వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైన రచన
– డా।। కనుపూరు శ్రీనివాసులురెడ్డి
మనసంతా చికాకుగా ఉంది. ఏదో తెలియని అసంతృప్తి. అప్పుడప్పుడు గుండెల్ని పిండేసినట్లు అనిపిస్తుంది. ఎందుకు పుడతారు? ఎందుకు అష్టకష్టాలు పడి బ్రతకాలనుకుంటారు? చివరకు దిక్కులేని చావు చస్తారు! ఒకే ఇంట్లో ఉంటూ ఒకరి మీద ఒకరికి ఈ ద్వేషాలు, కుతంత్రాలు, అసహ్యాలు, చాడీలు. పుకార్లు ఎలాంటి తృప్తినిస్తాయి? వయస్సు పైబడగానే అంతేనా, అంటరాని వారేనా? కుప్ప తొట్టిలో పారేసే ఎంగిలి ఇస్తరాకులేనా? దగ్గరవాడిని, ఆత్మీయుడిని సంధి కుదర్చలేని నా పరిస్థితి నాకే అర్థం అయ్యేదికాదు. డబ్బు కూడేసరికి పిల్లల్లో తగ్గిన ఆదరణ, గౌరవం గమనించి కాస్త కలిగించుకోవడం తగ్గించాను.
నడుస్తున్నాను. అడుగులు ఎలా వేస్తున్నానో కూడా తెలియడం లేదు. ఎంత మరిచిపోవాలన్నా గతం, జరిగిన సంఘటనలు.. కోడళ్లు, కొడుకుల మాటలు గుర్తుకు వస్తూనే ఉన్నాయి. నా మీద ఆమెకున్న అభిమానం, ఆప్యాయత ఈ అలంకరణలు మరీ మరీ జ్ఞాపకం చేస్తున్నాయి. త్వరగా వెళ్లి చూడాలి.
‘‘ఏవండీ! మా వాళ్లే! ఈ మధ్య రాకపోకలు లేవు. కానీ మరచిపోలేదు. ఎంత గొప్పగా అలంకరించారండి. స్వర్గాన్ని దించేసారు’’
పొంగుకొస్తున్న గర్వంతో, తోసుకొస్తున్న సంతోషంతో, తబ్బిబ్బు అయిపోతున్నట్లు వినిపించిన ఆ మాటలతో ఈ లోకంలోకి వచ్చి, తిరిగి చూసాను. ఎవరో పెద్దాయన. ఆయనతో మరో ముగ్గురు. నాతో నడుస్తున్నారు. గమనించనే లేదు. ఆనందాన్ని అదుపుచేసుకోలేక పెద్దగా మాట్లాడుతూ మైమరచి అటు ఇటు చూస్తూ నడుస్తున్నారు.
‘‘అబ్బ! ఏం దర్జా? ఎంత వైభోగం? పుడితే అట్లాంటి పుట్టుక పుట్టాలి. మేం ఉన్నోళ్లం కాదు. దూరపు బంధువులమైనా బంధా నికి గౌరవం ఇచ్చి చెప్పారు. పిలవగానే ఏమని కూడా అడగలేదు. అంతే కూడబలుక్కుని అందరం బయలుదేరాం. తక్కువ ఎక్కువలు చూడరండి. అలాంటి వంశం!’’ అన్నాడు, రోడ్డుకు అటు ఇటు చూస్తూ ఇంకో పెద్దాయన. తలలూపారు మిగిలినవాళ్లు. వాళ్ల సంతోషం చూస్తుంటే నాకెందుకో గుండెల్లో అదిమినట్లు అనిపించింది.
అతను చూస్తున్నవైపు చూసాను. రోడ్డుకు ఇరువైపులా నిలువెత్తు ఫ్లెక్స్ కటౌట్లు ఆమె వివిధ భంగిమల్లో ఉన్నవి మెరిసిపోతూ దారినంతా వెలుగు నింపుతున్నట్లు ఉన్నాయి.
ఎంతో సజీవంగా, అందంగా ఉన్నాయి. ఆ ముఖవర్చస్సు దారినంతా వెలుగు నింపుతున్నట్లు అనిపించింది. అలాంటి చిరునవ్వు, ముఖంలో కళ చూసి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో?
‘‘ఆ ఒంటినిండా నగలు, మూర్తీభవించిన ఆదిలక్ష్మిలాగుంది. అడిగిన వారికి మారు మాట్లాడకుండా కోర్కెలు తీర్చే పెద్దమ్మ తల్లిలా ఉంది. చేతులెత్తి దండం పెట్టాలని పిస్తుంది.’’ అన్నాడు పక్కన్నే నడుస్తున్న పెద్దాయన.
పరిశీలించి చూసాను. మెడలో రకరకాల నగలు, గాజులు మోచేతుల వరకు తళతళమెరుస్తున్నట్లు నియాన్ పెయింట్ వేసి అద్భుతంగా ఉంది. ఈ పది పదిహేను సంవత్సరాలలో వేసుకున్నట్టు నేను చూడలేదు.
కానీ ఆమెకు నగల మీద, చీరలమీద విపరీతమైన మోజు. పిచ్చి అని మా అన్న ఎగతాళి చేసి చెయ్యనట్లు అంటుంటే విన్నాను. ఆయన పోయిన తరువాత కోడళ్లు కొడుకులూ ‘‘ఇంకా ఆ పిచ్చి తగ్గలేదు. ఈ వయసులో కూడా సొగసులు. ఎన్ని మారుస్తాది, గుడ్డలు. అబ్బ చూడలేం. అయినా మా అత్తమ్మతో ఎవ్వరూ సరిరారు. ఎప్పుడూ తళతళ మెరుస్తూ ఉండాల, చీమిడి కారుతున్నా!’’ అనే చలోక్తులు చాటుగా అనడం కూడా విన్నాను. ఆమె ఎదురుగా ఎంతో అణుకువగా, ఆప్యాయంగా ఉండేవారు. ఎందుకంటే ఆస్తి అంతా ఆమె పేరు మీదనే ఉంది కదా!
‘‘నిజంగానండి. మేమూ విన్నాం. కొడుకులు, కోడళ్లు ఆమె మాటకు ఎదురు మాట్లాడేవాళ్లు కాదంట కదండీ. కాలు కింద పెట్టనివ్వకుండా కోడళ్లు అడుగులకు మడుగులొత్తే వాళ్లంట కదండీ.’
శని…శని!! ఉలిక్కి పడ్డాను. ఎక్కడో ఈ మాటలు పదేపదే విని ఉన్నాను.
‘అదేనండి! శనీశ్వరుడు, ఆ తల్లి ఇంట్లో అడుగు పెట్టనన్నా పెడతాడా? ఆ లక్ష్మీకళ చూస్తుంటే! పోనన్నా పోలేదు. మొండి ప్రాణం. ఆ కాలూ చేయీ పడిపోయి కొంచెం తగ్గింది కానీ, అబ్బ అన్నీ ఉంటేనా?’ కోడళ్లు నవ్వుతూ విసిరే విసుర్లు. ‘ఏం ఎత్తుకు పోతుందో పోయేటప్పుడు! దరిద్రపుగొట్టుది.’ అనే వెటకారాలు, చాలా మెత్తగా, సూటిగా వదిలే చతురోక్తులు చాలా దాచుకున్నాను.
‘‘అంత దృఢమైన శరీరంతో కాస్త కూడా వయస్సు కనిపించకుండా ఉంది. చూడు.. చూడు ఆ నవ్వు!! నోట్లోంచి మాట రాదంట, అంత స్థిమితం తల్లికి… చెప్పుకుంటుంటే విన్నాం. ఏందో మావా! ఇప్పటికి కుదిరింది ఆ తల్లి దర్శనం చేసుకునే అదృష్టం?’’
ఇంత వయసు వచ్చిన తరువాత కూడా వారం వారం ఒళ్లంతా పసుపు పూసుకుని, నువ్వులనూనెతో తలంటు చెయ్యాల. ఆరునూరయినా, గాలి వానయినా అదిమాత్రం తప్పకూడదు. అయ్యేదాకా నసుగుతూనే ఉంటుంది. పనోళ్లని నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. ఈ కాలంలో ఎవరు పడి ఉంటారు? నోరు కూడా పడిపోయి ఉంటే పీడా వదిలుండేది. దుప్పట్లు రోజూ మార్చందే ఒప్పుకోదు!
పళ్లు తోముకోవాలంటే పేస్టూ ఇవ్వరు. అడిగి అడిగి పళ్లపొడి తెప్పించుకుంటా! దుప్పట్లు కంపు కొడుతున్నా నెలల తరబడి మార్చరు. నాకా కాలూ చెయ్యీ బాగులేకపోయా. అట్లాగే ఆ కంపులోనే పడి ఉండేది అలవాటు అయిపోయింది. మళ్లీ వాళ్లే కంపు కంపు అని అసహ్యించుకునేది. నీకు తెలుసుకదా నేను ఎంత శుభ్రంగా ఉండే దాన్నో!!
‘‘ప్రతిదీ శుభ్రంగా, పద్ధతిగా ఉండాలంట కదండీ. భోజనం దగ్గర కూడా సమయం తప్ప కూడదంట కదండి. అందుకే అంత ఆరోగ్యంగా, సంతోషంతో వెలిగిపోతుంది.’’
‘‘చావు కళ. వంటింట్లో దొంగతనంగా మేం వచ్చేలోగా దొరికింది గుటుక్కు గుటుక్కు మింగేస్తుంది! ఏం కక్కుర్తో? దేన్నీ వదిలిపెట్టదు.’’
‘‘భర్తకు, బిడ్డలకు పెట్టిగాని తను మెతుకు ముట్టదంట కదండీ.’’ ‘‘కొంచెం కూడా మిగల్చదు. దాచిపెట్టేసుకుంటుంది.’’
ఎవరికి ఇవ్వడానికి? నేను విన్నానా, అను కున్నానా? నాలో పొరలు పొరలుగా ఆవేదన గుమికూడింది. అటు ఇటు చూసాను. నడుస్తున్న వాళ్లు ఈ లోకంలో లేరు. ఏదేదో మాట్లాడుతూ భ్రమిసి పోతున్నారు. భ్రమలో బతికే బతుకే అందంగా, హరివిల్లులా ఉంటుంది. ఎవరిది?
వారం వారం తిరుపతి కొండకు పోయి వచ్చేది. రాగానే వాసి పోయినట్లు కోడి, పంది, చేపలు! భక్తి లేదు. భయం లేదు. రోజూ మెక్కుతున్నారు కదా ఒక్కరోజు మానేస్తే ఏవంట. ఆ దేవుడికి బొచ్చు ఇచ్చి బోడిగుండుతో పది లడ్లు, పులిహోర, పొంగలి గంపకు తెచ్చాం కదా. తినకపోతే ఏమైనా అను కుంటాడు. పాపం అంటూనే బుట్టలు ఖాళీ చేసేది. ఒక్కరవ్వ, చిటికెడు కూడా నా ముఖాన కొట్టరు. పోనీ వాళ్లనే చల్లగా చూడనీ. ఒక్కసారి తీసుకు పొండిరా అని బ్రతిమిలాడినా మా నెత్తి నెక్కు అని కసుర్లు. ఎన్ని మొక్కులు తీర్చాను వాళ్లకు ఆరోగ్యం బాగలేకపోతే. నడిచి, ఉపవాసాలుండి, ఆ క్యూలో నేల మీద పడుండి. ఇప్పుడు కుక్కను చూసినట్లు…!
ఎవరు? ఎవరు?
మేమే! ఏం చెయ్యమంటారు టార్చరు భరించ లేకుండా ఉన్నాం. నిమిషం ఆలస్యం కాకూడదు. మరీ చీదరించుకుంటుంది. నిలవనివ్వదు. ఖర్మ ఖర్మ.. నిమిషం సంతోషంగా!? మేం ఏం తింటే అది ఆమెకు కావాలి. ఎట్లా? షుగరు, బి.పి., పక్షవాతం!
‘‘కోడళ్లు కన్నతల్లిలాగా చూసుకుంటారంట కదండీ. ఆ తల్లి చేసుకున్న పూర్వ జన్మ పుణ్యం!’’
తప్పక పోవాల్సిన పెండ్లిళ్లు, చాలా ప్రయా ణాలు అన్నీ చివరి క్షణంలో బిడ్డలకోసం ముగించు కున్నాను. ఇప్పుడో! ఆసు పత్రికి తీసుకు పొండిరా అని చెప్పి నాలుగు నెలలైంది. కొంచెం దూరం నడిస్తే కాళ్లునొప్పి, వాసిపోతు న్నాయి. ఆయాసం వస్తుంది అని. రోజు మార్చి రోజు పెళ్లాలతో గుడ్డలు కొనా లని, చెప్పులు కొనాలని మద్రాసు పోతూనే ఉన్నారు. తెచ్చింది దాచిపెట్టుకుని తింటారేగాని మెతుకు రాల్చరు!
‘‘ఆమెకు పెట్టిన తరువాతనే ఏదయినా మిగిలితే తింటారంట కదండి. అందుకే డెబ్భై సంవత్సరాలు?’’
ఆయన పోయినప్పటినుంచి ఎందుకులే? ఆకలికి తట్టుకోలేకపోతున్నా! అడిగితే ఉదయం గిన్నెడు ఇడ్లీలు తింటివే, లీటర్ పాలు తాగితివే! వంట కాబల్లా చేస్తున్నాం. అదేం కడుపా పందుల గుంటా! రాకాసి ఆకలో!?
‘‘అబ్బ! తల్లి ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధండి. అదృష్టం అంటే ఆమెదండి మొగుడు పోతే మాత్రం ఏవండి ఈ జరుగుబాటు, ఈ స్వర్గం ఎక్కడ వస్తుంది. నిజంగా! అలా చూసే పిల్లలకు అన్నీ కలిసొ స్తాయండి.’’
‘‘ఈ పండక్కి దేశదేశాల నుంచి అందరూ వచ్చేసి ఉంటారనుకుంటాను.’’ అని నా వైపు చూసారు.
‘‘ఊఁ…ఆ అందరూ రాలేదండి. వాళ్లకోసం?’’ ఏ ఒక్కరూ రాలేదని నాకు తెలుసు. ‘‘అంతరిక్ష ప్రత్యక్ష?’’
‘‘ఏవిటి… ఏవిటి! టీవీలో ప్రత్యక్ష ప్రసారం. అబ్బ.. అబ్బ అక్కడుండే బిడ్డల కోసం. జన్మ ధన్యం’’.
వీళ్లకు పొట్ట పొడిస్తే అక్షరం రాదు. ఏదో ఆయన ఉండబట్టి, వాళ్లను వీళ్లను బట్టి ఆ మట్టి పనులు, కంకర పనులు ఇప్పిస్తే. ఏదో కలిసొచ్చి కంట్రాక్టుల్లో కోట్లు కోట్లు. పెళ్లాలతో షికారులు, విందు భోజనాలు. ఆకలి…ఆకలి.. ఏదయినా తెప్పించుకోవాలని పిస్తుంది. పైసా ఇవ్వరు. గుడ్డలన్నీ పాతబడి చిరిగిపోయి ఉన్నాయి. కొనివ్వండిరా అంటే..!!
‘‘రెండు బీరువాల నిండా పట్టు చీరలు. వేసుకునే నగలకు ఒక ఇనప్పెట్టి. అబ్బ ఏం రాజసమండి!’’
బీరువాలో ఉండేటివన్నీ బయట తీసిపారేశారు. పట్టుచీరలన్నీ తీసేసుకున్నారు. ఆ చెత్త అంతా ఎందుకు? సోకెందుకు నీకు అని?
‘‘మనసుండాలి. అందులో తల్లికి చిటికెడు మెతుకులు పెట్టని కర్కోటకులున్న రోజుల్లో అబ్బా.. ఆహా.. ఓహో…ఎంత మంచి బిడ్డలో? ఆ తల్లి పెంపకం. పుణ్యంకొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు!!
ఇంతలో ఆకాశంలో నెత్తి మీదుగా విమానం శబ్దం వినిపించింది. అందరూ తలెత్తి చూసారు.
‘‘బాబోయ్! ఇదేంటి మావా! నెత్తిన పడేటట్టు. భయపడి చస్తినే!’’
చూసాను. హెలికాప్టర్ చాలా కిందగా మా పైనుంచి వెళ్లింది.
‘‘మావా.. మావా! అటు చూడు. దాన్లో నుంచి ఆ ఇంటి మీద ఏదో పోస్తున్నరు మావా!’’
‘‘అవున్రో! నిజమే! పూలు.. పూలురా! ఆ తల్లి ఇంటి మీద, ఊరంతా.. అబ్బ- అబ్బ! భూలోకంలో కనీ విననంత వైభోగం.
మావా! ఆ తల్లి కీర్తి, యుగయుగాలు శాశ్వతం. ఆ తల్లి పుణ్యాన మన జన్మ పావనం అయ్యింది. పద…పద త్వరగా! జనాలు.. జనాలు!! చూడగలమో లేదో?’’
పక్కనే కారొకటి వచ్చి ఆగింది. తిరిగి చూసాను. డ్రైవర్ నన్ను చూసి, ‘‘వస్తారా సార్?’’ అని అడిగాడు.
‘‘నువ్వు వెళ్లు. నేను వస్తాను.’’ అని మళ్లీ ‘ఎవరు?’ అని అడిగాను కారులోకి చూస్తూ..
‘‘హరికథ చెప్పేవాళ్లు సార్! చాలా పెద్దోళ్లు అంట. హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వచ్చారు. మద్రాసుకు పోయి తీసుకు వస్తున్నా!’’ అని వెళ్లిపోయాడు.
పక్కకు తిరిగి చూసాను. వస్తున్న వాళ్లు ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని నన్ను చూసారు.
‘‘హరికథ.. మద్రాసు.. హైదరాబాద్.. అబ్బా.. తప్పక వినాల్సిందే! అయినా అది కర్మక్రతువులు అయిన తరువాత కదా?’’ అనుమానంగా నా వైపు అందరూ చూసారు. వెంటనే, ‘‘ఏమో చేస్తారేమో?’’ అన్నారెవరో!
‘‘నీ ముఖం. ఇవన్నీ చేసినప్పుడు అది లేకుంటే ఎలా? ఊళ్లో జనాలు కూడా దీవించాలి కదా!’’
‘‘అది నిజమే! గొప్పోళ్లు కదా! ఏంచేసినా చెల్లిపోతుంది!’’ అన్నాడు మరొకతను.
‘‘అవును నిజమేరో! పుట్టిన దినమైతే ఏమి, గిట్టిన రోజయితే ఏమి? పుణ్యం పుణ్యమే! ఎంత గొప్ప! ఆ తల్లికే గాకుండా ఊరందరికీ వైకుంఠం. ఎంత దొడ్డ మనసు.’’ చేతులెత్తి ఆకాశానికి దండం పెట్టాడు ఒకతను.
శని…శని.. ఆ పిల్లలకు ఏదైనా ఉంటే పీడా వదిలింది!
‘‘ఛీ… ఛీ! నోరు, చెవులు, మూసుకో. కళ్లు పోతాయి.’’
‘‘వోప్పనాసోల్లు! కుళ్లు! ఏదంటే అది కూస్తాయండి ఆ కాకులు.’’
ఇంతలో మరో ట్రాక్టర్ ఓ పెద్ద సింహాసనం లాంటి కుర్చీ పెట్టుకుని వెళ్లింది.
‘‘ఎక్కడికడీ! ఆమెను ఊరేగించడానికా?’’ ఆశ్చర్యంగా అడిగాడు ఒకతను.
‘‘నీ ముఖం. కూర్చోపెట్టి పూజ చెయ్యడం కోసం. ఆమె ఆశీస్సుల కోసం జనాల తోపులాట. చేసిన పాపాలన్నీ హరించి అక్కడికక్కడే? అటు చూడు, జనాలు ఎలా పరుగులు తీస్తున్నారో? బట్టలు ఇస్తారేమో?’’
‘‘అబ్బ! న భూతో న భవిష్యతి. పుడితే అటువంటి పుట్టుక పుట్టాలి. ఇప్పుడే ఆమె కాళ్ల ముందుపడి చావాలని ఉంది.
స్వర్గంలో అనుభవించేది ఇక్కడే అనుభవిస్తుంది. స్వర్గభోగం.. స్వర్గభోగం అంటే ఇదే మావా. ఎంత అదృష్టం. ఎంత అదృష్టం!’’ నాతో వస్తున్న తను ఉబ్బితబ్బిబ్బు అవుతూ అన్నాడు.
ఛీ..ఛీ … నీ ముఖం చూస్తేనే దరిద్రం. ఎప్పుడూ ఏడుపు ముఖం వేసుకుని గోరీకాడ నక్కలా!
‘‘అదేవిటండి అలా మాట్లాడతారు.’’
ఆశ్చర్యంగా నన్ను ప్రశ్నించాడు. నేను కాదు అన్నట్లు తలూపాను. మరి ఎవరన్నట్టు చుట్టూ చూసి ఎవరూ కనిపించకపోతే ఆకాశంలోకి చూస్తూ చెంపలేసుకున్నాడు. అదెవరన్నారో నాకు తెలుసు.
ఊరి దగ్గరకు వచ్చాం. మైకులో నుంచి ఘంట సాల గారి భగవద్గీత, మధురంగా, హృదయాలను కదిలించేటట్లు ఆమడదూరం! నాతో వస్తున్న వాళ్లు ఒకరి ముఖాలు ఒకరు అనుమానంగా చూసుకుని మాట్లాడుకుంటున్నారు. ‘‘సార్! ఆ మహానుభావుడు నేరుగా స్వర్గానికి పోయి ఉంటాడు కదా?’’ తెలియదు అన్నట్లు పెదవి విరిచాను.
జాతస్య హిధ్రువో మృత్యుః ధ్రువం జన్మ.. పుట్టిన వానికి మరణం తప్పదు. మరణించిన వానికి మరుజన్మ! ముగ్గరూ ఉలిక్కి పడ్డారు. ఉన్నట్లుండి ఒకతను, ‘‘పుట్టిన రోజున చావు సంగతి ఎందుకండీ? ఇదేదో కొత్తగా ఉందే!?’’ అంటూ నన్ను అగమ్య గోచరంగా చూసాడు. అతని చూపుకు సమాధానం?
దగ్గరకు వెళ్లాం. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్లు నోరుతెరిచి రాళ్ల లాగా నిలిచిపోయాం.
ఏ ఒక్కరూ దగ్గర లేరు. ఎన్నో తినుబండారాలు నిగనిగలాడుతున్న వెండి గిన్నెలలో ఒక పక్కన దూరంగా ఉంచారు. ఒక మనిషి, పెద్ద గుడ్డ కర్రతో ఈగలు తోలుతోంది. ఆమెకు కాదు, ఆ ఫలహారాలకు! ఆడంగులు, కోడళ్లు చాలా దూరంగా కూర్చుని అందరితోనూ చెబుతున్నారు. ‘‘మా అత్తమ్మకు నూజివీడు రసాలు, బందరు లడ్డు, బాదం బర్ఫీలు, కాకినాడ కాజాలు, కోనసీమ పూతరేకులు అంటే చాలా ఇష్టం. అంతదూరం మనుషుల్ని పంపించి తెప్పించాం..’’ మెడనిండా దిగేసుకున్న నగలతో పట్టుచీరల మడతలు చూసుకుంటూ అందరూ వినేటట్లు చెపుతున్నారు, కాదు అరుస్తున్నారు.
‘‘అంతా ఈ రోజేనా అండి?’’ అని అడిగారు ఎవ్వరో?
‘‘ఆ…ఆ ఈ రోజే! ఎంత సేపు కాలబోతుంది. వెంటనే అదీ జరిపిస్తే ఒక శని… ఆహా! ఒక పని.. అట్లా అని కాదు, ఖర్మ వదిలిపోతుంది. తీరిక ఎక్కడ? అస్తికలు గంగలో కలపాలనుకున్నాం. టైం లేదు. కానీ ఎప్పుడో బుక్ చేసాం దుబాయికి. ఈమె వల్ల? టూరు, అందరికి కాస్త విశ్రాంతి! అప్పుడే పోయేటట్లు అందరికీ ఫోన్లు చేసేది.. బ్రతికేది.. ఎప్పుడు చస్తుందా.. అలిసిపోయాం ’’ ఆమె చేతికూడు తిన్న కొడుకులు.
నాతో వచ్చిన వాళ్లకు నోరు పడిపోయింది. పిచ్చిగా అయోమయంగా అట్లాగే చూస్తుండి పోయారు. నేనే కదిలించాను.
బిత్తరపోయినట్లు నన్ను చూసి ఆ పూలతో మునిగిపోయిన ఎముకల పోగు శవానికి వణుకుతూ దండం పెట్టారు!!
మెల్లగా నా చెవిలో ‘‘ఏమవుతుంది, సార్ మీకు.’’ అడిగారు.
‘‘వదిన!’’ నా కళ్లల్లో నిండిన కన్నీళ్లు చూసి, జల్లున జారాయి కన్నీళ్లు వాళ్ల కళ్లలో నుంచి!
‘‘పవిత్రానాయ సాధూనాం వినాశాయ..?’’
ఎప్పుడు? ఎక్కడ?
‘‘..ధర్మసంస్థాపనార్ధాయ!!’’