పద్మ అంటే లక్ష్మీసహితం, సరస్వతీ సమన్వితం. అదొక వివేక, వికాస సన్నిధి. జీవన సఫలతను సూచించే వ్యూహ విశేషం. శ్రీ, సిరి, సంపద, అతిగొప్ప సంఖ్య అనే అంతరార్థాలూ ఉన్నాయి. ప్రత్యేకించి ‘శ్రీ’ శబ్దానికి అభివృద్ధి, నిరంతర శోభ, అలంకరణమయం, విశేష ఖ్యాతి, బుద్ధిజ్ఞాన పూరితం, కాంతివంతం, ప్రతిభా సామర్థ్యాలు, ప్రకాశ వికాసాలు, కమనీయ రమణీయాలు, శుభకర, సుప్రసిద్ధ, పదవీభాగ్యం, మేధావి, గౌరవప్రపత్తి…. ఇలా విశేషార్థాలు ఎన్నెన్నో. ఇన్నిన్ని ప్రత్యేకతలు కలగలిసి ఉన్నందునే మన భారతదేశంలో ‘పద్మశ్రీ’కి అంత మహాదరణ. పురస్కారం అనేది సంబంధిత రంగంలో ఆ వ్యక్తి చేసిన సేవకు, సాధించిన స్థానానికి గుర్తింపుగా అందించే బహూకృతి, పెద్దరికానికి సన్నుతి.
ఇంతటి పురస్కృతికి దేశమంతటా ఆరున్నర దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. ప్రతిపాదనలు, స్వయం పరిశీలనల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే వీటికి ఎదురుతెన్నులు లెక్కలేనన్ని. పద్మవిభూషణ్, పద్మభూషణ్‌లతోపాటు పద్మశ్రీ సత్కారం అత్యున్నత స్థాయి పౌర సత్కృతి. ఈ మూడింటినీ కళాసాహిత్యాలు, సామాజిక సేవ -ప్రజా వ్యవహారాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, వాణిజ్య- పరిశ్రమలు, విద్య, వైద్యం, క్రీడాది విభాగాల్లో ఎంపికచేసి ఇస్తుంటారు. తొలి రెండూ సమగ్రతకు నిదర్శనాలైతే; పద్మశ్రీమంతులు ఆయా అంశాలవారీన నిష్ణాతులు. గణతంత్ర దినోత్సవ తరుణంలో వివరాలు వెల్లడించే వీటి బహూకరణ మటుకు మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ఉంటుంది. రాష్ట్రపతి భవన్‌లో మహోత్సవానికి విచ్చేయాలంటూ విజేతలకు ఇప్పటికే ఆహ్వానపత్రికలు అందాయి. ప్రకటిత పేర్ల సంఖ్య ప్రస్తుత సంవత్సరానికి 128. నలుగురు పద్మ విభూషణలు, 17మంది పద్మభూషణులైతే, పద్మశ్రీలు 107. వీరిలోని పద్మభూషణ దంపతుల జంట తెలుగువారవడం అన్నింటికంటే మించిన విలక్షణత. ప్రకటిత స్వీకర్తల్లో 34 మంది మహిళామణులు. విదేశీ, ప్రవాస భారతాది వ్యక్తులు 10 మంది ఉంటే; మరణానంతరం ప్రకటితులైనవారు 13 మంది. వాణిజ్య- పారిశ్రామిక రంగపరంగా పురస్కృతులైన కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా అగణిత ఘనత వారి తెలుగింటి నుంచి దేశదేశాలకీ విస్తరించిందిప్పుడు. పద్మశ్రీయుతుల్లో సుప్రసిద్ధులు మాత్రమే కాదు; బయటి ప్రపంచానికి ఇప్పటి వరకు తెలియకుండా, తెలియా లన్న కాంక్ష అసలే లేకుండా, తమ పని తాము మౌనంగా చేసుకు పోతూనే ఉన్న సామాన్యులూ ఉన్నారు. ఇంతటి మేలు కలయిక గతంలో ఎన్నడూ లేదు. ఇప్పుడు కొన్నేళ్లుగా ఇది ఎందుకు సాధ్య మవుతోందని సగటు పౌరుల్లో ఏ ఒక్కరిని అడిగినా; వారి వేలు కచ్చితంగా కేంద్రంవైపే చూపిస్తుంది. ఎవరూ కాదనలేని, ప్రతి సంవత్సరమూ ఎదురులేని నిత్యసత్యమిది. ‘అత్యద్భుత సేవలకు గుర్తింపూ గౌరవం లభించేలా- తాము ఉన్న స్థానం నుంచి పరమోన్నత స్థాయికి చేరిన వారిని చూస్తుంటే నా మనసు ఉప్పొంగుతోంది’ అని ప్రధాని నరేంద్రమోదీ మునుపే చేసిన ట్వీట్ ఒక్కటి చాలదా.. పద్మశ్రీ స్థాపక లక్ష్యం పరిపూర్తి అయిందనడానికి?
పద్మ అవార్డులు ముందుగా ప్రజల ప్రతిపాదనలు, ఆ తర్వాతే ప్రభుత్వ ప్రకటితాలు! అవి వచ్చినవా లేక తెచ్చుకున్నవా అనే ఘాటువ్యాఖ్య గతంలో పలుమార్లు మారుమోగినా, ఇప్పుడు ఆ తీరుతెన్నులే పూర్తిగా మారిపోయాయి. ఎవరు అర్హులో వారికే పురస్కారాలు లభించాయని సామాజిక మాధ్యమాలు సాక్ష్యంగా ప్రశంసలొస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ పద్మ విజేతలు తొమ్మిదిమంది ఉన్నారు. వీరిలో డాక్టర్ కృష్ణ ఎల్లా తమిళనాట జన్మించినా, మరీ ముఖ్యంగా తెలుగువారి కీర్తికిరీటం. తమిళనాడులోనూ పేరు గడించిన చలనచిత్ర నటీమని షావుకారు జానకి స్వస్థలం తెలుగుసీమే. ఎల్లా (దంపతులు), ఆమె మినహా మిగిలిన ఏడుగురూ ఇక్కడే పుట్టి పెరిగినవారు, విభిన్న రంగాల సంబంధీకులు. వీరంతా వైద్య, సంగీత, నాట్య, ఆధ్యాత్మికవేత్తలు. అందరి కృషీ యుగయుగాల మానవజాతికి ఉజ్జీవనం, జగజగాల జాగృత జ్యోతికి సంభావనం. సమతలోని సౌందర్యం కనుగొని, మమతలోని మాధుర్యం చవిగొని, సమసమాజ సంస్థాపన హితాన్ని అందిస్తూ వచ్చినవారే. చెదరని దరహాసంతో, బెదరని విశ్వాసంతో, జైత్రయాత్ర సాగించి జయశంఖం మోగించినవారే. సహజమైన ఆ సౌజన్యం జాతికి నవచైతన్యం. అది అచంచల ధైర్యం, అమోఘ స్థైర్యం. ‘జయభారతి’ కర్త కోరుకున్నట్లు ‘వివిధ రూప విద్యోన్నతి విశిష్టమై వెలయగ వలె/వైద్యవిద్య జనసేవా భావమ్ము వహింపగవలె/భాగ్యరమలు పరిశ్రమలు బహుముఖాల శోభిల వలె/పురములెల్ల లక్ష్మికి కాపురములై వెలయగవలె/ రత్నగర్భ భరతమాత రాజిలవలె నిత్యోన్నతి/ఆనాడే స్వాతంత్య్రం అర్థవంతమై నిలుచును/ఆనాడే స్వరాజ్యం మహదానందం అందించును.’ సర్వసత్తాక మహోత్సవ తరుణంలో వెలువడిన పురస్కార ప్రకటనం లక్షలాది జన హృదయాలను సంతోష తరంగితం చేసింది. నవరత్న ఖచిత సింహాసనాన ఆసీనులైన విజేతలను కళ్లముందు నిలిపింది. బహూకృతుల ప్రదాన సంరంభాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షించేందుకు ఎన్నెన్ని కళ్లో ఎదురు చూస్తున్నాయి. సేవల వివరాలు ప్రాంగణంలో వినవ స్తుంటే, వాటన్నింటినీ ఆస్వాదించాలని, వీనుల విందు అందుకోవాలని ఇంకెన్ని చెవులో ఉత్సుకత చూపుతున్నాయి. ఈ లోగా ప్రతిభామూర్తుల సమాచారమంతటినీ ఇప్పటికిప్పుడే సవివరంగా తెలుసుకుందామా.
డాక్టర్ కృష్ణ ఎల్లా
మరికొంత కాలానికి షష్టిపూర్తికి చేరువవుతున్న ఈయన భారతీయ విఖ్యాత శాస్త్రవేత్త, పరిశోధక ప్రముఖులు. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అధిపతి. విదేశీ విశ్వవిద్యాలయాల్లో గౌరవ అధ్యాపకత్వం. కరోనా విషమ సమయాన ఔషధం కనుగొన్న ప్రశస్తి. విద్యాభ్యాసవేళ స్వర్ణపతక స్వీకర్త. పశువైద్యానికి టీకామందు, మరో కోణంలో ఆహారధాన్యాల పరంగా శోధన పరంపరలు సాగించారు. ఆరోగ్య సంరక్షణకు సంబంధించి పారిశ్రామిక అవార్డులు, సృజన కనబరిచినందుకు బహుమానాలు, తాజాగా పద్మభూషణ వరించి వచ్చాయి. ఎన్ని రాసినా, ఎంత చేసినా, తెలుగు అంటే ఎంతో మమకారం. ఎల్లలు లేని, పరిమితు లెరుగని వైద్య, విజ్ఞాన సేవలను అంతటా విస్తరించ డమే తన జీవన లక్ష్యం. సతీమణి సుచిత్రతో సంయుక్త సహాయ సహకారాలు కొనసాగిస్తూ వస్తున్నారు.
సుచిత్ర ఎల్లా
భారత్ బయోటెక్ ప్రఖ్యాత శాస్త్రజ్ఞురాలు. కొవిడ్‌కి స్వదేశీ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన కీలకపాత్ర. అంతకుముందే తెలుగు నేలన వాణిజ్యమండలి తరఫున అవార్డు అందుకున్నారు. నిరుడు ఒక ఫౌండేషన్ బహూకృతిని స్వీకరించారు. వ్యవసాయ పట్టభద్రుడైన భర్త భారతదేశంలో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కోరి విదేశాల నుంచి తిరిగి వచ్చేయడంలో స్ఫూర్తిదాయని.
ఈ దంపతులు శతాధిక దేశాలకు టీకాలు అందించారు. హైదరాబాద్‌లోని విశ్వవిద్యాలయం నుంచి పీజీ డిప్లొమా చేశారు సుచిత్ర. భారత్ బయోటెక్ వ్యవస్థాపకురాలై, మహానగర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిన పెంపొందించారీమె. టైఫాయిడ్, హెపటైటిస్, రొటా వైరస్ వంటి పలు వ్యాధులకు చికిత్సమందును సృజించి అభివృద్ధి చేసి సర్వత్రా అందజేయడంలోనూ దిట్ట. ప్రయోగ పరీక్షలను సత్వరం పూర్తిచేసి, అనుకున్న ఫలితాలు సాధించడంలో మేటి. ఈ పురస్కృతితో తమ బాధ్యత ఇంకెంతో పెరిగిందంటూ భర్తతోపాటు నిబద్ధత వ్యక్తపరిచారు.
దైవభక్తి.. దేశభక్తి…
‘ధారణా బ్రహ్మరాక్షసుడు’ బిరుదాన్ని సార్థకం చేసుకొన్న జగమెరిగిన అవధాన సామ్రాట్టు గరికపాటి నరసింహారావు. స్వస్థలం పశ్చిమగోదావరి. మొదట్లో బోధక వృత్తి. పిల్లల పేర్లు శ్రీశ్రీ, గురజాడ అని పెట్టడంలోనే ఆయన భాషానురక్తి తేటతెల్లమవుతోంది. మహాసహస్రంతో పాటు వందలాది అవధాన పక్రియలను దేశ విదేశాల్లో నిర్వర్తించారు. టీవీ ఛానళ్లలోనూ వందలకొద్దీ కార్యక్రమాలు. ఐదువేల పంక్తులున్న వెయ్యి నూట పదహారు పద్యాలను ‘సాగరఘోష’ కావ్యంగా మలిచారు. వాటిని కేవలం ఎనిమిది గంటల్లో మహాధారణచేసి అద్భుత ప్రతిభను నిరూపించుకున్నారు. సహస్రావధానానికి సంబంధించి – 1,116మంది వృచ్ఛకులతో 21 రోజులపాటు 750 పద్యాలను ఏకధాటి ధారణ చేయడమంటే మాటలా మరి? ప్రపంచ రికార్డునే సొంతం చేసుకున్న ప్రత్యేకత. అమెరికాలో కంప్యూటర్లతో, బెంగళూరులో ప్రయోగశాలలో హైటెక్ అవధానాల నిర్వహణ. మన భారతం, బాష్పగుచ్ఛం, మౌఖిక సాహిత్యం, అవధాన శతకం వంటి రచనలెన్నో చేశారు. ‘మా అమ్మ’ లఘకావ్యం మాతృమూర్తిపై ఆయనకున్న అపార ప్రేమకు అక్షర ప్రతీక.
తెలుగు విశ్వవిద్యాలయం సహా అనేక సంస్థల నుంచి సారస్వత పురస్కృతులు అందుకున్నారు గరికపాటి. స్వర్ణపతకాలు, సువర్ణ హారాలు, కంకణాలు, కనకాభిషేకాలు, ముత్యాల కిరీట సత్కారాలు పొందారు. పలకరిస్తే పద్యం, కనకధారాస్తవం, శివానంద-సౌందర్యలహరి పేరిట సీడీలు వెలువరించారు. రామాయణ, భారత అంశాలతో పాటు కావ్యాల ప్రవచనాలను చిన్నితెర వేదికగా సాగిస్తూ వస్తున్నారు.
‘శారద’ వరియించె, శంకరాచార్యుడు చేయిపట్టి నడువజేయుచుండె / బుద్ధిమంతులైరి పుత్రులిర్వురు కూడ, వేరు కోర్కెలేదు పేర్కొనంగ’ – ఇదీ ఆ మహా సహస్రావధాని, ఆధ్యాత్మిక ప్రవచన ప్రముఖుడి అంతరంగ తరంగం. తరతరాల తెలుగు పద్యం, తెలుగు వెలుగు, నవజీవన వేదం, మరెన్నో ప్రసంగ పరిమళాలకు పద్మశ్రీ జత చేరింది. పుస్తకాల్లో, ఉపన్యాసాల్లో సామాజికతను జోడించి; సూటిగా ధాటిగా ఘాటుగా అభిప్రాయాలు వ్యక్తపరచే ఆయన సదా శ్రీమంతుడే.
దర్శనం మొగిలయ్య
అర్ధశత దేశాల ప్రతినిధులను 12 మెట్ల కిన్నెరగానంతో ఆకట్టుకున్న వాద్య సంగీత కళా ప్రభంజనుడు. సర్వ సాధారణ గ్రామీణుడిలా వేషభాషలున్నా, వాయిద్యం చేతపడితే అమృత ప్రవాహమే! తెలంగాణలోని నాగర్‌కర్నూలు ప్రాంతం స్వస్థలమైనా, ప్రస్తుతం రాజధాని నగరంలో దుర్భర జీవనం. రోజులో సగం కిన్నెర ఆలాపన సాగించినా, తన జీవితచరిత్ర బడిపిల్లల పాఠ్యాంశంగా మారినా, ఇప్పటికీ పేదరికమే వెంటాడుతోంది. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం ముందుకొచ్చి కోటిరూపాయల నజరానా ప్రకటించి, ఆయనను నిజమైన పద్మశ్రీ మంతుడిని చేసింది. ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రశంసించినట్లు – అపూర్వ అపురూప కళారూపాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న మొగిలయ్య చరితార్థుడే. ఆ ప్రాచీన సంగీత వాద్య మధురిమ ఇకముందూ వీనుల విందు అందించాల్సిందే. నిరుడు సినిమాలో పాట, భాషా సాంస్కృతిక శాఖతో డాక్యుమెంటరీ చిత్రీకరణ స్ఫూర్తి వెల్లివిరియాల్సిందే.
పద్మజారెడ్డి
కూచిపూడి నర్తనలో ఎంతగానో పేరొందిన ఈమెది కృష్ణాజిల్లా. తనయుడు ప్రణవ్ పేరిట అకాడమీ స్థాపించి, తన కళను ఆధునిక రూపాలుగా ప్రదర్శిస్తున్నారు. వందలమందికి శిక్షణ అందించి, భారతీయత చాటేలా, ఇతర దేశాలలో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటిల్లో వజ్రభారతి, కాకతీయుల చరిత్ర వంటివి అపార జనాదరణ సంపాదిం చాయి. మునుపే సంగీత నాటక అకాడమి గుర్తింపు సాధించారు. నాలుగున్నర దశాబ్దాల కళాసేవకు ప్రశంసగా అప్పట్లో రాష్ట్రపతి ప్రణబ్ నుంచి అవార్డు స్వీకరించారు. నాట్య విశారద, కళారత్న బిరుదులు, బంగారు పతకాలు సొంతమయ్యాయి. నాట్యాన్ని సామాజిక అంశా లతో మిళితం చేసిన పద్మజా రెడ్డి… తన అధ్యయనం, పరిశోధనలకు పద్మశ్రీతో సార్ధకత లభించిందంటున్నారు.
రామచంద్రయ్య
కోయభాషలో ఆశువుగా కథలు చెప్పే సకిని రామ చంద్రయ్య డోలు వాద్య ప్రసిద్ధుడు. ఈ ఆదివాసీ కళాకారుడిది భదాద్రి కొత్తగూడెం ప్రాంతం. కోయతెగల వంశ చరిత్రలను, నాటి యోధుల గాథలను గానం చేసే అరుదైన రూపకర్త. ఆసియాలోనే అతిపెద్ద జాతర ‘మేడారం’లో ప్రత్యేకత అంతా ఈయనదే. వాయిద్య పూర్వకంగా వనదేవతలకు పూజలు జరుపుతారు. తరతరాల నాటి సంప్రదాయ కళను కాపాడుతూ వస్తున్నారు. ఇప్పుడీ పద్మ పురస్కారం ఆ కళారూపానికి చక్కని గుర్తింపు.
సుంకర వెంకట ఆదినారాయణ
పశ్చిమగోదావరి, విశాఖల్లో విద్యాభ్యాసం. వైద్య విద్య తదుపరి విదేశాల్లో శిక్షణ. వైద్యాలయంలో మెడికల్ కాలేజీలోనూ వైద్య, విద్యా సేవలు. ఒకేరోజు అనేక శస్త్ర చికిత్సలతో మొత్తం మీద వేలాది సంఖ్యలో చరిత్ర సృష్టించిన బహు విఖ్యాత వైద్య నిపుణులు. పలు వైద్య గ్రంథాలకు సంపాదకత్వం, పరిశోధన వ్యాసాలు అసంఖ్యాకం.
షేక్ హసన్
మరణాంతర పురస్కారం. జన్మస్థలం కృష్ణా జిల్లా, నాదస్వర విద్వాన్‌గా అమోఘ ప్రజ్ఞ. ఆకాశవాణి హైదరాబాద్‌తో పాటు భద్రాచలం, యాదగిరిగుట్ట దేవస్థానాల్లో నిలయ విద్వాంస ఘనత. చిరకాల ఆ సేవలను గుర్తిస్తూ, గౌరవిస్తూ పద్మశ్రీ ప్రకటనం. దాదాపు 93 ఏళ్ల జీవితకాలంలో పలు ఆలయాల్లో స్వర ప్రదర్శనలిచ్చినందుకు కళాభిషేకం.
‘షావుకారు’ జానకి
స్వస్థలం రాజమహేంద్రవరమైనా, అటు తర్వాత దక్షిణాది మూడు భాషల్లో వందల కొద్దీ సినిమాల్లో నటన. దరిదాపు 70 ఏళ్ల చలనచిత్ర నటన రంగంలో తన సినిమానే ఇంటి పేరైంది. రంగస్థల, ఆకాశవాణి వేదికల మీద వేలాది ప్రదర్శనలు. ఇప్పటికీ కళామతల్లికి సేవలందిస్తున్న ఈ అభినేత్రి కంటే ‘పద్మశ్రీ’ అర్హులు ఇంకెవరుంటారు?
– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్