శ్రీనృసింహుడిని ‘క్షిపప్రసాదుడు’ అంటారు. అనుగ్రహిస్తే క్షణం కూడా ఆలస్యం చేయడని భావం. తన భక్తుడు ప్రహ్లాదుడి కోసం ఉద్భవించాడు. భక్తపరాధీనుడు, ఆర్తత్రాణపరాయణుడు. నృసింహావతారం కేవలం దనుజ సంహారానికే కాదు. భక్తికి గల అపరిమిత శక్తిని నిరూపించడమూ ఈ అవతార లక్ష్యం, తత్త్వం. ఆ ఉగ్రత్వాన్ని బట్టి ఆయన హిరణ్యకశిపుడినే కాదు… లోకాలన్నింటినీ చీకాకు పరచగలడని దేవతలు కలత చెందారు. అయితే ‘స్తోతప్రియుడు’ విష్ణువు ప్రసన్నాకృతిలో సాక్షాత్క రించారు. అవతార రీత్యా ఉగ్రమూర్తే అయినా కరుణాతరంగుడు. బిడ్డను దండించిన తండ్రి ఆ తరువాత లాలించడం లాంటిదే ఆయన నైజమని ఆధ్యాత్మికవేత్తలు అంటారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని మంగళాద్రి, అహోబిలం, ధర్మపురి నృసింహ క్షేత్రాలలో ఫాల్గుణ శుక్లపక్షంలో బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవాలు జరుగుతాయి. ఎగువదిగువ సన్నిధులలో ఫాల్గుణ శుద్ధ పంచమి నుంచి పౌర్ణమి వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.


ఆదిశేషుగా వర్ణించిన తిరుమల నుంచి శ్రీశైలం వరకు గల పర్వతపంక్తిలో తిరుమల కొండను ఆదిశేషుని శిరస్సుగానూ, అహోబిలంను మధ్య భాగంగానూ, శ్రీశైలంను తోక భాగంగానూ చెబుతారు. కనుకనే అహోబిలం పర్వతం ఎత్తుగా ఉందని అంటారు. ఓబులం, అహోబిలం, అహోబిలగిరి, అహోబలం, వేదాద్రి, దిగువ తిరుపతి, గరుడాద్రి, వీరక్షేత్రం, నగరి, నిధి, తక్ష్యాద్రి, నరసింహతీర్థం, గరుడాచలం తదితర పేర్లు ఉన్నా ‘అహోబిలం’ పేరే ప్రసిద్ధిచెందింది. మహా బలపరాక్రమాలతో స్వామి బిలం(గుహలో)లో దర్శనం ఇవ్వడం వలన ఈ క్షేత్రానికి ‘అహోబలం’, ‘అహోబిలం’అనే పేర్లు వచ్చాయని ప్రతీతి. క్షేత్రాన్ని తమిళులు ‘సింగవేల్‌ ‌కుండ్రమ్‌’ అం‌టారు. దానవశ్రేష్ఠుడు హిరణ్యకశిపుడిని సంహరించేందుకు ఆవిర్భవించిన మహోగ్ర నరసింహమూర్తిని చూసి భయపడి బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవాదులు, గంధర్వ, యక్షకిన్నెర, కింపురుషులు, ప్రజాపతులు, రుషులు తదితరులు ‘అహో వీర్యం అహో శౌర్యం అహో బాహు పరాక్రమం / నారసింహం పరందైవం అహోబలం మహాబలం’ అని శ్లాఘించారట. కాలక్రమంలో అది ‘అహోబిలం’ గా మారిందంటారు.

మరో కథనం ప్రకారం, గరుత్మంతుడి ఘోర తపస్సుకు ప్రసన్నుడైన నరసింహుడు గుహ(బిలం)లో దర్శనమివ్వడంతో ‘అహోబిలం’అనే పేరువచ్చింది. స్వామివారి సాక్షాత్కారంతో సంతోషాతిశయంతో పక్షిరాజు ‘అహోబిలం మహాబలం’ (అహోబిల క్షేత్రం మనలను మహా బలవంతులను చేస్తుంది) అన్నట్లు కథనం ఉన్నది. ‘అహోబలేశుడు’గా పూజలందుకునే స్వామి జన సామాన్యంలో ‘ఓబులేశు’గా మారాడు. దివిజ గంగ ‘భవనాశిని’గా భువికి దిగివచ్చి నృసింహుని పాదాలు కడుగుతూ ప్రవహిస్తోంది. ఇది భవ రోగాలకు ఔషధం. ఈ జలాలలో స్నానమాడి తనను సేవించుకున్నవారికి సకల పుణ్యాలు, సమకూరుతాయని సాక్షాత్తు స్వామివారే అనుగ్ర హించారని పురాణవాక్కు.

నవ నారసింహులకు ఆలవాలమైన ఎగువ సన్నిధి, శ్రీలక్ష్మీ నరసింహులుతో దిగువ సన్నిధిగా అహోబిలం క్షేత్రం రెండు భాగాలుగా దర్శన మిస్తోంది. ఎగువన ఉగ్ర నరసింహ, దిగువున ప్రహ్లాద వరద నరసింహ ఆలయాలు ప్రధానమైనవి.

‘జ్వాలాహోబిల మాలోల క్రోడాకారంజ భార్గవ

యోగానందచ్ఛత్రవట పావనానమమూర్తయ’ అనే శ్లోకం ఎగువ అహోబిలంలోని నవనారసింహ క్షేత్రాలను (జ్వాలా, అహోబిల, మాలోల, వరహా, కారంజ, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన నృసింహులు) తెలియ చెబుతోంది. ఎగువ క్షేత్రంలో అమ్మవారు చెంచులక్ష్మి కాగా, దిగువన అమృతవల్లితో స్వామి దర్శనం ఇస్తారు. ఇక్కడ ఆండాళ్‌ ‌సన్నిధి కూడా ఉంది. కానుగ వృక్షం కింద కొలువై ఉన్నందున కారంజ నరసింహుడు అని పేరుతో వ్యవహరిస్తారు. తమ ఆడపడుచు చెంచులక్ష్మిని మనువాడడం ద్వారా నరసింహుడు తమ అల్లుడయ్యా డన్నది ఈ ప్రాంతం (నల్లమల) చెంచుల ప్రగాఢ విశ్వాసం. గిరిజనులు స్వామివారికి జుంటు తేనె, మాంసం నైవేద్యంగా పెట్టేవారట.

బాల భాగవతుడు ప్రహ్లాదుడ్ని కరుణించేందుకు, సనకసనందులచే శాపగ్రస్థుడైన హిరణ్యకశిపునికి ముక్తి ప్రసాదించేందుకు శ్రీమన్నారాయణుడు నరమృగ శరీరంతో స్తంభం నుంచి మహోగ్రరూపంతో ఉద్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ‘ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందుందు వెదకి చూచిననందందేగలడు దానవాగ్రణి వింటే’ అని ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపునికి చేసిన సూచనను నిజం చేస్తూ శ్రీహరి స్తంభం నుంచి ఉద్భవించటం వల్లే శ్రీ ఉగ్ర నరసింహక్షేత్రం అహోబిలం ప్రసిద్ధిచెందింది. స్తంభోద్భ వుడు (నృసింహుడు) ఒక పాదం అహోబిలంలో, మరోపాదం పెన్నాహో బిలంలో (అనంతపురానికి సుమారు 22 కి.మీ. దూరంలోని కొండపై) మోపి హిరణ్యకశిపుడిని సంహరించాడని జనశ్రుతి. అసుర సంహారం తరువాత స్వామి అక్కడి అహోబిలంలోని ‘రక్తకుండం’లో చేతులు కడుక్కున్నారని చెబుతారు.

ఈ క్షేత్రాన్ని పురాణపురుషులు పరశురామ, రామలక్ష్మణులు, బలరామ, శ్రీకృష్ణార్జునులు, త్రిమతా చార్యులు శంకర, రామానుజ మధ్వాచార్యులు సందర్శించి స్వామిని అర్చించారని ఐతిహ్యం. శంకరభగవత్పాదుల నృసింహ ‘కరావలంబ’ స్త్త్తోత్రం జగత్ప్రసిద్ధం. కొంతకాలం ఈ క్షేత్రంలో గడిపిన వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు అహోబలేశుడిని ‘వేదములె నుతించగా, నవనారసింహ నమోనమో’ అని శముదలచరో అహోబలం, వేదములే నీ నివాసమట విమల నారసింహా, జయజయ నృసింహ సర్వేశా, కంభమున వెడలె ఘన నరసింహము, ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా, నరులారా నేడువో నారసింహ జయంతి’ తదితర సంకీర్తనలలో నృసింహ వైభవాన్ని, ఘనతను కీర్తించారు. తెలుగులో వచ్చిన తొలి స్థలపురాణం కూడా అహోబిలానిదేనని చెబుతారు.

మంగళాద్రీశా! జయతు…

కృష్ణానదీ తీరంలో గజాకారంలో గల ఈ కొండకు మంగళాచలం, మంగళ శైలం, మంగళాద్రి, తోతాద్రి, ధర్మార్తి, ముక్త్యాద్రి అనే పేర్లు ఉన్నాయి. శుభ మంగళాలు చేకూర్చే లక్ష్మీనరసింహుడు కొలువై ఉండడం వల్ల మంగళాద్రిగా, మంగళగిరిగా ప్రాచుర్యం పొందింది. శ్రీలక్ష్మి తపస్సు చేయడం వల్ల దీనికి ‘మంగళ’గిరి అని పేరు వచ్చిందని, ఆమె స్వామి వారికి అమృతం సమర్పించి కోపం తగ్గించారని పురాణ కథనం. ఈ కొండ శుభాలను ఇచ్చేదిగా భక్తులు భావిస్తారు. ఎగువ సన్నిధిలో ఉదయ, మధ్యాహ్నకాల అర్చనలు, దిగువన త్రికాలార్చనలు జరుగుతాయి. మంగళగిరి, స్నానాలయ్య, అన్నాలయ్య, దీపాలయ్య, వజ్రాలయ్యలనే క్షేత్రాలను పంచ నారసింహ క్షేత్రాలు అంటారు. ఇక్కడ కొండ దిగువున శ్రీరాజ్యలక్ష్మీ నరసింహస్వామి, ఎగువన శ్రీపానకాలస్వామి, గిరిశిఖరంపై గండాల నరసింహ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఎగువ సన్నిధిలో ప్రత్యేకంగా స్వామివారి విగ్రహమంటూ ఉండదు. తెరచుకుని ఉన్న నోటి ఆకారంలో రంధ్రం మాత్రమే కనిపిస్తుంది.

ఈ పర్వత గుహలోకి ప్రవేశించిన నముచి అనే దానవుడిని నృసింహరూపుడైన విష్ణువు సంహ రించాడు. దేవతలు అందించిన అమృతంలో సగం మాత్రమే స్వామి స్వీకరించి మిగిలినది బయటకు వదిలారట. కలియుగంలో సమర్పిస్తున్న పానకం ప్రసాదం కూడా ఆ కోవ కిందికే వస్తుందని చెబుతారు. పాండవులు అరణ్యవాస కాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించి రాజ్యలక్ష్మీ సమేత నృసింహ స్వామి ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథనం. అమ్మవారు స్వామివారి వైపు చూసేలా విగ్రహం ఉంటుంది. ఆదిశంకరులు, చైతన్య ప్రభువు ఈ క్షేత్రాన్ని సందర్శించినట్లు వారి పాదచిహ్నాలను మెట్లపై మలచారు. శ్రీరామచంద్రుడి ఆదేశం మేరకు భక్తాంజనేయుడు ఇక్కడ క్షేత్రపాలకుడిగా స్థిరనివాసం ఏర్పరచుకున్నారని మరో పురాణగాథ.

పానకం నివేదన

ఈ స్వామికి కృతయుగంలో అమృతం, త్రేతాయుగంలో ఆవు నెయ్యి, ద్వాప రంలో పాలు నివేదించేవారని స్థల పురాణం చెబుతోంది. ఈ యుగంలో పానకం (చెరకు, బెల్లం, పంచదార) సమర్పిస్తున్నారు. పానకాల స్వామికి సమర్పించే పానకంలో సగం మాత్రమే స్వీకరించి, మిగిలినది భక్తులకు తీర్థంగా వస్తుందని చెబుతారు. తరతరాలుగా ఇలా పానకం తయారుచేసి సమర్పిస్తున్నా, దేవస్థానంలో చీమలు, ఈగలు వంటివి కనిపించక పోవడాన్ని ప్రత్యేకతగా చెబుతారు. గండాల నరసింహస్వామినే గండాల రాయుడు అనీ అంటారు. అనుకున్న కోరికలు తీరినవారు గిరిశిఖరంపై పెద్ద ప్రమిదలో నూనె పోసి దీపం వెలిగిస్తారు.

కొండవీడును జయించిన శ్రీకృష్ణదేవరాయలు అమాత్యుడు తిమ్మరుసు సహా మంగళాద్రినాథుడిని దర్శించి భూదానం చేసినట్లు శాసనం తెలుపుతోంది. రాయల విజయాన్ని సూచించే ఈ శాసనాన్ని ‘జయస్తంభం’ అంటారు. ఈ శాసనంలోని వివరాల ప్రకారం, మంగళగిరి పురాన్ని నృసింహ ఆలయానికి దానంగా ఇచ్చారు. కనుకనే దానభూమిని ‘దేవభూమి’ లేదా ‘దేవస్థాన గ్రామం’గా పిలిచేవారు.

విఖ్యాత గాలిగోపురం

విజయనగర సామ్రాజ్య సామంతుడు, అమరావతి పాలకుడు నాదెండ్ల తిమ్మయ్య 1516లో ఆలయంలో మండపం, తొమ్మిది కుంభాలు, మూడు అంతస్తుల గాలిగోపురం నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఆలయానికి 28 గ్రామాలలో మొత్తం రెండు వందల కుంచాల (10 కుంచాలు=ఎకరం) భూమిని దానమిచ్చారు. సదాశివరాయలు, తిరుమలరాయలు, తిమ్మరాజు అనే పేర్లు ఈ శాసనంపై ప్రస్తావించారు. దాదాపు 225 ఏళ్ల క్రితం (1807) రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు దిగువ ఆలయానికి 153 అడుగుల ఎత్తు, 49 అడుగుల వెడల్పుతో 11 అంతస్తులు గాలి గోపురం నిర్మిం చారు. దీని నేపథ్యాన్ని పరిశీలిస్తే.. తన పాలనలో చెంచుల దోపిడీలు ఎక్కువ కావడంతో ఆగ్రహించిన వెంకటాద్రినాయుడు, అనేక మంది చెంచు నాయకు లను రప్పించి, మట్టు పెట్టించారట. దాంతో ప్రజలకు దోపిడీల బెడద తగ్గినా, అశాంతితో బాధపడు తున్న ఆయన పశ్చాత్తాపం, పాపపరిహారార్థం కోసం పెద్దల సూచన మేరకు ఆలయాల నిర్మాణం చేపట్టారని, ఆ క్రమంలోనే ఈ మహోన్నత గాలిగోపురం నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈ గాలిగోపురం పనులు రెండేళ్లకు పూర్తయిన తరువాత అది ఉత్తర దిశగా ఒరిగి ఉండడాన్ని గమనించి, ఆ లోపం సరిదిద్దేందుకు గోపురానికి ఉత్తర భాగంలో కోనేరును తవ్వించారు. దీనినే ‘చీకటి కోనేరు’ అంటారు. ఆలయానికి ఉత్తర, దక్షిణాన గాలిగోపురాలు ఉండడం మరో ప్రత్యేకత.

వార్షిక బ్రహ్మోత్సవాలు

ఏటా ఫాల్గుణశుద్ధ షష్ఠినాడు మొదలయ్యే వార్షిక బ్రహ్మోత్సవాలు పదకొండురోజుల పాటు సాగుతాయి. శుద్ధ చతుర్దశినాటి రాత్రి కల్యాణం, మరుసటి రోజు రథోత్సవం వైభవంగా సాగుతుంది. ఈ ఉత్సవాన్ని దక్షిణాది ‘పూరి’ రథోత్సవం’గా భక్తులు విశ్వసిస్తారు. పుష్పయాగంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. ‘మంగళగిరి తిరునాళ్ల’కు తెలుగునాట ప్రత్యేకత ఉంది. ఫాల్గ్గుణ బహుళ తదియ నుంచి పదిరోజులపాటు రోజుకు ఒక అవతారంలో స్వామిని అలంకరించి అర్చిస్తారు. ఓంకార నాదం వినిపించే దక్షిణావృత శంఖాన్ని 15వ శతాబ్దంలో తంజావూరు పాలకులు స్వామివారికి సమర్పించారు. ఈ శంఖానికి వైకుంఠ ఏకాదశి నాడు ప్రత్యేక పూజాదికలు నిర్వహించి భక్తులకు తీర్థం ఇస్తారు.

‘ధర్మవర్తన’ నగరి ధర్మపురి

ధర్మపురి హరిహరక్షేత్రం. శ్రీలక్ష్మీసమేత యోగానంద నృసింహుడు, రామలింగేశ్వరుడు ఇక్కడ కొలువుదీరారు. పూర్వం ధర్మవర్మ అనే రాజు ధర్మవర్తిగా పాలన చేసినందున ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చిందట. దీనిని బౌద్ధ భిక్షకులు ‘దమ్మపురి’ అని వ్యవహరిస్తారు. ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లాలో గోదావరి నదీ తీరాన గల పుణ్యక్షేత్రం ధర్మపురి క్షేత్రం. తెలంగాణలో యాదాద్రి అంత• ప్రాశస్త్యం కలిగింది. గోదావరి తీరంలోని ఇతర నృసింహక్షేత్రాల కంటే ధర్మపురి అతిపురాతనమైనదని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. గౌతమి మహర్షి తెచ్చినందున గౌతమి అని, గోహత్యాపాతకాన్ని పోగొట్టింది కనుక గోదావరి అని ఇక్కడి గోదావరిని వ్యవహరిస్తారు. ప్రశాంత గోదావరితీరంలో లక్ష్మీసమేత నృసింహుడు సాలగ్రామ విగ్రహరూపంలో పద్మాసనం, కోరమీసాలతో దర్శనమిస్తాడు.. శ్రీరామ చంద్రుడు రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించారని ఐతిహ్యం. ఇది భువనేశ్వర్‌లోని లింగ రామేశ్వరాలయాన్ని పోలి ఉంటుంది. ఇక్కడే మరో ఆలయంలో ఉగ్రరూపుడైన నృసింహుని విగ్రహమూ ఉంది. ఆలయ ప్రాంగణంలో శ్రీనివాసుడు, వేణుగోపాలస్వామి, ఆంజనేయ ఉపాలయాలు కొలువుతీరాయి. అరుదైన బ్రహ్మ ఆలయం కూడా ఇక్కడ నెలకొంది.

‘సమవర్తి’దే ప్రథమ దర్శనం

‘ధర్మపురి సందర్శనంతో యమపురి’ దూరమని నానుడి. ఎక్కడాలేని విధంగా యమధర్మ రాజుకు ఇక్కడ ఆలయం ఉండడం, నిత్యపూజాదికాలు నిర్వహించడం ప్రత్యేకత. దీపావళి తరువాతి విదియ (కార్తిక శుక్ల విదియ) నాడు ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఆనాడు ఆయనను సందర్శిస్తే కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇందుకు సంబంధించి, ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం…యముడు, యమునలు సూర్య సంతానం. తన ఇంటికి రావాలంటూ యమున సోదురుడిని ఆహ్వానిస్తుంది. అయితే పాపులను శిక్షించడంలో తీరికలేని ఆయన సోదరి మాటను మన్నించలేక పోయాడట. చివరకు కార్తిక శుక్ల విదియనాడు (యమ ద్వితీయ) వెళ్లి నృసింహాస్వామివారినీ దర్శించుకున్నాడట. ఆరోజున తోబుట్టువులు సోదరుల ఇళ్లకు వెళ్లి మంగళహారతులు అందుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజున సరకానికి ‘సెలవు’అని అంటారు. ఆనాడు యముడు తన లోకంలో ఉండడు కనుక తెలియక తప్పులు చేసినా అవి అంటవని జనుల నమ్మకం. యమ ధర్మరాజును దర్శించుకున్న తరువాతనే లక్ష్మీ నరసింహుడిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఇక్కడి ‘యమగండదీపం’ వెలిగించడం వల్ల ఆకస్మిక మృత్యువు సంభవించదని భక్తుల నమ్మకం. పితృకార్యాలు, కుజదోష నివారణకు ఈ క్షేత్రం ప్రసిద్ధి. కుజదోషస్థులు లక్ష్మీసమేత నృసింహుడికి కల్యాణం జరిస్తారు.

నరసన్నకే పుష్కరిణి స్నానం

 ఇక్కడి కోనేరును ‘బ్రహ్మ పుష్కరిణి’,లేదా ‘వరాహతీర్థం’అంటారు. ఇతర క్షేత్రాలలో భక్తులు పుష్కరిణిలో స్నానం చేయడం సాధారణం కాగా, ధర్మపురిలో ఆ అవకాశం, అనుమతి ఉండదు. ఇది కేవలం స్వామివారికి ఉద్దేశించినది కావడం ప్రత్యేకత. భక్తులు గోదావరిలోనే స్నానాలు ఆచరిస్తారు. బ్రహ్మ గుండం, యమ గుండం, వశిష్ఠ గుండం, సత్యవతి గుండం, శంఖతీర్థం, దేవతల మడుగు, గొల్లమడుగులాంటి గుండాలు ఉన్నాయని, దేవతలు నిత్యం ఇక్కడ నివసిస్తారని చెబుతారు. గోదావరి తీరంలో దత్తాత్రేయ ఆలయం దర్శనమిస్తుంది.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE