ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

కొత్త విద్యావిధానం ప్రాథమిక విద్య మాతృభాషలో జరగాలని నిర్దేశిస్తున్నది. కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఒక నిబంధన, విధానం ఉన్నదన్న విషయమే తెలియనట్టు వ్యవహరిస్తున్నాయి. ప్రాథమిక విద్య మాతృభాషలో జరగాలని చెప్పడంలో ఏ విధమైన ఛాందసత్వాన్ని చూడనక్కరలేదు. అది శాస్త్రీయమైన చింతన. ఇరుగు పొరుగు రాష్ట్రాలలో, ప్రపంచ దేశాలలో మాతృభాషకు ఉన్న గౌరవ ప్రతిష్టలు మన తెలుగు రాష్ట్రాలలో ఎందుకు లేవు? నిజానికి ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలలో మొదటి వరసలో ఉన్న చాలా దేశాలు తమ మాతృభాషనే నమ్ముకున్నాయి. పర భాషా వ్యామోహంతో అమ్మభాషను నిర్లక్ష్యం చేయడం క్షమించరానిది. ‘అమ్మభాషను పరిరక్షించుకోవడం సామాజిక అవసరం’. ‘దేశ క్షేమానికి భాషా క్షేమం పునాది’ అని వ్యవహారిక భాషా ఉద్యమకారుడు గిడుగు రామమూర్తి చెప్పేవారు.


అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి ఉద్విగ్నభరిత నేపథ్యం ఉంది. పాకిస్తాన్‌లో అంతర్భా గంగా ఉన్నప్పుడు తూర్పు పాకిస్తాన్‌ (ఇవాళ్టి బంగ్లాదేశ్‌) ‌ప్రజలు బెంగాలీ భాషకు గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఢాకాలో (బంగ్లాదేశ్‌ ‌రాజధాని) విశ్వవిద్యాలయ విద్యార్థులు, వైద్య విద్యార్థులు వేల సంఖ్యలో ఫిబ్రవరి 21, 1952న ప్రదర్శన నిర్వహించారు. పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం వారి కోరికను తిరస్కరించడమే కాదు, కాల్పులు జరిపింది. ఆ దారుణ మారణకాండలో ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అమ్మభాష కోసం జరిగిన బలిదానాలివి. బంగ్లాదేశ్‌ ఆవిర్భవించిన తర్వాత సంఘటనను దృష్టిలో పెట్టుకొని వారి అభ్యర్థన మేరకు 1999 నవంబర్‌లో యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా గుర్తించి ప్రకటించింది. ఫిబ్రవరి 21, 2000 సంవత్సరం నుండి అతర్జాతీయ మాతృభాషా దినోత్సవాలు గత రెండు దశాబ్దాలకు పైగా ‘11 భాషల రోదసిలో ప్రతి పదమూ ఒక మెరిసే నక్షత్రం’ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు.

యునెస్కో 2008 సంవత్సరాన్ని అంతర్జాతీయ మాతృభాషా సంవత్సరంగా కూడా ప్రకటించింది. 2012 సంవత్సరం మాతృభాషలో విద్యాబోధన ప్రాముఖ్యాన్ని గుర్తించవలసిన సంవత్సరంగా ప్రకటించింది.

2019 సంవత్సరాన్ని మూలవాసుల భాషల ఏడాదిగా ప్రకటించి ఆ భాషల అభివృద్ధి కోసం ఐక్యరాజ్య సమితి అనేక కార్యక్రమాలు రూపొందించి, నిర్వహించింది. సభ్యదేశాలు కూడా తమ స్థోమతనను సరించి, ఐ.రా.స. సందేశాన్ని అనుసరించి మూల భాషల అభివృద్ధి కోసం తీర్మానాలు చేశాయి. మెక్సికోలోని లాస్‌పినాస్‌ ‌నగరంలో జరిగిన ముగింపు సమావేశంలో మాతృభాషల పరిరక్షణ కోసం 2022-2032 దశాబ్దిని మూలవాసుల మాతృ భాషల దశాబ్దంగా జరుపుకొంటూ భాషా పరిరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై చర్చించింది. ముఖ్యంగా వ్యూహాత్మకమైన ఎనిమిది దిశానిర్దేశాల ద్వారా భాషలను ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి చేయవచ్చని తీర్మానించింది. యునెస్కో ఎన్నో దిశానిర్దేశాలు చేసింది.

ఎన్ని మాతృభాషా దినోత్సవాలు (ఆగస్టు 29, గిడుగువారి జయంతి): ఎన్ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాలు జరుపుకున్నా మన మాతృభాష ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందక దిగ జారిపోవడం శోచనీయం. తెలుగుభాష ఒకప్పుడు ప్రవాసాంధ్రులతో దాదాపు 18 కోట్లమంది వ్యవహర్తలతో జాతీయస్థాయిలో రెండోస్థానంలో, ప్రపంచస్థాయిలో 15వ స్థానంలో ఉండేది. ప్రస్తుతం తెలుగుభాష జాతీయస్థాయిలో 4వ స్థానంలో ఉంది. రెండో స్థానంలో బెంగాలీ, మూడోస్థానంలో మరాఠీ భాషలున్నాయి.

‘దేశ భాషలందు తెలుగు లెస్స’గా శ్రీనాథుడు, శ్రీకృష్ణ దేవరాయలు వంటి మహాకవులు కీర్తించారు. అప్పయ్య దీక్షితులు అనే సంస్కృత పండితుడు ఆంధ్రుడిగా జన్మించడం, ఆంధ్రభాష మాతృభాషగా కలిగి ఉండటం ఎన్నో జన్మల తపః ఫలమని వేనోళ్ల కొనియాడారు.

ఏడీ క్యాంప్‌బెల్‌ అనే పాశ్యాత్య పండితుడు ‘శబ్ద సంపదలోనూ, శబ్ద సౌష్ఠవంలోనూ, భావ వ్యక్తీకరణ లోనూ, శ్రావ్యతలోనూ, తెలుగుకు తక్కిన భాషలు సాటిరావు’ అని 1816లో తెలుగు వ్యాకరణ గ్రంథం పీఠికలో మెచ్చుకున్నాడు. ‘హెన్నీమోరిస్‌’ అనే మరో పాశ్చాత్య పండితుడు (1890), నిరక్షర కుక్షి మాట్లాడినా, తెలుగు శ్రవణానందకరంగా ఉంటుంది. తెలుగు ద్రావిడ భాషలన్నింటిలో మధురాతి మధుర మైంది. ఒకనాటికి జాతీయ భాష కాగలిగిన అర్హత తెలుగుభాషకు ఉందని ప్రశంసించాడు. ప్రసిద్ధ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి ‘వెన్నెల్లో పడవ ప్రయాణం చేస్తూ అప్పుడే వికసించిన మల్లెపూలను ఆఘ్రాణిస్తే కలిగే అనుభూతి తెలుగుభాష వింటున్నప్పుడు కలుగుతుందని’ సుందర తెలుంగుగా అభివర్ణించాడు. ఇంత గొప్పతనం ఉన్న మనభాష నిరాదరణకు గురి కావడం బాధాకరం.

యునెస్కో గణాంకాల ప్రకారం ఏ భాషా వ్యవహార్తల సంఖ్య ఆ భాష మాట్లాడేవారి జనాభాలో 30 శాతానికి తక్కువగా ఉంటే ఆ భాషను మృత భాషగా పరిగణిస్తారు.

యునెస్కో గణాంకాల మేరకు ఇప్పటికే ప్రపంచంలో ఉన్న ఆరువేల భాషల్లో మూడువేల భాషలు మృతభాషలైనట్లు తేలింది. తెలుగుభాష కూడా అలాంటి ప్రమాదపు అంచున ఉందని యునెస్కో ఇప్పటికే హెచ్చరించింది. ఆ ముప్పే ఎదురైతే ఆ పాపం ఎవరిది? భాష మనుగడను దెబ్బతీసే అనాలోచిత నిర్ణయాలు చేసే ప్రభుత్వానిదా? తల్లిభాష ఉనికి దెబ్బ తింటున్నా ఉపేక్షా భావంతో ఉన్న మనందరిదీనా? భాషా దినోత్సవాలు జరిపి నంత మాత్రాన మాతృభాషా పరిరక్షణ జరుగదు. ప్రభుత్వాలు భాషాభిమానులను భాగస్వాములను చేసి చిత్తశుద్ధితో కృషిచేయాలి. ప్రభుత్వాలు కళ్లు తెరవకుంటే ఇంట్లో అయినా రేపటి తరం వారికి తెలుగును నేర్పాలి.

మాతృభాష ఉనికిని ప్రపంచీకరణ ప్రభావం దెబ్బతీస్తున్నది. ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చే లక్ష్యంతో ఉన్న ప్రపంచీకరణ వివిధ దేశాల మీద, విభిన్న జాతుల ‘సంస్కృతుల మీద, వాటి జీవన విధానంపైన తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. విభిన్నజాతుల, వివిధ భాషల సంస్కృతులతో విలసిల్లే భారతదేశంలో ప్రవేశించిన తర్వాత స్థానికంగా ఉన్న మాతృభాషలు తమ ఉనికిని కోల్పోతున్నాయి. ప్రపంచీకరణ ప్రభావం తెలుగు భాషా సంస్కృతులు ఎందకు పనికిరానివిగా ప్రచారం చేస్తూ ప్రజల్లో భ్రమలను కల్పించింది. ఆంగ్లభాష ఒక్కటే ఉద్యోగాలను కల్పించగలదు అనే మానసిక స్థితిలోకి ప్రజలను నెట్టి వేయడంలో దాదాపు సఫలీకృతమైంది. ధనిక దేశాల సంస్కృతే అసలైన సంస్కృతిగా భ్రమ కల్పించింది. వారి భాషే నాగరిక భాష అన్న విష ప్రచారంతో భాషా సంస్కృతులను ఏకకాలంలో తెలుగు నేలమీద విస్తరింపజేసింది. పాలనారంగంలో ఉత్తర ప్రత్యుత్తరాలను తెలుగుభాషలో నిర్వహించాలన్న అధికార భాషా సంఘం వారి ఉత్తర్వులు సైతం ఆచరణలో విఫలమయ్యాయి.

ప్రపంచీకరణ విష ప్రభావంతో ఆంగ్లభాషా ప్రభావం ప్రజల్లో బలీయంగా నాటుకుంది. బడుగు బలహీనవర్గాల ప్రజలు సైతం ఆర్థిక స్థోమత లేకున్నా తమ పిల్లలను కార్పొరేట్‌ ‌విద్యాసంస్థల్లో ఆంగ్ల మాధ్యమంలో చదివించాలన్న పట్టుదల పెరిగింది. ప్రజల ఆకాంక్ష ఇదేనంటూ ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశ పెట్టింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంధప్రదేశ్‌ను అనుసరించి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఆంగ్ల మాధ్యమ బోధన ఐచ్ఛికంగా నేర్పాలి. నిర్భందం కారాదు. భాషాభి మానులు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని నిరసిస్తున్నారు. ప్రభుత్వాలు పదోతరగతి వరకు ప్రథమ భాషగా మాతృభాషను చదివే నిబంధనను చిత్తశుద్ధితో అమలు చేసేవిధంగా భాషాభిమానులు పట్టుదలతో ప్రయత్నం చేయాలి.

కార్పొరేట్‌ ‌విద్యాసంస్థలు ఇంటర్మీడియట్‌ ‌స్థాయిలో మార్కుల సాధనకోసం మాతృభాష తెలుగు స్థానంలో సంస్కృతాన్ని నిర్భంధంగా చదివించేందుకు చేసే ప్రయత్నం మాతృభాష ఆదరణ కోల్పోవడానికి ప్రబలమైన కారణం. తెలుగుభాషకు తీరని ద్రోహం. ఇది తెలుగుకు జరుగుతున్న అన్యాయం కోణం నుంచి మాత్రమే చెప్పడమే కాని, సంస్కృతాన్ని ద్వేషించడానికి కాదు. మార్కుల పేరుతో తెలుగును పక్కన పెట్టే వాతావరణం నిరసించవలసినదే. దేవనాగరలిపి అక్షరాలు రాకున్నా ప్రతి సంవత్సరం నిర్భంధంగా లక్షలాది మంది విద్యార్థుల చేత సంస్కృతాన్ని చదివి స్తున్నారు. ఉన్నత విద్యాశాఖా మంత్రులు కార్పొరేట్‌ ‌కళాశాలల యాజమాన్యాలు సమావేశాలు ఏర్పాటు చేసి పదోతరగతిలో సంస్కృతం చదివిన వారికి, దేవనాగరలిపిలో రాయగలిగిన వారికి మాత్రమే సంస్కృతం చదివే అవకాశం కల్పించాలి. మిగిలిన విద్యార్థులు విడిగా తెలుగుభాషను చదివే విధంగా చట్టం చేయాలి. ఈ విషయంలో అధికార భాషా సంఘాలు, మాతృభాషాభిమానులు పట్టుదలతో ప్రయత్నం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు వారికి సహకరించి తెలుగుభాషను ప్రోత్సహించాలి.

అప్పర్‌ ‌ప్రైమరీ పాఠశాలలన్నింటిలో రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన తెలుగు ఉపాధ్యాయులను నియమించి తెలుగు భాషా బోధనను నిర్మాణాత్మకంగా కొనసాగేలా చేయాలి.

ఇంగ్లీషు కాన్వెంటు పాఠశాలల్లో తెలుగు మాట్లా డిన విద్యార్థులను శిక్షించే అమానుష సంప్రదాయాన్ని కఠినచర్యల ద్వారా అరికట్టాలి. అవసరమైతే ఆ సంస్థల గుర్తింపును ప్రభుత్వం రద్దు చేయాలి.

అధికార భాషా సంఘాల ఆధ్వర్యంలో తెలుగు అకాడమీ సహకారంతో ఒక సమగ్రమైన తెలుగు – తెలుగు నిఘంటువును తయారు చేయించాలి. గ్రాంథిక పదాలకు సరళమైన వ్యవహారిక పదాలను సూచించాలి. తెలుగు జాతీయాలు, సామెతలు, వివిధ ప్రాంతాల్లో ఉన్న మాండలిక పదాలను క్రోడీకరించి ప్రామాణికంగా రూపొందించాలి. ద్రావిడ భాషల న్నింటిలో సమగ్రమైన నిఘంటువుల రూపకల్పన ఎప్పుడో జరిగింది.

అధికార భాషా సంఘాలు జిల్లా స్థాయిలో ఏర్పాటుచేసి పాలనాభాషగా, బోధనా భాషగా తెలుగును పర్యవేక్షించే ప్రయత్నం చేయాలి. అధికార భాషా సంఘాలు అధికారం లేని నామమాత్రపు సంఘాలుగా కొనసాగితే ప్రయోజనం శూన్యం.

తెలుగు తెలిసిన వారితో విడిగా తెలుగులో మాట్లాడాలి. ప్రపంచీకరణ ప్రభావంతో ఆంగ్లభాషా పాలకులుగా మారినవారు మాతృభాషాభిమానంతో మసలుకోవాలి. తమ పిల్లలకు తెలుగు రాదని ఆడంబరంగా చెప్పుకునే పద్ధతికి స్వస్తిపలకాలి.

ప్రభుత్వాలు సివిల్‌ ‌సర్వీసెస్‌ ‌పరీక్షల్లో మాదిరి రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు కమీషన్‌ ‌పరీక్షల్లో గ్రూపు I, II, III, IV అన్నింటిలో తెలుగు భాషా సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా మార్చాలి. ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం గ్రామ సచివాలయాల పరీక్షల్లో ప్రస్తుతం నామ మాత్రంగా ఉన్న తెలుగు ప్రాధాన్యాన్ని కనీసం 25 మార్కులకు పెంచాలి. తెలుగులో లేఖారచన, దరఖాస్తులు, ఫిర్యాదులు వంటి వాటితో పాటు జాతీయాలు, సామెతలు వంటి వాటిని చేర్చాలి.

ప్రభుత్వాలు మాతృభాషా పరిరక్షణకు ఈ సూచనలు పాటిస్తారని ఆశిద్దాం.

– డా।।పి.వి.సుబ్బారావు, రిటైర్డ్ ‌ప్రొఫెసర్‌

About Author

By editor

Twitter
YOUTUBE