– పద్మావతి రాంభక్త

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన రచన

‘టిఫిన్‌ చేసేసాను, ఇవాళ నీకు నచ్చిన పెసరట్టు ఉప్మా, వేడివేడిగా తిను’ అంటూ సుష్మను పిలిచాను. తను రాత్రంతా పని చేసి ఉదయం ఏడు గంటలకు పడుకుని పది గంటలకు నిద్ర లేచింది. అర్జంట్‌ ప్రాజెక్ట్‌ అని రెండు వారాలుగా తన మీద బాగా ఒత్తిడి ఉంది. సరిగ్గా నిద్ర కూడా పోవట్లేదు. అందుకే ముఖం కూడా బాగా వడలిపోయి కళ్ల కింద లైట్‌గా నల్లని వలయాలు కూడా వచ్చాయి. బాత్‌రూం లోంచి తువ్వాలుతో ముఖం తుడుచుకుంటూ వచ్చి ‘శుభోదయం, హబ్బా నాకు నచ్చిన టిఫిన్‌ చేసావు, ఇప్పుడు పెసరట్లను కుమ్మేస్తా చూడు’ అంది, సుష్మ నవ్వుతూ పళ్లెం అందుకుంటూ.

‘‘చట్నీతో పాటు పొడి కూడా వెయ్యనా, నీకు పొడితో తినడం ఇష్టం కదా?’’ అడిగాను. ‘‘వద్దు సంజూ, ఈ చట్నీతో పెసరట్టుప్మా అదిరింద నుకో, స్వర్గాన్ని తాకాను మొదటి ముక్క నోట్లో పెట్టుకోగానే తెలుసా. అయినా నేనేగా నిన్ను వంటలలో ఇంతలా నలభీములను మించిపోయేలా చేసింది’’ అంది. ‘‘చాల్లే, చట్నీ నువ్వు గానీ నేర్పించావా? ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందామా, నా సొంత రెసిపి ఇది’’ అంటూ గర్వంగా మీసం మెలేసాను. ‘‘పోదూ బడాయి. పెసరట్టు ఇలా దోరగా కాల్చడం, ఉప్మా ఈ పెసరట్లకు జత కుదిరేలా ఇలా కాస్త వదులుగా చెయ్యడం నేను కదా నేర్పింది దుర్మార్గుడా. పొరపాటున కూడా నాకు మార్కులు వెయ్యవు కదా’’ అంది ముద్దుగా అలుగుతూ. ‘‘ అమ్మా తల్లీ భార్యామణీ అలగకు. నువ్వే నువ్వే నేర్పావు’’ అన్నాను తన చుబుకం పట్టుకుని. ‘‘అలా రా దారికి’’ అంటూ తను టిఫిన్‌ తిన్న పళ్లెం సింక్‌లో కడిగి స్టాండ్‌లో బోర్లించింది. ‘‘నేను కడుగుతాను కదా, నువ్వెందుకు కడిగావు’’ అన్నాను. ‘‘వద్దులే బాబూ, నువ్వు చేస్తున్న పని చాలు. మరీ నా ప్లేట్‌ కూడా కడగాలా’’ అంటూ చేత్తో నా క్రాఫ్‌ చెరిపేసింది. తను అంతే ఎంత అలసటగా ఉన్నా చాలా ఉత్సాహంగా ఉంటుంది. తన అలసటను అసలు బయటకు కనబడనీయదు. ‘‘అన్నట్టు అమ్మ వస్తా నంటూ మళ్లీ ఫోన్‌ చేసింది. నీతో మాట్లాడతానని నీకు ఫోన్‌ ఇవ్వమంది. నువ్వు బాత్‌ రూంలో ఉన్నావని చెప్పాను. మళ్లీ మరొక కట్టుకథేదో చెప్పి వచ్చే నెల వద్దువుగానీ అని బయలదేరకుండా ఆపేసాను. అదే నీకు ఫోన్‌ ఇచ్చుంటే నీ మీద ప్రశ్నల వర్షం కురిపించేది’’ అన్నాను తనని పొదివి పట్టుకుంటూ. ‘‘పాపం అత్తయ్యగారు ఏమనుకుంటారో, మనం కావాలనే ఆవిడ రాకుండా చేస్తున్నామని తెలుస్తే బాధపడతారేమో’’ అంది. ‘‘చూద్దాం, నీకు కొంచెం ఈ ప్రాజెక్ట్‌ అయిపోతే, ఇక ఒక పూట పని చేస్తే చాలు కదా. ఈ లోపల నాకు కూడా ఏదో ఒక ఉద్యోగం దొరకక పోదు. అసలు అనవసరంగా ఆ ఉద్యోగానికి రిజైన్‌ చేసానేమో అని అప్పుడప్పుడు అనిపిస్తోంది. ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోతే చాలు. అంతవరకూ మనకి ఈ తిప్పలు తప్పవు.’’ ‘‘అదేమిటి అలా అంటావు. ఎన్నాళ్లుగా చేస్తున్నా నీ పనికి, తెలివితేటలకు అక్కడ గుర్తింపు లేనపుడు ఎందుకు అక్కడ పని చెయ్యడం. ఒక ప్రొమోషనూ లేదు, జీతంలో ఒక్క రూపాయి కూడా పెరగలేదు. అయినా ఆ కంపెనీకి పెద్దగా ప్రాజెక్ట్స్‌ కూడా లేవుట, నా ఫ్రెండ్‌ చెప్పింది. కొంత మందిని తీసేద్దామనే ఆలోచనలో కూడా ఉన్నారుట. అందునా నీకు కానా జాబ్‌ సేటిస్‌ ఫాక్షన్‌ లేనప్పుడు అనవసరం. ఇప్పుడేమైంది నా జీతం సరిపోదా మనకి. నువ్వు కొన్నాళ్లేగా ఖాళీగా ఉన్నది, అయినా ఏ డెడ్‌ లైన్ల వెనుకా పరుగులు తీయక్కరలేకుండా మనసును ప్రశాంతంగా పెట్టుకో. అన్నట్టు మొన్నటి ఇంటర్య్వూ బాగా చేసానన్నావు కదా, ఎప్పుడు చెప్తానన్నారు?’’ ‘‘ఈ నెలాఖరుకల్లా చెప్తానన్నారు మరి చూద్దాం. ఆ ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ టైమ్‌లోనే నెట్‌ స్లో అవ్వాలా, కర్మ కాకపోతే. కానీ నేను కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఆ జాబ్‌ తప్పక వస్తుంది’’ ‘‘నువ్వేమీ ఆలోచించకుండా హాయిగా ఉండు. కాకపోతే అత్తయ్యగారు రాకుండా అడ్డుకోవడానికి ఎన్నాళ్లని ఇలా అబద్ధాలు చెప్పగలం’’

‘‘అవును అమ్మతో అబద్ధాలు చెప్తుంటే నాకు కూడా బాగా గిల్టీగా ఉంది. పోనీ వంటకి ఎవరినైనా కుదుర్చుకుందామంటే ఈ కరోనా భయమొకటి హడలుగొట్టేస్తోంది’’

‘‘అవును బాబోయ్‌, మొన్న నా ఒళ్లు కాస్తంత వెచ్చబడినందుకే హడలి చచ్చాను. ఇక బయట నుండి వచ్చిన వాళ్లు తిన్నగా ఉంటారా? ఏం తీసుకొస్తారో తెలీదు. సరిగ్గా మాస్క్‌ కూడా వాడరు. వంట చేస్తు న్నపుడు దగ్గినా తుమ్మినా మనకి అనుమానం. కానీ నీకే వంట పని, ఇంటి పని ఎక్కువైపోతోంది’’

‘‘నా సంగతి వదిలెయ్యి. నాకు ఇదంతా అలవాటై పోయింది. నువ్వే సరిగ్గా నిద్ర పోవట్లేదు. చూడు కళ్ల కింద కారీబ్యాగులు ఎలా వస్తున్నాయో’’ తన కళ్ల కింద మునివేళ్లతో రాస్తూ అన్నాను, ఎమ్మెస్‌ నారాయణను అనుకరిస్తూ.

‘‘ఏదో చిన్నగా కళ్ల కింద వలయాలు వస్తే క్యారీ బ్యాగ్‌లు అంటూ వేళాకోళం చేస్తావా?’’

‘‘ఊరికే అన్నాను కానీ, టైమ్‌ చూసుకున్నావా. నువ్వు మళ్లీ లాగిన్‌ అవాలిగా. నీకు టైముంటే ప్రైమ్‌లో ఏదైనా సినిమా చూద్దాం కాసేపు. నీ మైండ్‌ కూడా రిఫ్రెష్‌ అవుతుంది’’

కాసేపు సినిమా చూసి, సుష్మ గదిలోకి వెళ్లి లాప్‌టాప్‌ ఆన్‌ చేసింది. నేను మధ్యాహ్నం భోజనానికి ఇద్దరికీ ఇష్టమైన గుత్తివంకాయ కూర, సాంబార్‌ చేసే పనిలో పడ్డాను. ఏమైనా డౌట్లు వస్తే యూట్యూబ్‌లో వంటల వీడియోలు ఓపెన్‌ చేసి చూస్తూ చేస్తాను. నేను వంటలు అదరగొడుతున్నానని ఈ మధ్య సుష్మ తెగ మెచ్చేసుకుంటోంది.

మళ్లీ అమ్మ నా ఆలోచనలోకి నడచి వచ్చింది. అమ్మానాన్నా ఇద్దరూ ఉద్యోగస్తులు. అమ్మ అప్పటి రోజుల్లోనే పీజీ చేసింది. అమ్మానాన్నలకు బాగా లేటు వయసులో నేను పుట్టాను. నాయనమ్మ ఇంట్లో ఏ పనీ ముట్టుకునేది కాదు. దానితో అమ్మకు ఇంట్లో విపరీతమైన చాకిరీ, బయట ఆఫీసు పని కూడా తప్పేది కాదు. ఇద్దరూ ఉద్యోగాలు చెయ్యకపోతే, అత్తయ్యల పెళ్లిళ్లకు చేసిన అప్పులు తీర్చాలి కదా. ఇక నాన్న తను తన ఉద్యోగం తప్ప ఇంట్లో విషయాలేమీ పట్టించుకోవడమే ఆయనకు తెలీదు. ఆయన పొరపాటున కాఫీ గ్లాసు సింకులో వేసినా నాయనమ్మ పెద్ద రాద్దాంతం చేసేది. ‘మగాడంటే అలా దర్జాగా కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని రాజ్యం చేస్తూ పెత్తనం చెలాయించాలి’ ఇదీ నాయనమ్మ తత్వం. పాపం అమ్మ అన్నీ ఓపికగా చేసుకుంటూ చూసుకుంటూ ఉండేది. మరి అంత పాతకాలం భావాలతో ఉన్న నాయనమ్మ అమ్మను ఉద్యోగానికి ఎందుకు పంపేదో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. డబ్బుకున్న గొప్పదనం అదేనేమే, డబ్బు దగ్గరకు వచ్చేసరికి రూల్స్‌ అన్నీ గాల్లో కలిసిపోయి తుడిచిపెట్టుకుపోతాయి. లోకంతీరు కూడా ఇదే కదా..

పని చేసీ చేసీ అమ్మ శరీరం అరిగి అలసి పోయేది. కానీ అమ్మ పొరపాటున కూడా ఎవరినీ పల్లెత్తు మాట అనేది కాదు, సహాయం అడిగేది కాదు. తలనెప్పి, జ్వరం ఏది పోయి ఏది వచ్చినా ఆ పని చక్రం అవిశ్రాంతంగా తిరుగుతూనే ఉండేది. ఇక అత్తయ్యలు వస్తే అమ్మ పని పెనం మీద నుండి పొయ్యిలో పడేది. అత్తయ్యలు పుట్టింటికి వస్తే చాలు, కాలు కదిపేవారు కాదు. అమ్మ సెలవు పెట్టి వాళ్లకి నచ్చినవన్నీ వండిపెట్టేది. వాళ్లు కూడా నిర్మొహ మాటంగా అడిగి చేయించుకు తినేవారు. ‘‘పిచ్చిపిల్లలు, అక్కడ వాళ్లేగా చెయ్యి కాల్చుకోవడం. అత్తగారు ఒక్క పూటా ఉడకెయ్యదు కదా. పుట్టింటికి వచ్చినప్పుడే కాస్త విశ్రాంతి వాళ్లకి. ఏం తినాలన్నా మొహమాటం లేకుండా చెప్పండి, వండి పెడతాను’’ అంటూ నాయనమ్మ అత్తయ్యలను కనుక్కుని అమ్మకు రకరకాల వంటలు పురమాయించేది. ఇక పండుగలు వస్తే చాలు అత్తయ్యలు, మావయ్యలు వాళ్ల పిల్లలు, నాయనమ్మ చెల్లెలు, తాతగారి చెల్లెలు అందరూ ఇంటికి వచ్చేవారు. చాలా కోలాహలంగా ఉండేది ఇల్లు. అమ్మని మాత్రం వంటిల్లు కొంగుకు ముడేసు కునేది. నాకు చిన్నపుడు పండుగలొస్తే భలే సరదాగా ఉండేది కానీ కాస్త జ్ఞానం వచ్చాక మాత్రం అమ్మని చూసి కడుపు తరుక్కుపోయేది. అమ్మకు సాయం చేస్తుంటే ‘‘ఏమిట్రా ఇది. మగవెదవ్వి , అవతలకి పో. ఆడంగి పనులన్నీ చేస్తున్నావు’’ అంటూ నాయనమ్మ కసిరేది. నేను మాత్రం ఏదో ఒక రకంగా నాయనమ్మ చూడకుండా అమ్మకు సాయం చెయ్యాలని తాపత్రయపడేవాడిని. ఎందుకంటే ఆవిడ చూసిందంటే అమ్మకు గట్టిగా అక్షింతలు పడేవి. అమ్మకి పుట్టింటికి వెళ్లే యోగమూ లేదు. వెళ్లినా అక్కడా తండ్రికి వండి పెట్టడమే. ఎందుకంటే అమ్మమ్మ చిన్నప్పుడే పోయింది. అయినా నాయనమ్మ ఎప్పుడో గానీ అమ్మను పుట్టింటికి పంపేది కాదు. ‘‘నువ్వెళ్లిపోతే ఇక్కడ మా ముసలి ప్రాణాలకు, నీ మొగుడికి ఎంత ఇబ్బందో ఆలోచించు’’ అని సణుగుతూ దీర్ఘాలు తీసేది. అమ్మకి తన జీవితంలో విశ్రాంతి అన్న పదమే ఎక్కడా తారసపడలేదు.

నాకూ సుష్మకు పెళ్లై ఏడాదే అయింది. కొత్తలో అమ్మ వచ్చి మా కొత్త కాపురాన్ని చూసి వద్దన్నా వినకుండా అన్నీ సర్దిపెట్టి వెళ్లింది. నాయనమ్మా తాత గారూ పోయాక అత్తయ్యలు రావడం మానుకున్నారు. నాన్న పోయి రెండేళ్లై అమ్మ ఒంటరి అయింది. నా దగ్గరకు వచ్చెయ్యమన్నా రానని తను ఒక్కత్తే ఉంటుంది. ఇక కరోనా లాక్‌డౌన్లు రావడంతో అమ్మకు నా దగ్గరకు రావడం అసలు కుదరలేదు. ఇప్పుడు లాక్‌డౌన్లు ఎత్తేయడంతో అమ్మ ఇక్కడకు వచ్చి ఒక నాలుగు రోజులుంటానని అడుగుతోంది. నాకు కూడా అమ్మ వస్తే బావుండుననే ఉంది.

సుష్మకు ఆఫీసు ప్రాజెక్టు పని ఒత్తిడి వల్ల నేను ఇంట్లో అన్నీ చూసుకుంటూ వంట కూడా చెయ్యాల్సి వస్తోంది. ఇటువంటి సమయంలో అమ్మ కనుక వస్తే నేను ఇవన్నీ చెయ్యడం చూసి ఏమనుకుంటుంది. అసలే మగవాడు ఇలాగే ఉండాలనే ఒక గట్టి తీర్మానం ఉన్న కుటుంబంలో మమేకమై బ్రతికింది కదా. అందుకే ఏదో ఒకటి చెప్తూ అమ్మ ప్రయాణాన్ని వాయిదా వేస్తూ ఉన్నాను. అమ్మ చూస్తుండగా నేను ఇంటిపని చెయ్యడం, గదిలో లాప్‌టాప్‌ పట్టుకుని కూర్చోవడం సుష్మకు కూడా ఇబ్బంది కదా. అలాగని అమ్మ నెత్తిన పని వెయ్యలేను. ఇలా నా ఆలోచనలలో నేనుండగానే మధ్యాహ్నం రెండు కొట్టింది. భోజనానికి రమ్మని నేను సుష్మ గది తలుపు చిన్నగా తట్టాను. తను ఏదో మీటింగ్‌లో ఉన్నట్టుంది. ‘పది నిమిషాలు’ అంటూ వాట్సాప్‌లో మెసేజ్‌ పెట్టింది.

సుష్మ ప్రాజెక్ట్‌ మరొక పది పదిహేను రోజులు సాగేలా ఉంది. నా జాబ్‌ సంగతి ఇంకా గాలిలోనే ఉంది. ఒక రోజు పొద్దున్న టిఫిన్లపర్వం ముగిసాక ఫ్లాట్‌ బయట కూరలబ్బాయి తెచ్చిన కూరలు తీసుకెళ్లి వంటింట్లో వంటపనిలో హడావిడిగా ఉన్నాను. ఉన్నట్టుండి నా వెనుక ఎవరో ఉన్నట్టు గోడ మీద నీడ కనబడిరది. సుష్మ గదిలోంచి దేని కోసమో వచ్చిందనుకుని, ‘‘ఏం కావాలి? మరొకసారి కాఫీ తాగుతావా, కలపమంటావా?’’ అన్నాను ఉల్లిపాయలు చాకుతో గబగబా తరుగుతూ నీరు కారుతున్న కళ్లను ఒకవైపు మోచేత్తో తుడుచుకుంటూ. ‘‘కాఫీ వద్దు కానీ వేడివేడి మసాలా టీ ఇవ్వు తాగుతాను.’’ ఆ గొంతు విని ఉలికిపడి చూస్తే అమ్మ నన్ను భుజం మీద తడుతూ నవ్వుతోంది. ‘‘అమ్మా అదేమిటి చెప్పా పెట్టకుండా వచ్చావు? అయినా తలుపు లాక్‌ చేసుందిగా, తీసుకుని లోపలికి ఎలా వచ్చావు?’’ ప్రశ్నలు కురిపించాను. ‘‘నేను లిఫ్ట్‌ లోంచి బయటకు వస్తున్నపుడే నువ్వు కూరలు లోపలకు తీసుకెళ్లడం చూసాను. నువ్వు హడావిడిలో తలుపు వెయ్యడం మరచిపోయావు కన్నా’’ అంది పకపకా నవ్వుతూ. ‘‘నేను లోపలకు వచ్చి అప్పుడే ఐదు నిమిషాలైంది. నువ్వు వంటింట్లో నాట్యం చేస్తుంటే నిశ్శబ్దంగా గమనిస్తూ ఉన్నాను. ఉల్లిపాయల ఘాటుకి నువ్వు కళ్లు సగం మూసి ఉండడంతో నన్ను గమనించలేదు. ఫరవాలేదే నా కొడుకు బాగానే ప్రయోజకుడయ్యాడే. బాగా అనుభవమున్నట్టు వంటలు చేసేస్తున్నాడు’’ అంది మళ్లీ తనే. నేను దొంగతనం చేస్తూ దొరికి పోయినట్టు గతుక్కుమన్నాను. ‘‘అదీ నేనూ సుష్మా….. ఆఫీస్‌ ప్రాజెక్టు….’’ అంటూ నేను నంగినంగిగా మాట్లాడుతుంటే ‘‘ఏమిట్రా ఆ కంగారూ? నేనేమైనా దయ్యాన్నా భూతాన్నా అమ్మనిరా. ముందు వెళ్లి చేతులు కడుక్కుని రా పో. హాల్లో కూర్చుని స్థిమితంగా మాట్లాడుకుందాం’’ అంటూ అమ్మ హాల్లోకి వెళ్లి కూర్చుంది. నేను మసాలా టీ కలుపుకుని అమ్మ దగ్గరకు వెళ్లి కప్పు అందించాను. ‘‘నేను వస్తానంటే నువ్వు ఏదో కల్లబొల్లి కబుర్లు చెప్పి నన్ను రాకుండా ఆపేస్తున్నావు. అందుకే చెప్పాపెట్టకుండా బయలుదేరి వచ్చేసాను. ఇప్పుడు చెప్పు ఏమిటి ఏమైనా సమస్యలున్నాయా మీ ఇద్దరికీ’’ అని అడిగింది. ‘‘అయ్యో అదేమీ లేదమ్మా. నువ్వు గాబరాపడకు, మేము బాగానే ఉన్నాం’’ అంటూ నేను మేము ఆలోచించినది, నాకు ఉద్యోగం లేకపోవడం, సుష్మ ప్రాజెక్టు పని మొత్తం చెప్పాను.

‘‘అమ్మా తను ఆఫీసుపని చేస్తుంటే, నేను ఖాళీయే కదాని వంట చేస్తున్నాను లేకపోతే సుష్మే చేస్తుంది’’ అంటూ చెప్పబోతుంటే ‘‘ఒరేయ్‌ కన్నా, అమ్మను ఇంతేనా నువ్వర్థం చేసుకున్నది. భార్యాభర్తలిద్దరూ సమానమే, ఇద్దరూ సంసారనావని మునిగిపోకుండా సక్రమంగా నడిపితేనే, జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఇంటి పని చేస్తుంటే నేను ఏమైనా అనుకుంటానేమో లేక ఏదైనా అనేస్తానేమో అని ఆలోచించావా? మొత్తానికి భలే వాడివే’’ అంది. ‘‘అది కాదమ్మా, సుష్మ….’’ అంటూ నేను ఇంకేదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే నన్ను ఆపేసి ‘‘నాకు మాత్రం భలే గర్వంగా ఉంది. నా పెంపకం వృథా పోలేదు’’ అని అమ్మ అంటుంటే నేను నేల మీద చతికిలబడి కుర్చీలో కూర్చున్న అమ్మ ఒడిలో తల పెట్టుకున్నాను. ‘‘చాల్లే గర్వపడిపోకు కానీ పో వెళ్లి వంట చెయ్యి. నేను త్వరగా భోజనం చేసేస్తాను ఇవాళ. అందులోనూ అసలే నా కొడుకు వంట రుచి చూసే అదృష్టం కూడా కలిగింది మరి’’ అంది. ఆ మధ్యాహ్నం నేనూ అమ్మా సుష్మా కలిసి ఆనందంగా భోజనం చేసాం.

నా వంట తిని అమ్మ తెగ మెచ్చుకుంటుంటే సుష్మ మూతి ముడుచుకుని ‘‘నేను కూడా బాగానే వంట చేస్తాను అత్తయ్యగారూ’’ అంటుంటే మేమిద్దరమూ పడీపడీ నవ్వడమే నవ్వడం.

About Author

By editor

Twitter
YOUTUBE