డామిట్‌! ‌కథ అడ్డం తిరిగింది – అని ‘కన్యాశుల్కం’ గిరీశం లెవెల్లో క్లైమాక్స్ ‌సీనులో జుట్టు పీక్కున్నారు ఇండియాను చెరబట్టిన తెల్ల దొరవారు.

ఆరే ఆరు నెలల్లో ఎంత మార్పు! 1945 ఆగస్టులో ప్రపంచ యుద్ధాన్ని గెలిచిన దిగ్విజయ ఉత్సాహంలో వారు కళ్లు నెత్తికెక్కి ఉన్నారు. 1946 ఫిబ్రవరి కల్లా దిమ్మతిరిగి, కాళ్లూ చేతులు ఒణికి, చెమటలు పట్టి దిక్కు తోచక బెంబేలుపడుతున్నారు.

జపాన్‌ ‌చేతులెత్తేసి సరెండర్‌ అవటానికి ముందునుంచే తెల్లదొరలు తమకు పట్టుబడిన వారిపై విచారణలు, కఠినశిక్షలు రొటీన్‌గా చేసుకు వేసుకు పోతున్నారు. రంగూన్‌ ‌తిరిగి వశపరచుకోవటానికి ముందే 20మందికి పైగా కోర్ట్ ‌మార్షల్‌ ‌చేసి తీవ్ర శిక్షలు విధించారు. బర్మాలో భారత సైన్యం నుంచి జారిపోయిన ఆరుగురిని పట్టుకుని ఉరి తీశారు. ఆ సంగతి వార్‌ ‌డిపార్టుమెంటు జాయింటు సెక్రెటరీ ఫిలిప్‌ ‌మాసన్‌ ఎన్నికల అనంతరం కొత్తగా కొలువు తీరిన సెంట్రల్‌ అసెంబ్లీ (పార్లమెంటు) ఎదుట 1946 ఫిబ్రవరిలో ప్రకటించాడు. సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌యుద్ధ వ్యూహంలో భాగంగా పారాశూట్ల ద్వారా, సబ్మెరైన్ల ద్వారా ఇండియాకు రహస్యంగా చేరవేసిన ఎందరో స్పెషల్‌ ఏజెంట్లను, బర్మా రంగంలో పట్టుబడిన కొందరు ఐఎన్‌ఎ ‌సైనికులను విచారణ లేకుండానే చంపేసినట్టూ వార్తలొచ్చాయి. (అంతర్జాతీయ యుద్ధ నియమాల ప్రకారం సక్రమ విచారణ ఏదీ జరపకుండా తమ సైనికులను హతమార్చటం నేరం అని సుభాస్‌ ‌చంద్రబోస్‌ ఆ ‌సందర్భంలో తీవ్ర హెచ్చరిక చేసిన సంగతి ఇంతకుముందు చెప్పుకున్నాం.) ద్రోహులను, విద్రోహులను దొరికిన వారిని దొరికినట్టు కాల్చెయ్యటం యుద్ధంలో చాలా మామూలు విషయమైనట్టు బ్రిటిషువారు ఆ విషయంలో మౌనం వహించారు.

యుద్ధం ముగిశాక పట్టుబడిన వేలాది సైనికు లను ఏమి చేయాలన్న ప్రశ్న వచ్చింది. బర్మా నేషనల్‌ ఆర్మీలాగే ఐఎన్‌ఎ ‌కూడా తమ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడింది కదా? బర్మా తిరుగుబాటుదారుల తప్పిదాలను క్షమించి శిక్షించకుండా వదిలేసినప్పుడు ఐఎన్‌ఎ ‌విషయంలో కూడా అలాగే వ్యవహరించాలా అన్నది 1945 ఆగస్టు 17న బ్రిటిష్‌ ‌కేబినెట్‌ ఇం‌డో బర్మా కమిటీ సమావేశంలో చర్చకొచ్చింది. ‘‘కుదరదు. మొదట మనపై తిరగబడినా యుద్ధంలో జపాన్‌ ‌పని అయిపోయిందని గ్రహించాక ఆంగ్‌సాన్‌ ఆర్మీ మనవైపు తిరిగి మనతో కలిసి జపాన్‌పై పోరాడింది. కాబట్టి క్షమించాం. దానికీ దీనికీ పోలిక లేదు. మనపై కత్తి ఎత్తిన ఐఎన్‌ఎ ‌ద్రోహులను తేలిగ్గా వదిలే సమస్యే లేదు అని ప్రధానమంత్రి అట్లీ కరాఖండిగా చెప్పాడు.

జపాన్‌ ‌వాళ్లు ఎంత ప్రలోభపెట్టినా లొంగ కుండా, విధేయతా ప్రమాణానికి కట్టుబడి యుద్ధ ఖైదీలుగానే ఉండటానికి ఇష్టపడిన ఇండియన్‌ ఆర్మీ వీర సైనికులను ఐఎన్‌ఎ ‌రెనెగేడ్లు పెట్టిన బాధలు, చిత్రహింసల గురించి విన్నాక దొరల ఆగ్రహం అతిశయించింది. యుద్ధఖైదీలను బానిసల కంటే హీనంగా హింసించి, గొడ్డుచాకిరీ చేయించిన జపాన్‌ ‌క్రూరత్వం మీద ఆగ్రహంతో రగిలిపోతున్న తెల్లవారికి, జపాన్‌తో కుమ్మక్కై రాజద్రోహానికి పాల్పడిన ఐఎన్‌ఎను మళ్ళీ ఎవరూ అలాంటి తప్పిదానికి సాహసించలేనంత కర్కశంగా శిక్షించటం తక్షణ కర్తవ్యంగా తోచింది.

ఆ ఊపులో విజయగర్వం తలకెక్కి లెక్కలు తీయిస్తే ఐఎన్‌ఎలోని మొత్తం 40 వేల సైనికుల్లో మలయాలో రిక్రూట్‌ ‌చేసుకున్న సివిలియన్లు పోగా ఇండియన్‌ ఆర్మీకి చెందిన వారి సంఖ్య 20 వేలు అని తేలింది. అందులో 16 వేల మంది బ్రిటిషు వారికి చిక్కారు. వారిలో 11 వేల మందిని డిల్లీ ఎర్రకోటలో పెట్టి ఒకటికి రెండుసార్లు ఇంటరాగేట్‌ ‌చేశారు. సర్కారు పట్ల విశ్వాసం దండిగా ఉన్నా గత్యంతరం లేక పర్యవసానాలకు భయపడి ఐఎన్‌ఎలో చేరిన వారు ‘వైట్‌’, ‌దుష్ప్రచారానికి మోసపోయి సర్కారుకు ఎదురుతిరిగినవారు ‘గ్రే’, బుద్ధిపూర్వకంగా విద్రోహులైన వారు ‘బ్లాక్‌’ అని మూడు తరగతులుగా వర్గీకరించారు. మొదట్లో ‘బ్లాక్‌’‌ల సంఖ్యే చాలా ఎక్కువ అనుకున్నారు. కానీ ఒక్కొక్కరినీ గుచ్చిగుచ్చి నిగ్గతీసి, సందేహ లాభాలను ఇచ్చిన మీదట కఠినంగా శిక్షార్హులైన ‘బ్లాక్‌’‌లు 2565 అని వార్‌ ‌డిపార్టుమెంటు లెక్క తేల్చింది. వారందరినీ బహిరంగంగా కోర్ట్ ‌మార్షల్‌ ‌చేయనున్నట్టు పైనపేర్కొన్న బ్రిటిష్‌ ‌కేబినెట్‌ ‌కమిటీకి కూడా తెలియపరిచారు. విధేయత కట్టు తప్పని సైనికులు, సైన్యాధికారులపై ఆ ద్రోహులు ఎలాంటి పాశవిక హింసకు, ఎన్ని అమానుష ఘాతుకాలకు పాల్పడ్డారో బహిరంగ విచారణలో బయటపెడితే జనమే వారిని అసహ్యించుకుంటారని, వారి చేతుల్లో భయానక బాధలు పడ్డ ఆర్మీవారిని నెత్తిన పెట్టుకుంటారని సర్కారువారు అంచనాలు బాగానే వేశారు. కాని తీరా అయింది వారు కలనైనా ఊహించనిది.

నెలకు 40 కేసుల చొప్పున యమస్పీడుగా డీల్‌ ‌చేసినా రెండున్నర వేల పైచిలుకు ‘బ్లాక్‌’ ‌ల విచారణ ముగించి మరణశిక్షో, జైలుశిక్షో విధించటానికి ఎంత లేదన్నా ఏడాదిపైనే పడుతుంది. వాళ్లు చేసిన దుర్మార్గాలు, అఘాయిత్యాలు సవిస్తరంగా విని విని జనానికి ఐఎన్‌ఎ అం‌టే రోత, సర్కారు వారి ధర్మబుద్ధి మీద ప్రేమ పెల్లుబుకుతాయి అని ఆశపడ్డ వారికి మొదటి షాకు ప్రాసిక్యూషన్‌ ‌వారే ఇచ్చారు. అడ్వకేట్‌ ‌జనరల్‌ (ఎ.‌జి.) కార్యాలయం వారు ఎర్రకోటలో ప్రాసిక్యూషన్‌ ‌దుకాణాలు తెరిచి ఒక్కొక్క కేసూ లోతులోకి వెళ్ళిచూస్తే న్యాయ పరీక్షలో దాదాపుగా ఏదీ నిలవదని, మర్డర్‌, ‌టార్చర్‌ ‌వంటి తీవ్ర అభియోగాలను నిరూపించేందుకు సాక్ష్యాధారాలు నూటికి 99 కేసుల్లో లేవని తేలింది.

ఉన్న వాటిలోకెల్లా బలమైన.. తిరుగులేని రుజువులు, సాక్ష్యాలు ఉన్న కేసు అని నిర్ధారణ చేసుకుని షానవాజ్‌, ‌సెహగల్‌, ‌ధిల్లాన్‌లను మొట్టమొదట బోనెక్కిస్తే తెల్ల సర్కారువారికి అదే నెత్తికి చేతులు తెచ్చి పెట్టింది. ముగ్గురికీ యావజ్జీవ శిక్ష ఈ చేత్తో వేసి ఆ చేత్తో అర్జెంటుగా ఎత్తేయ్యక తప్పలేదు. పరువు మడిచి జేబులో పెట్టుకుని, అంతగా విధంచెడ్డా ప్రజాగ్రహం బారి నుంచి సర్కారును రక్షించుకోవాలన్న ఫలం దక్కలేదు.

1857 తిరుగుబాటులో పాల్గొన్నవారిని వేల సంఖ్యలో రోడ్ల పక్క చెట్లకు ఉరితీసి, జనాలు హడలిపోయేలా తమ ప్రతాపం చూపించినట్టే ఇప్పటి తిరుగుబాటుదారులనూ బహిరంగంగా తొక్కి వేయాలనుకున్న బ్రిటిషు సర్కారు ఎత్తు బెడిసికొట్టింది. 1857లో ఆర్మీ సిపాయిలు మొదలుపెట్టిన పనిని 1946లో నేవీ రేటింగులు పూర్తిచేశారు. సర్కారువారు అందించిన సిమెంటు, ఇటుకలతో ఇండియాలోని బ్రిటిషు సర్కారుకే సమాధి కట్టిపెట్టారు!

ఐఎన్‌ఎ ‌విచారణల నుంచి, నావల్‌ ‌మ్యూటినీ నుంచి జనాల దృష్టి మరల్చటం కోసం సర్కారు కొత్త ఎత్తువేసింది. దేశం మీద దాడికి దిగిన జపాన్‌ను వీరోచితంగా జయించి దేశాన్ని రక్షించిన వీర సైనికులను అభినందించటానికి 1947 మార్చి 7న అట్టహాసంగా విక్టరీ మార్చ్ ‌పెట్టింది. న్యూడిల్లీ నుంచి ఎర్రకోట వరకూ పెరేడ్‌ ‌చేసే సైనికుల మీద వెర్రిజనం పూలు చల్లుతారని దొరతనం ఆశపడితే వారేమో రాళ్లు రువ్వటానికి సిద్ధపడ్డారు. విజయోత్సవాన్ని బహిష్కరించటమే గాక నగరమంతటా హింసాత్మక ప్రదర్శనలు జరిగాయి. విద్యుత్‌ ‌డిపార్టుమెంటు వారు మెరుపు సమ్మె చేసి విద్యుత్‌ ‌సరఫరా బంద్‌ ‌చేశారు. పత్రికల ప్రచురణ నిలిచిపోయింది. దుకాణాలు, సినిమా హాళ్లు స్వచ్ఛందంగా మూసేశారు. యూరప్‌, ‌బర్మాలలో యుద్ధాన్ని గెలిచిన సైనికయోధులను జనం గేలిచేసారు. యూరోపియన్‌ ‌డ్రెస్సులో కనపడిన వారినల్లా కొట్టారు. పోలీసులు ఫైరింగులు చేసినా అలజడి ఆగలేదు. చివరికి ఎర్రకోట చేరకుండానే విక్టరీ మార్చ్ అర్ధాంతరంగా ఆగింది.

ఐఎన్‌ఎ ‌విచారణ, తదనంతర తిరుగుబాట్ల ప్రకంపనాలు దిల్లీ నుంచి లండన్‌ ‌దాకా అధికార సౌధాల పునాదులను కదిలించాయి. లండన్‌లోని చీఫ్స్ ఆఫ్‌ ‌స్టాఫ్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌ఫీల్డ్ ‌మార్షల్‌ ‌వైకౌంట్‌ అలాన్‌ ‌బ్రూక్‌కు ఇండియా కమాండర్‌ ఇన్‌ ‌చీఫ్‌ ‌సర్‌ ‌క్లాడ్‌ ఆచిన్‌ ‌లెక్‌1946 ‌ఫిబ్రవరి 14న రాసిన ఈ కింది రహస్య లేఖ పరిస్థితి ఎటు పోతుందో, ఎక్కడికి దారి తీస్తుందో, దానిని ఎలా అదుపు లోనికి తేవాలో దిక్కుతోచని బ్రిటిష్‌ ‌సర్కారు అయోమయ స్థితికి అద్దంపడుతుంది.

MOST IMMEDIATE TOP SECRET 14 February 1946

.. No one can forecast with any certainty, the extent or degree of the hostile action with which we may have to deal. Such action may vary from complete rebellion aided by the whole or great majority of the Indian Armed Forces to isolated civil disturbances in different parts of the country, in suppression of which it may be possible to use Indian Armed Forces in support of the Indian Police.. In addition to the above possibilities of anti- Government action, there is the equally serious possibility of a religious waron large scale and covering the greater part of India between Hindus and Moslems.This contingency, should it arise, will be extremely difficult to meet as it is more than likely that it will be impossible to rely on either the Police or the Indian Armed Forces for the restoration of law and order. This means that British troops alone would be available to restore the situation which will certainly result in turning communal strife into anti Governmentaction by both parties. In this event we would again be faced by the risk of the Indian Armed Forces throwing in their lot with the insurgent elements.

If the worst comes to the worst British troops will be the only stable element in the country. Unless the essential key points can be held with reasonable certainty the maintenance of these troops may well become impossible. These key points are the capital Delhi, whence alone control can be exercised and the four chief ports Bombay Karachi Calcutta and Madras.. . Immediate despatch of three British Brigade Groups to India would be desirable in order to minimise any risk there may be of loss of control of the key points mentioned above.. ..

[TheTransfer of Power 1942-7, vol. 6, pp. 975-976]

(మనం ఎంత విస్తృతిలో, ఏస్థాయిలో ప్రతిఘటనను డీల్‌ ‌చేయవలసి వస్తుందో ఎవరమూ చెప్పలేం. ఇండియన్‌ ‌సాయుధ సేనలు మొత్తమో లేక వాటిలో అత్యధిక భాగం పూర్తి తిరుగుబాటు చేయడం మొదలుకుని దేశంలోని వివిధ ప్రాంతాలలో చెదురుమదురుగా పౌర అల్లర్ల వరకూ ఏమైనా జరగవచ్చు. పౌర అల్లర్లు మాత్రమే అయితే వాటిని అణచటానికి పోలీసులకు తోడుగా ఇండియన్‌ ‌సాయుధ సేనలను ఉపయోగించగలం. పైన పేర్కొన్న సంభవాలకంటే ప్రమాదకరమైనది ఇంకొకటి ఉన్నది. హిందువులు, ముస్లింల మధ్య దేశం విశాల ప్రాంతాలలో పెద్ద ఎత్తున మత యుద్ధమే కనుక సంభవిస్తే దానిని ఎదుర్కోవటం మహాకష్టం అవుతుంది. ఎందుకంటే అప్పుడు శాంతిభద్రతల పునరుద్ధరణకు అటు పోలీసుల మీదగాని ఇటు ఇండియన్‌ ‌సాయుధ బలగాల మీదగాని ఆధారపడలేని దుస్థితి ఉత్పన్నమవ్వవచ్చు. ఇక పరిస్థితిని పునరుద్ధరించటానికి బ్రిటిష్‌ ‌ట్రూప్స్ ‌మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి. వాటిని వాడితే మతసంఘర్షణ కాస్తా ప్రభుత్వ వ్యతిరేకతగా మారి రెండు విరోధి పక్షాలూ అందులో పాలుపంచుకుంటాయి. అదే కనుక జరిగితే భారత సాయుధ సేనలు తిరుగుబాటుదారులతో చేరిపోయే ప్రమాదం ఉంది.

జరగకూడనివన్నీ కర్మం చాలక జరిగితే దేశంలో స్థిరంగా మిగిలేవి బ్రిటిష్‌ ‌ట్రూప్స్ ‌మాత్రమే. అతి కీలకమైన స్థానాలు మన అధీనంలో లేకపోయి నట్టయితే ఆ ట్రూప్సును మెయింటైన్‌ ‌చేయటం మనతరం కాదు. ఆ కీలకస్థానాలు ఏమిటంటే రాజధాని దిల్లీ, నాలుగు ప్రధాన రేవులు బాంబే, కరాచీ, కలకత్తా, మద్రాస్‌. అవి భద్రంగా ఉన్నప్పుడే కంట్రోల్‌ ‌మన చేతుల్లో ఉంటుంది. మూడు బ్రిటిష్‌ ‌బ్రిగేడ్‌ ‌గ్రూపులను వెంటనే పంపిస్తే పైన పేర్కొన్న కీలక స్థానాల మీద కంట్రోలు జారిపోకుండా చూడటం వీలవుతుంది.)

మొదట్లో ఐఎన్‌ఎను వెనకేసుకు వచ్చి సర్కారుపై తీవ్రంగా మాట్లాడిన కాంగ్రెస్‌ ‌ముఖ్య నాయకులకు నచ్చచెప్పి ఎలాగో మేనేజ్‌ ‌చేసి తమదారికి తెచ్చుకోగలిగినా బ్రిటిష్‌ ‌రాజ్యానికి కష్టాలు తీరలేదు. నేతాజీ సుభాస్‌ ‌చంద్రబోస్‌ ఈ ‌లోకం నుంచే దాటిపోయిన తరవాత కూడా తెల్లదొరతనానికి కంటికి కునుకు లేకుండా వెంటాడాడు. Last Years of British India గ్రంథంలో మైకేల్‌ ఎడ్వార్డెస్‌ ‌చెప్పినట్టు-

ust as the British had not feared Gandhi, the reducer of violence, they no longer feared Nehru, who was rapidly assuming the lineaments of civilised statesmanship-even elder statesmanship- in response to the changed situation. The British, however, still feared Subhas Bose or, rather, the violence he represented.

[ Last Years of British India, Michael Edwardes, p. 92]

(హింసను వ్యతిరేకించే గాంధీకి బ్రిటిషువారు ఏనాడూ భయపడనట్టే నాగరీక స్టేట్స్‌మన్‌ ‌లక్షణాలను మారిన పరిస్థితుల్లో త్వరితంగా పుణికి పుచ్చుకుంటున్న నెహ్రూకూ భయపడటం మానేశారు. ఇంకా వారు భయపడేది సుభాస్‌ ‌చంద్రబోస్‌కు, లేక అతడు ప్రేరేపించిన హింసకు మాత్రమే.)

బ్రిటిషువారు ప్రపంచ యుద్ధాన్ని గెలిస్తేనేమి స్వాతంత్య్ర యుద్ధంలో మట్టికరచారు. సైనిక యుద్ధంలో ఓడి నేతాజీ స్వాతంత్య్ర లక్ష్యాన్ని దిగ్విజయంగా సాధించాడు. ఐఎన్‌ఎ ‌విచారణ, తదనంతర తిరుగుబాట్లలో మాడు పగిలిన తరవాత తమ అధికారానికి వెన్నెముక అయిన సైన్యాన్ని, పోలీసులను ఇంకే మాత్రమూ నమ్మలేమని తెల్లవారికి అర్థమయింది. ఉద్విగ్న జనాన్ని జోకొట్టటం కాంగ్రెసు నేతాశ్రీలను మేనేజ్‌ ‌చేసినంత తేలిక కాదని చేతులు కాలాక వారికి తెలిసివచ్చింది. అటు సైన్యమూ, పోలీసులూ కూడా తిరగబడితే, రాజధాని దిల్లీ అయినా తమ కంట్రోల్‌లో ఉంటుందన్న భరోసా లేనప్పుడు తమ గతి ఏమిటన్న ప్రశ్న వారికి స్థిమితం లేకుండా బెంబేలెత్తించింది. వారి చేతిలోని 30 బ్రిటిష్‌ ఇన్ఫెన్ట్రీ బెటాలియన్లు, 17 యూరోపియన్‌ ఆర్టిలరీ రెజిమెంట్లూ దేశంలో తెల్లవారి మానప్రాణాలు కాపాడేందుకు ఎందుకూ కొరగావు. ఆ మాట లండన్‌కు పెట్టుకున్న రహస్య మొరలో కమాండర్‌ ఇన్‌ ‌చీఫే ఒప్పుకున్నాడు. కనీసం రెండున్నర లక్షల బ్రిటిష్‌ ‌సైనికులనూ, ఆఫీసర్లనూ చుట్టూ ఉంచుకుంటే గానీ నానాటికీ విషమించే పరిస్థితిని కంట్రోలు చెయ్యలేరు. ఉన్నపళాన అన్ని లక్షల మందిని దేశంలోకి చేరవేయటం అసంభవం. అది సాధ్యపడనప్పుడు అర్జెంటుగా జెండా పీక్కొని ఇండియానుంచి పరారవ్వటమే తరణోపాయం.

ఇంచుమించుగా రెండు శతాబ్దాలపాటు తాము ఆడిన విభజించి పాలించే ఆట కట్టిందనీ, సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌రగిలించిన స్వాతంత్య్ర సంగ్రామ జ్వాల దావానలంలా తమను దహించనున్నదని గ్రహించాక తెలివిగల తెల్లవారు ప్రాప్త కాలజ్ఞత చూపారు. లండన్‌లో పావులు చకచకా కదిలాయి. అడుగులు వేగంగా పడ్డాయి. సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌స్వాతంత్య్రం కోసం ఆత్మ బలిదానం చేసిన ఏడు నెలలకు, ఎర్రకోటలో ఐఎన్‌ఎ ‌విచారణ మొదలైన మూడునెలల కల్లా, చరిత్రాత్మకమైన నావల్‌ ‌మ్యూటినీ లేచి నెల తిరగకుండా 1946 మార్చ్ 15 ‌న బ్రిటన్‌ ‌ప్రధాని క్లెమెంట్‌ అట్లీ కామన్స్ ‌సభలో చరిత్రాత్మకమైన భారత స్వాతంత్య్ర ప్రకటన చేశాడు ఇలా:

»»…India is today in a state of great tension…. The temperature of 1946 is not the temperature of 1920 or of 1930 or even of 1942..at the present time the tide of nationalism is running very fast in India. Today I think that national idea has spread right through and not least, perhaps, among some of those soldiers who have given such wonderful service in the war. Is it any wonder that today India claims as a nation of 400,000,000 people that she should herself have freedom to decide her own destiny? My colleagues are going to India with the intention of using theirutmostendeavours to help her to attain that freedom as speedily and fully as possible.”

 (‘‘ఇండియా ఇవాళ పెద్ద టెన్షన్లో ఉన్నది. 1946 టెంపరేచరు 1920లోనో, 1930 లోనో, ఆ మాటకొస్తే 1942లోనో ఉన్న టెంపరేచరు లాంటిది కాదు. ప్రస్తుత కాలంలో జాతీయవాద ప్రవాహం ఇండియాలో మహా వేగంగా పరుగెత్తుతున్నది. యుద్ధంలో అద్భుత సేవ చేసిన కొందరు సైనికులతో సహా జాతీయభావం సర్వత్రా వ్యాపించింది… నలభై కోట్ల మందికి చెందిన జాతిగా తన భావిగతిని తానే నిర్ణయించుకోవాలని ఇండియా ఈ రోజు కోరటంలో ఆశ్చర్యమేముంది? వీలైనంత వేగంగా, సాధ్యమైనంత సంపూర్ణంగా స్వాతంత్య్రం సాధించటంలో ఇండియాకు శాయశక్తులా సహాయపడేందుకు నా కేబినెట్‌ ‌సహచరులు ఇండియా వెళుతున్నారు.’’)

కాంగ్రెసువారు నడిపిన 1920నాటి సహాయ నిరాకరణ, 1930 శాసనోల్లంఘన, 1942 క్విట్‌ ఇం‌డియాల కాలం లాంటిదికాదు 1946లో ఇండియాలో సెగలు కక్కుతున్న జాతీయభావ ఉష్ణోగ్రత. మరీ ముఖ్యంగా సైనికులలో ఉప్పొంగిన జాతీయత అని బ్రిటన్‌ ‌ప్రధానమంత్రి పార్లమెంటులో భారత స్వాతంత్య్ర ప్రకటన సందర్భంలో అన్న మాటలను బట్టే భారతదేశ స్వాతంత్య్రం ఎవరివల్ల వచ్చిందన్నది స్పష్టం. ఆ తరవాత బ్రిటిష్‌ ‌పార్లమెంటులో ఇండియన్‌ ఇం‌డిపెండెన్స్ ‌బిల్లు మీద చర్చలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు చర్చిల్‌ ‌లేబర్‌ ‌బ్రిటిష్‌ ‌సామ్రాజ్య ఘనకీర్తిని గాంధీకి లొంగిపోయి నాశనం చేశావంటూ ప్రధాని అట్లీ మీద విరుచుకు పడ్డాడు. దానికి ప్రధానమంత్రి అదే మోతాదులో ఘాటైన జవాబు ఇచ్చాడు. ‘ఇండియాలో బ్రిటిష్‌ ‌సామ్రాజ్యం నిలబడింది భారత ప్రజల సపోర్టుతో కాదు. బ్రిటిష్‌ ఆర్మీ వెన్నుదన్ను వల్ల. రెండో ప్రపంచ యుద్ధకాలంలో సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌కూడగట్టిన ఇండియన్‌ ‌నేషనల్‌ ఆర్మీ మూలంగా, 1946లో బొంబాయిలో, ఇతరత్రా నేవీలో తిరుగుబాట్ల వల్ల సైనిక బలగాల్లో బ్రిటిష్‌ ‌ప్రభుత్వం పట్ల విధేయత బీటలు వారింది. ఆ పరిస్థితుల్లో మర్యాదగా ఇండియా నుంచి నిష్క్రమించటం మినహా మనకు గత్యంతరం లేదు – అని ఆ సందర్భంలో ప్రధానమంత్రి విడమర్చి చెప్పాడు.

 ఇదే వాస్తవాన్ని అనంతరకాలంలో క్లెమెంట్‌ అట్లీయే కలకత్తా పూర్వ ప్రధాన న్యాయమూర్తి ఫణిభూషణ్‌ ‌చక్రవర్తికి స్వయంగా ధ్రువీకరించాడు. ఆ వైనం చక్రవర్తి మాటల్లోనే వినండి:

“When I was acting as Governor of West Bengal in 1956, Lord Attlee visited India and stayed in the Raj Bhavan, Calcutta, for two days. I had then a long talk with him about the real grounds for the voluntary withdrawal of British from India. I put it straight to him like this:

The Quit India Movement of Gandhi poractically died out long before 1947 and there was nothing in the Indian situation at that time which made it necessary for the British to leave India in a hurry. Why did they then do so’ In reply Attlee cited several reasons, the most important of which were the activities of Subhas Chandra Bose which weakened the very foundation of the attachment of the Indian land and naval forces to the British Government. Towards the end I asked Lord Attlee about the extent to which the British decision to quit India was influenced by Gandhi’s activities. On hearing this question Attlee’s lips widened in a smile of disdain and he uttered, slowly, putting emphasis on each single letter- mi-ni-mal”

[History of Freedom Movement In India, Vol.3, R.C. Majumdar, p.610]

(1956లో నేను పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్రం యాక్టింగ్‌ ‌గవర్నరుగా ఉన్నప్పుడు లార్డ్ అట్లీ ఇండియా పర్యటనలో రెండు రోజులు కోల్‌కతా రాజ్‌భవన్‌లో బస చేశాడు. బ్రిటిషువారు ఇండియా నుంచి స్వచ్ఛందంగా వైదొలగటానికి అసలు కారణాల గురించి నేను ఆయనతో చాలాసేపు మాట్లాడాను. నేను సూటిగా ఇలా అడిగాను:

‘గాంధి క్విట్టిండియా ఉద్యమం 1947 కంటే చాలా ముందే అంతరించిపోయింది కదా. హడావుడిగా ఇండియాను వదిలి పోవలసినంత అగత్యం బ్రిటిషువారికి ఏమి వచ్చింది?’ జవాబుగా అట్లీ అనేక కారణాలు చెప్పాడు. అన్నిటిలోకీ ముఖ్యమైనవి సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌కార్యకలాపాలట! బ్రిటిష్‌ ‌ప్రభుత్వం పట్ల భారత సైనిక, నౌకా దళాల అనుబంధపు పునాదినే అవి దెబ్బతీశాయని ఆయన పేర్కొన్నాడు. ఇండియా నుంచి నిష్క్రమించాలన్న బ్రిటిష్‌ ‌నిర్ణయాన్ని గాంధీ కార్యకలాపాలు ఏ మేరకు ప్రభావితం చేశాయి అని నేను చివరిలో లార్డ్ అట్లీని అడిగాను. ఆ ప్రశ్నకు జవాబుగా ఆయన పెదవులు ఏవగింపు లాంటి చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ‘అ-తి-త-క్కు-వ’ అని ఒక్కో అక్షరాన్నీ ఒత్తి పలికాడు.)

1973 ఆగస్టు 20న అమృతబజార్‌ ‌పత్రిక ప్రచురించిన ఇంటర్వ్యూలో బ్రిటన్‌ ‌మాజీ ప్రధాని అట్లీ ఇంకా విస్పష్టంగా చెప్పాడిలా :

The loyalty of the British Indian Army to the Crown was so severely shaken when they saw Netaji’s INA that it was just not possible to continue British rule in India.”
[Quoted in The Man India Missed The Most, Bhuvan Lall, p. 373]

(నేతాజీనీ, ఐఎన్‌ఎనీ చూశాక చక్రవర్తి పట్ల బ్రిటిష్‌ ఇం‌డియన్‌ ఆర్మీ విధేయత – ఇండియాలో ఇంకెంత మాత్రమూ బ్రిటిష్‌ ‌పరిపాలన కొనసాగలేనంత తీవ్రంగా సడలిపోయింది.)

– ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి

About Author

By editor

Twitter
YOUTUBE