జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌ప్రచ్ఛన్నయుద్ధం మరొకసారి పంజా విసిరింది. అనుకోనిది జరిగితే ‘ఆశ్చర్యం’ కలగడం సహజం. అనుకున్నదే జరిగింది. కొంతకాలంగా ప్రపంచం యావత్తూ  భయపడుతున్నట్టే రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్‌ ‌పుతిన్‌ ‌ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై ‘యుద్ధా’న్ని ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రతికూల పరిణామాలకు దారితీసే అవాంఛనీయ సంఘటన ఇది! పాత సోవియెట్‌ ‌రష్యాకు పునర్‌ ‌వైభవం తేవాలని పుతిన్‌ ‌కలగంటున్నారనీ, నాటోను విస్తరించే పనిలో అమెరికా ఉందనీ బలమైన వాదనే ఇప్పుడు ప్రపంచమంతటా వినిపిస్తున్నది. రష్యా వంటి ప్రబలశక్తి దాడి చేస్తే ఉక్రెయిన్‌ ‌వంటి దేశానికి చిరకాలం ఎదిరించే త్రాణ ఉండదు. అయినా నిలువరించే ప్రయత్నం అనివార్యం. ఇప్పుడు ఉక్రెయిన్‌లో జరుగుతున్నది అదే. రష్యా సైన్యాలు ఉక్రెయిన్‌ ‌రాజధాని కీవిలోకి ప్రవేశించాయి. పెద్దగా కాలయాపన చేయకుండానే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ బెలారస్‌లో చర్చలకు సిద్ధపడ్డారు. చర్చలు ప్రారంభమయ్యేదాకా కాల్పులు ఆగవని పుతిన్‌ ‌ప్రకటిస్తే, ప్రజలకు ఆయుధాలు ఇస్తామని జెలెన్‌స్కీ ప్రకటించడం విశేషం. జెలెన్‌స్కీని భయపెట్టడానికీ లేదా కాలరాయడానికీ పుతిన్‌ ‌సిద్ధపడుతున్న సూచనలూ కనిపిస్తున్నాయి. ఒక పక్క చర్చలకు సిద్ధమని ప్రకటించి, అణ్వాయుధాల ప్రయోగానికి సిద్ధం కావలసిందని తన సైన్యానికి పుతిన్‌ ఆదేశాలు ఇచ్చారు. యుద్ధం అనివార్యమని మానసికంగా సిద్ధమైన ప్రపంచ దేశాలు, తమ అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా దీనిపై స్పందించాయి. నిజానికి ఏ దేశమూ తమ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసే యుద్ధానికి కాలు దువ్వడానికి ఇష్టపడదు. ఎంత బలమైన కూటమిగా ఉన్నా నాటో దేశాలు ఇందుకు భిన్నం కావు. ఇవి ఎంతసేపూ తమ రక్షణపైనే ప్రధానంగా దృష్టిపెడతాయి తప్ప మరో దేశం కోసం యుద్ధానికి దిగవు. ఇది పుతిన్‌కు తెలియనిది కాదు. అందుకనే పక్కా ప్రణాళికతో వ్యూహాత్మకంగా ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగారు.


అమెరికా ఆర్థిక ఆంక్షలు విధిస్తుందన్న సంగతి తెలిసే అన్నీ సమకూర్చు కొని, అన్నింటికీ సిద్ధమై పుతిన్‌ ఉ‌క్రెయిన్‌ ఆ‌క్రమణకు ఉపక్రమించారు. 2004లో చైనాతో 117 బిలియన్‌ ‌యు.ఎస్‌. ‌డాలర్ల విలువైన ఇంధన సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకున్న నేపథ్యంలో ఇప్పుడు పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించినా రష్యా పెద్దగా ఇబ్బందుల్లో పడదు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య చెల్లింపుల్లో అనుసరిస్తున్న ‘స్విఫ్ట్ ‌చెల్లింపుల వ్యవస్థ’ నుంచి రష్యాను వెలివేసే చర్యకు యుఎస్‌ ‌నేతృత్వంలోని పశ్చిమదేశాలు ఉపక్రమించే ప్రమాదాన్ని ముందే గుర్తించిన రష్యా ఇందుకు ప్రత్యామ్నాయంగా ‘‘సిస్టమ్‌ ‌ఫర్‌ ‌ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ‌ఫైనాన్షియల్‌ ‌మెసేజ్‌ (ఎస్‌పీఎఫ్‌)’’ ‌వ్యవస్థను అభివృద్ధి చేసింది. మరో విషయమేమంటే దాదాపు 25 సంవత్సరాలుగా పుతిన్‌ ‌పక్కా ప్రణాళికతో రష్యాకు పూర్వవైభవ సాధనకు అడుగులు ముందుకేస్తూ వస్తున్నారు. పశ్చిమ దేశాలతో సంఘర్షిస్తూనే ఆసియా దేశాలతో సంబంధాలను పటిష్టం చేసుకున్నారు. ఆయన హయాంలోనే రష్యా ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎంతో పురోభివృద్ధి సాధించి, పూర్వవైభవం దిశగా సాగుతోంది. పరిస్థితి ఇదేమాదిరి కొనసాగితే, రష్యా బలీయ దేశంగా అంతర్జాతీయ యవనికపై నిలిచి, నాటి సోవియట్‌ ‌యూనియన్‌ ‌ప్రాభవాన్ని పొందాలన్న పుతిన్‌ ‌చిరకాల వాంఛకు ప్రతీకగా నిలిచిపోవడం ఖాయం.

ఉక్రెయిన్‌ ఒం‌టరిపోరు

 అమెరికా హెచ్చరికలన్నీ ‘‘ఉత్తిత్తివే’’నని తేలిపోతున్నది. ఒకవైపు రష్యా అప్రతిహతంగా తన ఆక్రమణను కొనసాగిస్తుంటే, అమెరికా, నాటో దళాలు ముందుకు రాకపోవడంతో ఉక్రెయిన్‌ ఏకాకిగా మిగిలిపోయింది. మొదట్నుంచీ ఉక్రెయిన్‌కు మద్దతుగా రష్యాకు తీవ్ర హెచ్చరికలు జారీచేస్తూ వస్తున్న అమెరికా తాజా వైఖరివల్ల ఉక్రెయిన్‌ ‌నిండా మునిగింది. నగరాలకు నగరాలు రష్యా సేనలతో నిండిపోతున్నా, రాజధానికి చేరువగా అవి వచ్చినా కూడా అమెరికా ఒక్క సైనికుడిని దించలేదు. చాలా వేగంగా రష్యా తన ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తుండటంతో ఉక్రెయిన్‌, ‌రష్యా ఆధీనం లోకి వెళ్లడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవు తున్నది. యూరప్‌ ‌దేశాలు, నార్త్ అట్లాంటిక్‌ ‌ట్రీటీ ఆర్గనైజేషన్‌ (‌నాటో) దేశాలు ఆర్థికపరమైన సమస్యల్లో ఉన్న నేపథ్యంలో రష్యాతో యుద్ధానికి దిగి మరిన్ని కష్టాలను కొనితెచ్చుకునే పరిస్థితిలో లేవని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక అమెరికా విషయానికి వస్తే అఫ్ఘానిస్తాన్‌లో ఒకసారి పరువు పోగొట్టుకున్న అమెరికా ఇప్పుడు ఉక్రెయిన్‌ ‌విషయంలో తన అసమర్థతను చాటుకుంది. రష్యా లాంటి బాహుబలి దేశాన్ని ఎదిరించడం ఉక్రెయిన్‌ ‌వల్ల అయ్యేపని కాదు. అమెరికా, నాటో దేశాలు, ఐరోపా సమాఖ్య దేశాలు ఉమ్మడిగా ఉక్రెయిన్‌కు మద్దతుగా వచ్చినట్లయితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేది. నిజానికి ఈ భయంతోనే ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ ‌మార్కెట్లు ఫిబ్రవరి 24న తీవ్ర నష్టాలను చవిచూశాయి. కానీ జరుగుతున్న పరిణామాలు ఊహించిన వాటికి భిన్నంగా ఉంటున్నాయి. మహాద్భుతం జరిగితే తప్ప రష్యా అప్రతిహతకు ఎదురులేని స్థితి ప్రస్తుతం కొనసాగుతోంది.

రష్యా దాడికి కారణాలు

అమెరికా, నాటో దేశాలతో తన సంబంధాలు ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయని భావించిన రష్యా యూరప్‌లో ఆ కూటమి సైనిక కార్యకలా పాలపై పరిమితులు విధించాలని, తూర్పు యూరప్‌లోకి నాటో విస్తరణపై నిషేధం విధించాలని, ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వకూడదన్న షరతుతో చర్చలకు ముందుకు వచ్చింది. అయితే ఐరోపా సమాఖ్య దేశాలతో చర్చలు జరపడం వల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదన్న భావనతో యుఎస్‌తోనే నేరుగా చర్చలు జరుపుతామని రష్యా ప్రతిపాదించగా యూరప్‌ ‌దేశాల భాగస్వామ్యం లేకుండా చర్చలు జరపడం సాధ్యంకాదని అమెరికా తెగేసి చెప్పింది. అంతేకాకుండా ఉక్రెయిన్‌లో చొరబాటుకు పాల్పడితే భయంకర మూల్యం చెల్లించక తప్పదని కూడా రష్యాను హెచ్చరించింది. 2004లో బాల్టిక్‌ ‌దేశాలు లాత్వియా, లిథుయేనియా, ఇస్తోనియాలు నాటో సభ్యత్వాన్ని తీసుకోగా, 2008లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ ‌బుష్‌, ‌రష్యా సరిహద్దు దేశాలు జార్జియా, ఉక్రెయిన్‌లకు నాటో సభ్యత్వం ఇవ్వడానికి మద్దతు పలికారు. ఒకపక్క ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వాలన్న అంశంపై భిన్నాభిప్రాయాలు కొనసాగుతుండగానే మరోపక్క యుఎస్‌-ఉ‌క్రెయిన్‌ ‌మధ్య పెరుగుతున్న సైనిక సహకారం రష్యా ఆందోళనకు కారణమైంది. ఉక్రెయిన్‌ ‌సైన్యాలకు యుఎస్‌ ‌సైనికులు తర్ఫీదునివ్వడం, సైనికుల ఉమ్మడి విన్యాసాలు రష్యాలో క్రమంగా భయాందోళనలను పెంచాయి. దీనికితోడు ఫిబ్రవరి 14న బ్రసెల్స్‌లో జరిగిన నాటో దేశాల సదస్సు సందర్భంగా యుఎస్‌ ఒక ప్రకటనలో ‘‘నాటో సభ్యత్వంతో సహా, తన విదేశాంగ విధానాన్ని స్వతంత్రంగా, బయటివారి జోక్యం లేకుండా రూపొందించుకునే హక్కు ఉక్రెయిన్‌కు ఉంది’’ అని స్పష్టం చేసింది. జెనీవాలో పుతిన్‌-‌జో బైడెన్‌ ‌సమావేశం జరగడానికి కొద్దిరోజుల ముందు ఈ ప్రకటన విడుదల కావడం గమనార్హం.

ఉక్రెయిన్‌పై దాడికి దిగాలన్న ఉద్దేశం తనకు లేదని చెబుతూ ప్యారిస్‌, ‌బెర్లిన్‌ ‌నగరాల్లో రష్యా-నాటో కౌన్సిల్‌తో, యూరప్‌లో భద్రత-సహకార శాశ్వత మండలితో రష్యా రెండు దఫాలు చర్చలు జరిపింది. ‘ప్రచ్ఛన్న యుద్ధానంతరం ఏర్పడిన పెను సంక్షోభం’’ అంటూ జో బైడెన్‌ అభివర్ణించడంతో జర్మనీ, ఫ్రాన్స్‌లు దౌత్యపరమైన ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ముఖ్యంగా తమ ఇంధన అవసరాల కోసం రష్యాపై, భద్రతా అంశాలపై యుఎస్‌పై ఆధార పడుతున్న జర్మనీ, ఫ్రాన్స్‌లు దౌత్యపరమైన చర్చల మార్గాన్నే ఆశ్రయించాయి. ఈ విధంగా ఒకపక్క ప్రతిష్టంభన కొనసాగుతుండగానే యుఎస్‌, ‌నాటో దేశాలు తూర్పు యూరప్‌కు మూడువేల సైనికులను, యుద్ధనౌకలను తరలించడమే కాకుండా ఉక్రెయిన్‌లోని తమ పౌరులను స్వదేశాలకు తిరిగి రప్పించడానికి ఉపక్రమించాయి. ఇదే సమయంలో జో బైడెన్‌ ‌రష్యాపై పెద్దఎత్తున ఆర్థిక ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తూనే, రష్యా-జర్మనీల మధ్య నిర్మించిన నార్డ్ ‌స్ట్రీమ్‌ ‌పైప్‌లైన్‌-2‌ను నిలిపేస్తామని కూడా బెదిరింపులకు పాల్పడటంతో అంతర్జాతీయ స్టాక్‌ ‌మార్కెట్లలో భయాందోళనలు చోటుచేసుకొని ఒక్కసారిగా కుప్పకూలాయి. దీనికి తోడు అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్‌ ‌బ్యారెల్‌ ‌ధర 2014 తర్వాత మొదటిసారి వంద డాలర్లకు ఎగబాకింది.

కాగా రష్యా అధ్యక్షులు పుతిన్‌ ఉ‌క్రెయిన్‌లోని లుహాన్స్ ‌పీపుల్స్ ‌రిపబ్లిక్‌, ‌డొనెట్స్‌క్‌ ‌పీపుల్స్ ‌రిపబ్లిక్‌లకు స్వాతంత్య్రం ప్రకటించే డిక్రీపై ఫిబ్రవరి 21న సంతకం చేశారు. ఆ విధంగా ఆయన ఉక్రెయిన్‌ను మూడు ముక్కలు చేశారు. దీంతో ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశానికి యుఎస్‌ ‌పిలుపునిచ్చింది. అచ్చం క్రిమియాను ఆక్రమించి నప్పటి మాదిరిగానే రష్యా, ఉక్రెయిన్‌ ఆ‌క్రమణ విషయంలో కూడా వ్యవహరిస్తుండటంతో రష్యాకు వ్యతిరేకంగా యుఎస్‌ ‌తన ప్రచార యుద్ధాన్ని ఒక్కసారిగా ముమ్మరం చేయడం ప్రచ్ఛన్నయుద్ధం కాలం ఇంకా ముగిసిపోలేదన్న అభిప్రాయాన్ని కలిగిస్తోంది. ఏది ఏమైనప్పటికీ పశ్చిమ దేశాల వల్ల ప్రమాదం తన సరిహద్దులకు విస్తరించడం పుతిన్‌కు ఎంతమాత్రం ఇష్టంలేదు. ఈ నేపథ్యంలో తనదేశ సరిహద్దులో ‘తటస్థ జోన్‌’‌లను ఏర్పాటు చేసేందుకు పుతిన్‌ ఈ ‌చర్య తీసుకున్నారని భావించాలి. పుతిన్‌ ఈ ‌నిర్ణయం తీసుకున్న దగ్గరినుంచే సమస్య మరింత తీవ్రస్థాయికి చేరుకుంది. ఉక్రెయిన్‌లోకి తమ సైన్యాలను ‘‘శాంతి పరిరక్షక మిషన్‌’’ ‌కింద మాత్రమే పంపినట్టు రష్యా చెబుతోంది. రష్యా ఇంతటి తీవ్రస్థాయి చర్యలకు దిగడానికి ప్రధాన కారణం అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాల వైఖరి మాత్రమే. ముందుగా తూర్పు యూరప్‌కు చెందిన లిథియేనియా, లాత్వియా, ఎస్తోనియాల్లో ఉన్న తమ సైనిక దళాలను వెనక్కు తీసుకోవాలని రష్యా డిమాండ్‌ ‌చేస్తోంది. అదేవిధంగా రొమేనియాలో నాటో దేశాలు ఏర్పాటుచేసిన క్షిపణీ రక్షణ వ్యవస్థను కూడా తొలగించాలని పుతిన్‌ ‌కోరుతున్నారు. వీటికి అమెరికా అంగీకరించలేదు. మొత్తంమీద అమెరికా ప్రకటనలకే పరిమితమైతే, రష్యా ఆచరణాత్మకంగా ముందుకు వెళుతోంది.

భారత్‌కు తలనొప్పులు

రష్యా-అమెరికాల మధ్య పెరుగుతున్న విభేదాలు భారత్‌ అనుసరిస్తున్న దౌత్యనీతికి పెనుసవాలు విసురుతున్నాయి. ఎవరికీ మద్దతు తెలపకుండా తటస్థంగా సమాన దూరాన్ని పాటించే విదేశాంగ విధానాన్ని భారత్‌ అనుసరిస్తోంది. ఇందుకనుగుణంగానే జనవరి 31న ఉక్రెయిన్‌పై జరిగిన ఓటింగ్‌లో పాల్గొనలేదు. అంతేకాకుండా ‘మిన్‌స్క్ ‌ప్యాకేజీ’కి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయా దేశాల దౌత్యవేత్తలకు సూచించింది. అంతేకాకుండా ఇటీవల మెల్‌బోర్న్‌లో జరిగిన క్వాడ్‌ ‌సమావేశంలో ఉక్రెయిన్‌ ‌ప్రస్తావన రాకుండా జాగ్రత్త వహించారు. అయితే ‘ఉక్రెయిన్‌ ‌విషయంలో రష్యా దూకుడుగా వ్యవహరిస్తోంద’ని చేసిన బ్లింకెన్‌ ‌ప్రస్తావనకు జపాన్‌, ఆ‌స్ట్రేలియాలు మద్దతు పలకగా, భారత్‌ ‌మాత్రం దౌత్యమార్గాన్ని సమర్థిస్తూ ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతం, చైనా దూకుడు పై దృష్టి కేంద్రీకరించాలని గట్టిగా నొక్కి చెప్పింది. క్వాడ్‌ ‌సమావేశంలో ఉక్రెయిన్‌ ‌సమస్యను మినహాయించ డానికి భారత్‌ ‌వైఖరే ప్రధాన కారణమంటూ వచ్చిన ఊహాగానాలకు విదేశాంగ శాఖ ‘‘ఉక్రెయిన్‌ ‌సమస్యపై భారత్‌-‌యుఎస్‌లు నిజాయితీగా చర్చించాయి’’ అని వివరణ ఇచ్చింది. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తించాలి. ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి తిరుమూర్తి చేసిన ‘మిన్‌స్క్ ‌ప్యాకేజీ’ ప్రస్తావన, భారత్‌… ‌రష్యా అనుకూల వైఖరి అవలంబిస్తున్నదన్న అభిప్రాయానికి ఆయా దేశాలు రావడానికి కారణమైంది. దీంతో ‘‘ఉంటే మాకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉండండి’’ అంటూ మ్యూనిచ్‌ ‌భద్రతా సమావేశం-2022 స్పష్టం చేసింది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి హాజరయ్యారు. డాక్టర్‌ ‌లిన్‌ ‌క్యుయోక్‌ ‌మోడరేటర్‌గా వ్యవహరించిన ఈ సమావేశంలో ఉక్రెయిన్‌పై మద్దతుకు, ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంలో సైనికపరమైన సహాయ సహకారాలకు పశ్చిమ దేశాలు ముడిపెట్ట డాన్ని మన విదేశాంగ మంత్రి జయశంకర్‌ ‌తప్పు పట్టారు. ‘‘2009 వరకు చైనా ఆగడాలపై ఏవిధం గానూ నోరుమెదపని పశ్చిమదేశాలు, దక్షిణ చైనా సముద్రం, దక్షిణాసియా ప్రాంతాల్లో తన విస్తరణ వాదంతో చైనా, వాణిజ్య నౌకల స్వేచ్ఛా రవాణాకి అడ్డంకులు సృష్టిస్తున్నప్పుడు కిమ్మనలేదు. గల్వాన్‌ ‌లోయ సంఘటన, గత 22 నెలలుగా భారత్‌-‌చైనాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు కారణమైన చైనా వైఖరిని కూడా పశ్చిమ దేశాలు తప్పుపట్టలేదని’’ మన విదేశాంగ మంత్రి పశ్చిమ దేశాల గురివింద వైఖరిని వేలెత్తి చూపారు.

రష్యా, ఐరోపా దేశాలు, యుఎస్‌లతో భారత్‌ ‌సత్సంబంధాలు కొనసాగిస్తూ, తటస్థ వైఖరి అనుసరి స్తోంది. అయితే కనుచూపు మేరలో ఉక్రెయిన్‌ ‌సంక్షోభం ముగిసే పరిస్థితి కనిపించకపోవడం భారత్‌కు మింగుడుపడటం లేదు. ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంలో వేగంగా విస్తరిస్తున్న చైనా ఉనికి తమ ప్రయోజనాలకు ఇబ్బందికరంగా మారడం భారత్‌- ‌యుఎస్‌లు దగ్గర కావడానికి ఒక కారణం. ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంలో చైనా విస్తరణ వాదానికి వ్యతిరేకంగా అమెరికా, జపాన్‌, ఆ‌స్ట్రేలియాలతో కలిసి క్వాడ్‌ ‌గ్రూపులో సభ్యురాలిగా కొనసాగుతోంది. ఇదే సమయంలో దశాబ్దాలుగా రష్యాతో కొనసాగు తున్న స్నేహాన్ని కాపాడుకుంటూ వస్తోంది. జనవరి 31న యుఎన్‌ ‌భద్రతామండలిలో ఉక్రెయిన్‌పై జరిగిన ఓటింగ్‌లో పాల్గొనకుండా తటస్థ వైఖరి అనుసరించడానికి ఇదే ప్రధాన కారణం. 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించినప్పుడు యుఎన్‌లో జరిగిన ఓటింగ్‌లో కూడా భారత్‌ ‌పాల్గొనలేదు. అప్పట్లో యుఎస్‌ ‌నేతృత్వంలోని పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడాన్ని భారత్‌ ‌ఖండించింది. రష్యా నుంచి ఎస్‌-400 ‌వ్యవస్థను భారత్‌ ‌కొనుగోలు చేసినప్పటికీ యుఎస్‌ ‘‌కాస్టా’ చట్టాన్ని ప్రయోగించక పోవడానికి, భారత్‌ను క్వాడ్‌కు ఒక చోదకశక్తిగా గుర్తించడమే కారణం. ఉక్రెయిన్‌ ‌సంక్షోభం ముగిసిం దంటే ఈ ‘కాస్టా’ కత్తిని యుఎస్‌ ‌ఝుళిపించక మానదు. ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమిస్తే, అమెరికా తీవ్రస్థాయి ఆంక్షలు విధించకమానదు. అప్పుడు తూర్పు రష్యాలో పెట్టుబడులు పెట్టాలన్న భారత్‌ ‌ప్రణాళికలకు విఘాతం కలుగుతుంది. తర్వాత రష్యా, చైనా, ఇరాన్‌, ‌పాకిస్తాన్‌ ‌దేశాలు ఒకేతాటిపైకి వస్తాయి. ఇక నార్ట్ ‌స్ట్రీమ్‌-2 ‌పైప్‌లైన్‌ను నిలిపి వేయడం, కొవిడ్‌తో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్‌ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. సైనిక సంఘర్షణ ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటివరకు భారత్‌ అనుసరిస్తున్న దౌత్యపరమైన వ్యవహారశైలి ఇక కొనసాగడం కష్టం. అందువల్ల ఈ సంక్లిష్ట పరిస్థితి నుంచి బయటపడటానికి భారత్‌ ‌చాలా జాగ్రత్తగా కొత్త వ్యూహాలను రచించక తప్పదు.

నేపథ్యం

ప్రచ్ఛన్నయుద్ధం ముగిసాక ఉక్రెయిన్‌, ‌రష్యా, బ్రిటన్‌, ‌యుఎస్‌ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఉక్రెయిన్‌ ‌తనకు సోవియట్‌ ‌నుంచి సంక్రమించిన అణ్వాయుధాలను వదిలేయాలి. ఇందుకు ప్రతిగా ఉక్రెయిన్‌ ‌స్వాతంత్య్రం, సార్వభౌమత్వం సరిహద్దుల భద్రతకు ఈ ఒప్పందం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ ‌జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడారు. చుట్టుపక్కల దేశాల్లో ఉన్న తమ సైన్యాలు, యుద్ధనౌకలు, ఇతర ఆయుధాలను ఉక్రెయిన్‌ ‌వైపునకు తరలించడం అమెరికా ప్రారంభించింది. యు.కె. ట్యాంకు విధ్వంసక క్షిపణులను ఉక్రెయిన్‌కు పంపింది. పుతిన్‌ ‌మద్దతుదార్లు, యు.కె.లో రష్యా బ్యాంకుల కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. అయితే రష్యాకు చెందిన కొందరు మిలియనీర్లకు బ్రిటన్‌ ‌స్వర్గధామం వంటిది. ఇది బ్రిటన్‌ అనుసరించే వైఖరిపై తప్పక ప్రభావం చూపగలదు. రష్యా విషయంలో జర్మనీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న జర్మన్‌ ‌ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ ‌స్కాల్జ్ ‌నేతృత్వంలోని సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీ సంప్రదాయంగా రష్యాకు అనుకూలం. ఇటీవలి కాలంలో రష్యాతో అతిపెద్ద ఇంధన ఒప్పందాన్ని జర్మనీ కుదుర్చుకుంది. ప్రస్తుతం రష్యాకు సహజవాయు పైపులైన్‌ ‌పనులను నిలిపేసింది. భవిష్యత్తులో తన సహజవాయు అవసరాల కోసం రష్యాపై ఆధారపడటం తగ్గించుకునే దిశగా అడుగులు ముందుకేయవచ్చు.

ఐరోపా సమాఖ్య చీఫ్‌ ఉర్సులా ఒన్‌ ‌లెన్‌ ‌డియెర్‌ ఉ‌క్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించారు. ఇక చైనా తాజా పరిణామాల నేపథ్యంలో రష్యాతో తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తుంది. ఇదే సమయంలో యుఎస్‌తో వాణిజ్య సంబంధాలను వదులుకోలేదు. ఈ నేపథ్యంలోనే రష్యాపై ఆంక్షలను ఖండించి ఇరుపక్షాలు సంయ మనం పాటించాలని పేర్కొని చేతులు దులుపుకుంది. భారత్‌ ‌కూడా తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఐక్యరాజ్యసమితిలో భారత్‌ అనుసరించిన వైఖరిని రష్యా ఎంతగానో ప్రశంసిం చింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని 16 వేల మంది విద్యార్థులను తిరిగి స్వదేశానికి రప్పించే యత్నాల్లో ఉంది. ఉక్రెయిన్‌పై దాడి సరైందేనంటూ ప్రకటించ డంతో ప్రపంచ దేశాలు పాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

గతంలో సోవియట్‌ ‌యూనియన్‌లో అంతర్భా గంగా ఉండి ప్రస్తుతం నాటో గ్రూపులో కొనసాగు తున్న బల్గేరియా, ఇస్తోనియా, లాత్వియా, లిథుయే నియా, రొమేనియా, స్లొవేకియా, స్లొవేనియాలు సహజంగానే ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తు న్నాయి. అయితే రష్యా తదుపరి లక్ష్యం తామేనని ఎస్తోనియా, లాత్వియా, లిథియేనియా (బాల్టిక్‌ ‌దేశాలు)లు భయపడుతున్నాయి. బెల్జియం, చెక్‌ ‌రిపబ్లిక్‌లు రష్యాలను విమర్శించాయి. హంగరీ ప్రధాని విక్టర్‌ ఆర్బన్‌ ‌రష్యాతో దృఢమైన సంబంధా లను కోరుకుంటూనే ఉక్రెయిన్‌ ‌స్వతంత్రదేశంగా ఉండటం అవసరమని పేర్కొన్నారు. ‘రష్యా నయా సామ్రాజ్యవాదాన్ని’ ఖండిస్తున్నామని పోలండ్‌ ‌పేర్కొంది. ఉక్రెయిన్‌కు అవసరమైన సహాయ సహకా రాలు అందిస్తామని కూడా ప్రకటించింది. సిరియా, వెనిజులా దేశాలు రష్యాకు మద్దతుగా నిలిచాయి. ప్రస్తుత సంఘర్షణ మరింత సంక్లిష్టరూపం దాలిస్తే ఇది రష్యా, ఉక్రెయిన్‌, ‌యూరప్‌ ‌దేశాలపై తీవ్ర ప్రతికూల పరిణామాలకు దారితీయక మానదు. అంతేకాకుండా ప్రపంచ ఆర్థికవ్యవస్థ మరింత కుదుపులకు లోనుకావడం ఖాయం. గత రెండేళ్లుగా కొవిడ్‌ ‌బారినపడి, కుదేలయిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో ఉక్రెయిన్‌ ‌సంక్షోభం భారత్‌కు శరాఘాతం వంటిదే!

———————–

జిత్తులమారి చైనా

ఉక్రెయిన్‌ ‌సమస్యపై అమెరికా అనవసర భయాలు సృష్టిస్తోందని చైనా పేర్కొంది. ఈ సమస్యపై చారిత్రకంగా తమ వైఖరిలో ఏవిధమైన మార్పు లేదని స్పష్టం చేసింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చిన్‌యుంగ్‌ ‌మాట్లాడుతూ రష్యాపై పశ్చిమదేశాలు విధించిన ఆంక్షలు పూర్తిగా ఏకపక్షమంటూ తప్పు పట్టారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేస్తూ యుఎస్‌ ‌భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని, ఒక దేశ భద్రతా సమస్యను ఇతర దేశాలు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. కాగా ఇటీవలి చైనా శీతాకాల ఒలింపిక్స్ ‌సందర్భంగా ఉక్రెయిన్‌ ‌విషయంలో రష్యాకు, చైనా తన పూర్తి మద్దతు పలకడం, ఆ రెండు దేశాల మధ్య స్నేహబంధం మరింత బలపడటాన్ని సూచిస్తోంది. ఒకపక్క పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయంటూ ఊదరకొడుతున్న అమెరికా, మరోపక్క రష్యా చొరబాటును ఉక్రెయిన్‌ ‌తక్కువ అంచనా వేయడం, మరోవైపు ఐరోపా దేశాల దౌత్యవేత్తలు ఉక్రెయిన్‌ ‌సంక్షోభాన్ని పరిష్కరించేందుకు యత్నించడం వంటి ఈ గందరగోళం మధ్య రష్యా-చైనాల మధ్య సంబంధాలు ఎన్నడూ లేని స్థాయిలో మరింత బలోపేతమయ్యాయి. తైవాన్‌ ‌విషయంలో రష్యా మద్దతుకు ప్రతిగా చైనా ఉక్రెయిన్‌ ‌విషయంలో రష్యాకు తోడుగా నిలిచింది. ఈవిధంగా ఉక్రెయిన్‌ ‌సంక్షోభం నేపథ్యంలో రష్యా-చైనా సంబంధాలు మరింత బలోపేతం కావడం భారత్‌కు తనొప్పిగా మారింది. అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా వైఫల్యం కారణంగా ఏర్పడిన భద్రతా పరమైన శూన్యం రష్యా, చైనాలకు కలిసివచ్చింది. ఈ ప్రాంతంలో తమ పలుకుబడిని పెంచుకోవడానికి అవసరమైన శక్తిని కూడదీసుకోవడానికి, పనిలో పనిగా చైనా హాంకాంగ్‌పై తన కంబంధహస్తాన్ని మరింత బిగిం చడానికి, తైవాన్‌లో మరిన్ని చొరబాట్లకు పాల్పడటానికి అమెరికా అఫ్ఘ్ఘాన్‌ను వీడివెళ్లడంతో అవకాశం వచ్చింది. ఇదే సమయంలో యూరప్‌లో ప్రచ్ఛన్న యుద్ధానంతర రాజకీయాను మార్చివేయడానికి రష్యా ప్రయత్నం మొదలైంది. ఇక ఉక్రెయిన్‌ ‌పరిణామాలు చైనాకు ఊపిరిపోస్తాయనడంలో సందేహం లేదు. ఒకే చైనా విధానం అమల్లో భాగంగా తైవాన్‌ను ఆక్రమించుకోవాలని ఉవ్వి ళ్లూరుతున్న చైనా… తైవాన్‌ను ఆక్రమించుకోవడం పెద్ద సమస్య కాదన్న బలమైన అభిప్రాయానికి రావడం ఖాయం. ప్రపంచం యావత్తూ ఉక్రెయిన్‌పై దృష్టి కేంద్రీకరించిన సమయంలో చడీచప్పుడూ లేకుండా, సునాయాసంగా తైవాన్‌ను  చైనా కబళించే అవకాశాలే మెండు! ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవడానికి రష్యా అనుసరించిన మాదిరి ప్రణాళిక కూడా అవసరం లేదు. అప్పుడు చైనా, రష్యాలు… ఉక్రెయిన్‌, ‌తైవాన్‌ల విషయంలో పరస్పరం ఒక అవగాహనకు వచ్చిన తర్వాతనే ఈ ఆక్రమణలకు పాల్పడ్డాయని భావించాల్సి ఉంటుంది.

—————————-

భారతీయ విద్యార్థుల ఆక్రోశం

ఉక్రెయిన్‌లో దాదాపు 16,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిని స్వదేశానికి రప్పించే కార్యక్రమం ఇప్పటికే మొదలయింది. తెలుగు ప్రాంతాల విద్యార్థులు కూడా కొందరు తమ కుటుంబాల వద్దకు చేరుకున్నారు. భారత్‌కు రావాలనుకునే విద్యార్థులు ఉక్రెయిన్‌ ‌సరిహద్దులకు రావాలని చెబుతున్నారు. దీనితో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. నాటో దేశమైన పోలండ్‌, ఉ‌క్రెయిన్‌ ‌సరిహద్దుకు చేరుకున్న భారతీయ విద్యార్థుల పట్ల పోలండ్‌ ‌భద్రతాదళాలు అమానుషంగా వ్యవహరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కొందరు విద్యార్థులు ఉక్రెయిన్‌లోనే రక్షణ కోసం ఏర్పాటు చేసిన బంకర్లలోనే ఉండిపోయారని కూడా వార్తలు వస్తున్నాయి. అక్కడ నుంచి భారతదేశంలో ఉన్న తమ కుటుంబీకులకు వారు చేసుకుంటున్న విన్నపాలు, పడుతున్న కడగండ్లు వింటూ ఉంటే హృదయం ద్రవిస్తున్నది. అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం వారి తరలింపునకు చేస్తున్న యత్నాలు ఆశాజనకంగా ఉన్నాయి.

About Author

By editor

Twitter
YOUTUBE