సంపాదకీయం
శాలివాహన 1943 శ్రీ ప్లవ మాఘ బహుళ త్రయోదశి
28 ఫిబ్రవరి 2022, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
‘వీళ్లని బంధించి ఉంచడానికి తగిన కారాగారాలు దేశంలో లేవు. అసలు వీళ్లని విడుదల చేస్తే మానవ రక్తం రుచి మరిగిన పులిని మానవ సమూహాల మధ్య విడిచిపెట్టినట్టవుతుంది’ – 2008 నాటి గుజరాత్ పేలుళ్ల కేసు మీద తీర్పు ఇస్తూ ప్రత్యేక కోర్టు చేసిన వ్యాఖ్య ఇది. 56 మంది అమాయకులను బలిగొన్న ఆ పేలుళ్ల ఘటనను విచారించడానికి రాజధాని అహమ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు ఈ ఫిబ్రవరి 18న తీర్పు వెలువరించింది. 49 మందిని దోషులుగా నిర్ధారించి అందులో 38 మంది మరణశిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి ఏఆర్ పటేల్ తీర్పు చెప్పారు. మరొక 28 మందిని ఇంతకు ముందే నిర్దోషులుగా విడుదల చేశారు. దేశంలో ఒక వ్యాజ్యంలో ఇంత పెద్ద సంఖ్యలో మరణశిక్షలు విధించడం ఇదే మొదటిసారి. 1991 నాటి రాజీవ్‌గాంధీ హత్య కేసులో 1998లో తమిళనాడు టాడా కోర్టు 26 మందికి మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. గుజరాత్ పేలుళ్లపై వచ్చిన 7,000 పేజీల ఆ భారీ తీర్పులోని కొన్ని భాగాలు అనుభవజ్ఞుడైన న్యాయవాది ఒకరు పరిశీలించారు. ఆయన చెప్పిన అంశాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి.
ఈ వ్యాజ్యంలో శిక్ష పడినవారు దేశంలో రక్తపాతం సృష్టించడంతో పాటు నాటి గుజరాత్ ముఖ్యమంత్రి, హోంమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌షాలను (నేడు భారత ప్రధాని, భారత హోంమంత్రి), స్థానిక శాసనసభ్యుడు ప్రదీప్ సిన్హ్ జడేజాలను హత్య చేయాలని కుట్ర పన్నారు. గుజరాత్ మంత్రిమండలి సభ్యులు నితిన్ పటేల్, ఆనందీబెన్ పటేల్‌లను అంతం చేయడానికి కూడా పథకం వేశారు. ఇందులో దోషులంతా ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందినవారు. ఈ పేలుళ్ల లక్ష్యాలలో ఒకటి నరేంద్ర మోదీని అంతం చేయడమేనని అప్రూవర్‌గా మారిన ఒకరు పేర్కొన్నారని, ఈ అంశాన్ని 2010లో కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్‌లో ప్రస్తావించామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుధీర్ బ్రహ్మదత్ విలేకరులకు చెప్పారు. ఈ కేసులో గడచిన సెప్టెంబర్‌లో మొత్తం 78 మందిని దోషులుగా తేల్చారు. ఒకరు అప్రూవర్‌గా మారారు. 2009లో విచారణ మొదలయింది. తరువాత మరొక నలుగురిని కూడా పట్టుకున్నారు.
ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్టు ఆ పేలుళ్ల ఘటన క్రమం, అందులో దోషులు నిర్వహించిన పాత్ర ఎంత క్రూరమో చెప్పడానికి మాటలు చాలవు. అహమ్మదాబాద్‌లో జూలై 26న 70 నిమిషాల వ్యవధిలో 21 పేలుళ్లు జరిగాయి. 56 మంది చనిపోగా, 200 మంది క్షతగాత్రులయ్యారు. ఈ దుర్ఘటనకు కొంచెం ముందు, మే 13న జైపూర్‌లో సంభవించిన పేలుళ్ల తరహాలోనే సైకిళ్లకు, రాష్ట్ర రవాణా శాఖ బస్సులలో, ఆసుపత్రులలో టిఫిన్ క్యారియర్ బాంబులు అమర్చి పేల్చారు. రెండు ప్రభుత్వ ఆసుపత్రులలో నలభయ్ నిమిషాల తేడాతో బాంబులు పేలాయి. మొదటి దఫా పేలుళ్లలో గాయపడిన వారిని తీసుకువచ్చిన తరువాత రెండో ఘాతుకానికి ఒడిగట్టారు.
ఎందుకీ పేలుళ్లు? ఎందుకింత క్రూరత్వం? దీనికి సమాధానం అప్రూవర్ నుంచి వచ్చింది. 2002 గుజరాత్ కల్లోలానికి ప్రతీకారం తీర్చుకోవడం ఒకటి. రెండు రాష్ట్రంలో ఉన్న ముస్లిం వ్యతిరేక ప్రభుత్వాన్ని కూల్చేసి, ఇస్లామిక్ పరిపాలన తీసుకురావడం. ఎంత జుగుప్సాకరం! అత్యంత నీచంగా ఇలాంటి వాళ్ల హక్కుల గురించి గొంతు చించుకునే కిరాయి మేధావులు ఈ దేశం నిండా ఉన్నారు. మోదీ, ఆయన పార్టీ, ఆయన విశ్వాసం మీకు వ్యతిరేకం కావచ్చు. అంత మాత్రానే చంపుతారా? మోదీని పదవి నుంచి దించినంత మాత్రానే ముస్లిం రాజ్యం వచ్చేస్తుందా? ఇది మతోన్మాదం తలకెక్కిన కిరాతకుల ఆశ మాత్రమే.
అయితే జిహాద్ అన్న పదం చాలా ‘పవిత్రమైనది’, దానిని ముస్లిం యువత మనసులను కలుషితం చేయడానికి దుర్వినియోగం చేస్తున్నారని ప్రత్యేక కోర్టు అభిప్రాయపడడం ప్రశ్నలకు తావిచ్చేదే. జిహాద్ పదంలో పవిత్రభావం ఉండవచ్చు. కానీ దాని చరిత్రలో అందుకు సంబంధించిన జాడలు దొరకుతాయా? కానీ జిహాద్ దుర్వినియోగాన్ని ఆపడానికి ముస్లిం సంస్థలు పూనుకోవాలని కోర్టు పిలుపునివ్వడం ఆహ్వానించదగినది. జాతీయవాద శక్తులకు వ్యతిరేకంగా ముస్లిం మతోన్మాదం చేస్తున్న ఈ కుట్ర జాతీయ, అంతర్జాతీయ స్థాయిదేనని మరొకసారి రుజువైంది.పేలుళ్లలో భాగస్వాములైన ఉగ్రవాదులకు గుజరాత్, కేరళ అడవులలో తర్ఫీదు ఇచ్చారు. అహమ్మదాబాద్, వదోదర, బరూచ్, సూరత్, పుణే నగరాలలో బాంబులు తయారుచేశారు. పేలుళ్లకు తామే బాధ్యులమంటూ కొంతసేపటికే కొన్ని టీవీ చానళ్లకు ఇండియన్ ముజాహిదీన్, హర్కత్ ఉల్ జిహాదీ అల్ ఇస్లామిల పేరుతో సంక్షిప్త సమాచారాలు వచ్చాయి. తరువాత ఈ పేలుళ్ల సూత్రధారి ముఫ్తి అబు బషీర్‌ను, మరొక తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు శిక్ష పడినవారంతా పోలీసుల అదుపులోనే ఉన్నారు.
ఈ తీర్పుపై అప్పీలుకు వెళతామని ఇప్పటికే ఉగ్రవాదుల న్యాయవాదులు చెప్పారు. కావచ్చు. కానీ ముస్లిం మతోన్మాదం నిజరూపం దీనితో ఇంకాస్త స్పష్టం కాలేదా? ఏ వర్గం వారైనా, ఏ వేదిక వారయినా ముస్లిం మతోన్మాదాన్ని సమర్థించడం ఆపకపోతే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. అలాగే ముస్లిం మతోన్మాదులకు లక్ష్యంగా ఉన్న హిందువులు, ఇతర మైనారిటీలు కూడా సరైన పంథాలో ఆలోచించడం ఇకనైనా మొదలుపెట్టాలి. బీజేపీని అధికారం నుంచి పడగొట్టడానికీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రాబల్యం తగ్గించడానికి ఇస్లామిక్ ఉగ్రవాదం పెరగడం అవసరమేనన్న మూర్ఖత్వంతో ఉన్న కమ్యూనిస్టులు, ఉదారవాదులు కళ్లు తెరవాలి. కేరళలో పీఎఫ్‌ఐ రీతిని చూశాక కూడా వీళ్లకి సిగ్గు రాదేమి? ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మానవ రక్తం రుచిమరిగిన పులులు అంటూ చెప్పింది వీళ్ల గురించే.