మార్చి 18 హోలీ
దుర్గుణాలపై సద్గుణాలు విజయం సాధించిన సంతోష సమయాలలోనూ, జీవితం వర్ణభరితం కావాలన్న ఆకాంక్షతోనూ బంధుమిత్రులపై రంగులు చిలకరించడం హోలీ పండుగ ప్రత్యేకత. వర్ణ, వర్గ, లింగ భేదాల్లేకుండా పవిత్ర భావంతో ఈ పండుగ జరుపుకుంటారు. స్నేహ సౌభ్రాతృత్వాలను, ప్రేమానురాగాలను పెంచే పండుగ హోలీ.
హోలీని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. వసంత రుతువుకు ఆగమనంగా జరుపుకునే దీనినే వసంతోత్సవం, మదనోత్సవం అని కూడా అంటారు. దీనికి పురాణ ప్రాశస్త్యం ఉంది. హోలీ గురించి అనేక పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నప్పటికీ హోలిక (హిరణ్యకశిపుని సోదరి) దహనం, ‘కుమార సంభవం’ నేపథ్యాన్ని ప్రధానంగా చెబుతారు. దుష్టశిక్షణతో పాటు లోకరక్షణకు గుర్తుగా హోలీని జరుపుకుంటారు. మొదటిది ప్రత్యక్షంగా రాక్షసి సంహారం కాగా, రెండవది తారకాసుర సంహారానికి యోధుడి జననం (కుమారస్వామి) నేపథ్యంగా పురాణాలు పేర్కొంటున్నాయి.
దేశవ్యాప్తంగా ప్రచారంలో ఉన్న ప్రఖ్యాత గాథ ప్రకారం తారకాసుర సంహారానికి పార్వతీపరమేశ్వ రులకు పుత్రోదయం (కుమారస్వామి) కలగాలి. అందుకు పరమేశ్వరుడికి తపోభంగం కలిగి ప్రణయాభిముఖుడు కావాలి. ఆ క్రమంలో విధాత సూచన మేరకు మన్మథుడు అకాలంలో వసంత రుతువును సృష్టించి ఆయనపై పుష్పబాణ ప్రయోగం చేస్తాడు. మనసు చలించిన శివుడు, తపోభంగానికి ఆగ్రహించి త్రినేత్రంతో రతీపతిని భస్మం చేస్తాడు. రతీ విలాప, విన్నపాలకు క•రిగిన శంకరుడు ఆతనిని పునర్జీవితుడని చేస్తాడు. కానీ అశరీరంగా ఉంటూ రతీదేవికి మాత్రమే కనిపిస్తాడని మహేశ్వరుడు అనుగ్రహించాడు. ఈ ఉదంతం ఫాల్గుణ పౌర్ణమి నాడు జరిగింది కనుక ఆ రోజును ‘కామదహనో త్సవం’ అని అంటారు. తెలుగువారికి సంక్రాంతి లాంటిదే ఉత్తర భారతీయులకు హోలీ పండుగ. అక్కడ ప్రధాన ఆహారమైన గోధుమలు కోతకు వచ్చే సమయంలో కోలాహలమే హో హో కారం ‘హోలీ’ అని కొందరు అంటారు. ఫాల్గుణ పౌర్ణమి నాటి ఈ పండుగను వసంతోత్సవం, మదనోత్సవం, కాముడి పున్నమిగా ప్రాచీన గ్రంథాలు పేర్కొన్నాయి.
హోలికా దహనం
రఘువు అనే రాజు తన రాజ్యంలో హోలిక అనే శిశుహంతక రాక్షసిని సంహరించగా ప్రజలు ఆ సందర్భంగా జరుపుకున్న పండుగే ‘హోలీ’గా కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఆరోజున ఆ రాక్షసి బొమ్మను దహనం చేస్తారని ‘పురుషార్థ చింతామణి’ తెలుపుతోంది. కృతయుగం నాటి మరో కథ ప్రకారం, పసిపిల్లలను అపహరించే హోలిక అనే రాక్షసి (హిరణ్యకశిపుడి సోదరి) సాయంతో ప్రహ్లాదుడి హరిభక్తిని మాన్పించాలని అవసరమైతే కుమారుడిని అంతమొందించాలని హిరణ్యకశిపుడు భావిస్తాడు. రక్షణవస్త్రం (శాలువ లాంటిది) ధరించడంతో నిప్పు వలన ఎలాంటి ప్రమాదం వాటిల్లదనే వరం గల ఆమె ఒడిలో చితిలో కూర్చోవాలని కుమారుడిని ఆజ్ఞాపిస్తాడు. ప్రహ్లాదుడు శ్రీహరిని ప్రార్థిస్తూ తండ్రి ఆనతిని పాటించాడు. చితిమంటలు ఎగసిన వెంటనే అనూహ్యంగా రక్కసి కప్పుకున్న ‘రక్షణ వస్త్రం’ ఎగిరి ప్రహ్లాదుడిని కప్పడంతో ఆమె అగ్నికి ఆహుతి అవుతుంది. రాక్షసి పీడ వదలినందుకు సంతోషంతో ప్రజలు రంగునీళ్లు (వసంతాలు)లు చిమ్ముకుంటూ వేడుక జరుపుకున్నారట. హోలిక రక్కసి పేరు మీదే ‘హోలీ పేరు వచ్చిందని చెబుతారు. పండుగ ముందు రోజున హోలిక విగ్రహాన్ని దహనం చేస్తారు. కామదహనం తరువాత ఈ భస్మాన్ని పవిత్రంగా భావిస్తూ, నొసటన ధరిస్తారు.
శ్రీకృష్ణుడు పుట్టి పెరిగిన మధుర, బృందావనం, నందగావ్‌లలో ఈ వేడుకను పదహారు రోజులపాటు ఘనంగా జరుపుకుంటారు. స్త్రీలు రాధలుగా, పురుషులు గోపీలుగా మారి కవ్వింపు మాటలతో ఆటలాడతారు. మహిళలు (రాధలు) తమ వద్ద ఉన్న కర్రలతో కొడుతున్నట్లు నటిస్తే, పురుషులు (గోపీలు) వెంట తెచ్చుకున్న డాలుతో కాపాడుకుంటారు. వంగ దేశంలో ఈ పండుగ ‘డోలోత్సవం’గా ప్రసిద్ధి. డోల అంటే ఉయ్యాల. శ్రీకృష్ణుడికి ఈ ఉత్సవం నిర్వహించి, బొబ్బట్లు నివేదిస్తారు. ఈ పున్నమినాడు శ్రీకూర్మంక్షేత్రంలో డోలోత్సవం నిర్వహిస్తారు. దానినే ‘డోలాయాత్ర’ అనీ అంటారు. మహారాష్ట్ర, కర్ణాటక లలో పోలీలను (భక్ష్యాలు) హోలికాగ్నిలో వేస్తారు. మరాఠ, కన్నడ భాషలలో కొన్ని పదాలను ‘ప’ కారం బదులుగా ‘హ’ కారం ఉపయోగిస్తారు. అలా పోలీ హోలీగా మారిందని కొందరి భావన. పంజాబ్‌లో హిందువులు, సిక్కులు కలిసిపోయి హోలీ ఆడతారు.
ఆనందంతో పాటే ఆరోగ్యం
గతంలో హోలీ సందర్భంగా సంప్రదాయ బద్ధంగా వేపగింజలు, కుంకుమ, పసుపు తదితర ప్రకృతిసిద్ధ, ఆయుర్వేద పదార్థాలతో రంగులు తయారు చేసేవారు. కాలక్రమంలో రసాయనాల రంగుల కారణంగా అలెర్జీ, చర్మ వ్యాధులు, అంధత్వం, మూత్రపిండాల వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయంగా వస్తున్న పండుగలను జరుపుకుం టూనే నియమాలను పాటిస్తే ఆరోగ్యాన్ని, పర్యావర ణాన్ని కాపాడినవారమవుతాం. ఆ దిశలో సాగుదాం!
– ఎ. రామచంద్ర రామానుజ