తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ మరోసారి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోగా ఉద్యోగాల భర్తీ ఊసే ఎత్తలేదు. వృద్ధులు, వితంతువులు, ఎటువంటి ఆసరా లేని నిరుపేదలు ఎంతగానో ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ల ప్రస్తావనే లేదు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకానికి ఒక్క పైసా ఇవ్వలేదు. అయితే సొంత స్థలం ఉన్నవాళ్లకు మాత్రం రూ. 3 లక్షలు ఇస్తామని తెలిపింది. కొత్తగా ఆకట్టుకునే ఎలాంటి పథకాలు లేకుండా సాదాసీదా బడ్జెట్‌ను రూపొందించారు. ఎన్నికల్లో ప్రభుత్వాన్ని గట్టెక్కిస్తున్న, ఇప్పటికే అమలవుతున్న రైతుబంధు, దళితబంధు వంటి పథకాలకు నిధులు సర్దుబాటు చేసేందుకే ప్రభుత్వం ఎక్కువ మొగ్గుచూపింది. బడ్జెట్ ప్రసంగంలో దాదాపు పది పేజీలు కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడానికే కేటాయించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రం నుంచి రూ. 60 వేల కోట్లు వస్తాయని అంచనా వేసుకుంది. మొత్తం రూ. 2.56 లక్షల కోట్లతో అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజే రసవత్తర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీలో టీఆర్‌ఎస్ తనదైన వ్యూహాలను అమలు చేసింది. ప్రధాన ప్రతిపక్షాలు లేకుండానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి అధికార పార్టీ మరోసారి తన ఆధిక్యతను ప్రదర్శించుకుంది. చివరకు తాను రూపొందించుకున్న బడ్జెట్‌కు ఏ ఆటంకం లేకుండా చూసుకుంది. అయితే, బడ్జెట్ ప్రసంగం సాగిన రోజు నెలకొన్న పరిణామాలు ఆసక్తిని, ఉద్రిక్తతను సంతరించుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి టీఆర్‌ఎస్ సర్కారులో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఈటల రాజేందర్ ఐదుసార్లు వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వైద్య, ఆరోగ్య శాఖా మంత్రిగా మండలిలోనూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనుభవం ఉంది. గత ఏడాది ఆయన బీజేపీలో చేరి హుజురాబాద్ ఉపఎన్నికలో గెలుపొందిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సమావేశాల్లోనే తొలిసారి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఐదుసార్లు వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టిన అనుభవం, బడ్జెట్‌లో ఉండే లోటు పాట్లు ఏంటో, అసలు కథ ఏంటో పూర్తిగా తెలిసిన ఈటల నోరు విప్పితే తమ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందేమోనన్న ఆలోచనతోనే బీజేపీ ఎమ్మెల్యేలను సమావేశాల నుంచి సస్పెండ్ చేశారని సోషల్ మీడియాలో చర్చ నడిచింది.
ఈనెల 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 15వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) నిర్ణయించింది. అయితే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావులను స్పీకర్ సస్పెండ్ చేశారు. బలవంతంగా వారిని బయటకు పంపించారు.
ఆ తర్వాత మంత్రి హరీష్‌రావు పూర్తిస్థాయి బడ్జెట్ పాఠాన్ని చదివి వినిపించారు.
బీజేపీ నుంచి ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అధికార పార్టీకి వందకు పైగా సభ్యులున్నారు. కానీ, టీఆర్‌ఎస్ వెన్నులో వణుకు పుట్టిన పరిస్థితి కనిపించింది. అందుకే బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ వాదన లేకుండా చేసింది. టీఆర్‌ఎస్ పార్టీ ఏ స్థాయిలో అసహనానికి గురవుతుందో ఈ పరిణామంతో ప్రస్ఫుటంగా కనిపించింది. బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన కొద్దిసేపటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బడ్జెట్ ప్రసంగాన్ని బైకాట్ చేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు నిర్వహించడంపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సభలో నిలబడి నిరసన వ్యక్తంచేశారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని ఆరోపిస్తూ సభలో పాయింట్ ఆర్డర్ లేవనెత్తారు. ఇందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అనుమతించకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో, అధికార టీఆర్‌ఎస్ సభ్యుల మధ్యే అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం సాగింది.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం!
చట్ట సభల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సిన తీరు, అనుసరించాల్సిన సంప్రదాయాన్ని టీఆర్‌ఎస్ పక్కనబెట్టింది. ఏ అసెంబ్లీలో అయినా, చివరకు పార్లమెంటులో కూడా వార్షిక బడ్జెట్ సమావేశాల విషయంలో ఓ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అసెంబ్లీల్లో అయితే గవర్నర్, పార్లమెంటులో అయితే రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజే ఏపీలోనూ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో సభ ప్రారంభమయింది. కానీ, తెలంగాణలో మాత్రం గవర్నర్ తమిళిసై ప్రసంగం లేకుండానే ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు మొదలుపెట్టింది. పైగా తొలిరోజే బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ పరిణామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం నాలుగైదు రోజుల ముందే తెలిసినా, బడ్జెట్ సమావేశాలకు ముందురోజు రాజ్‌భవన్ నుంచి ఓ ప్రకటన విడుదలయింది. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని గవర్నర్ తమిళిసై తప్పుబట్టారు. ‘కొత్త సెషన్ కానందున గవర్నర్ ప్రసంగం అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. సాంకేతిక అంశాల వల్ల నా ప్రసంగాన్ని ప్రభుత్వం రద్దుచేసింది. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభమవుతాయని ప్రభుత్వమే మొదట చెప్పింది. ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టేందుకు నా సిఫార్సు కూడా కోరింది. ఇప్పుడేమో గవర్నర్ ప్రసంగం లేదంటున్నారు. అయినా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టేందుకు నేను సిఫార్సు చేశాను. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నాను. గవర్నర్ ప్రసంగం లేకపోవడం వల్ల శాసనసభ్యుల హక్కులకు విఘాతం ఏర్పడుతుంది. గతేడాది ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని కోల్పోతున్నారు’ అని ఈ ప్రకటనలో తెలిపారు గవర్నర్. అంతేకాదు, మరుసటిరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే సమయంలోనే గవర్నర్ సర్కారుకు ఓ రకంగా షాకిచ్చారు.
ఆ సమయంలో రాజ్‌భవన్‌లో అందుబాటులో లేకుండా షెడ్యూల్ రూపొందించుకున్నారు. యాదాద్రి పర్యటనకు వెళ్లారు. అసెంబ్లీ సమావేశాలు మొదలైన సమయంలోనే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజలందరికీ లబ్ధి చేకూర్చేలా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు. ఇక, అదే రోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు గవర్నర్. మహిళలు అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్నా.. ఇప్పటికీ వివక్షకు గురవుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావడం బాధాకరమని అన్నారు. మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదని, అత్యున్నత పదవిలో ఉన్న మహిళలకూ అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని పరోక్షంగా తన బడ్జెట్ ప్రసంగం గురించి ప్రస్తావించారు.
బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అంశం అగ్గిరాజేసింది. ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర నిరసన తెలిపిన బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రధాన గేటు లోపల బైఠాయించారు. తెలంగాణలో నిర్భంద పాలన నశించాలంటూ నినాదాలు చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘ప్రజా సంక్షేమ విధాన పత్రమే గవర్నర్ ప్రసంగం. దీని మీద చర్చించడం ఎమ్మెల్యేగా మా హక్కు. కానీ కేసీఆర్ 40 సంవత్సరాలుగా వస్తున్న విధానాన్ని తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారు.’ అని వ్యాఖ్యానించారు. ఈటల బీజేపీ శాసనసభ్యుడిగా సభలో తొలిసారిగా అడుగుపెట్టారు. ఆయన మొహం చూడటం ఇష్టంలేకనో, అసెంబ్లీలో ఈటల ఉనికిని భరించలేకనో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వ్యూహం పన్ని ఉంటారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
ఈ వ్యవహారంలోనూ రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు నడిచాయి. బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి సస్పెండ్ కావాలనే లక్ష్యంతోనే సభకు వచ్చారని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. అసలు వెల్‌లోకి ఏ పార్టీ సభ్యుడు వచ్చినా సస్పెన్షన్ వేటు తప్పదని గత సమావేశాల సందర్భంగానే అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు చెప్పామని తెలిపారు. వెల్‌లోకి వెళితే ఎలాగూ తమను సస్పెండ్ చేస్తారనే ఉద్దేశంతో బీజేపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారని తెలిపారు.
దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. అధికార టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి బీజేపీ ఎమ్మెల్యేలను ప్రణాళిక ప్రకారం సస్పెండ్ చేసిందని ఆరోపించారు. సభ ప్రారంభమైన రెండు నిమిషాలకే బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడమంటే.. అది టీఆర్‌ఎస్ పన్నిన కుట్ర కాదా? అని ప్రశ్నించారు.
– సుజాత గోపగోని, 6302164068, సీనియర్ జర్నలిస్ట్