ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌ ‌పర్యటన సందర్భంగా బయటపడిన భద్రతా లోపాలు దేశ ప్రజలను కలవరపెట్టాయి. కానీ కొందరు ఈ అంశంలో మోదీని లక్ష్యంగా చేసుకుని చేసిన ప్రకటనలు అత్యంత జగుప్సాకరంగా, బాధ్యతారహితంగా ఉన్నాయి. కొందరైతే మోదీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన వారిని సైతం వదలలేదు. ఈ ఘటనలో జోష్‌ను చూసినవారు కొందరు. ఢిల్లీలో ఏడాదిపాటు రైతులను నిరీక్షింప చేసిన మోదీకి పంజాబ్‌లో వారే సరైన రీతిలో జవాబు ఇచ్చారని కొందరు ట్వీట్లు, సందేశాలు పెట్టారు. ఒక పాశవికానందం ఇందులో కనిపించింది. కళాకారులమన్న ముద్రతో కొందరు, రాజకీయ నాయకులమన్న పేరుతో ఇంకొందరు, స్వయం ప్రకటిత సామాజిక కార్యకర్తలు, మేధావులు ఈ పాశవికానందాన్ని పుష్కలంగా అనుభవించారు.


మోదీ పంజాబ్‌ ‌పర్యటనలో భద్రతా వైఫల్యాలపై ఇప్పటికే విచారణ మొదలు కాగా, స్వయంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని స్వతంత్ర విచారణ సంఘాన్ని నియమిస్తున్నట్టు ప్రకటించింది. ఆందోళనకారులు కాన్వాయికి 100 మీటర్లు దూరంలో ఉన్నారంటే పంజాబ్‌ ‌పోలీసుల భద్రత, జాగరూకత ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అక్కడ కనిపించిన నలుగురైదుగురు బీజేపీ కార్యకర్తలున్నారని వార్తలు వచ్చాయి. అదైనా తప్పిదమే. ఇవన్నీ ఒక ఎత్తైతే సోషల్‌ ‌మీడియాలో సాగించిన  వారిలో దుష్ప్రచారం కొందరి దురుద్దేశాలను బయటపెట్టింది.

హుసేనీవాలా అమరవీరుల స్మారకం వద్దకు బయలుదేరిన ప్రధాని, భద్రతా వైఫల్యంతో ఆ పర్యటను రద్దు చేసుకొని ఢిల్లీ వెళ్లిపోయారు. ఆ సందర్భంలో ‘మీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పండి… అంటూ మోదీ పంజాబ్‌ అధికారులతో వ్యాఖ్యానించడంలోని అంత రార్థాన్ని గమనించకుండా, ఈ తప్పిదాన్ని కప్పిపుచ్చు కునేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ సోషల్‌ ‌మీడియాలో ఎదురు దాడికి దిగింది. బీజేపీ కార్యక్రమానికి జనం తగిన సంఖ్యలో లేనందునే మోదీ తిరగి వెళ్లిపోయారంటూ కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత రణ్‌దీప్‌ ‌సింగ్‌ ‌సుర్జేవాలా ట్వీట్‌ ‌చేశారు. సభ ప్రారంభానికి చాలా గంటల ముందు తీసిన ఫోటో దీనికి జత చేశారు.

ఖలిస్తాన్‌కు నాంది: పన్నూ

ఫిరోజ్‌పుర్‌లో ప్రధాని పర్యటనను తామే అడ్డుకున్నామని లండన్‌ ‌కేంద్రంగా నడుస్తున్న ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థ ‘సిక్స్ ‌ఫర్‌ ‌జస్టిస్‌’ ‌నాయకుడు గురుపత్వంత్‌ ‌సింగ్‌ ‌పన్నూ చెప్పుకున్నారు. ఖలిస్తాన్‌ ‌స్వాతంత్య్రానికి ఇది నాంది అని చాలా పెద్ద మాటే అన్నారు. రానున్న శాసనసభ ఎన్నికలు ఖలిస్తాన్‌ ‌రిఫరెండంపై తీర్పునిస్తాయని అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ రిఫరెండమ్‌కు జనవరి 5 నుంచి ప్రచారం ప్రారంభమైందని, దీనిని మోదీ ప్రభుత్వం గుర్తించాలని కూడా చెప్పారు పన్నూ. త్రివర్ణ పతాకం ధరించి వచ్చినవారు ఢిల్లీకి వెనుదిరగవలసి వచ్చిందట. రైతులు మోదీని చెప్పుల్లేకుండా పంజాబ్‌ ‌నుంచి తరిమికొట్టారట. నాటి ప్రధాని ఇందిరాగాంధీ పంజాబ్‌కు ఆయుధాలతో వచ్చారని, ఆమెకు ఆయుధాలతోనే సమాధానం లభించిందని పన్నూ చెప్పారు. సిక్స్ ‌ఫర్‌ ‌జస్టిస్‌ అక్కడితో ఆగడం లేదు. పంజాబ్‌ ‌రైతులు, సిక్కులకు వ్యతిరేకంగా నమోదయ్యే కేసులకు దూరంగా ఉండాలని న్యాయవాదులను హెచ్చరించింది. 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో ఒక్కరికి కూడా ఇప్పటివరకు శిక్షపడలేదని గుర్తు చేసింది.

కాంగ్రెస్‌ ‌కువిమర్శలు

బీజేపీపై వ్యతిరేకతతో కాంగ్రెస్‌ ‌నాయకులు ఖలిస్తాన్‌ ‌వేర్పాటువాద శక్తుల విషయంలో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు న్నాయి. నిజానికి ఈ వేర్పాటువాద భూతంతో ఎక్కువగా నష్టపోయింది కాంగ్రెస్‌ ‌పార్టీయే. స్వర్ణమందిరంలో నక్కిన ఉగ్రవాదులును ఏరివేసేందుకు చేపట్టిన ఆపరేషన్‌ ‌బ్లూస్టార్‌ ‌కారణంగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత కాలంలో ఎల్‌టీటీఈ ఉగ్రవాదులు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని బలి తీసుకున్నారు.అయినా రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భద్రతను విస్మరించి ప్రధాని మోదీపై ఆ పార్టీ విమర్శలు చేస్తోంది.

సిక్కులను ప్రతినాయకులుగా చూపేందుకు కాంగ్రెస్‌ ‌కుట్రపన్నిందని ఆరోపిస్తూ సిక్కు సమాజ్‌ ‌దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు జరిపింది. హిందువులు, సిక్కుల మధ్య అగాధాన్ని సృష్టించడానికి అంతర్జాతీయ కుట్ర జరిగిందనీ, దాన్ని కాంగ్రెస్‌ అమలుచేసే పనిలో ఉన్నా, దేవుడి దయవలన విఫలమైందని సిక్కులు ఆరోపిస్తున్నారు. క్రైస్తవ ముఖ్యమంత్రి చన్ని సింగ్‌, ‌పాక్‌ ‌తోలుబొమ్మ సిద్ధూలకు తాయిలాలు ఇచ్చి ఈ కుట్ర అమలుకు యత్నం జరిగిందని సిక్కు సమాజ్‌ ‌తీవ్ర మైన ఆరోపణలు చేసింది. ఇంగ్లండ్‌ ‌సిక్కులు కూడా ప్రధాని మోదీకి అండగా నిలిచారు.

ప్రధాని మోదీ కాన్వాయ్‌లో అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో చేర్చిన కారు గురించి ఇటీవల కాంగ్రెస్‌ ఇలాంటి విమర్శలే చేసింది. ‘దేశంలో ఇప్పుడు ప్రతివ్యక్తి మోదీ లాంటి ఫకీర్‌ (‌సన్యాసి) బతుకు కోరుకొంటున్నాడు. గగనయానానికి రూ.8,000 కోట్ల విమానం, భూమ్మీద తిరిగేందుకు రూ.20 కోట్ల కారు, ఇల్లు కట్టేందుకు రూ.2,000 కోట్లు. ఫకీర్‌ ‌బతుకంటే ఇదే కాబోలు’ అంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి గౌరవ్‌ ‌వల్లభ్‌ అజ్ఞానంతో ట్వీట్‌ ‌చేశారు. అయితే ప్రధానమంత్రి కాన్వాయ్‌లో కొత్త కార్లను చేర్చడం విశేషం ఏమీకాదని, సర్వ సాధారణంగా జరిగేదే అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

సోషల్‌ ‌మీడియాలో దుష్ప్రచారం

ఆంధప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, ప్రధాని భద్రత అంశం దేశానికి సంబంధించి ఎంతో ప్రాధాన్యమైందని చెప్పారు. ప్రధాని పర్యటనలో భద్రతాలోపాలు ఆందోళన కలిగిస్తోందని ట్వీట్‌ ‌చేశారు. ఆయన పార్టీ సానుభూతి పరులు కొందరు ప్రధానిపై చౌకబారు విమర్శలు చేశారు. మరోవైపు ప్రధానికి ఏమైనా జరిగితే 1984 ఘటనలు పునరావృత్తమవుతాయని కొందరు పోస్టులు పెట్టారు. ఈ పోస్టులతో ఎలాంటి సంబంధం లేకున్నా బీజేపీకి అంటగట్టాలని వ్యతిరేకులు ప్రయత్నించారు.

సెలబ్రిటీల ముసుగులో..

మోదీ విషయంలో కొందరు సెలబ్రిటీలు నిత్యం విషయం కక్కడం కొత్తేమీ కాదు. ఇందులో హీరో సిద్ధార్థ్ ఒకరు. మోదీ కాన్వాయ్‌ ‌వ్యవహారంలో ట్విట్టర్‌ ‌వేదికగా సైనా నెహ్వాల్‌ ‌స్పందించారు. ‘ప్రధానికే అలాంటి పరిస్థితి ఎదురైతే.. ఏ దేశమైనా సురక్షితంగా ఉందని ఎలా అనుకోగలం. ప్రధానిపై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా’ అని పేర్కొన్నారు. అయితే ట్వీట్‌కు సిద్ధార్థ్ ‌రీట్వీట్‌ ‌చేస్తూ ‘‘చిన్న కాక్‌తో ఆడే ప్రపంచ ఛాంపియన్‌. ‌భగవంతుడి దయవల్ల భారతదేశాన్ని కాపాడేవారు ఉన్నారు’’ అని వ్యాఖ్యా నించాడు. దీనిపై జాతీయ మహిళా కమిషన్‌ అసహనం వ్యక్తం చేసింది. సిద్ధార్థ్ ‌వ్యాఖ్యలను కమిషన్‌ అధ్యక్షురాలు రేఖాశర్మ ఖండించారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల యింది కూడా. సిద్ధార్థ్‌పై ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేసి, విచారణ జరిపాలని మహారాష్ట్ర డీజీపీని రేఖాశర్మ కోరారు. అసభ్యకరంగా మాట్లాడినందుకుగానూ సిద్ధార్థ్ ‌ట్విటర్‌ ‌ఖాతాను వెంటనే తొలగించాలంటూ ట్విటర్‌ ఇం‌డియా గ్రీవెన్స్ అధికారికి లేఖ రాశారు.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE