ఫిబ్రవరి 5 వసంత పంచమి
సమస్త సృజనాత్మకు అక్షరమే మూలం. అది అజ్ఞాన తిమిరాన్ని హరించి జ్ఞానప్రభలను వెలిగిస్తుంది. అందుకు అధిదేవత వాణి బ్రహ్మ స్వరూపిణి. ఆమె శక్తి వల్లనే ప్రాణులకు ఉలుకు, పలుకు సిద్ధిస్తున్నాయి. దీపం నుంచి కాంతి ప్రసరించినట్లు ఆమెలోని చైతన్యం జగత్తంతా విస్తరిస్తుంది. మాఘమాసంలో వసంత పంచమి నాడు ఆమెను విశేషంగా ఆరాధిస్తారు. ముఖ్యంగా ఆ రోజున సరస్వతీపూజ నిర్వహిస్తారు. శరన్నవరాత్రులలో ఏడవ రోజున కూడా (మూలానక్షత్రం) అర్చిస్తారు.
మాతృమూర్తులలో, నదులలో, దేవతలలో ఉత్తమమైనది సరస్వతి (‘అంబీతమే నదీతమే దేవీతమే సరస్వతి’) అని రుగ్వేదవాక్కు. సరస్వతీ తీరంలోనే వేదకాలపు నాగరికత వర్ధిల్లిందని, ప్రకృతిలోని మార్పుల కారణంగా ఆ నది అదృశ్యమై అంతర్వాహినిగా ప్రవహిస్తోందని చరిత్ర చెబుతోంది. ఆ నదీ ఆరాధనే క్రమంగా దేవతారాధనగా పరిణమించిందని చరిత్రకారులు చెబుతారు. ప్రవాహధ్వనితో తన రచనా వ్యాసంగానికి విఘాతం కలిగిస్తున్న సరస్వతీ నది అంతర్వాహినివి కావాలని వ్యాసుడు ఆదేశించారని కథనం ప్రచారంలో ఉంది.
మాఘ శుద్ధ పంచమి నాడు సరస్వతీ మాత అవిర్భవించింది. ఈ తిథిని శ్రీపంచమి, వసంత పంచమి, మదన పంచమి, సరస్వతీ జయంతి అని వ్యవహరిస్తారు. వసంత రుతువు చైత్రమాసంలో మొదలవుతున్నప్పటికీ ఆ రుతు శోభకు ఈ మాసమే స్వాగతం పలుకుతుందన్న భావనతో ‘వసంత పంచమి’గా పేర్కొంటారు.
సరస్వతీదేవి జనులను జ్ఞాన, వివేక, చైతన్యవంతులుగా చేస్తూ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని, అదే లక్ష్మీతత్త్వం కనుక ఈ తిథిని ‘శ్రీపంచమి’ అంటారని చెబుతారు. శివుడి ఫాలనేత్రాగ్నికి భస్మమై, రతీదేవి విలాప, విన్నపంతో తన రూపం ఆమెకు మాత్రమే కనిపించేలా మన్మథుడు వరం పొందిన ఈ రోజును మదన పంచమిగా పిలుస్తారు. పుస్తకాలను పూజిస్తే విద్యాభివృద్ధి సాధ్యమవుతుందని విశ్వసించడం వల్ల దీనిని ‘విద్యార్థుల పండుగ’ అనీ వ్యవహరిస్తారు.
జ్ఞానతేజం
అక్షరమే జగత్తుకు మూలాధారం. ఆ అక్షరం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అలా సంక్రమించిన జ్ఞాన తేజానికి పరిధులు, పరిమితులు లేవని, రవిచంద్రుల వెలుగుల కన్నా జ్ఞానతేజమే గొప్పదని విజ్ఞులు చెబుతారు. అందుకు కారణభూతురాలు శారదాదేవిని వేదమాతగా, అలౌకిక సమ్మేళనశక్తిగా అభివర్ణించాడు వ్యాసభగవానుడు. ఆమెను అన్న, ధన ప్రదాయినిగా వేదం పేర్కొంది. సురగురువు బృహస్పతి శారదాం బను ఆశ్రయించి మేధాశక్తి, విద్యాసంపదను ఆర్జించారని పురాణం. గురుశాపంతో విద్యలన్నీ కోల్పోయిన యాజ్ఞవల్క్యమహర్షి సూర్యభగవానుడి సూచన మేరకు అమ్మవారిని ప్రార్థించారట. అక్షరమాత అపార కరుణా కటాక్షాలతోనే కాళిదాసు ‘మహాకవి’గా అవతరించారు.
ధవళాన్విత
సరస్వతీ అమ్మవారిని ‘సర్వశుక్లాం శుద్ధరూపం’ అన్నారు. తెల్లదనం ఉట్టిపడే ఉపకరణాలన్నీ ఆ తల్లి సంబంధితాలే. కనుకనే ‘శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా..’ పద్యంలో సహజకవి పోతనా మాత్యుడు, ఆమెను శ్వేతవర్ణమూర్తిగా అభివర్ణించారు. వాణీదేవికి ప్రశాంతతకు చిహ్నమైన తెలుపు రంగు ఇష్టమట. ఆమె స్వరూపాన్ని తెల్లని వస్తువులు.. శరత్కాల మేఘాలు, చంద్రుడు, చందనం, హంస, మల్లెలదండ, మంచు, సముద్రపు నురగ, హిమా లయం, రెల్లుగడ్డి, ఆదిశేషువు, మొల్లలు, తెల్ల మందారం, తెల్లతామరపూవు, ఆకాశగంగ.. లాంటి వాటితో పోల్చారు.
తెల్లని వస్త్రం ధరించిన సరస్వతీదేవి కాంతిమంత వదనంతో చల్లని చిరునవ్వు వెదజల్లుతుంటుంది.
సరస్వతి ధరించే తెలుపురంగు చీర స్వచ్ఛత, ఆమె వాహనం శ్వేతహంసను ఆత్మలకు మూలమైన పరమాత్మకు సంకేతంగా చెబుతారు. హంస పాలను, నీటిని వేరుచేస్తున్నట్లే మనిషిలోని మంచిచెడులను బేరీజు వేసుకొని పాలలాంటి ‘మంచి’ని అమ్మవారి వాహనంగా చేసుకొని జగతికి దిశానిర్దేశం చేస్తారని చెబుతారు.
సృజనాత్మకత, స్వచ్ఛత, మోక్షసిద్ధికి ప్రతీక అయిన అమ్మవారిని శ్రీపంచమి నాడు మాత్రం పసుపు రంగు చీరతో అలంకరించి విశేష పూజలు నిర్వహిస్తారు. సరస్వతి బ్రహ్మ ముఖంలో కొలువుదీరారని, వేదపురాణాలు ఆ తల్లికి నిలయాలని శాస్త్ర వచనం. సరస్వతి విద్యను మాత్రమే కాక సర్వశక్తి సామర్థ్యాలను అనుగ్రహిస్తుందని దేవీభాగవతం పేర్కొంది. ఆమె జ్ఞానం, ఐశ్వర్యం, సౌభాగ్య సమ్మేళనం. జ్ఞానంవల్ల ఐశ్వర్యం, ఐశ్వర్యం వల్ల సౌభాగ్యం, సౌభాగ్యం కారణంగా జీవిత పరమార్థం సిద్ధిస్తాయని చెబుతారు.
వేదాధ్యాయులు శ్రావణ పౌర్ణమి నాడు అధ్యయనం ప్రారంభించి మాఘ శుద్ధ పంచమితో ముగించే ఆచారం ఉందని మార్కండేయ, మత్స్య, స్కంద పురణాలు వివరిస్తున్నాయి. సరస్వతి జయంతిని పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తారు. వసంత పంచమి నాడు విద్యా సామాగ్రిని అమ్మవారి సమక్షంలో ఉంచి ప్రత్యేకంగా అర్చించి పాలతో తయారు చేసిన లేదా తెల్లగా ఉండే పదార్థాలను నివేదిస్తారు.
శంకరభగవత్పాదులు నెలకొల్పిన నాలుగు ఆమ్నాయపీఠాలలో దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం మొట్టమొదటిది. లోకానికి ప్రేమసుధలు పంచే విద్యానిలయంగా శంకరులు ఈ పీఠాన్ని స్థాపించారు. తుంగాతీరంలో ప్రసవవేదన పడుతున్న కప్పకు తాచుపాము తన పడగ నీడలో ఆశ్రయమిచ్చిన దృశ్యం ఈ పీఠ స్థాపనకు ప్రేరణగా చెబుతారు. ఆలయ జీర్ణోద్ధరణ, నవీకరణ సందర్భాలలో కుంభాభిషేకాలు నిర్వహించాలన్న ఆగమశాస్త్ర నిర్దేశానుసారం ఆలయ స్వర్ణగోపురానికి పన్నెండేళ్లకు ఒకసారి శ్రీపంచమి నాడు కుంభాభిషేకం నిర్వహిస్తారు. ఆ ప్రకారం, నాలుగేళ్ల క్రితం (2017) ఆ క్రతువు పూర్తయింది.
వాసర పీఠ నిలయే నమోస్తుతే…
శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి
వాసరా పీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే…
వేదవ్యాస ప్రతిష్టితమైన బాసరలోని జ్ఞానసరస్వతి విశేష పూజలందుకుంటున్నారు. ఆయన తపస్సు చేయడం వల్ల ఆ ప్రాంతానికి వ్యాసపురి అని పేరు వచ్చిందని చెబుతారు. కాలక్రమంగా వాసరగా, బాసరగా ప్రసిద్ధికెక్కింది. పుష్య బహుళ పంచమి నుంచి మాఘ శుద్ధ అష్టమి వరకు పద్దెనిమిది రోజుల పాటు శ్రీ పంచమి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని చిన్నకోడూరు సమీపంలోని అనంతసాగరంలోని సరస్వతీక్షేత్రంలోని మూలమూర్తి నిలుచుని దర్శనం ఇవ్వడం ప్రత్యేకత. తెలంగాణలో బాసర, వర్గల్, అనంతసాగర్‌లో అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. ఆంధప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కొలనుభారతీ దేవి క్షేత్రంలో చతుర్భుజాలతో ఆవిర్భవించిన అమ్మవారు వీణాపాణిగా కాకుండా పుస్తకధారిణిగా ఉండడం విశేషం. వివిధ ప్రాంతాలలో సరస్వతీ ఆలయాలు వెలుస్తూ పూజలు అందుకుంటున్నాయి. ‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే.’ అనే ఆర్యోక్తికి జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి హేతువు. విద్యవల్ల వినయం, వినయం వల్ల పాత్రత, పాత్రత వల్ల ధనం, ధనం వల్ల ధర్మం, దాని కారణంగా ఐహికాముష్మిక సుఖమూ కలుగుతాయని ఆర్యవాక్కు. ఇన్ని ప్రసాదించే చదువుల తల్లికి అక్షరాంజలి.
విదేశాలలోనూ సరస్వతీమాత పూజలందు కుంటున్నారు. అతిపెద్ద ముస్లిం దేశం ఇండోనేషి యాలోని బాలిద్వీపంలో నీటికొలను మధ్య సరస్వతీ దేవి కొలువుదీరారు.
– ఎ. రామచంద్ర రామానుజ, సీనియర్ జర్నలిస్ట్