– డా।। చింతకింది శ్రీనివాసరావు

జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన


‘‘అవునవును. ఎగువనున్నవాళ్లంతా నిన్ను కోరుకోవడానికే ఉన్నారనుకుంటున్నావేమో! మినుములూరు సంజీవరాజే నీతో కన్నెరికం చేస్తాడని చూస్తున్నావేమో!’’ అక్కసు వెలిగక్కింది.

‘‘ఏమో, ఎవడు చెప్పగలడు? సంజీవరాజే నాతో కూడుతాడో, చనిపోయిన అతగాడి తండ్రి పెద్దదేశి రాజే సమాధి నుంచి లేచివస్తాడో చూద్దాం! లేకపోతే ఆ మహనుభావులందరూ శీలవంతులుగానే ఉంటూ నన్ను మళ్లీ దిగువకు నిక్షేపంలా పంపిస్తారేమో అదీ చూద్దాం! అయినా నావృత్తి నాది. అది దేవుడిచ్చింది. దేవుడయినా ఆపలేనిది. ఇప్పటికే ఎగువదారి తొక్కడంలో నేను జాప్యం కనబరిచాను.’’ ధీమాగా చెప్పింది కులతిలక.

‘‘అయితే నేను నీతో రాను. ఆ పాపం నేను చెయ్యలేను.’’ సువర్ణ గట్టి మనసుతో చెప్పింది.

‘‘నిన్ను నిర్బంధించలేను. నా వృత్తిని నేను మానుకోనూ లేను.’’ అంటూ మాట్లాడటానికి మరేం లేదన్నట్టుగా కట్టిన పూలమాలల్ని వెండిపళ్లెంలో పడేసి చివాలున లేచి వెళ్లిపోయింది కులతిలక. ఆమె వెళుతున్న వైపుగానే చూస్తూ నిరాశతో నిస్తేజంగా మిగిలిపోయింది సువర్ణతిలక. మరుదినమే వడ్డాది సానిమేళం మేనాలు మినుములూరు కదిలివెళ్లాయి.

*********

నందరాజ్యభవనంలో మహర్నవమినాడు ఆయుధ పూజ పెద్దఎత్తున జరుగుతుంది. పూజగదికి ఎడమ వైపున ఉన్న సింహవాహిని భవనంలో దీన్ని లెంకలు నిర్వహిస్తుంటారు. ఈ భవనం చాలా పెద్దది. ఇందు లోని తూరుపు వేదిక మీద నిలువెత్తు మహంకాళీ విగ్రహం స్థాపితమై ఉంటుంది. వేనవేల ఆయుధాలు ధరించిన హస్తాలతో, విరగబోసుకున్న కేశపాశాలతో, నల్లటి ఆకారంతో, ఎర్రని నాలుకను వెలుపలికి వాల్చి, సమస్త కపా మాలాంకృత విలాసియై, నిఖిల లోక భయంకరియై నోరుతెరుచుకుని ఉంటుంది. హఠాత్తుగా కన్నెత్తి చూసినవారికి జడుపు తప్పదన్నట్టుంటుంది.

కాళీప్రతిమ నిలిచిన వేదిక విశాలంగా ఉంటుంది. దానిమీద నాటి కాలాన కుమార్తె ప్రభావ తితో పాటుగా వియ్యంకులవారి ఇంటికి విక్రమార్కుడు పంపిన మహాకృపాణాలు, కవచాలు ఉంటాయి. ఒకనాటి యుద్ధాలలో శత్రువులను కడతేర్చడానికి నందరాజులు వినియోగించిన తరతరాలకు చెందిన రకరకాల కరవాలాలుంటాయి. వీరప్రతాపగంగుడు, ప్రతాపగంగరాజు, గంగరాజులు ఉపయోగించిన బాకులు, బల్లేలు, కత్తులు, డాళ్లు ఉంటాయి. చేతుల నిండా తొడుక్కుని శత్రువు పొట్టచీల్చగల పులిగోరు తొడుగులూ ఉంటాయి.

వీటన్నింటికీ దసరా ముందటిరోజున పూజాది కాలు నిర్వహించడం నంద ప్రభువులకు వార సత్వంగా దఖలు పడిన ఆచారం. ఈ కార్యక్రమాన్ని గద్దె మీద కూర్చునే ప్రభుపుంగవులు గతంలో చేపట్టేవారు. వారి సతులు పక్కన నిలిచి భర్తలకు పూజల్లో సాయపడేవారు. కానీ, ఇరవైయ్యేళ్లుగా పరిస్థితి అది కాదు. మహాప్రభువు భైరవుడు ఎప్పుడో చనిపోయాడు. అతని కొడుకు వెంకటేశుడు కన్నబిడ్డలందరూ కన్నుమూయడంతో భార్యతో సహా అరణ్యవాసానికి వెళ్లిపోయాడు. ఇందువల్లనే ఈ బాధ్యత ఇప్పుడు మాకలిశక్తి మీద పడింది.

ఆమె పరిస్థితీ ఏమీ బాగాలేదు. వృద్ధాప్యం మీదపడినందువల్ల లొంగిపోయినట్టుగా అయింది. జీవితమంతా అలసిపోతూనే ఉండటంచేత అసుర సంధ్యకు చేరిన ఆదిత్యునిలా మారిపోయింది. అందుకే, చిత్తజాణ, నెమలిజాణ చెరోవైపునా సహాయపడుతుండగా ఉదయం బొమ్మెత్తువేళ పూజను తప్పనిసరి తంతుగా అయిందనిపించింది. అర్చన పూర్తి చేసి, చెలులిద్దరూ తోడురాగా, సింహవాహినీ ప్రాసాదం వెలుపలికి వచ్చింది. ఉద్యానంలోని రాతి పలకల చప్టా మీదకు చేరింది. మహాదేవి మాకలిశక్తి తోటలోకి వచ్చినందువల్ల ఆమె రాకకోసం అప్పటి వరకూ అక్కడ ఎదురుచూస్తున్న దాసికాజనమంతా మరికొంచెం ఆవలకు వెళ్లిపోయారు.

ఎండపొడ తగలగానే తేరినట్టుగా అయింది మాకలి. నుదుటపట్టిన చెమటను చేలాంచలంతో తుడుచుకుంటూనే చిత్తజాణ వైపుచూస్తూ,

‘‘ఎన్నాళ్లో నాకింకా ఈ పరీక్షలన్నీను.’’ బాధగా అంది. ఆ మాటలకు చిత్త చిత్తం కనలినట్టయింది.

‘పాపం. మహాదేవి మాకలిది ఎంతటి కష్ట జీవితమో. చిన్నప్పుడే కోడలిగా కోటకు చేరింది. ఇంకా రాచవిధులు పూర్తిగా అవగాహన చేసుకోనే లేదు. భర్త దూరమయ్యాడు. కష్టపడి పిల్లల్ని పెంచు కొచ్చింది. శత్రువులను నిభాయిస్తూ రాజ్యాన్ని నిలుపుకుంది. ఇంతలోనే ఏడుగురు మనుమలు పైలోకాలకు దాటి పోయారు. కొడుకూ కోడలూ దూరమైపోయారు. పగవాడికీ రాకూడదు. ఈ అమ్మ కష్టం.’ మనసులోనే అనుకుంటూ,

‘‘వయస్సు కదమ్మా. కొద్దిపాటి ఇబ్బందులు తప్పవు.’’ ముక్తసరిగా అంది.

చిత్త మాటల్ని పట్టించు కోకుండా ఈ తడవ నెమలిజాణ ముఖంలోకి చూసింది మాకలి.

‘‘సంజీవరాజు ఎప్పుడు రాజ్యానికి వస్తాడో? అప్పుడుగానీ నాకీ పాట్లు తప్పవే. అప్పుడే నీకూ విశ్రాంతి.’’ అనేసింది.

‘‘అంతేనమ్మా. అయినా మీకూ నాకూ విశ్రాంతి ఎక్కడుంటుంది చెప్పండి. ఏదో ఒక పని చేస్తూ ఉండా లనుకునేవాళ్లం. పనిలేని నాడు మనమే దాన్ని కల్పిం చుకుంటాం కూడాను.’’ నవ్వుతూనే పలికింది నెమలి.

‘‘సంజీవుడు మంచివాడు. పట్టాభిషేకం చేసుకుని, రాజుగా జనంలో ఎంతో పేరు తెచ్చుకుంటాడు. అతని అనుశాసన అంతటిది. అతని శౌర్య పరాక్రమాలు ఎనలేనివి. అన్నింటికీ మించి అతని మానవత అమృతోపమానం. నేనంటే తనకి పిచ్చి ప్రేమ. ఎన్నాళ్లయిందో యువరాజును చూసి!’’ మాకలిశక్తి మనుమడిపై ప్రేమానురాగాలు కురిపించింది. అందుకు నెమలి ప్రతిస్పందిస్తూ,

‘‘ఒక్కమాట మాత్రం నిజమమ్మా. జీవితమంతా హారతి కర్పూరం చేసి సంజీవరాజును రాణీ మోదమ్మ దిద్దితీర్చింది.’’ మనసు విప్పార్చుకుంది. ఆ మాటలకు మాకలి మరింతగా పొంగిపోయింది. అలాంటప్పుడే ప్రాధాన్యం గల మరొక అంశమేదో స్ఫురణకు వచ్చినట్టుగా,

‘‘పట్టాభిషేకం సంగతి సరే, ముందుగా యువ రాజులవారికి మంచి పిల్లని తెచ్చి పెళ్లిచెయ్యాలనేది నా ఉద్దేశం.’’

మాకలమ్మ ఇలా అనగానే ఈసారి చిత్త అందుకుపోయింది.

‘‘మనం తేవడం దేనికమ్మా. మినుములూరులో యువరాణులకు కరువేంటి.’’ చనువారా అంది. ఆమె ఎంతప్రేమగా అన్నప్పటికీ మాకలి మనసు పూర్తిగా తెలుసుకోలేకపోయిందనే యోచనతో కొంచెం కోప్పడినట్టుగా చిత్త వైపు చూసింది నెమలిజాణ. ఆ చూపులకు చిత్తజాణ సర్దుకుంది.

మహాదేవి సంశయాలు నెమలికి తెలుసు. వివాహం కారణంగా దేశిరాజులకు పట్టిన గతి గుర్తుండటం వల్లనే మాకలిశక్తి ఇప్పుడిలా బెంగ పడుతోందనీ తెలుసు. అందుకనే సంజీవరాజును ముందుగా ఒక ఇంటివాడిని చేసి, ఆనక కిరీటధారణ చేస్తే మంచిదన్న ఆమె లోలోపలి మాటా తెలుసును. ఇవన్నీ తెలిసిందువల్లనే,

‘‘మోదమ్మవారికి వర్తమానం పంపలేక పోయారా.’’ చిత్తమాటను పూర్వపక్షం చేస్తున్నట్టుగా వినమ్రంగా పలికింది.

‘‘ఆ..ఆ.. పంపానులే. సంజీవరాజుకు పెండ్లి  చెయ్యడం ఉత్తమమని, సంబంధాలు చూడమని మీ మినుములూరు రాణీగారికి కబురుపెట్టానులే. ప్రత్యేకంగా జాబురాసి వార్తాహరుడితో పంపించాను కూడాను.’’ వివరణ పోల్చింది మాకలి.

‘‘మరికనేం. మంచిపనే చేశారు.’’ నెమలి జాణ అంది.

‘‘ఏమోనే. పూర్వంలా లేదు పరిస్థితి. ఒకప్పుడు నందరాజ్యంలో మెట్టపల్లాల భేదాలే ఉండేవి. ఇప్పుడలా కాదు. కులాలు పుట్టు కొచ్చాయి. జాతుల తేడాలతో మన్యం రగలిపోతోంది. నాలుగు ఊళ్లకు ప్రతినిధిగా ఉంటాడని మనం ఎవణ్ణయినా దుర్గనాయకుడని అందలం ఎక్కిస్తే చాలు. తనే గొప్పవాడినని వాడు విర్రవీగిపోతున్నాడు. తనకో కులం సృష్టించుకుంటున్నాడు. తన కింది వాళ్లందరినీ కడకొమ్మున ఉంచుతున్నాడు. అందుకే, నందంలో ఎలాంటి పిల్ల దొరుకుతుందో సంజీవుడికి. పిల్లని చూడగం. ఆ పిల్ల మనసులోకి దూరి చూడలేం.’’ వాపోయింది నందమహాదేవి.

‘‘అదేంలేదమ్మా. సంజీవుల విషయంలో మీరేం బెంగపడకండి. యువరాజులవారికి అంతా మంచే జరుగుతుంది. మన రాజ్యానికి శుభమే ఒనగూరుతుంది.’’ చీరకొంగుతో రాజమాతకు వీవన చేస్తూ భరోసాగా పలికింది నెమలి. అప్పటికే ఎక్కువగా మాట్లాడినట్టుగా మాకలి భావించిందో ఏమో,

‘‘వెళదాం.’’ అంటూ రాతి చప్టాను వదిలి పెట్టేసింది. వీవన ఆపేసి ఆమె వెనుక చేరింది నెమలి. అనుసరించింది చిత్త.

*********

తూర్పు కనుమల్లోని కోట్ల, దోరశి, పసిబయలు ప్రాంతాలవారంతా చీమల బారుల్లా మినుములూరు కొండలవైపు తరలిపోతున్నారు. విజయదశమి రోజున ఆ గిరుల్లో జరిగే తీర్థ మహోత్సవాన్ని తిలకించేందుకు ఉత్సాహంగా బయలుదేరి వెళుతున్నారు.

ఆశ్వీయుజ, కార్తీకా దసరా మాసంలో బారెడు పొద్దెక్కితేనేగానీ కోనజనం సాధారణంగా ఇళ్లు వదిలిపెట్టబోరు. అలాంటి వారంతా కోడిజామునే బయలుదేరిపోయారు. ఇలా మినుములూరు విచ్చేస్తున్న వీరందరికీ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా యువ రాజు సంజీవుడు అన్ని ఏర్పాట్లూ చేయించాడు. స్వయంగా తానే వీటిని పర్యవేక్షిస్తున్నాడు. ఎద్దుల బళ్ల మీద వచ్చేవారు ఎక్కడ పశుగణాన్ని కట్టి ఉంచాలి? నడచివచ్చేవారి కోసం మరెక్కడ చలి వేంద్రాలు నెలకొల్పాలి? తీర్థప్రజ ఆకలిదప్పులు తీర్చేందుకు ఇంకెక్కడ అంబలి కేంద్రాలు తెరి పించాలి? వంటి విషయాలన్నింటినీ అప్పటికే స్థిరపరిచాడు. మినుములూరుకు సమీపానఉండే వంటలమామిడిపల్లెలో దూరాభారాల నుంచి వచ్చేవారు వండి వార్చుకోవడానికి, వడ్డన చేసు కోవడానికి సదుపాయాలు కల్పించాడు. అడ్డాకుల విస్తరంటలు, వంటపుల్లలు, మంచినీళ్లదిప్పలు సిద్ధపరిచాడు. ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కార్య నిర్వహణ జరిపిస్తున్నాడు.

మామూలుగా అయితే నంద, మత్స్యరాజ్యాల ఏకైక వారసుడైన సంజీవరాజుకు దసరా కంటే గిరివాసులు చైత్రమాసంలో జరుపుకునే ఇటింపండగ, మార్గశిర పలకం నెల దాటాక వచ్చే సంకురాత్రి, మాఘంలో చేసుకునే శివరాత్రి, కొర్రలు పండి ఇంటికి చేరే వేళ జరిపే కొర్రకొత్త, నంది పండగ అంటేనే మక్కువ. కానీ, ఈ మధ్య దసరా సంబరాలనూ పెద్దఎత్తున చేపడుతున్నాడు. భావినేతగా ఇరు రాజ్యాల ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వాలి కాబట్టే, విజయదశమి తీర్థానికి ప్రాధాన్యతనిచ్చి పనిచేస్తున్నాడు. సంజీవుడి తల్లి మోదమ్మకు ఇదంతా సమ్మోదాన్ని కలిగిస్తోంది. బిడ్డ ప్రయోజకుడై ప్రజలను తోబుట్టువుల్లా చూసుకుంటున్నాడన్న భావన ఆమెను సంతోషపెడుతోంది. పేరుకు తగ్గట్టే సంజీవుడు పేదలపాలిట సంజీవుడే. వాళ్ల కష్టం తనదిగా భావించి పరిష్కరిస్తుంటాడు.

ప్రతీ సంవత్సరం కంటే ఈ ఏడాది మరింతగా జనం దశమి పరసలో పాల్గొనేందుకు ప్రధాన ఆకర్షణ లేకపోలేదు. వడ్డాది నుంచి వచ్చిన సానిమేళాలే ఈ ఆకట్టు. మున్నెన్నడూ ఈ మేళాలు కొండలు ఎక్కేవే కావు. మినుములూరు చుట్టుపక్కల జనపదాలకు చెందిన కొందరు యువకులు సంజీవరాజును ఈ తడవ బాగా పట్టుపట్టారు. వారంతా ఆస్థానంలో బాధ్యత గలిగిన కొలువు గాళ్ల పిల్లలు. మేళాలు తప్పని సరిగా గిరులు పట్టవలసిందేనని బతిమ లాడారు. కుదరదంటే, అలిగారు. కూడదంటే కినిశారు. చివరికి అనుమతి సంపాదించ గలిగారు. దసరా నాడు వంట్లమామిడి గ్రామ వేదికపై మేళం పెట్టుకోవడానికి యవరాజును ఒప్పించారు.

అసలే పర్వదినం. ఆ మీదట సానిమేళం. చెప్పేదేముంది. కొండ గోర్జీలన్నీ నిండిపోయాయి. అటు మత్స్యరాజ్యం నుంచీ, ఇటు నందం నుంచీ ప్రజాళి ఉవ్వెత్తున ఎగసిపడటంతో మన్యంలో కలకలం రేగుతోంది. ఉదయాన్నే ఊళ్లల్లో బయలు దేరిన జనం దారిపొడవునా తమదే రాజ్యమన్నట్టుగా తూలుతున్నారు. తబలా వంటి తుడుం వాయించు కుంటూ నృత్యాలు చేస్తూ వచ్చేవారు కొందరు. అడవిలో తిరిగే గురగేదె కొమ్ముతో తయారు చేసిన తూతు గొమ్ము ఊదుకుంటూ కాకరబీకరగా విచ్చేసేవారు మరికొందరు. నగారా వంటి నరికెను ఆపసోపాలు పడుతూ మోస్తూనే బడబడావాయిస్తూ వస్తున్నవారు ఇంకొందరు.

దారి పొడవునా వేటచేస్తూ వస్తున్నవారి సంఖ్యా తక్కువేం కాదు. గురగేదె కనబడితే పదుగురూ కలిసి సాగించే సోపువేటకు దిగి, దాన్ని చంపి, చీల్చి, కాల్చి సరిసమానంగా పంచుకు తింటున్నారు. మరికొందరయితే అల్లెతాటి నార విలుబద్దలతో పిట్టల్ని కొడుతున్నారు. మరికొంతమంది మటుకు దుర్గాభక్తులుగా తమ ఊరి లెంకలను, పూజారులను వెంటబెట్టుకుని భజనలతో నడుస్తున్నారు. డొంకల దారుల్లో మిడతలు ఎదురుపడినప్పుడు పితృదేవతలైన పెతరలుగా వీటిని భావించి నమస్కారాల జోరలు చెల్లిస్తున్నారు.

కల్లు సంగతయితే చెప్పనక్కరలేదు. బహు ప్రీతిగా కల్లుదిప్పలు భుజాన వేసుకుని నడిచే వారెంతోమంది. కణుజు మాంసంతో వండిన దుమ్ముకల్లు పూటుగా సేవించి వీరిలో కొంతమంది తూలుతున్నారు. చెక్కల కట్టలు వేసి వండిన కల్లు తాగి ఇంకొంతమంది పడిపడిలేస్తున్నారు. సామబియ్యంతో కాచిన పిండి పెండెపు కల్లును మరికొంతమంది అపురూపంగా గుటకలు వేస్తున్నారు. కుర్రజట్టయితే తియ్యని పిట్టసోరి కల్లును అపురూపంగా మింగుతోంది.

మహిళల హడావుడీ తక్కువగా ఏమీలేదు. కొండదారుల్లో కనబడిన పువ్వునల్లా తుంచి సిగలో తురుముకుంటున్నారు. అక్కడక్కడ ఎదురవుతున్న కుగ్రామాల కాంతలను ప్రేమగా పలకరిస్తున్నారు. వాళ్లకు పువ్వులు అందజేసి నేస్తం కట్టుకుంటున్నారు. ఆనందంగా నేస్తులతో కలిసి పూలను ముడుచు కుంటున్నారు.

ఇలా జనమంతా వేళలన్నీ మరచి కంపల చిడుగుల బాటలు మీరుతున్నారు. తోపుల చివటలు మళ్లుతున్నారు. కొండకాలువల జోరెలు దాటు తున్నారు. చిక్కుపొదల జోవర్లు గెంతుతున్నారు. లోయల లోవలను అధిగమిస్తున్నారు. కొండచెంపల లొద్దులను, తీగలు అల్లుకున్న పొదలను తొక్కుతూ ముందడుగు వేస్త్తున్నారు. ఎడగీతవేళ, మధ్యసిత్రం వేళ దాటి, సాయంత్రం అయిదుగంటల పులివేళకు సమూహాలు సమూహాలుగా గమ్యస్థానానికి చేరుకుంటున్నారు.

*********

అంతులేని సంతోషంతో మినుములూరు దసరాతీర్థంలో భాగం పంచుకునేందుకు, వంటల మామిడిలో జరిగే సానిమేళాన్ని తిలకించేందుకు వెళుతున్న పల్లెవాసుల్లో కోట్లమన్యపు మండివలస గ్రామప్రజలూ ఉన్నారు. గోనెటెడ్ల మీద, గుర్రాల మీద వంటపాత్రలూ, దినుసులూ నడిపిస్తూ వారంతా ముందుకు పోతున్నారు. వీళ్లకు సేవలు చేయడానికి, సాయంగా నిలవడానికి ఊరితలారి కోలన్న తప్పని సరిగా తరలివెళ్లవలసిందే. అతగాడితో పాటుగా ఊరి కోలగాళ్లూ పరస చూడాలన్నారు. కుటుం బాలతో సహా వస్తామన్నారు. కాదనలేకపోయాడు.

మరోవిశేషం ఏమిటంటే ఈ సంవత్సరం మినుములూరు తీర్థానికి అతని భార్య రేకమ్మ, కూతురు గంగు కూడా బయలుదేరారు. గంగు పట్టుదల మీదనే ఇదంతా జరిగింది. మొదట్లో కోలన్న గట్టిగానే కూతుర్ని ప్రతిఘటించాడు. కుదరలేదు. సానిమేళం చూసి తీరవలసిందేనని పట్టుపట్టింది. దీనికి తోడు నిన్న గాక మొన్ననే పంచాయితీ తీర్పు పాలబడి, గన్నేరు పిక్కలు తిని, వాటిని కక్కించడంతో బతికి బయటపడ్డ గరిక సైతం పెదనాన్న కోలడిని వేడుకుంది. చచ్చి బతికిన గరిక మనసు అర్థం చేసుకున్న కోలడు కాదనలేకపోయాడు. అయితే అతగాడికీ మేళాల విషయమై ఒక అనుమానం లేకపోలేదు. కలవారి కోసమే ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన చూడటానికి• తమ వంటి పిన్నలకు అనుమతి ఉంటుందా అనేదే అతని సందేహం. ఇవన్నీ పైకి చెప్పలేడు. అనవసర విషయాల మీద చర్చ అనర్థం అన్నట్టుగా నోరు మూసుకుని ఊరందరితో పాటు బయలుదేరిపోయాడు. పల్లెజనమంతా పయనమైతే వెనకవెనగ్గా తన స్థాయిని గుర్తుపెట్టుకుని కడగానే కదిలాడు. తనవారినీ కదిలించాడు.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
YOUTUBE