మతాన్ని ప్రాథమిక హక్కుగా, ‘విశ్వాసం’గా భారత రాజ్యాంగం గుర్తించింది. అందుచేతనే రాజ్యాంగంలోని 25-28 అధికరణల్లో మత హక్కును కల్పించింది. విచిత్రమేమంటే మన రాజ్యాంగం ‘మతాన్ని’ లేదా ‘మతానికి సంబంధించి అంశాలను’ నిర్వచించ లేదు. ఈ పదాలకు న్యాయపరమైన అర్థాలను వివరించే బాధ్యతను సుప్రీంకోర్టుకే వదిలేసింది. మతం అంటే జర్మనీకి చెందిన తత్త్వవేత్త ఇమాన్యుయెల్ కాంట్ నిర్వచనం ప్రకారం, ‘మనం నిర్వర్తించాల్సి విధులను దివ్య ఆదేశాలుగా గుర్తించడం’. అమెరికా సామాజికవేత్త మిల్టన్ యింగర్ ఇచ్చిన నిర్వచనం, ‘నిత్యజీవితంలో ఒక సమూహానికి చెందిన మానవులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను అధిగమించేందుకు అనుసరించే విశ్వాసాల వ్యవస్థ’. మనదేశంలో మతాలకు అనుగుణంగా చట్టాలున్నాయి! కానీ మతాలకతీతంగా ఉమ్మడి సివిల్ కోడ్ లేదు! అది అమల్లో ఉంటేనే కొన్ని సున్నిత సమస్యలకు పరిష్కారం సాధ్యం. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొని రావాలని చూస్తున్న ‘యూనిఫామ్ సివిల్ కోడ్’ గోవా రాష్ట్రంలో మాత్రమే ‘గోవా సివిల్ కోడ్’ పేరుతో ప్రస్తుతం అమల్లో ఉంది. అది పోర్చుగీసువారి సివిల్ కోడ్. 1961లో గోవా మనదేశంలో విలీనమైన దగ్గరినుంచి అదే సివిల్ కోడ్ అక్కడ అమలవుతోంది.
దేశంలో ‘యూనిఫామ్ సివిల్ కోడ్’ లేక పోవడం వల్ల ఎటువంటి సమస్యలు ఉత్పన్న మవుతాయో చెప్పడానికి కర్ణాటకలో ప్రస్తుతం కొనసాగుతున్న ‘హిజాబ్’ వివాదం గొప్ప ఉదాహరణ. గతంలో మనదేశంలో ఇటువంటి వివాదాలు ఏర్పడలేదని కాదు. ఒక వివాదాన్ని ప్రారంభంలోనే పరిష్కరించకపోవడం వల్ల ఎప్పటికప్పుడు కొత్తరూపంలో ఇవి సాక్షాత్కరి స్తుంటాయి. విచిత్రమేమంటే కులాతీత, మతాతీత రాజ్యాంగం కలిగిన దేశమని మనం ఎంతగా గొప్పలు చెప్పుకున్నప్పటికీ, ఈ రెండు అంశాలే మనదేశాన్ని ఎప్పటికప్పుడు ఇబ్బందుల్లోకి నెడుతుండటం విషాదం. మతాలు, కులాల మధ్య సామరస్యం లేనప్పుడు చిన్న కారణం చాలు, పెద్ద ఎత్తున చిచ్చురేగడానికి! ఈ విధంగా రావణకాష్టం రగిలించడానికి దుర్మార్గపు శక్తులు ఎప్పుడూ కాచుకు కూర్చునే ఉంటాయి. ఇప్పుడు ‘హిజాబ్’ అనే ఒక చిన్న సమస్య కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.
వివాదం ప్రారంభం
ఇప్పటి వివాదం డిసెంబర్ 31న ఉడిపిలోని ప్రభుత్వం పి.యు. బాలికల కళాశాలలో ఆరుగురు విద్యార్థినులు హిజాబ్‌లు ధరించి తరగతులకు హాజరవుతామని డిమాండ్ చేయడంతో మొదలైంది. ప్రవేశాల సమయంలో కళాశాల నియమ నిబంధనల గురించి చెప్పినప్పుడు అంగీకరించి, తీరా ఇప్పుడు ఈవిధంగా డిమాండ్ చేయడ మేంటంటూ, కళాశాల యాజమాన్యం జనవరి 1వ తేదీన సమావేశం ఏర్పాటుచేసి, హిజాబ్ ధరించి వచ్చే వారిని కళాశాలలోకి అనుమతించకూడదని నిర్ణయించింది. కానీ సమస్య అంతటితో సమసి పోలేదు. జనవరి 13న ఉడిపి పి.యు. బాలికల కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థినులు తమను హిజాబ్ ధరించడానికి అనుమతిస్తేనే తరగతులకు హాజరవుతామని స్పష్టం చేశారు. పరిస్థితిని గమనించి హిజాబ్ సమస్యకు కళాశాల యాజమాన్యం జనవరి 19న ఒక పరిష్కారాన్ని సూచించింది. దీని ప్రకారం విద్యార్థులు హిజాబ్ ధరించి కళాశాలకు రావచ్చు. కాకపోతే తరగతి గదిలోకి టీచర్ ప్రవేశించగానే వాటిని తీసివేయాలి. ఇది అంగీకారయోగ్యం కాకపోతే ప్రభుత్వ ఆదేశాలు వచ్చేవరకు వేచి ఉండాలి. ఇదిలావుండగా జనవరి 25న కర్ణాటక ప్రభుత్వం ‘యూనిఫామ్’, ‘డ్రెస్‌కోడ్’పై ఒక నిపుణుల కమిటీని నియమించింది. ప్యానల్ తుది నిర్ణయం తీసుకునేవరకు ‘యథాతథ స్థితి’ని కొనసాగించాలని ఉడిపి కళాశాలను ఆదేశించింది. జనవరి 28న ఉడిపి పి.యు. కళాశాల బెటర్‌మెంట్ కమిటీ హిజాబ్ సమస్యకు పరిష్కారం కనుగొనాలన్న ఉద్దేశంతో ముస్లిం నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చలు ప్రారంభించారు. కానీ ‘క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ (సోషల్ డెమోక్రటిక్ పార్టీ అనుబంధ విద్యార్థి సంస్థ) మాత్రం విద్యార్థినులకే మద్దతు ఇస్తామని తేల్చి చెప్పటడంతో సమస్య పీటముడిపడింది.
ఇదిలావుండగా జనవరి 31న ప్రభుత్వ పి.యు. కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. కళాశాల క్యాంపస్‌లో హిజాబ్ ధరించడంతో సహా తప్పనిసరి మత విశ్వాసాలను అనుసరించే ప్రాథమిక హక్కు తమకు ఉన్నదంటూ ప్రకటించాలన్నది ఈ పిటిషన్ సారాంశం. దీంతో మరునాడు అంటే ఫిబ్రవరి 1న ఈ విద్యార్థినులు తరగతులకు హాజరు కావడానికి అనుమతి లభించలేదు. ఈ కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ ఎస్. దీక్షిత్, కేసు విచారణను మరో విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని ఫిబ్రవరి 9న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిఫారసు చేశారు.
కర్ణాటక ప్రభుత్వ వాదన
హిజాబ్ ధరించడం ఇస్లాం మతాచారం ప్రకారం తప్పనిసరి కాదని, కర్ణాటక ప్రభుత్వం వాదిస్తోంది. అంతేకాదు ప్రాథమిక హక్కులపై అవసర మనుకున్నప్పుడు పరిమితులు విధిస్తూ ఆదేశాలు జారీచేసే అవకాశం తనకు ఉన్నదని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కర్ణాటక విద్యాచట్టం సెక్షన్ 133(2)-1983 ప్రకారం యూనిఫామ్ ధరించడంపై ఆదేశాలు జారీచేసే అధికారం ఉన్నదని కూడా పేర్కొంటున్నది. గతంలో ఇటువంటి కేసుల్లోనే కోర్టులు ఇచ్చిన తీర్పులు పరిశీలించవచ్చు. స్టూడెంట్ పోలీస్ కేడెట్ (ఎస్‌పిసి) ప్రాజెక్టుకు సంబంధించి విద్యార్థినులు తప్పనిసరిగా నిర్దేశించిన యూనిఫామ్‌నే ధరించాలని కేరళ ప్రభుత్వం గతంలో ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ కుట్టియాడిలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న రిజా నహాన్ అనే విద్యార్థిని రాజ్యాంగం లోని 25(1) అధికరణం తమకు హిజాబ్ ధరించే హక్కును కల్పిస్తున్నదంటూ ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయిం చినప్పుడు కోర్టు… ప్రభుత్వానికే మతపరమైన తన సమస్యను నివేదించమని కోరింది. ఆమె తిరిగి ప్రభుత్వాన్ని ఆశ్రయించగా సెక్యులరిజం పాటించడానికి యూనిఫామ్ ధరించాల్సిందేనని ఆదేశించింది. యువత అభివృద్ధికి, భవిష్యత్తులో చట్టాన్ని గౌరవించడం, క్రమశిక్షణతో మెలగడం, నిస్సాహాయులకు చేయూతనందించడం వంటి అంశాల్లో పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు తగిన శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఇది. అదేవిధంగా కేరళకు చెందిన క్రీస్తు నగర్ సీనియర్ సెకండరీ పాఠశాల ఒక సి.ఎం.ఐ. విద్యాసంస్థ. ఈ పాఠశాలకు యూనిఫామ్ ఉంది. అయితే అక్కడే చదువుతున్న ముస్లిం విద్యార్థినులు దీనికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు. ఇదే ఫాతిమా తస్నీమ్ వర్సెస్ కేరళ స్టేట్ కేసు (2018)గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కేరళ హైకోర్టు ‘ఒక ప్రైవేటు ఎయిడెడ్ విద్యాసంస్థలో నిర్దేశిత డ్రెస్‌కోడ్ (యూనిఫామ్) అమల్లో ఉన్నప్పుడు హిజాబ్ ధరించడాన్ని తిరస్కరించవచ్చునని, ఒకవేళ సంస్థకు అటువంటి స్వేచ్ఛ లేనట్లయితే సంస్థ నిర్వహణ కష్టమవుతుందని’ స్పష్టం చేసింది. అంటే ఇక్కడ డ్రెస్‌కోడ్ గురించి వ్యక్తిగతమైన విశ్వాసాలు, నమ్మకాలు ఉండటంలో స్వేచ్ఛ ఉన్నవిధంగానే ఒక సంస్థకు నిర్వహణ విషయం కూడా ఒక ప్రాథమిక హక్కుగా పేర్కొనడం గమనార్హం.
వేరే ప్రాంతాలకు వ్యాప్తి
కాగా జనవరి 6న ‘పాంపి కాలేజ్ ఆఫ్ అయికల’ వారు కళాశాలలోకి కేవలం యూనిఫాం ధరించిన వారిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 2న భద్రావతిలోని సర్ సి.వి. ప్రభుత్వ కళాశాలలో హిజాబ్ ధరించిన విద్యార్థినులకు వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు నిరసనలు తెలిపారు. ఫిబ్రవరి 3న కుందాపూర్ జూనియర్ కళాశాలలో 28 మంది ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించారన్న కారణంగా తరగతులకు అనుమతించకపోవడంతో వివాదం ఒక్కసారి రాజుకుంది. ఇది భండార్కర్ ఆర్టస్ అండ్ సైన్స్ కాలేజీ తర్వాత ప్రభుత్వ పి.యు. కళాశాలకు పాకింది. ఇదిలావుండగా హిజాబ్‌ను సమర్థిస్తున్న వారికి పోటీగా ఫిబ్రవరి 8న ఉడిపిలోని మహాత్మా గాంధీ మెమోరియల్ కళాశాలకు చెందిన కొందరు విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి రావడంతో సమస్య కొత్త మలుపు తీసుకుంది. విద్యా సంస్థలను ఫిబ్రవరి 9వ తేదీనుంచి మూడు రోజులపాటు మూసివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే వరకు పరిస్థితులు వెళ్లాయి.
రాజకీయాల క్రీనీడ
ఈ గొడవలన్నింటికీ వెనుక సోషల్ డెమోక్రటిక్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ‘క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ (సి.ఎఫ్.ఐ) ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఎంతో కాలంగా కర్ణాటకలోని మలనాడు ప్రాంతంలో ఎ.బి.వి.పి. బలీయంగా ఉంది. సి.ఎఫ్.ఐ. క్రమంగా తన పలుకుబడిని విద్యాసంస్థల్లో పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ గొడవలు విస్తృతమవుతున్నాయని చెబుతున్నారు. సి.ఎఫ్.ఐ. బలం పెరిగితే సోషల్ డెమోక్రటిక్ పార్టీ సహజంగానే ఆధిపత్యం వహించవచ్చు. ఈ పోరాటంలో ప్రస్తుతం విద్యార్థులు బలవుతున్నారు. విద్యార్థుల్ని ఏదో విధంగా రెచ్చగొడితే విద్యాసంస్థల్లో ప్రాబల్యాన్ని బాగా విస్తరించుకోవచ్చునన్నది కొన్ని రాజకీయ పార్టీల్లో నెలకొన్న ‘సంప్రదాయిక’ అభిప్రాయం. ఒక తరం, ఒకానొక సమస్యతో ఇబ్బంది పడినప్పుడు, దానికి తనతోనే ముగింపు పలకాలి, అంతేకాని కింది తరానికి బదలాయించరాదు. అట్లా చేస్తే సమస్య రావణకాష్ట మవుతుంది. ప్రస్తుత హిజాబ్ సమస్య ఆ కోవకు చెందిందే. అమాయకులైన విద్యార్థుల్లో విషబీజాలు నాటడానికి కారణమవుతోంది. ఆఖరికి మలాలా యూసుఫ్ జాయ్ కూడా హిజాబ్‌కు అనుకూలంగా ప్రకటించే స్థాయికి ఇది చేరుకుంది.
పాక్ నాయకుల దిగజారుడుతనం
పొరుగుదేశం పాకిస్తాన్ రాజకీయనేతలు సరేసరి. పాక్ మంత్రులు షా మహమ్మద్ ఖురేషి, ఛౌదరీ ఫవాద్ హుస్సేన్‌లు కూడా హిజాబ్ వివాదం గురించి మాట్లాడటం విచిత్రం! తమ దేశ దుస్థితి ఎంతమాత్రం పట్టని వీరు మనదేశంలోని ఒక రాష్ట్రంలో నెలకొన్న చిన్న వివాదంపై గొంతెత్తడానికి వెనుకాడకపోవడం వీరి దుర్నీతికి నిదర్శనం. వీటన్నింటిపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ మాట్లాడుతూ ఏదోవిధంగా ఈ చిన్న సమస్యకు ‘మతం’ రంగు పులమడమే లక్ష్యంగా కొన్ని శక్తులు పనిచే స్తున్నాయని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. మైనారిటీల విష యంలో ‘నేరాలకు పాల్పడే అటవిక’ దేశం, మత సామరస్యాన్ని పాటించే భారత్‌పై అభాండాలు వేయడం తగదని హెచ్చరించారు. ప్రపంచంలో ప్రతి పదిమంది ముస్లింలలో ఒకరు మనదేశంలోనే నివసిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం 50వేల మదరసాలు మరో 50వేల మైనారిటీ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. మరి అదే పాకిస్తాన్‌లో మొదట 1288 దేవాలయాలుండగా మరి ఇప్పుడు కేవలం 31కి పరిమితమయ్యాయి. మైనారిటీలపైన పాక్ అనుసరిస్తున్న వైఖరికి దీనికంటే పెద్ద ఉదాహరణ అక్కరలేదు. దేశ విభజన సమయంలో 23శాతం ఉన్న హిందువుల జనాభా, ఇప్పుడు మూడు శాతాని కంటే తక్కువకు పడిపోయింది. ఇటువంటి నిజాలు పాక్ ‘గురివింద’లకు తెలియవు. విచిత్రమేమంటే, మైనారిటీల చేతుల్లో మెజారిటీలు ఇబ్బందులు పడుతున్న దేశం బహుశా ప్రపంచంలో భారత్ మాత్రమే నేమో! ఏవిధమైన ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఆనందంగా మైనారిటీలు జీవిస్తున్న దేశం కూడా భారత్ మాత్రమే! ఈ సత్యాన్ని మనదేశంలోని కుహనా సెక్యులరిస్టులు గుర్తించాలి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో కర్ణాటక పరిణామాలు దేశీయంగా ఇటువంటి సెక్యులర్ ‘మేతావులకు’ ఎక్కడలేని ఉత్సాహం కలిగించడం సహజం.
గ్రేట్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఎంట్రీ
నిండా మునిగిన ‘‘గ్రాండ్ ఓల్డ్ పార్టీ’’ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక్కసారి ఒళ్లు విదిల్చుకొని సహాయకులు రాసిన విమర్శలు చేసి తన మామూలు ధోరణిలోకి వెళ్లిపోతారు. ఇక ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సుర్జేవాలా రాష్ట్ర విద్యార్థి నేతల పేరుతో విడుదల చేసిన లేఖలో ‘భాజపా ప్రభుత్వ’ స్వార్థ పూరిత వైఖరే విద్యార్థుల్లో ఐక్యతను దెబ్బతినడానికి కారణమంటూ ప్రస్తుత గందర గోళంలో తన పార్టీ తరపున ‘ఆజ్యం’ పోయడానికి యత్నించారు. సమస్య మూలం క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా విద్యార్థి సంస్థలో ఉన్నప్పటికీ ‘ఆత్మసాక్షి’ని తొక్కిపట్టి ‘బుజ్జగింపు’, ‘రెచ్చగొట్టే’ ధోరణులు అవలంబించడం ఆ పార్టీకే చెల్లింది. విద్యాసంస్థల్లో కుల, మత అసమానతలు లేకుండా ఉండేందుకు ఉద్దేశించిన ‘యూనిఫామ్’ విషయం మరుగునపడి, హిజాబ్ ధరించాలా వద్దా? వంటి అంశాలపై అనవసర చర్చలు లేవనెత్తి, ‘మతం రంగు’ పులిమే రాజకీయాలకు స్వస్తి పలకకపోతే దేశ పురోభివృద్ధి ఎలా సాధ్యం? ఏ చిన్న సాకు దొరికినా ‘హింస’ను రెచ్చగొట్టే రాజకీయ పార్టీల వైఖరి మారనంతవరకు దేశం సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధించడం కష్టం.
– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్