– ఎస్‌. ‌గురుమూర్తి, ఎడిటర్‌, ‌తుగ్లక్‌ ఆర్థిక-రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

2022-బడ్జెట్‌లో ‘మొట్టమొదటిసారి’ అనదగ్గ అంశాలు చాలానే చోటుచేసు కున్నాయి. మళ్లీ వీటన్నింటిలో మొట్ట మొదటగా చెప్పుకోవాల్సింది, సభలో ఆర్థికమంత్రి ప్రసంగం ఏవిధమైన అవాంతరాలు లేకుండా సజావుగా సాగడం! కనీసం ఒక్కసారి కూడా ఎవరూ ఆర్థికమంత్రి ప్రసంగాన్ని అడ్డుకోలేదు.

ఏదో ఒక కారణం చూపించి పెద్దగా అరుపులూ, కేకలూ ఏవీ ఈసారి చోటు చేసుకోలేదు. రెండో విషయమేమంటే, ఎన్నికల ముందు ప్రవేశపెట్టే బడ్జెట్‌ అయినప్పటికీ ఓట్లు రాల్చే ప్రజాకర్షక పథకాల ఊసు లేకపోవడం. మూడోది, అంటే మొదటిసారి అన దగ్గ మూడో అంశం – రాహుల్‌గాంధీ అసాధారణ రీతిలో బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఏవిధమైన వ్యాఖ్యానమూ చేయకుండా తిన్నగా తన కారులో కూర్చొని వెళ్లిపోవడం. గంట తర్వాత తీరిగ్గా తన సహాయకులు రాసిచ్చిన దానిప్రకారం బడ్జెట్‌పై ఒక నిందాపూర్వక ట్వీట్‌ ‌చేసి ఊరుకోవడం. నాలుగోది ఎన్నికల తాయిలాలతో కూడి ఉంటుందనుకున్న విపక్షాలు బడ్జెట్‌పై విరుచుకుపడటానికి అన్ని రకాల కత్తులూ, కటార్లు సిద్ధం చేసుకొని వస్తే అటువంటివేవీ లేకపోగా, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ, ఆహార సబ్సిడీ, రసాయన ఎరువుల సబ్సిడీల్లో కోతలు పెట్టడం వాటికి అశనిపాతమైంది. దీంతో అప్పటివరకు బడ్జెట్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వంపై దాడిచేయడానికి తాము ముందుగా రాసుకువచ్చిన స్క్రిప్టును తక్షణం మార్చేసి, ఇది పేదల వ్యతిరేక బడ్జెట్‌ అని చెప్పడానికి కొత్త రాత ప్రతులను తయారు చేసుకోవాల్సి వచ్చింది. ఐదవది ఇప్పటివరకు తమకు అలవాటైన భాషలో బడ్జెట్‌ ‌లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన విపక్షాలు నోటమాట రాని స్థితిలో నిశ్చేతనం కావడం. ఆరవది గ్రామాలు, వ్యవసాయం, పోస్టాఫీసులు, ఫైనాన్స్, ‌మౌలిక సదుపాయాలు, భూమి రిజిస్ట్రేషన్లు, పన్నుల వసూళ్లు, రైల్వేలు, రహదార్లు, నీటి మార్గాలు, లాజిస్టిక్స్, ‌కరెన్సీ.. వీటన్నింటిని డిజిటల్‌ అనుసంధానం ద్వారా ఒక అతిపెద్ద జాతీయ కంప్యూటర్‌గా సమీకృతం చేయడం. ఏడవది ఆర్‌బీఐ డిజిటల్‌ ‌కరెన్సీని ప్రవేశ పెట్టబోతున్నదని ప్రకటించడం. ఎనిమిదవది స్వతంత్ర భారతావనిలో వార్షిక బడ్జెట్‌ ‌మొట్టమొదటి సారి మానసికంగా శతజయంతి బడ్జెట్‌గా రూపాంతరం చెందడంతో సాధారణ రీతిలో బడ్జెట్‌పై విమర్శల దాడి చేయాలనుకున్న విపక్షాలకు గొంతులో పచ్చి వెలక్కాయపడ్డ చందంగా మారడం. పూర్తి ఆర్థికవేత్త కాకపోయినా, మనోవిశ్లేషణ నేపథ్యమున్న ఒక ఆర్థికవేత్త బహుశా ఈ బడ్జెట్‌ను రూపొందించి ఉండవచ్చునని భావించాల్సి వస్తోంది.

ఖర్చుపై ప్రజల సంశయాత్మకత

పెరుగుతున్న కుటుంబాల పొదుపు అనే ఒక ముఖ్యాంశం ప్రస్తుత బడ్జెట్‌ ‌సైద్ధాంతికత, రూపకల్పనపై ప్రభావం చూపిందని చెప్పాలి. బడ్జెట్‌ ‌పూర్వ సర్వే 2021లో దేశంలో కుటుంబాల పొదుపు ఏకంగా రూ.7లక్షల కోట్లకు పెరిగిందని తేల్చింది. ఇదే సమయంలో కుటుంబాలు తీసుకున్న రుణాలు రూ.18,000 కోట్లు మాత్రమే! సమాజంలో అట్టడుగు వర్గాల వారికోసం ప్రవేశపెట్టిన జన్‌ధన్‌ ‌యోజనలో కూడా 2021 ఏప్రిల్‌ ‌నుంచి 2022 జనవరి మధ్య అంటే కేవలం 9నెలల కాలంలో పొదుపు మొత్తం రూ.39,000 కోట్లకు చేరడం మరో గమనార్హ మైన అంశం. పెరుగుతున్న పొదుపు ప్రజల్లో ఖర్చుపై నెలకొన్న సంశయాత్మకతకు చిహ్నం. కనీసం కరోనా ప్రభావం పూర్తిగా తగ్గేవరకు ప్రజల్లో ఈ వైఖరి కొనసాగవచ్చు. ప్రస్తుతం ప్రజల మనోవైఖరికి వ్యతిరేకంగా నడుచుకోవద్దని బహుశా విత్తమంత్రి భావించి ఉంటారు. అందుకనే ఖర్చును ప్రోత్సహించే రీతిలో పన్నులు, వడ్డీల్లో కోతల జోలికి వెళ్లలేదు. ఒకవేళ ఆమె ప్రజల జేబుల్లో డబ్బులు ఉంచినా, వారు ఖర్చుకు ముందుకు రాకపోవచ్చు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఈ ప్రాథమిక అంశం ఎక్కువగా ప్రస్తావనకు రాలేదు. బహుశా ప్రభుత్వ వ్యయం పెంచే దిశగా ఆర్థికమంత్రిపై ఒత్తిడి ఉండవచ్చు.

ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ వ్యయం

 2020-2021లో ఆర్థికవ్యవస్థపై పడిన భారం, 2021-22 మొదట్లో బడ్జెట్‌ ఆదాయాన్ని గమ నించిన విత్తమంత్రి రెవెన్యూ వ్యయం విషయంలో అపాయాన్ని కోరి తెచ్చుకునే సాహసం చేయలేదు. అందువల్లనే ఆమె ప్రభుత్వ నేతృత్వంలో డిమాండ్‌ ‌సృష్టి ద్వారా ఆర్థికవ్యవస్థకు చోదక శక్తి కల్పించాలని భావించడం సముచితమైన నిర్ణయం. ప్రభుత్వ వ్యయానికి పెద్దమొత్తంలో ప్రైవేటు సేవింగ్స్ అం‌దు బాటులో ఉండటంతో, పెట్టుబడి వ్యయాన్ని 34% వరకు పెంచడం ద్వారా ఆర్థికవ్యవస్థను మరింత పైకి తీసుకెళ్లడానికి ఉద్దేశించారు. డిమాండ్‌ను పెంచేందుకు రూ.2లక్షల కోట్లు కేటాయించడానికి ప్రధాన కారణం ప్రజల వద్ద ఉత్పాదక ద్రవ్యం ఉండటమే. నిజానికి రిటైల్‌ ‌ద్రవ్యోల్బణ స్థాయి అనుకూలంగా లేని పరిస్థితుల్లో ఆర్థికమంత్రి తీసుకున్న సహేతుక నిర్ణయం ఇది. పెట్టుబడి వ్యయం విషయంలో అన్నింటికంటే ముందు చెప్పుకోవాల్సింది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ ఎంఈ) ఇచ్చే రుణహామీని మరో ఏడాది పొడిగిం చడం. దీనివల్ల ఆయా పరిశ్రమల వాణిజ్య కార్యకలాపాలకు అవసరమైన పెట్టుబడి కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ప్రజలకు అనుత్పాదక ఉచితాలను ప్రకటించకుండా, ఉత్పాదక ద్రవ్యాన్ని వ్యవస్థలోకి ప్రవేశపెట్టడంపైనే విత్తమంత్రి ప్రధానంగా దృష్టి పెట్టడం గమనించాల్సిన అంశం.

సముచితం, యుక్తియుక్తం

బడ్జెట్‌లో పేర్కొన్న ఖర్చు సముచితం మాత్రమేకాదు యుక్తియుక్తం కూడా. ప్రభుత్వ పెట్టుబడుల వ్యయం రూ.7.5లక్షల కోట్లు, గృహ కేటాయింపులకు రూ.48వేల కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్రాలకు రూ.1లక్ష కోట్లు వడ్డీలేని రుణాలు, గ్రామీణ ఉపాధి హామీకి రూ.78వేల కోట్లు, జల్‌ ‌జీవన్‌ ‌మిషన్‌కు రూ.60వేల కోట్లు-కొన్ని ముఖ్యమై నవి-వంటి నగదు చోదకాల వేగం ఆర్థిక వ్యవస్థను మరింత వృద్ధిబాట పట్టించడానికి దోహదం చేస్తాయి. కొవిడ్‌ ‌కారణంగా-2020-21లో మాదిరిగా-మరోమారు అనిశ్చితితో కూడిన సంక్షోభం ఏర్పడినట్లయితే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంలో ఆర్థికమంత్రి వివేచన కనబరచారు. గతంలో కొవిడ్‌ ‌కారణంగా గ్రామీణ ఉపాధిహామీ పథకం బడ్జెట్‌ ‌దాదాపు మూడు రెట్లు పెరగడమే కాదు, ఉచిత రేషన్‌ అమలు కూడా గరిష్టస్థాయిని చేరుకోవడం గమనార్హం.

విపత్కర ప్రజాకర్షక పథకాలకు స్వస్తి

ప్రతికూల ఫలితాలనిచ్చే ప్రజాకర్షక పథకాలను ఈసారి ఆర్థికమంత్రి పక్కన పెట్టారు. ద్రవ్యోల్బణ విపత్తును పట్టించుకోకుండా, పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి, ప్రజాకర్షక పథకాలవైపే మొగ్గుచూపి ఎంజిఎన్‌ఆర్‌ఈజీఏ, ఆహార సబ్సిడీ, రసాయన ఎరువుల సబ్సిడీలకు కేటాయింపుల రూపంలో రూ.50వేల కోట్లు ప్రజల చేతుల్లో పెట్టి అధికారంలోకి రావాలనుకోవచ్చు. కానీ ఇది ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే కాదు, అంతిమంగా నష్టపోయేది ప్రజలే కనుక మంత్రి ఈ పని చేయలేదు. అదీకాకుండా దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో ఏ విధమైన ఉచితాలకు ఆస్కారం లేకుండా బడ్జెట్‌ను రూపొందించినందుకు మోదీ ప్రభుత్వాన్ని అభినందించాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో హోరాహోరీగా ఎన్నికల పోరు కొనసాగుతూ, 2024లో జరుగబోయే సాధారణ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయత, విజయావ కాశాలపై ఇక్కడి ఫలితాల ప్రభావం ఉండబోతు న్నప్పటికీ ఓట్లు రాల్చే దిశగా బడ్జెట్‌ను రూపొందిం చాలన్న మనో ప్రేరణను నిగ్రహించుకోవడానికి మోదీకి ఎంతో రాజకీయ సంకల్పబలం అవసరం.

దేశ భద్రతకు సంబంధించిన అంశం బడ్జెట్‌ ‌ప్రసంగాల్లో చోటుచేసుకోక పోవడం దుస్సహమైన లోపం. బడ్జెట్‌ ‌ప్రసంగాల్లో ప్రాధాన్యం వహించేది ఆర్థికవ్యవస్థ, వర్తకం, వాణిజ్యం, విత్తం, రాజకీయాలు మాత్రమే. కానీ 2020 నుంచి దేశం రెండువైపుల నుంచి యుద్ధ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, చర్చల్లో పాల్గొనేవారు ఆ అంశాన్ని అసలు పట్టించుకున్న దాఖలాలే లేకపోవడం విచిత్రం. రక్షణ రంగానికి తగిన కేటాయింపుల విషయానికి చర్చల్లో ప్రాధాన్యం ఎక్కడా కనిపించలేదు. కానీ బడ్జెట్‌ ‌విమర్శకులు మాత్రం ఉద్యోగ వర్గాలు, మధ్యతరగతి, రైతులు, పేదల పక్షాన మాట్లాడుతున్నట్టు కన్నీరు కార్చడం తప్ప రక్షణ రంగం కేటాయింపుల్లో హెచ్చుతగ్గుల గురించి ఎంతమాత్రం పట్టించుకోక పోవడం విచిత్రం. మూడేళ్ల క్రితం రక్షణ రంగ కేటాయిపుల్లో పెరుగుదల రూ.3.05లక్షల కోట్లుండగా 2022-23 బడ్జెట్‌లో ఇది రూ.3.85 లక్షల కోట్లకు చేరింది. అంటే ఈ మూడేళ్లకాలంలో ఈ పెరుగుదల సముచిత స్థాయిలోనే కొనసాగు తోందని భావించాలి. ఇందులో రక్షణ రంగానికి చెల్లించే పించన్ల మొత్తం రూ.1.20లక్షల కోట్లు. బడ్జెట్‌ ‌మొత్తంలో అధిక మొత్తం అంటే రూ.5లక్షల కోట్లకంటే ఎక్కువ కేటాయింపు ఒక్క రక్షణరంగానికే జరుగుతోంది. అయినప్పటికీ చర్చల్లో దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు సరికదా స్వల్ప చర్చతోనే సరిబుచ్చుతున్నారు.  అయితే ఈ రంగంలో దేశీయ ఉత్పత్తుల సేకరణకు విధానపరంగా ప్రాధాన్యం ఇవ్వడం ఇక్కడ గమనించాల్సిన కీలకమైన అంశం. రక్షణరంగంలో దేశీయ ఉత్పత్తుల సేకరణ 58% నుంచి 68%కు పెరగడం విశేషం. దీర్ఘ కాలంలో దేశ భద్రతకు, రక్షణ రంగంలో ఉద్యోగావ కాశాలు, సాంకేతికాభి వృద్ధి, ఎగుమతుల విషయంలో మరింత ముందుకు వెళ్లడానికి ఇది గొప్ప ముందడుగని చెప్పాలి. గత ఏడేళ్లకాలం నుంచి మోదీ ప్రభుత్వం దేశీయ రక్షణ ఉత్పత్తుల వృద్ధికి కృషిచేస్తూ వస్తోంది. ఆవిధంగా దృష్టి కేంద్రీకరించక పోతే నేడు 600 మిలియన్‌ ‌డాలర్ల విలువైన బ్రహ్మోస్‌ ‌క్షిపణులను ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేయగలిగి ఉండేవాళ్లం కాదు.

2047-దీర్ఘకాల లక్ష్యం

ఈ బడ్జెట్‌ ‌సుదీర్ఘ కాలం మీద విహంగవీక్షణం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యకలాపాలను సర్వహితం కోసం ఏకీకృతం చేస్తూ జాతీయ భౌతిక, ఆర్థిక, విత్త, సాంకేతిక రంగాలను ఒకే జాతీయ కంప్యూటర్‌ ‌పరిధిలోకి తెచ్చి, జాతీయ పాలనా వ్యవస్థగా రూపుదిద్దేందుకు అవసరమైన పునాదిని ఈ బడ్జెట్‌ ఏర్పరుస్తున్నది. ఈ బృహత్‌ ‌డిజిటైజేషన్‌ అజెండా సాధిస్తే, ఆర్థికవ్యవస్థలో, ప్రభుత్వ వ్యయంలో నెలకొన్న లొసుగులు, దేశాన్ని భౌతికంగా, రక్షణరంగంతో పాటు జాతీయ నైతికతను దెబ్బతీస్తున్న అవినీతి చీడకు చరమగీతం పాడవచ్చు. అయితే దీన్ని సాధించడం అనుకున్నంత సులభం కాదు.

కానీ ప్రస్తుత మోదీ ప్రభుత్వం విశాల దృక్పథంతో 45కోట్ల జన్‌ధన్‌ ‌యోజన బ్యాంకు ఖాతాలు, ప్రత్యక్షంగా ప్రయోజనాల బదలీ, ముద్ర రుణాలు వంటి వాటిని ప్రవేశపెట్టింది. రాజకీయంగా వాటిల్లే నష్టాన్ని ఖాతరు చేయకుండా నోట్ల రద్దును ప్రవేశపెట్టి ఉండకపోతే నేడు ఇవన్నీ సాధ్యమయ్యేవి కావు. నోట్ల రద్దు పుణ్యమాని దేశ ప్రజలు డిజిటల్‌ ఆర్థిక జీవితానికి అలవాటుపడటమే కాదు, ఆర్థికవ్యవస్థ క్రమబద్ధమైంది. ఇప్పటివరకు అగ్రాహ్యంగా ఉన్న పునశ్చరణ ప్రకియను ఈ క్రమబద్ధమైన, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో ప్రవేశ ప్టెడం, సంప్రదాయ ఆర్థికవ్యవస్థ వాటా నాటకీయంగా పెరగడానికి దోహదం చేసింది. ఎస్‌.‌బి.ఐ. అధ్యయనం ప్రకారం నోట్ల రద్దుకు ముందు దేశంలో అనియత ఆర్థిక వ్యవస్థ 52% ఉండగా, నోట్లరద్దు తర్వాత అది 15%-20%కు మాత్రమే పరిమితమైంది. ఇదే పునాదిపై మోదీ ప్రభుత్వం ప్రగాఢ విశ్వాసంతో భారత్‌-2047 ‌ప్రాజెక్టును ప్రవేశపెట్టింది. అందువల్ల ఇది ఒక్క ఏడాదికి మాత్రమే పరిమితమయ్యే బడ్జెట్‌ ‌కానేకాదు. ప్రభుత్వాలను అతిశయించే బడ్జెట్‌. ‌భవిష్యత్తులో ఏ ప్రభుత్వమైనా దీనిపై ఆధారపడి పనిచేయాల్సిందే. మొత్తం మీద చెప్పాలంటే 2022-23 బడ్జెట్‌ ‌సాధారణ చరిత్రను అతిశయించడమే కాదు, భారత భవిష్యత్తుకు అతిపెద్ద మలుపుగా చెప్పాలి.

‘ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ‌నుంచి

అను : విఠల్‌ ‌రావు

About Author

By editor

Twitter
YOUTUBE