కేసీఆర్‌ ‌మళ్లీ జాతీయ రాజకీయాల ఊసెత్తారు. మందీ మార్బలంతో కలిసి ముంబై వెళ్లారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ‌ఠాక్రేతో పాటు.. నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అధినేత శరద్‌పవార్‌ను కలిశారు. ఇద్దరితోనూ వేర్వేరుగా సమావేశమై చర్చించారు. జాతీయ రాజకీయాల్లో మార్పులు తెస్తామంటూ ప్రకటనలు చేశారు. ఇద్దరు నేతలతోనూ కేసీఆర్‌ ‌సంయుక్తంగా మీడియా సమావేశాలు నిర్వహించారు. ఈ పరిణామాలు ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి.

తన ముంబై పర్యటన గురించి మీడియాలో విస్తృతంగా కవరేజీ ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు కేసీఆర్‌. ఉత్తరాదిన ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వాన్ని టార్గెట్‌ ‌చేసిన వైనం అందరి దృష్టినీ ఆకర్షించింది.

కేసీఆర్‌ ‌జాతీయ రాజకీయాల నినాదం ఈనాటిది కాదు. గతంలోనూ చాలాసార్లు ఇలాంటి పర్యటనలు చేశారు. దాదాపు నాలుగేళ్లుగా ఈ నినాదాన్ని నెమరేసుకుంటున్నారు. అయితే, ఆ తర్వాత నిశ్శబ్దమైపోతున్నారు. బీజేపీ ముక్త భారత్‌ ‌నినాదంతో దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాన్ని నిలబెడతామని కేసీఆర్‌ ‌పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర పర్యటన సాగింది. అయితే, గతంలో మాదిరిగానే ఈసారి కూడా పర్యటన ముగిసిన వెంటనే ఆ అంశం అటకెక్కు తుందనుకున్నారు. కానీ, మరుసటిరోజు నారాయణ ఖేడ్‌లో జరిగిన సభలోనూ కేసీఆర్‌ ఆ అం‌శాన్ని ప్రస్తావించారు. తనకు తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కావాలని విజ్జప్తి చేశారు. తెలంగాణలో విజయం సాధించినట్టే జాతీయ స్థాయిలో విజయం సాధించేలా దీవించాలని కోరారు.

హైదరాబాద్‌ ‌నుంచి ప్రత్యేక విమానంలో ముంబై వెళ్లిన కేసీఆర్‌ ‌బృందం వెంట ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు బీబీ పాటిల్‌, ‌రంజిత్‌ ‌రెడ్డి, సంతోష్‌ ‌కుమార్‌, ‌రైతుబంధు సమితి చైర్మన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ‌ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఉన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా సీఎం ఠాక్రే ఇంటికెళ్లి మధ్యాహ్న భోజనం తర్వాత రాజకీయ చర్చలు జరిపారు.

దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై, రావాల్సిన మార్పులపై చర్చించామని, ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఇదేనని, దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని కేసీఆర్‌ ఈ ‌సందర్భంగా అన్నారు. హైదరాబాద్‌ ‌రావాలని ఉద్ధవ్‌ ‌ఠాక్రేను కోరానని, ఇంకా అనేక మంది ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతామని తెలిపారు. దేశంలో గుణాత్మకమైన మార్పు అవసరమని, రాబోయే రోజుల్లో కలిసి పని చేయాలని నిర్ణయించామని, త్వరలో హైదరాబాద్‌లో లేదా మరో చోట అందరం నేతలం కలుస్తామని, భవిష్యత్‌ ‌కార్యాచరణపై చర్చిస్తామని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు.

మరుసటి రోజు నారాయణఖేడ్‌ ‌బహిరంగ సభలోనూ కేసీఆర్‌ ‌జాతీయ రాజకీయాల ఆకాంక్ష గురించి మాట్లాడారు. బంగారు భారతదేశాన్ని తయారు చేసేందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని ప్రకటించారు. బంగారు తెలంగాణ ఎలాగైతే తీర్చిదిద్దుకున్నామో.. భారతదేశాన్ని కూడా అలాగే చేసుకోవాల్సిన అవసరముందని వ్యాఖ్యా నించారు. ‘భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా.. ఉండాల్సిన పద్ధతిలో దేశం లేదు. దేశంలో దుర్మార్గమైన వ్యవహారం జరుగుతోంది. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టి పబ్బం గడుపుతున్నారు’ అని విమర్శించారు. అందుకోసమే బంగారు భారతదేశాన్ని తయారు చేసేందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని ప్రకటించారు. ‘దేశం బాగుపడాలంటే జాతీయ రాజకీయాల్లో మనం ప్రముఖ పాత్ర పోషించాలి. అమెరికా కంటే గొప్ప దేశంగా తీర్చిదిద్దుకోవాలి. మనం విదేశాలకు పోవుడు కాదు.. అక్కడి వారు వీసాలు తీసుకుని భారత దేశానికి వచ్చేలా చేసేటంత వనరులు, సంపద, గొప్ప యువశక్తి మనకి ఉన్నది. అందుకే నేను పోరాటానికి బయలుదేరాను. మీ అందరి దీవెన నాపై ఉండాలి’ అని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు.

కేసీఆర్‌ ‌మాటలు వినడానికి బాగానే ఉన్నా.. ఇప్పటికప్పుడు ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి ఏం చేస్తారనే చర్చ సాగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కేంద్రంలోని బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనతో ఉన్నట్టు కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికప్పుడు పడిపోయే సూచనలు కూడా కనిపించడం లేదు. ఒకవేళ కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్‌ ‌కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని అనుకున్నా.. ఎన్నికలకు ఇన్ని నెలల ముందుగా ఓ కూటమిని ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు.. ఎన్నికలకు ఇంత తొందరగా జాతీయస్థాయిలో ఓ కూటమిని ఏర్పాటు చేయడం వల్ల ఎన్నికల నాటికి ఆ కూటమిలో లుకలుకలు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అయితే సీఎం కేసీఆర్‌ ఈ ‌రకమైన వ్యాఖ్యలు చేయడం వెనుక మరో కారణంగా కూడా లేకపోలేదనే వాదన వినిపిస్తోంది. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నానని.. కాబట్టి తెలంగాణకు టీఆర్‌ఎస్‌ ‌తరఫున మరో వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయబోతున్నానని.. తన కుమారుడు కేటీఆర్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టే అవకాశం లేకపోలేదు. కేటీఆర్‌ ‌ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం ఎప్పటి నుంచో సాగుతోంది. అయితే వివిధ కారణాల వల్ల కేటీఆర్‌కు సీఎం పగ్గాలు ఇచ్చే అంశాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారనే ప్రచారం ఉంది. త్వరలోనే యాదాద్రి ఆలయం పునర్‌ ‌ప్రారంభం తరువాత కేసీఆర్‌.. ‌తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అంతేకాదు, గులాబీ అధినేత మరో రకమైన వ్యూహంతో కూడా ముందుకు సాగవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటే.. ముందుగా తెలంగాణలో మరోసారి సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని భావిస్తున్న కేసీఆర్‌.. అం‌దుకోసం మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చని పలువురు లెక్కలు వేసుకుంటు న్నారు. కేసీఆర్‌ ‌పదే పదే జాతీయ రాజకీయాల్లోకి వెళతానని చెప్పడం వెనుక ఈ రెండు అంశాల్లో ఏదో ఒకటి కారణం కావొచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది.

గతంలో చంద్రబాబు కూడా థర్డ్ ‌ఫ్రంట్‌ అం‌టూ బీజేపీ, కాంగ్రెసేతర శక్తులను ఒకే వేదికపైకి తీసుకొచ్చినా విఫలమయ్యారు. ప్రతి విషయంలోనూ చంద్రబాబును విమర్శించే కేసీఆర్‌.. ఆయన ఫార్ములా ఎందుకు ఫాలో అవుతున్నాడన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. మరోవైపు.. చంద్రబాబు గతంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యనేతలను కలిసిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ ‌మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలోనే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలన్న ఆలోచనలు గతంలోనూ జరిగాయని, అవేవీ సత్ఫలితాలు ఇవ్వలేదని ఆయన అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలా భేటీ కావడం కొత్తేమీ కాదని ఫడ్నవీస్‌ అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. బీజేపీయేతర పార్టీల ఐక్యత సాధ్యమయ్యే పనికాదని, ఆ విషయం ఇది వరకే నిరూపిత మైందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కూడా తమ పార్టీయే విజయం సాధించబోతోందని దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆశాభావం వ్యక్తంచేశారు.

– సుజాత గోపగోని, 6302164068, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE