ఆవు.. అందరూ పిలిచే మాట. గోవు.. ఆవు గొప్పదనం తెలిసినవాళ్లు పిలిచే పిలుపు. గోమాత.. భూమ్మీద నడయాడే దేవతగా గుర్తించినవాళ్లు భక్తితో పిలిచే పిలుపు. ప్రధానంగా హిందువులకు గోమాత దేవత. దేవుళ్లతో సమానంగా గోవును పూజిస్తారు. అత్యంత పవిత్రంగా భావించే ఇలాంటి గోమాతకు ఇప్పుడు రక్షణ లేకుండా పోయింది. నిత్యం యథేచ్ఛగా కబేలాలకు తరలిస్తున్నారు. అయినా.. ప్రభుత్వం, పోలీసులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. దీంతో గోమాత ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. గో సంపద నానాటికీ కనుమరుగవుతుండటం, గోమాంసం కోసం, ఇతర అవసరాల కోసం కొన్ని వర్గాలవాళ్లు గోవుల వధకు పాల్పడుతుండటంతో ఈ పరిణామాలు తలెత్తుతున్నాయి. నిత్యం ఎక్కడో ఓచోట గోవులను అక్రమంగా తరలించడం, గో సంరక్షకుల చేతికి చిక్కడం, విషయం పోలీస్‌స్టేషన్‌కు చేరడం వంటి సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. గోవధకు అడ్డుకట్ట వేసేందుకే ప్రత్యేకంగా కొన్ని హిందూసంఘాలు కంకణం కట్టుకొని పహారా కాస్తున్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇలా, రహస్యంగా గోవులను వధశాలలకు తరలించే వ్యక్తులు తరచూ పట్టుబడుతూనే ఉన్నారు. గోవులను రక్షించే బృందాలు పదులసంఖ్యలో సంరక్షిస్తూనే ఉన్నాయి. గో సంరక్షకులు స్వయంగా ఫిర్యాదు చేస్తే గానీ పోలీసులు రంగంలోకి దిగక పోవడం, అప్పటికప్పుడు ఏవో కేసులు పెట్టి చేతులు దులుపుకోవడం మినహా కఠినంగా వ్యవహరించక పోవడం, ఇలాంటి దందాను సమూలంగా నిర్మూలిం చేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించక పోవడం, చర్యలు తీసుకోకపోవడం కారణంగా గోసంరక్షకులే ఈ అక్రమదందాను అరికట్టే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో గోసంరక్షక బృందాలపై దాడులు కూడా సర్వసాధారణంగా మారుతున్నాయి. గోవుల అక్రమ రవాణాను అడ్డుకుంటున్న సందర్భంలో అక్రమ రవాణా దారులు.. గో సంరక్షకులపై దాడులకు, హత్యాయత్నా లకు కూడా పాల్పడుతున్నారు. ఆ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. గో సంరక్షకులకు అండగా ఉండే కొందరు ప్రజా ప్రతినిధులో, ప్రముఖులో జోక్యం చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే హైదరాబాద్ కర్మన్‌ఘాట్ ప్రాంతంలో ఫిబ్రవరి 22 రాత్రి నుంచి 23 ఉదయం వరకూ చోటుచేసుకున్న పరిణామాలు ఉలికిపాటుకు గురిచేశాయి. ఎప్పటిలాగే కొందరు అక్రమ రవాణాదారులు గోవులను సమీప జిల్లాల నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న గో సంరక్షక దళానికి చెందిన సభ్యులు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. అయినా, దురుసుగా ప్రవర్తించిన అక్రమ రవాణాదారులు వీళ్లను లెక్క చేయకుండా ముందుకు దూసుకెళ్లారు. దీంతో, ఓ వాహనంలో గో సంరక్షక సభ్యులు ఆ వాహనాన్ని వెంబడించారు. ఆ అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అడ్డుకున్న హిందూ సంఘాలపై ముష్కరులు దాడికి తెగబడ్డారు. ప్రముఖ కర్మన్ ఘాట్- ఆంజనేయస్వామి సన్నిధిలో హిందూ సంఘాల ప్రతినిధులపై భౌతికదాడులు చేసి, గాయపరిచారు. పైగా కత్తులతో దాడులు చేసి, భయోత్పాతం సృష్టించారు. గో సంరక్షక దళాల సభ్యులపై హత్యాయత్నానికి ఒడిగట్టారు. గో రక్షకులు వచ్చిన ఇన్నోవా వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
భవానీనగర్ ప్రాంతంలో బీఫ్ దుకాణం నడిపే కొందరు వ్యక్తులు నల్గొండ జిల్లాలోని మాల్ క్రాస్ రోడ్స్ నుంచి 2 గేదె దూడలను, 3 దూడలను కొనుగోలు చేసి, •• 07 •జు 5570 నెంబర్ బొలెరో వాహనంలో అక్రమంగా తీసుకొచ్చారు. మీర్‌పేట్ లోని గాయత్రీనగర్ సమీపంలోకి చేరుకోగానే.. కొందరు గో సంరక్షక దళ సభ్యులు అది గమనించి వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయినా ఆపకపోవడంతో, వెంబడించారు. ఇన్నోవా వాహనంలో వెంబడించిన గో సంరక్షక దళ సభ్యులు చివరకు బొలెరోను ఆపారు. ఆ సమయంలో అక్రమ రవాణాదారులకు, గో సంరక్షక దళ సభ్యులకు మధ్య ఘర్షణ జరిగింది. వాళ్లు కత్తులు, ఇతర మారణాయుధాలతో వెంబడించడంతో గో సంరక్షక దళ సభ్యులు సమీపంలోని కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయంలోకి పారిపోయి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈ లోపే గోవుల అక్రమ రవాణా దారులకు మరికొందరు తోడయ్యారు. ఆలయంలోకి దూసుకెళ్లి పలువురిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో, కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎలాగోలా అక్కడినుంచి తప్పించుకున్న వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోగా సమాచారం తెలుసుకున్న భజరంగ్‌దళ్, గో రక్షక్ కార్యకర్తలు అక్కడికి చేరుకొని తీవ్రంగా గాయపడ్డ వాళ్లను ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘర్షణల గురించి తెలుసుకున్న స్థానిక ప్రజలతో పాటు.. హిందూ సంఘాల నేతలు, బీజేపీ నాయకులు పెద్దఎత్తున కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం పరిసరాల్లోకి చేరుకున్నారు. దీంతో, అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసు కున్నాయి. రాత్రి ఆ ప్రాంతమంతా గంభీరంగా మారిపోయింది. వందల సంఖ్యలో హిందూ సంఘాల నేతలు, కార్యకర్తలు, భారీగా మోహరించిన పోలీసులతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హనుమాన్ దేవాలయంలోకి ఇతర మతస్తులు ప్రవేశించడాన్ని నిరసిస్తూ భారీ సంఖ్యలో హిందూ కార్యకర్తలు గుమిగూడి తమ విశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీశారని నినాదాలు చేస్తూ ధర్ణాకు దిగారు. ప్రధాన రహదారిపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచి పోయింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిరసన తెలియజేస్తున్న హిందు సంఘాల ప్రతినిధు లను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో పలువురు గాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో పలువురు భజరంగ్‌దళ్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు గోవుల అక్రమరవాణా చేస్తున్న వారిపైన, హిందూసంఘాల కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డ ఏడుగురిపైనా కేసులు నమోదుచేశారు. నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపి చెర్లపల్లి జైలులో ఉంచారు. స్వాధీనం చేసుకున్న 5 దూడలను అబ్దుల్లాపూర్‌మెట్‌లోని యుగ తులసి ఫౌండేషన్ గోశాలకి అప్పగించారు. ఈ సంఘటనలో రెండు వాహనాలు, మొబైల్ ఫోన్లు, ఆరు ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, బొలెరో వాహనం డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో గో సంరక్షక దళ సభ్యులపైన కూడా పోలీసులు మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేసారు.
అయితే, సంఘటన జరిగిన రోజు రాత్రి పోలీసులు అసలు స్పందించలేదని, పైగా.. గో రక్షకులు, భజరంగ్‌దళ్ కార్యకర్తలపైనే లాఠీచార్జీ చేశారంటూ మరుసటిరోజు ఉదయం హిందూ సంఘాల నేతలు భారీ సంఖ్యలో కర్మన్‌ఘాట్ బాట పట్టారు. దీంతో, మరుసటిరోజంతా కర్మన్‌ఘాట్ హనుమాన్ మందిరం పరిసరాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ స్వయంగా హనుమాన్ ఆలయం దగ్గరికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు.
మరోవైపు ఈ వ్యవహారంపై పోలీసులు అప్రమత్త మయ్యారు. ఇంచార్జ్ డీజీపీ అంజనీ కుమార్.. ఇతర పోలీసు ఉన్నతాధికారులతో సమా వేశమై పరిస్థితిని సమీక్షించారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలకు పాల్పడితే ఊరుకోవొద్దని సూచించారు. దీంతో, హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. సోషల్ మీడియా పోస్టింగులపై నిఘా పెట్టారు. రెచ్చగొట్టే పోస్టులు, వీడియోలు, కామెంట్లను పెట్టే వాళ్లను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. దీనికి సంబంధించి ఐటీ సెల్, ఇంటెలిజెన్స్ బృందాలతో సోషల్ మీడియాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల పైనా నిఘా పెట్టారు. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్‌లు, కామెంట్ల డేటాను తీస్తున్నారు. పాతబస్తీతో పాటు.. గ్రేటర్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో రాత్రి పూట పెట్రోలింగ్ పెంచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.
మరోవైపు.. గోరక్షక్ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాజధాని సాక్షిగా తల్వార్లతో రొహింగ్యాలు దాడులు చేస్తుంటే ప్రభుత్వం వేడుక చూస్తోందని విమర్శిం చారు. ఇష్టారీతిన కబేలాలకు తరలిస్తున్న గోవుల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అన్ని మతాలకు చెందిన వాళ్లు ఉండే హైదరాబాద్‌లో ఇలాంటి సంఘటనలు తరచూ చోటు చేసుకోవడంపై విశ్లేషకులు, ప్రధానంగా హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గోవుల వధను పూర్తిగా అరికట్టేలా అవసరమైన చర్యలు తీసు కోవాలని కోరుతున్నాయి. గోసంరక్షణ విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపిస్తున్నాయి. ఇలాంటి సున్నితమైన అంశాలపై ఇకనైనా ప్రభుత్వం, పోలీ సులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
– సుజాత గోపగోని, 6302164068, సీనియర్ జర్నలిస్ట్