సమున్నత స్థాయి విద్యాబోధన, ఉదాత్తరీతి పరిశోధన. ఈ రెండింటి ఐక్య వేదికే- విశ్వవిద్యాలయం. ఉభయ లక్ష్యాల సాధనకు, సమర్థ నేతృత్వం ఎంతైనా అవసరం. అందునా భారత తొలి ప్రధాని పేరిట రూపొందిన వర్సిటీకి పాలనా నాయకత్వం వహించడమంటే మాటలా? దేశ, విదేశీ ప్రసిద్ధుల కళ్లన్నీ అక్కడే కేంద్రీకరించి ఉంటాయి. నిన్నటి, నేటి, రేపటి తీరు తెన్నులపైనే అన్ని చెవులూ రిక్కించి వింటుంటాయి. తీసుకునే నిర్ణయాలు, చేపట్టే చర్యల గురించి సమీక్షలూ, వ్యాఖ్యలూ నిరంతరం కొనసాగుతుంటాయి. ఇంతటి కీలక పదవిలో నియమించడం, నిర్వహణ సాగించడం కూడా కత్తిమీద సాము వంటివే! ఈసారి నియామకం మటుకు ఎంతో సునాయాసంగా, ఒక్క క్షణమైనా వేచి చూడాల్సిన పనేమీ లేకుండా జరిగిపోయింది. ఎందుకన్న ప్రశ్నకు సమాధానం ఒక్కటే, అర్హులూ ఆ ఒక్కరే. ధూళిపూడి శాంతిశ్రీ. ప్రతిష్టాత్మక మహాసంస్థకు తొలి మహిళా వైస్‌ ‌ఛాన్సలర్‌ ఆమె. పేరు వినగానే, విద్యావేత్తలకు కొండంత భరోసా అనిపించింది. అధ్యాపక బృందాల సంతోషం అన్ని విధాలా రెట్టింపు అయింది. విద్యార్థినీ, విద్యార్థుల ఆశల సుమాలు మరింత వికసించి పరిమళించాయి. విమర్శకుల నుంచీ ప్రశంసలందుకుంటున్న శాంతిశ్రీ జీవితం ప్రతిభా సామర్థ్యాల మేలుకలయిక. ఎవ్వరైనా, ఎప్పుడైనా నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం ఉన్నాయి. తనను నియమిస్తూ వెలువడిన నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా హర్షించినవారు ఎందరెందరో. తన పని తాను చేసుకుపోవడం తప్ప మరేదీ ఆలోచించని, విధి నిర్వహణ మినహా ఇంకేదీ తలపునకైనా రాని సార్థక నామధేయురాలామె. ఆ తెరిచిన పుస్తకంలోని పేజీల్ని తరచి చూస్తే…

జవాహర్‌లాల్‌ ‌నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యూ) స్థాపితమై అర్ధశతాబ్దం దాటింది. వేలల్లో విద్యార్థులు; వందల సంఖ్యలో అధ్యాపక, తదితర సిబ్బంది, ఇంతకుముందు వీసీగా మామి డాల జగదీశ్‌కుమార్‌ ఉన్నారు. దేశ రాజధాని నగరం లోని వెయ్యికి పైగా ఎకరాల్లో విస్తరించి ఉందా భారీ వ్యవ•్థ. ప్రభుత్వ కేంద్రీయ విద్యాసంస్థ. శాస్త్ర- సాంకేతిక, సామాజిక అంశాలతో పాటు అంతర్జా తీయ స్థాయి అధ్యయనాలూ కొనసాగుతూ వస్తు న్నాయి. ఈ వర్సిటీని భారతదేశం అంతటిలోనూ ఉదాత్తమైనదిగా సర్వే ద్వారా నిర్ధారించి దశాబ్దం కావస్తోంది. కచ్చితంగా ఇది సమున్నత గుర్తింపు, జాతీయంగా సముదాత్త పరిగణింపు. శాస్త్రీయతను సర్వవిధాలా పెంచి పోషిస్తున్నందుకే అందరికీ ఎంతో గౌరవాదరాలు. అందుకే కదా సాక్షాత్తు రాష్ట్రపతి నుంచే నాలుగేళ్ల కిందట ది బెస్ట్ ‌విజిటర్స్ అవార్డు. ఆ కారణంగానూ ఇప్పుడు శాంతిశ్రీ పైనే ప్రతివారి చూపులూ కేంద్రీకృతమయ్యాయి. ఈ సరికొత్త మహిళా ప్రొఫెసర్‌ ‌సారథ్యం ఎన్నెన్ని అద్భుత ఫలితాలు ఇస్తుందన్నదే అందరి ఆంతర్యం, అంతరార్థం. తెలుగు మూలాలు గల కుటుంబం నుంచి వచ్చిన ఈమే ప్రస్తుత నిర్వాహక నాయిక. జగదీశ్‌ ‌కేంద్ర విశ్వవిద్యాలయ నిధుల సంఘం అధిపతిగా వెళ్లడంతో, వీసీ స్థానాన్ని భర్తీ చేసుకున్న తనది ఫలప్రద చరిత్ర. మరీ విశేషం ఏమిటంటే, ఇదే వర్సిటీలో చదువుకున్నారీమె. అంతర్జాతీయ సంబంధాల గురించిన పరిశోధననీ ఇక్కడే చేసి డాక్టరేట్‌ను స్వీకరించారు. ఉప కులపతి స్థానాన్ని ఒక తెలుగు వ్యక్తి తర్వాత మరొకరు అలంకరించడం ఎంతైనా విశిష్టత కాదూ!

భాషలు, ప్రాంతాలకు అతీతం

తండ్రి ధూళిపూడి ఆంజనేయులు సాహితీవేత్త, పాత్రికేయులు, సివిల్‌ ‌సర్వెంట్‌గా ఉద్యోగ విరమణ చేసినవారు. స్వస్థలం తెనాలి ప్రాంతం. తల్లి మూలమూడి ఆదిలక్ష్మి తెలుగు, తమిళ విభాగాల్లోనూ ఆచార్యురాలు. రష్యాకు చెందిన లెనిన్‌ ‌గ్రాడ్‌లో పనిచేశారు. అక్కడ పుట్టిన శాంతిశ్రీకి ఆ రెండు దేశీయ భాషలతోపాటు మరాఠీ, సంస్కృతం, హిందీ, ఆంగ్లం కూడా కొట్టిన పిండి. కన్నడ, మలయాళ భాషలనీ ఇట్టే అర్థంచేసుకోగలరు. గోవాకు సంబంధిం చిన కొంకణి సైతం బాగా తెలుసు. కారణం ఏమి టంటే, ఆమె మొదటి ఉద్యోగ ప్రస్థానం ఆరంభమైంది ఆ ప్రాంతంలోనే. పుట్టింది రష్యాలో నైనా, అటు తర్వాత వచ్చి చదువుకున్నదంతా తమిళనాడులో. తదుపరి విధుల నిర్వహణలో భాగంగా మహారాష్ట్రలో ఉన్నారు. అక్కడ రాజనీతి, ప్రభుత్వ పాలనాశాస్త్ర ప్రొఫెసర్‌గా వ్యవహరించారు. అందువల్లనే ఎక్కడెక్కడి భాషలనీ చక్కగా నేర్చుకుని నిష్ణాతురాలయ్యారు. దేశ, విదేశీ భాషలన్నింటా ఇంతటి పటిమను సొంతం చేసుకున్నారు. ఇప్పుడామె షష్టిపూర్తికి దగ్గరలో ఉన్నారు. మరో అయిదేళ్లు ఢిల్లీ వర్సిటీకి తన సేవలు అందించనున్నారు. ఇంతటి గౌరవం, అవకాశం రెండూ అరుదైనవే. తన డిగ్రీ చదువు మద్రాసులో అయింది. అక్కడే చరిత్రను, సోషల్‌ ‌సైకాలజీనీ అభ్యసించారు. పొలిటికల్‌ ‌సైన్స్ ‌పీజీని సాధించారు. డిప్లొమాలను రెండు విదేశీ వర్సిటీల ద్వారా అందుకున్నారు. (ఒకటి శాంతి ప్రాధాన్య అంశంలో స్వీడన్‌ ‌నుంచి, మరొకటి సామాజిక సేవకు సంబం ధించి అమెరికా నుంచి.) ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి ఢిల్లీకి చేరిన ఆమె – తన ప్రథమ ప్రాధాన్యం జాతీయ విద్యావిధానం అమలును వేగవంతం చేయడంపైనే అని తేల్చి చెప్పారు. మద్రాసులో పోస్టుగ్రాడ్యుయేషన్‌ ‌దాకా చదువులు, తదుపరి పుణెలో అధ్యాపక బాధ్యతలు, అంతకుముందు విదేశీ నివాసాలు తన ఆలోచనా పరిధిని ఎప్పటికప్పుడు విస్తృతపరుస్తూ వచ్చాయి. సమర్థతకు సూచికగా కొంతకాలం క్రితం పుణె వర్సిటీ వీసీ విధులూ నిర్వర్తించి ఇక మకాం రాజధానికి మార్చారు. ఇన్ని ప్రాంతాలు, భాషలు, అనుభవాలు, బాధ్యతా నిర్వహణలు తన జీవన వైవిధ్యాన్ని, బహుచక్కని చొరవను ప్రస్ఫుటం చేస్తున్నాయి. పరిణతికి నిదర్శనమిదే కదా!

విస్తృత స్థాయి సమర్థత

బహుముఖ ప్రభ నిండిన శాంతిశ్రీకి అవకాశాల సద్వినియోగం ఒక్కటే కాదు, విమర్శలను తిప్పి కొట్టడమూ తెలుసు. ఎక్కడైనా అవాంఛనీయ ధోరణులు తలెత్తితే, ‘నాకెందుకు?’ అనుకోలేదు ఎన్నడూ. అభిప్రాయాలు, వ్యాఖ్యానాలను నిర్మొహ మాటంగా వెల్లడిస్తుంటారు. అవసరమైన సంద ర్భాల్లో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. ప్రజా సంబంధాల అంశం మీద పరిశోధనల గైడుగా ఉండిన ఆమెకు, వృత్తిపరమైన బంధాల నిర్వహణ తెలియకుండా ఉంటుందా? భావ వ్యక్తీకరణకు తలమానికమైన బోధన రంగంలో ఉన్న తనకు భావనల వెల్లడి తీరు తెలియనిదా? విద్యారంగాన్ని సైతం రాజకీయమయం చేసిన ప్రబుద్ధులు ఎన్ని ఆరోపణలనైనా గుప్పిస్తుంటారు కానీ, వాటిని ఎప్పుడు, ఎక్కడ తిప్పికొట్టాలో ఆమెకైతే స్పష్టం. రికార్డులు నెలకొల్పడం అలవాటుగా మారిన ఆ విశాల మనస్కురాలు అనుచిత వ్యాఖ్యలకు చెదిరే వ్యక్తి కానే కాదు. ప్రవీణురాలి బోధనవృత్తి మొదలై దాదాపు మూడున్నర దశాబ్దాలు. గోవా నుంచి పుణె నగరానికి బదిలీయై 28 సంవత్సరాలు. మునుపు యూజీసీ ప్రతినిధిగానూ పనిచేశారు. వర్సిటీలో వివిధ హోదాల అనుభవ నిపుణతను గడించారు. దరిదాపు 30 మందికి పరిశోధనల మార్గదర్శిగా సేవలం దించారు. పలు కేంద్రీయ విశ్వవిద్యాలయాల తీరు తెన్నుల సమీక్షనూ చేపట్టి ఉన్నారు. తన తండ్రి అనువాద పటిమను ఆవాహన చేసుకున్న రచయిత్రి. ఆయనకు చెన్నైలో అతిపెద్ద వ్యక్తిగత గ్రంథాలయం ఉండటాన్ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటారీమె. పలు పుస్తకాలు రచించి, రెండొందల వరకు పరిశోధన పత్రాలు వెలువరించి, అనేకానేక సభలూ సమావేశాల్లో గుక్క తిప్పుకోకుండా ప్రసంగించి, ఎప్పటికప్పుడు తానేమిటో నిరూపిస్తూనే వస్తున్నారు. ఎన్నెన్నో సమస్యల పరిష్కారానికి శిక్షణలిచ్చే ఆ శాంతిశ్రీకి అవరోధాలు ఎలా ఎదుర్కోవాలో వేరెవరూ చెప్పాల్సిన పనిలేదు. తనకు తెలియకుండానే అజ్ఞాత వ్యక్తులు చొరబడి, ట్విటర్‌ ‌ఖాతాను తెరిచి, వివాదాస్పద వ్యాఖ్యాలు చేయడాన్ని బలంగా తిప్పికొట్టారు. ‘కావాలనే ఈ విధంగా చేస్తూ మీ సమయాన్ని, శక్తిని వృధా చేసుకుంటారు. ఎందుకిలా?’ అంటూ ఘాటైన చురకలంటించారు ఈ మధ్యనే. అది ఓర్వలేని తనమని, ఇకనైనా మానుకుంటే మంచిదని సూటిగా ధాటిగా తలంటారు. ఉగ్రవాదాన్ని, దేశభక్తి రాహిత్యాన్ని ఎందుకు క్షమించాలన్నదే తనదైన ప్రశ్న. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏమిటో తెలియజెప్పాలన్న ఆమె ప్రయత్నమే అత్యుత్సాహుల ఆక్షేపణలకు కారణ మైంది. అంత మాత్రానికే బెదిరితే తాను శాంతిశ్రీ ఎలా అవుతారు చెప్పండి? భావ ప్రకటన స్వేచ్ఛకు తానే అసలైన చిరునామా.

అపూర్వ, అపురూప సేవ

చదువుల ఖజానా ఆమె. తమిళనాట చదువు తుండగానే, రెండు రాష్ట్ర స్థాయి ర్యాంకులను వశం చేసుకున్న దిట్ట. రెడ్‌‌క్రాస్‌ ‌వంటి సేవాసంస్థల్లో అత్యంత క్రియాశీలి. సంస్కరణలతో పురోభివృద్ధి వేగవంత మవుతుందని విశ్వసిస్తారు, ఆచరిస్తారు కూడా. విశ్వవిద్యాలయాల్లో విద్యారంగ కిరణాలు పరివ్యాప్తం కావాలన్నదే నిశ్చితవాదం. వీటిని కాదని, కూడదని ఎవరంటారు, అనగలరు? ‘పార్లమెంట్‌, ‌భారత్‌ ‌విదేశాంగ విధానం’ వంటి గ్రంథాల కర్త. వచ్చే జులై పదిహేనున తన పుట్టినరోజు. పుట్టి నింటికి, మెట్టినింటికి వన్నె తెచ్చిన ధీర. చైనాలోనూ రిసోర్స్ ‌పర్సన్‌ ‌బాధ్యతలు నిర్వహించిన ప్రయోగశీల. సామాజిక శాస్త్రాల భారత పరిశోధన మండలికి ప్రతినిధి. జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో రమారమి రెండొందల పురస్కృతుల విజేత. తాను డిగ్రీ చదువుకున్న తమిళనాడు కళాశాల నుంచి వరసగా ఐదేళ్లూ బహుమానం గెలుచుకున్న రికార్డు ఈమెకుంది. అమెరికాతోపాటు ఆస్ట్రియా నుంచీ ఫెలోషిప్‌ల విజేత. తన తండ్రి పత్రికా సంపాదకత్వ అనుభవాన్ని తానూ పుణికిపుచ్చుకున్నారు. ప్రసార, సమాచార శాఖల్లో అందించిన నిరంతర సేవలను ఆదర్శంగా భావించి అనుసరిస్తున్నారు. ఆయన మరణానంతరం ఆ లైబ్రరీని పుణె ప్రాంతానికి మార్చుకున్నారు. ఇప్పుడిక ఢిల్లీకి బస మారడంతో, అపురూపమైన ఆ పుస్తకాలన్నింటినీ తెచ్చుకోవాలన్న యోచనలో ఉన్నారు. శాంతిశ్రీ తాను చదువుకున్న జేఎన్‌యూలోనూ ప్రథమ శ్రేణి ర్యాంకరే. డాక్టరేట్‌కు కారణమైన రచనను 28 ఏళ్ల ప్రాయంలోనే పూర్తిచేసిన క్రియాతత్పరురాలు. నూతన పదవీ బాధ్యతలు స్వీకరించిన ఈమె గురించి అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది, కేంద్రానికీ ఎన్నో ఆశలూ ఆశయాలున్నాయి. తానిప్పుడు పదమూడో వీసీ. పదవీకాలంలో ఎన్నెన్నో మెరుపులు తెస్తారని, విశ్వవిద్యాలయాన్ని పురోగమన పథంలో పరుగులు తీయిస్తారని ఆకాంక్షిస్తున్న వారెందరో. అవన్నీ ఫలించాలి కాబట్టి అందరి చూపూ ఆమె వైపే.

జాతి నేతలు ఎప్పుడూ కోరుకుంది శాంతి సౌభాగ్యాలనే. జాతీయ ఐక్యతకే జీవితాలను అంకితం చేశారు వారు. జనస్వామ్య జీవన విధానం, సామాజిక న్యాయసాధన, సమగ్ర అవగాహన కోసమే వారంతా పరితపించారు. అదే కోవలో సమాచరణ ద్వారా శాంతిశ్రీ తనదైన పాలనను విస్తృత పరుస్తారని మనమందరం ఆశించవచ్చు. మొట్ట మొదటి వనితా వీసీగా ఎంత అర్హురాలో, ఆకాంక్షలను ఫలప్రదం చేయడంలో సైతం అంతే సమర్థురాలు. ఇందుకు ఆశ్చర్య, ప్రశ్నార్థకాల అవసరం బొత్తిగా లేదు. ఎందుకని అంటే, పేరుకు తగినట్లు ఆమె శాంతి పరిపూర్ణశ్రీ.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE