స్వయం ప్రకటిత మేధావులే భారతదేశానికి నిజమైన చీదర. ఇది చాలాసార్లు రుజువైంది. తమ చీదర ప్రమాణాలను పెంచుతూ, తమ ఉనికిని వీళ్లు చాటుకుంటూనే ఉన్నారు. హక్కుల సాధన పేరుతో, ప్రజా సంఘాల పేరుతో, ప్రెషర్‌ ‌గ్రూప్‌ల చాటున భిన్న భిన్న అవసరాలకు, భిన్న భిన్న వేషాలు వేస్తూ స్వయం ప్రకటిత మేధావులు మైనారిటీల కోసమే పాటు పడుతున్నామంటారు. పత్రికా ప్రకటనలు, బహిరంగ లేఖలు సంధిస్తూ ఉంటారు. ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మయ్‌కి 34 సంతకాలతో అందిన ‘బహిరంగ లేఖ’ కూడా అలాంటిదే. ఒట్టి చీదర. రామచంద్ర గుహ వంటివారి చేవ్రాళ్లు ఇందులో ఉన్నాయి. గత కొద్ది నెలలుగా మీ ఏలుబడిలోని రాష్ట్రంలో మైనారిటీల మీద దాడులు పెరిగిపోయాయి. మెజారిటీ మతస్థుల వైఖరి, ద్వేషపూరిత ప్రసంగాలు మైనారిటీల ఊచకోతకు ప్రేరేపిస్తున్నాయి. దీనికి మీ సంజాయిషీ ఏమిటి? అని అడుగుతోంది ఈ లేఖ. దీని చిరునామా చెత్తబుట్టే అయినా, ఈ బహిరంగ లేఖలు కొంత చర్చకు అవకాశం కల్పిస్తాయి. సదరు ఉత్తరకుమారుల వైఖరి ఏమిటి? ఈ దేశంలోని వాస్తవ పరిస్థితుల పట్ల, అసలు ఈ దేశ సార్వభౌమాధికారం పట్ల, ఇక్కడి మెజారిటీ మతస్థుల హక్కుల పట్ల వాళ్లకున్న మన్నన ఏపాటిది? వీటి మీద ఒక అంచనాకు రావడానికి ఈ లేఖలు ఉపకరిస్తాయి. అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని ఆ మహోన్నత పంథాకు ఎన్ని రకాలుగా తూట్లు పొడుస్తున్నారో కూడా తెలుస్తుంది.

కర్ణాటకలో ఇప్పుడు విద్యాసంస్థలలో హిజబ్‌ (‌ముస్లిం మహిళలు తలకు ధరించే వస్త్రం) ధారణ, చర్చ్‌ల ఆస్తుల మీద సర్వే అనే రెండు అంశాలు రగడ సృష్టిస్తున్నాయి. ఆ రెండు వర్గాలు పోటాపోటీగా బీజేపీ ప్రభుత్వం మీద మాటల దాడులకు దిగిపోయాయి. రాష్ట్రంలో ఉన్న చర్చ్‌లు, వాటి చిరునామాలు, వాటి అధీనంలో ఉన్న భూములు, అవి ఏ పాస్టర్‌ ‌పేరుతో ఉన్నాయి, సర్వే నంబర్ల వివరాలు పంపమని జిల్లాల డిప్యూటీ కమిషనర్లకి జూలై, 2021లో ఆదేశాలు వెళ్లాయి. ఇదొక సర్వే. ఈ సర్వేను సవాలు చేస్తూ (పీపుల్స్ ‌యూనియన్‌ ‌ఫర్‌ ‌సివిల్‌ ‌లిబర్టీస్‌) ‌పీయూసీఎల్‌ ‌దాఖలు చేసిన పిటిషన్‌ ‌మీద హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. అనుమతి ఉన్న, అనుమతి లేని చర్చ్‌ల వివాదం ఇప్పటికే నడుస్తోంది. సర్వేను నిలిపివేస్తూ స్టే ఇవ్వడం సాధ్యం కాదని చెబుతూనే, ఈ విషయం మీద ఒక అఫిడవిట్‌ ‌సమర్పించవలసిందేనని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. బీజేపీ ప్రభుత్వం మీద మిషనరీలు, వాటితో కుమ్మక్కయిన పీయూసీఎల్‌ ‌బురద చల్లడమే ధ్యేయంగా పెట్టుకున్నాయని చెప్పడానికి కోర్టు నిర్ణయం చాలు.

మైనారిటీల మీద కక్షతోనే ఇదంతా చేస్తున్నారన్న కర్ణాటక కేథలిక్‌ ‌మత గురువుల సంఘం నాయకుడు మాచిడో చేస్తున్న వాదన ఎంత అసంబద్ధమో తెలియాలి. అసలు ఈ సర్వే నేపథ్యం ఏమిటి? చిత్రదుర్గ జిల్లా, హోసదుర్గ ఎమ్మెల్యే గూలిహట్టి శేఖర్‌ ‌రాష్ట్రంలో మతాంతరీకరణలు విపరీతమైనాయని సాక్షాత్తు శాసనసభలో ఆరోపించారు. తన నియోజక వర్గంలోనే 15,000 మంది నుంచి 20000 మందిని క్రైస్తవంలోకి మార్చారనీ, అందులో తన తల్లీ ఉన్నదనీ ఆయన ఆక్రోశించారు. తరువాత ఆమె వెనక్కి వచ్చింది. బలవంతపు మత మార్పిడికి సంబంధించి రాష్ట్రంలో 36 కేసులు ఉన్నాయని శేఖర్‌ ‌చెప్పారు. కొన్ని ఇళ్లనే చర్చ్‌ల కింద, బైబిల్‌ ‌సొసైటీల కింద మార్చేశారని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. జనతాదళ్‌ (‌సెక్యులర్‌) ఎమ్మెల్యే (నగ్థాన్‌ ‌నియోజకవర్గం, విజయపుర జిల్లా) కూడా బంజారాలను లక్ష్యంగా చేసుకుని మిషనరీలు మతమార్పిడి సాగిస్తున్నారని ఆరోపించారు. ఈ వాదనల తరువాతే ముఖ్య మంత్రి బసవరాజ్‌ ‌బొమ్మయ్‌ ‌బలవంతపు మతాంతరీకరణలకు వ్యతిరేకంగా చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. దీనినే మైనారిటీలు వ్యతిరేకిస్తున్నారు.

హిజబ్‌తో ముస్లిం బాలికలను కళాశాలలోకి అనుమతించబోమని రాష్ట్రంలోని కొన్ని కళాశాలలు ప్రకటించడం మరొక వివాదం. తమ మతానికి అనుగుణంగా, మత హక్కును గౌరవించుకునే విధంగా హిజబ్‌తో తమను తరగతి గదులలోకి అనుమతించాలని ఉడిపి కళాశాల బాలిక కోర్టును ఆశ్రయించింది. ఇంతలోనే కర్ణాటక పాప్యులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా రంగంలోకి దిగిపోయి బెదిరింపులు ఆరంభించింది. జనవరి 17న పీఎఫ్‌ఐ ‌రాష్ట్ర కార్యదర్శి నాసిర్‌ ‌పాషా చేసింది ఇదే. ఇంతకీ ఆగస్టు 11,12, 2020లో బెంగళూరులోనే కేజీ హళ్లి, డీజేహళ్లి పోలీసు స్టేషన్ల మీద సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీ ఆఫ్‌ ఇం‌డియా (ఎస్‌డీపీఐ) ప్రోద్బలంతో రెచ్చిపోయిన ముస్లిం మూకలు చేసిన దాడి సంగతి పీయూసీఎల్‌కి ఎందుకు గుర్తులేదు? అప్పుడు కర్ఫ్యూ పెట్టారు. ముగ్గురు చనిపోయారు. ఎస్‌డీపీఐ పీఎఫ్‌ఐ అనుబంధ సంస్థే. ఇంతకీ ఈ అల్లర్లకి మూలం సామాజిక మాధ్యమాలలో ప్రవక్తను అవమానిస్తూ ఒక యువకుడు, పోస్టు పెట్టడమే. అతడు కాంగ్రెస్‌ ‌నాయకుడు, ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి సన్నిహిత బంధువు. ఆరోపణలక• మాత్రం బీజేపీ దొరికింది.

ఆంధప్రదేశ్‌లో దాదాపు 120 హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు, హిందువులకు నీడ లేకుండా చేస్తామని యూపీలో ఇటీవలనే ఒక మౌల్వీ తీవ్ర వ్యాఖ్య చేసినప్పుడు, ఓవైసీ అపూర్వ సోదరుల రెచ్చగొట్టుడు సమయాలలో గాఢ నిద్ర పోయిన ఈ మేధావులు చట్టబద్ధంగా, శాసనసభలో జరిగిన చర్చ ఆధారంగా తీసుకున్న నిర్ణయాల మీద హిందూ ఆధిక్య ముద్ర వేయడం చీదర కాదా? ఒకటి నిజం. అంతర్జాతీయ కుట్రలో భాగస్వాములైన మైనారిటీ నేతలు, సంస్థలు, సెక్యులర్‌ ‌రాజకీయ పార్టీలు ఆడిస్తున్నట్టు మేధావులు ఆడితే ఇక్కడ మత సామరస్యం రాదు. అంతేనా, మేధావుల వైఖరి మైనారిటీల ఆగడాలకు ఊతమిచ్చేదిగా పరిణమిస్తుంది.

About Author

By editor

Twitter
YOUTUBE