– లక్ష్మీకుమార్‌

‌నులక మంచంమీద కూర్చుని ఆరిపోయిన చుట్టకు నిప్పంటిస్తున్నాడు కొమరయ్య. ‘‘ఏంది మావా, అత్త ఇంకా రాలె. నీ ఒక్కడవే ఉండావ్‌?’’ ‌గోడ అవతల నుండి అడిగింది రాజమ్మ.

‘‘పొద్దుగాల పోయింది, ఉప్పలమ్మ గుడికాడకు. ఇంక రాలె. ఏం మొక్కుతుందో ఏందో’’ తనలో తనే గొణుక్కున్నాడు కొమరయ్య.

‘‘వత్తాదిలె, రాక ఏడికి పోతది. ఇదో తీసుకో నీ మనవడు తెచ్చినాడు.’’ అంటూ తన చేతిలో ఉన్న తెల్లటి కల్లుముంత కొమరయ్య చేతికందించింది రాజమ్మ. కొమరయ్య దాన్ని చూడగానే ‘‘హమ్మయ్య పాణం పోసేవే రాజమ్మ’’ అంటూ ఆత్రంగా అందుకున్నాడు. కాసేపటికి కొమరయ్య భార్య యాదమ్మ వచ్చింది. ఆమె రావడంతోనే అరుగుమీద కూర్చుండి పోయింది. ‘‘ఏందే, ఏ ఏలప్పుడు పోయినావ్‌. ఊరంతా నాకే కావాలని మొక్కుతుండవా, ఉప్పలమ్మని’’ అన్నాడు కొమరయ్య.

‘‘ఆఁ ఉన్నది పోగొట్టుకొని, ఊరంతా కావాలని మొక్కుతుండా’’ అని కసిరినట్లే చెప్పింది యాదమ్మ.

‘‘సిర్రుబుర్రులాడతుండావ్‌.. ‌గుడికాడ ఎవలు అవుపడలేదా ఏంది?’’

‘‘ఎవలన్నా ఉంటే కదా, అవుపడతానికి. ఆ ఎంచర్‌లో ఉన్న మారాజుల పెద్ద పెద్ద పర్వతాల్లాంటి కార్లు ఏడ మీదికొత్తయా అని, గుండెలు అరసేతులో ఎట్టుకొని గుడికాడికి పోయినాను. ఉప్పలమ్మ కూడా జనాలు లేక ఉసూరుమని కూకుంది. నాలాటి పాతోళ్లు, ఎలుగుతున్న గుడ్డి దీపంలో కాత్త నూనేసి ఓ దణ్ణం ఎడుతుండారు. ఓ పాటా లేదు, డప్పూ లేదు. ఆ ఎంచరు గోడపక్కల దిట్టి సుక్క(దిష్టి చుక్క)లా ఉంది ఉప్పలమ్మ గుడి. ఏందో మావా చానా బాధ అనిపించింది. ఒకప్పుడు బాయికాడ ఉప్పలమ్మ గుడి అంటే ఎట్టుండేది! పంట చేతికందగానే అందరం కలసి ఎంతసక్కగా జాతర సేసేటోళ్లం. సిన్నాపెద్దా ఊరూవాడా జాతరంటే గుడికాడ్నే ఉండేటోల్లు. ఇప్పుడు ఆడ సూడనీకి ఏం లేదు. ఎంచర్లు.. పుణ్ణమా అని ఉన్న పొలాలన్నీ ఐనకాడికి అమ్ముకున్నరు. మన బాయికాడ పొలం అమ్మొద్దని నెత్తీ నోరు మొత్తుకుండా. నా మాట ఇన్నావేంది?’’ అని యాదమ్మ తన బాధ అంతా బయటపెట్టింది.

అప్పటిదాకా మౌనంగా ఉన్న కొమరయ్య నోట్లో ఉన్న చుట్టముక్క తీసి నేలకి రాస్తూ ‘‘ఏం మన పొలాలేమన్నా ఊరికే ఇచ్చినావ్‌. ‌పైసల్‌ ‌తీసుకున్నాం గదా. గా పైసలతోనే గదా నీ కొడుకు యాపారం ఎట్టుకుండు. ఆళ్ల పిల్లలు ఇంగ్లిష్‌ ‌బడిలో నాలుగు ఇంగ్లిష్‌ ‌ముక్కలు నేర్చుకుంటుండారు. సుట్టుపక్కల అందరూ అమ్ముకుంటే నువ్వు ఎవుసం చేత్తావ్‌? ‌బోరులో నీళ్లు ఉంటాయో లేదో తెల్వదు. వాన సినుకెప్పుడు పడ్తదో తెల్వదు. ఇంకేటి పండిచ్చేది. ఎద్దు ఎవుసం ఎనకటి ముచ్చటే. గిప్పుడేమిలేదే యాదమ్మా,

ఆ కల్లుముంత ఇటు ఎట్టు’’ అన్నాడు.

కొమరయ్యకి కల్లుముంత చేతికిస్తూ ‘‘ఓసారి ఆ ఎంచర్లో ఉన్న రాయిసెట్టు (రావిచెట్టు) కాడకు పోవాలని మనుసు లాగుతుండాదయ్యా, మన పొలం ఉండప్పుడు బాయికాడ రాయిసెట్టు ఎప్పటినుండో ఉండేదని సెప్పెటోడివి కదా! బాయికాడ కెళ్లినప్పుడు దానికింద కూకుంటే పాణం హాయిగుండేది. ఒక్కసారి ఎళ్లొద్దామయ్య’’ అని అడిగింది యాదమ్మ. ‘‘నీ కోరిక సల్లగుండా, మనల్నెవరు లోపలకి రానిత్తరు. గా పనికిమాలిన ఆలోసన మాని కూడొండు’’ అన్నాడు కొమరయ్య.

వీళ్ల మాటలు వింటున్న రాజమ్మ కొడుకు కాలేజీకి వెళ్తూ ‘‘ఏం తాత మంచి హుషారుగున్నావ్‌’’ అం‌టూ లోపలకి వచ్చి ‘‘ఏమన్నా తేవాల్నా?’’ అని అడిగాడు. కొమరయ్య కొడుకు వ్యాపారం కోసం సిటీకి దగ్గర్లోనే ఉంటాడు. తండ్రిని కూడా తనతో ఉండమన్నాడు. కానీ పుట్టిన ఊరొదలి ఎక్కడకు రాను అని.. ఒక పక్క కూలిపోతున్న పాత పెంకుటింట్లోనే కాలం గడుపుతున్నాడు. అందుకే ఏం అవసరమైనా రాజమ్మ కొడుకు తెచ్చి ఇస్తుంటాడు. ఇంతలో యాదమ్మ ‘‘వద్దయ్యా అన్నీ ఉండాయ్‌. ‌రోడ్డు మీద జాగర్త. ఎడ్లబండి పోయే జాగాలో పెద్ద పెద్ద కార్లు ఒత్తుండాయ్‌. ‌జర సూసుకొని వెళ్లు’’ అని చెప్పింది. ‘‘అవును అవ్వా ఆ ఎంచర్‌కి పోనీకి ఇదే రోడ్డు. ఇది చాలా సిన్నగా ఉందిట. మన నాలుగిళ్లు ఈడ నుండి ఎప్పుడు తీద్దామా? అని సూస్తుండ్రు. గివి తీస్తే రోడ్డు పెద్దగా అవుతుందట. మొన్న మా బాబాయ్‌ ‌సెప్తుండు. ఐనా గాని మీరు పొలాలు అమ్మి తప్పు సేసినారు. కాలం ఎప్పుడు ఒక లాగానే ఉంటుందా? ఇప్పుడుండ ప్రభుత్వం వ్యవసాయంపై బాగానే శ్రద్ధపెట్టింది. పొలాలకి నీళ్లొచ్చేలాగా సేస్తుండ్రు. మనక్కూడా వచ్చేటివేమో. మా నాయన కూడా మీ లెక్కనే అమ్మేసినాడు. ఆ వచ్చిన నాల్గు పైసలు నాల్గురోజులు కూడా ఉండలే. గిప్పుడు పని సేయనీకి ఒంట్లో సత్తువ లేకపోయె. సర్లే ఐపోయిన ముచ్చటెం దుకు గాని నేనెళ్లొస్తా’’ అని కాలేజీకి బయలుదేరాడు రాజమ్మ కొడుకు.

మనవడి మాటలు మరింత గుబులు పుట్టించాయి యాదమ్మకు. కొమరయ్య మాత్రం కుర్రకుంక ఆడికేం తెలుసు, ఎవుసం సంగతి? అనుకున్నాడు. కానీ కొమరయ్య మనుసులో కూడా ఏదో ఒక మూల బాధ మూలుగుతూనే ఉంది. దానికి కారణం తన దగ్గరి బంధువైన శ్రీనివాస్‌గౌడ్‌ అం‌దరికి నచ్చచెప్పి ఆ చుట్టుపక్కల పొలాలను ల్యాండ్‌ ‌డెవలపర్స్‌కి అమ్మించాడు. ఊర్లోకి కాలనీలు ఒస్తే ఊరు మంచిగా అయిద్ది. మీ బిడ్డలు మంచిగా సదువుకొని ఉద్యోగాలు చేయొచ్చని చెప్పినాడు. ముందు మస్తు పైసలు అని చెప్పాడు. కానీ చేతికి వచ్చేటప్పటికి అంత రేటు లేదంటుండ్రు మావా అంటూ గంపెడు పైసలు వస్తాయి అనుకున్న వాళ్లకి గుప్పెడు పైసలు చేతిలో పెట్టించాడు. కాని శ్రీనివాస్‌ ‌గౌడ్‌కి బాగానే ముట్టింది. తాము మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్నారు అందరూ. ఈ విషయం మనసును బాధిస్తుంటుంది. ఎందుకో కొమరయ్యకు ఈ నాలుగు పాత ఇళ్లు.. ఇక్కడ ఎక్కువకాలం ఉండనీయరు అనిపించింది. ఎందుకంటే తెలంగాణ పల్లెల్లో జాతర్లు, దావత్‌లు సాంప్రదాయంగా వస్తూన్నవే. కానీ దావత్‌లు చేసుకున్నప్పుడు కాస్త అటు ఇటుగా మైకంలో అరిసినా, సిందేశినా వెంచర్‌ ‌బాబులు అదేదో న్యూసెన్స్ అన్నట్టుగా చూపులు. లేదా వార్నింగ్‌లు. ఇవి ఈ మధ్య తరుచూ అనుభవం అయ్యాయి కొమరయ్యకి. ఇప్పటికే గాదెకింద దూరిన పందికొక్కులు గాదెంతా ఆక్రమించుకున్నట్టు చానా పల్లెలు వెంచర్లతో నిండిపోయాయి. అక్కడున్న హక్కుదారులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. కొమరయ్య మనస్సంతా ఆలోచనలతో నిండిపోయింది.

————-

యాదమ్మ, కొమరయ్య ఒకరితో ఒకరు మాటలు లేకుండానే ఇద్దరూ కూర్చుని అన్నం తిన్నారు. కాసేపటికి కొమరయ్య మెల్లగా ‘‘యాదమ్మా అటు పోయిద్దాం రా’’ అన్నాడు. ‘‘ఏడకి రాయిసెట్టు కాడకేనా?’’ అంది ఆత్రుతగా.

‘‘అవునే సూద్దాం. లోపలకి ఎళ్లనిత్తరో లేదో!’’ అన్నాడు. భుజంపై తుండుగుడ్డ వేసుకొని భయం భయంతోనే వెంచర్‌ ఎం‌ట్రన్స్ ‌దగ్గరకి వెళ్లారు. వాళ్లని చూడగానే సెక్యూరిటీ గార్డు ఎదురొచ్చి ‘‘మీ పేరు రాయిండి, ఎవరింటికెళ్లాలి?’’ అని అడిగాడు. ఏం చెప్పాలో తెలియలేదు. ఒకప్పుడు దర్జాగా తిరిగిన నేలే ఇది. కానీ ఇప్పుడు అడుగు ముందుకేయాలంటే కారణం చెప్పాలి. అయినా ధైర్యంగానే ‘‘ఓసారి లోపలకెళ్లి ఆ సెట్టుకింద కూకోనొత్తామయ్యా’’ అని చెప్పాడు. వెంటనే సెక్యూరిటీ గార్డు ‘‘ఇదేమైనా పార్క్ అనుకుంటున్నావా కూర్చోవడానికి? జావ్‌ ‌జావ్‌’’ అన్నాడు. యాదమ్మ కూడా బతిమాలింది. మీరు వెళ్తారా లేకపోతే బయటకు గెంటాలా? అని తన చేతిలో ఉన్న కర్ర తీసుకున్నాడు. యాదమ్మ కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. చేసేది ఏమి లేక వెను దిరిగారు. ఇంతలో ఒక పెద్ద ఫియట్‌ ‌కారు వచ్చి ఆగింది. అందులోంచి బయటకు దిగిన సతీష్‌ ‌కొమరయ్య దగ్గరకు వచ్చి ‘‘ఏంది తాత గిట్లొచ్చావ్‌? అని అడిగాడు. తనకు పరిచయంలేని వ్యక్తిని చూసి కొమరయ్య కొంచెం కంగారుపడుతూ ‘‘మా యాదమ్మ సెట్టుకాడకి పోతానంటే తీసుకువచ్చాను, కానీ లోపలికి పోనిత్తలేరు బాబు’’ అని చెప్పాడు. సతీష్‌ ‌సెక్యూరిటీ గార్డుతో ఏదో మాట్లాడాడు. తర్వాత కొమరయ్య దగ్గరికి వచ్చి ‘‘నేను చెప్పినా. గిప్పుడు పో తాత. ఇంకెవరైనా, ఏదైనా అడిగితే సతీష్‌బాబు ఇంటికి పోతుండం అని చెప్పండి. నేను కూడా వస్తా చెట్టు దగ్గరికి’’ అని చెప్పి కారుని వెంచర్లోపలకి పోనిచ్చాడు. కొమరయ్య, యాదమ్మ వేగంగా అడుగులు వేస్తూ చివరన, వెంచర్‌ ‌గోడకు అనుకుని ఉన్న రావిచెట్టు వైపు వెళ్లారు. ఎక్కడా మొక్క లేదు, మట్టి వాసన లేదు. అన్నీ పెద్ద పెద్ద విల్లాలు. సిమెంట్‌ ‌రోడ్లు. పేరుకే ఇళ్లు. అంతా నిశ్శబ్దం. చీమ చిట్టుక్కుమన్నా వినబడే నిశ్శబ్దం. అక్కడక్కడా కాపలాకుక్కల అరుపులు తప్ప మరేమి వినబడటం లేదు. మధ్య మధ్యలో రయ్‌మంటూ దూసుకొస్తున్న కార్లు. ఇవి తప్ప మరేమీ కనపడలేదు వాళ్లకి. రావిచెట్టు రెండు ప్లాట్‌లలో విస్తరించి ఉంది. దాని ముందు ఇంకొన్ని ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అది వెంచర్‌ ‌చివర భాగం కావడంతో ఇంకా అక్కడ ఇల్లు కట్టలేదు. యాదమ్మకి చెట్టును చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది. గతం కళ్ల ముందు కదిలింది. ఒకప్పుడు పొలంలో పని అయిపోగానే మధ్యాహ్నం నాటికి అందురూ చెట్టుకింద చేరి కష్టసుఖాలు చెప్పుకుంటూ తెచ్చుకున్న అన్నం కూరలు పంచుకునేవాళ్లు. ఎర్రటికారం అన్నంలో కలుపుకున్నా అమృతంలా ఉండేది. ఆ చెట్టు కిందే ఎన్నో గొడవలు పరిష్కారం అయ్యేవి. మరెన్నో కొత్త విషయాలు తెలిసేవి. మనుషులనే కాదు, పశువులను కూడా ఎండ, వానల నుండి రక్షించేది. మంచీచెడు, తప్పొప్పులు చెప్పే పెద్దవాళ్లు ఈ చెట్టుకిందే కూర్చునేటోళ్లు. కానీ ఇప్పుడు చెట్టుకింద కూర్చున్నా ఆ ఆనందం లేదు. మనసంతా గుబులుగా ఉంది.

కొమరయ్య మెల్లగా చెట్టు మొదటకెళ్లి ఆప్యా యంగా చేతితో తడుముతున్నాడు. అతని మనసుకు ఏవో మాటలు వినబడుతున్నాయి. అవును అవి చెట్టునుండే.. ‘‘కొమరయ్యా బాగున్నావా? ఇన్నాళ్లకి గుర్తొచ్చానా! పోన్లే ఇప్పుడైనా వచ్చావ్‌. ‌నేనుండేది ఇంకొన్ని రోజులే. నేను పోయేలోపు నన్ను ఆప్యాయంగా చూసే వాళ్లు ఒక్కరైనా వస్తారా! అని ఇన్ని రోజులు ఆశగా ఎదురుచూస్తున్నాను. ఈ స్థలాలు బిల్డర్లు కొన్నారంట. త్వరలోనే నన్ను ముక్కలు ముక్కలు చేసి ఇక్కడనుండి తీసేస్తారు. తరువాత నన్ను చూడలేవు. ఇక్కడ కూడా పెద్ద పెద్ద భవనాలు కడతారంట. మొన్న నాకళ్లెదురుగానే గోడకట్టనీకి అడ్డుగా ఉన్నాయని నా బిడ్డల్ని నరికేసారు. నా గుండె తరుక్కుపోయింది. ఇప్పుడు నా వంతు. వన మహోత్సవాల పేరుతో మొక్కలు నాటాలంటారు. అదేనోటితో వెంచర్ల అభివృద్ధి అంటూ పచ్చని పొలాలు, మానుల్లాంటి మహావృక్షాలు నామ రూపాల్లేకుండా చేసేస్తున్నారు. ఈ పట్నం మనుషులు నాకు ఎప్పటికి అర్థంకారు. కొమరయ్య నిన్ను, ఈ ఊరిని విడచి త్వరలోనే నేను వెళ్లిపోతున్నాను…’’

ఇంకా ఏవో మాటలు చెట్టు తన మనసుకు చెబుతుంది.

కొమరయ్య కళ్ల నుండి అప్రయత్నంగా నీళ్లు కారుతున్నాయి. ఇంక అక్కడ ఉండాలనిపించలేదు. భుజం మీది తువాలుతో కళ్లు తుడుచుకొని ‘‘యాదమ్మా ఎళ్దాం రా’’ అన్నాడు. అక్కడినుంచి ఇద్దరూ బయలుదేరారు. వారికి ఎదురొస్తున్న సతీష్‌ ‘‘అరె తాత. అప్పుడే పోతుండవ్‌. ‌మా ఇల్లు ఈడనే. రా పోదాం’’ అన్నాడు.

‘‘ఒద్దులే అయ్యా.. నీ పుణ్ణేమా అని నా యాదమ్మ కోరిక తీరింది’’ అన్నాడు కొమరయ్య. ‘‘ముక్కూ, ముఖం తెల్వకపోయినా మాకు సాయం సేసినవ్‌. ‌సల్లగుండు కొడుకా’’ అంది యాదమ్మ.

‘‘అయ్యో అవ్వా రోజు నేను ఈ తాతని బడ్డీకొట్టు కాడ సూస్తా. నాకు మా తాత యాదికొస్తాడు. మాకు పొలం ఉండేది. మా అయ్య నన్ను సదివించనీకి అమ్మేసినాడు. ఇప్పుడు నేను పెద్ద ఉద్యోగమే చేస్తున్నా. కానీ చూసి సంతోషించనీకి వాళ్లు లేరు. ఒక్కసారి ఇంటికొచ్చి పోరాదూ..’’ అంటూ వాళ్లని తన ఇంటి దగ్గరకు తీసుకెళ్లాడు.

లోపలికి వెళ్లకముందే సతీష్‌ ‌భార్య బయటకి వచ్చి ‘‘ఎక్కడకెళ్లారు. బయటకెళ్లాలని చెప్పాగా. వాళ్లు ఎవరు?’’ అని అడిగింది. సతీష్‌ ‘‘‌వాళ్లా! వాళ్లు కోల్పోయిన అస్థిత్వాన్ని వెతుక్కుంటూ వచ్చిన అతిథులు’’ అని చెప్పాడు.

‘‘మీ కవిత్వాలు నాకు అర్థంకావు గాని ఎంతో కొంత ఇచ్చి పంపించండి’’ అని చెప్పి లోపలికి వెళ్లిపోయింది.

తమని యాచకులు అనుకుంటుందని కొమరయ్యకి అర్ధం అయింది.

‘‘సతీష్‌బాబు ఇంక ఎల్తామయ్యా’’ అంటూ లోపలకెళ్లకుండానే వెనుతిరిగారు. సతీష్‌ ఇం‌క వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. కానీ మనసులో బాధగా ఉంది.

ఒకటి కావాలంటే మరొకటి కోల్పోక తప్పదు. ఒకవిధంగా చెప్పాలంటే ఇది అభివృద్ధి. అవును. జనావాసాలు పెరగడం వల్లనే పల్లెలకు రోడ్లు, మంచినీళ్లు, విద్య లాంటి సదుపాయలు పెరుగు తున్నాయి. కానీ అభివృద్ధి పేరుతో, పచ్చని పంటపొలాలన్నీ భవిష్యత్‌ ‌పెట్టుబడులంటూ కళ్లముందే కనుమరుగైపోతున్నాయి. స్వచ్ఛమైన ఆక్సిజన్‌ అం‌దించే పెద్ద పెద్ద చెట్లను నరికేయడం కరక్టేనా? నేడు చిన్నచిన్న వ్యాధులు సైతం తట్టు కోలేనంతగా మనం కాలుష్య కోరల్లో చిక్కుకున్నాం. అసలు చెట్లే లేకపోతే మనకు, మన ముందు తరాలకు భవిష్యత్తు ఉంటుందా? రైతుకి చెట్లతో,  పశువులతో ఉండే బంధం కార్పొరేట్‌ ‌స్కూళ్లలో ఏసీ గదులలో చదువుకొనే నేటితరానికి అర్థమవుతుందా? వీళ్లే కదా రేపటి తరం నాయకులు.

సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలు సతీష్‌ ‌మనసును ఆక్రమించాయి.వెంచర్‌ ‌నుండి బయటి కెళ్లిపోతున్న ఆ రైతన్న వైపు బాధగా చూస్తూ ఉండిపోయాడు సతీష్‌.

‌భారమైన మనసుతో కొమరయ్య, యాదమ్మ ఇంటివైపు అడుగులు వేశారు.

About Author

By editor

Twitter
YOUTUBE