భారత స్వాతంత్య్రం కోసం బ్రిటిష్‌ ఇం‌డియా మొత్తం కదిలింది. అప్పటికే దేశంలో ఉన్న  562 సంస్థానాలలో ఉద్యమ వేడి కొంచెం తక్కువే అయినా, దేశం నలుమూలలా స్వేచ్ఛా నినాదం వినిపించింది. ఈ ప్రాంతాల నుంచి వెళ్లి జాతీయ స్థాయిలో నాయకత్వం వహించినవారే ఎందరో ఉన్నారు. అలా దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందినవారు మన స్వాతంత్య్రోద్యమంలో ప్రాతినిధ్యం వహించారు. కానీ జాతీయ నేతల ఆదేశాలను అనుసరించి కింది స్థాయిలో ఆయా వ్యూహాలను, ఉద్యమాన్ని నిర్వహించినవారు ఎంతమందో ఇప్పటికీ అంచనాకు అందదు. వారి త్యాగాలను కూడా చరిత్రలో నమోదు చేయాలి. ఆ ప్రయత్నం కొంతవరకు మాత్రమె సాగింది. ఇది తక్కువేనని అనిపిస్తుంది. జిల్లాల వారీగా స్వాతంత్య్రో ద్యమం, ఉద్యమ నాయకుల గురించి పరిశోధనలు జరిపి, మరుగున ఉండి పోయిన ఉద్యమ చరిత్రను వెలికి తీసే కృషి జరుగు తున్న మాట కాదనలేం. అలాంటి కృషి చేసిన వారిలో ఒకరు డాక్టర్‌ ‌గాదం గోపాలస్వామి. ‘పశ్చిమ గోదావరి జిల్లాలో స్వాతంత్య్రోద్యమం’ అనే అంశం మీద ఆయన పరిశోధన చేశారు. పంజాబ్‌, ‌మహారాష్ట్ర, బెంగాల్‌ ‌వంటి ప్రాంతాలలో స్వరాజ్య సమరంతో కుతకుత లాడిన ప్రదేశాలు కొన్ని ఉంటాయి. ఆరు అధ్యాయాలుగా ఉన్న ఈ సిద్ధాంత వ్యాసం చదువుతూ ఉంటే ఆ ప్రాంతాల ఉద్యమమే గుర్తుకు వస్తూ ఉంటుంది. అదే తీవ్రత. అవే త్యాగాలు. ఎన్నో సమాంతర ఘటనలు కూడా తారసపడతాయి. మంచి పరిశోధనతోనే ఇది సాధ్యమైంది. మరుగున పడిన త్యాగం దేశ ప్రజలందరి దృష్టికి వచ్చింది. స్వాతంత్య్ర కాంక్ష పట్ల ఈ ప్రాంతానికి ఉన్న నిబద్ధత, గాంధీజీ పిలుపు పట్ల ఉన్న గౌరవం ఇలా వ్యక్తమయినాయి. ఈ పరిశోధనలోని ప్రత్యేకత, స్వాతంత్య్రోద్యమంలో తెలుగు పత్రికల పాత్ర కూడా సమాంతరంగా నమోదవుతూ ఉంటుంది. గాంధీజీ మార్గంలోనే కాకుండా, ఇతర పంథాలలో స్వాతంత్య్రం కోసం పోరాడినవారు ఉన్నారు. ఇందులో అలాంటి వారికి సంబంధించిన ఒకటి రెండు చరిత్రలు ఉన్నాయి. మార్గం ఏదైనా కావచ్చు. వారు చేసినదీ స్వరాజ్య సమరమే కాబట్టి, చరిత్రలో ఉండాలి.

బెంగాల్‌ ‌విభజన తరువాతనే గోదావరి జిల్లాలలో రాజకీయ చైతన్యం వెల్లి విరిసింది. నిజానికి దక్షిణ భారతదేశం జూలు విదిల్చినది అప్పుడే. బిపిన్‌పాల్‌ ‌యాత్ర ఇందుకు దోహదం చేసింది. సహాయ నిరాకరణోద్యమ సమయానికే పశ్చిమ గోదావరి పూర్తి స్థాయిలో ఉద్యమానికి సిద్ధమైనట్టు డాక్టర్‌ ‌గోపాలస్వామి రుజువు చేశారు. సత్యాగ్రహోద్య మానికి కట్టుబడి ఉంటామని ఈ జిల్లాలో ప్రమాణ పత్రం మీద సంతకం చేసిన తొలి వ్యక్తి మాగంటి లక్ష్మణదాసు (చాటపర్రు). ఉమర్‌ అలీషా, దాసు మాధవరావు, బొమ్మకంటి కృష్ణమూర్తి వంటివారి నాయకత్వంలో ఖిలాఫత్‌ ఉద్యమం ఎంత విజయ వంతంగా సాగిందో ఇందులో చదువుతాం. సహాయ నిరాకరణోద్యమం/ఖిలాఫత్‌ ఉద్యమం జిల్లాలో ఏ గ్రామంలో ఏ రీతిలో జరిగిందో, ఎవరు నాయకులో కూడా రచయిత సేకరించారు. ఈ ఉద్యమంలో స్త్రీల పాత్రను కూడా పరిశోధకుడు నమోదు చేశారు. ఉదా. మాగంటి అన్నపూర్ణ జీవిత విశేషాలు.

నాగ్‌పూర్‌ ‌జెండా సత్యాగ్రహం, స్వరాజ్‌ ‌పార్టీ, సైమన్‌ ‌కమిషన్‌ ‌రాకకు నిరసన, ఉప్పు సత్యాగ్రహం, 1937 ఎన్నికలు, వ్యక్తి సత్యాగ్రహం, వేండ్ర, ఉండి రైల్వే స్టేషన్ల మీద దాడి, క్విట్‌ ఇం‌డియా ఉద్యమం వివరాలు కూలంకషంగా నమోదు చేశారు. అలాగే గాంధీ ఆశయాలైన అంటరానితనం నిర్మూలన, సారా వ్యతిరేకోద్యమం, ఖాదీ ప్రచారం, ఈ ప్రాంతంలో గాంధీజీ పర్యటన గురించి రచయిత ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఉద్యమ వేడి తక్కువేమీ కాదు. నాయకత్వం పటిమ ఉంది. కానీ ఇవన్నీ వెలుగు చూడాలంటే ఇలాంటి పరిశోధనతోనే సాధ్యం. ఇలాంటి పరిశోధనలు ఇంకా జరగవలసి ఉంది. అప్పుడే స్వరాజ్య సమరం సమగ్ర దృశ్యం ఇవాళ్టి తరాల ముందు నిలుస్తుంది. స్వాతంత్య్ర సమరయోధుల లక్ష్యం తమ ప్రాంతం ఒక్కటే బ్రిటిష్‌ ఇం‌డియా నుంచి స్వేచ్ఛను తెచ్చుకోవడం కాదు. మొత్తం భారతదేశానికి అలాంటి స్వేచ్ఛ. సాంస్క్సతిక ఏకత్వం రాజకీయ ఐక్యతకు దారి చూపిన వాస్తవాన్ని కూడా మన స్వరాజ్య సమరం నుంచి మనం గ్రహించగలం.

డాక్టర్‌ ‌గోపాలస్వామి పరిశోధన విస్తృతమైనది ఆయన సేకరించిన సమాచారమే మూడు నాలుగు బృహత్‌ ‌గ్రంథాలకు వస్తువు కాగలదు. ఆయనే వెలువరించిన ‘భారత స్వాతంత్య్రోద్యమంలో పశ్చిమ గోదావరి జిల్లా యోధులు’, ‘పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము’ అనే రెండు పుస్తకాలు అలా వచ్చినవే అనిపిస్తుంది. పరిశోధనను దాటి తన అధ్యయనానికి డాక్టర్‌ ‌గోపాలకృష్ణ ఇలా పుస్తక రూపం ఇవ్వడం చరిత్ర రచనకు, దానిపైన పూర్తి అవగాహ నకు రావడానికి  ఉపకరించేదే. ఇవన్నీ స్థానిక చరిత్రలే అయినా, అనేక ఉపనదులు వెళ్లి పెద్ద నదిని సుసంపన్నం చేసినట్టు, మన జాతీయోద్యమ పరిపూర్ణ రూపాన్ని దర్శింపచేస్తాయి.

‘భారత స్వాతంత్య్రోద్యమంలో పశ్చిమ గోదావరి జిల్లా యోధులు’ గ్రంథం చదవడం ప్రత్యేక అనుభవం. 463 పేజీల ఈ పుస్తకంలో 116 మంది సమర యోధుల వివరాలు ఉన్నాయి. ఇందులో చరిత్ర ప్రసిద్ధులైనవారు కొద్దిమందే. ఆ ప్రాంతంలో వారు ప్రముఖులే అయినా, వారి త్యాగం, దృక్కోణం తెలిసింది తక్కువ. ఇతర ప్రాంతాలకు తెలిసే అవకాశం కూడా తక్కువే. ఆ లోటును ఇలాంటి పరిశోధనలు తీరుస్తాయి.

జిల్లాలో స్వాతంత్య్రోద్యమ తొలి నాయకుడు ఆత్మకూరి గోవిందాచార్యులు మొదలు, కాంగ్రెస్‌ ‌భాష్యకారుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య, జిల్లా స్వాతంత్య్రోద్యమ రథసారథి దండు నారాయణరాజు, చంటి బిడ్డతో జైలుకు వెళ్లిన కలగర పిచ్చమ్మ, పప్రథమ హరిజన నాయకుడు గొట్టుముక్కల వెంకన్న, జిల్లా కాంగ్రెస్‌ ‌ప్రథమ అధ్యక్షుడు మంతిప్రగడ భుజంగరావు, ఆంధ్రా డెమాస్థనీస్‌గా పేర్గాంచిన చెరుకువాడ నరసింహం వంటి వారి చరిత్రలు క్లుప్తంగానే అయినా తెలుసుకోగలుగుతాం. ఇక ఈ జిల్లాకే చెందిన అల్లూరి సీతారామరాజు గురించి ఎలాగూ విస్మరించలేరు. తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, డేగల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులు, రెబ్బాప్రగడ మందేశ్వరశర్మ, దేవులపల్లి సత్యవతమ్మ, పరకాల పట్టాభి రామారావు, మహాత్ముని మానస పుత్రిక అన్నపూర్ణ, కోరుకొండ సుబ్బారెడ్డి, పోలీసుల తుపాకీకి ఎదురునిలిచిన కోటమర్తి కనకమహా లక్ష్మమ్మ, హిందూ-ముస్లిం ఐక్యతను కోరిన షేక్‌ అలీ సాహెబ్‌, ‌రైతు కూలీ నాయకుడు కొమ్మారెడ్డి సూర్యనారాయణమూర్తి, కవి యోధుడు మంగిపూడి వేంకటశర్మ వంటి వారందరి చరిత్రను డాక్టర్‌ ‌గోపాలస్వామి సేకరించారు. వీరిలో ఎక్కువమంది అజ్ఞాతంగా ఉండిపోయిన మహనీయులే. ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌సందర్భంగా అయినా వారిని తలుచుకోవడం మనందరి విధి.

గాంధీజీ పశ్చిమ గోదావరి జిల్లాలో 48 గ్రామాలను సందర్శించడం కూడా స్మరణీయమైన ఘటనే. ఈ అంశంతో రాసిన చిన్న పుస్తకమే ‘పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము’. ఏప్రిల్‌ 3, 1921‌న తొలిసారి కస్తుర్బా సహా గాంధీజీ ఏలూరు రైల్వేస్టేషన్‌లో దిగారు. ఆయన జిల్లాకు రావడం అదే మొదటిసారి. ఎవరు స్వాగతం పలికారు, ఎంతమంది వచ్చారు అన్న విషయాలను డాక్టర్‌ ‌స్వామి కళ్లకు కట్టారు. ఖద్దరు పట్ల గాంధీజీ అనురాగం ఎంతటిదో చెప్పే ఘటనలు ఇందులో ఎన్నో!  అందులో ఒక చక్కని ఉదంతం: ‘గాంధీజీ ఏలూరు వచ్చిన తరువాత క్షురకర్మకై ఖద్దరు కట్టిన మంగలి కావలెనని అన్నారు. 36 గంటలు వెతికినా అలాంటివారు దొరకలేదు. మీరు ఖద్దరు ధరించిన మంగలివారికే ఎక్కువ గిరాకీ ఉండేటట్లు చేయవలెను. అదే విధంగా వడ్రంగులు, చాకళ్లు, ఇతర పనివాళ్ల విషయంలోను ఖద్దరు కట్టిన వారికే ఎక్కువ గిరాకీ ఉండేటట్లు చేయండి. ఆ విధంగా ప్రజలలో ఖద్దరు వ్యాప్తి చేయాలి’ (పే 40) అన్నారట. పోతునూరు, కొవ్వలి, దెందులూరు, గుండుగొలను, తాడేపల్లిగూడెం, ఆకివీడు, భీమవరం, పెనుమంట్ర, మట్లపాలెం, పాలకొల్లు, ఆచంట, తణుకు,చాగల్లు, కొవ్వూరు వరకు ఆయన పర్యటన, ప్రజలు చూపిన ఆదరణ, హరిజనవాడలకు ప్రయాణం వంటి అంశాలన్నీ రచయిత అక్షరబద్ధం చేశారు. గమనించాలే గానీ, దేశంలోని ప్రతి గ్రామానికి ప్రత్యేకత ఉంటుంది. చరిత్ర ఉంటుంది. చరిత్రకారులు కదిపితే చాలు, అవన్నీ వెలికి వస్తాయి. ఇక స్వరాజ్యం పోరాటం గురించి చెప్పేదేముంది? ప్రతి పల్లె ఓ చరిత్ర పుస్తకం ఇవ్వదూ!

– డా।। గాదం గోపాలస్వామి

About Author

By editor

Twitter
YOUTUBE