– డా. రామహరిత
పాకిస్తాన్ కట్ టు సైజ్
బంగ్లాదేశ్ ‘స్వర్ణిమ్ జయంతి’ వేడుకలను డిసెంబర్ 16న మనదేశం, ఘనంగా జరుపుకుంది. 1971లో 14 రోజుల పాటు సాగిన బంగ్లా విముక్తి యుద్ధంలో మన దేశం చరిత్రాత్మక పాత్రను పోషించింది. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ప్రతి భారతీయడు గర్వపడేటట్టు పాకిస్తాన్ మీద మన సేనలు అపూర్వ విజయం సాధించాయి. అందుకే, 1971 డిసెంబర్ 16 చరిత్రలో ‘విజయ దివస్’గా మిగిలింది. విజయ దివస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘స్వర్ణిమ్ విజయ్ పర్వ్’ పేరిట స్వర్ణ జయంతి వేడుకలను జరుపుకున్నాం.
మరో వంక, బంగ్లా విముక్తి యుద్ధంలో మన దేశం పోషించిన పాత్ర, భూమికపై లోతైన అధ్యయనం జరిగింది. ఎన్నో సమీక్షలు జరిగాయి. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కలిగించిన భారత్-పాక్ యుద్ధం నేపథ్యంగా చాలానే పుస్తకాలు వచ్చాయి. అలా వచ్చిన ప్రతి పుస్తకం, ప్రతి అధ్యయన గ్రంథం, ఒక కొత్త కోణాన్ని ఆవిష్క రించింది. ఇప్పుడు చర్చించబోతున్న ‘పాకిస్తాన్ కట్ టు సైజ్’ గ్రంథం అలాంటిదే. భారత సైనికదళాల మధ్య విజయానికి దోహదం చేసిన పరస్పర సహకారం గురించి, అప్పటికి ఇంకా ఆరేళ్ల ప్రాయం దాటని పసిగుడ్డు, భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) పోషించిన పాత్రను మరో కోణంలో అవిష్కరించింది. అంతేకాకుండా, యుద్ధ తంత్రంలో భౌగోళిక, రాజకీయ శక్తులు పోషించిన పాత్రను, దౌత్య వ్యూహాలను చర్చించారు రచయిత డీఆర్ మన్కేకర్.
యుద్ధభూమిలో నిలిచి, వార్తలు సేకరించిన వార్ కరెస్పాండెంట్ డి.ఆర్. మన్కేకర్ 1972లో రాసిన పుస్తకమిది. ప్రస్తుత సరిహద్దు సమస్యల విశ్లేషణకు అవసరమైన పూర్వరంగాన్ని అందిస్తుంది. మన్కేకర్ ‘పాకిస్థాన్ కట్ టు సైజ్’ అన్న అసలు శీర్షికకు‘14 రోజుల భారత్ -యుద్ధం వాస్తవ కథనం’ అనే ఉప శీర్షిక చేర్చారు. ఆ రెండింటికీ పూర్తి న్యాయం చేసిన మన్కేకర్ 1971 భారత్ – పాక్ యుద్ధం గురించి ప్రచారంలో ఉన్న అసత్యాలను, సంపూర్ణ ఆధారాలతో పూర్వపక్షం చేశారు.
నిజానికి,ఈ యుద్ధం మన దేశం కోరి చేసినది కాదు. అయినా, ఇప్పటికీ, కొన్ని పశ్చిమ దేశాలు, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాలలో మన దేశం అనవసరంగా వేలు పెట్టిందనే అభిప్రాయంతోనే ఉన్నాయి, కానీ, అందులో నిజం లేదు. నిజం ఏమంటే, ముందుగా పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వింది. ఈజిప్ట్ మీద ఇజ్రాయల్ చేసిన దాడుల తరహాలో, పాకిస్తాన్ డిసెంబర్ 3, 1971న అమృత్‌సర్, ఆగ్రా, అంబాల, అవంతిపూర్, బికనీర్, హల్వారా, జోధ్‌పూర్, జైసల్మేర్, పఠాన్’కోట్, బుర్జ్, శ్రీనగర్ తదితర చోట్ల వైమానిక స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ చెంగేజ్ ఖాన్ పేరిట దాడులు చేసిన పాక్, ముందుగా యుద్ధనాదం చేసింది. యుద్ధానికి కాలు దువ్వింది. అయితే భారత వైమానిక సామర్ధ్యాన్ని, బలహీనపరిచేందుకు, పాక్ పన్నిన కుట్రలు ఫలించలేదు. అప్పటికే, ఇజ్రాయల్ యుద్ద తంత్రాన్ని, ఔపోసన పట్టిన భారత సేనలు ఆ కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాయి, నష్టాన్ని చాలా వరకు తగ్గించాయి. మరో వంక పాక్ దుశ్చర్యలను గ్రహించిన భారత ప్రభుత్వం, మన సేనలను తూర్పు సరిహద్దు గుండా తూర్పు బెంగాల్‌లోకి పంపింది. ఇది వాస్తవం. ముందుగా కాలు దువ్వింది పాక్. అయినా, ‘మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కింది’ అన్నట్లు ఐక్యరాజ్య సమితిలో భారతదేశం దురాక్రమణకు పాల్పడిందని పాక్ ఆరోపించింది. అసత్యాన్ని సత్యమని నమ్మించే విఫల ప్రయత్నం చేసింది. నిజానికి పశ్చిమ కనుమలపై వైమానిక మెరుపు దాడులకు ముందుగానే పాకిస్తాన్ జెట్ విమానాలు అగర్తలా స్థావరం మీద దాడులకు తెగబడ్డాయి.
అదే సమయంలో తూర్పు బెంగాల్‌లో భారత సేనల జోక్యాన్ని అడ్డుకునేందుకు అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు యాహ్యాఖాన్ ఐక్యరాజ్య సమితిలో సమస్యను జటిలం చేసే ప్రయత్నం చేశారు. తూర్పు బంగ్లాలో భారతదేశం గెరిల్లా యుద్ధానికి పాల్పడు తోందని ఆరోపించారు. యథాతథ స్థితిని కొనసా గించాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్‌కు అమెరికా, చైనా అండగా నిలవడంతో యాహ్యాఖాన్, భారత దేశాన్ని తేలిగ్గా ఇరకాటంలోకి నెట్టవచ్చని ఆశించారు. అయితే, ఆ సమయంలో రష్యా ఒకసారి కాదు, తూర్పు బంగ్లాపై పాకిస్తాన్ అణచివేత సాగిన మొత్తం కాలంలో మూడుసార్లు, వీటో పవర్ ఉపయోగించి, పాకిస్తాన్ నీచ,నికృష్ట ఎజెండాను భగ్నం చేసింది.
అదొకటి అలా ఉంటే, పాకిస్తాన్ ముక్కలు కావడానికి, భారతదేశం కారణమనే సాధారణ అభిప్రాయంలో కూడా నిజం లేదు. అదే విషయాన్ని మన్కేకర్ విపులంగా వివరించారు. నిజానికి అందరూ అనుకున్నట్లు భారత సైన్యం పాకిస్తాన్‌ను ఛిద్రం చేయడం కాదు, యాహ్యాఖాన్ ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా, దౌర్జన్యంగా విభజన కుట్రకు తెర తీశారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల ఫలితాలను కాదని, యాహ్యాఖాన్ ఎన్నికలలో విజయం సాధించిన షేక్ ముజిబూర్ రెహ్మాన్‌ను అరెస్ట్ చేశారు. బెంగాలీలపై నిర్దాక్షిణ్యంగా హింసకు, దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో బెంగాలీలు భారతదేశానికి శరణార్థులుగా రావడం మొదలైంది. అయితే, కొద్ది కాలంలోనే శరణార్ధుల వెల్లువ సమస్యగా మారింది. మన దేశానికి మోయలేని భారంగా మారింది. చివరకు, ఆర్థిక, సామాజిక సమస్యలకు, మతపరమైన సమస్యలకు కూడా శరణార్ధుల తాకిడి కారణం అయింది.
ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రధాని ఇందిరా గాంధీ ప్రపంచాధినేతలకు విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రపంచ దేశాల నుంచి ఆశించిన సహాయం అందలేదు కానీ, బంగ్లాదేశ్ విషయంలో భారతదేశం వేలు పెట్టడం వెనక దురుద్దేశాలు ఏవో ఉన్నాయనే ఆరోపణలు ఎదురయ్యాయి. అంతే కాదు, శక్తికి మించి అంత మంది శరణార్థులను దేశంలోకి ఎలా, ఎందుకు అనుమతించారంటూ పశ్చిమ దేశాలు ప్రశ్నించాయని రచయిత గుర్తు చేశారు.
ఇలా ఓ వంక పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై మాటలకు అందని రీతిలో క్రూరంగా ప్రవర్తిస్తున్నా ప్రపంచ దేశాదినేతలు పాకిస్తాన్ పక్షానే నిలిచారు. 1971 మే నెలలో హెన్రీ కిస్సింజర్ పాకిస్తాన్‌కు మద్దతుగా అన్నట్లు, ఇస్లామాబాద్ నుంచి పెకింగ్ (బీజింగ్) వెళ్లారు. భాతదేశానికీ వ్యతిరేకంగా పాకిస్తాన్, చైనాలతో అమెరికా అధ్యక్షుడు చేతులు కలిపారు.
ఇదుకు సమాధానంగా భారతదేశం సోవియెట్ యూనియన్‌తో ఆగష్టు 9 న, యుద్ద సమయంలో పరస్పర సహకారం కోసం స్నేహ ఒప్పందం కుదుర్చు కుంది. చివరకు, చివరి ప్రయత్నంగా ఇందిరాగాంధీ, ఏడు పశ్చిమ దేశాలకు వెళ్లారు. అయినా ఫలితం రాలేదు. చివరకు, నవంబర్ 2వ తేదీన ఒక ఇంటర్వ్యూ ఇందిరాగాంధీ, ‘వేరే దేశం సమస్యలతో మా దేశం బాధలకు గురికావాలని కోరుకోవడం లేదు. అందుకు మేము సిద్ధంగా లేం, శరణార్థు లందరూ వెనక్కి వెళ్లిపోవాలి’ అని స్పష్టం చేశారు. అలాగే, పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి, రోజులు మారాయని గుర్తుచేశారు. ఎక్కడో వేల మైళ్ల దూరంలో ఉన్న ఏ దేశం అయినా మా దేశం, దురాక్ర మణకు పాల్పడిందని, మా ప్రయోజనాలను విస్మరించే విధంగా మాపై వత్తిడి తేవాలనుకుంటే, అది అయ్యే పని కాదని, స్పష్టం చేశారు.ఇప్పుడు మా దేశ ప్రయోజనాలకు ఏది మంచిది అనిపిస్తే అదే చేస్తాం కానీ, ఇంకొకరి వత్తిళ్లకు లొంగేది లేదని స్పష్టం చేశారు.
ఇక్కడ రచయిత మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించారు. యాహ్యాఖాన్ అసలు ఉద్దేశం అందరూ అనుకుంటున్నట్లుగా, తూర్పు పాకిస్తాన్‌లో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కాదు. కశ్మీర్‌ను భారత దేశం నుంచి ఎగరేసుకు పోవడమే ఖాన్ లక్ష్యం. అందుకే పశ్చిమ కనుమలపై కన్నేసి, అక్కడకు సైనికులను పంపారు. అదే సమయంలో జనరల్ ఏఏకే నైజ్,తూర్పు బెంగాల్ సరిహద్దులను మూసివేశారు. బెగాలీలపై అమానుష దాడులకు తెగబడ్డారు. ఈ అణచివేత గెరిల్లా దాడులను ప్రారంభించాలనే ముక్తివాహినీ సంకల్పాన్ని తీవ్రతరం చేసింది. ముక్తివాహిని, సమాచార వ్యవస్థను ధ్వంసం చేయడం మాత్రమే కాదు, పాక్ జెట్ విమానాన్ని కూల్చి వేశారు. పాక్ యుద్ద నౌకలు రెండింటిని సముద్రంలో ముంచేశారు. నవంబర్ నాటికి, పావు వంతు బంగ్లాదేశ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో, చైనా ఎలాంటి యుద్ధంలో అయినా పాకిస్తాన్‌కు సహాయంగా ఉండేందుకు ‘హెవీ మిషనరీ కాంప్లెక్స్’ను ఏర్పాటు చేసింది. మరోవంక మార్చి నుంచి డిసెంబర్ వరకు చిక్కిన తొమ్మిది నెలల సమయాన్ని భారత సేనలు సద్వినియోగం చేసుకున్నాయి. తూర్పు, పశ్చిమ కనుమల్లో పై చేయి సాధించాయి.
నిజానికి పాకిస్తాన్‌తో తూర్పు బెంగాల్లో జరిగిన యుద్ధం, మామూలు యుద్ధం కాదు. భారత సేనలకు అదొక విషమ పరీక్ష. ‘అవరోధాల సంగ్రామం’గా పిలిచే ఈ యుద్ధంలో ప్రతి ఆరు మైళ్లకు ఒక నది అవరోధంగా నిలిచింది. సైన్యం ముందుకు సాగేందుకు ఇంజనీర్లే కీలకమయ్యారు. అందుకే ఈ యుద్ధాన్ని ‘ఇంజనీర్ల యుద్ధం’ అని కూడా అంటారు. ఇక అక్కడి నుంచి సేనలు సమన్వయంతో కదులుతూ, పాక్ సేనలను, ఆ దేశానికి అండగా నిలిచిన దేశాల ఆయుధ సంపత్తిని తుత్తునియలు చేస్తూ ముందుకు కదిలాయి. చివరకు పాకిస్తాన్ చమురు నిల్వలు అడుగంటి, భారత విజయం తథ్యమని తేలిన నేపథ్యంలో భారత పార్లమెంట్, డిసెంబర్ 6న బంగ్లాదేశ్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించింది. ఆ వెంటనే పాకిస్తాన్ భారతదేశంతో దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకుంది.
కానీ, ఆ తర్వాత నాలుగు రోజులకే, డిసెంబర్ 10 మేజర్ జనరల్ ఫర్మాన్ ఖాన్ ఐదు సూత్రాల కాల్పుల విరమణ ప్రతిపాదన, పశ్చిమ పాకిస్తాన్ పౌరులను, ఐక్యరాజ్య సమితి అప్పగించే ఒప్పందాన్ని పంపించారు. అయితే, యాహ్యాఖాన్ డిసెంబర్ 11న ఈ అభ్యర్ధనను తిరస్కరించారు. డిసెంబర్ 14న ఈస్ట్ పాకిస్తాన్ గవర్నర్ డాక్టర్. ఏఎం మాలిన్ రాజీనామా సమర్పించారు. యాహ్యాఖాన్, అమెరికా, చైనా ఆదుకుంటాయని ఆశించారు. అందుకే, నియాజీ కాల్పుల విరమణ విజ్ఞప్తిని తిరస్కరించారు. భారత సేనలు చుట్టుముట్టడంతో, జనరల్ మానెక్ షా సరెండర్ ఆర్డర్స్ అంగీకరిస్తూ, జనరల్ నియాజీ డిసెంబర్ 16న సుమారు 4.30 గంటల సమయంలో, లెఫ్ట్‌నెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా సమక్షంలో సరెండర్ పేపర్స్ మీద సంతకం చేశారు. చివరకు, మార్చి 25, 1972 సైన్యాన్ని ఉపసంహ రించుకోవడంతో భారత దేశం విలువలకు నిలిచిన దేశంగా ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకుంది.
ఇలా ‘పాకిస్తాన్ కట్ టు సైజ్’ రచయిత డి.ఆర్. మన్కేకర్ భారత్ – పాకిస్తాన్ యుద్ధ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలనూ, భౌగోళిక రాజకీయ శక్తులు పోషించిన పాత్రను, అదే విధంగా యుద్ధభూమిలో భారత త్రివిధ దళాలు పోషించిన పాత్రను, ముక్తివాహినికి శిక్షణ ఇవ్వడంలో బీఎస్‌ఎఫ్ పోషించిన పాత్రను, ఇలా విభిన్న అంశాలను, ముఖ్యంగా మరుగున పడిన అనేక నిజాలను చక్కగా ఆవిష్కరించారు. ప్రచారంలో ఉన్న అసత్యాలను, పూర్వపక్షం చేశారు. అందుకే, మన్కేకర్ రాసిన ‘పాకిస్తాన్ కట్ టు సైజ్’ 1971 బంగ్లా విముక్తి యుద్ధం గురించి ప్రాథమిక అవగాహన కలిపిస్తుంది. ఆ మేరకు ఇది ఓ మంచి పుస్తకం అనిపించుకుంది.
అను: రాజనాల బాలకృష్ణ