– సింహప్రసాద్‌

‌వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైన రచన


అర్ధరాత్రి అదే పనిగా ఫోన్‌ ‌మోగుతోంటే అయిష్టంగానే లేచి వెళ్లాను.

ఫోన్‌ ఎత్తగానే ‘‘మీ నవల ఉత్సవం ఇప్పుడే చదివాను. పరమ చెత్త’’ అని దాడి చేశాడు.

నిర్ఘాంతబోయాను.

‘‘అది అవార్డు నవల. ఎందరో మెచ్చుకున్నారు…’’

‘‘అందుకే ఫ్రెండ్‌ ఇం‌ట్లో చూసి తెచ్చుకున్నా. పొద్దున చదవడం మొదలుపెట్టాను. మధ్యలో ఆపలేకపోయాను. మంచి ఉత్కంఠ ఉంది మీ నవల్లో’’

‘‘ఈ ముక్క చెప్పడానికి మీకు ఈ టైమే దొరికిందా?’’ విసుగు అణచుకుంటూ అన్నాను.

‘‘చదవటం పూర్తికాగానే మీకు ఫోన్‌ ‌చేయకుండా ఉండలేకపోయాను. అందులో సీతనీ రాముడ్నీ ఏకంగా ఆకాశానికెత్తేశారు. వాళ్లు ఏ కాలం వాళ్లు? త్రేతాయుగం వాళ్లు. అవునా? ఇప్పుడే కాలం నడుస్తోంది? కలియుగం. మధ్యలో ద్వాపరయుగమూ వెళ్లిపోయింది. అవునా కాదా?’’

‘‘అది నిజమైనప్పుడు కాదనెలా అంటాను?’’

‘‘అది తెలిసి కూడా ఎప్పుడో బీసీ కాలం నాటి వారి గురించి అంత గొప్పగా రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? మా తాతలు నేతులు తాగారని చెప్పి, మా మూతుల వాసన చూడమన్నట్టుంది మీ వరస. నాకేం నచ్చలేదు. విల్లు, బాణాల కాలాన్ని మర్చిపోయి తుపాకులు, ఆర్డీఎక్స్‌ల కాలం గురించి రాస్తే మీకూ మాకూ మంచిది. నాలాంటి ఎందరో పాఠకులకూ నచ్చుతారు..’’

‘‘ఒక్కమాట. అంత పెద్ద నవల్లో ఒక్క ముక్కా మీకు నచ్చలేదా? చిత్రంగా ఉందే!’’

‘‘కోడలు ఏలూరులో పుట్టింట్లో ఉండి రానం టుంది చూడండి, అది మాత్రం నచ్చింది. వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు రాశారు. మా కోడలు అచ్చం అలాంటిదే!’’

‘‘అలాగా! కొంచెం వివరంగా చెప్పండి’’

‘‘చెబుతాను గాని, మీకు అమెరికా అంటే ద్వేషం ఉన్నట్టుంది. అందుకే ఆ భూతలస్వర్గం వదిలి, ఇక్కడి పల్లెటూరికి రావటం ఓ పెద్ద ఘనకార్యం అన్నట్టు బిల్డప్‌ ఇచ్చారు. పైగా దానికి జననీ జన్మభూమిశ్చ- అని రాముడన్నాడని కలరింగూ ఇచ్చారు’’

‘‘అహ.. అదేం లేదు. నిజానికి మా అబ్బాయిలు అమెరికాలోనే ఉంటున్నారు.’’

‘‘అయినా అలా రాశారంటే మీరు చిత్రమైన వాళ్లనే. మా కోడలు ఇండియా వస్తే చాలు తిన్నగా పుట్టింటి కెళ్లి తిష్టవేస్తుంది. మా అబ్బాయితో కలిసి వచ్చినా సరే, తెయ్‌ ‌మంటూ అక్కడికి తీసుకుపోద్ది. రండ్రా రండ్రా అని మేం ఫోన్‌ ‌మీద ఫోన్‌ ‌చేస్తే గాని మా ఇంటికి రారు. వచ్చినప్పుడైనా పట్టుమని పది రోజులుండరు. చుట్టపు చూపుగా వచ్చి, ఇలా ముఖం చూపించి అలా ఎగిరి వెళ్లిపోతారు’’

‘‘మీ అబ్బాయి అయినా ఉండొచ్చుగా!’’

‘‘ఎక్కడ ఉండనిస్తుందండీ ఆ కోడలు మహారాణి! తిరుపతి వెళ్లాలి, తాజ్‌మహల్‌ ‌చూడాలి అంటూ ఏదో పోగ్రాం వేసి లాక్కుపోతుంది. పోనీ వెంట మమ్మల్ని తీసుకెళ్తారా అంటే అదీ లేదు. గొప్పగా వాళ్ల అమ్మానాన్నల్ని తీసుకుపోతుంది. ఖర్చంతా వీళ్లే పెట్టుకోవాలి గాని వాళ్లు వాళ్ల ముల్లె విప్పరు. పైసా విదల్చరు!’’

‘‘అలాంటి వాళ్లూ ఉంటార్లెండి…’’

‘‘ఎదురుగా మా కోడలు కన్పిస్తోందిగా! మీరు నవల్లో ఏం రాశారో గుర్తుందిగా. సీత రాముడి వెంట అడవికి నడిచి పోయింది గాని, పుట్టింటికెళ్లి రాజభోగాలనుభవిద్దాం అనుకోలేదని’’

‘‘బాగానే గుర్తుపెట్టుకున్నారే. మీ కోడల్ని చదవమనండి’’

‘‘చదివితే బాగానే బుద్ధొచ్చును. అసలు పుస్తకాలే చదవదా మనిషి. ఎంత సేపూ చిప్స్ ‌నముల్తూ హిందీ, ఇంగ్లిష్‌ ‌సీరియళ్లు చూస్తూ కూర్చుంటుంది’’ అక్కసుగా అన్నాడు.

‘‘అలాగా. ఇక ఉంటాను….’’

‘‘ఆగండాగండి. మీరు బాగానే రాస్తారు గాని ఎప్పుడూ అయోధ్య, రామాయణం అంటూ వాటిని పట్టుకు వేళ్లాడ తారేంటి. వాటినీ, ఆ గొడవల్నీ వదిలేసి మా కోడల్లాంటి వారి గురించీ, వారి ప్రవర్తన వల్ల నలిగి, విసిగి పోతున్న మాలాంటి వారి ఆవేదన గురించి పేజీల కొద్దీ రాయండి. కొందరైనా బుద్ధి తెచ్చుకుని లెంపలేసు కుంటారు. మీ నవలని చెత్త అన్నానని ఏమీ అనుకోవద్దు. ఏదైనా మొహం మీద కొట్టినట్టు నిక్కచ్చిగా మాట్లాట్టం నా అలవాటు….’’

‘‘థాంక్స్. ‌కుదిరితే ఆ నవలని ఇంకోసారి చదివి, ఆలోచించి చూడండి. మీ అభిప్రాయం తప్పకుండా మారుతుంది!’’ నవ్వుకుంటూ లైన్‌ ‌కట్‌ ‌చేశాను.

ళి       ళి       ళి

ఒకరోజు నా హైస్కూలు మిత్రుడు హఠాత్తుగా నర్సాపురం నుంచి ఊడిపడ్డాడు. ఇద్దరం మత్స్యపురి హైస్కూల్లో చదువుకున్నాం. పదేళ్ల క్రితం కాబోలు ఓ పెళ్లిలో కలిశాం. ఆ తర్వాత ఈ మధ్య- ఒక ఇరవై రోజుల క్రితం, ఏదో పత్రికలో నా కథతోబాటు ప్రచురించిన ఫోన్‌ ‌నెంబర్‌ ‌చూసి, కాల్‌ ‌చేశాడు. అంతే. ఇప్పుడిలా చెప్పా పెట్టకుండా ఎందుకొచ్చాడో అర్థం కాలేదు.

మనిషి మాత్రం బాగా లొంగిపోయాడు. ఏదో మనోవ్యథ లాంటిది పీడిస్తున్నట్టుంది. ఆర్థిక ఇబ్బందులా? స్టేట్‌ ‌గవర్నమెంట్లో చేశాడు. బాగా సంపాదించానని క్రితం సారి కలిసినప్పుడు చెప్పాడే!

టిఫిన్‌ ‌చేస్తూ అన్నాడు ‘‘నువ్వు నాకో సాయం చేసి పెట్టాల్రా’’

‘‘ఎలాంటి సాయం?’’

‘‘మా వియ్యంకుడు మీ కూకట్‌పల్లిలోనే ఉంటున్నాడు. పరమేశ్వర్రావు గారనీ- నీకు తెలిసే ఉంటుంది…’’

చిన్నగా నవ్వి అన్నాను. ‘‘ఆ పేరు గల వాళ్లెవరూ తెలీదు గాని, తెలుసు కోవచ్చులే. అదేం పెద్ద కష్టంకాదు, ఇంతకీ విషయం ఏవిటి?’’

గబుక్కున లేచొచ్చి నా రెండు చేతులూ పట్టుకున్నాడు. ‘‘మా కోడల్ని కాపురానికి పంపట్లేదురా. నువ్వు, నీ పేరూ పలుకుబడీ కనెక్షన్లూ ఉపయో గించి ఎలాగైనా సరే మా వియ్యం కుడ్ని ఒప్పించాలి….’’

ఇబ్బందిగా కదిలాను. ‘‘అతడెవరో తెలీకుండా… అయినా ఫరవాలేదులే. ఆ ఇరుగు పొరుగుల్లో నాకు తెలిసిన వారో, మా బ్యాంక్‌ ‌వాళ్లో ఎవరో ఒకరు ఉండి ఉంటార్లే. వారి ద్వారా నరుక్కు రావచ్చుగాని, ఇంతకీ మీ కోడలు కాపురానికి ఎందుకు రానంటోంది?’’

‘‘సుజాత మంచిదే గాని, తండ్రి ఎంత చెబితే అంత. ఆయన ఎలా ఆడమంటే అలా ఆడుతుంది. అతగాడో పరమ మూర్ఖుడు! మొండి ఘటం!’’

‘‘ఏవంటాడు?’’

‘‘మా వాడు ఇల్లరికం రావాలిట!’’

తుళ్లిపడ్డాను. ‘‘మీ వాడు బెంగళూర్లో చేస్తున్నాడన్నావు కదూ?’’

తలాడించాడు. ‘‘ఇక్కడికి ట్రాన్స్‌ఫర్‌ ‌చేయించుకుని వాళ్లింట్లో ఉండాలిట. అలాగని వాళ్లతో కాదు, వాళ్ల బిల్డింగుపై పోర్షన్లో ఉండాలిట. సిటీలో మా వాడికి సొంతిల్లు ఉంది. ‘ఇక్కడికి ట్రాన్స్‌ఫర్‌ అయి వస్తే ఆ ఇంట్లో ఉంటాంగాని, వాళ్ల ఇంటిపైన అద్దెకుండాల్సిన కర్మ మాకేంటి’ – అంటాడు మా అబ్బాయి’’

‘‘అదీ పాయింటే’’

‘‘అలా కుదరదట. వాళ్ల కళ్లెదుటే ఉండాలిట’’

‘‘అలా ఎందుకుట?’’

అటూ ఇటూ చూసి, గొంతు తగ్గించి చెప్పాడు. ‘‘మా వాడి మీద అనుమానం ఉందిట!’’

‘‘ఐసీ. ఆ యాంగిల్‌ ఉం‌దా. మనలో మనమాట. మీ వాడికి స్త్రీ వ్యామోహం ఉందా కర్మ?’’

‘‘ఛా ఛా. ఒకటోరకం బుద్ధిమంతుడురా. మా వాడు నీతీ రీతీ తప్పితే నేనెందుకు ఊరుకుంటాను చెప్పు? రెండు చెంపలూ వాయించి మరీ బుద్ధి చెప్పనూ. అక్కడికీ వాళ్లు సాయిబాబా భక్తులు గనుక, షిర్డీ వెళ్లి, బాబా ముందు ప్రమాణం చేస్తానన్నాడు. ఆ తండ్రీ కూతుళ్లు వింటే కదా!’’

‘‘కొందరు కూతుళ్ల తల్లిదండ్రులు అంతేలే. రిమోట్‌ ‌కంట్రోల్తో కూతుళ్ల కాపురాలు మేనేజ్‌ ‌చేస్తుంటారు. పెళ్లి చేసి పంపేక, ఇక తమ బిడ్డ అత్తింటి కుటుంబ సభ్యురాలే అనుకోరు. అక్కడా తమ మాటే చెల్లాలని, ఊరికే అన్నిట్లో తలదూరుస్తూ, లేనిపోనివి నూరిపోస్తూ ఆమె ద్వారా సమస్యలు సృష్టిస్తుంటారు’’

‘‘ఏమోరా. ఇదంతా మా ప్రారబ్దం అనుకో. వారి ఇంట్లో అందరూ చదువుకున్నారు, ఉద్యోగస్తులు, మర్యాదస్తుల కుటుంబం అని సంబంధం కలుపు కున్నాం…’’

‘‘కట్నం దండిగా ఇచ్చారేమో కదా, అన్నయ్య గారూ’’ కాఫీ ఇస్తూ చురకవేసింది ఇల్లాలు.

‘‘అవినీతి సొమ్ము మూలుగుతోంది. ఇచ్చాడు’’ నిరసనగా అన్నాడు.

‘‘అయితే మాత్రం అడక్కుండా ఈ రోజుల్లో ఎవరిస్తారూ!’’ సాగదీసింది.

అతడి ముఖం చిన్నబోయింది. ఇంకేమాట తూలుతుందోనని భయమేసి, కళ్లతో వారించాను. లోపలికెళ్లి పోయింది.

‘‘మీ వియ్యంకుడి అడ్రస్సు ఇవ్వు. అతడి ఫోటో వాట్సప్‌లో పంపించు. ముఖం చూసి గుర్తు పట్టగలనేమో చూద్దాం…’’

‘‘ఇది నీవల్లే అవుతుంది. నాకీ ప్రాంతంలో నీకన్నా బాగా తెలిసిన వాళ్లెవరూ లేరు. నాకోసం ఎక్‌‌స్ట్రాగా కష్టపడైనా సరే ఈ పని చేసి పెట్టరా. మా వాడి సంసారం నిలబెట్టరా’’ ప్రాధేయపడ్డాడు.

ఫోటో చూశాను. ‘‘ఇతడ్నెక్కడో చూశాను. ఎక్కడబ్బా? రోజూ మా భువనవిజయం గ్రౌండ్‌కి వాకింగ్‌కి వస్తూంటాడు..’’ అంటూ చిరునామా చూశాను. ‘‘అరె మాకు రెండు వీధులు అవతలే ఉంది వారి ఇల్లు..!’’

‘‘ఇప్పుడు నా పని సులువుగా తెమిలిపోతుందని నమ్మకం చిక్కింది. పద వెళ్దాం..’’ లేస్తూ అన్నాడు.

‘‘మొదటే ఇద్దరం ఎందుకులే. ముందు నేనొక్కణ్ణీ వెళ్లి విషయం రాబడతాను’’

‘‘అన్నయ్యగార్ని తీసుకెళ్లండి. వియ్యంకుళ్లు ఇద్దరూ ఎదురు బదురుగా ఉంటే, అపార్థాలూ సమస్యలూ ఇట్టే విడిపోతాయి’’ ఇల్లాలు కల్పించు కుంది.

‘‘ఆవేశకావేశాలు రగిలి అనవసర రాద్ధాంతా లకూ పంతాలకూ దారితీయొచ్చు. ఇది కాపురం సమస్య. అలా వద్దులేగాని వారుండేది మనింటి వెనుకే గనుక, ముందు నేను వెళ్లి సమస్యేంటో తెలుసు కుంటాను. తర్వాత వీడిని పిలిచి సెటిల్‌ ‌చేస్తాను’’

పరమేశ్వర్రావు గారికి ఫోన్‌ ‌చేశాను. ఓ గంటలో రమ్మన్నాడు. వెళ్లాను.

‘‘మిమ్మల్ని గ్రౌండ్‌లో ఎప్పట్నుంచో చూస్తున్నాను. మీరు మా వియ్యంకుడి ఫ్రెండ్‌ అని మీరిందాకా చెప్పేదాక తెలీదు సుమండీ’’

‘‘ఇప్పుడు తెలిసింది గనుక ఇక నుంచి చక్కగా మాట్లాడుకోవచ్చు. మీ అమ్మాయినోసారి పిలిస్తే మాట్లాడతాను…’’

‘‘దాని మొహం, దానికేం తెలుసండీ. మీక్కావా ల్సిన ఇన్ఫర్మేషన్‌ అం‌తా నేనిస్తాగా. మా అల్లుడు తిన్ననైన వాడు కాదు. అందుకనే మా అమ్మాయిని బెంగళూరు పంపట్లేదు. లేకపోతే నాకేం మాయరోగం చెప్పండి’’

‘‘చెడు అలవాట్లున్నాయంటారా?’’

‘‘ఒకటి కాదు చాలా ఉన్నాయి. పార్టీల్లో మందు కొడతాడట. ఆఫీసు కొలీగ్‌తో సంబంధం ఉందిట. ఆవిడ తరచూ ఫోన్‌ ‌చేస్తుందిట. మా అమ్మాయి ఫోన్‌ ‌వింటోందని తెలిస్తే మాత్రం మాట మార్చి, ఆఫీసు పని గురించి మాట్లాడుకుంటార్ట. అందుకనే మేం అతడ్ని నమ్మాలంటే హైదరాబాద్‌కి ట్రాన్స్‌ఫర్‌ ‌చేయించుకోవాల్సిందే అని తెగేసి చెప్పాను. మా ఇంటి పై పోర్షన్‌ ‌ఖాళీ చేయించి ఇస్తాం. అందులో ఉండాలి’’

‘‘మీరు సీసీ కెమేరాల్లా నిఘా వేస్తానంటారు?’’

‘‘భలేగా చెప్పారు. ఎగ్జాక్ట్‌గా అలాగే అనుకోండి’’

‘‘ఒక పనిచేస్తే? మీరే అక్కడికెళ్లి వారి పక్కింట్లో అద్దెకు దిగి అబ్జర్వ్ ‌చేస్తే ఎలా ఉంటుంది?’’

‘‘ఏడిసినట్టు ఉంటుంది. ఇది మా సొంత ఇల్లండీ. దీన్ని వదిలేసి అక్కడికి పోవాల్సిన కర్మేంటి మాకు?’’

‘‘మీ అమ్మాయి కాపురం గురించి ఆ మాత్రం ఇబ్బంది పడలేరా చెప్పండి’’ నవ్వుతూనే అడిగాను.

‘‘అక్కర్లేదు. ప్లీడర్‌తో మాట్లాడాను. గృహహింస కింద కేసు పెడితే చాలు. అల్లుడూ, అతడి అమ్మా, బాబూ వచ్చి మా కాళ్ల మీద పడతారు. లేదా జైల్లో చెక్కభజన చేస్తూ కూర్చుంటారు’’ అక్కసుగా అన్నాడు.

‘‘బెదిరింపులతో కాపురాలు చక్కబెట్టలేం పరమేశ్వర్రావుగారూ’’

‘‘అతడు తిన్నగా ఉంటే, మేం చెప్పినట్టు వింటే ప్రోబ్లమే ఉండదు. మీ ఫ్రెండే కదా, ఆ ముక్క చెప్పి ఒప్పించండి’’

‘‘మీరు ఉత్సవం నవల చదివారా?’’ సడన్‌గా అడిగాను.

‘‘ఎందుకు?’’ అడిగాడతను.

‘‘భర్త ఎలా ఉండాలో, భార్య ఎలా మసలాలో అందులో చక్కగా రాశారు. భర్త రాముడిలా ఉండాలి. పక్క చూపులు చూడకుండా పద్ధతిగా ఉండాలి. తండ్రి మాట వినాలి. ఇక సీత ….’’

అతడి ముఖం ఎర్రబడింది. ‘‘అది త్రేతాయుగపు కథండీ!’’ చప్పరించేశాడు.

చటుక్కున గుర్తొచ్చింది. ఆ మధ్య ఒకరాత్రి వేళ ఫోన్‌ ‌చేసి నవల చెత్తగా ఉందని తిట్టింది ఇతడు కాదు కదా?

‘‘అయితే మీరది చదివారన్నమాట’’

‘‘చదివాను గనుకే తడుముకోకుండా కుండబద్దలు కొట్టినట్టు చెప్పాను. ఏదైనా ముఖం మీద కొట్టినట్టు చెప్పడం నా అలవాటు’’ ఫోజు కొట్టాడు.

‘‘మీ అభిప్రాయం ఏదైనా, రామకథ ఇవాళ కూడా రిలవెంటే. ప్రతి భర్తా రాముడిని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి భార్యా సీతలా ఉండాలి’’ ఇతడు అతడేనని నిర్ధారణ అవుతోంటే నాకు కొత్త ఉత్సాహం వచ్చింది.

‘‘కచ్చితంగానూ, అడవులకైనా సరే మొగుడి వెన్నంటే ఉండాలి…’’

ఆ వెంటనే నాలిక్కరుచుకుని అన్నాడు. ‘‘అతడు రాముడైతే ఆమె సీతలా ఎందుకుండదులెద్దురూ!’’

‘‘మీ అబ్బాయి రాముడేనా? సందేహం ఏమైనా ఉందా?’’

నా వంక అయోమయంగా చూశాడు. ‘‘రాముడైతే నా మాటని వేదవాక్కుగా భావించే వాడు. అప్పుడింక అనుకోవాల్సిందే ముంటుంది. వాడు కోడలి చేతిలో కీలుబొమ్మ. పెత్తనం ఆవిడగారి చేతిలో పెట్టేసి, ఆడమన్నట్టల్లా ఆడుతున్నాడా ఇడియట్‌. అయినా మనం మా అల్లుడి గురించి మాట్లాడుతున్నాం. మధ్యలో మా అబ్బాయి ప్రసక్తి ఎందుకు? దానికీ దీనికీ ఏవిటి సంబంధం?’’ విసుగ్గా ముఖం పెట్టాడు.

‘‘సంబంధం ఉందనే, అమెరికాలో ఉంటోన్న మీ అబ్బాయి గురించి అడిగాను’’

‘‘తలా తోకా లేకుండా మాట్లాడకండి. వాడికీ ఇతగాడికీ సారూప్యం ఏవిటి?’’ కించిత్తు కోపంగా అన్నాడు.

‘‘మీ కోడలు సీతలా ఉండటం లేదనీ, అయిన దానికీ, కాని దానికీ పుట్టింటికి పోతోందనీ చెప్పేరుగా!’’

‘‘అవన్నీ మీకెవడు చెప్పాడు? అసలు అలా కూసినగాడిదెవడు?’’ కయ్‌ ‌మన్నాడు.

‘‘మీరే ఫోన్‌ ‌చేసి మరీ తిట్టి చెప్పారు. త్రేతా యుగం నాటి కథలు రాయొద్దని హెచ్చరించారు…’’

‘‘నేను మీకు ఫోన్‌ ‌చేశానా? మీరిప్పుడేగా పరిచయం అయ్యింది?’’

‘‘అది చాలా చిన్న విషయం గాని పక్కన పెట్టేయండి. మీ అభిప్రాయం నాకర్థమైంది. మీ కోడలు సీతలా ఉండాలి. మీ అల్లుడు రాముడే అవ్వాలి. బాగానే ఉంది గాని, సీతారాములు కలియుగం వాళ్లు కానప్పుడు మీరు వాళ్లతో ఎందుకు పోల్చాలి చెప్పండి’’

అతడి ము•ం తెల్లగా పాలిపోయింది. సమాధానం ఏమివ్వాలో తోచక గుడ్లప్పగించి చూసి తలదించుకున్నాడు.

‘‘రామాయణం, ఒక ఆదర్శ కుటుంబాన్ని, ఒక ఆదర్శ భర్తని, ఒక ఆదర్శ భార్యని, ఒక ఆదర్శ సోదరుణ్ణి, ఒక ఆదర్శ మిత్రుడ్ని, ఒక ఆదర్శ సేవకుడ్ని నమునాగా మన ముందు నిలిపింది. సీతారాముల నడక, నడత, నడవడిక ఒక కొలబద్దగా మారింది. అంచేత దానితోనే ఏ కాలపు భార్యాభర్తల్నైనా కొలుస్తుంటాం. అంచనా వేస్తుంటాం. వారి అడుగుజాడల్లో నడవమని బోధిస్తుంటాం. ఏంచేతంటే సీతారాములే ది అల్టిమేట్‌. ‌శిఖరాగ్రం. వారిని మించిన జంట జగాన లేదు. రామాయణం మన సంస్కృతిలో ఒక భాగం. మన రక్తంలో కలగలిసి పోయిన సత్యం. దాన్ని కాదనటం ఎవరి తరమూ కాదు’’ కాస్తంత ఉద్రేకంగా అన్నాను.

‘‘మీరు….?’’

‘‘చెబుతానుండండి. మీ కోడల్ని తప్పుబట్టారు. సీతలా ప్రవర్తించక పుట్టింటిని అంటిపెట్టుకునుంటుందని నిందించారు. కాని మీ కూతురి విషయంలో అదే తప్పు చేస్తున్నారు. ఏమంటే మీ అల్లుడు రాముడు కానే కాదంటున్నారు’’

‘‘అవునది అనుమానం కాదు, నిజమే అంటాను’’ తనది కింది చెయ్యి అవుతోందని గ్రహించి కాబోలు స్వరం పెంచి దబాయింపుగా అన్నాడు.

‘‘మీ అబ్బాయి మీ మాట వింటే చాలు, అమెరికాలో ఉండటానికి అభ్యంతరం లేదు. మీ అల్లుడు, వాళ్ల నాన్న మాట వినకూడదు, బెంగళూరులో ఉండకూడదు. మీ కోడలు సీతలా ఉండాలి.

మీ అమ్మాయి సీతలా ఉండక్కర్లేదు. మీ అబ్బాయి మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినా తప్పు పట్టకూడదు. ఇద్దర్నీ రెండు విభిన్న రాళ్లతో తూచడం సరైందేనా చెప్పండి? ఈ ద్వంద్వ ప్రమాణాలు అవసరమా?’’

దెబ్బతిన్నట్టు చూశాడు. తలొంచుకున్నాడు.

‘‘కొడుక్కీ, అల్లుడికీ, కూతురికీ కోడలికీ ఒకే ప్రమాణం అప్లై చేస్తే సమస్యలూ మనస్పర్థలూ మబ్బుల్లా తేలిపోతాయి. ఆలోచించండి. పితృ వాక్య పరిపాలకుడైన రాముడిగా ఉండమని మీ అబ్బాయికీ, అల్లుడికీ ఇద్దరికీ చెప్పండి. మీ అమ్మాయికీ కోడలుకీ సీతని ఆదర్శంగా తీసుకోమనీ చెప్పండి. వెంటనే ఎలాంటి అడ్డు పుల్లలూ వేయకుండా మీ అమ్మాయిని బెంగళూరుకి భర్త దగ్గరకి పంపి హాయిగా కాపురం చేసుకోనీయండి. వారికేమైనా ఒడిదుడుకులొస్తే, రెండు చేతులూ అడ్డుపెట్టి కాపుగాయండి. తప్పటడుగులు వేస్తే చెవి మెలిపెట్టండి. ఆ హక్కూ అధికారమూ మీకెప్పుడూ ఉంటాయి’’

అర్థమైందనట్టు చూసి తలాడిస్తూ, ‘‘అలాగేలెండి కాని, ఇంతకీ మీరెవరో చెప్పలేదు?’’ కీచుగొంతుతో అడిగాడు.

‘‘త్రేతాయుగం వాళ్ల గురించి నవల రాసినవాణ్ని!’’

About Author

By editor

Twitter
YOUTUBE