– చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్ జనరల్, భారత పారిశ్రామిక సమాఖ్య (CII)
వృద్ధికి ఊతమిస్తూ కీలక సంస్కరణాయుతమైన వరుస అంకురార్పణలకు నాంది పలుకుతామన్న వాగ్దానాన్ని సాకారం చేస్తున్నట్టుగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2047 సంవత్సరానికి స్వాతంత్య్ర శతాబ్దిలోకి అడుగుపెడుతున్న భారత్‌ను అంతర్జాతీయ యవనికపై అద్వితీయశక్తిగా అవతరింపజేసే దిశగా ఈ బడ్జెట్ మార్గదర్శనం చేస్తున్నది. పెట్టుబడులకు మరింత తోడ్పాటును అందించే ఉద్దేశంతో ప్రధానమంత్రి గతిశక్తి, సమ్మిళిత అభివృద్ధి, మెరుగైన ఉత్పాదకత, విస్తారమైన అవకాశాలు, ఇంధన పరివర్తన, వాతావరణ అనుకూల చర్య, పెట్టుబడులకు ఆర్థిక సహకారం వంటి కీలక రంగాలపై ఈ బడ్జెట్ ప్రధానంగా దృష్టిపెట్టింది.
ఆయా రంగాల అవసరాలకు లోబడి ప్రభుత్వం చేసిన ప్రకటనలు వివేకంతో కూడుకున్నవి. మౌలిక సదుపాయల విస్తరణ, నిలకడతో కూడుకున్న నిర్వహణ, వ్యవసాయం, డిజిటలైజేషన్ దిశగా ప్రభుత్వంచేసే ఖర్చులను ఉపయుక్తం చేసే లక్ష్యంతో ఉన్నవి. ప్రజల కోసం భారీ ఎత్తున నిర్వ హించ తలపెట్టిన వ్యయానికి ప్రైవేట్ పెట్టుబడులను సేకరిస్తారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చే మౌలిక సదుపాయాల కల్పనా కార్యక్రమం ఒక ఉత్ప్రేరకంగా పనిచేసే అవకాశం ఉంది. తద్వారా సమాజంలో అన్ని వర్గాల ప్రజల అవసరాలను తీరుస్తూనే ఆర్థికవృద్ధి, అభివృద్ధి పథాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.
ఒక క్రమపద్ధతిలో ఆర్థిక ఏకీకరణను ఈ బడ్జెట్ నెరవేర్చింది. 2022 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 6.9 శాతానికి స్థిరపడింది. అదే 2023 సంవత్సరానికి ద్రవ్యలోటును 6.4 శాతంగా అంచనా వేయడమైనది. రాష్ట్ర స్థాయిలో ద్రవ్య లోటును 4 శాతానికి అనుమతించారు. అదనపు వ్యయం ద్వారా వృద్ధికి ఊతమివ్వడంలో అది ఒక ఉపకరణంగా పనిచేస్తుందని నిరూపించుకోనుంది. రాష్ట్ర స్థాయిలో లక్ష కోట్లు, అంతకు మించిన సహాయం అందించాలనే పథకాలను ప్రభుత్వం రచిస్తున్నది. అది రాష్ట్రాలకు మరింత ప్రయోజనకారి అవుతుంది. మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన పెట్టుబడులను మరింత ప్రోత్సహించా ల్సిన అవసరాన్ని ఈ బడ్జెట్ గుర్తించింది. అందుకే ఈ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పలు ముఖ్యమైన ప్రకటనల రూపేణా ప్రభుత్వం ఆ పని చేసింది. 2022 సంవత్సరంలో 5జీ వేలంపాటల నిర్వహణ లాంటి వాటితో పాటు ఉత్పత్తి అనుబంధ ప్రోత్సాహకం (పీఎల్‌ఐ)లో భాగంగా 5జీ కోసం డిజైన్ ఆధారిత తయారీ పథకం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో నిరుపేద లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి నిధుల కేటాయింపు వంటివి ఆ ప్రకటనల్లో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5.54 లక్షల కోట్లుగా ఉన్న పెట్టుబడి వ్యయంపై 35.4 శాతం అనూహ్యమైన పెంపును ఈ బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంస్కరణ అవసరమైన చోట్ల ప్రభుత్వ వ్యయానికి దారి తీసే అవకాశం ఉంది. ఇది హౌసింగ్, కన్స్‌ట్రక్షన్, రియల్ ఎస్టేట్‌కు ప్రోత్సాహకాలు ఇవ్వాలంటూ మేం చేసిన సిఫార్సుకు తగ్గట్టుగా ఉంది.
కర్బన ఉద్గారాలను కనిష్టానికి లేదా శూన్యం చేయడం కోసం కొత్త టెక్నాలజీల వ్యాపారీకరణకు మద్దతు ఇవ్వడం ద్వారా అలాంటి టెక్నాలజీల రూపకల్పనలకు రావాల్సిన డిమాండ్‌ను మేం లేవనెత్తాం. స్వచ్ఛ ఇంధన పరివర్తనకు విధాన పరంగా ప్రత్యేక శ్రద్ధను ఈ బడ్జెట్ చూపింది. అది వాతావరణ మార్పు లక్ష్యాలకు ఉపకరిస్తుంది. వచ్చే 25 సంవత్సరాల కాలానికి దేశ వృద్ధిలో కీలకమైనదిగా ఈ రంగం ఉంటుందని చెప్పారు. పునరుద్ధనీయ ఇంధనం, ఇంధన సామర్థ్యం, ఎలక్ట్రిక్ మొబిలిటి, గ్రీన్ బాండ్లకు భారీ ఎత్తున నిధుల కేటాయింపు జరిగింది. బొగ్గును ఇంధనంగా మార్చేందుకు ప్రయోగ స్థాయిలో నాలుగు ప్రాజెక్టులు ప్రకటించారు. వీటికి తోడు దేశంలో ఇంధన ఉత్పాదకతకు రూ.19,500 కోట్ల అదనపు కేటాయింపు జరిగింది. ఇది 2030 నాటికి 280 గిగావాట్ల స్థాపిత సౌరశక్తి సామర్థ్యానికి ఊతమి స్తుంది. అత్యంత సమర్థవంతమైన పాలిసిలికాన్ మాడ్యూళ్ల తయారీకి పీఎల్‌ఐ కేటాయింపు దేశ సౌరశక్తి సామర్థ్యాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది.
ఈ బడ్జెట్ ప్రధానంగా దృష్టి పెట్టిన రంగాల్లో ప్రజారోగ్య సంరక్షణ కూడా ఉంది. ఆ క్రమంలో నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకో సిస్టమ్ కోసం ఒక వేదిక ఆవిర్భావానికి నాంది పలికింది. హెల్త్ ప్రొవైడర్లు, ఆరోగ్య సంరక్షణ సంస్థల డిజిటల్ రిజిస్ట్రీలు, ఒక నవ్యమైన హెల్త్ ఐడెంటిటీ, ఎక్కడి నుంచైనా ఆరోగ్య సంరక్షణ సమకూర్చే సదుపాయాలను సదరు నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకో సిస్టమ్ అందిస్తుంది. కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా అన్ని వయస్సులకు చెందిన పౌరుల్లోనూ మానసిక ఆరోగ్య సమస్యలను కలిగించిన వైనాన్ని ప్రభుత్వం గుర్తించింది. ప్రజారోగ్య సంరక్షణకు మరో అడుగు ముందుకు వేస్తున్నట్టుగా జాతీయ టెలీ-మెంటల్ హెల్త్ పోగ్రామ్‌ను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది.
టాక్సేషన్‌కి సంబంధించి కీలకమైన సంస్కరణలను తాజా బడ్జెట్ తీసుకువచ్చింది. ప్రత్యేక ఆర్థిక మండళ్లలో పూర్తిగా ఐటీతో నడిచే కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్, క్యేపిటల్ గూడ్స్‌లో దశలవారీగా రాయితీ రేట్ల తొలగింపునకు మార్గం సుగమం చేసింది. క్రమంగా దిగుమతులపై దృష్టి పెట్టే… 7.5 శాతం మేరకు మితమైన సుంకం లాంటి సంస్కరణలూ ఇందులో ఉన్నాయి. అంతేకాక, దేశంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో తయారీకి ఊతమిచ్చే ఒక శ్రేణీకృత వ్యవస్థను సమకూర్చేలా కస్టమ్స్ డ్యూటీ రేట్లను క్రమపద్ధతిలో ఉంచాలని బడ్జెట్ ప్రతిపాదించింది.
2022 మార్చి 31లోగా ఏర్పాటైన, అర్హత కలిగిన అంకుర సంస్థలకు వచ్చే 10 సంవత్సరాల కాల వ్యవధిలో వరుసగా మూడు సంవత్సరాల కాలానికి పన్ను మినహాయింపు ఇవ్వనున్నారు. ఈ విధంగా ఔత్సాహిక, యువ వ్యాపారులకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తున్నారు. నిర్దేశిత దేశవాళీ కంపెనీల కోసం అంతర్జాతీయ స్థాయి వాణిజ్యంలో ఒక పోటీతత్త్వంతో కూడుకున్న వాతావరణాన్ని నెలకొల్పడంలో భాగంగా కొత్తగా ఏర్పాటైన దేశవాళీ తయారీ కంపెనీలకు పన్నులో 15 శాతం రాయితీని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంతకంతకు మారుతున్న ఆర్థిక రంగాన్ని పరిగణనలోకి తీసుకున్నట్టుగా ఏదేని వర్చువల్ డిజిటల్ ఆస్తి ద్వారా పొందే ఆదాయంపై 30 శాతం పన్నును బడ్జెట్ ప్రతిపాదించింది. స్వాధీనత ఖర్చును మినహాయించుకొని అలాంటి ఆదాయాన్ని లెక్కించే సమయంలో ఏదేని వ్యయం లేదా భత్యానికి సంబంధించి ఎలాంటి తీసివేత అనుమతించరు.
ఈ బడ్జెట్ ఎన్నో నిర్మాణాత్మక సంస్కరణలకు అండదండగా నిలిచిందని చెప్పాలి. సులభతరమైన వ్యాపారానికి ఊతమిచ్చే ఎన్నో చర్యలు ఇందులో తీసుకున్నారు. అంతేకాదు, పెట్టుబడిదారులకు మరింత ప్రోత్సాహ కరంగా ఈ బడ్జెట్ ఉన్నది. స్టాండర్డైజేషన్‌పై దృష్టి, పేరుకుపోతున్న అనుమతుల తొలగింపు, సలహాలు, సూచనల క్రౌడ్ సోర్సింగ్, పర్యావరణ అనుమతుల కోసం ఏర్పాటైన ఏక గవాక్ష పోర్టల్ ‘పరివేష్’ (=וజు•)ను మరింత విస్తృతపరచడం, కంపెనీలు స్వచ్ఛందంగా మూతపడే పక్రియ సులభతరం, వేగవంతం కోసం ప్రాసెసింగ్ యాక్సెలెరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ సెంటర్ ఏర్పాటు లాంటి ప్రస్తావనలు ఈ సంస్కరణల్లో ప్రధానాంశాలు.
మొత్తంగా, కరోనా మహమ్మారి తదనంతర రికవరీని మరింత వేగవంతం చేసే ఒక భావిపక్రియను అనుసరించడం ద్వారా ఆర్థికవృద్ధిలో భారత్‌ను అత్యున్నత శిఖరాలకు చేర్చడంలో ప్రభుత్వానికి గల నిబద్ధతకు 2022-23 కేంద్ర బడ్జెట్ ప్రాతినిథ్యం వహిస్తున్నది. అలాగే 2047లో అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలిపే లక్ష్యసాధనకు తాజా బడ్జెట్ ఊతమిస్తున్నది.
అను: మహేష్ ధూళిపాళ్ల