మార్చి 13 కదిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం

ఆంధప్రదేశ్‌లోని మరో మహిమాన్విత నారసింహ క్షేత్రం కదిరి. ‘ఖా’ అంటే విష్ణుపాదం, ‘అద్రి’ అంటే పర్వతం అని, విష్ణువు పాదంమోపిన ప్రాంతం కనుక ‘ఖాద్రి’ క్షేత్రమై, అనంతరం వాడుకలో కదిరిగా నామాంతరం చెందిందని చెబుతారు. హిరణ్య కశిపుని వధానంతరం నారసింహుడు ఆగ్రహావేశాలతో ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు పరమ భాగవతుడు ప్రహ్లాదుడు అంజలి ఘటించి ‘విధాతాదులే వెరపుచెందు నీ ఉగ్రరూపం ఉపశమింపుమా/త్రిలోకాలకు ప్రియంబైన నీ ప్రసన్నాకృతి ప్రసాదించుమా’ అని చేసిన విన్నపాన్ని మన్నించి ప్రసన్నుడయ్యాడు. ప్రేమాస్పదుడిగా దర్శనమిచ్చాడు. మరే నృసింహ క్షేత్రంలోనూ లేనివిధంగా ఇక్కడి స్వామివారు ప్రహ్లాద సమేతంగా దర్శనమిస్తారు. అలా ‘ప్రహ్లాద వరద నృసింహుడి’గా పూజలందుకుంటున్నారు. మరో ఐతిహ్యం ప్రకారం, భృగుతీర్థం వద్ద తపస్సు చేసుకుంటున్న భృగుమహర్షికి స్వామివారు తమ ఉనికిని చాటగా, ఆ మహర్షి వసంతరుతువులో ఆయన విగ్రహాన్ని వెలికి తీసి ప్రతిష్ఠించి ‘వసంతవల్లభులు’గా నామకరణం చేశారు. స్వామివారు హిరణ్యకశివుని తునాతునకలు చేసినట్లు అష్టబాహువులతో దర్శనమిస్తారు. చెన్నకేశవస్వామి ఇక్కడి క్షేత్రపాలకుడు. వసంతవల్లభుల మూలవిరాట్‌కు అభిషేకానంతరం విగ్రహం వక్షస్థలం నుంచి వచ్చే స్వేదజలాన్ని భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు.

ప్రహ్లాదుడు సహా దేవతలు శ్రీహరిని స్తుతించడం వల్ల దీనికి ‘స్తోతాద్రి’అని పేరు వచ్చింది. దీనినే కదిరి కొండ అంటారు. నారసింహుడు ఆగ్రహావేశాలతో ఆ ప్రాంతానికి వచ్చి అక్కడి క్రూర జంతువులను వేటాడంతో వేటరాయుడిగా ప్రసిద్ధులయ్యారని, అదే జన వ్యవహారంలో బేట్రాయుడిగా మారిందని చెబుతారు. ఖాద్రి నరసింహుడికి ‘కాటమరాయుడు’అని మరో పేరు. ‘కాటమ’ అంటే అడవి, ‘రాయుడు’ అంటే అధిపతి అని, అడవికి అధిపతి మృగరాజు (సింహం). సింహం శిరస్సుగా కలిగినందుకు ఈ స్వామికి ఈ పేరూ వచ్చిందని పెద్దలు విశ్లేషించారు. ‘ఖాద్రి’ (చండ్ర) చెట్టుమూలాల్లో స్వయంభూవుగా వెలిశాడు. వేదారణ్యమైన ఈ ప్రాంతంలో ఖదిరిచెట్లు ఎక్కువగా ఉన్నందున ఆ పేరు వచ్చిందట. ఇక్కడి స్వామివారి పుష్కరిణిని ‘భృగుతీర్థం’ అని వ్యవహరిస్తారు. ఇదికాకుండా, ఈ క్షేత్రం చుట్టుపక్కల వ్యాస, పాండవ, కుంతీ, ద్రౌపది తీర్థాలు ఉన్నాయి.

శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ప్రహ్లాద వరద• నరసింహాస్వామి ఆలయ నిర్మాణం మూడు దశలలో జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. బుక్కరాయలు పనుపు కుమారుడు కంపరాయలు. 1353వ సంవత్సరంలో మొదటి దశ నిర్మాణం పూర్తిచేయగా, 1386-1418 మధ్యకాలంలో హరిహర రాయలు రెండవ దశ, 1509-1529 మధ్య కాలంలో శ్రీకృష్ణదేవరాయలు మూడవ దశ పనులు చేసినట్లు చరిత్ర చెబుతోంది.

కదరి నరసింహుని బ్రహ్మోత్సవాలలో భాగంగా ‘బ్రహ్మగరుడ’ సేవ అత్యంత ప్రధానమైంది. బ్రహ్మ ‘తేరు’ ఉత్సవం నాడు ఈ క్షేత్రం కిక్కిరిసి పోతుంటుంది. రథోత్సవం సందర్భంగా పండ్లు, మిరియాలు వంటివి విసురుతారు. వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే సర్వరోగాల తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం.

– ఎ. రామచంద్ర రామానుజ

About Author

By editor

Twitter
YOUTUBE