శ్రీరామానుజాచార్యుల ఆశీస్సుల వల్ల వేయేళ్ల క్రితమే ఈ భూమికి సమతా వాదం తెలిసిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పరమ పూజనీయ సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్‌జీ భాగవత్ అన్నారు. హిందువులు ఆత్మవిస్మృతి, ఆత్మన్యూనత విడనాడాల్సిన సమయం ఆసన్నమైనదనీ, ప్రతి విషయానికి హిందువులు వృధాగా భయపడుతున్నారనీ ఆయన అన్నారు. ఈ దేశాన్ని పాలిస్తున్న వారు హిందువులేనని, చాలా రాజకీయపక్షాలకు నేతృత్వం వహిస్తున్నవారు, వాటిలో కొనసాగుతున్న వారు అత్యధికంగా హిందువులేనని చెప్పారు. హిందూశక్తి ముందు ఏ శక్తి నిలబడలేదనీ, కనుక ఆత్మవిస్మృతి, ఆత్మన్యూనతా భావనలను వీడి నడుం బిగించాలని డాక్టర్ భాగవత్ పిలుపునిచ్చారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా శ్రీరామ నగరం (ముచ్చింతల్)లో పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ త్రిదండి శ్రీమన్నారా యణ చిన్న జీయర్ స్వామి ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డా. మోహన్‌జీ, శ్రీ భయ్యాజీ జోషీ తదితరులు పాల్గొన్నారు. ‘సమతా మూర్తి’ భగవద్రా మానుజుల పంచలోహ విగ్రహాన్ని మోహన్ జీ దర్శించుకున్నారు. 108 దివ్యదేశా లనూ సందర్శించి, యాగశాలల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో, సాధుసంతుల సమ్మేళనంలో సర్ సంఘ్‌చాలక్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఇచ్చిన సందేశం:
‘‘పూజనీయ సాధుపుంగవులారా! సభలో ఆసీనులైన సజ్జనులారా, మాతలారా, సోదరులారా! ఈ కార్యక్రమంలో పాల్గొని సమాజంలో శాంతి కోసం, విపత్కర పరిస్థితులలో అనుసరించాల్సిన పద్ధతుల గురించి మన సాధుసంతులు చేసిన మార్గ దర్శనం, సాగిన మేధోమథనంతో అన్ని విషయాలు స్పష్టమైనాయి. అయితే ఈ మాటలన్నీ మీ దాకా, మన దాకా చేరాయా లేదా? ఈ విషయాన్ని తెలుసుకోవాలని సాధుసంతులు పరీక్షించదలచి నట్టున్నారు. అది తెలుసుకునేందుకే నాకిక్కడ మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. దాంతో ఇప్పుడిక్కడ నా వేషమే మారిపోయింది. వేషం మారినంతనే జ్ఞానం, వైరాగ్యం వస్తాయా? వాటికోసం తపస్సు చేయాలి.
ధర్మరక్షణ విషయానికొద్దాం. ధర్మాన్ని రక్షించా లంటే ఏం చేయాలి? నాకో కథ గుర్తుకొస్తోంది. అడవిలోని కుందేలు కథ. అది గడ్డి తినేసి ఒక చెట్టు కింద నిద్రపోతోంది. ప్రక్కనున్న తాడిచెట్టు నుండి అకస్మాత్తుగా మట్ట పడింది. కుందేలు భయపడి, పారిపోయి వేరేచోట దాక్కొంది. కాస్సేపయ్యాక తలెత్తి చూస్తే, పడింది తాటిమట్ట. నాకు భగవంతుడు అన్యాయం చేశాడు. నాక్కూడా ఏనుగు శరీరమిచ్చి ఉంటే తాటిమట్ట పడిన శబ్దానికే భయపడేదానినా అనుకుంది. అందరి మాటా వినే భగవంతుడు ఇదీ విన్నాడు, తథాస్తు అన్నాడు. దాంతో కుందేలు కుందేలు రూపంలోనే ఏనుగంత అయింది. అది చూసి మురిసిపోయింది. స్నానం చేద్దామని కుందేలు మడుగు వద్దకు వచ్చింది. గట్టున ఉన్న కప్పలు ఈ వింత ఆకారాన్ని చూసి నీళ్లలోకి దూకడం మొదలెట్టాయి. దాంతో కుందేలు- ‘భయపడకండి, నేను రోజూ వచ్చే కుందేలునే. దేవుని దయ వల్ల ఈ ఆకారాన్ని పొందాను. ఇప్పుడిక ఎవరికీ భయపడను అన్నది. అందుకు కప్పలు -‘మహా చెప్పావ్! మడుగులో మొసలి ఉంది. నీళ్లలో అది మహా బలశాలి. దాని ఒళ్లంతా ముళ్లు. ఎంత పెద్ద ఏనుగయినా తోక ముడవాల్సిందే’ అన్నాయి. కుందేలు భయపడిపోయింది. మళ్లీ మనసులో అనుకొంది, తనకి కూడా మొసలిలా ముళ్లుంటే బావుంటుందని. భగవంతుడు మళ్లీ తథాస్తు అన్నాడు. ఏనుగంత ఆకారానికి తోడు, దేహం మీద ముళ్లూ మొలిచాయి. ధీమాగా స్నానం చేసి బయటకొచ్చిన కుందేలుకి అడవిలోని జంతువు లంతా పరుగులు తీస్తుండటం కనిపించింది. ఇది చూసిన కుందేలు కోతులని అడిగింది విషయ మేమిటని? అడవిని కబళించేందుకు, జంతువులని పట్టుకునేందుకు ఒక గుంపు వస్తోంది, పోయి ప్రాణాలు కాపాడుకో అన్నాయి కోతులు. కుందేలు ఓ చోట దాగి మళ్లీ, ‘భగవాన్! అడిగినదల్లా ఇస్తున్నావు, ఇంతలోనే భయాలన్నీ కల్పిస్తున్నావు ఏమిటిదంతా?’ అని నిట్టూర్చింది. అప్పుడు భగవంతుడన్నాడు, ‘భయ పడకుండా ఉండేందుకు ఏనుగంత ఆకారం, మొసలి ముళ్లు ఇమ్మని అడిగావే కానీ, నీ పిడికెడు గుండెకు ధైర్యాన్ని ఇవ్వమని అడిగావా? నిర్భయ హృదయాన్ని అడిగివుంటే, ఇచ్చి ఉండే వాడిని. భయం లేకుండా ఉండేదానివి’ అని. చూడబోతే హిందువుల పరిస్థితి సరిగ్గా అలానే ఉంది.
మన హిందువులకి దేనికీ లోటులేదు. అయినా అనవసరంగా భయపడి పోతున్నారు. వేల సంవత్స రాలుగా విధర్మీయుల దురాక్రమణలను, అరాచకాలను సహించి కూడా హిందువులు నేటికీ 80 శాతం ఉన్నారు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నవారు హిందువులే. విభిన్న రాజకీయ పార్టీలలో ఉన్న వారిలో అత్యధికులు హిందువులే. అధికారులలో, ఉద్యోగు లలో అధిక శాతం హిందువులే! ఇది మన దేశం. నేటికీ దేశంలో మందిరాలున్నాయి, అవి నిలబడుతున్నాయి. మన వారసత్వ పరంపర మనకు ఏమి నేర్పిందో అది శాశ్వతం.
సమానత్వం విషయానికి వస్తే సమస్త ప్రపంచం ఫ్రాన్స్ రాజకీయ విప్లవం గూర్చి ప్రస్తావిస్తుంది. తెల్లతోలు వాళ్లు చాలా పెద్ద పెద్ద మాటలే చెబుతారు నేటికీ. తాము ఉన్నతులమనే అహంకారం. ఇవాళ్టికీ పలు దేశాల్లో వర్ణ వివక్షను కొనసాగిస్తున్నారు. కానీ వేలాది సంవత్సరాలనుంచి మనదేశంలో సమతావాదం కొనసాగుతున్నది. భగవద్రామానుజా చార్యులు సమతావాదాన్ని వేయి సంవత్సరాల నాడే ప్రబోధించారు. ఇక్కడ జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది, రామానుజులవారి భవ్యమూర్తి ఇదే స్ఫూర్తిని ప్రబోధిస్తోంది. మనకు ఏం తక్కువయిందని మనల్ని మనం విస్మరించుకుంటున్నాం? ఆత్మ విస్మృతే మన బలహీనతకు, దౌర్బల్యానికి కారణం. ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది. ఇక్కడిలా, అక్కడలా అంటూ సమస్యల గూర్చి పోరాటం చేస్తూనే ఆ సమస్యల పరిష్కారానికి ఆలోచించాల్సిన అవసరం ఉంది.
కేరళలో ఉదయన్ అనే రాజకుమారుడు ఉండేవాడు. పాలనలో శిక్షణ ఇప్పించటానికి, ప్రజలను రక్షించేందుకు శస్త్రవిద్యలో శిక్షణ ఇప్పించటానికి ఓ గురుకులంలో చేర్చాడు అతని తండ్రి. ద్రోణాచార్యుడి వంటి 21 మంది గురువులు ఆ గురుకులంలో ఉన్నారు. పన్నెండేళ్ల• ఉదయన్ శిక్షణ పొందాడు. పరీక్షా సమయం ఆసన్నమయింది. పరీక్షించేందుకు ఇరవై మంది గురువులతో పాటు ప్రధానాచార్యుడు కూడా ఆసీనులయ్యారు. ఆచార్యులారా నేను మీ ముందు హాజరయ్యాను. నన్ను పరీక్షించుకోవచ్చు అని ఉదయన్ గురువుల నుద్దేశించి అన్నాడు. ఈ పన్నెండేళ్లలో నువ్వేం అభ్యసించావు? అని ప్రధానాచార్యుడు ప్రశ్నించారు. ‘గురువర్యా, మీ కృప వలన అస్త్ర శస్త్ర విద్యలన్నిటిలోను ఆరితేరాను. వివిధ అస్త్ర శస్త్రాలతో పది వేలమంది నాపై తలపడినా వారందరినీ సునాయాసంగా ఓడించి విజయాన్ని సాధించగలను, అని రాజకుమారుడు జవాబిచ్చాడు. ఇతర విద్యార్థులంతా చప్పట్లు చరిచారు. గురువులూ చప్పట్లు చరిచి వుంటారేమో! ‘అలాగా, అయితే మేము ఇప్పుడు నిన్ను పరీక్షించబోము, ఆరునెలల తర్వాత వస్తే నిన్ను పరీక్షిస్తాం’ అని గురువులు అతగాడిని పరీక్షలో ఫెయిల్ చేసి సప్లిమెంటరీకి అనుమతిం చారు. ఇది ఉదయన్‌ని ఆలోచనలో పడేసింది. ఆర్నెల్ల తర్వాత మళ్లీ హాజరయ్యాడు. గురువులు రాజకుమారుడిని గతంలో అడిగిన ప్రశ్నే అడిగారు. అందుకు, గురువులారా, గతంలో నేను సరిగా యోచించకుండానే జవాబిచ్చాను. ఆలోచించగా, ఆ జవాబు సరి కాదనిపించింది. పదివేలమంది నాపై దాడి చేసినా నేను వారందరినీ చంపలేను, లోపలున్న వారితోనే పోరాడి గెలవగల నని రాజకుమారుడు చెప్పాడు. రాజకుమారుడి మాట అటుంచితే మన యుద్ధతంత్రాన్ని పరికిస్తే యోధుడిని 27 గురు మాత్రమే చుట్టుముట్టగలరు. ఆ 27 గురు మాత్రమే యోధుడిపై దాడి చేయగలరు. జవాబు విన్న ఆచార్యులు ‘‘నువ్వు ఆలోచించిన తీరు బాగానే వుంది, అదే దిశలో ఆలోచన కొనసాగించు. ఆరునెలల తర్వాత వస్తే నిన్ను పరీక్షిస్తాం’’ అని మళ్లీ పంపేశారు. రాజకుమారుడు కాసింత విచారానికి లోనయినా ‘అదే దిశలో ఆలోచించు’ అనే క్లూ దొరికినందుకు సంతోషించాడు. ఆర్నెల్ల తరువాత హాజరై, అడిగిన అదే ప్రశ్నకు జవాబిస్తూ ‘‘అహంకారంతో నేను సరయిన రీతిలో సమాధానం ఇవ్వలేదు. 27 మంది నన్ను చుట్టుముట్టినా ఆ 27మందితోనూ పోరాడలేను.. 27 గురు చుట్టూ ముట్టినా మొదటి వాణ్ని నిలువరించు, రెండోవాణ్ణి నెట్టేయ్, మూడోవాణ్ణి కొట్టేయ్.., మిగతావారిని వలయం నుండి బయటకు తరిమేయమని.. నీ ఎదురుగా ఒకడికన్నా ఎక్కువమందిని ఉండనీయ కుండా జాగ్రత్త పడమని చెబుతుంది శాస్త్రం. ఈ మేరకు చూస్తే యుద్ధరంగంలో నేను ఒక్కడితోనే పోరాడగలను’ అని చెప్పాడు రాజకుమారుడు. దాదాపు దారిలోకి వచ్చావ్, ఆర్నెల్ల తర్వాత వస్తే పరీక్ష తీసుకుంటామని గురువులు చెప్పారు. ఐతే చివర్లో రాజకుమారుడు చెప్పాడిలా – ఆచార్యవరుల్లారా మీరు నాకు అద్భుతమైన రీతిలో అస్త్ర శస్త్ర విద్యలు నేర్పారు.. యుద్ధం చేయడానికో, ఘర్షణలు పడటానికో మీరు నాకు శస్త్రవిద్యలు నేర్ప లేదు కదా! కానీ నేను యుద్ధం ఎవరితో చేయాలి? శత్రువులెవరూ లేరు, ఎవరితోనూ నాకు వైరం లేదు. ఎలాగయితే మన హిందూ సమాజం భావిస్తుందో అలా అందరూ నా బంధువులే – మిత్రులే. వసుధైవ కుటుంబకం అని నేను భావిస్తాను. అయితే అందరూ నాకు మల్లె వుండరు కదా. అనవసరంగా గొడవలు, ఘర్షణలు సృష్టించి సజ్జనులను ఇక్కట్ల పాలు చేసే దుష్టులున్నారు. నేను యుద్ధమైతే చేయలేను అలాంటి దుర్జనులు, దుష్టుల బారి నుండి సమాజాన్ని తప్పకుండా రక్షించగలను’’ అని. ఆ జవాబు విన్న గురువులు-‘‘నువ్వు చెప్పిన సమాధానం బాగుంది. ఈ కోణంలోనే మేము నేర్పిన విద్యలను ఉపయోగిస్తూ ప్రజలని రక్షించ’’మని చెప్పారు.
అయితే ఒక్క విషయం. వసుధైవ కుటుంబక మన్న భావనతో హిందూ సమాజం చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. స్పష్టంగా చెప్పాల్సివస్తే మన మనముందు ఏ శక్తీ నిలబడ లేదు.కేవలం మనలో పేరుక పోయిన భయమే మనల్ని ముందడుగు వేయనీకుండా నిలువరిస్తోంది. వేల సంవత్సరాల క్రితం హిందూ సమాజం భయపడి ఉంటే, అప్పుడే హిందూ సమాజ అస్తిత్వం పరిసమాప్తమయ్యేది. మన మీద అరాచకాలకు పాల్పడిన వారంతా ఉనికి లేకుండా పోయారు. అయిదు వేల సంవత్సరాల క్రితం మన హిందూ సమాజం, మన సనాతన ధార్మిక జీవనం – సంస్కృతి ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి. వివిధ ఆధ్యాత్మిక మార్గాల్లో మన దేశాన్ని సాధు సంతులు సుశోభితం చేశారు. ఇలాంటి సనాతన ధార్మిక జీవనం, సంస్కృతి, సాధుసంతులు భారతదేశంలో తప్ప మరెక్కడా చూడలేం. నేటికీ మహాత్ములు సాక్షాత్కరిస్తున్నారు. మహోన్నతమైనది మన జన్మభూమి. అపారమైన జన సమృద్ధి, అపారమైన ఖనిజ సంపద ఇక్కడుంది. ప్రపంచం లోనే తరుణ దేశం మనది. మనం భయపడాల్సిన అవసరమేమిటి? కేవలం మనల్ని మనం మరవటం వల్ల ఈ భయం నెలకొంది. దీంతో తనకు తానే విస్మృతికి లోనవుతున్నాడు. మన అస్తిత్వంలో ఎంత వైవిధ్యమున్నా ఆ అస్తిత్వం, ఏకత ఒక్కటే. ప్రస్తుత తరుణంలో మనం సమతా సమరసతలను ఆచరించాల్సిన, ప్రచారం చేయాల్సిన అవసర ముంది. ఎందుకంటే మనల్ని మనం మరచి పోయాం. ధర్మాచార్యులు, ఆధ్యాత్మికవేత్తలు ఈ విషయంలో తమవంతు పాత్ర తాము పోషిస్తూ సమాజాన్ని సంఘటితం చేస్తున్నారు, కనుక మనం కూడా వారి మార్గదర్శనంలో హిందూ సమాజంలోని వారినంతా సమానంగా చూడాలి. మన దైనందిన జీవనంలో, వారిని తమ వారిగా, ఆత్మస్వరూపులుగా భావించాలి. మన ధర్మం, మన సంస్కృతి ఇదే చెబుతోంది. వైదికము, అవైదికము కూడా అందరినీ సమానంగా చూడమనే చెబుతుంది. హిందూ సమాజంలోని అన్ని కులాల వారిని, వర్గాల వారిని చేరదీసి మైత్రీపూర్వ వాతావరణాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉంది.
ఇవాళ రైలు ప్రయాణం, విమానయానం గూర్చి ఆలోచిస్తున్నాం. అదే యాభై ఏళ్లనాడు భాగ్యనగరం వెళ్లాలంటే పదండి సైకి•ల్‌పై అనే వాళ్లం. ఆ రోజుల్లో శక్తి ఉండేది. ఇవాళ పరిస్థితి మారింది. సైకిల్ తొక్కడమైతే వచ్చు గాని సైకిల్‌పై వెళ్లాలంటే ధైర్యం చాలదు. అందుకే రైళ్లు, విమానాల గురించి ఆలోచిస్తాం. కానీ లక్ష్యాన్ని చేరుకోవాలి. అదే విధంగా మార్గాలు ఏవయినా మన ధర్మమార్గంలో మోక్ష లక్ష్యాన్ని చేరుకునేందుకు మన సంస్కృతి చెప్పిన ధర్మార్థకామ మోక్షాలను ఆచరించాలి. దేశంలో వివిధ ప్రాంతాల వారు, వివిధ భాషలు మాట్లాడే వారు, విభిన్న సంప్రదాయల వారున్నారు. వీళ్లందరినీ మనవాళ్లే అంటాం. ఇది మనదేశంలో కొనసాగుతున్న భిన్నత్వంలో ఏకత్వ సౌందర్యం. అందరినీ సమానంగా చూడటం మొదలుపెట్టండి, అన్ని వర్గాలు, జాతుల వారితో స్నేహం చేయండి. కుటుంబ మిత్రులుగా మలచుకోండి. ఇక్కడ అఖిల భారతస్థాయిలో ధర్మాచార్యులు-సాధు సంతులు కలుసుకున్నట్లే నెలకోసారి మీ జిల్లాలలో, తాలూకాలు, బ్లాకులలో కలుసుకొని సమాజ హితం గూర్చి, ధర్మ రక్షణ గూర్చి చర్చించి మార్గదర్శనం చేస్తే బాగుంటుంది. అదే విధంగా మనం కూడా వారానికోసారి ఏదో ఒక సమయంలో మన కుటుంబ సభ్యులతో కూర్చొని భజనలు చేసి, ఆపై ఈ విషయాలన్నిటిని చర్చించండి. ఇక్కడ కొలువైన సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల ప్రతిమ నుండి మనమంతా స్ఫూర్తిని పొందాలి. ఒక విషయం – కుటుంబ సభ్యులతో కూడిన సమావేశాలలో మన వంశ పూర్వికుల గూర్చి చర్చించాలి. వారు ఆచరించిన సంస్కృతీ సంప్రదా యాలు కుటుంబంలో ఆచరిస్తున్నామా లేదా అనే విషయాన్ని గూర్చి కూడా చర్చించాలి. ఇళ్లలో పెట్టిన వారి చిత్రాలతో ప్రేరణ పొందాలి.
మనం సంపాదించిన ఆదాయాన్ని ఏం చేయాలనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మీ సంపాదన లోని ఆరోవంతు రాజ్యాన్ని పాలిస్తున్న రాజు కివ్వండి. మరో ఆరోవంతు మీ కుటుంబానికి, ఇంకో ఆరోవంతు మీ స్వంతానికి కేటాయించండి. ఒక ఆరో వంతు జమ చేసుకోండి. మరో ఆరోవంతు సమాజశ్రేయస్సు కోసం, ఇంకో ఆరోవంతు మందిరాల కోసం కేటాయించండి. సంపాదనని ఇలా కేటాయించినప్పుడు హిందూ సమాజం రెండడుగులు ముందుకేస్తుంది. మనమింకా శక్తివంతులమవుతాం. ఏ విషయంలోనయినా మొదటి ప్రాధాన్యం హిందువుల హితం, అంటే దేశం హితం. ఆ తర్వాతే నా హితం, నా కుటుంబ హితం, నా భాష, నా ప్రాంత హితం అనే భావన కలగాలి. స్వాభిమానంతో, ఆత్మగౌరవంతో హిందూ సమాజం జీవనం కొనసాగించాలి. రామానుజాచార్య మూర్తి ప్రతిష్ట సందర్భంగా ఇక్కడ జరిగిన ధర్మాచార్యుల సమ్మేళనంలో జరిగిన మేధో మథనంలో ఈ విషయా లన్నిటిపై చర్చ జరిగిందని, సరైన సమయంలో హిందూ సమాజాన్ని జాగృత పరచేందుకు సాధుసంతులంతా సంకల్పించారని భావిస్తున్నాను. ఈ అంశాలకు తొలి అడుగు గతంలోనే పడింది. రెండో అడుగు ఈ భాగ్యనగరంలో పడింది. భాగ్యనగరమనే పేరుకు సార్థకత చేకూరింది. ధర్మ రక్షణకు గృహస్థాశ్రమంలో ఉన్న వారు నిర్వహించా ల్సిన కర్తవ్యాలెన్నో ఉన్నాయి. ఆ గృహస్థాశ్రమానికి ధారణా పూర్వకమైన మార్గదర్శనం చేసేది సన్యాసాశ్రమం.
గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించే వారు తమ కర్తవ్య నిర్వహణని విస్మరించవద్దు. కుటుంబంలో సద్భావ, సదాచార పూరిత వాతావరణం నెలకొల్పాలి. తమ సంతానాన్ని తేజోసంపన్నులుగా తేజోమూర్తులుగా మలచాలి. అలాంటి వారితోనే హిందూ సమాజం అంటే దేశం వైభవోన్నత స్థితికి చేరుకుంటుంది, ధర్మ జగత్తు స్థాపన జరుగుతుంది.
అను: విద్యారణ్య కామ్లేకర్