– పుట్టగంటి గోపీకృష్ణ
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైన రచన
టోక్యో ఒలింపిక్స్, జులై 2021,
అరియాకే జిమ్నాస్టిక్ సెంటర్..
జిమ్నాస్టిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ముద్ర తన కోచ్ సురీందర్‌సింగ్‌తో కలిసి జిమ్నాస్టిక్ సెంటర్లో ఉంది. ఇప్పటికి మూడు రకాల పోటీలు ముగిశాయి. వాల్ట్, బీమ్, ఫ్లోర్ ఈవెంట్లలో తన ప్రదర్శన ముగించింది ముద్ర.
భారతదేశం నుండి ఇంతవరకు ఏ జిమ్నాస్టూ ఒలింపిక్స్ మెడల్ గెలవటం సంగతి తరువాత, కనీసం పోటీకి అర్హత సంపాదించలేదు. ఆ స్థాయికి చేరిన మొదటి జిమ్నాస్టు ముద్ర. ఆత్రుతగా ఇప్పటి వరకు తను చేసిన ప్రదర్శనకు జడ్జిలు ఇవ్వబోయే మార్కుల కోసం ఎదురు చూస్తోంది ఆమె.
ఇంతలో మార్కులు ఎలక్ట్రానిక్ బోర్డు మీద ప్రత్యక్షం అయ్యాయి. ఇప్పుడే ముగిసిన పోటీలో మార్కులతో పాటు, మొత్తం మార్కులు కూడా ఎర్ర అక్షరాలతో మెరుస్తూ కనపడ్డాయి.
ముద్ర పేరు అయిదవ స్థానంలో ఉంది.
‘‘నో’’ అంది ముద్ర. ఆమె గొంతు బాధగా ధ్వనిం చింది. అనియంత్రితంగా ఆమె కళ్లు చెమ్మగిల్ల్లాయి. సురీందర్‌సింగ్ ఓదార్పుగా ఆమె భుజం మీద చెయ్యి వేశాడు.
ఇక మిగిలి ఉంది ఒకే ఒక ఈవెంట్. ఏదో అద్భుతం జరిగితే తప్ప అయిదవ స్థానంలో ఉన్న తను మెడల్ గెలిచే అవకాశం లేదు. ఆ సంగతి ఆమెతో పాటు కోచ్ సురీందర్‌కు కూడా బాగా తెలుసు. తన ఇన్ని సంవత్సరాల శ్రమ వృథా అయినందుకు ఆమెకు నిరాశగా ఉంది. ఇప్పటివరకు సాధించింది కూడా తక్కువ విషయం కాదు అని ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు కోచ్ సురీందర్‌సింగ్. ఇంతలో ఆమెకు ఫ్లాష్‌లాగా ఒక ఆలోచన వచ్చింది. ‘‘సార్! ఒక పని చేస్తాను’’ అంది ముద్ర ఉత్సాహంగా.
‘‘ఏం చేస్తావ్?’’ అడిగాడు కోచ్ ఒక్కసారిగా ఆమెలో కనిపిస్తున్న ఉత్సాహానికి కారణం తెలియక.
‘‘నా తరువాత ఈవెంట్‌గా ప్రదునోవా ఎటెంప్ట్ చేస్తాను..’’
‘‘మై గాడ్….!’’ అన్నాడు సురీందర్‌సింగ్. ‘‘అదెంత ప్రమాదకరమో తెలుసా?’’
‘‘తెలుసు సర్! కానీ అయిదవ స్థానంలో ఉన్న నేను కనీసం మూడవ స్థానానికి రావాలంటే అదొకటే మార్గం. ఏ మెడల్ తేకుండా వెనెక్కి వెళ్లటం నాకు ఇష్టం లేదు.’’
‘‘అందుకని ప్రాణాలు పణంగా పెడతావా?’’ అన్నాడు సురీందర్‌సింగ్. అతని మాటల్లో అతిశ యోక్తి లేదు. జిమ్నాస్టిక్స్‌లో అత్యంత ప్రమాద కరమయిన ఫీట్ ప్రదునోవా. పరుగెత్తుకుంటూ వచ్చి చేతుల ఆధారంగా గాల్లోకి ఎగిరి, చేతులతో మోకాళ్లను పట్టుకుని గాలిలోనే రెండు పల్టీలు కొట్టి కాళ్ల మీద ల్యాండ్ అవ్వాలి. రెండు పల్టీలు కొట్టటం పూర్తయ్యే వరకు చేతులు మోకాళ్లను పట్టుకునే ఉండాలి. ల్యాండ్ అయినపుడు కాళ్లు కాకుండా ఏ శరీర భాగం కూడా నేలను తాక కూడదు. సెకనులో వందో వంతు తేడా వచ్చినా తలకిందులుగా ల్యాండ్ అవటం, శరీరం బరువు మెడమీద పడటం, ప్రాణాలు పోవటం జరుగుతుంది. అందుకనే దీనిని ‘వాల్ట్ ఆఫ్ డెత్’ అంటారు.
‘‘130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు అండగా ఉండగా నాకు ఏమీ కాదు సర్. ఒలింపిక్స్ మళ్లీ నాలుగేళ్లకు కానీ రాదు. అప్పటికి నాలో ఈమాత్రం శక్తి సామర్ధ్యాలు కూడా ఉంటాయో, ఉండవో. దేశం కోసం ఈ మాత్రం రిస్క్ తీసుకోవచ్చు సర్’’.. ‘‘నేను చెప్పాల్సింది చెప్పాను. ఆపై నీ ఇష్టం’’ అన్నాడు సురీందర్‌సింగ్.
రెండు నిమిషాల్లో ముద్ర ప్రదునోవా వాల్ట్ చేయబోతుందన్న విషయం మీడియాకు తెలిసి పోయింది. అప్పటివరకు అక్కడ ఉన్న జర్నలిస్టులు రెట్టింపు అయ్యారు. కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండా పోటీలు జరుగుతున్నాయి. ప్రేక్షకులకయితే అనుమతి లేదు కానీ, వేరే ఆటగాళ్లు అక్కడ కూర్చుని చూడవచ్చు. ఖాళీగా ఉన్న ఇండియన్ క్రీడాకారులు ఒక్కసారిగా అక్కడ పోగయ్యారు. అప్పటిదాకా బోసిగా ఉన్న స్టేడియంలోని సీట్లు కొంతలో కొంత నిండాయి. ముద్ర చేయబోతున్న ఫీట్ గురించి తెలుసుకుని అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు.
ఇక ఇండియాలో టీవీలో చూస్తున్న వారి సంఖ్యకయితే అంతే లేదు.
‘వాల్ట్ ఆఫ్ డెత్’ చేయటానికి ప్రయత్నించ బోతున్న ఇండియన్ గర్ల్ ముద్ర గురించి కామెంటే టర్లు ఆపకుండా చెప్తున్నారు. కొంతమంది సహచర జిమ్నాస్టులు, ‘మళ్లీ ఒకసారి ఆలోచించుకో’ అని సలహా చెప్పారు. అయినా ముద్ర అనుకున్న పని చేయటానికే సిద్ధపడింది.
‘‘ఇంతవరకు ప్రపంచంలో కేవలం అయిదుగురు అమ్మాయిలు మాత్రమే ఈ ఫీట్ చేయగలిగారు’’ చెప్తున్నాడు ఒక కామెంటేటర్.
ముద్ర తన పొజిషన్ తీసుకుంది. ఎదురుగా వాల్ట్ బోర్డ్ ఆహ్వానిస్తున్నట్లు కనిపిస్తోంది. తన విజయాన్ని కోరుకుంటున్న అశేష ప్రజానీకం ఇస్తున్న ఆశీర్వచనాలే ఆలంబనగా చేయవలసిన పనిని మనసులో మననం చేసుకుంది. కింద ప్యాడింగ్ చేసిన నేల మెత్తగా ఉంది. గట్టిగా ఊపిరి లోపలకు తీసుకుని ఒక్కసారిగా పరుగు అందు కుంది ఆమె. వేగాన్నంతా కాళ్లలోకి తెచ్చుకుని ఎగిరి స్ప్రింగ్ బోర్డ్ మీదకు దూకింది. స్ప్రింగ్ బోర్డ్ ఆమె శరీరాన్ని గాలిలోకి లేపింది. గాలిలో ప్రయాణి స్తూనే చేతులను వాల్ట్ బోర్డ్ వైపు చాపింది. వాల్ట్‌బోర్డ్ మీద చేతులు ఆనీ ఆనగానే చేతులతో శరీరాన్ని గాలిలోకి నెట్టింది. అదే సమయంలో ఆమె రెండు చేతులు గట్టిగా మోకాళ్లను బిగించి పట్టుకున్నాయి. గాలిలో శరీరాన్ని పల్టీలు కొట్టించే ప్రయత్నం మొదలు పెట్టింది ముద్ర. ఆమె కోరుకున్నట్లు… ఒకటి, రెండు అంటూ రెండు పల్టీలు కొట్టిన ఆమె శరీరం సరిగ్గా కాళ్ల మీద వచ్చి నిలబడింది.
స్టేడియం చప్పట్లతో నిండి పోయింది.
ముద్ర భారతదేశం నుండి ఒలింపిక్ పతకం గెలిచిన మొదటి జిమ్నాస్ట్‌గా చరిత్రలో నిలిచింది.
**********
ఆమె విజయాన్ని టీవీలో వీక్షించి పులకరించి పోతున్నాడు తండ్రి విశ్వనాథం.
ముద్ర కంటే ఎక్కువగా అతనికి అభినందనలు అందుతున్నాయి. ఈ అభినందనలకు తను అర్హుడేనా? అన్న అనుమానం ఎప్పటిలానే అతన్ని తొలుస్తోంది. తనకింతటి గౌరవం తెచ్చిపెట్టిన ముద్ర తన జీవితంలోకి ప్రవేశించిన సంఘటన అతనికి మరలా గుర్తుకు వచ్చింది.
ఇరవై మూడు సంవత్సరాల క్రితం విశ్వనాథం దేవుడిని దర్శించుకోవటానికి విజయవాడ నుండి తిరుమలకు ప్రయాణమయ్యాడు. అతనితో పాటు అతని భార్య కూడా ఉంది. వారు ఎక్కిన బస్సు తిరుపతి చేరేటప్పటికి తెల్లవారుతోంది. తిరుపతి బస్టాండు బయట సిటీబస్సు ఎక్కి అలిపిరి దగ్గర దిగి కాలి నడకన కొండ మీదకు చేరుకున్నారు.
వారికి పెళ్లయి పన్నెండేళ్లు అవుతోంది. ఇంత వరకు పిల్లలు లేరు. అతన్ని మళ్లీ పెళ్లి చేసుకోమని ఇంట్లో తల్లి ఒత్తిడి చేస్తోంది. అతను నిజంగా ఆ పని చేస్తాడేమో అని భార్య తల్లడిల్లిపోతోంది. ఈసారన్నా దేవుడు దయతలచక పోతాడా, తమ కోరిక తీరక పోతుందా అన్న ఆశతో వచ్చారు వారు.
పర్వదినాలు కావటంతో కొండ మీద ఇసకేస్తే రాలనంత మంది జనం ఉన్నారు. దేవుడికేమో విఐపిలకు దర్శనమివ్వటానికే సమయం దొరకటం లేదు. ఇక సామాన్య భక్తులయితే రోజు పైగా క్యూ కాంప్లెక్సులో నిలిచిపోక తప్పని పరిస్థితి.
అన్ని ఇబ్బందులు ఆనందంగా భరించి దైవ దర్శనం పూర్తి చేసుకున్న దంపతులు పూర్తిగా అలసి పోయారు. కాటేజీలు, సత్రాలు అన్నీ నిండిపోయి, గుడి ఎదురుగా ఉన్న విశాలమయిన ఖాళీ స్థలంలో ఎక్కడబడితే అక్కడ జనాలు కింద పడుకుని నిద్ర పోతున్నారు. మరో దారిలేక వారు కూడా అక్కడే కూలబడ్డారు. ఒక పక్క చలి వణికించి వేస్తోంది. ఇలాంటి అవసరాలకు పనికి వస్తాయని తమతో తెచ్చుకున్న మందపాటి దుప్పట్లలో ఒక దాన్ని కింద పరచి, చెరో దుప్పటి మీద కప్పుకుని పడుకున్నారు. తిరుమలలో చలి మామూలుగానే ఎక్కువ. అందులో ఇప్పుడు కార్తీక మాసమేమో మరీ వణికించి వేస్తోంది. అలానే ఇబ్బంది పడుతూ నిద్రపోయే ప్రయత్నం చేస్తున్నారు వారిద్దరు.
ఒక పక్కకు తిరిగి పడుకున్న విశ్వనాథానికి ఎదురుగా తమలాగే అవస్థ పడుతున్న మరో జంట కనిపించారు. వారి చిరిగిన బట్టలు, తైల సంస్కారం లేని తలలు, వారు ఎంత బీదవారో చెప్తున్నాయి. ఆ జంటలోని స్త్రీ కాళ్లకు కడియాలు, మెడలో రకరకాల పూసలు వేసుకుంది. మగాడు పరిచయం లేని పద్ధతుల్లో తలపాగా చుట్టుకుని ఉన్నాడు. అంతకు ముందే తల్లి పసిదానికి పాలిచ్చి పడుకోబెట్టింది. అయినా ఆ నెలల పసిగుడ్డు చలికి ఏమో మధ్య మధ్యలో నిద్రలోనే కదులుతోంది. ఏవో చినిగి పోయిన గుడ్డలు కప్పుతున్నా అవి ఆ పసిదాన్ని చలి నుండి కాపాడలేక పోతున్నాయి. ఆ పసిదాన్ని చూస్తుంటే, ఒక్క క్షణం జాలి వేసింది విశ్వనాథానికి. ఈ అమ్మాయే తన ఇంట్లో పుట్టి ఉంటే ఎంత అపురూపంగా పెరిగేదో అనుకుంటే, అతనికి ఆ దేవుడి నిర్ణయాల మీద కోపం వచ్చింది. లేచి తను కప్పుకున్న దుప్పటి తీసి వారికి ఇచ్చి, ‘‘ఆ పసిదానికి కప్పండమ్మా’’ అన్నాడు.
వాళ్లు కృతజ్ఞతగా చూస్తూనే, ‘‘ఉన్న ఒక్క దుప్పటీ ఇచ్చేస్తే మీకు ఎట్టా అయ్యా?’’ అన్నారు.
నవ్వేశాడు విశ్వనాథం.
వాళ్లు మరి రెట్టించకుండా దుప్పటిని పసిదాని మీద కప్పారు.
‘‘ఏం చేస్తుంటారు?’’ అడిగాడు విశ్వనాథం.
‘‘ఊర్లల్లో సర్కస్ ఆటలు ఆడి డబ్బులు అడుక్కుంటాం అయ్యా’’ అన్నాడతను.
తాడు మీద ఆడపిల్లలు నడుస్తూ బ్యాలెన్సింగ్ చేస్తూ రకరకాల విద్యలు ప్రదర్శిస్తుంటే, కింద డప్పు కొడుతూ తిరిగే మగాడు గుర్తుకు వచ్చారతనికి. ఒకప్పుడు వాళ్లు ఊర్లోకి వస్తే చుట్టూ జనాలు మూగి చూసినంత సేపు చూసి, తోచినంత ఇచ్చి వారిని ప్రోత్సహించే వాళ్లు. ఇప్పుడు సమస్తం టీవీల రూపంలో నాలుగ్గోడల మధ్యకు వచ్చేశాక, వారిని చూసే వాళ్లే లేరు. అసలు వారి బ్రతుకులే అంతంత మాత్రం. ఇలాంటి పసిపిల్లలతో వారికి జరుగుబాటు ఎంత కష్టమో తలచుకుంటే అతనికి బాధ వేసింది.
ఆలోచనల మధ్య నిద్ర పట్టింది విశ్వనాథానికి.
రాత్రి వేళ ఏదో అలికిడయితే మెలకువ వచ్చింది విశ్వనాథానికి. ఎవరో లోగొంతుకలో ఏడుస్తున్న శబ్దం అని గుర్తించాడతను. పడుకునే పరిసరాలు గమనించాడు. ఎదురుగా పడుకుని ఉన్న జంటలో ఆడామె ఏడుపును గొంతులో అదుముకుంటుంటే, మగ వ్యక్తి ఆమెను ఓదారుస్తూ దూరంగా తీసుకు వెళ్తున్నాడు. ‘‘ఎందుకే ఏడుస్తావ్? ఆ పసిదానికి మనం ఏమి ఇవ్వగలం? బ్రతకటానికి రోజూ చావట మేగా మన జీవితం. దాన్ని ఎవరు తీసుకుపోయినా మనకంటే మంచి జీవితమే ఇస్తారు. పద’’ అంటు న్నాడు. వారు పసిపిల్లని అక్కడే వదిలి వెళ్తున్నారని అప్పుడు గ్రహించాడు విశ్వనాథం. ఒక్క క్షణం అతనికి ఏం చేయాలో అర్ధం కాలేదు. అతను కావాలంటే ఆ జంటను వెనక్కి పిలిచి పసిదాన్ని పోషించేలా ఆర్థిక సాయం చేయవచ్చు. కానీ అతనిలోని స్వార్ధం అతన్ని ఆపేసింది. అది దేవుడు తనకు ఇచ్చిన అవకాశమేమో అని తనను తాను వంచించుకున్నాడు విశ్వనాథం. మరి కొన్ని నిమిషాలు మౌనంగా పడుకున్న చోటే ఉండి పోయాడు. తరువాత లేచి భార్యను కూడా లేపాడు. అయోమయంగా చూస్తున్న ఆమెకు పసిపాపను చూపాడు. ఆవిడ ఏదో గట్టిగా మాట్లాడబోయింది. ఒక చేత్తో ఆమె నోరు మూసి మరో చేత్తో పసిపాపను ఎత్తుకుని అక్కడ నుండి దూరంగా నడిచాడు.
‘‘పాపమేమో అండీ’’ అంటోంది భార్య. కానీ ఆ మాటల్లో బలం లేదు.
‘‘దొంగతనం చేయటం పాపం. దొరికిన దాన్ని తీసుకువెళ్లటం పాపం కాదు. పైగా కన్నవాళ్లు వద్దనుకున్న ఈ పాపని మనం తీసుకెళ్లాలని రాసి ఉండబట్టే ఇలా జరిగింది. ఇక మాట్లాడకు’’ అన్నాడు విశ్వనాథం. కొద్దిసేపు ఆగి, ‘‘తాడు మీద సర్కస్ చేస్తూ బ్రతకాల్సిన పిల్ల. మన ఇంట్లో మహారాణిలా బ్రతకబోతోంది. ఇందులో నాకు అంత తప్పు ఏమీ కనపడటం లేదు’’ అన్నాడు.
ఆ పాపను తన చేతుల్లోకి తీసుకుంది విశ్వనాథం భార్య. అప్పుడే నిద్ర లేచిన పసిపాప తన బుల్లి చేతులతో అందిస్తున్న స్పర్శా సుఖాన్ని అనుభవించిన తరువాత ఆమె ఇక అడ్డు చెప్పలేదు.
పసిపిల్లతో వెనక్కి తిరిగి వచ్చిన భార్యాభర్తలను విశ్వనాథం తల్లి ఆశ్చర్యంగా చూసింది. మొదట్లో మగపిల్లాడయితే బాగుండేదని కొద్దిగా గుణిసింది కానీ తరువాత ఆమె కూడా సర్దుకుపోయింది.
కూతురుకు ముద్ర అని పేరు పెట్టాడు విశ్వనాధం. ముద్రతో అతని లోకం పెనవేసుకు పోయింది. ఇరవై నాలుగు గంటలు ఆమె తోడిదే లోకం. తోటి పిల్లలతో ఆడుకుంటుంటే ఏ దెబ్బలు తగులుతాయో అని దూరంగా నిలబడి ఉండేవాడు. బడికి పంపాల్సి వస్తే రోజులో అంతసేపు తన నుండి దూరం అయిపోతోందని అల్లాడిపోయాడు.
ముద్ర చలాకీ పిల్ల. హైపర్ యాక్టివ్. ఒకచోట కూర్చునేది కాదు. ఎగురుతూ, గెంతుతూ ఉండేది. మగపిల్లల కంటే ఎక్కువగా చెట్లు, గోడలు ఎక్కుతూ ఉండేది. స్కూలులో చేరిస్తే అల్లరి తగ్గుతుంది అనుకున్నారు. కానీ స్కూలు ప్లే గ్రౌండులో పారలల్ బార్ల మీద తను చేస్తున్న ఫీట్లు చూసి పి.టి. మాస్టర్ థ్రిల్ అయిపోయాడు. ‘‘మీ అమ్మాయిని జిమ్నాస్టిక్ క్లాసుల్లో చేర్చండి. స్కూలుకు పేరు తెస్తుంది’’ అన్నాడు విశ్వనాధంతో.
‘ఇంకా నయం సర్కస్‌లో చేర్చమన్నాడు కాదు’ అనుకున్నాడు విశ్వనాధం. పైకి మాత్రం, ‘‘చూద్దాం లెండి’’ అంటూ తప్పించుకున్నాడు.
‘‘ఆ అమ్మాయిలో జిమ్నాస్టిక్స్ కళ సహజంగా ఉందండీ. కొద్దిగా ప్రోత్సహిస్తే చాలా పైకి వస్తుంది’’ అంటున్న పీటీ మాస్టర్ మాటలు పట్టించు కోలేదతను. మనసులో మాత్రం, ‘ఎందుకు ఉండదు? ఉండే ఉంటుంది. ఆ రక్తం అలాంటిది మరి. కానీ ఈ ముద్రకి అంత రిస్కు తీసుకోవలసిన అవసరం లేదు…’ అనుకున్నాడు.
ముద్రకి వయసు పెరుగుతుంటే క్లాసులు కూడా పెరుగుతున్నాయి. అంతేతప్ప ఆ అమ్మాయికి చదువులో ధ్యాస తక్కువని అందరికీ అర్ధమయింది. ‘‘అదే చదువుకుంటుందిలే’’ అని తండ్రీ, ‘చదువుకోక పోతే కొంపలు అంటుకుంటాయా?’ అని తల్లీ అంటుంటే ఇక చదవాల్సిన అవసరం ఆ అమ్మాయికి కూడా కనపడటం లేదు.
అయితే ఆ స్కూలు పీటీ మాస్టారుకు తెలివి తేటలు ఎక్కువ. తన ఆధ్వర్యంలో ఒక స్టూడెంటు నయినా జిల్లా స్థాయికి తీసుకువెళ్లగలిగితే తప్ప తనకు ప్రమోషన్ రాదని అర్ధం చేసుకున్నాడు. సన్నగా, దృఢంగా ఇంత చిన్న వయసులో పారలల్ బార్ మీద తొణక్కుండా నడిచే ముద్రని చూస్తే తనకి అవకాశం ఆ అమ్మాయి రూపంలో ఎదురయిందని అర్ధం చేసుకున్నాడు. పైగా జిమ్నాస్టిక్స్‌లో పోటీ పడే విద్యార్ధులు తక్కువ. కొద్దిగా ప్రయత్నించినా ముద్రకి, తనకి కూడా పేరు వస్తుందని అతనికి తెలుసు. అందుకే ముద్ర తండ్రి వద్దన్నా తన ప్రయత్నాలు వదిలి పెట్టలేదు. అవకాశం దొరికినపుడల్లా ముద్రతోనే మాట్లాడటం మొదలు పెట్టాడు. జిమ్నాస్టిక్స్ అంటే ఏమిటో నెమ్మదినెమ్మదిగా చెప్పటం మొదలుపెట్టాడు. ‘‘అమ్మాయ్! ఈ రోజు టీవీ చూడమ్మా. ఏషియన్ జిమ్నాస్టిక్ పోటీల లైవ్ ఇస్తున్నారు’’ అని చెప్పాడు ఒకరోజు.
ఆ రాత్రి టీవీ చూసింది ముద్ర. పోగ్రాం పూర్తయ్యేటప్పటికి, ‘‘నాన్నా! నాకు ఈ ఆట నేర్పించు’’ అని అడిగింది. ముఖ్యంగా రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో తళుకుబెళుకుల డ్రస్సులు వేసుకుని చలాకీగా పల్టీలు కొడుతున్న అమ్మాయిలను చూస్తే తనకు కూడా అలా అవ్వాలని అనిపించింది. విశ్వనాధానికి కూతురు సంగతి తెలుసు. తెల్లారేటప్పటికి ఈ సంగతి మరచి పోతుందనుకున్నాడు. కానీ ఆమెను ఎగదొయ్యటానికి పీటీ మాస్టరు ఒకడు ఉన్నాడనే విషయం మరచి పోయాడు.
మరుసటి రోజు ఇంటికి వచ్చిన ముద్ర మళ్లీ, ‘‘నాన్నా! నాకు జిమ్నాస్టిక్స్ నేర్పించు’’ అని అడిగింది. మళ్లీ మళ్లీ అడిగింది. ఇక కూతురు ధ్యాస మరల్చ లేమని నిశ్చయించుకున్న విశ్వనాధానికి సరే అనక తప్పలేదు. పీటీ మాస్టరుతో పాటు ఊరంతా తిరిగి అత్యంత ఆధునిక సౌకర్యాలున్న ఒక జిమ్ ఫైనలైజ్ చేశాడు. ‘‘కావాలంటే పోటీలకు మీ స్కూలు పేరు మీద పంపించుకోండి. కానీ ట్రైనింగ్ మాత్రం ఇక్కడే తీసుకుంటుంది..’’ అని పీటీ మాస్టరుకు గట్టిగా చెప్పాడు.
కూతురు అడిగిందని జిమ్‌లో చేర్చాడు కానీ జిమ్నాస్టిక్స్‌లో తర్ఫీదు పొందాలంటే కూతురు చేయాల్సిన పనులు చూస్తే విశ్వనాధానికి కళ్లు తిరిగినంత పనయింది. అప్పటికీ చిన్నపిల్ల కాబట్టి ముద్ర చేత తేలికపాటి ట్రైనింగే మొదలు పెట్టారు.
పాల్గొన్న మొదటి పోటీలోనే ముద్రకు మంచి పేరు వచ్చింది. ముద్ర ఉత్సాహం మరింత పెరిగింది. ‘‘ఇక చాల్లే అమ్మా!’’ అంటే, ‘‘అప్పుడేనా నాన్నా! ఒలింపిక్ పతకం సాధించవద్దూ’’ అనేది.
ఆమె ఏడవ క్లాసుకు వచ్చేటప్పటికి జిమ్నాస్టిక్స్‌లో ముద్ర ప్రదర్శన చూసిన కోచ్‌లు అందరూ ఈ అమ్మాయి చరిత్ర సృష్టించబోతోందని చెప్పేవారు.
తన పధ్నాలుగవ ఏట నుండి పెద్ద పోటీలలో పాల్గొనటం మొదలు పెట్టింది ముద్ర. దేశంలో జిమ్నాస్టుల్లో పెద్దగా పోటీ లేకపోవటంతో ఆమె ఎక్కడకు వెళ్లినా మెడల్‌తో తిరిగి వస్తోంది. అది ఆమె ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. తన తరుపు నుండి ఏ లోటూ లేకుండా తన సాధనను రెట్టింపు చేసింది ముద్ర. నాలుగేళ్లలో నేషనల్ ఛాంపియన్‌గా నిలిచింది.
ఆమెను మరింత తీర్చిదిద్దితే ఒలింపిక్ పతకం వచ్చే అవకాశం ఉందని భావించిన క్రీడా మంత్రిత్వ శాఖ ఆమెను ఢిల్లీకి పిలిపించుకుంది. అన్ని సౌకర్యాలతో ప్రభుత్వ ఖర్చుతో హాస్టల్లో ఉండే అవకాశం ఉన్నా, కూతురుతో కలిసి ఉండటం కోసం విశ్వనాధం తన మకాం మళ్లీ ఢిల్లీకి మార్చాడు. అప్పటికే తనకున్న పొలాన్ని సగం అమ్మాడు విశ్వనాధం. ‘‘ఇలా అమ్ముకుంటూ పోతే ఎలా అండీ? దాని పెళ్లి ఎలా చేస్తాం?’’ అని భార్య అంటే, ‘‘నా కూతురుకు నగలు పెట్టాలని నువు అనుకుంటున్నావ్. నా కూతురు పతకం తెచ్చి, దేశానికే నగ పెట్టాలని అనుకుంటోంది. ఏది గొప్ప విషయమో ఆలోచించు’’ అనేవాడు విశ్వనాధం.
ఆ ప్రయత్నాల్లో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. మన దేశం వరకు ఫరవాలేదు కానీ వేరే దేశాల జిమ్నాస్టులతో పోటీ పడినప్పుడు ముద్రకు తెలిసింది తను ఇంకా ఎంత అభివృద్ధి చెందాల్సి ఉందో. దేశం తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాలంటే తను చేస్తున్న కృషి చాలదని ఆమెకు అర్ధమయింది. అప్పుడే ఆమెకు ప్రదునోవా గురించి తెలిసింది. వాల్ట్ ఆఫ్ డెత్ అనే ఆ పక్రియను సాధన చేయటం మొదలు పెట్టింది. అయితే ఆ విషయం ఆమె తండ్రికి తెలియనివ్వలేదు. తండ్రికి తను చేస్తున్న పక్రియ ఎంత ప్రమాదకరమో తెలిస్తే అసలుకే మోసం వస్తుంది. ఆమెను గైడ్ చేస్తున్న కోచ్‌లు కూడా ఆమె ఆ పక్రియ చేయటాన్ని వ్యతిరేకించారు. ‘‘మొత్తం ప్రపంచంలో ఇప్పటికి ప్రదునోవా విజయవంతంగా చేయగలిగిన స్త్రీలు ఆరుగురు. అంటేనే అర్ధం చేసుకో ఇది ఎంత ప్రమాదమో’’ అంటూ ఆమెను వెనక్కి లాగటానికి ప్రయత్నించారు. అయినా ఆమె మొండిగా ప్రదునోవా నేర్చుకోవటానికే మొగ్గు చూపింది.
ఆ ప్రయత్నాల ఫలితం ఇపుడు ఒలింపిక్ ఫలితం రూపంలో ఆమెకు లభించింది.
*****
ఢిల్లీలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి సహా ప్రముఖు లందరూ ముద్రను అభినందించి గౌరవించారు. ముద్ర భారతదేశానికే ముద్దుబిడ్డ అని పొగిడారు.
ఆమె విజయవాడ వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గొప్ప పౌర సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఆమెకు అత్యున్నత హోదాలో ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించారు.
నగరం మొత్తం తరలి వచ్చిందా అన్నట్లు సభ జనసంద్రమయింది. అంతా పూర్తి అయిన తరువాత విలేకరుల సమావేశం జరిగింది.
‘‘మీ ఈ అద్భుత ప్రదర్శనను ఎవరికి అంకితం ఇస్తారు?’’ అని అడిగాడు ఒక విలేకరి.
‘‘నా ఈ ఉన్నతికి కారణం ఎవరో ఈ ఊరిలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆయన మా నాన్నగారు. అదే సమయంలో ఆయనతో పాటు పేరు తెలియని ఒక అజ్ఞాత వ్యక్తికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకో మీకు ఇప్పుడే చెప్తాను’’ అని ఏమి చెప్పాలో ఆలోచించుకుంటున్నట్లు కొద్దిగా విరామం తీసుకుంది ముద్ర.
తనకు కూడా తెలియని ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరా? అని విశ్వనాధం కూడా కుతూహలంగా వింటున్నాడు.
‘‘ఒక రోజు నేను స్కూలు నుండి ఇంటికి వస్తుంటే రోడ్డు పక్కన సర్కస్ చూపించి డబ్బులు అడుక్కుం టున్న బృందం కనిపించింది. వారిలో ఒక చిన్న పిల్ల ఎంతో ఎత్తున ఉన్న తాడు మీద అవలీలగా నడుస్తోంది. అలా బ్యాలెన్స్ చేసుకుంటూనే కింద నుండి విసిరి వేస్తున్న వస్తువులను తల మీద పడేలా చేస్తోంది. ఇవన్నీ చేస్తూనే నడుము చుట్టూ రింగ్ తిప్పుతోంది. వాటిలో ఒక్కొక్క పని చేయటానికే మేము తల్లకిందులవుతున్నాం. మరి ఆ అమ్మాయి అంత అవలీలగా ఎలా చేస్తుందో తెలుసుకోవాలని అనిపించింది. వాళ్ల ప్రదర్శన పూర్తి అయ్యాక వాళ్లం దరికీ పెద్దలాగా ఉన్న పెద్దాయన్ని, ‘‘ఆ అమ్మాయికి ఈ సర్కస్ చేయటం ఎవరు నేర్పారు?’’ అని అడిగాను. ‘‘ఆకలి నేర్పిందమ్మా’’ అన్నాడా వ్యక్తి. ‘‘మేము ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా జిమ్నాస్టిక్ ఫీట్లు చేయాలంటే భయం వేస్తుంది. మరి మీకు భయం వెయ్యదా?’’ అని అడిగాను. ‘‘రెండు పూటలా తిండి దొరక్క పిల్లల్ని అమ్ముకుంటున్న వాళ్లం. బ్రతకటానికి భయపడుతున్న వాళ్లం. ఇక చావంటే భయం ఏముంటది తల్లీ’’ అన్నాడతను. అప్పుడు నాకు అర్ధమయింది మన దేశంలో ప్రతిభకు కొదువ లేదు. నాకంటే ప్రతిభ ఉన్న వాళ్లు, నా కంటే చిన్న వయసులో రెండు పూటలా తిండి కోసం చావుకు తెగిస్తున్నారు. అలాంటిది నేను దేశం కోసం ఆ మాత్రం తెగువ చూపించలేనా అనుకుంటే నా భయం మొత్తం పోయింది. ఆ తరువాత అతను నాకు ఎప్పుడూ కనపడ లేదు. కానీ అతని మాటలు నాకు ఎప్పుడూ వినిపిస్తూ ఉండేవి. అప్పటి నుండి భయా నికి నన్ను చూస్తే భయం పుట్టేలా తయారయ్యాను. అదే నా విజయరహస్యం’’ ఆంటూ చెప్పింది ముద్ర.
విశ్వనాధం ఉలిక్కిపడ్డాడు.
ముద్ర మాట్లాడుతున్న అజ్ఞాతవ్యక్తి ఎవరు? కొంపతీసి ఇరవై మూడేళ్ల క్రితం తనకు పిల్లను వదిలి వెళ్లిన వ్యక్తి కాదు కదా? అన్న అనుమానంతో అతనికి చాలా రోజులు నిద్ర పట్టలేదు. అతనే అయితే ముద్ర ఎవరో అతనికి తెలుసా? రెండు దశాబ్దాల తన శ్రమకు సమానంగా రెండు నిమిషాలు మార్గదర్శనం చేసి గౌరవం దక్కించుకున్నాడా?
విశ్వనాధం మనసులో మెదులుతున్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే అజ్ఞాతవ్యక్తి తారసపడాలి. కానీ అది ఎప్పటికీ జరగలేదు.
*******
(దీపా కొర్మాకర్ భారతదేశం నుండి ప్రదునోవా వాల్ట్ సాధించిన మొదటి మహిళ. ప్రపంచంలో ఆరవ మహిళ. ఈ కథ ఆమెకు అంకితం.)