ఈ పరిణామం గురించి చర్చించేటప్పుడు మొదట వేసుకోవలసిన ప్రశ్న- గడచిన వందేళ్ల నుంచి ఈ దేశంలో మెజారిటీ ప్రజల జీవన విధానాన్ని, అంటే హిందూత్వను అదేపనిగా దూషించే పనిలో ఉన్న పార్టీ నాయకుడు దేశానికి నాయకత్వం వహించడం ఎంతవరకు సబబు? కొత్త కూటమి నేపథ్యంలో ఇదే కనిపిస్తున్నది. ఈసారి కూటమి నిర్మాణానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఉత్సాహపడుతున్నారు. అది బీజేపీకి ప్రత్యామ్నాయమట. దానికి ఆయన పెట్టిన పేరు సామాజిక న్యాయం కోసం కూటమి. డీఎంకే అనే హిందూ వ్యతిరేక, హిందీ వ్యతిరేక ద్రవిడవాద ప్రాంతీయ పార్టీ కొత్త అవతారంతో మొత్తం దేశాన్ని కలుషితం చేయాలని అనుకుంటున్నది. స్టాలిన్ భావజాలం, డీఎంకే చరిత్ర చూస్తే ఈసారి సామాజిక న్యాయం నినాదంతో హిందూ వ్యతిరేక అజెండాను జాతీయ స్థాయిలో అమలు చేయాలన్న దుర్బుద్ధితో పాచికలు వేస్తున్నదని అనిపిస్తుంది. ప్రస్తుతం హిందూ ధర్మం మీద జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కొందరు వినిపిస్తున్న అబద్ధాలు, హిందూత్వ మీద జరుగుతున్న వ్యతిరేక ప్రచారం, ఒక వర్గం మీడియా సృష్టించిన వాతావరణం తన రంగప్రవేశానికి సహకరించే విధంగా ఉన్న తరుణంలో స్టాలిన్ ప్రయత్నం ఆరంభించారు. మమత, కేజ్రీవాల్, అఖిలేశ్‌లకు పోటీగా ఇప్పుడు ప్రధాని పదవికి స్టాలిన్ కూడా బరిలో దిగారు.
కాంగ్రెస్ మరణశయ్య మీదకు చేరిన తరువాత ప్రాంతీయ పార్టీల ఆశలకు అంతే లేకుండా పోయింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు గల్లంతయి పోతోంది. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా బీజేపీ వర్సెస్ ప్రాంతీయ పార్టీ మధ్యే పోటీ. కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలకు తోకగా, సీట్ల కోసం దేబరి స్తోంది. ఈ వాతావరణంలోనే కొందరు తృతీయ ప్రత్యామ్నాయం అంటూ రగడ చేస్తున్నారు. ప్రజలు మాత్రం గత అనుభవాలను బట్టి మూడో కూటమిని ప్రహసనప్రాయంగా చూస్తున్నారు. కానీ ఈసారి ఇలాంటి ప్రయత్నాల వెనుక ప్రమాదకర వ్యూహం ఉంది. ప్రస్తుతం తిరుగులేని రాజకీయ, సామాజిక శక్తిగా ఉన్న బీజేపీ ప్రత్యర్థి స్థానాన్ని హిందూ వ్యతిరేక శక్తులతో భర్తీ చేయాలన్న నీచమైన యుక్తి చాలామందికే ఉంది. ఇప్పుడు దీనికి కేంద్రబిందువు స్టాలిన్.
1989లో నేషనల్ ఫ్రంట్, 1996లో యునైటెడ్ ఫ్రంట్‌ల ప్రయోగాలు విఫలమయ్యాయి. కాంగ్రెస్ వ్యతిరేక ఓటుతో గెలిచిన పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా కూటములు ఏర్పాటు చేశాయి. ఇందుకు మళ్లీ కాంగ్రెస్ మద్దతు తీసుకోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. చివరికి బీజేపీ నేతృత్వం లోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ), కాంగ్రెస్ నాయత్వంలోని యునైటైడెట్ పోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) మాత్రమే మిగిలాయి. యూపీఏ చతికిలపడటంతో ఎన్‌డీఏ యేతర పార్టీలు మళ్లీ తృతీయ కూటమి కోసం అర్రులు చాస్తున్నాయి. బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాలేనప్పుడు, ఆ స్థానాన్ని తామే ఎందుకు భర్తీ చేయకూడదనే దురాశ కూడా ప్రాంతీయ పార్టీల నాయకులలో ఉంది.
జాతీయ రాజకీయా ఉబలాటం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి బలంగా ఉంది. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కూటమిని మమత బాహటంగానే వ్యతిరేకించారు. రాహుల్ నాయకత్వంపై నమ్మకం లేదని చెప్పకనే చెప్పేశారు. చేసే ప్రయత్నం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్ నాయకులు పార్టీని జాగ్రత్తగా చూసుకుంటామని హామీ ఇస్తే తాను రాష్ట్రం వెలుపల పనిపై దృష్టి సారిస్తానని, దేశవ్యాప్తంగా టీఎంసీని విస్తరిస్తానని చెబుతున్నారు మమత. పార్టీ అధ్యక్షురాలిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఇవన్నీ ఆమె మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలన్నీ కలసి 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌దీ ఇదే మైండ్ గేమ్. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సర్వేలు ‘ఆప్’లో ఉత్సాహాన్ని పెంచాయి. టీఎంసీ, ఆప్ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న గోవా మీద దృష్టి పెట్టాయి. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో తృతీయ కూటమి ఏర్పాటు చేస్తానంటూ కొన్ని రాష్ట్రాలు చుట్టి వచ్చారు. ఆ నాయకులంతా పైకి సానుకూలత వ్యక్తం చేసినా ఎన్నికల ముందు మొహం చాటేశారు. వీరిలో మమత ఒకరు. రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఇంకా కలలు కంటూనే ఉన్న కేసీఆర్ మరోసారి బీజేపీ, కాంగ్రెసేతర కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నా రుట. ఇటీవల కేసీఆర్ తమిళనాడు వెళ్లినప్పుడు స్టాలిన్‌తో సమావేశయ్యారు. వామపక్ష నేతలు హైదరాబాద్ వచ్చినప్పుడూ వారిని ఎడ్యుకేట్ కానీ ప్రతిపక్ష ఓట్లు చీలితే బీజేపీ లబ్ధి పొందుతుందని కాంగ్రెస్ హెచ్చరిస్తోంది.
ఈ నేపథ్యంలోనే తృతీయ ప్రత్యామ్నాయం ఆటలోకి కొత్త ఆటగాడు వచ్చాడు. గత ఏడాది ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి పదవిలో ఇంకా కుదురుకోకముందే మమత, కేసీఆర్ తరహాల్లో స్టాలిన్ కూడా కేంద్రంతో గిల్లికజ్జాలు మొదలుపెట్టారు. హిందీ భాషను వ్యతిరేకించడం, దేశ వ్యాప్తంగా నిర్వహించే నీట్ (మెడిసిన్) ప్రవేశపరీక్షను వ్యతి రేకించడం ఇందులో భాగమే. బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా తృతీయ కూటమికి నాయకత్వం వహించాలన్నదే స్టాలిన్ ఆశ. దేశం మతోన్మాదుల గుప్పిట్లోకి వెళ్లే ప్రమాదంలో ఉందని, మతోన్మాదుల నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందంటూ దేశ వ్యాప్తంగా 37 పార్టీల అధినేతలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
సామాజిక న్యాయ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తాను ఏర్పాటు చేస్తున్న ‘ఆల్ ఇండియా సోషల్ జస్టిస్’(అఖిల భారత సామాజిక న్యాయ సమాఖ్య)లో చేరాలంటున్నారు స్టాలిన్. ఈ గణతంత్ర దినోత్సవానికి ఈ సమాఖ్య ఏర్పాటును ప్రకటించారు.‘జాతీయ స్థాయిలో సమాఖ్య విధానం, సామాజిక న్యాయసూత్రాలను సాధించే దిశగా కృషి చేసేందుకు అన్ని పార్టీల నాయకులు, పౌర సమాజ సభ్యులు, భావసారూప్యత కలిగిన వ్యక్తులు, సంస్థలు కలిసి ఉమ్మడి వేదికగా ఒక ఫెడరేషన్ తప్పనిసరిగా ఏర్పడింది. ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరిది అనే సామాజిక న్యాయ భావజాలాన్ని ప్రతి ఒక్కరూ ఆర్థిక, రాజకీయ, సామాజిక హక్కులు, అవకాశాలకు అర్హులని ఈ భావజాలం నమ్ముతుంది. ఈ సమాన అవకాశాలను అందజేసినప్పుడే మన రాజ్యాంగ నిర్మాతల దృష్టిలోని సమానత్వ సమాజాన్ని నిర్మించగలం. మండల్ కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి ఏవిధంగా పోరాటం చేశామో.. అదే విశ్వాసం, ధ్యేయంతో ఏకం అవుదాం’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇంతకీ స్టాలిన్ ఎవరెవరికి లేఖ రాశారు? సోనియాగాంధీ (కాంగ్రెస్), లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్‌జేడీ), అఖిలేశ్ యాదవ్ (ఎస్‌పీ), మాయావతి (బీఎస్‌పీ) ఫరూక్ అబ్దుల్లా (జేకేఎన్‌సీ), మహబూబా ముఫ్తీ (పీడీపీ), శరద్ యాదవ్ (ఎన్‌సీపీ), ఉద్దవ్ ఠాక్రే (శివసేన), రాజ్ ఠాక్రే (ఎంఎన్‌ఎస్), మమతా బెనర్జీ (టీఎంసీ), దేవెగౌడ (జేడీఎస్). డి. రాజా (సీపీ), సీతారాం ఏచూరి (సీపీఎం), కె.చంద్రశేఖర రావు (టీఆర్‌ఎస్), జగన్మోహన్ రెడ్డి (వైసీపీ), చంద్రబాబు నాయుడు (టీడీపీ), పవన్ కల్యాణ్ (జనసేన), నవీన్ పట్నాయక్ (బీజేడీ), అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), హేమంత్ సొరేన్ (జేఎంఎం), రంగస్వామి (ఎన్‌ఆర్ కాంగ్రెస్), లలన్ సింగ్ (జేడీయూ) వేలప్పన్ నాయర్ (ఏఐఎఫ్‌బీ), అసదుద్దీన్ ఓవైసీ (ఎంఐఎం), కేఎం ఖాదర్ మోహిద్దీన్ (ఐయూఎంఎల్), రేణూ జోగి (జనతా కాంగ్రెస్), అమరీందర్ సింగ్ (పంజాబ్ లోక్ కాంగ్రెస్) సుఖ్బీర్ సింగ్ బాదల్ (ఎస్‌ఏడీ), చిరాక్ పశ్వాన్ (లోక్‌జన శక్తి), ఓంప్రకాశ్ చౌతాలా (ఐఎన్‌ఎల్‌డీ).
తమిళనాడు ప్రతిపక్ష నేతలను కూడా ఆహ్వానించారు స్టాలిన్. అన్నాడీఎంకే కో-ఆర్డినేటర్ పన్నీర్‌సెల్వం, పీఎంకే అధినేత రాందాస్, వీసీకే నేత థోల్ తిరుమవలన్, వైగో, ఎంహెచ్ జవహ రుల్లాలకు కూడా లేఖ రాశారు. కుహనా సెక్యులర్ వాదులు, హిందూ వ్యతిరేకుల చెవులతో వింటే ఇదంతా బాగానే ఉంది. అందుకే జాతీయ స్థాయి పతాక శీర్షికల్లో నిలుస్తున్నది. కానీ స్టాలిన్ లేఖ ఎవరిని కలపగలదు? ఉదాహరణకు మహారాష్ట్రకు చెందిన శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే. ఆంధప్రదేశ్‌లో జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్, మాయావతి. జమ్మూ కశ్మీర్‌లో ఫరూక్, మహబూబా. పంజాబ్‌లో అమరీందర్, సుఖ్బీర్! ఎవరిని కలుపుతుంది?
కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా టీఎంసీని నిలపాలని మమత భావన. అంటే స్టాలిన్ ఊహకు సమాంతరంగా ఆమె మరో మార్గంలో వస్తున్నారు. కాబట్టి మమతతో ఎలా కలసి పని చేయగలరో స్టాలినే చెప్పాలి. బీజేపీ వ్యతిరేకత మాట దేముడెరుగు! తెలుగునాట జగన్, చంద్రబాబును స్టాలిన్ కలపగలరా? తమిళనాడుతో డీఎంకే ప్రధాన ప్రత్యర్థి అన్నాడీఎంకేకు స్టాలిన్‌తో కలిసి పని చేయాల్సిన అవసరం ఏమిటి? ఇక కేరళ మినహా ఎక్కడా ఉనికి లేని వామపక్షాలను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లే. ఒక తెలుగు దినపత్రిక అయితే ఈ కూటమి గురుంచి మరీ అత్యుత్సాహంగా రాసేసింది. కేసీఆర్, స్టాలిన్, మమతల ఫొటోలు పెట్టి ‘ముగ్గురు ముఖ్యమంత్రుల సరికొత్త రాజకీయం.. ఢిల్లీయే లక్ష్యం’ అంటూ సాగిందా కథనం.
తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నీట్ విషయంలో రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి, సీఎం స్టాలిన్ మధ్య విభేదాలు తీవ్రమైనాయి. ఐదు నెలల క్రితం నీట్ పరీక్ష నుంచి రాష్ట్రానికి మినహాయింపును ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ బిల్లును గవర్నర్ తిప్పి పంపించడంతో వివాదం ముదిరింది. గవర్నర్ నీట్ బిల్లును 142 రోజుల పాటు తనవద్దే ఉంచుకొన్నా రని, సరిగ్గా మెడికల్ అడ్మిషన్లు ప్రారంభమైన సమయంలోనే పంపించారని స్టాలిన్ ఆరోపించారు. ఈ బిల్లును తిరిగి గవర్నర్‌కు పంపాలని ఈ అంశం మీద నిర్వహించిన అఖిలపక్షం ఏకగ్రీవంగా తీర్మానించింది. డీఎంకే నాయకులు గవర్నర్ రవి నిర్ణయాన్ని ఖండిస్తూ, ట్విట్టర్‌లో ‘గెట్ అవుట్ రవి’ అనే హ్యాష్ ట్యాగ్‌తో నిరసన వ్యక్తం చేశారు.ఫెడరల్ వ్యవస్థకు ప్రతీక అయిన గవర్నర్‌తో ఘర్షణ పడడం ఇప్పుడు తీవ్రమవుతున్నది. బీజేపీతో వైరాన్ని కేసీఆర్, స్టాలిన్, మమత, పినరయ్ ఇదే రీతిలో వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ సామాజిక న్యాయం నినాదం అందుకోవడానికి డీఎంకేకు ఉన్న నైతిక హక్కు ఏమిటి? దేశవ్యాప్త సామాజిక న్యాయం కోసం నినాదం అందుకున్న డీఎంకే కొన్ని కులాలనే లక్ష్యంగా చేసుకున్న మాట ఇప్పుడు అంతా గుర్తు చేసుకోవాలి. ద్రవిడవాదం ఎస్సీలను నిర్లక్ష్యం చేసిందన్న చారిత్రక సత్యానికి ఇంతవరకు దిద్దుబాటు చర్యలూ లేవు. ద్రవిడ కజగం వ్యవస్థాపకుడు, నేటి డీఎంకే పార్టీ ఆవిర్భావానికి మూలకారకుడు పెరియార్ ఈవీ రామస్వామి నాయకర్ ప్రధానంగా హిందూ వ్యతిరేకి. మార్క్సిస్టులు, ఉదారవాద చరిత్రకారుల దృష్టిలో, పెరియార్ ఒక సామాజికవేత్త. బ్రాహ్మణత్వం, కుల ప్రాబల్యం, మహిళల అణచివేత వంటి దురాచారాల నుంచి దేశాన్ని రక్షించిన యోధుడు. నిజానికి కులవ్యవస్థ నిర్మూలన పేరుతో హిందూ వ్యతిరేకతను నూరిపోసిన జాత్యాహంకారి ఆయన. కేవలం బ్రాహ్మణుల నిర్మూలనకు, తద్వారా హిందూ సమాజ విచ్ఛిన్నం కోసమే పెరియార్ ఉద్యమాన్ని నడిపించాడంటే అతిశయోక్తి కాదు. 1953లో వినాయక విగ్రహాలను ధ్వంసం చేయడం కోసం ఆందోళనలు నిర్వహించాడు. రాముడిని దుర్భాషలాడాడు. రాముడు మహిళలను చంపి, ముక్కలు చేశాడని అబద్ధాలు ప్రచారం చేశాడు. ఒక సందర్భంలో నెహ్రూ, గాంధీ చిత్రపటాలతో పాటు భారత రాజ్యాంగాన్ని కూడా తగులబెట్టాలని పిలుపునిచ్చాడు. పెరియార్ స్త్రీ వ్యతిరేకి. ద్రవిడార్ కజగ•మ్ అధికారిక పత్రికలో అనేకసార్లు స్త్రీవాదానికి వ్యతిరేకంగా వ్యాసాలు రాశాడు. అంటే ఫెడరల్ వ్యవస్థకీ, భారతీయ సామాజిక వ్యవస్థకీ కూడా పెరియార్ వ్యతిరేకి. ఆ విష వాదాల కొనసాగింపే డీఎంకే. హిందూ వ్యతిరేకి ఈవీ రామస్వామి జయంతిని ‘సోషల్ జస్టిస్‌డే’గా నిర్వహిస్తోంది స్టాలిన్ ప్రభుత్వం. జాతీయ రహదారుల్లో సైన్ పోస్టులు, మైలురాళ్లపై హిందీ ఉండటాన్ని తప్పుబట్టారు. తమిళ ప్రజలపై కేంద్రం దొడ్డిదారిన హిందీని రుద్దే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇదీ వేర్పాటువాదమే. దీనికి ప్రాంతీయ దురభిమానాన్ని ఆధారం చేసుకుంటున్నారు. భారత రాజ్యాంగంలోని సమాఖ్య విధానాన్ని సవాలు చేస్తోంది డీఎంకే.
నాస్తికవాదం ముసుగులో హిందూ వ్యతిరేకతను ప్రచారం చేసిన డీఎంకే గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్ద నాటకమే ఆడింది. మూతపడ్డ ఆలయాలను తెరుస్తామని స్టాలిన్ హామీ ఇచ్చారు. తిరువణ్ణామలై (అరుణాచలం) నిర్వహించిన ప్రచారంలో ‘‘హిందుత్వానికి డీఎంకే వ్యతిరేకం కాదు. అందరి ఆచార వ్యవహారాలను మేం గౌరవిస్తాం’’ అని పేర్కొన్నారు. హిందూ ఆలయాలు, పవిత్ర ప్రదేశాల పునరుద్ధరణ కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని డీఎంకే మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. పూరీ, బద్రీనాథ్, కేదార్‌నాథ్ యాత్రలకు వెళ్లేవారికి ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున రాయితీ అందజేస్తామంది. కానీ ఇప్పుడు రోజుకో హిందూ ఆలయం కూలుతోంది. ఎన్నికలలో హిందువులను మభ్య పెట్టడం, తరువాత వంచించడం ఇప్పుడు కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీలన్నింటికీ మామూలైపోయింది. ప్రస్తుతం చెలరేగిపోతున్న హిందూ వ్యతిరేకవాదం, ముస్లిం మతోన్మాదం అండగా తానూ ఒక అరిగిపోయిన నినాదంతో స్టాలిన్ ఢిల్లీ వైపు నడవాలని అనుకుంటున్నారు. తాము ఘోరంగా మోసపోయామని ఇప్పటికే తమిళనాడు ఓటర్లు భావిస్తున్నారు. అలాంటి దుస్థితి భారతీయులందరికీ పంచిపెట్టవద్దు.
– క్రాంతి, సీనియర్ జర్నలిస్ట్