దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లలో కొద్దిమందినే గుర్తిద్దామా? లేక ప్రతి ఒక్కరికీ నివాళి ఘటిద్దామా? మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన జవాన్లకు ఇండియా గేట్ (ఢిల్లీ) దగ్గరి స్మారకం వద్ద ఇప్పటి వరకూ నివాళులు అర్పిస్తున్నాం. స్వతంత్ర భారతదేశ రక్షణ కోసం పోరాడిన సైనికుల త్యాగాలను కూడా స్మరించుకోవడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకం దగ్గరకు అమరజ్యోతిని తరలిస్తే తప్పు ఎలా అవుతుంది?
ప్రపంచంలో నేడొక అజేయశక్తి భారత సైన్యం. ప్రాచీనకాలం నుంచే మన యుద్ధవీరులు పరా క్రమాలకు ఆలవాలం. ఇది గుర్తించిన బ్రిటిష్ పాలకులు ప్రపంచ యుద్ధాల్లోకి దింపారు. ఈ పోరాటాల్లో బ్రిటిష్ ఇండియా విజయం కోసం ప్రాణాలను అర్పించిన వారి త్యాగాలక• గుర్తింపుగా ఢిల్లీలో 1921లో ఇండియా గేట్ నిర్మించారు. దానిపై మొదటి ప్రపంచ యుద్ధ అమర జవాన్ల పేర్లు ఉన్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత శత్రు దేశాలతో యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాల్లో అమరులైన వారి త్యాగాలను గుర్తించే ఎలాంటి స్మారకచిహ్నాలు లేవు. ఒక్క 1971 నాటి భారత్-పాక్ యుద్ధంలో అమరులైన భారతీయ సైనికులకు నివాళిగా ఇండియా గేట్ దగ్గర అమర్ జవాన్ జ్యోతిని ఏర్పాటు చేశారు. ఆ లోటును గుర్తించిన భారత సైన్యం సమగ్రమైన జాతీయ యుద్ధ స్మారకం అవసరాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తెచ్చినా గత ప్రభుత్వాలేవీ పట్టించుకోలేదు. ప్రధాని మోదీ దీనికి ఒక రూపం ఇచ్చారు.
ఇండియా గేట్ ఎందుకు నిర్మించారు?
స్వాతంత్య్రం రావడానికి పూర్వం జరిగిన ఇక్కడి ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు. బ్రిటిష్ ఇండియాలో జాతీయ నాయకులు వ్యతిరేకించినా బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ సైనికులను యుద్ధంలోకి దించింది. భారతీయ సైనికులు లేకపోతే జర్మనీ చేతిలో బ్రిటన్ చిత్తుగా ఓడిపోయేదని ఆనాటి యుద్ధ విశ్లేషకులు చెప్పారు. వెస్ట్రన్ ఫ్రంట్‌లో మన జవాన్లు జర్మనీని అడ్డుకోకపోతే బ్రిటన్‌ను అక్రమించి ఉండేది. ఈ యుద్ధంలో 14 లక్షలమంది బ్రిటిష్ ఇండియా సైనికులు పాల్గొన్నారు. 74వేల మంది మరణించారు.
భారతీయ సైనికుల త్యాగాలకు గుర్తింపుగా ఇండియా గేట్ నిర్మించారు. దీని వాస్తుశిల్పి ఎడ్వర్డ్ లుటియన్స్. 1921, ఫిబ్రవరి 10న శంకుస్థాపన చేస్తే 1931లో ఇది పూర్తయింది. మొదటి ప్రపంచ యుద్ధ అమర జవాన్ల పేర్లను ఇండియా గేట్ మీద చెక్కారు. కానీ 13 వేల మంది పేర్లకు మాత్రమే చోటు దక్కింది. మొదట దీనిని ‘ఆలిండియా మెమోరియల్ వార్’ అని పిలిచేవారు. ఎత్తు 42 అడుగులు. ఢిల్లీ ప్రధాన ఆకర్షణల్లో ఇండియాగేట్ ఒకటి. ఇక్కడ ఉన్న మండపంలో బ్రిటన్ చక్రవర్తి ‘కింగ్ జార్జ్-5’ విగ్రహం ఉండేది. దాన్ని 1968లో తొలగించారు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26, 1950న తొలి గణతంత్ర దినోత్సవాన్ని జరుపు కున్నాం. రాజ్‌పథ్‌లో జరిగిన కవాతులో మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారితో కలిసి పోరాడి, మరణించిన భారత సైనికులకు మాత్రమే నివాళులు అర్పించారు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, ఆర్మీ, నేవీ, వైమానికదళం రోజుల సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రక్షణమంత్రి, త్రివిధ సేనల అధిపతులు సైనికుల స్మారక చిహ్నాల వద్ద నివాళులు అర్పించేవారు. కానీ ఏదో లోటు. స్వతంత్ర భారతదేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించే చిహ్నం ఏదీ లేదు. స్వాతంత్య్రం తర్వాత అత్యున్నత త్యాగం చేసిన సైనికులకు కూడా స్మారక చిహ్నం అవసరమని భారత సాయుధ దళాలు భావించాయి.
1971 నాటి భారత్-పాక్ యుద్ధంలో భారత్ విజయం సాధించినా, 3,843 మంది భారత సైనికులు అమరులయ్యారు. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తర్వాత, స్వతంత్ర యుద్ధస్మారక చిహ్నం కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. అప్పటి ప్రధాని ఇందిర 1972 రిపబ్లిక్ డే రోజున అమర్ జవాన్ జ్యోతిని ప్రారంభించారు. అమర్ జవాన్ జ్యోతిలో నల్లరాతితో చేసిన ఒక వేదిక, ఒక స్మృతి చిహ్నం ఉన్నాయి. గుర్తు తెలియని సైనికుల సమాధిగా దీన్ని గుర్తిస్తారు. ఆ వేదికపై బాయ్‌నెట్‌తో కూడిన, తిప్పి ఉంచిన •1 1 సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, దానిపై సైనికులు యుద్ధంలో ధరించే హెల్మెట్ ఉంటుంది. నాలుగు బర్నర్లతో కూడిన నాలుగు కలశాలు దీనిపై ఉంటాయి. సాధారణ రోజుల్లో ఒక బర్నర్ ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. ముఖ్యమైన రోజుల్లో నాలుగు బర్నర్లు వెలిగిస్తారు. ఈ బర్నర్లనే శాశ్వత జ్యోతిగా పరిగణిస్తారు.
జాతీయ యుద్ధ స్మారకం
ఏ కాలంలో, ఏ యుద్ధంలో అమరుడైనప్పటికి ప్రతి భారతీయ జవాను త్యాగాన్ని స్మరించుకోవాలి. ఈ దిశగా జాతీయ యుద్ధ స్మారకం (నేషనల్ వార్ మెమోరియల్) నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. స్వతంత్ర భారతదేశం చేసిన• యుద్ధాలు, పోరాటాలు, ఆపరేషన్లు, ఘర్షణల్లో మరణించిన సైనికుల స్మృత్యార్థం దీన్ని నిర్మించారు. ఈ తరహా స్మారక కేంద్రం నిర్మించాలనే చర్చలు 1961 నుంచి జరుగుతున్నాయి. 2011లో మరోసారి ప్రతిపాదన వచ్చింది. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక కార్యరూపం దాల్చింది.
ఇండియా గేట్ సమీపంలో 40 ఎకరాల్లో రూ.176 కోట్ల వ్యయంతో జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించారు. 1947, 65, 71 భారత్-పాక్ యుద్ధాలు, గోవా విలీనం, 1962 భారత్-చైనా యుద్ధం, కార్గిల్ యుద్ధంతో పాటు ఇటీవలి గల్వాన్ పోరులో అమరులైన జవాన్లందరి పేర్లూ ఇందులో ఉన్నాయి.ఫిబ్రవరి 25, 2019 న ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకాన్ని ఆవిష్కరించారు. ఈ స్మారక మందిరం నిర్మాణం నాలుగు వృత్తాలను ఆధారంగా చేసుకొని ఉంటుంది. ఇందులో పెద్దది రక్షా చక్రం. దీనిలో దేశాన్ని రక్షించే సైనికులను ప్రతిబింబిస్తూ చెట్ల వరుస ఉంటుంది. రెండోది త్యాగ చక్రం. ఇది చక్రవ్యూహం తరహాలో గుండ్రని గోడలతో ఉంటుంది. బంగారు రంగుతో 26,466 మంది సైనికుల పేర్లు వీటిపై చెక్కారు. ఇవి విధినిర్వహణలో అమరులైన సైనికుల పేర్లు. మూడోది వీరచక్రం. మన సైనికదళాలు పాల్గొన్న యుద్ధాలు, చర్యలు ప్రతిబింబిస్తూ ఇందులో ఆరు కాంస్య ప్రతిమలు ఉన్నాయి. చివరిది అమర చక్రం. ఇందులో స్తూపం, శాశ్వత జ్యోతి ఉన్నాయి. 2019 నుంచి వెలుగుతున్న ఈ జ్యోతిలోనే అమర్ జవాన్ జ్యోతిని కలిపేశారు. జ్యోతి అనేది వీరమరణం పొందిన సైనికుల అమరత్వ స్ఫూర్తికి చిహ్నం మాత్రమే కాదు వారి త్యాగాన్ని దేశం ఎప్పుడూ మరిచిపోదని చెప్పేందుకు గుర్తు.
జాతీయ యుద్ధ స్మారకాన్ని ఎలా నిర్మించాలి అనే దానిపై ప్రపంచవ్యాప్త పోటీలు జరిగాయి. ఈ పోటీలో చెన్నైకి చెందిన ఔవ దీవ అనే డిజైనింగ్ సంస్థ విజేతగా నిలిచింది. ఈ సంస్థకు చెందిన చీఫ్ ఆర్కిటెక్ట్ యోగేష్ చంద్రహాసన్, ‘ఈ డిజైన్ ముఖ్య ఉద్దేశం వీరుల మరణాన్ని తలచుకొని శోకించే స్థలంగా కాకుండా వారి జీవితాలను, పండుగగా జరుపుకోవటం, వారి త్యాగాలను గౌరవించటం.’ అని తెలిపారు.
నేతాజీ విగ్రహం ఏర్పాటు
ఈ ఏడాది 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటోంది. అంతే కాదు ఆజాద్ హింద్ హౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి (జనవరి 23). సాధారణంగా గణతంత్ర దినోత్సవాలను జనవరి 24న ప్రారంభించడం సంప్రదాయం. ఇప్పుడు నేతాజీ గౌరవార్ధం ‘పరాక్రమ్ దివస్’ సందర్భంగా జనవరి 23 నుంచే గణతంత్ర వేడుకలు ప్రారంభించారు. ఇండియా గేట్ దగ్గర ఉన్న మండపంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని మోదీ. 1968లో తొలగించిన కింగ్ జార్జ్-5 విగ్రహం ఉన్న స్థానంలోనే ఇప్పుడు బోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. నేతాజీ విగ్రహం పూర్తయ్యేందుకు కొంత సమయం పడుతుంది. అప్పటి వరకూ ఇక్కడ ఆయన హోలోగ్రామ్‌ను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ నేతాజీ జయంతి రోజున దీన్ని అవిష్కరించారు.
అమర్ జవాన్ జ్యోతి విలీనం
జాతీయ యుద్ధ స్మారకం నిర్మించిన తర్వాత ఇండియా గేట్ వద్ద జరిగే అన్ని సైనిక కార్య క్రమాలను జాతీయ యుద్ధ స్మారకం వద్దకు మార్చారు. ఈ క్రమంలో అమర్ జవాన్ జ్యోతి కూడా ఇక్కడే ఉంటే అను కూలంగా ఉంటుందని భావిం చారు. జనవరి 21, 2022న, చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ అధిపతి ఎయిర్ మార్షల్ బలభద్ర రాధాకృష్ణ నేతృత్వంలో అమర జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధస్మారకం వద్ద ఉన్న జ్వాలలో విలీనం చేశారు. గమనించాల్సిన విషయం- ఇండియా గేట్ దగ్గర ఉన్న అమర్ జవాన్ జ్యోతిని ఆర్పలేదు. అక్కడ కూడా జ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది..
అమర జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధస్మారకం వద్ద ఉన్న జ్వాలలో విలీనం చేయడం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన సైనికులను అగౌరవపరిచే చర్య అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ దీన్ని ఒక సమస్యగా మార్చేసింది. కొందరు దేశభక్తిని, త్యాగాన్ని అర్థం చేసుకోలేరంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పరోక్షంగా బీజేపీపై విరుచుకుపడ్డారు. శౌర్యపరాక్రమాలు చాటిన జవాన్ల స్మారకార్థం వెలిగిన జ్యోతి ఈ రోజు లేకపోవడం విచారకరమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమర్ జవాన్ జ్యోతిని మళ్లీ వెలిగిస్తామని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో నిర్మించనున్న ‘అమర్ జవాన్ జ్యోతి’కి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఫిబ్రవరి 3న శంకుస్థాపన చేస్తారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ప్రకటించారు.
తాము చేయలేని పనులు జాతీయ యుద్ధ స్మారకం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఏర్పాటు సహజంగానే కాంగ్రెస్ పార్టీకి మంట కలిగిస్తున్నాయి. ఈ ఆవేశంతోనే అమర్ జవాన్ జ్యోతిని వివాదాస్పదం చేస్తోందని అర్థమవుతోంది.
50 ఏళ్లుగా నిర్విరామంగా వెలుగుతున్న అమర్ జవాన్ జ్యోతిని ఆర్పేసినట్లు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. జ్యోతిని పూర్తిగా ఆర్పివేయట్లేదని, అందులో కొంత భాగాన్ని తీసుకెళ్లి జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉండే జ్యోతితో కలుపుతున్నామని తెలిపింది. విపక్షాల విమర్షలకు సమాధానం ఇచ్చింది. ‘‘ఇండియా గేట్ మీద ముద్రించిన జవాన్ల పేర్లలో 1971 యుద్ధంలో మరణించిన వారి పేర్లు లేవు. మొదటి ప్రపంచ యుద్ధం, అఫ్ఘాన్-ఆంగ్లో యుద్ధంలో పోరాడిన అమరుల పేర్లే ఉన్నాయి. ఇది వలస పాలనను గుర్తుకు తెస్తోంది. జాతీయ యుద్ధ స్మారకంలో భారతీయ అమరవీరులందరి పేర్లు ఉంటాయి. అందువల్ల అమర జవాన్ల కోసం జ్యోతిని అక్కడ ఏర్పాటు చేయడమే సబబు. అక్కడే ఈ జ్యోతి కూడా వెలిగితేనే వారికి నిజమైన శ్రద్ధాంజలి ఘటించినట్లు అవుతుందిఏడు దశాబ్దాల్లో జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించలేని వాళ్లు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు’’ అని విమర్శించాయి.
ప్రభుత్వ నిర్ణయాన్ని మాజీ సైన్యాధ్యక్షుడు వేద్ ప్రకాశ్ మాలిక్ సమర్థించారు. జాతీయ యుద్ధ స్మారకం ఏర్పాటయ్యాక అమర జవాన్లకు నివాళులర్పించే కార్యక్రమాలన్నీ అక్కడే జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు జ్యోతులను విలీనం చేయడం సబబేనన్నారు. జవాన్ల కోసం జాతీయ యుద్ధ స్మారకం నిర్మించినందున ఇండియా గేట్ వద్ద ప్రత్యేక జ్యోతి ఎందుకన్న వాదన ఉన్నట్లు సైనికవర్గాలు పేర్కొన్నాయి. 1947-48 పాకిస్థాన్ యుద్ధం మొదలుకొని గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరులైన సైనికుల వరకు అందరి పేర్లు జాతీయ యుద్ధ స్మారకంలో ఉన్నాయని గుర్తుచేశాయి.
– క్రాంతి, సీనియర్ జర్నలిస్ట్