలు ముందుకు రావడం స్వాగతించదగ్గ పరిణామం. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్‌పై ఉత్పత్తి దారుల బాధ్యతలను విస్తరించే నిబంధనలు ఈ ఏడాది జులై నుంచి అమల్లోకి రానున్నాయి.
ఏటా ఉత్పత్తవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం చూస్తే ఆందోళన కలగక మానదు. 2019-20లో సుమారు 34.7 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తయినట్లు అంచనా. వీటిల్లో 15 లక్షల టన్నులు పునర్వినియోగమైంది. 1.6 లక్షల టన్నులు సిమెంట్ పరిశ్రమల్లో వినియోగించారు. పెద్ద రాష్ట్రాలు, కాస్తోకూస్తో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లోనే ప్లాస్టిక్ ఎక్కువగా ఉత్పత్తవుతున్నట్లు గణాంకాలు ఘోషిస్తు న్నాయి. పారిశ్రామికంగా ప్రగతి సాధించిన రాష్ట్రంగా పేరొందిన మహారాష్ట్ర నుంచి 13 శాతం ప్లాస్టిక్ వ్యర్థం పోగుపడింది. ఆ తరవాత 12 శాతంతో గుజరాత్, తమిళనాడు ఉన్నాయి. ఈ రెండూ కూడా పారిశ్రామికంగా ముందంజలో ఉన్న రాష్ట్రాలే. తమిళనాడు ఉత్పత్తిరంగంలో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. 9 శాతంతో తరవాత స్థానంలో పశ్చిమ బెంగాల్, కర్ణాటక నిలిచాయి.
ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు సైతం ఏమీ వెనకబడి లేవు. 2019-20లో తెలంగాణ 2.33 లక్షల టన్నులు, ఆంధప్రదేశ్ 46 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేశాయి. పారిశ్రామికంగా తెలంగాణ కంటే ఏపీ వెనకబడిందన్న విషయాన్ని గమనించాలి. అందువల్లే ఏపీలో కొంతవరకు తగ్గింది.
ఉదాసీనతే అసలు సమస్య…
ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణలో ప్రభుత్వాల పాత్ర అత్యంత కీలకం. కానీ ఈ విషయంలో అన్ని స్థాయిల ప్రభుత్వాలదీ ఉదాసీన వైఖరి కావడం ఆందోళన కలిగిస్తోంది. నిబంధనల ప్రకారం ఏటా స్థానిక సంస్థలు తాము తీసుకుంటున్న నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపాలి. కానీ ఈ విషయంలో చెప్పుకోదగ్గ ప్రగతి లేదు. నివేదికలు కూడా నామమాత్రంగా ఉంటు న్నాయి. అవి మొక్కుబడిగా సమర్పించినట్లు ఉంటు న్నాయన్న విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో అన్ని రాష్ట్రాల్లో కూడా స్థానిక సంస్థలు నివేదికలను పంపడం లేదు. పేరుకు దేశంలోని 29 రాష్టాలకు గాను 25 రాష్టాలు ప్లాస్టిక్ వినియోగం నిషేధం అమలు చేస్తున్నట్లు చెబుతున్నాయి. కానీ ఆచరణలో మాత్రం అమలు నామమాత్రంగానే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిషేధం అమల్లో చిత్తశుద్ధి కొరవడి, పకడ్బందీ చర్యలు కనిపించడం లేదు. కేవలం 12 రాష్ట్రాలే తమ కార్యాచరణను ప్రకటిం చాయి. మిగిలిన రాష్ట్రాలు ఆ దిశగా స్పందించలేదు. దిగుమతిదారులు, బ్రాండెండ్ ఉత్పత్తిదారులు ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణలో సంప్రదాయ పద్ధతులే కాకుండా వినూత్నంగా ముందుకు సాగాల్సి ఉంది. కేవలం ప్రభుత్వ నిబంధనలను అమలు చేసినంత మాత్రానే సమస్య కనుమరుగైపోదు. వారు తమవంతుగా వినూత్న పద్ధతులను కనుగొనాలి. వాటిని త్రికరణశుద్ధిగా అవలంబించాలి. నేలలో సులభంగా కలిసిపోయే సంచుల తయారీకి అడుగు వేయాలి. కఠినమైన, భారీ జరిమానాలతో కొంత వరకు సమస్యను అరికట్టవచ్చు. అదే సమయంలో అన్నింటికన్నా ముఖ్యమైనది ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించడం. ఇందులో ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సంస్థలు, సామాజిక కార్యకర్తల భాగస్వామ్యం కీలకం. గుడ్డ సంచుల తయారీని ప్రోత్సహించాలి. ప్లాస్టిక్ బదులు ఇతర ఉత్పత్తుల తయారీ, వినియోగం కోసం అటు ఉత్పత్తి దారులు, ఇటు వినియోగదారుల కోసం ప్రభుత్వాలు ప్రోత్సాహకాలను ప్రకటించాల్సిన అవసరాన్ని విస్మరించలేం. పన్నుల తగ్గింపు, పరిశోధన, అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. ఈ ఎగుమతులను ప్రోత్సహించ డానికి చర్యలు చేపట్టాలి. ప్లాస్టిక్ పునర్ వినియోగం పైనా పూర్తిస్థాయిలో దృష్టి సారించాలి. ఇందుకు అవసరమైన సాంకేతికతను సమకూర్చాలి. మండల స్థాయిలోనూ వీటిని సమకూర్చినట్లయితే సత్ఫలితాలు సమకూరతాయి. ఇది ఒకరోజులో వచ్చే మార్పు కాదు. పకడ్బందీ, నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగితే వీలైనంత త్వరలోనే సానుకూల ఫలితాలు సమకూరతాయి. అంతిమంగా ప్లాస్టిక్ నియంత్రణ అసాధ్యం ఏమీ కాదన్న విషయాన్ని అందరూ గుర్తించాలి.
పర్యావరణంలో మార్పుతో పెనుముప్పు…
ప్లాస్టిక్ తరవాత ప్రపంచం ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య పర్యావరణం. పర్యావరణ పరంగా సమతుల్యత లోపించి కొత్త కొత్త సమస్యలు ఎదురవు తున్నాయి. అనేక ఉత్పాతాలు పుట్టుకొస్తున్నాయి. మారిన పరిస్థితుల్లో పర్యావరణం అన్నది ఏ ఒక్క దేశం సమస్య కానే కాదు. అభివృద్ధి చెందిన దేశం, వెనకబడిన దేశం అన్న తారతమ్యాలు లేవు. పరిష్కార మార్గాలపై ప్రపంచ దేశాల చిత్తశుద్ధి కొరవడిందన్నది అందరూ అంగీకరించే చేదునిజం. ఈ విషయంలో ప్రపంచ దేశాల అధినేతల మాటలు కోటలు దాటతాయి. బోలెడంత చిత్తశుద్ధి కనపడుతోంది. చేతలు శూన్యం. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్యారిస్ ఒప్పందం అమల్లో యావత్ అంతర్జాతీయ సమాజం విఫలమైందన్నది వాస్తవం. పర్యావరణానికి సంబంధించి తాజాగా వెలుగు చూసిన ఐపీసీసీ (ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమెట్ ఛేంజస్- పర్యావరణ మార్పులపై అంతర్ ప్రభుత్వాల కమిటీ) నివేదిక ప్రమాద ఘంటికలను మోగించింది. తక్షణం నివారణ చర్యలపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించకపోతే వచ్చే రెండు దశాబ్దాల్లో మరిన్ని సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించింది. కరవు కాటకాలు, వరదలు, తుపాన్ల వంటివి సంభవించి మానవ జీవితం కకావికలమవుతుందని పేర్కొంది. అకాల వర్షాలు, తుపాన్లతో మానవాళి మనుగడ ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరించింది. అదే సమయంలో కరవుకాటకాలు సంభవించి ఆహార ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుందని పేర్కొంది. దీనివల్ల ఆకలి, క్షుద్బాధ వంటి సమస్యలు ఏర్పడతాయని అంతిమంగా మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించింది. ఇది ఎవరినో హెచ్చరించడానికి, భయపెట్టడానికి రూపొందించిన నివేదిక కాదు. కేవలం వాస్తవాలను, మున్ముందు రాబోయే సవాళ్ల గురించి అప్రమత్తం చేసే ప్రయత్నంగా భావించాలి. కేవలం వినడం వరకే పరిమితమైతే ప్రయోజనం లేదు. ఆ దిశగా నివారణ చర్యలు చేపడితేనే మానవాళికి మేలు కలుగుతుంది.
ప్రస్తుత పరిస్థితి యథాతథంగా కొనసాగితే భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందని హెచ్చరించింది. ఇది ఏరకంగా చూసినా మంచిది కాదు. దీని ప్రభావం భారత్‌పైనా అధికంగా ఉంటుంది. సువిశాల దేశం, అతి పెద్దదైన తీరప్రాంతం, అధిక జనసాంద్రత, విభిన్న వాతావరణ పరిస్థితుల కారణంగా మన దేశంలో భూతాపం ఎక్కువగా ఉంటుంది. భూతాపం పెరగడం వల్ల కరవు కాటకాలు సంభవిస్తాయి. తద్వారా ఆహార కొరత ఏర్పడుతుంది. ఫలితంగా ఆకలి కేకలు వినపడ తాయి. అదే సమయంలో సముద్ర నీటి మట్టాలు పెరుగుతాయి. సముద్ర జలాలు నగరాల్లోకి చొచ్చుకు వస్తాయి. ఏకంగా కొన్ని నగరాలే మునిగిపోయే ప్రమాదం ఉంది. దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబై నగరానికి ఈ ప్రమాదం పొంచి ఉందని ఐపీసీసీ తాజా నివేదిక స్పష్టం చేసింది. ముంబయి మహానగరంలో రిజర్వు బ్యాంకు కార్యాలయం ఉంది. అనే ప్రభుత్వరంగ సంస్థల బ్యాంకుల కేంద్ర కార్యాలయాలు ఇక్కడి నుంచే పని చేస్తున్నాయి. అనేక ప్రైవేట్ ఆర్థిక సంస్థల కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ముంబై నగరం కేవలం దేశ వాణిజ్య రాజధాని కాదు. దేశంలో పారిశ్రామికంగా బాగా ప్రగతి సాధించిన రాష్ట్రం, అదే సమయంలో అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్ర రాజధాని నగరం కూడా కావడం గమనార్హం. ఈ మహానగరానికే కాదు, దేశంలోని ఇతర తీరప్రాంత నగరాలకు కూడా ఈ సమస్య పొంచి ఉంది. భారతదేశం సుమారు 7500 కిలో మీటర్లకు పైగా తీరప్రాంతం విస్తరించి ఉన్నదేశం. అందువల్ల ఐపీసీసీ నివేదికను విస్మరించ జాలం. అదే జరిగితే మన వినాశనాన్ని మనేమే కొని తెచ్చుకున్నట్లవుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పర్యావరణ సమతౌల్యం లోపించడం వల్ల మడ అడవులు ముంపునకు గురవుతాయి. భూమి కోతలు సంభవిస్తాయి. భూసారం క్షీణిస్తుంది. భూములు వ్యవసాయానికి పనికిరాకుండా పోతాయి. దీని ఫలితం పంటలపై పడుతుంది. సముద్ర నీరు తీర ప్రాంత పట్టణాలు, గ్రామాలు, నగరాల్లోకి చొచ్చుకు వస్తుంది. ఈ శతాబ్దం మధ్య కాలానికి దేశంలో వరదల బారినపడే వారి సంఖ్య 3.5 కోట్లకు చేరుతుంది. ఉద్గారాలు కొద్దిమేరకు పెరిగినా ఈ శతాబ్దం అంతానికి 4.5 కోట్ల నుంచి అయిదు కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపుతుందని ఐపీసీసీ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
తీవ్రమైన వాతావరణ మార్పులు పంటలపైనా ప్రభావితం చూపుతాయి. 2050 కల్లా భారత్‌లో బియ్యం, గోధుమ, చిరుధాన్యాల ఉత్పత్తిలో దాదాపు 9 శాతం పడిపోతుంది. ఇక దక్షిణ భారతంలో మొక్కజొన్న దిగుబడి 17 శాతం తగ్గుతుంది. ఫలితంగా ఆహార ధాన్యాలకు విపరీత డిమాండ్ ఏర్పడుతుంది. అవి అందరికీ అందుబాటులో ఉండవు. పేదలు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. ఫలితంగా ఆకలి చావులు, ఆర్థిక వ్యవస్థ అతలా కుతలమవుతుంది. పర్యావరణ మార్పులు చేపల ఉత్పత్తిపైనా పడుతుంది. ఉష్ణోగ్రతలు ఇదే మాదిరిగా కొనసాగితే దేశంలో జీవనదులుగా పేరుగాంచిన గంగ, బ్రహ్మపుత్రలకు విపరీతమైన వరదలు వస్తాయి. అనేక తీరప్రాంత పట్టణాలు, గ్రామాలు, పొలాలు ముంపునకు గురవుతాయి. భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తుంది. దీనివల్ల వ్యవసాయోత్పత్తులు తగ్గుతాయి. ఫలితంగా ఆహారధాన్యాల దిగుబడి తగ్గుతుంది. ఇది మరో సమస్యకు దారితీస్తుంది. సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 3 నుంచి 14 శాతం జీవజాతులు అంతరించి పోతాయని ఐపీసీసీ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల అంతర్జాతీయ సమాజం తక్షణమే ఈ సమస్యపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న వాస్తవాన్ని గుర్తించాలి. లేనట్లయితే దాని ఫలితం అనుభవించక తప్పదు.
పెట్రోలు, డీజిల్ వాహనాల బదులు విద్యుత్ వాహనాల వినియోగం వల్ల కాలుష్యం తగ్గుతుంది. కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. కానీ భారత్‌లో ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి థర్మల్ కేంద్రాల ద్వారానే జరుగుతుంది. వాహనాల వల్ల వాతావరణం లోకి విడుదలయ్యే బొగ్గు పులుసు వాయవు కూడా ఎక్కువవుతుంది. అందువల్ల సంప్రదాయేతర సౌర, పవన విద్యుత్‌పై ఆధార పడటం ఉత్తమం. అయితే ఈ తరహా విద్యుత్ ఉత్పత్తి నామమాత్రం. అందువల్ల ప్రజా రవాణాకు ఉపయోగించే అన్ని రకాల వాహనాలపైన సౌర ఫలకాలను ఏర్పాటుచేస్తే ఆ వాహనానికి అవసరమైన విద్యుత్‌లో కొంతవరకైనా ఉత్పత్తయ్యే అవకాశం ఉంది. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు, కర్బన ఉద్గారలు కనీస స్థాయికి తగ్గించేం దుకు ప్రభుత్వాలు, ప్రజలు సమష్టిగా ముందుకు సాగాలి. వాతావరణాన్ని వేడెక్కించడంలో కీలకపాత్ర పోషించే ఏసీలు, ఫ్రిజ్‌ల వాడకాన్ని కనీస స్థాయిలో తగ్గించేందుకు ప్రజలు తమవంతుగా స్వచ్ఛందంగా ముందుకు రావాలి. నిజానికి పర్యావరణ మార్పులకు ప్రధాన కారణం అభివృద్ధి చెందిన దేశాలు పారిశ్రా మికీకరణ పేరుతో అవి ఇంతకాలం పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేశాయి. ప్రగతి పేరుతో దాని పరిరక్షణను తాకట్టు పెట్టాయి. పర్యావరణానికి సంబంధించిన ప్యారిస్ ఒప్పందాన్ని చిత్తశుద్ధిగా అమలు చేయడంలో సంపూర్ణంగా విఫలమయ్యాయి. చివరికి వైఫల్యాన్ని వెనకబడిన దేశాలపై రుద్దుతున్నాయి.
సాగరాలకు ముప్పు
వాతావరణాన్ని క్రమబద్ధం చేసేవి ఆ నీలి సాగరాలే. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల కోసం మనం అనుక్షణం పీల్చుకునే ప్రాణవాయువును అధిక శాతం అందించేవి ఆ సముద్రాలే. అసలు జీవ వైవిధ్యానికి నిలయాలు ఆ జలనిధులే. అపార సంపదలకు నిలయాలు ఆ జలరాశులే. కానీ అందుకు ప్రతిఫలంగా ప్రపంచ మానవాళి చేస్తున్న పని ఏమిటి? చూపుతున్న కృతజ్ఞత ఎలాంటిది. ఏటా కోటీ పదిలక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఆ సాగర జలాలలోకి విసిరివేయడమే. అంటే ప్రతి నిమిషానికి ఒక ట్రక్కుడు తుక్కు ప్లాస్టిక్ ఆ అందాల సముద్రాలలో పారబోస్తున్నారు. 51 ట్రిలియన్‌ల మైక్రో ప్లాస్టిక్ శకలాలు మన సముద్రాలలో ఉన్నాయి. సముద్రాలలోకి చేరే 80 శాతం ప్లాస్టిక్ వ్యర్థానికి మూలం నదులు. దాదాపు వేయి నదుల ద్వారా ఈ వ్యర్థాలు చేరుతున్నాయి. నిజానికి ప్రతి జలమార్గాన్ని, వనరుని మనిషి ప్రధానంగా ప్లాస్టిక్ వ్యర్థంతో, ఇతర వ్యర్థాలతో నాశనం చేసుకుంటున్నాడు. ఐక్యరాజ్య సమితి చెప్పినట్టు నేడు ప్లాస్టిక్ కాలుష్యం ఒక మహమ్మారి స్థాయికి చేరుకుంది.
సాగరాలను కలుషితం, విషపూరితం చేస్తున్న సమస్య (మెరైన్ ప్లాస్టిక్ పొల్యుషన్) ప్రపంచ జనాభాకు సంబంధించిన సమస్య. ప్రకృతి ఎదుర్కొంటున్న పెను విపత్తు. చేయని పాపానికి భవిష్యత్ తరాలకు ముందే తగులుతున్న శాపం. ఈ పెనుభూతం మీద పోరాటం ఎప్పుడో మొదలయింది. ప్రతి పౌరుడు ఇందుకు మద్దతు ఇవ్వాలి. ప్రస్తుతం 63 దేశాలు ఇందుకు సంబంధించిన ప్రచార కార్యక్రమంలో ఉన్నాయి. ప్లాస్టిక్ కాలుష్యం మీద ఆరంభమైన పోరుకు తూర్పు ఆఫ్రికా దేశం కెన్యా నాయకత్వం వహించడం ఒక అద్భుతం. సముద్ర తీరాలకు, నదీ తీరాలకు వచ్చేవారు ప్లాస్టిక్ సంచులు, కప్పులు, ప్లేట్లు తీసుకురావడాన్ని ఈ దేశం నిషేధించింది. ఇది సముద్రాలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోకుండా తీసుకునే జాగ్రత్తలో తొలి అడుగు వంటిదే.జలమార్గాలను, జలరాశులను ప్లాస్టిక్ వ్యర్థంతో అపవిత్రం చేయవద్దని ఈ దేశం ప్రపంచానికి చెబుతోంది. అంతా ఆలకించి తీరాలి. ఇందుకు కెన్యా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, అమలు చేస్తోంది.
అంతా అనుకున్నట్టు ప్లాస్టిక్ వాడకం చౌకకాదు. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ సీసాల బదులు అంతకంటే తక్కువ ఖర్చుతో సీసాలు తయారు చేసేందుకు కృషి చేయవచ్చు. ప్లాస్టిక్ సంచుల కారణంగా ఏటా లక్ష సముద్ర జీవాలు చనిపోతున్నాయి. కాస్త మానవత్వం చూపితే వాటి చావుకు కారణం కాని విధంగా ప్రత్యామ్నాయం తేవచ్చు. శీతల పానీయాలు, కొబ్బరి బొండాలు తాగడానికి ప్లాస్టిక్ స్ట్రాలు నిరాకరించాలి. వెదురు, గాజు, స్టీలుతో చేసిన స్ట్రాలు వెంట తీసుకువెళ్లి వాడాలి.
భారతదేశానికి 7,500 కిలోమీటర్ల మేర సాగరతీరం ఉంది. మన దేశంలో ఇంకెన్ని ఆంక్షలు ఉండాలో!
– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్