భారతదేశంలో మానవహక్కులకు రక్షణ లేదంటూ, హిందూ జాతీయతావాదం విస్తరిస్తున్న ధోరణి ఆందోళన కలిగిస్తున్నదంటూ పనీపాటా లేకుండా వాపోయే మూక నుంచి మళ్లీ ఓ గొంతు వినిపించింది. ఈ గొంతు సాక్షాత్తు భారత మాజీ ఉపరాష్ట్రపతి మహమ్మద్‌ ‌హమీద్‌ అన్సారీది కావడమే విశేషం. ఇలాంటి విద్రోహపూరిత వ్యాఖ్య చేయడానికి ఆయన ఎంచుకున్న సమయం భారత గణతంత్ర దినోత్సవం. సందర్భం ఇంకా ఘనమైనది- భారత్‌ ‌మైనారిటీల పాలిట ఓ బలిపీఠం అంటూ నిరంతరం ఆడిపోసుకునే ఇండియన్‌ అమెరికన్‌ ‌ముస్లిం కౌన్సిల్‌ (ఐఏఎం‌సీ) చర్చా కార్యక్రమం. నిజానికి అన్సారీ దేశ వ్యతిరేకత, హిందూ ద్వేషం ఈనాటివి కావు. ఇందుకు కావలసినన్ని రుజువులు ఉన్నాయి.

భారతదేశంలో అసహనం నెలకొందని ఆ చర్చా కార్యక్రమంలో (వర్చువల్‌) ‌మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ తేల్చారు. ఇంకా, భారత్‌లో ప్రతిష్టితమైన పౌర జాతీయవాదం స్థానంలో కొత్త, ఊహాత్మక సాంస్కృతిక జాతీయవాదం అనే ధోరణి, సంప్ర దాయం ఈ మధ్య పెరిగిపోయింది. భారత్‌లో పౌర జాతీయవాదం స్థానంలో సాంస్కృతిక జాతీయతా వాదాన్ని ప్రతిష్టించే పని జరుగుతోంది.  ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలలో సాధించిన మెజారిటీని మతపరమైన ఆధిక్యంగా చిత్రిస్తూ, రాజకీయ అధికారం మీద గుత్తాధిపత్యం సాధించినట్టు భావి స్తున్నది. ఈ తీరును చట్టబద్ధంగా, రాజకీయంగా సవాలు చేయాలి అన్నారాయన.

ఈ చర్చలో ఇంకా అమెరికా చట్టసభల ప్రతినిధులు ఎడ్‌ ‌మార్కే, జిమ్‌ ‌మెక్‌గవర్న్, ఆం‌డీ లెవిన్‌, అమీనా గురీబ్‌ ‌ఫాకిమ్‌, ‌మారిషస్‌ ‌మాజీ అధ్యక్షుడు నాడీన్‌ ‌మాయినెజ్‌ ‌కూడా పాల్గొన్నారు. భారతీయ నటి స్వర భాస్కర్‌ ‌కూడా మాట్లాడారు. బెంగళూరు ఆర్చ్‌బిషప్‌ ‌పీటర్‌ ‌మాచాడోకు హిందువు లను ఈ వేదిక మీద నుంచి ఆడిపోసుకునే సదవకాశం నిర్వాహకులు ఇచ్చారు. అందుకు తగ్గట్టే పీటర్‌ ‌కూడా భారతదేశంలో హక్కులకి తీవ్ర విఘాతం కలుగుతోందని వాపోయారు. ఈ చర్చ నిర్వహణలో ఇండియన్‌ అమెరికన్‌ ‌ముస్లిం కౌన్సిల్‌కి  వాష్టింగ్టన్‌ ‌కేంద్రంగా పనిచేసే 17 సంస్థలు కూడా చేయూతనిచ్చాయి. ఇందులో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ (‌యుఎస్‌) ‌కూడా ఉంది. ఇంకా, జెనోసైడ్‌ ‌వాచ్‌, ‌హిందూస్‌ ‌ఫర్‌ ‌హ్యూమన్‌రైట్స్, ‌న్యూయార్క్ ‌స్టేట్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌చర్చస్‌ ‌కూడా ఉన్నాయి. భారత్‌లోని బహుళ సంస్కృతిక అల్లిక రక్షణ పేరుతో చర్చా కార్యక్రమం జరిగింది.

అన్సారీ వయసు ఇప్పుడు 84 ఏళ్లు. ఆయన ఇలా మాట్లాడడం, అంటే దేశ సార్వభౌమాధికా రానికీ, ప్రజాతీర్పుకీ వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం, ప్రజాస్వామిక మౌలిక సూత్రాలను వ్యతిరేకించడం ఇదే మొదటిసారి కాదు. ఉప రాష్ట్రపతిగా (2007-2017. ఎన్‌డీఏ అభ్యర్థి నజ్మా హెప్తుల్లా మీద కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అంటే భారత్‌ ‌నెత్తిన కాంగ్రెస్‌ ‌రుద్దిన మరొక నాయకమ్మ న్యుడు అన్సారీ. రెండోసారి జస్వంత్‌ ‌సింగ్‌ ‌మీద గెలిచారు) పదవీ విరమణ చేయడానికి పది రోజుల ముందు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి, అపహాస్యం పాలయ్యారు. భారతదేశంలో, మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో పరమత అసహనం, అశాంతి, అభద్రత నెలకొన్నాయని రాజ్యసభ టీవీతో ముచ్చటించినప్పుడు అధిక ప్రసంగం చేశారు. దీనికి వీడ్కోలు సభలో ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా వాత పెట్టారు. 1961లో విదేశీ వ్యవహారాల శాఖలో చేరి 38 ఏళ్లు పనిచేశారు. ఆస్ట్రేలియా, అప్ఘానిస్తాన్‌, ‌సౌదీ అరేబియా, ఇరాన్‌లలో రాయబారిగా పనిచేశారు.

ఇంతకీ అన్సారీ తాజాగా ఆవేశపడిన ఆ వేదిక ఎవరిది? అక్కడ ఆ చర్చా కార్యక్రమం నిర్వహించినది ఎవరు? అదంతా ఇండియన్‌ అమెరికన్‌ ‌ముస్లిం కౌన్సిల్‌ ఏర్పాటు. వీళ్లు అమెరికాలో ఉండి భారతీయ ముస్లింలు భరించరాని కష్టాలు పడుతున్నారని గగ్గోలు పెడుతూ ఉంటారు. భారత్‌లో మైనారిటీల మీద దాడులు జరిగిపోతున్నాయంటూ ప్రచారం చేస్తూ ఉంటారు. అంతేనా, రొహింగ్యాల సమస్యలు తీర్చడానికి అవసరమైన నిధులు ఈ కౌన్సిల్‌ ‌సేకరిస్తూ ఉంటుందని సీఎన్‌ఎన్‌ ‌న్యూస్‌ 18 ‌వార్తా సంస్థ వెల్లడించింది. కొవిడ్‌ ‌నివారణ కోసం సేకరించిన నిధులను నొక్కేసిందని దీనిమీద ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిని మించిన వాస్తవం, దీనికి ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నాయి. త్రిపురలో జరిగిన మత ఘర్షణల వెనుక ఈ కౌన్సిల్‌ ఉం‌దని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పత్రంలో పేర్కొంది. మైనారిటీలని బతక నివ్వడం లేదన్న ప్రచారంతో  భారత్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టించాలని ఈ కౌన్సిల్‌ ‌తినని గడ్డి లేదు. మత సహనం లోపించిన దేశాల జాబితాలో భారత్‌ను చేర్పించాలంటూ ఈ కౌన్సిల్‌ ‌యునైటెడ్‌ ‌స్టేట్స్ ‌కమిషన్‌ ఆన్‌ ఇం‌టర్నేషనల్‌ ‌రెలిజియస్‌ ‌ఫ్రీడమ్‌ అనే సంస్థకి ముడుపులు ఇచ్చిందని డిస్‌ఇన్ఫో ల్యాబ్‌ అనే సంస్థ వెల్లడించింది. ఈ కౌన్సిల్‌ అధిపతి షేక్‌ ఉబేద్‌. ఇతడికి ముస్లింల మీద జరిగే అరాచకాల పేరుతో నిధులు వసూలు చేసుకోవడమే పని. ఇదీ డిస్‌ఇన్ఫో చెప్పినదే. బర్మాలో ముస్లింల ఊచకోత నియంత్రణ పేరుతో ఉబేదా డబ్బులు వసూలు చేశాడు. అబ్దుల్‌ ‌మాలిక్‌ ‌ముజాహిద్‌ ఉబేద్‌ ‌మిత్రుడు. మాలిక్‌ ఇస్లామిక్‌ ‌సర్కిల్‌ ఆఫ్‌ ‌నార్త్ అమెరికా అధ్యక్షుడు. ఇది పాకిస్తాన్‌ ‌కేంద్రంగా పనిచేసే జమాత్‌ ఎ ఇస్లామ్‌కి అనుబంధంగా పనిచేస్తుంది. ఇస్లామిక్‌ ‌సర్కిల్‌ ఆఫ్‌ ‌నార్త్ అమెరికా సంస్థకీ, పాకిస్తాన్‌ ‌కేంద్రంగా పనిచేసే లష్కరే తాయిబా సంస్థకీ మధ్య సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి మూక నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నిస్సిగ్గుగా పాల్గొని భారత్‌ ‌గురించి కారుకూతలు కూశారు మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ.

ఈ మాజీ ఉపరాష్ట్రపతి అసలు బాధ ఏమిటో తెలియదు. పీపుల్స్ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా అనే ఉగ్రవాద సంస్థ దేశంలో పనిచేస్తోంది. ఇది నిర్వహించిన కార్యక్రమానికి కూడా అన్సారీ హాజరయ్యారు (ప్రవక్తను అవమానించాడన్న ఆరోపణతో 2010లో కేరళలో ఒక ప్రొఫెసర్‌ ‌చేయి నరికిన చరిత్ర పీఎఫ్‌ఐకి ఉంది. కేరళలో లవ్‌ ‌జిహాద్‌ ‌నిర్వహిస్తున్న సంస్థ కూడా). 2020 నవంబర్‌లో దేశమంతా కొవిడ్‌తో సతమత మవుతుంటే ఇంకో రెండు వ్యాధులు కూడా ఇక్కడ బాధిస్తున్నాయని అన్నారు అన్సారీ. అవే-మత భావన, తీవ్ర జాతీయవాదమట. కాంగ్రెస్‌ ఎం‌పీ శశిథరూర్‌ ‌పుస్తకం ‘ది బ్యాటిల్‌ ఆఫ్‌ ‌బిలాంగింగ్‌’‌ను వర్చువల్‌ ‌పద్ధతిలో ఆవిష్కరిస్తూ ఈ మాట అన్నారు. అంతేకాదు, ఒక్క నాలుగేళ్లలోనే పౌర జాతీయవాదం నుంచి సాంస్కృతిక జాతీయవాదం వైపు వ్యవస్థ వెళ్లిందని అన్నారు. ఇక ఆయన దృష్టిలో మత భావన అంటే అతి తీవ్ర మత భావన. దీనిని సామాజిక ఒత్తిడితోనే కాదు, ప్రభుత్వ పరమైన ఒత్తిడితో కూడా రుద్దుతున్నారట. అంతకు ముందు 2018 అక్టోబర్‌లో కూడా ఇలాగే నోరు జారారు. దేశ విభజనకి పాకిస్తాన్‌ ఒక్కటే కారణం కాదు, భారత్‌కూ భాగం ఉందని ఈయన చెప్పారు. ఏఎన్‌ఐ ‌వార్తా సంస్థ నివేదిక ప్రకారం విభజనలో మనకి కూడా సమభాగం ఉన్నా, దానిని అంగీకరించడానికి మనం సిద్ధంగా లేమని ఆయన చెప్పారు.

అన్సారీ విధ్వంసకర చింతన ఇప్పటిది కాదు. రిసెర్చ్ అం‌డ్‌ ఎనాలిసిస్‌ ‌వింగ్‌ (‌రా) మాజీ అధిపతి ఎన్‌కె సూద్‌ ఈయన గురించి ఒక ఇంటర్వ్యూలో జుగుప్సాకరమైన నిజాలు వెల్లడించారు. అన్సారీ 1990-92 మధ్య ఇరాన్‌లో భారత రాయబారిగా పనిచేశారు. టెహ్రాన్‌లో ఉన్న ‘రా’ వ్యవస్థ గురించి బయటకు చెప్పి అందులోని ఉద్యోగుల ప్రాణాలకే ముప్పు తెచ్చిన ఘనత అన్సారీది. ఆప్‌ ఇం‌డియా వార్తా సంస్థకు చెందిన చిరంజీవి భట్‌ ‌జూలై 15, 2019న చేసిన ఆ ఇంటర్వ్యూలో వేసిన తొలి ప్రశ్న, ఆయన (అన్సారీ) జాతి వ్యతిరేక కార్యకలాపాలలో ఉన్నాడని మీరు మొదట ఎప్పుడు అనుమానించారు? అనే. అన్సారీ మీద ఉన్న ముద్ర అది. ఇరాన్‌ ‌విమానాశ్రయంలో సందీప్‌ ‌కపూర్‌ అనే ఒక దౌత్య ఉద్యోగిని కిడ్నాప్‌ ‌చేశారు. విదేశాలలో పనిచేసే భారతీయుల బాగోగులు చూసే బాధ్యత అక్కడి రాయబారిది. కానీ అన్సారీ ఈ కిడ్నాప్‌ ‌విషయంలో మూడు రోజులు తరువాత గాని స్పందించలేదు. పైగా సందీప్‌ ‌దేశ వ్యతిరేక కార్యకలాపాలో పాల్గొన్నాడని నోట్‌ ‌రాశారు. మరొకరిని కూడా కిడ్నాప్‌ ‌చేశారు. అప్పుడు కూడా అంతే. లాంఛనంగా ఒక నోట్‌ ‌రాసి పెట్టడమే. అందుకే ఇండియాలో ఉన్న ఆర్‌కే యాదవ్‌ అనే అధికారిని సంప్రతిస్తే విపక్ష నేత అటల్‌ ‌బిహారీ వాజపేయి దృష్టికి తీసుకు వెళ్లారాయన. అటల్‌జీ పీవీ నరసింహారావుకి తెలియ చేశారు. ఆ తరువాతే కిడ్నాప్‌ ‌కథ సుఖాంతమైంది. ఇలా అధికారులు కనిపించకుండా పోతే, వారి భార్యలు దౌత్యాధికారిని కలవాలని అనుకునేవారు. కానీ వారిని అన్సారీ అనుమతించే వారు కాదు. దీనితో కొందరు ఆయన కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు కూడా. ఏ భారత ఉప రాష్ట్రపతి అయినా పీఎఫ్‌ఐతో చేతులు కలిపిన సంగతి మీరు విన్నారా? అని కూడా సూద్‌ ‌ప్రశ్నించారు. అన్సారీ అసలు భారతీయుడు అని చెప్పడమే సిగ్గు చేటు అని కూడా సూద్‌ ఈసడిం చారు. ఇస్రో రహస్యాల అమ్మకం కేసులో నంబి నారాయణ్‌ను అన్యాయంగా ఇరికించిన రతన్‌ ‌సెహెగల్‌ అన్సారీకి సన్నిహితుడే.

అన్సారీ ఆత్మకథ కూడా రాసుకున్నారు. దాని పేరు ‘బై మెనీ ఏ హ్యాపీ యాక్సిడెంట్‌’. ఇం‌దులో జాతీయవాదాన్ని ‘సైద్ధాంతిక గరళం’ అని అభివర్ణించారు, ఈ బెంగాలీ. అధికార లాలస నుంచి జాతీయవాదాన్ని వేరుగా చూడలేరని ఈ మాజీ అలీఘడ్‌ ‌విశ్వవిద్యాలయ విద్యాధికుడు చెప్పడం ఆశ్చర్యం కాదు. అది ఇతరుల హక్కులలోకి చొరబడు తుందట. అలీఘడ్‌ ‌విశ్వవిద్యాలయం, జామియా మిలియా వీసీగా పనిచేసిన అన్సారీ భారత విభజనకు పటేల్‌ ‌కూడా కారణమేనని చెప్పడంలో వింతేమీ కాదు.

About Author

By editor

Twitter
YOUTUBE