ఫిబ్రవరి 16 – 19, సమ్మక్క-సారలమ్మ జాతర

దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదిగా పేర్కొనే మేడారం ‘సమ్మక్క-సారలమ్మ’ జాతరను ‘గిరిజన కుంభమేళా’గా చెబుతారు. ప్రజల కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన తల్లీకూతుళ్లు అడవిబిడ్డలకు ఆరాధ్యదైవాలు. ఆ ‘తల్లుల’ జాతర అంటే తెలంగాణలో, ముఖ్యంగా అడవిబిడ్డలకు చెప్పలేనంత సంబరం. సుమారు ఎనిమిది దశాబ్దాలకు పైబడి గిరిజనేతరులు కూడా ఈ ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొంటు న్నారు. నమ్మకాలకు, ఐకమత్యానికి, కట్టు బాట్లకు ఈ జాతర నిదర్శనంగా నిలు స్తుంది. గిరిజన దేవతలుగా ప్రసిద్ధికెక్కిన సమ్మక్క, సారలమ్మలు గిరిజనేతరుల ఇళ్లల్లోనూ ఇలవేల్పులుగా పూజలు అందుకుంటున్నారు. ‘వనదేవతల’ జాతర నాలుగు రోజులూ ఈ మారుమూల గ్రామం మేడారం జనసంద్రమే. ఈ జాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది.

జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలో ప్రకృతి అందాలతో నాగరిక ప్రపంచా నికి దూరంగా ఉండే ఈ కుగ్రామం జాతర సమ యంలో కాలు కదపలేనంతగా భక్తజనంతో కిక్కిరిసి పోతుంది. ఈ నెల (ఫిబ్రవరి) 16వ తేదీ (మాఘశుద్ధ పౌర్ణమి) నుంచి నాలుగు రోజులపాటు సాగే ఈ జాతర సందర్భంగా లక్షలాది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారని అంచనా.

సమ్మక్క వృత్తాంతం

సమ్మక్క జననానికి సంబంధించి కొద్దిపాటి మార్పులతో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆమె భూమిలో ఒక పెట్టెలో లభ్యమైనట్లు ఒక కథ ప్రచారంలో ఉండగా, 12వ శతాబ్దంలో వేటకోసం వెళ్లిన కోయదొరలకు అడవిలో పెద్ద పులుల కాపలా మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతున్న పసిపాప దొరికినట్లు మరో కథనం. ఆ చిన్నారిని మేళతాళా లతో మేడారం తీసుకువెళ్లారు. కొండదేవత సాక్షాత్తు పాప రూపంలో అవతరించిందని, ఆమెను దైవ ప్రసాదంగా భావించిన పొలవాసకు చెందిన గిరిజన దొర మేడరాజు దంపతులు సమ్మక్క అనే పేరుతో గారాబంగా పెంచారు. ఆమెన తన మేనల్లుడు, మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లిచేశారు. ఆ దంపతులకు ఇద్దరు కూతుళ్లు సారలమ్మ, నాగులమ్మ, కుమారుడు జంపన్న కలిగారు. స్థానికుల దృష్టిలో పగిడిద్దరాజు రాముడైతే సమ్మక్క తల్లి సీతామాత. అలాగే ఆయన పరమశివుడైతే ఆమె పార్వతి. కష్టాలు, ఇబ్బందులలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆ దంపతులు ఆదరించేవారు. గిరిజనులు వారిని తల్లిదండ్రులుగా, వారి సంతతిని తోబుట్టువులుగా గౌరవించేవారు.

భరిణెగా సమ్మక్క

అప్పట్లో కాకతీయ ప్రతాపరుద్రుడు రాజ్య విస్తరణ జైత్రయాత్రలో భాగంగా పొలవాసపై దాడిచేయగా, ఆయన ధాటికి తట్టుకోలేక మేడరాజు, తదితర గిరిజన నాయకులు మేడారంలో అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. అదే సమయంలో కాకతీయుల సామంత రాజు పగిడిద్దరాజు అనావృష్టి కారణంగా కప్పం కట్టలేక పోగా, స్వతంత్రరాజ్యం ప్రకటించుకోవడం, మేడరాజుకు ఆశ్రయం ఇవ్వడం ప్రతాపరుద్రునిలో ఆగ్రహాన్ని రగిల్చింది. సామంతులు ఇలా తిరగబడితే సామ్రాజ్యం విచ్ఛిన్నమవుతుందని భావించిన ఆయన తన ప్రధాన మంత్రి యుగంధురుడి (నాగయ్యగన్నుడు) సారథ్యంలో మేడారంపైకి సైనిక పటాలాన్ని పంపాడు. ఆ యుద్ధంలో కాకతీయులకు అపారంగా నష్టం వాటిల్లడంతోపాటు మేడారం మొత్తం నేలమట్టమవుతుంది. ప్రతాపరుద్రుడు మేడారంపైకి (మాఘశుద్ధ పౌర్ణమి నాడు) దండెత్తగా, సమ్మక్క ఆమె సంతానంతో పాటు అల్లుడు కొండాయి ప్రభువు గోవిందరాజు వేర్వేరు ప్రాంతాల నుంచి ఎదుర్కొ న్నారు. అయినా కాకతీయసేనలను నిలువరించలేక పోయారు. ఓటమి పరాభవాన్ని తట్టుకోలేక జంపన్న సమీపంలోని సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాటి సంపెంగ వాగే నేటి జంపన్న వాగు. (జంపన్న ఆత్మహత్య చేసుకోలేదని, తన గాయాల రక్తాన్ని వాగులో కడుక్కోవడం/శుభ్రం చేసుకోవడం వల్ల దానికి జంపన్నవాగు అని పేరు వచ్చిందని కొందరు అంటారు. ఆ మాటకు వస్తే సమ్మక్క, సారలమ్మ, జంపన్నలు మరణించారని గిరిజనులు అంగీకరించరు. కొన్ని స్థల పురాణాల మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి. ఉదా హరణకు, సమ్మక్క యుద్ధంలో మరణించినట్లు కొన్ని కథల్లో ఉంటే, నెత్తురోడుతూ సమీపంలోని గుట్టల్లోకి వెళ్లి అదృశ్యమైనట్లు, ఇంకో కథలో సహగమనం చేసినట్లు ప్రచారంలో ఉంది.)

అయినవారు అసువులు బాయడంతో సమ్మక్క అపర కాళిలా విజృంభించి కాకతీయ సేనలకు ముచ్చెమటలు పట్టించారు. ఆ వీరవనిత చేతిలో ఓటమి తప్పదని భీతిల్లిన కాకతీయ సైనికుడు ఒకరు బల్లెంతో ఆమెను దొంగదెబ్బ తీశాడు. రక్తసిక్తమైన దేహంతో ఆమె మేడారానికి ఈశాన్య దిశగా చిలకలగుట్ట వైపు గల గుహలోకి వెళ్లి అదృశ్యమైంది. ఆమెను వెతుకుతూ వెళ్లిన అనుచరులకు ఒక నాగవృక్షం సమీపంలోని పుట్ట వద్ద పసుపు- కుంకుమలతో భరిణెగా కనిపించగా దానిని సమ్మక్కకు ప్రతిరూపంగా భావించారు. నాటి నుంచి ఆ భరిణెతో ఏటా మాఘశుద్ధ పున్నమి నుంచి సమ్మక్క జాతర జరుపుకుంటున్నారు. మేడారానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలోని బయ్యక్కపేట గ్రామానికి చెందిన గిరిజనుడి ఆధ్వర్యంలో మొదటి జాతర జరిగినట్లు తెలుస్తోంది.

ప్రతాప రుద్రుడి పశ్చాత్తాపం

అశేష జనవాహినిలో సమ్మక్కపై, ఆమె కుటుంబంపై గల ఆరాధనను గ్రహించిన ప్రతాపరుద్ర చక్రవర్తి పశ్చాత్తాపంతో మేడారం చేరి, జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుని మేడారంను కోయదొరల స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తాడు. సమ్మక్క పేరున ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి నాడు ముత్తయిదువుల పండుగ, రెండు సంవత్స రాలకు ఒకసారి జాతరను వైభవంగా జరుపుకునేలా ఆదేశం ఇచ్చి, అందుకు అవసరమైన నిధులు కేటాయించి, తాను కూడా భక్తుడయ్యాడని చారిత్రక కథనం.

గద్దెలే ఆలయాలు..

 మేడారంలో రెండు చెట్ల చుట్టూ ‘గద్దెలు’ తప్ప ఎలాంటి ఆలయం ఉండదు. ఆ గద్దెలను సమ్మక్క, సారలమ్మ దేవతలుగా భావిస్తారు. వాటిని ‘పెద దేగి’, ‘తునికి’ అని వ్యవహరిస్తారు. ఇంకో మూలగా మరో చిన్న గద్దెపై గుర్రపు తల ఆకారంలో ఉన్న ‘లక్ష్మీ దేవర’ ప్రతిమను ఏర్పాటు చేస్తారు. జాతర సమయంలో కోయ పూజారులు సమ్మక్క అమ్మవారిని తీసుకువస్తున్నట్లు గుర్తుగా సమీపంలోని గుట్ట నుంచి కుంకుమ భరిణె, వెదురు ముక్కలు తెస్తారు. జాతర ప్రారంభం నాడు పెద్ద (ప్రధాన) పూజారి చిలకలగుట్టకు రహస్యంగా వెళ్లి అమ్మవారికి సంకేతంగా కంకపూలను, కుంకుమ భరిణెను తెచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. మొదటి రోజు సాయంత్రం గిరిజన పూజారులు కన్నెపల్లి గ్రామం వద్ద సారలమ్మ అమ్మవారిని పూజించి తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్టిస్తారు. ఆ మరునాడు సాయంత్రం 5 గంటలకు చిలకలగుట్ట వద్ద సమ్మక్క దేవతను పూజించి గుట్ట కిందికి తెచ్చి ప్రతిష్టిస్తారు. జిల్లా కలెక్టర్‌, ఐటిడిఎ అధికారి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ‌స్థానిక శాసనసభ్యుడి సమక్షంలో పది రౌండ్ల తుపాకీ కాల్పులు జరిపి దేవతలను గద్దె దగ్గరకు తెస్తారు. మూడవ రోజున వైభవోపేతంగా జరిగే ప్రధాన జాతరలో భారీ సంఖ్యలో భక్తులు పొల్గొని ‘అమ్మవార్ల్లను దర్శించుకుంటారు. భక్తుల మొక్కుబడులు పూర్తికాగానే చివరి రోజు సాయంత్రం దేవతలు ‘వనప్రవేశం’ చేస్తారు.

వరాలిచ్చే వనదేవతలు

ఈ వనదేవతలు తమ కోర్కెలు తీర్చే దైవాలని భక్తుల విశ్వాసం. వారి ఆశీర్వాదంతో పిల్లలు కలుగుతారని, దీర్ఘకాల వ్యాధుల నుంచి స్వస్థత కలుగు తుందని నమ్మకం. సంతానం కోరే మహిళలు సమ్మక్క, సారలమ్మ గద్దెలకు ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటారు. తమ కోరిక ఫలిస్తే ఆ తల్లుల గద్దెల వద్ద తొట్టె (ఊయల) కడతామని మొక్కుకుని, కోరిక తీరిన వారు మరుసటి జాతరలో మొక్కు చెల్లించుకుంటారు. కొందరు తమ పిల్లలకు ఆ దేవతల పేర్లు పెట్టు కుంటారు. ఆడ శిశువులకు సమ్మక్క-సారలమ్మ అని, మగ శిశువులకు జంపన్న అని పేరు పెట్టుకోవడం తరుచుగా కనిపిస్తుంది. ఈ పేర్లు కలవారు మేడారం జాతరకు తప్పక హాజరై మొక్కుబడులు తీర్చుకోవడం మరో విశేషం.

మొక్కుబడులు-ప్రసాదం

భక్తులు, బంగారంగా పిలుచుకునే బెల్లాన్ని కానుక/ముడుపుగా చెల్లిస్తారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు బెల్లాన్ని తులాభారంగా సమర్పించు కుంటారు. అలా నైవేద్యంగా పెట్టిన బెల్లాన్ని భక్తు లందరికి పంచుతారు. కోడెలను కూడా కానుకగా సమర్పించడం జాతరలో మరో ప్రత్యేకత. వడిబాలు, బియ్యం, కొబ్బరి కాయలు, పసుపు-కుంకుమలు, వస్త్రాలు, బోనాలు తదితరాలనూ సమర్పించు కుంటారు. గద్దెమీది బెల్లం స్వీకరిస్తే దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయని, అక్కడి కుంకుమను పొందితే సంతానప్రాప్తి, మోక్షం కలుగు తాయని భక్తుల నమ్మకం. అమ్మవార్లు గద్దెలపైకి వస్తున్న సమయంలో మొక్కితే సంతానయోగం ఉంటుందని కూడా భావిస్తారు. సమ్మక్కను తీసుకువస్తున్న వారికి అడ్డంగా పడుకొని, పూజారులు తమ మీదుగా నడచివెళితే జన్మ తరించినట్లుగా విశ్వసిస్తారు.

శివశక్తులు-పూనకాలు

జాతరలో ‘శివసత్తుల’ పూనకాలు ఉత్కంఠ కలిగిస్తాయి. జంపన్న వాగులో స్నానం చేస్తుంటేనే వారికి పూనకం వస్తుంటుంది. కొత్తచీర, రెండు రవికలు ధరించి, చేతుల నిండా గాజలు, బొట్టు (మగవారు కూడా), ఒడి బియ్యంతో, తల వెంట్రుకలు విరబూసుకుని శివాలూగే దృశ్యం ఉత్కంఠ కలిగిస్తాయి. పూనకంతో ఊగే మహిళలు బంధువుల గురించి, ప్రకృతి వైపరీత్యాల గురించి చెబుతుంటారు. భక్తులు ఆ పలుకులను సాక్షాత్తు సమ్మక్కవిగానే విశ్వసిస్తారు.

రాష్ట్ర ఉత్సవం..

కాకతీయుల కాలం నుంచి కొనసాగుతూ వస్తోన్న ఈ జాతరను ‘రాష్ట్ర ఉత్సవం’ (స్టేట్‌ ‌ఫెస్టివల్‌)’ ‌గా ప్రకటిస్తూ ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం 1996 ఫిబ్రవరి 1న ఆదేశాలు జారీచేసింది. దీనిని జాతీయ ఉత్సవంగా గుర్తించాలని 2014లో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

ప్రత్యేక బస్సులు

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేడారం జాతర సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ‘మేడారం విత్‌ ‌టీఎస్‌ ఆర్టీసీ’ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి మేడారా నికి నడిచే బస్సులు, చార్జీల వివరాలు ఈ యాప్‌ ‌ద్వారా తెలుసుకోవచ్చు. ఈసారి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని భావిస్తూ, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటిడిఎ), ఇతర శాఖలు సన్నాహాలు చేస్తున్నాయి. తాగునీరు, స్నానఘట్టాలు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాయి.

– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE