సంపాదకీయం

శాలివాహన 1943 శ్రీ ప్లవ ఫాల్గుణ  శుద్ధ పంచమి

07 మార్చ్చి 2022, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‌ఫిబ్రవరి 24, 2022-భూగోళమంతటా జరిగిన వందల యుద్ధాల పక్కన మరొక యుద్ధాన్ని ప్రపంచ చరిత్రలో నమోదు చేసిన తేదీ. ఆ యుద్ధాల మాదిరిగానే ఇదీ ముగియడం అనివార్యం. కానీ, యుద్ధనేరాలు, రక్తపాతం, ధననష్టం కూడా యథాతథం. యుద్ధాల విషాదం బారిన పడని యుగం గురించి ఆశించవద్దనీ, ఎదురు చూడవద్దనీ ప్రపంచ మానవాళికి ఓ చేదు నిజాన్నీ, బహుశా శాశ్వత సత్యాన్నీ చెప్పిన రోజు కూడా అదే అనుకోవచ్చు. ఒకనాటి పదిహేడు సోవియెట్‌ల యూనియన్‌లోని ఉక్రెయిన్‌ ‌మీద రష్యా దాడికి దిగినది ఆ రోజే. నెపోలియన్‌ ‌బోనపార్టి చేసిన యుద్ధాలు మొదటి ప్రపంచ యుద్ధ కారణాలలో ఒకటిగా చెబుతారు. మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధాన్ని తెచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం ప్రచ్ఛన్నయుద్ధానికి దారి ఇచ్చింది. దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా సాగుతున్న ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగింపే తాజా రష్యా-ఉక్రెయిన్‌ ‌ఘర్షణ.

యుద్ధంలో ఎవరి కారణాలు వారికి ఉంటాయి. ఎవరి వాదనలు వారివే. ఎవరిది దురాక్రమణ అనేదీ, ఎవరు బాధితులు అనేదీ చరిత్ర చెబుతుంది. ఇప్పుడు వినిపిస్తున్న రెండు వాదనలు-రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ ‌పుతిన్‌ ‌రష్యాకు పూర్వ వైభవం తేవాలన్న యోచనలో ఉన్నారని కొందరు వాదిస్తున్నారు. అమెరికా కూడా తన కనుసన్నలలో పనిచేసే నార్త్ అట్లాంటిక్‌ ‌ట్రీటీ ఆర్గనైజేషన్‌ (‌నాటో) గొడుగు కిందకు ప్రపంచ దేశాలను తేవాలన్న తపనతో వేగిపోతోంద న్నది మరొక వాదన. ఇద్దరిదీ ప్రపంచాధిపత్యం కోసం ఆరాటమేనన్నది దీని సారాంశం.

సోవియెట్‌ ‌యూనియన్‌ ‌విడిపోయి మూడు దశాబ్దాలయింది. ఉక్రెయిన్‌ ‌స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది కూడా. రష్యా ఇరుగుపొరుగున పద్నాలుగు దేశాలను నాటో తన ప్రాబల్యంలోకి తెచ్చుకుంది. ఇది తమ ఉనికికి ప్రమాదమన్నది రష్యా వాదన. నాటోను నిరోధించడం తమ దేశ రక్షణకు సంబంధించిన విషయం, కాబట్టి అది హక్కు అంటారు పుతిన్‌. ఉ‌క్రెయిన్‌ ‌వ్యవహారాలలో జోక్యం చేసుకునే అవకాశం రష్యాకు మొదటి నుంచి ఉంది. సనాతన క్రైస్తవులలో ఒక వర్గం, ఇతర రష్యా మద్దతుదారులు అక్కడ ఉన్నారు. ఆ దాయాది దేశాల మధ్య 2014 ఆరంభం నుంచి షెల్స్ ‌ప్రయోగం జరుగుతూనే ఉంది. తూర్పు సరిహద్దులలో నిరంతర ఘర్షణ వాతావరణమే ఉంది కూడా.

ఉక్రెయిన్‌ ‌సంక్షోభం అసలు ఎనిమిదేళ్ల క్రితమే ఆరంభమైంది. నవంబర్‌ 2013‌లో నాటి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు విక్టర్‌ ‌యనుకోవిచ్‌ ‌యూరోపియన్‌ ‌యూనియన్‌తో విస్తృత ఆర్థిక ఒప్పందానికి నిరాకరించడమే ఇందుకు నాంది. దీనితోనే రాజధాని కీవ్‌లో హింసాకాండ చెలరేగింది. అంతిమంగా 2014 ఫిబ్రవరిలో అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లిపోవలసి వచ్చింది. ఆ వెంటనే రష్యా రంగప్రవేశం చేసింది. ఉక్రెయిన్‌లోని క్రిమియా ప్రాంతం రష్యా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. వెంటనే క్రిమియా వివాదాస్పద రిఫరెండమ్‌తో రష్యా సమాఖ్యలో చేరడానికి నిర్ణయించింది. ఆ తరువాత ఉక్రెయిన్‌ ‌భూభాగాలు లుహాన్‌స్క్, ‌దొనెత్‌స్క్‌లు కూడా వేరు పడాలని రిఫరెండమ్‌ ‌నిర్వహించి స్వతంత్రం ప్రకటించుకున్నాయి. యుద్ధానికి ముందుటి ఈ మొత్తం పరిణామాలతో, అంటే 2014 నుంచి ఇంతవరకు 10,300 మంది చనిపోయారు. 2014 జూలై నాటికే ఉక్రెయిన్‌ ‌సంక్షోభం అంతర్జాతీయ సమస్యగా మారింది. ఉక్రెయిన్‌ ‌గగనతలంలో మలేసియా ఎయిర్‌లైన్స్ ‌విమానాన్ని రష్యా క్షిపణి కూల్చివేయడమే ఇందుకు కారణం. ఇందులో 298 మంది చనిపోయారు.

విడవమంటే పాముకి కోపం, తినమంటే కప్పకి కోపం చందంగా ఉంది పరిస్థితి. తూర్పు యూరప్‌, ‌మధ్య ఆసియాలలో సైనిక కార్యకలాపాలు నిర్వహిస్తూ రష్యా దిశగా విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఆపాలని అమెరికా, నాటోలను పుతిన్‌ ఇదివరకే హెచ్చరించారు. నాటోలో ఉక్రెయిన్‌ను చేర్చడానికి జరుగుతున్న ప్రయత్నాలూ ఆగాలని చెప్పారు. ఈ హెచ్చరికలను నాటో, అమెరికా తిరస్కరించడమే కాదు, ఉక్రెయిన్‌ ‌మీద దాడి జరిగితే ఆర్థిక ఆంక్షలు తప్పవని ప్రతి హెచ్చరిక చేశారు. ఈ ఫిబ్రవరి ఆరంభంలో మూడువేల అమెరికా సేనలను పోండ్‌, ‌రొమేనియా (నాటో సభ్య దేశాలు)లలో మోహరించ వలసిందని జో బైడెన్‌ ఆదేశించారు. అదే సమయంలో పుతిన్‌ ‌తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాలు లుహాన్‌స్క్, ‌దొనెత్‌స్క్‌లలో శాంతిని నెలకొల్పాలని సైన్యాన్ని ఆదేశించారు. డిసెంబర్‌ ‌నాటికి లక్ష మంది సైనికులను మోహరించారు. గడచిన డిసెంబర్‌ అం‌తంలో లేదా ఈ జనవరిలో దాడి జరుగుతుందని అమెరికా నిఘా సంస్థలు అంచనాకు వచ్చాయి. చివరికి ఇదే ఫిబ్రవరి 24న పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమించింది. మొత్తానికి చర్చలకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరించినట్టు వార్తలు రావడం ఇప్పటికి ఒక సాంత్వన. ఇంకా సాగదీయడం అందరికీ చేటే.

ఆక్రమిత కశ్మీర్‌ను కలుపుకోవడం ఇదే పంథాలో జరగాలని కొందరు ఇప్పుడు అభిప్రాయపడడం తొందరపాటు. కానీ ఇప్పుడు నాటో దేశాలు భారతీయ విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరు హేయంగా ఉంది. ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న మన విద్యార్థులు పోలండ్‌ ‌సరిహద్దులలో చలిలో రోడ్ల మీద ఉంటే ఆ దేశ సైనికులు అమానుషంగా వ్యవహరిస్తున్నారు. అదే ఉక్రెయిన్‌ ‌పౌరులను అనుమతిస్తున్నారు. ఇదేం ద్వంద్వవైఖరి? ఈ విషయం గురించి అమెరికాకు, నాటోకు నిరసన తెలియచేయాలి. ఈ యుద్ధం విషయంలో కూడా ఐక్యరాజ్య సమితి నిస్సహాయత వెల్లడైంది. యుద్ధాన్ని నివారించవలసిందని రష్యా అధ్యక్షునికి మన ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ ‌చేయడం, తమకు అండగా ఉండవలసిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మోదీకి ఫోన్‌ ‌చేయడం ఇందుకే. ఏమైనా ఈ వివాదంలో భారత్‌ అనుసరించిన తటస్థ వైఖరి సరైనదే.

About Author

By editor

Twitter
YOUTUBE