మార్చి 11 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం

తెలంగాణలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రికి ఘనమైన ప్రశస్తి ఉంది. బాలప్రహ్లాదుడ్ని లాలించి బ్రోచేందుకు ఉగ్ర నరసింహుడిగా శ్రీమన్నారాయణుడు అవతరించాడు. భక్తుడు యాదరుషి విన్నపం మేరకు శ్రీలక్ష్మీ సమేతంగా ప్రసన్న వదనంతో కొలువుదీరిన క్షేత్రం యాదగిరిగుట్ట. ఫాల్గుణ శుద్ధ విదియ (ఈ ఏడాది మార్చి 4వ తేదీ) నుంచి ద్వాదశి వరకు 11 రోజుల పాటు యాదాద్రీశుడికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. జీవితంలో కష్టనష్టాలు పెరిగినప్పుడు, చోర,శత్రు,దుష్టగ్రహాల భయం చుట్టుముట్టినప్పుడు నృసింహుడిని ఆరాధించాలని పురాణాలు పేర్కొంటున్నాయి. (శాస్త్రవచనం). నరసింహా కరావలంబన స్తోత్ర అనుసంధానంతో శరణువేడితే కష్టాలు దరిచేరవని చెబుతారు.


భగవంతుడు సర్వాంతర్యామి. జగత్తంతా నిబిడీ కృతమై ఉన్నాడని చాటి చెప్పడమే దశావతారాలలోని నాలుగవదైన నృసింహావతార ఉద్దేశం. దానినే పోతనామాత్యుడు ‘ఇందుగలడందులేడని సందేహము వలదు..’ అని ప్రహ్లాదుడి నోట పలికించారు. నరహరి స్తంభోద్భవుడిగా దానవ చక్రవర్తి హిరణ్యకశిపుని సంహరించాడు. దనుజ సంహారానికి త్రిమూర్తుల సమన్వయశక్తితో ఆవిర్భవించిన పరబ్రహ్మ స్వరూపం నారసింహుడు. బుద్ధికి మనిషి, దేహబలానికి సింహం సంకేతంగా చెబుతారు. ఆ రెండు శక్తుల సమ్మేళనం.

యాదాద్రి క్షేత్ర వైభవం బ్రహ్మాండ, స్కాంద పురాణాలలో వర్ణితమైంది. ‘యాద’ అంటే జలం. విశేషమైన జలరాశిపై ఏకశిలతో కూడిన మహా పర్వతం యాదాద్రి. ఉగ్ర, గండ భేరుండ, జ్వాల, యోగానంద, లక్ష్మీనృసింహ అనే పంచనార సింహుడి రూపాలతో భాసిల్లే యాదాద్రి పాంచభౌతిక శరీరానికి సంకేతంగా చెబుతారు.

‘నాహం వసామి వైకుంఠే నయోగి హృదయేరవౌ!

మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారదా!!’ (నేను వైకుంఠంలో లేను. యోగుల హృదయాలలోనో, సూర్యునిలోనో కనిపించను. నా భక్తులు తలచేచోట, నన్ను కీర్తించే చోట ఉంటాను’ అని శ్రీ మహావిష్ణువు దేవర్షి నారదమునితో చెప్పినట్లు పద్మపురాణం పేర్కొంటుంది. అలాంటి క్షేత్రాలలో యాదాద్రి (యాదగిరిగుట్ట) పంచ నారసింహ క్షేత్రం ఒకటి. నిత్య నిరంతరం లక్ష్మీనరసింహ నామ స్మరణతో తెలంగాణ తిరుపతిగా అలరారుతున్న దివ్య క్షేత్రం. విష్ణుతుండం. గోపురచక్రం ఉండడం వల్ల ఇతర క్షేత్రాల కన్నా ఇది మరింత విశిష్టతను పొందింది.

యాదాద్రి నృసింహుడి ఆవిర్భావంపై పురాణా లను బట్టి.. ఋష్యశృంగ, శాంత దంపతుల కుమారుడు యాదరుషి పరమ విష్ణుభక్తుడు. విష్ణుమూర్తి అవతారమైన లక్ష్మీనరసింహుని అనుగ్రహం, సాక్షాత్కారం కోసం అడవిలో తపస్సు చేస్తుండగా, అక్కడి కొండజాతి వారు అతనిని పట్టి క్షుద్రదేవతలకు బలి ఇచ్చేందుకు ప్రయత్నించగా, స్వామి ప్రయోగించిన సుదర్శన చక్రం వచ్చి కాపాడిందని, అది ఈ క్షేత్రం చుట్టూ రక్షావలయాన్ని నిర్మించిందని పురాణగాథ. యాదరుషి తపస్సు ఫలించి నృసింహుడు ప్రత్యక్షమవుతాడు. అయితే ఆయన ఉగ్రరూపాన్ని దర్శించలేక భీతిల్లుతుండగా స్వామివారు ప్రసన్నాకృతిలో శ్రీలక్ష్మీదేవి సమేతంగా దర్శనమిస్తారు. తనను కటాక్షించిన గుహలోనే వెలసి సామాన్య భక్తులనూ అనుగ్రహించాలన్న విన్నపాన్ని మన్నించి పంచ నారసింహులుగా కొలువుదీరారు. వీరిలో జ్వాలా నృసింహుడు, యోగానంద, లక్ష్మీనృసింహులు కొండగుహలో, గండభేరుండస్వామి క్షేత్రపాలకుడు ఆంజనేయుడితో కలిసి ఉంటారు. ఉగ్ర నృసింహునిది అభౌతిక రూపమని, తేజో రూపంలో కొండచుట్టూ ఆవరించి ఉంటాడంటారు.

యాదాద్రి క్షేత్రాన్ని ఎందరో రాజులు దర్శించు కున్నట్లు చారిత్రకాధారాలు ఉన్నాయి. పశ్చిమ చాళుక్య రాజు త్రిభువనమల్లుడు క్రీ.శ.1148లో యాదాద్రీశుని సేవించుకున్నట్లు భువనగిరి దుర్గంలోని శాసనం ద్వారా తెలుస్తోంది. కాకతీయ గణపతిదేవుడు, విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు స్వామివారిని దర్శించుకున్నారు.

బ్రహ్మోత్సవ సమారోహం

ఏటా ఫాల్గుణ శుద్ధ విదియ (ఈసారి మార్చి 4వ తేదీ) నుంచి ద్వాదశి వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. అప్పట్లో ‘భక్తోత్సవాలు’ పేరుతో స్వామివారికి ఏటా మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిగేవి. ఆ తరువాత ఐదు రోజు లకు పొడిగించారు. ప్రస్తుతం 11 రోజుల పాటు వైభవంగా నిర్వహి స్తున్నారు. ఉదయం వేళల్లో అలంకారాలు, సాయం వేళల్లో సేవలు నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాలు నిరాటంకంగా సాగేలా చూడాలంటూ తొలినాడు స్వస్తి వాచకంతో శ్రీమహా విష్ణువు సర్వసైన్యాధ్యక్షుడు విష్వక్సేనుడికి అర్చన నిర్వహిస్తారు. ఉత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ. రెండవ రోజు ధ్వజారోహణ, ఆ రాత్రి భేరీపూజ, మూడవరోజు వేదపారాయణం, నాలుగవ రోజు హంసవాహన సేవ, ఐదవరోజు కల్పవృక్ష సేవ, ఆరవరోజున గోవర్ధనగిరి అవతారం, ఏడవ రోజున స్వామివారి కల్యాణోత్సవానికి ఎదుర్కోలు నిర్వహిస్తారు. ఎనిమిదవ రోజు తిరుకల్యాణం, తొమ్మిదవ రోజు రథోత్సవం నిర్వహిస్తారు. కల్యాణో త్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. పదవ రోజున చక్రస్నానం, మరునాడు అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి అవుతాయి. బ్రహ్మాది దేవతలు తరలి వస్తారని విశ్వసించే ఈ ఉత్సవాల వేళ నారదాది మహర్షులు హరి సంకీర్తనలు ఆలపిస్తారట. బ్రహ్మోత్సవాలతో పాటు ప్రతినెల స్వామివారి జన్మనక్షత్రం (స్వాతి)నాడు అష్టోత్తర శతఘటాభిషేకం, ఏటా చైత్రపౌర్ణమినాడు స్వామి వారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు.

తొలి దర్శనం క్షేత్రపాలకుడికే

ఇక్కడి పుష్కరిణిలో స్నానమాచరించి, ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తరువాతే నృసింహదేవుడి గర్భాలయానికి చేరుకుంటారు. సాక్షాత్తు శ్రీమన్నా రాయణుడి పాదాల నుంచి ఉద్భవించిన గంగగా అవతరించిన ఈ కోనేటిలో స్నానంతో సమస్త పాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. మహర్షులు బ్రాహ్మీ ముహూర్తంలో ఈ పుష్కరిణిలో స్నానంచేసి లక్ష్మీ నృసింహుడి దర్శనం చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. వారు వస్తున్నప్పుడు మృదంగ ధ్వనులు వినిపిస్తాయంటారు.

వైద్య నృసింహుడు

ఇతర నృసింహ క్షేత్రాలతో పోలిస్తే శారీరక మానసిక రుగ్మతలతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారి సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. వారు గుట్ట మీద బసచేసి (నలభై ఒక్క రోజులు) స్వామి గర్భాలయానికి ప్రదక్షిణలు, స్వామిని అర్చించే సంప్రదాయం నెలకొంది. పసుపుకొమ్ములు చేతబట్టి ఉదయం, సాయంవేళల్లో స్వయంభువులకు, క్షేత్ర పాలకుడు హనుమంతుడికి పదిహేను ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ.

విష్ణు పుష్కరిణిలో స్నానమాచరిస్తూ స్వామిని స్మరిస్తూ, దర్శించడం వల్ల స్వస్థత పొందవచ్చని భక్తుల విశ్వాసం. అందుకే ఆయనను ‘వైద్య నృసింహుడు’ అని భక్తితో పిలుచుకుంటారు.

మరో ‘రత్నగిరి’

శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాల నిర్వహణ ఈ క్షేత్రంలో మరో ప్రత్యేకత. నిత్యం నాలుగు దఫాలుగా వ్రతాలు జరుపుకునే యాదాద్రి ఆంధప్రదేశ్‌లోని ‘రత్నగిరి’ (అన్నవరం సత్యనారాయణస్వామి)ని తలపిస్తోంది. శ్రావణ, కార్తీక మాసాలలో ఈ వ్రతం ఆచరించేవారి సంఖ్య గణనీయంగానే ఉంటుంది. ఏడాది పొడవునా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు.

ఇంటింటా యాదన్న(మ్మ)

ఆయా క్షేత్రాల పరిధిలోని దేవీదేవతల పేర్లను స్థానికులు పెట్టుకోవడం సర్వసాధారణం. యాదాద్రి నృసింహుని విషయంలో ఆ సంప్రదాయం పాళ్లు కాస్త ఎక్కువనే చెప్పుకోవాలి. తెలంగాణ జనాభాలో అత్యధికులు పురుషులు యాదగిరి, యాదయ్య, యాదన్న, నరసయ్య అని, మహిళలను యాదమ్మ, యాదక్క, నరసమ్మ అనే పేర్లతో కనిపిస్తారు. నలుగురైదుగురిలో ఒకరికైనా ఈ పేరు ఉంటుందని మురిపెంగా చెబుతారు. కాలానుగుణంగా (నవ తరం) పేరు (ఉచ్ఛారణ) మార్చుకుంటున్నా మూలం అదే. యాదాద్రీశుడి పట్ల గల భక్తి భావానికి ఇదో ఉదాహరణ.

రాష్ట్ర ఆధ్యాత్మిక రాజధాని

యాదాద్రి తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక రాజధానిగా రూపుదిద్దుకుంటూ, ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రీశుని ఆలయ పునర్నిర్మాణంతో పాటు వెయ్యి ఎకరాలలో సకల సదుపాయాలతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘ఆధ్యాత్మిక’ నగరం నిర్మిస్తోంది. రూ.1200 కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టిన ఆలయ పునర్ని ర్మాణ బృహత్‌ ‌పథకం పనులు చివరి దశకు చేరాయి. నాలుగు మాడవీధులు, అంతర్‌ ‌బాహ్య ప్రాకారాలు, ఆళ్వారుల విగ్రహాలు, ముఖమండపాలతో ముస్తాబవుతోంది.

ఆధారశిల నుంచి గోపురం వరకు కృష్ణ శిలతో నిర్మించడం, అదీ ప్రపంచంలోనే తొలిసారి కావడం విశేషం. 2014 సంవత్సరం వరకు ‘యాదగిరి గుట్ట’గా ప్రసిద్ధమైన ఈ క్షేత్రం అటు తరువాత అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ‘యాదాద్రి’గా వ్యవహారం లోకి వచ్చింది.

మంగళమ్‌ ‌నారసింహాయ మంగళమ్‌ ‌గుణసింధవే

మంగళం నివాసాయ యాదాద్రీశాయ మంగళమ్‌

– ‌డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE