– ఎం.వి.ఆర్. శాస్త్రి
సాయుధ సంగ్రామం ద్వారా భారతదేశ స్వాతంత్య్రాన్ని సాధించటానికి ప్రవాస భారతీయ గదర్ విప్లవకారులు సమాయత్తమైన కాలాన- కోల్‌కతా హార్బరు చేరిన జపాన్ నౌక కొమగతమారులోని సుమారు 300 మంది అమాయక ప్రయాణికులను బ్రిటిషు ప్రభుత్వం జలియన్ వాలాబాగ్ స్థాయిలో రాక్షసంగా ఊచకోత కోసిన 36 ఏళ్లకు-
భారత దేశ విముక్తికి సముద్రజలాల్లో ఇంకో చరిత్రాత్మక సాయుధ విప్లవం!
అది చరిత్రకెక్కని సాయుధ విప్లవం కూడా! రాయల్ ఇండియన్ నేవీలోని భారతీయ సైనికులు (వారికి ‘రేటింగ్స్’ అని పేరు) 1946 ఫిబ్రవరి 18న బ్రిటిషు సామ్రాజ్యంమీద బాహాటంగా తిరగబడ్డారు. ఆరోజు ముంబయి డాక్స్‌లో నౌకాదళానికి చెందిన HMIS Talvaar ఓడలో తిరుగుబాటును మొదలుపెట్టిన వాడు బాలచంద్ర దత్. అతడు
ఆ నౌకలో వైర్లెస్ టెలిగ్రాఫిక్ ఆఫీసరు. అతడికి స్ఫూర్తి నేతాజీ సుభాస్ చంద్రబోస్.
యుద్ధకాలంలో బర్మాలో ఉన్నప్పుడు బి.సి. దత్ మొదటిసారి ఐఎన్‌ఏ గురించి విన్నాడు, రంగూన్‌లో ఉండగా ఐఎన్‌ఏ సైనికులను చూశాడు. ఐఎన్‌ఏ వారే రంగూన్‌ను బ్రిటిషు దళాలకు స్వాధీనపరిచారు. కానీ దత్ వెళ్ళిన కొన్ని గంటలకే వారిని బంధించి తీసుకుపోవటంతో కలిసి మాట్లాడటానికి అవకాశం లేకపోయింది. యుద్ధం ముగిశాక మలయా నుంచి తిరిగివచ్చిన సలీల్ శ్యామ్ అనే స్నేహితుడు ఆ విప్లవ సైన్యం గురించి, దానిని నడిపించే నేతాజీ గురించి దత్తుకు ఒళ్ళు పులకరించే కథలు చెప్పాడు. మలయాను ఆక్రమించిన బ్రిటిషు సేనలో ఉండటం వల్ల ఆ స్నేహితుడికి ఐఎన్‌ఏ వారితో నేరుగా పరిచయం కలిగి నేతాజీకి వీరాభిమాని అయ్యాడు. ఐఎన్‌ఏకు సంబంధించిన సాహిత్యం, కొన్ని ఫోటోలు, జవహర్లాల్ నెహ్రూకూ, నేతాజీ అన్న శరత్ చంద్రబోస్‌కూ ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రభుత్వంలో ముఖ్యులు రాసిన లేఖలు పట్టుకుని అతడు ముంబాయి వచ్చాడు. ఆ ఉత్తరాలను చిరునామాదారులకు ఎలా అందజేయాలో అతడికి తోచలేదు. ఆ ఉత్తరాలతో పట్టుబడితే రాజద్రోహం కింద మరణశిక్ష తప్పదు. కాబట్టి వాటిని చూడగానే దత్తుకు భయంవేసింది. అదే సమయంలో అతడిలో దేశభక్తి ఉప్పొంగి, నేతాజీ దివ్య స్ఫూర్తి ఆవహించింది.
‘‘అప్పుడు నా వయసు 22. నాజీల దాష్టీకాన్ని అంతమొందించటానికి జరిగిన యుద్ధంలో నేనూ పాల్గొన్నాను. బ్రిటిషు ప్రజలు వారి దేశాన్ని రక్షించుకోవటానికి పడిన తపనను నేను నా కళ్ళారా చూశాను. బ్రిటన్ నుంచి, ఇతర మిత్ర దేశాల నుంచి వచ్చిన నావికులతో కలిసి నేను అనేక రంగాల్లో పనిచేశాను. తాము దేనికొరకు పోరాడుతున్నదీ వారికి తెలుసు. మరి నేను ఏ దేశం కోసం ఉన్నాను? ఎవరి యుద్ధం నేను చేస్తున్నాను? నా విధేయత నా దేశానికా? దానిని అణచివేస్తున్న విదేశీ దొర తనానికా? ఈ ప్రశ్నలు నన్ను ఎప్పుడూ కలచి వేస్తుండేవి. నేవీలో సుభాస్ చంద్రబోస్ పేరు, ఆజాద్ హింద్ ఫౌజ్ పేరు ఎక్కడా వినపడనిచ్చేవారు కాదు. శ్యామ్ చెప్పిన తరవాత నాకు నేతాజీ గురించి బాగా తెలిసింది. ఆయన వేసిన బాటలో దేశం కోసం అన్నిటికీ తెగించి ముందుకు దూకాలని నేను నిశ్చయించుకున్నాను.’’
అని తరవాత కాలంలో గుర్తు చేసుకున్నాడు బాలచంద్ర దత్. అతడు తోటివాళ్లను కూడగట్టాడు. అప్పటికే నేతాజీ నెత్తురు మండే యువతకు హీరో! రోల్ మోడల్!! దేశ స్వాతంత్య్రంకోసం నేతాజీ సాగించిన అద్భుత సైనిక సంగ్రామం వివరాలు పత్రికల ద్వారా తెలిసేకొద్దీ యావద్భారతంలో లాగే నౌకాదళంలోనూ దేశభక్తి, పోరాటతత్వం ఉప్పొంగాయి. కదిలించినదే తడవుగా దత్తుకు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. నేతాజీ ప్రేరణతో పోరాటానికి కమిట్ అయ్యారు.
అంతా కలిసి 1945 డిసెంబరు నేవీ డే నాడు ముంబయిలో తమ తడాఖా చూపించాలనుకున్నారు. ‘క్విట్ ఇండియా’, ‘స్వాతంత్య్రం కోసం మీ నెత్తురు చిందించండి’, ‘ఇప్పుడే తిరగబడండి’ ‘బ్రిటిష్ సర్కార్ రోజులు మూడాయి’, ‘మ్యూటినీ కాదు యూనిటీ’, ‘సామ్రాజ్యవాదం నశించాలి’ లాంటి నినాదాలు ముంబయి రేవు దాపున నిలిచిన HMIS Talvaar నౌక గోడలనిండా రాత్రికి రాత్రి రాశారు.
నౌకాదళ చరిత్రలో కనీవినీ ఎరుగని ఆ తిరుగు బాటుకు తెల్లవాళ్లు అదిరిపడ్డారు. కలనైనా ఊహించని ఆ కుట్రకు కారకులెవరో కనుక్కోవటానికి విశ్వప్రయత్నం చేశారు. రహస్యాన్ని ఛేదించటం వారి తరం కాలేదు. దాంతో దత్తు బృందానికి మరింత తెగింపు వచ్చింది.
1946 ఫిబ్రవరి 2 నౌకాదళ కమాండర్ ఇన్ చీఫ్ అడ్మిరల్ జాన్ హెన్రీ గాడ్ ఫ్రే (ఇయాన్ ఫ్లెమింగ్ రాసిన జేమ్స్ బాండ్ నవలల్లోని ‘ఎం’ పాత్రకు అతడూ ఒక ప్రేరణ) ముంబయి విజిట్ చేశాడు. అతడికీ, బ్రిటిష్ సర్కారుకూ వ్యతిరేకంగా మళ్ళీ గోడల మీద నినాదాలు వెలిశాయి. తిరుగుబాటును ప్రేరేపించే కరపత్రాలూ, పోస్టర్లూ విస్తృతంగా వ్యాప్తి అయ్యాయి. అది సీమదొరలకు రెండో షాక్.
మరునాడు నేవీ అధికారులు దత్తును అరెస్టు చేశారు. అతడి లాకరులో విద్రోహకరమైన పత్రాలు దొరికాయని అభియోగం మోపారు. దర్యాప్తు చేసి దత్తును డిమోట్ చేసి సర్వీసు నుంచి తొలగించారు. సాటి రేటింగులు అతడికి వీరోచితంగా ఘన స్వాగతం ఇచ్చారు.
స్వరాజ్యం సాధించేంతవరకూ సమ్మె కట్టాలని అనుకుని నౌకాదళంలో సమ్మె నిర్వహణకు ఒక కేంద్ర కమిటీని ఏర్పరచారు. ఎం.ఎస్.ఖాన్ అనే ముస్లిం నావికుడిని అధ్యక్షుడుగా, మదన్ సింగ్ అనే సిక్కు నావికుడిని ఉపాధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. ముస్లిం లీగు ఒక పక్కన మత ఘర్షణల చిచ్చును దేశమంతటా అంటిస్తున్న సమయాన అన్ని మతాలకు చెందిన రేటింగులూ స్వాతంత్య్రం కోసం ఏకమయ్యారు. రాయల్ ఇండియన్ నేవీని వశం చేసుకుని భారత రాజకీయ నాయకత్వానికి అప్పగించటం వారి ధ్యేయం.
HMIS Talwaar సిగ్నల్ స్కూలు రేటింగ్స్ తమ కమాండర్ దాష్టీకానికి నిరసనగా హంగర్ స్ట్రైక్‌కు దిగటంతో 1946 ఫిబ్రవరి 18న చరిత్రకెక్కిన నావల్ మ్యూటినీ మొదలైంది. మరునాడు తల్వార్ ఓడలోని రేటింగ్సు ఇతరత్రా ఉన్న తమ సహచరుల మద్దతు కూడగట్టటానికి కాజిల్ బారక్స్, ఫోర్ట్ బారక్స్‌కు కట్టగట్టుకుని వెళ్ళారు. అన్ని ఎస్టాబ్లిష్‌మెంట్లకూ చెందిన 2వేల మంది రేటింగులు కలిసి ఆ ఉదయం గడ్డపలుగులు, సుత్తులు, హాకీ స్టిక్కులు పట్టుకుని మువ్వన్నెల పతాకాలూ, సుభాస్ చంద్రబోస్ పోస్టర్లూ ప్రదర్శిస్తూ మిలిటరీ ట్రక్కుల్లో, లారీల్లో సిటీ అంతటా తిరిగారు. మెయిల్ తీసుకువెళ్ళే వాహనాలను ఆపి మెయిల్ బాగ్స్ తగలబెట్టారు. కార్లు, గుర్రపు బగ్గీలలో వెళుతున్న విదేశీయులను అడ్డగించి కిందికి దింపి బలవంతంగా ‘జై హింద్’ నినాదం చేయించారు. దాంతో దేశమంతటా తెల్ల తోలు వారిలో గగ్గోలు పుట్టింది.
యూరోపియన్ల మీద దాడితో పరిస్థితి తీవ్రత గ్రహించి బాంబే గవర్నరు Sir J. Kolville పోలీసు కమిషనరు, ఆర్మీ, నేవీ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం జరిపాడు. సమ్మెదారులు హింసకు దిగలేదు, కాని పైవాళ్లను లెక్కచేసే స్థితిలో లేరు; కొంతమంది ఆఫీసర్లు, పెట్టీ ఆఫీసర్లు కూడా వారితో కలిశారు; పెద్ద మ్యూటినీయే లేచేటట్టు ఉన్నది; ఈ పరిస్థితిని తట్టుకునేందుకు నాకున్న వనరులు సరిపోవుబీ ఆ సంగతి పై వాళ్లకు రిపోర్టు చేశాను అని చెప్పి చేతులెత్తేశాడు అడ్మిరల్ రాట్రే.
సిటీలో ఉన్న నావల్ ఎస్టాబ్లిష్‌మెంట్లకు తోడు హార్బరులోని 22 షిప్పులకూ, బాంబే వెలుపల షోర్ ఎస్టాబ్లిష్‌మెంట్లకూ తిరుగుబాటు పాకిందని సమీక్షా సమావేశంలో తేలింది. మిలిటరీని, ఆర్మ్‌డ్ పోలీసు లనూ దింపితే గానీ పరిస్థితి అదుపు చేయలేమని అర్థమయింది. స్థానిక ఏరియా కమాండర్ చేతిలో అందుబాటులో ఉన్నవి ఒకటిన్నర బెటాలియన్లు మాత్రమే. ఫోర్టు, కాజిల్ బారక్స్‌లోని ఆయుధగారాల నుంచి మ్యూటినీర్లు ఆయుధాలు గుంజుకుంటే ప్రమాదం. కాబట్టి వాటిని ముందు సురక్షితం కావించాలని నిర్ణయమయింది.
ఆ రాత్రి కాజిల్ బారక్స్‌లో కీలకమైన కమ్యూనికేషన్ రూమ్ మీద మ్యూటినీర్లు దాడి చేశారు. అధికారులు అతికష్టం మీద వారిని వెనక్కి పంపించారు. మర్నాడు మ్యూటినీర్లను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని బారక్స్‌లో బంధించమని జనరల్ బెయెర్డ్‌కు ఆదేశాలు వచ్చాయి. మధ్యాహ్నం మూడున్నరకల్లా రేటింగ్స్ అందరూ బారక్స్‌లోకి వెళ్ళాలని, బయట కనిపిస్తే అరెస్టు చేస్తామని లౌడ్ స్పీకర్లలో నగరమంతటా చాటించారు. చాలామంది బారక్స్‌కు తిరిగివెళ్లారు. వందమంది రేటింగ్సును మరాఠా బెటాలియన్, సాయుధ పోలీసులు వీధుల్లో అరెస్టు చేశారు.
ఫిబ్రవరి 21న మ్యూటినీ పతాక స్థాయికి చేరింది. ఆ రోజు ఉదయం బారక్స్ నుంచి బల వంతంగా బయట పడ్డ సమ్మెదారుల మీద బ్రిటిష్ ట్రూప్సు కాల్పులు జరిపాయి. రేటింగులు ఆయుధ గారాన్ని బద్దలు కొట్టి ఆయుధాలు, అమ్యూనిషను గుంజుకుని మరాఠా లైట్ ఇన్ఫెంట్రీప్లాటూన్ మీద ఎదురుకాల్పులు జరిపారు. కాజిల్ బారక్స్‌లో ఆ రోజు సాయుధ యుద్ధమే జరిగింది. రైఫిళ్లకు తోడు లైట్ మెషిన్ గన్లు, గ్రెనేడ్లు కూడా రేటింగులు ఉపయోగించారు.
తిరగబడ్డ రేటింగ్స్‌కు మద్దతుగా జనం కదిలారు. కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీల వారు పోరాటంలో చేరారు. దేశభక్తి ఉన్న సామాన్య కాంగ్రెస్ కార్యకర్తలూ వారితో కలిశారు. మూడు రోజుల పాటు అల్లర్లతో ముంబయి అతలాకుతల మయింది. ప్రభుత్వ ధాన్యం దుకాణాలు, బ్రిటిషు వారికి చెందిన బ్యాంకులు, స్టోర్లు దగ్ధమయ్యాయి.
ఇండియన్ నేషనల్ ఆర్మీ మాదిరిగా తమది ఇండియన్ నేషనల్ నేవీ అని మ్యూటినీర్లు పేరు పెట్టుకున్నారు. ముంబయి హార్బర్‌లో 20 షిప్పులను, నావల్ డాక్ యార్డును వశపరచుకుని ఎల్లెడలా ‘క్విట్ ఇండియా’ అని రాసి, దిక్కులు దద్దరిల్లేలా నినాదాలు చేశారు. యూనియన్ జాక్ పతాకం పీకేసి, కాంగ్రెస్, ముస్లిం లీగ్ జెండాలు ఎగరేశారు. సాయంత్రం మ్యూటినీర్లు ఇండియన్లను లోపలికి అడుగుపెట్టనివ్వని బాంబే యాట్ క్లబ్ మీద తమ ఆర్టిలరీని ఎక్కుపెట్టారు. ఆరుగంటల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఇరువైపులా ప్రాణనష్టం బాగా అయింది.
కాజిల్ బారక్స్ అంతటా మ్యూటినీ ఉద్ధృతమవటంతో గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర వాటర్ ఫ్రంట్, డాక్స్ దారుల రక్షణకు లీసేస్టర్ షైర్ రెజిమెంట్, రాయల్ మెరైన్ల బ్రిటిషు బలగాలను మోహరించారు.
బ్రిటిషు సర్కారు తీవ్ర స్థాయి తిరుగుబాటు పరిస్థితిని ప్రకటించింది. నగరంలో రాత్రివేళ తిరుగుతూ ఎవరు కనిపించినా కాల్చివేయమని సాయుధ బలగాలకు ఉత్తర్వులిచ్చింది.
నావల్ మ్యూటినీకి సంఘీభావంగా నావల్ ఎక్కౌంట్స్ విభాగంలోని సివిలియన్ సిబ్బంది సమ్మె కట్టారు. 1200 మంది రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులూ ఊరేగింపు తీసి సంఘీభావం ప్రకటించారు. వైమానిక దళంలోని ఇండియన్ పైలట్లు షిప్పుల మీద బాంబులు వేసే విమానాలను నడపటానికి నిరాకరించారు. నావల్ రేటింగ్సు మీద పోరుకు వెళ్ళే బ్రిటిషు ట్రూప్సును తీసుకువెళ్ళేది లేదని ట్రాన్స్‌పోర్టు యూనిట్లు మొండికేశాయి. ఇండియన్ స్క్వాడ్రన్లను నమ్ముకునే పరిస్థితి లేకపోవటంతో ఆగ్నేయాసియా నుంచి మిత్రరాజ్యాల విమానాల కోసం బ్రిటిషు అధికారులు కబురుపెట్టారు. బహిరంగ తిరుగుబాటు దృష్ట్యా ముంబయి హార్బరు లోని 24 యుద్ధనౌకలను వదిలి వెళ్ళమని బ్రిటిషు ఆఫీసర్లకు ఆదేశాలు వెళ్ళాయి. ఇండియా నుంచి అర్జెంటు అభ్యర్ధనపై రాయల్ నేవీ క్రూయిజర్ సహా అనేక యుద్ధనౌకలను ముంబయికి హుటాహుటిన పంపించినట్టు లండన్‌లో ప్రధాని క్లెమెంట్ అట్లీ కామన్స్ సభలో ప్రకటించాడు.
నావల్ మ్యూటినీకి మద్దతుగా 20వేల మంది మిల్లు కార్మికులు సమ్మె చేయటంతో ముంబయిలో ఎన్నో బట్టలమిల్లులు మూతపడ్డాయి. జనాలకు, పోలీసులకూ మధ్య లెక్కలేనన్ని వీధి పోరాటాలు జరిగాయి. బస్సులు, ట్రాములు, కార్లు ధ్వంసం కావటంతో నగర ప్రజారవాణా వ్యవస్థ అధ్వాన మయింది. రెచ్చిపోయిన మూకలు ఆఫీసులు, మిల్లులు, ప్రభుత్వ ధాన్యం దుకాణాలను దగ్ధం చేశారు. ఎన్నో చోట్ల యూనియన్ జాక్ జెండా తగులబెట్టారు. మొత్తం పౌర పరిపాలన స్తంభించింది. 14 లక్షల జనాభా గల మహానగరాన్ని మిలిటరీకి అప్పగించారు. మూకలకు, పోలీసులకు నడుమ ఘర్షణల్లో 150 మంది మరణించారు. 1500 మంది తీవ్రంగా గాయపడ్డారు.
బారక్స్ నించి మిలిటరీ గార్డులను తక్షణం ఉపసంహరించకపోతే కాల్పులు తప్పవు అంటూ 21వ తేదీ సాయంత్రం హార్బరులో నిలిచిన యుద్ధ నౌకలనుంచి అల్టిమేటం అందింది. భారీ శతఘ్నులతో కాల్పులు జరపటానికి నిజంగానే ఆ షిప్పులలోని మ్యూటినీర్లు సర్వసన్నద్ధమయ్యారు. బెదిరింపులకు జడిసి గార్డులను ఉపసంహరించేది లేదని సర్కారు ప్రకటించింది. అదనపు శతఘ్నులు, బాంబర్ విమానాల కోసం హుటాహుటిన ఏర్పాట్లు జరిగాయి.
బ్రిటిష్ సర్కారు అలజడిని అణచివేయటానికి సర్వ శక్తులూ ఒడ్డింది. ఇండియన్ ట్రూప్స్‌ను కల్లోలిత ప్రాంతాల్లో విధులనుంచి తప్పించారు. నౌకాదళ కమాండర్ ఇన్ చీఫ్ అడ్మిరల్ గాడ్ ఫ్రే దిల్లీ నుంచి పరుగున వచ్చి ముంబయిలో పరిస్థితిని స్వయంగా డీల్ చేశాడు. ‘submit or perish’ (లొంగండి లేదా చావండి) అని రేడియో ద్వారా రేటింగ్సుకు అల్టిమేటం ఇచ్చాడు. బలప్రదర్శన కోసం 19 ఎయిర్ ఫోర్స్ విమానాలు ముంబయి సిటీ, హార్బర్ల మీద చక్కర్లు కొట్టాయి. పన్నెండు పౌడర్ గన్లతో ఆర్టిలరీ రెజిమెంటు, ఎన్నో ఆర్మడ్ శకటాలు నగరానికి చేరుకున్నాయి. రాయల్ ఎయిర్ ఫోర్స్ బాంబర్ విమానాలు సీమ నుంచి శాంతాక్రుజ్ ఎయిర్ పోర్టుకు వచ్చాయి. మ్యూటినీర్లు ఒక ఆర్మడ్ డిస్ట్రాయర్‌ను సముద్రంలో నిలిపి దాని గన్లను గేట్ వే ఆఫ్ ఇండియా వైపు గురిపెట్టారు. వాళ్ళు ఫైర్ చేస్తే షిప్పును ముంచెయ్యమని సర్కారు ఆదేశించింది.
నావల్ రేటింగ్స్ తిరుగుబాటు వార్తలు పత్రికలూ, ఆలిండియా రేడియో ద్వారా దేశమంతటా విస్తృతంగా వ్యాప్తి అయ్యాయి. ముంబయిలో మొదలైన విప్లవం క్రమంగా ఇతర నౌకాస్థావరాలకూ పాకింది. కోల్‌కతాలో షోర్ ఎస్టాబ్లిష్‌మెంట్ HMIS Hooghlyలోని రేటింగ్సు ఫిబ్రవరి 22న మెరపు సమ్మె మొదలెట్టారు. మద్రాసులో HMIS Adayar, విశాఖపట్నంలో HMIS Sonavati రేటింగ్సు సమ్మెలో కలిసి, త్రివర్ణపతాకం చేతపట్టి, ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదం చేస్తూ వీధుల్లో ఊరేగారు. ఫిబ్రవరి 25న రేటింగ్సు మ్యూటినీకి సంఘీభావంగా మద్రాస్ నగరం అంతటా బంద్ జరిగింది.
మొత్తం 11 షోర్ ఎస్టాబ్లిష్‌మెంట్లలోనూ కలిపి 20వేల నేవీ రేటింగ్స్ సమ్మెలో చేరారు. అన్ని భవనాల నుంచి, నౌకల నుంచి యూనియన్ జాక్ జెండాలు లాగేశారు. 20వ తేదీ రాత్రికల్లా నేవీ యావత్తూ బాహాటంగా తిరగబడింది. ముంబయి, కరాచీ, మద్రాస్, విశాఖపట్నం, కోల్‌కతా, కొచ్చిన్, అండమాన్స్ రేవుల్లో 78 షిప్పులు, బ్రిటిష్ జెండాను పీకి త్రివర్ణపతాకం ఎగరేశాయి. పది షిప్పులు, రెండు షోర్ ఎస్టాబ్లిష్మెంట్లు మాత్రమే బ్రిటిషు వారి చేతుల్లో మిగిలాయి. సాయుధ బలగాలకు చెందిన ఇతర యూనిట్లకూ తిరుగుబాటు చప్పున వ్యాపించింది. ఫిబ్రవరి 25 కల్లా ముంబయి, మద్రాసులలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సమ్మెలో చేరింది. కొన్ని రోజులపాటు ఎక్కడ చూసినా అల్లకల్లోలం.
‘‘ఈ మొత్తం పరిణామాల్లో ఆందోళనకరమైన అంశం ఏమిటంటే అలా జరుగుతుందని మనకు ముందస్తుగా ఎలాంటి వార్నింగు లేకపోవటం! కాస్తలో తప్పిపోయింది గాని రేటింగ్సు కరాచీలోనూ స్వైరవిహారం చేసి బాంబేలో చేసినన్ని అఘాయిత్యాలు ఇక్కడా చేయగలిగేవారే. మన బలగాలను మనమే నమ్మలేని పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలన్నది కమాండర్ ఇన్ చీఫ్‌తో మీరు మాట్లాడాలి’’ అంటూ కరాచీ గవర్నర్ Sir E. Mudie 1946 ఫిబ్రవరి 26న వైస్‌రాయికి రహస్య లేఖ రాశాడు. అత్యంత విశ్వాసపాత్రులని పేరుపడ్డ ఆర్మీ వెటరన్లు కూడా తీవ్రవాద నేషనలిస్టు గ్రూపుల రహస్య సమావేశాలకు హాజరవుతున్నట్టు ప్రభుత్వానికి వేగులందాయి.
నేతాజీ సుభాస్ చంద్రబోస్ రగిలించిన జాతీయ స్ఫూర్తి నౌకా, వైమానిక దళాల నుంచి ఆంగ్ల సామ్రాజ్య ప్రాభవానికి వెన్నెముక అయిన ఆర్మీకీ అంటుకుంది. ఫిబ్రవరి 26న జబల్పూర్‌లోని సిగ్నల్ ట్రెయినింగ్ సెంటర్‌లో పనిచేసే రెండువేల మంది సిగ్నల్ కోర్ సైనికులు ముంబాయి నావల్ రేటింగ్సుపై కాల్పులకు నిరసనగా ఆకస్మిక సమ్మె చేశారు. యూనిట్ నోటీసు బోర్డుల మీద జైహింద్ నినాదాలు రాశారు. మరునాడు సమ్మెదారులు ఆర్మీ యూనిఫాంలు ధరించి బ్రిటిష్ అధికారులు ఎంతగా వారించినా వినకుండా ‘జైహింద్’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని నినదిస్తూ నగరవీధుల్లో కాంగ్రెస్, ముస్లిం లీగ్ జెండాలతో బ్రిటిష్ వ్యతిరేక ప్రదర్శన జరిపారు. ఇండియన్ సిగ్నల్స్ డిపో కమాండర్ అయిన లెఫ్టినెంట్ కల్నల్ ఆండర్సన్ అనే ఆంగ్లేయుడు ముందుకు కదిలితే కాల్చేస్తానని రైఫిల్ ఎక్కుపెడితే, సైనికులు ధైర్యంగా ఛాతి చూపించి కాల్చమన్నారు. విదేశీయుడు వెనకడుగు వేశాడు.
నగరవీధుల్లో పెరేడ్ చేశాక సైనికులు జబల్పూర్‌లోని తిలక్ భూమిలో పెద్ద బహిరంగ సభ పెట్టారు. నేతాజీ బోస్ చిత్రపటానికి మిలిటరీ సెల్యూట్ చేశారు. ‘అందరం పుట్టింది బానిసలుగానే! అయినా మేము బానిసలుగా చావదలచలేదు. దేశ స్వాతంత్య్రం కోసం మా చివరి రక్తపు బొట్టును చిందించటానికి సిద్ధంగా ఉన్నాం’ అని ఒక సైనికుడు చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సైనికుల సమ్మెకు మద్దతుగా స్కూళ్ళు, కాలేజీలు, మార్కెట్లు స్వచ్ఛందంగా మూసేశారు.
ఇతర దేశాల్లో ఉన్న బ్రిటిష్ సైనిక బలగాల్లో ఇండియన్లదే పెద్ద సంఖ్య. ముంబయి నేవీలో పుట్టిన మ్యూటినీ వైరసు ప్రపంచంలో ప్రధానమైన ట్రబుల్ స్పాట్లయిన బర్మా, హాంగ్‌కాంగ్, మలయా, ఈజిప్టు, ఇరాక్, ఇండోనీసియా, సిరియాలకు కూడా పాకి అక్కడి ఇండియన్ ట్రూప్సు కూడా తిరగబడితే బ్రిటిషు సామ్రాజ్యం పరువు ఏమి కాను? అని తెల్లదొరలు తలలు పట్టుకున్నారు. దిల్లీ సహా ఏడు నగరాలను తిరగబడ్డ సైనికులు వశపరచుకోగలిగిన 1857 విప్లవం గుర్తుకొచ్చి తమ ముందు గతి ఏమిటా? అని బ్రిటిష్ సామ్రాజ్యం గాబరాపడింది,
“Events of the past few days show that the days of the British rule in India are numbered. When the organised forces in India have defied orders, the British Raj must realise that in addition to the civilian population, the very armed forces on which it had relied in the past were no longer reliable.” (ఇండియాలో బ్రిటిష్ పరిపాలనకు రోజులు దగ్గరపడ్డాయని ఇటీవలి ఘటనలను బట్టి అర్థమవుతుంది. సంఘటిత సైనిక దళాలే ఆజ్ఞలను ధిక్కరించాయంటే ఇంతకాలమూ తాము ఆధారపడిన సాయుధ బలగాల మీద ఇంకేమాత్రం ఆధారపడటానికి వీల్లేదని బ్రిటిష్ రాజ్ గ్రహించాలి)
– అని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పొలిటికల్ సెక్రెటరీ ఫెన్నర్ బ్రాక్వే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి లండన్‌లో పైకి అనేశాడు.
బ్రిటిష్ సర్కారు మనసులో గుబులూ అదే! కళ్ళు మూసినా తెరిచినా వారికి 1857 పీడకలే!!
మిగతా వచ్చేవారం