‘నేను కొట్టినట్టే కొడతాను, నువ్వు ఏడ్చినట్టే ఏడు’ అని తెలుగు నానుడి. తమ పార్టీ ప్రభుత్వం పంజాబ్‌లో చేసిన నిర్వాకం ఇప్పుడు కాంగ్రెస్‌లో వణుకు పుట్టిస్తున్నది. ప్రధాని భద్రత విషయంలో పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ ‌సింగ్‌ ‌చన్ని ఉద్దేశపూర్వకంగా వ్యవహరించిన తీరు, అంతటితో ఊరుకోకుండా అజ్ఞానంతో ప్రధాని మీద చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కే చేటు తెచ్చే విధంగా పరిణ మించాయి. ఏదో ఒకనాటికి వాస్తవాలు బయట పడతాయన్న కనీస జ్ఞానం లేకపోవడం వల్లనే ఇలాంటి ధోరణి ప్రదర్శించినవారంతా ఇప్పుడు దిక్కుతోచని రీతిలో ఉన్నారు. దీని నుంచి బయటపడడానికి ఆ పార్టీ నానా తిప్పలు పడుతోంది. ఇందుకు నిదర్శనమే కాంగ్రెస్‌ ‘‌తాత్కాలిక’ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో జరిపిన సంభాషణ. ఈ సంభాషణ వివరాలను సాక్షాత్తు ‘తాత్కాలిక’ అధ్యక్షురాలి సన్నిహితులే వెల్లడించి, ఆమె మీద మచ్చ పడకుండా కాపాడే ప్రయత్నం చేశారు. ఇండియా టుడే ఇచ్చిన ఈ వివరాలు చూస్తే ఇదొక ప్రహసనమని చెప్పడానికి సందేహించనక్కర లేదనిపిస్తుంది. ఇంతకీ ‘తాత్కాలిక’ నేత మూణ్ణాళ్ల పంజాబ్‌ ‌ముఖ్యమంత్రితో ఈ విషయం మాట్లాడడం, ఆ వివరాలను సోనియా సన్నిహితులు వెల్లడించడం ఎందుకు? ‘హిందువులు అధికంగా ఉన్న ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చాలామంది ఎమ్మెలేలు, ఎంపీలు కలసి, కథ అడ్డం తిరిగేటట్టు ఉంది, ఇంకో అరవై రోజులలో జరిగే శాసనసభల ఎన్నికల మీద పంజాబ్‌ ‌ఘటన ప్రభావం చూపించగలదు’ అని హెచ్చరించడమే ఇందుకు కారణమని ఇండియా టుడే పేర్కొన్నది. 


ఫిరోజ్‌పూర్‌ ఉదంతానికి బాధ్యున్ని చేస్తూ ఎస్‌ఎస్‌పి హర్మన్‌దీప్‌ను రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌సస్పెండ్‌ ‌చేశారు. కానీ ఆ సస్పెన్షన్‌ ఉత్తర్వులను ముఖ్యమంత్రి చన్ని బుట్టదాఖలు చేశారు. ఇది పంజాబ్‌ ‌హిందువుల ఆగ్రహానికి దారితీసిందన్న అభిప్రాయం ఉంది. అలాగే రైతు చట్టాల రద్దుకు పంజాబ్‌లోని హిందువులలో కొందరు వ్యతిరేకం. కాంగ్రెస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే (అభొర్‌ ‌నియోజకవర్గం) సునీల్‌ ‌కుమార్‌ ‌జాఖడ్‌ ‌ప్రకటన హిందువుల క్షోభ వ్యక్తమయ్యే రీతిలోనే ఉంది. ఈయన పీసీసీ మాజీ అధ్యక్షుడు కూడా. బాగా పేరున్న హిందూ నాయకుడు. శాసనసభలో విపక్ష నేతగా కూడా పనిచేశారు. ఈయనే ప్రధాని మోదీకి భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి భద్రతా వైఫల్యం సుస్పష్టం అంటూ కుండబద్దలు కొట్టి వెనువెంటనే ప్రకటించారు. అంతేకాదు, జనవరి 6వ తేదీ ఉదయమే పంజాబ్‌ ‌కాంగ్రెస్‌లో పనిచేస్తున్న పలువురు హిందూ నాయకులు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను సంప్రతించారు. భద్రతా వైఫల్యాల ఆరోపణ దరిమిలా హిందువులలో తలెత్తిన ఉద్వేగాలకు ఒక రాజకీయ పరిష్కారం ఆలోచించ వలసిందని మొరపెట్టుకున్నారు. సోనియా-చన్ని సంభాషణ వెనుక ఇంత కథ ఉంది.

 జనవరి 5 నాటి ఆ ఘటన గురించి జనవరి 6 సాయంత్రం ముఖ్యమంత్రి చన్నితో మాట్లాడుతూ ‘తాత్కాలిక’ అధ్యక్షురాలు సోనియా ‘ఆగ్రహం’ వ్యక్తం చేశారట. అందుకు బాధ్యులైన వారి పట్ల కఠినంగా వ్యవహరించవలసిందిగా హుకుం జారీ చేశారట. ప్రధాని భద్రతనే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య తాంశంగా చేసుకుని ఉండవలసిందని అభిప్రాయ పడ్డారట. ఇంతకీ ఇది జరిగిన తరువాత అయినా ముఖ్యమంత్రి చన్నిలో మార్పు వచ్చిందా? ఆరో తేదీ సాయంత్రం సోనియా సంభాషణ, ఆగ్రహం వ్యక్తం చేయడం వంటివన్నీ నాటకమని చెప్పడానికి ఆ మరునాడే చన్ని ఇచ్చిన ప్రకటన చాలు. తన ప్రాణానికి హాని అంటు ప్రధాని చెప్పడం ఒక ఎత్తుగడ అని మరింత దిగజారుడు వ్యాఖ్య చేశారాయన. శాంతియుతంగా ప్రదర్శన (ప్రధాని ప్రయాణించే మార్గంలో) చేస్తున్న తన రైతుల మీద లాఠీచార్జికి తాను ఆదేశించలేనంటూ అపార ప్రేమను కురిపిం చారు. పీసీసీ అధ్యక్షుడు సిద్ధు కూడా ఇంతకంటే ఎక్కువ విజ్ఞత ప్రదర్శించలేదు. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకుండానే పార్టీ ఎన్నికలకు వెళుతుండడం సిద్ధుని నిలువనీయడం లేదు. ఆ నేపథ్యం లోనే సిద్ధు నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఇది ప్రహసనం కాక మరేమిటి?

ప్రధాని ప్రయాణించవలసిన రోడ్డు మార్గాన్ని ‘పరిశుభ్రం చేయడం సాధ్యం కాలేదు’ అంటూ జనవరి 5వ తేదీ మధ్యాహ్నం పంజాబ్‌ ‌పోలీసు యంత్రాంగం నిస్సహాయత వ్యక్తం చేసిన తరువాత మోదీ వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఫిరోజ్‌పూర్‌ ‌దగ్గరి ఫ్లైవోవర్‌ ‌మార్గాన్ని ‘రైతు సంఘం’ భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ‌దిగ్బంధనం చేయడంతో ప్రధాని వెనుదిరిగారు. ఫిరోజ్‌పూర్‌ ఉదంతం ద్వారా స్పష్టమవుతున్నది ‘హత్య చేయాలన్న’ కాంగ్రెస్‌ ‌పార్టీ యోచనేనని బీజేపీ పంజాబ్‌ ‌శాఖ అధ్యక్షుడు అశ్విని శర్మ చేసిన ఆరోపణను కొట్టి పారేయలేమనని నెమ్మదినెమ్మదిగా రుజువవుతోంది. అలాంటి యోచనతో పోలీసు శాఖ కుమ్మక్కయిందని కూడా తీవ్రమైన ఆరోపణ చేశారు ఆ బీజేపీ నేత. రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ ‌జనరల్‌ను పదవి నుంచి తప్పించ వలసిందిగా రాష్ట్ర బీజేపీ నాయకులు గవర్నర్‌ ‌భన్వరీలాల్‌ ‌పురోహిత్‌ను కలసి కోరారు కూడా. కాబట్టి మోదీ హత్యకు కుట్ర అన్నది వట్టి ఆరోపణ కాదు, వాస్తవమేనన్న సంగతి రుజువయ్యే లోపుననే తామూ తమ ముఖ్యమంత్రిని మందలించామని చెప్పడానికి కాంగ్రెస్‌ ‌తాత్కాలిక అధ్యక్షురాలు చిన్న ప్రయత్నం చేశారు. వారసుడు ఇక్కడ లేడు కాబట్టి కాంగ్రెస్‌ ‌పెద్దలు హాయిగా ఊపిరి పీల్చుకుని ఉంటారు. లేకపోతే ఆయన నోటి నుంచి ఏం వచ్చేదో! దాని నుంచి బయటపడడానికి ఎంత శ్రమించాల్సి వచ్చేదో!

చన్ని నిర్వాకం, వరస పెట్టి ఇచ్చిన బుర్ర తక్కువ ప్రకటనలు పంజాబ్‌లో ఉన్న 38.5 శాతం హిందువుల మీద ప్రభావం చూపించ వచ్చునన్నదే సోనియా అసలు భయం. దీనికి తోడు తాము ఏరి కోరి తెచ్చి నియమించుకున్న పంజాబ్‌ ‌ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవ్‌జోత్‌ ‌సింగ్‌ ‌సిద్ధు అడ్డూఅదుపూ లేకుండా మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్‌ ‌ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ‌తనకు పెద్దన్న వంటివాడంటూ ఆ భారత ద్వేషి పట్ల సిద్ధు నిస్సిగ్గుగా ప్రేమానురాగాలు  ప్రకటిస్తూనే ఉన్నాడు. పైగా పాకిస్తాన్‌తో వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించాలన్న నినాదం కూడా తరచూ ఆ నోటి నుంచి వస్తూ ఉంటుంది. ఇక ముఖ్యమంత్రి చన్ని ఎన్నికల ప్రచారం పరమ వికృతంగా మొదలైంది. రాష్ట్రంలో విచ్చల విడి మత్తు మందుల వాడకాన్ని, రవాణాను ఆపలేకపోయారనీ, దళిత విద్యార్థి వేతనాలలో అక్రమాలు జరిగాయనీ, కల్తీసారా మరణాలక• అడ్డుకట్ట వేయలేకపోయారనీ, సిక్కుల పవిత్ర గ్రంథ సాహెబ్‌కు అపచారం జరిగితే చర్యలు తీసుకోలేదంటూ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ ‌సింగ్‌ ‌మీద చన్ని ధ్వజమెత్తుతున్నారు. అమరీందర్‌ ‌నిన్నటిదాకా తమ పార్టీ ముఖ్యమంత్రేననీ, ఆయన మంత్రి వర్గంలో తానూ మంత్రినేనన్న స్పృహనూ కోల్పోయి చన్ని విమర్శలకు దిగుతున్నారు. ఇంతకీ వాటిపై చర్యలు తీసుకోవడానికి చన్ని చేసినది కూడా ఏమీలేదు. దర్యాప్తునకు కూడా ఆదేశించలేదు. ఇంకా దారుణం- సంఘటన జరిగిన 18 గంటల తరువాత కూడా ఫ్లైవోవర్‌ ‌మీద ప్రధాని కాన్వాయ్‌ని అడ్డగించిన ‘గుర్తు తెలియని వ్యక్తుల’ మీద ఎఫ్‌ఐఆర్‌ ‌దాఖలు కాలేదు. దారి అడ్డగించినవారితో కలసి తేనీరు సేవించిన పోలీసులకు  వారి గురించి తెలియదనడం ఏమిటని బీజేపీ ప్రశ్నించింది. ఇలా ప్రధాని భద్రతకు భంగం కలిగించిన నేరానికి రూ. 200 జరిమానాతో సరిపెడతారా? అని కూడా బీజేపీ వ్యాఖ్యానించింది.

ఈ కాంగ్రెస్‌ ‌ముఖ్యమంత్రి బాధ్యతా రాహిత్యంతోనే కాదు, రాజ్యాంగ విరుద్ధంగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోదీ భద్రత గురించి వస్తున్న ఆరోపణల గురించి తాను కాంగ్రెస్‌ ‌నాయకురాలు ప్రియాంక వాద్రాకు అన్నీ వివరించానని స్వయంగా చెప్పడం మరొక వివాదానికి దారి తీసింది. నిజానికి నెహ్రూ-గాంధీ కుటుంబంలో రాజ్యాంగేతర శక్తులు కొత్తకాదు. ఇప్పుడు బీజేపీ ఆ విషయమే ప్రశ్నిస్తున్నది. ప్రియాంకకు ఏ విధమైన రాజ్యాంగ హోదా ఉందని పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి భద్రతా చర్యల గురించి చర్చించారని బీజేపీ నిలదీస్తున్నది. నన్ను ప్రాణాలతో తిరిగి భటిండా చేర్చినందుకు ధన్యవాదాలు అంటూ ప్రధాని చాలా సున్నితంగా వాత పెట్టి ఉండవచ్చు. కానీ ఆ మాటలలోని పదును, వాడి, వేడి తట్టుకోవడానికి కాంగ్రెస్‌ ‌పార్టీ సిద్ధంగా ఉండడం మంచిది.

About Author

By editor

Twitter
YOUTUBE