ఈ ఎన్నికల్లో గోవాలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించింది. మొత్తం 40 స్థానాలున్న ఈ రాష్ట్రంలో 20 స్థానాల్లో గెలుపొంది భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ 11 ‌స్థానాలకు పరిమితమైంది. ఇక్కడ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ‌రెండు స్థానాల్లో విజయం సాధించడం విశేషం. మహారాష్ట్రవాది గోమంతక్‌ ‌పార్టీ (ఎంజీపీ) రెండు సీట్లలో, గోవా ఫార్వర్డ్ ‌పార్టీ ఒకచోట విజయం సాధించాయి. ఎంజీపీతో పాటు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల నుంచి భాజపాకు ఇప్పటికే మద్దతు లేఖలు అందడంతో ఆ పార్టీ మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.

ప్రస్తుత ఎన్నికల్లో గోవాలో మొత్తం 78.94% ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోగా, భాజపా 20 స్థానాల్లో గెలుపొంది 33.31% ఓట్లను పొందింది. కాంగ్రెస్‌కు 23.46% ఓట్లు పోల్‌ ‌కాగా 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎంజీపీ 7.6% ఓటు షేర్‌ ‌సాధించి రెండు సీట్లలో గెలుపొందింది. ఏఏపీ 6.67% ఓట్లు సంపాదించి రెండు సీట్లు కైవసం చేసుకుంది. ఇక తృణమూల్‌ ‌కాంగ్రెస్‌కు 5.21% ఓట్లు పోలయినప్పటికీ ఒక్క సీటు గెలుచుకోలేదు. గతంతో పోలిస్తే గోవా ఫార్వర్డ్ ‌పార్టీ దెబ్బతిన్నది. గతంలో ఆ పార్టీకి మూడు స్థానాలుండగా ఇప్పుడు రెండు కోల్పోయి కేవలం ఒక్క స్థానంలోనే గెలుపు సాధించింది. ఈ పార్టీ ఓటు షేర్‌ 1.84%. ఇక ఎన్‌సీపీ 1.14%; శివసేన 0.18%; రివల్యూషనరీ గోవన్స్ ‌పార్టీ, స్వతంత్రులు కలిసి 19.37% ఓట్లు సాధించారు. నోటాకు 1.12% ఓట్లు పడ్డాయి.

2017, ఫిబ్రవరిలో గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ, ఫార్వర్డ్ ‌పార్టీ, మహారాష్ట్ర గోమంతక్‌ ‌పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పుడు మనోహర్‌ ‌పారికర్‌ ‌గోవా ముఖ్య మంత్రి అయ్యారు. పారికర్‌ ‌మరణానంతరం ప్రమోద్‌ ‌సావంత్‌ ‌మార్చి 19, 2019న గోవా ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అమిత్‌ ‌పాలేకర్‌ను ప్రకటించగా, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌ముఖ్యమంత్రి అభ్యర్థిగా చర్చిల్‌ అలెమోవ్‌ను, కాంగ్రెస్‌ ‌దిగంబర్‌ ‌కామత్‌ను ప్రకటించాయి. భాజపా ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్‌ ‌సావంత్‌ ‌నేతృత్వంలో ఎన్నికల బరిలో దిగింది. ఆప్‌, ‌కాంగ్రెస్‌, ‌తృణమూల్‌ ‌పార్టీలు ఎన్నికల్లో ఎన్ని తాయిలాలు ప్రకటించినా ప్రజలు వాటిని తిరస్కరించారు. భాజపా 20 సీట్లు సాధించడంతో మెజారిటీకి కేవలం ఒక్కసీటు వెనుకబడింది. అయితే మహారాష్ట్ర గోమంతక్‌ ‌పార్టీ, ముగ్గురు స్వతంత్రులు మద్దతు ప్రకటించడంతో భాజపా అధికార పీఠం ఎక్కడం ఖాయమైంది.

1989 నుంచి గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే.. 1999లో జరిగిన ఎన్నికల్లో మాత్రమే కాంగ్రెస్‌ 21 ‌స్థానాల్లో గెలిచి, ఒక్క సీటు మెజారిటీని సాధించింది. మిగిలిన ఎన్నికల్లో ఎప్పుడూ హస్తం పార్టీకి ఇన్ని సీట్లు రాలేదు. 1989లో 20 సీట్లు సాధించింది. 1994లో 18; 2002, 2007 ఎన్నికల్లో 16 చొప్పున సీట్లు గెలుచుకుంది. 2012 ఎన్నికల్లో 9 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2017లో 17 సీట్లు సాధించి ఫరవాలేదని పించినా, 2022 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమై ఘోర ఓటమిని చవిచూసింది.

భారతీయ జనతా పార్టీ గోవా ఎన్నికల్లో తన ఉనికిని చాటడం 1994లో మొదలైంది. అప్పటి ఎన్నికల్లో కేవలం 4 సీట్లతో ప్రారంభమైన పార్టీ ప్రస్థానం.. 1999 ఎన్నికల నాటికి తన బలాన్ని 10 సీట్లకు, 2002 ఎన్నికల్లో 17 సీట్లకు పెంచుకోవడం ద్వారా రాష్ట్రంలో చాలా వేగంగా విస్తరించింది. అయితే 2007 ఎన్నికలు మాత్రం పార్టీ జోరుకు బ్రేక్‌ ‌వేసాయనే చెప్పాలి. ఆ ఎన్నికల్లో కేవలం 14 సీట్లలో గెలుపొందింది. అయితే 2012 ఎన్నికల్లో 21 స్థానాల్లో విజయం సాధించింది. 2017లో 13 సీట్లకే పరిమితమైనా మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేసింది.

గోవాలో అతి పురాతనమైనదిగా పరిగణించే మహారాష్ట్రవాది గోమంతక్‌ ‌పార్టీని 1989 నుంచి పరిశీలిస్తే.. ఆ పార్టీ ప్రయాణం అవరోహణ క్రమంలో సాగింది. 1989లో 18 స్థానాలతో కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చిన పార్టీ తర్వాత జరిగిన ఎన్నికల్లో 1994లో మాత్రమే 12 సీట్లను గెలుచుకుంది. ఆ తర్వాత ఇక ఎన్నడూ సింగిల్‌ ‌డిజిట్‌ ‌దాటలేదు. చివరకు 2017లో 3 స్థానాల్లో గెలుపొందింది. తాజాగా రెండు సీట్లను మాత్రమే గెలుచుకుంది.

ఇక ఎన్‌సీపీ, గోవా వికాస్‌ ‌పార్టీ, గోవా ఫార్వర్డ్ ‌పార్టీ, యునైటెడ్‌ ‌గోవన్స్ ‌డెమాక్రటిక్‌ ‌పార్టీ, గోవా రాజీవ్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ, సేవ్‌ ‌గోవా ఫ్రంట్‌ ‌పార్టీల ప్రభావం చాలా తక్కువనే చెప్పాలి. స్వతంత్రులు అన్ని ఎన్నికల్లో తమ ఉనికిని చాటుతూ వస్తున్నప్పటికి అత్యధికంగా 5 స్థానాల్లో గెలుపొందింది మాత్రం 2012లోనే. తాజా ఎన్నికల్లో ముగ్గురు ఎన్నికయ్యారు. వీరు భాజపాకు మద్దతు పలికారు.

ఇప్పటివరకు గోవాలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌లేదా భాజపా గెలుచుకున్న అత్యధిక సీట్లు 21. ఈ మ్యాజిక్‌ ‌నెంబర్‌ను ఇంతవరకు ఏ పార్టీ బ్రేక్‌ ‌చేయలేదు. 1999లో కాంగ్రెస్‌, 2012‌లో భాజపా ఈ ఫిగర్‌ను చేరుకున్నాయి. నిన్నటి ఎన్నికల్లో రాజకీయ పండితుల అంచనాలను తలక్రిందులు చేస్తూ భాజపా 20 స్థానాల్లో విజయం సాధించి మెజారిటీకి ఒక్క సీటు మాత్రమే వెనుక ఉండటం విశేషం. ఈ ఎన్నికల ద్వారా భాజపా వరుసగా మూడోసారి అధికారాన్ని అధిష్టించబోతున్నది. కాగా ఆమ్‌ ఆద్మీ పార్టీ (2); రివల్యూషనరీ గోవన్‌ ‌పార్టీ (1)లు ఈసారి తమ ఖాతాలను తెరవగా, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌కు ఇంకా ఆ అవకాశం దక్కలేదు. ఈ మూడు పార్టీలు చాలా నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌ ఓట్లను చీల్చడంతో ‘గ్రాండ్‌ ఓల్డ్’ ‌పార్టీ అవకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. కర్ణుడి చావుకు ఆరు కారణాలన్నట్టు.. ‘సెక్యులర్‌’ ‌పార్టీలుగా చెలామణి అవుతున్న ఈ పార్టీలు గ్రాండ్‌ ఓల్డ్ ‌పార్టీకి ‘అంపశయ్యను’ సిద్ధంచేశాయి. ఉత్తరాయణ పుణ్యకాలం కూడా కావడంతో ఆ పార్టీలోని అసమ్మతివాదులు మిగిలిన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసి చేతులు దులుపుకోక మానరు.

ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే గత ఎన్నికలతో పోలిస్తే.. ఓట్ల శాతంలో స్వల్ప పెరుగుదల మాత్రమే ఉండటం గమనార్హం. 2017 ఎన్నికల్లో 32.5% ఓట్లు సాధిస్తే, ఈసారి 33.3% అంటే 0.8% పెరుగుదల నమోదు చేసింది. ఇక ఐదేళ్ల క్రితం 28.5% ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ ఓట్లు ఈసారి 5% తగ్గి 23.5% మాత్రమే సాధించింది. ఈసారి అధికారం తమదేనన్న ధీమా కాంగ్రెస్‌లో వ్యక్తమైంది. ఇందుకనుగుణం గానే కాంగ్రెస్‌ ‌పెద్దల వ్యూహాలు కూడా కొనసాగాయి. తీరా ఎన్నికల్లో చతికిలపడటం ఆ పార్టీ ఉద్దండులకు ఎంతమాత్రం మింగుడు పడటంలేదు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడానికి కూడా అవకాశం లేదు. సహచర ‘సెక్యులరిస్టు’లే నిండా ముంచడంతో ‘మునకే’ సుఖమనుకునే పరిస్థితి ఆ పార్టీది! ఏదిఏమైనా మనోహర్‌ ‌పారికర్‌ ‌వేసిన పునాది భాజపాకు ఉపయోగపడింది.

– విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE