– ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి

ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువుకు చిక్కకూడదని సుభాస్‌ ‌చంద్ర బోస్‌ ‌నిశ్చయించింది తన విషయంలో మాత్రమే. పోరాటం ఆపి లొంగిపొమ్మని రంగూన్‌ ‌నుంచి బయలుదేరటానికి ముందే ఆయన తన సైన్యానికి ఆజ్ఞ ఇచ్చాడు.

డివిజన్‌ ‌కమాండర్‌ ‌షానవాజ్‌ ‌ఖాన్‌కి 1945 మే 1న ఆ ఉత్తర్వు తెలిసే సరికి చివరి రంగంలో ఆఖరి ప్రతిఘటన కూడా విఫలమైంది. వెనుదిరిగిన సేనల్లో చివరి పార్టీ ఇరువాడి నది కుడిగట్టుకు చేరుకొన్నది. డివిజనల్‌ ‌హెడ్‌ ‌క్వార్టర్స్ ‌సీనియర్‌ ఆఫీసర్లు అందులో ఉన్నారు. ఇంకో ఐదుమైళ్లు నడిచి ప్రోమ్‌ ‌చేరాలని వారు అనుకుంటున్నారు. అదీ అడియాస అయింది. జపాన్‌ ‌వాళ్ళు ప్రోమ్‌ను కూడా ఖాళీ చేసి ఊరు తగలబెట్టి పోయారు. రంగూన్‌ ‌కూడా శత్రువుల వశమైందనీ, బర్మాలో ఉన్న ఐఎన్‌ఎ ‌దళాలు ఎక్కడివారక్కడ లొంగిపొమ్మని నేతాజీ ఆదేశించాడనీ సమాచారం అందింది. అందరూ హతాశులయ్యారు.

ఆ సమయాన నేతాజీ రంగూన్‌ ‌నుంచి సామూహికంగా తిరుగు ప్రయాణంలో మౌలమీన్‌లో బస చేసి ఉన్నాడని వదంతి. జబ్బుపడిన వారిని, గాయపడినవారిని ప్రోమ్‌ ‌గ్రామంలో ఒక కల్నల్‌, ఒక మేజర్‌ ‌సంరక్షణలో వదిలి, మిగిలిన బలగంతో వెళ్ళగలిగినంత ముందుకు వెళ్లి వీలయితే నేతాజీని చేరుకోవాలని షానవాజ్‌ ‌నిర్ణయించాడు. బ్రిటిష్‌ ‌వారు రాగానే సరెండర్‌ అయిపొమ్మని వారికి చెప్పాడు. దూరాన ఫిరంగుల మోతలు వినిపిస్తుండగా ఆ రాత్రి ఊరు వదిలి పెట్టాడు. మేమూ మీతో వస్తామని శరీర స్థితి సరిగాలేనివారు ప్రాధేయ పడ్డారు. ఇంఫాల్‌ ‌నుంచి తిరోగమనంలో రోగులు, క్షతగాత్రులు పడిన భయానక బాధలు పునరావృతం కావటం ఇష్టంలేక షానవాజ్‌ ‌దానికి ఒప్పుకోలేదు.

రంగూన్‌ ‌దారి పట్టిన పార్టీకి ఎక్కడ చూసినా జపాన్‌ ‌సైనికులు దొరికిన ప్రతి వాహనాన్నీ పట్టుకుని దౌడు తీయటం కనిపించింది. అడిగినా మనవారికి సహాయం చేసే స్థితిలో వారులేరు. శత్రువులకు చిక్కకుండా అడ్డదారుల్లో నడిచి మే 7న రంగూన్‌ ‌కు 30 మైళ్ళ దూరంలోకి చేరుకున్నారు. అటునుంచి తూర్పుకు మళ్లి సిట్టాంగ్‌ ‌నది దాటి మౌలమీన్‌ ‌కో, బాంగ్‌ ‌కాక్‌ ‌కో చేరాలని అనుకున్నారు. దట్టమైన అడవులగుండా వారంరోజులు నడిచి పెగూ సమీపానికి చేరారు. అప్పటికి పెగూ కూడా బ్రిటిషు వారికి స్వాధీనమయింది. ముందు, వెనుక, పక్కల ఎటూ తప్పించుకునే వీలు లేకుండా చక్రబంధంలో ఇరుక్కున్నట్టు అర్థమయింది. రేషన్లు ఎప్పుడో అయిపోయాయి. అమ్యూనిషన్లు దాదాపు ఖాళీ అయ్యాయి. వానలు మొదలయ్యాయి. ఇక ఎటూ వెళ్ళలేమని గ్రహించి 13 వతేదీ రాత్రి షానవాజ్‌ ‌ఖాన్‌ అం‌దరినీ సమావేశ పరచి యథార్థ స్థితి వివరించాడు. తరువాత ఏమైందీ అతడి మాటల్లోనే…

‘‘ఇక మనము ఏమీ చెయ్యలేము. బ్రిటిషువారికి లొంగిపోయి మనదేశం వెళ్లటం మినహా మనకు వేరే దారిలేదు.మన ఆఫీసర్లు మీ వెంట ఉండి దాని ఏర్పాట్లు చూస్తారు. వ్యక్తిగతంగా నా వరకూ బ్రిటిషు దళాలపై ఆత్మాహుతి దాడి చేసి ప్రాణాలు వదలాలని నిశ్చయించుకున్నాను. ఇష్టమున్నవారు కొద్దిమంది నా వెంట రావచ్చు’’ అని నేనంటే మొత్తం 300 మందీ ముందుకొచ్చారు. ఉన్న కొద్దిపాటి డబ్బుతో అంతమందికీ సరిపడా రేషన్లు కష్టం కనుక మహా ఐతే 50 మందిని నేను తీసుకు వెళ్ళగలనని నేను చెప్పాను. నా సూచనపై కల్నల్‌ ‌ధిల్లాన్‌ 300 ‌మందిలో నుంచి 50 మందిని ఆత్మాహుతి దళానికి ఎంపిక చేశాడు. ఇద్దరు ఆఫీసర్లను వెంట ఇచ్చి మిగిలినవారిని సరెండర్‌ అయ్యేందుకు కన్నీళ్ళతో సాగనంపాను. చిన్నపిల్లల్లా వెక్కివెక్కి ఏడుస్తూ చివరి సెల్యూట్‌ ‌చేసి సైనికులు నానుంచి సెలవు తీసుకున్నారు. ఆత్మాహుతి దళంలోకి తమను తీసుకోలేదన్న నిస్పృహతో ఆరుగురు సైనికులు ‘జైహింద్‌’ అం‌టూ తుపాకీతో కాల్చుకుని ఒకరి తరవాత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకెవరైనా అలాంటి పని చేస్తే నేనూ ఇక్కడే కాల్చుకుని చచ్చిపోతానని బెదిరించాక గానీ ఆత్మహత్యలు ఆగలేదు.

‘‘సరెండర్‌ ‌కావటానికి కల్నల్‌ ఎ.‌బి.సింగ్‌, ‌కల్నల్‌ ‌జాగిర్‌ ‌సింగ్‌ల నాయకత్వంలో అందరినీ పంపించాక మా ఆత్మాహుతి బృందం యోమా-పెగూ కొండలవైపు శత్రువును వెతుక్కుంటూ వెళ్లింది. కల్నల్‌ ‌జి.ఎస్‌. ‌ధిల్లాన్‌, ‌మేజర్‌ ‌మెహర్‌ ‌దాస్‌ ‌నాతోబాటు ఉన్నారు. ఎక్కడో ఒక బేస్‌ ఏర్పరచుకుని శత్రువుపై గెరిల్లా దాడులు చేయాలని మా సంకల్పం. దానికి స్థానికుల సహకారం అవసరం. మునుపటికీ ఇప్పటికీ పరిస్థితి పూర్తిగా మారింది. ఇప్పుడు గ్రామస్థులే బ్రిటిష్‌ ‌వారికి ఇన్ఫార్మర్లుగా మారి మమ్మల్ని పట్టివ్వటానికి వెనకాడటం లేదు. మా దగ్గర రేషన్లు లేవు. కడుపు నింపుకోవటానికి గ్రామాల మీద ఆధారపడ్డాము కాబట్టి వాటికి దూరంగా అడవుల్లో ఉండలేము. దగ్గరికి వెళితే పట్టుబడే ప్రమాదం. పైగా తెరపిలేని వానలు. శత్రువు ఆనుపానులు మాకు తెలియకపోగా పైపెచ్చు మా కదలికలే ఎప్పటికప్పుడు ఎల్లెడలా ఉన్న ఇన్ఫార్మర్ల ద్వారా శత్రువుకు తెలిసిపోతున్నాయి. మేము మెరపు దాడి చెయ్యకముందే అన్ని వైపుల నుంచీ శత్రువులు మమ్మల్ని చుట్టుముడుతున్నారు. అనేక విఫల యత్నాల తరువాత మా నిస్సహాయత అర్థమైంది.

‘‘అలా తిరుగుతూ తిరుగుతూ మే 17 రాత్రి 11 గంటలకు ఒక ఊరు సమీపానికి చేరాము. అ రాత్రికి ఆ ఊళ్ళో బస చేయవచ్చా అన్నది తెలుసుకోవటానికి మాలో ముగ్గురిని వెంట తీసుకుని ముందుగా నేను వెళ్లాను. ఊళ్లోకి అడుగు పెట్టగానే ‘తుమ్‌ ‌కౌన్‌ ‌హో’ అని గట్టిగా వినిపించింది. ఎవరో మనవాళ్ళే అయి ఉంటారన్న ఉద్దేశంతో ‘మేము ఐఎన్‌ఎ ‌సైనికులం ఆ రాత్రికి ఆశ్రయం కోసం వచ్చామ’ని దూరం నుంచే బదులిచ్చాను. ఐఎన్‌ఎ ‌పేరు వినగానే ‘రాపిడ్‌ ‌ఫైర్‌’ అని ఒక బ్రిటిష్‌ ఆఫీసరు అరిచాడు. 15 గజాల దూరంలో ఉన్న మా పైన రైఫిళ్లు, మెషిన్‌ ‌గన్లు గర్జించాయి. నా ఎదుట, రెండుపక్కల ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. నేను అదృష్టవశాత్తూ తప్పించుకుని వెనక్కి పరుగెత్తి మా వాళ్ళను తీసుకుని మళ్ళీ ముందుకు ఉరికాను. కాల్పుల్లో ఏడుగురిని చంపి శత్రువును వెళ్ళగొట్టగలిగాము. బ్రిటిషువారికి, ఐఎన్‌ఎకు నడుమ ఆఖరి సాయుధ ఘర్షణ బహుశా అదే.

‘‘మరునాడు ఉదయానికి మా పార్టీ బ్రిటిష్‌ ఆర్టిలరీ ప్రధాన దళం ఉన్న చోటికి 500 గజాల దూరంలోకి వెళ్ళగలిగింది. వారిమీద ఒకేసారి అందరం విరుచుకుపడి చచ్చిపోవాలని అనుకున్నాం. కాని మాకంటే ముందే బ్రిటిష్‌ ‌దళాలు మేము ఉన్న చోటును చుట్టుముట్టాయి. నేను మా వాళ్ళను పిలిచి మాట్లాడాను. ‘చావటానికి మనముందు మూడు మార్గాలున్నాయి. మొదటిది, అన్నిటికంటే సులువైనది మనల్ని మనమే కాల్చుకుని చనిపోవటం. అది పిరికిపని కాబట్టి నాకైతే ఇష్టం లేదు. రెండో పధ్ధతి శత్రువుల తుపాకులకు ఎదురెళ్ళి వీలైనంత మందిని చంపి మనం చచ్చిపోవటం. అది సైనికుడు కోరుకోదగ్గ వీర మరణం. మూడోది శత్రువుకు మనమే పట్టుబడటం. మనం దొరకగానే వారు మనల్ని కాల్చెయ్యవచ్చు. లేదా ఇండియా పట్టుకెళ్ళి కోర్ట్ ‌మార్షల్‌ ‌చేసి చంపేందుకూ ఆస్కారం ఉంది. ఒకవేళ అదే జరిగితే మన ఉద్యమం గురించి మన దేశవాసులకు తెలిపేందుకు అవకాశం దొరకొచ్చు. మన గడ్డ మీద మనం సమాధి అయ్యే అదృష్టమూ కలగవచ్చు. ఈ మూడింటిలో ఏది మంచిదో ఆలోచించండి’ అన్నాను. అప్పుడు కల్నల్‌ ‌జి.ఎస్‌. ‌ధిల్లాన్‌ ‌లేచి ‘మనమెందుకు కాల్చుకోవాలి? అదేదో బ్రిటిషు వాళ్ళనే చేయనిద్దాం. వాళ్ళు ఎలాంటివారో మన జనానికీ అర్థమై ప్రతీకారం చేయాలన్న కసి వారిలో పెరగవచ్చు. కాబట్టి మూడో పద్దతే మంచిది’ అన్నాడు. అందరూ అతడిని బలపరచారు.’’

[My Memories of INA And Its Netaji, Maj. Gen. Shahnawaj Khan, pp.192-195]

ఆ తరవాత జరిగినదాన్ని కల్నల్‌ ‌గురుబఁ్‌ ‌సింగ్‌ ‌ధిల్లాన్‌ ఇలా వర్ణించాడు:

‘‘షానవాజ్‌ ‌తనకు ఇష్టం లేకున్నా విధిలేక లొంగుబాటుకు ఒప్పుకున్నాడు. బ్రిటిష్‌ ‌కమాండర్‌ను కాంటాక్ట్ ‌చేయటానికి ఒక లెఫ్టినెంటును పంపించాం. అతడు మూడు గంటల తరవాత తిరిగొచ్చాడు. ఆయుధాలు పక్కన పెట్టి వేచి ఉండమన్నారని అతడు చెప్పాడు. మమ్మల్ని పట్టుకు పోయే వారు వచ్చేదాకా షానవాజ్‌ ‌మొహం గంటు పెట్టుకుని తడి నేల మీద వేళ్ళతో పిచ్చి గీతలు గీస్తూ కూచున్నాడు. శత్రువుకు అప్పగించటానికి ఇష్టపడక తన రివాల్వరును దగ్గరలోని వాగు నీళ్ళలో పడేశాడు. కాసేపటికి ఒక జీపు, దాని వెనక రెండు ట్రక్కులు వచ్చి మా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. జీపులో డ్రైవరు పక్కన కూచున్న ఇండియన్‌ ‌మేజర్‌ ‌చూడగానే షానవాజ్‌ ‌ను గుర్తుపట్టి సెల్యూట్‌ ‌చేశాడు. షానవాజ్‌ ‘‌జై హింద్‌’ అని ప్రత్యభివాదం చేసి నన్ను పరిచయం చేశాడు. డ్రైవరును, నన్ను వెనక కూచోమని , ఫ్రంట్‌ ‌సీటు షానవాజ్‌ ‌కిచ్చి మేజర్‌ ‌తాను జీపు డ్రైవ్‌ ‌చేశాడు. వెళ్లుతున్నంత సేపూ ఐఎన్‌ఎ ‌గురించి, నేతాజీ గురించి ఏవేవో అడుగుతూనే ఉన్నాడు.

కాసేపటికి ఒక క్రీడామైదానం వద్ద ఉన్న బ్రిగేడ్‌ ‌హెడ్‌ ‌క్వార్టర్స్‌కు తీసుకు వెళ్ళారు. మిలిటరీ పోలీస్‌ ‌కెప్టెన్‌కు మమ్మల్ని అప్పగించారు. అతడు ‘లైన్‌ ‌లో నిలబడండి’ అని ఆజ్ఞాపించాడు. అప్పటికి సాయంత్ర మయింది. వందల మంది సైనికులు అక్కడ చేరి మమ్మల్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. వారిలో చాలా మంది భారతీయులు. షానవాజ్‌ ఆ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. అందరూ తల ఎత్తి గర్వంగా నిలబడండి- అని మాకు చెప్పాడు. 20 అడుగులు ముందుకువేసి మా కేసి తిరిగి ‘ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌! ‌సావధాన్‌’ అని మొదలెట్టి అదేదో సెరిమోనియల్‌ ‌పెరేడ్‌ ‌లా మా చేత మాసిన బట్టలతోనే చక్కగా డ్రిల్‌ ‌చేయించాడు. హిందుస్తానీలో అతడిచ్చిన కమాండ్లు విని భారతీయ సైనికులు ముగ్ధులయ్యారు. ఆ రాత్రి మమ్మల్ని పెగూ జైల్లో ఉంచి మరునాడు ఇంటరాగేషన్‌ ‌సెంటర్‌కు పంపించారు. ఇంటరాగేషన్‌ ‌సమయంలో నా దగ్గర ఉన్న నేతాజీ ఫోటోను చూసి ముచ్చటపడి తనకు కావాలని అడిగి తీసుకున్నాడు.’’

[Quoted in Netaji: The Great Revolutionary, V.R. Adiraju , 397-399]

ఇంటరాగేషన్‌ 20 ‌రోజులు సాగింది. చాలా మంది ఇండియన్‌, ‌బ్రిటిష్‌ ఆఫీసర్లు మనవాళ్ళని ప్రశ్నించారు. ఆ సమయాన ఒక సీనియర్‌ ‌బ్రిటిష్‌ ఆఫీసర్‌ ‌దురుసుగా మాట్లాడితే షానవాజ్‌ ‌దానికి తగ్గట్టే జవాబులు చెప్పాడు ఇలా:

‘దేనికోసం మీరు పోరాడేది?’

‘మా స్వాతంత్య్రం కోసం’

‘అలాంటప్పుడు సరెండర్‌ ఎం‌దుకయ్యారు?’

‘అది మీరు అడగవలసిన ప్రశ్న కాదు. జవాబు మీకు బాగా తెలుసు. ఎందుకంటే సరెండర్‌ అవటంలో బ్రిటిషువాళ్ళు ఆరితేరారు. డన్కిర్క్‌లో సింగపూర్‌లో మీరు ఏమిచేశారో నేను చెప్పాలా?’

‘జపాన్‌ ‌వాళ్ళు నీకెంత జీతం ఇచ్చేవారు?’

‘వాళ్ళెందుకు ఇవ్వాలి? మాకు జీతం మా నేతాజీ ఇచ్చాడు’

‘మీ నేతాజీకి డబ్బెక్కడిది?’

‘మా భారత పౌరులు విరాళాలు ఇస్తే వచ్చింది.’

ఈ సంభాషణ ఇండియన్‌ ‌ట్రూప్స్ అం‌దరికీ తెలిసింది. అప్పటిదాకా ఐఎన్‌ఎ అనేది జపాన్‌ ‌తొత్తు అనుకుంటున్న వారికి ఆశ్చర్యం కలిగింది. కస్టడీలో ఉండగా చాలా మంది షానవాజ్‌, ‌ధిల్లాన్‌లను కలిసి ఐఎన్‌ఎ ‌గురించి వివరాలు అడిగి తెలుసు కున్నారు. ‘ఇంతకాలం బ్రిటిష్‌ ‌ప్రాపగాండాకు మోసపోయాం. నిజం తెలిసి ఉంటే మేమూ మీతో చేరేవాళ్ళం’ అని కొందరు బాధపడ్డారు.

తరవాత పెగూ నుంచి ఎస్కార్టుతో అందరినీ రంగూన్‌ ‌తీసుకువెళ్లారు. అటు నుంచి షానవాజ్‌ను విమానంలో కోలకతా పంపి బ్రిటిష్‌ ‌మిలిటరీ పొలీసులకు అప్పగించారు. వారు నలుగురు గూరా? ఆఫీసర్ల సాయుధ ఎస్కార్టుతో అతడిని దిల్లీకి పంపించారు. తమాషాగా సాగిన ఆ ప్రయాణం షానవాజ్‌ ‌మాటల్లో:

‘‘కోలకతా పోలీస్‌ ‌లాకప్‌ ‌నుంచి బయలుదేరే ముందు ఎస్కార్ట్ అధికారిని పిలిచి ‘మీరు తీసుకువెళుతున్న వ్యక్తి బ్రిటిష్‌ ‌సర్కారుకు శత్రువు. మహా ప్రమాద కారి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీ టామీ గన్‌ ‌లాక్కుని మిమ్మల్నే కాల్చి పారిపోగలడు. అతడు తప్పించుకుంటే మీకు శిక్ష తప్పదు. జాగ్రత్త. ఏమాత్రం అనుమానం వచ్చినా షూట్‌ ‌చెయ్యండి’ అని చెప్పారు. క్లోజ్డ్ ‌వాన్‌లో రైల్వే స్టేషనుకు తీసుకు వెళ్లి మా కోసం రిజర్వు చేసిన ఫస్ట్ ‌క్లాస్‌ ‌కంపార్టు మెంటులో ఎక్కించారు. ‘ప్రమాదకరమైన ఖైదీ. ఎవరూ లోపలికి రాకూడదు’ అని పెద్ద అక్షరాలతో కంపార్టుమెంటు బయట బోర్డు పెట్టారు. గూరా? సుబేదారు తనకిచ్చిన ఆదేశాలను అక్షరాలా పాటించాడు. నేను నా బెర్త్ ‌మీద నడుము వాల్చగానే ముగ్గురు గార్డులను టామీ గన్లను ఎక్కుపెట్టించి నా పక్కన నిలబెట్టాడు. కాలు, చెయ్యి ఏ మాత్రం కదిలించినా వాళ్ళు ఎలర్ట్ అయ్యేవారు. కంగారులో ఎక్కడ కాల్చేస్తారోనని భయపడ్డాను. ఆ రోజు పగలు, రాత్రి మొత్తం అలాగే గడిచింది. ఒక్క మాట మాట్లాడకుండా నన్ను అనుక్షణం కనిపెట్టి ఉన్న తరువాత మరునాడు ఉదయానికి నేనూ మామూలు మానవుడినేనని సుబేదార్‌ ‌గ్రహించాడు. మెల్లిగా నా దగ్గరికి వచ్చి నేను ఎవరు, చేసిన నేరం ఏమిటి అని అడిగాడు. నేను ఇండియన్‌ ఆర్మీలో ఆఫీసరునని, బ్రిటిషు సర్కారు పక్షాన పోరాడటానికి నేను మలయా వెళ్లానని, ఐఎన్‌ఎ ఏర్పడ్డాక అందులో చేరి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నానని చెప్పాను.

‘‘అతడికి అర్థం కాలేదు. జీతం బాగా వచ్చే ఆఫీసరు అయిఉండీ బ్రిటిషు సర్కారుకు వ్యతిరేకంగా ఎందుకు పోరాడారు, దాని వెనుక కారణాలేమిటి -అని అడిగాడు. అన్నట్టు ఆ ఆఫీసరు చిన్‌ ‌హిల్స్‌లో మా యూనిటుపై యుద్ధం చేసిన సైన్యంలో ఉన్నాడు. ఐఎన్‌ఎ ‌గురించి అతడు విన్నది వేరు. అతడికి అర్థం కావటానికి నేను ఒక ప్రశ్న వేశాను. ‘మామూలుగా యుద్ధంలో ఇండియన్‌, ‌గూరా? ఆఫీసర్లు ముందు వరసలో ఉంటారు. టామీలు వారి వెనకెక్కడో ఉంటారు-నిజమేనా?’ అని. అతడు ఔనన్నాడు. మరి మీ గూర్ఖాలు, టామీలు సమానంగా జీతాలు పొందుతున్నారా అని నేను అడిగాను. లేదు-మా కంటే టామీల జీతాలు నాలుగు రెట్లు అని అతడి జవాబు. ‘శత్రువుల బులెట్లు ఎదుర్కొనే టప్పుడేమో మీరు ముందు, జీతాల్లోనేమో వారికంటే అంత వెనకా? ఎందుకలా?’ అని నేను అడిగితే అతడు దీర్ఘంగా ఆలోచించి ‘ఔను సాహెబ్‌! అది అన్యాయం’ అన్నాడు. జీతాల్లో, అలవెన్సుల్లో, పెన్షన్లలో, రేషన్లలో ఇండియన్‌ ‌సైనికులకు జరుగుతున్న అన్యాయాన్ని తొలగించటానికే ఐఎన్‌ఎ ‌బ్రిటిషు సర్కారుపై పోరాటానికి దిగిందని నేను చెప్పాను. మళ్ళీ చాలా సేపు ఆలోచించి ‘అదే నిజమైతే ఐఎన్‌ఎ ‌చేసింది మంచిపని’ అని అతడు మెచ్చుకున్నాడు.

‘‘మీ కమాండర్‌ ఇన్‌ ‌చీఫ్‌ ఎవరు అన్నది అతడి తరవాతి ప్రశ్న. నేతాజీ ఫోటో చూపిస్తే ఆపేక్షతో చూసి ‘అయితే ఒక ఇండియన్‌ ‌కూడా కమాండర్‌ ఇన్‌ ‌చీఫ్‌ ‌కాగలడన్నమాట’ అన్నాడు. అప్పటినుంచి అతడి వైఖరి మారింది. తుపాకులు దించమని తన వాళ్లను ఆజ్ఞాపించి, కిందటి రోజు తన ప్రవర్తనకు క్షమాపణ చెప్పాడు. ఐఎన్‌ఎ ‌గురించి మొత్తంగా భారతీయుల, ముఖ్యంగా భారత సైనికుల మనసులను ఎంతగా పాయిజన్‌ ‌చేశారు, వాస్తవ మేమిటో తెలియగానే తప్పుడు ప్రాపగాండా ప్రభావం ఎలా పటాపంచలు అవుతుంది అన్నదానికి పై సంభాషణ ఒక ఉదాహరణ. 1945జూన్‌ 14‌న దిల్లీ చేరగానే నన్ను ఎకాఎకి ఎర్రకోటకు తీసుకు వెళ్ళారు.’’

[My Memories of INA And Its Netaji, Maj. Gen. Shahnawaj Khan, pp.195-198]

మొత్తం 23,266 మంది ఐఎన్‌ఎ ‌సైనికులు బర్మా, మలయా, సింగపూర్‌, ‌థాయిలాండ్‌లలో బ్రిటిషు వారికి పట్టుబడ్డారు. 1945 మే – అక్టోబర్‌ ‌మధ్య వారిలో పదివేల మందిని రంగూన్‌ ‌నుంచి ఇండియాకు తరలించి ఎర్రకోట సహా అనేక చెరసాలల్లో ఉంచారు. ఆగస్టులో యుద్ధం ముగిశాక జపాన్‌ ‌చెరలో రెండేళ్ళు యుద్ధ ఖైదీలుగా నరక యాతనలు పడి విడుదల అయిన బ్రిటిష్‌ ఆర్మీ సైనికులను స్వదేశం చేర్చటానికి ఫస్ట్ ‌ప్రయారిటీ ఇచ్చి అందు బాటులో ఉన్న నౌకలు, విమానాలు అన్నీ వారి రవాణాకు ప్రత్యేకించారు. దాంతో ఐఎన్‌ఎ ‌ఖైదీల తరలింపు ఆలస్యమయింది. చివరి ఖైదీ ఆగ్నేయాసియా వదిలి వెళ్ళేసరికి 1946 మార్చి వచ్చింది. ఇండియన్‌ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ‌ఫోర్స్‌లకు బర్మాలో మొదటిసారి ఐఎన్‌ఎతో సంపర్కం ఏర్పడి అప్పటికి దాదాపు సంవత్సరం అయింది. మూడేళ్ళ కిందటి వరకూ ఒకే మిలిటరీలో కలిసి పని చేసిన వారు కనుక తిరిగి కలుసుకునే సరికి ఖైదీలకూ, వారిని ఖైదు చేసిన వారికి నడుమ ఆత్మీయ బంధం ఎంత వద్దనుకున్నా పెనవేసుకున్నది.

ఇండియాలోనూ అదే పరిస్థితి. అంతవరకూ బ్రిటిష్‌ ‌ప్రాపగాండా నమ్మి ఐఎన్‌ఎ ‌జపాన్‌ ‌కీలు బొమ్మ అనుకున్న సైనికులకు పూర్వ సహచరుల ద్వారా నిజం తెలిశాక ఐఎన్‌ఎ అం‌టే ఇష్టం, నేతాజీ మీద ఆరాధనాభావం కలిగాయి. తాము ఊహించని ఆ ‘వైపరీత్యం’ తమ సామ్రాజ్యానికి తెచ్చిపెట్టనున్న భూకంపం మెల్లిమెల్లిగా కాని తెల్లదొరల బుర్రకెక్కలేదు.

వారి దృష్టిలో జాతీయ సైనికులు కనికరించరాని ద్రోహులు. న్యాయాలు, చట్టాలు పాటించనక్కరలేని నికృష్టులు. ఆ కావరంతో తెల్లవాళ్ళు 1944 జూన్‌ ‌నుంచీ 1945 ఏప్రిల్‌ ‌వరకూ యుద్ధంలో తమకు చిక్కిన ఐఎన్‌ఎ ‌వాడినల్లా కాల్చి చంపారు. ఇప్పుడు అది సాధ్యపడదు. ఒకేసారి వేల మంది లొంగిపోయి నప్పుడు అంతమందినీ వరసపెట్టి కాల్చెయ్యటం కుదరదు. అంతర్జాతీయ న్యాయ ఒడంబడికల ప్రకారం యుద్ధ ఖైదీలమీద విచారణ జరపక తప్పదు.

పట్టుబడిన వారిని వైట్‌, ‌గ్రే, బ్లాక్‌ అని మూడు కేటగిరీలుగా విడగొట్టారు. కాలం అనుకూలించగానే తిరిగి చేరే ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో సైన్యం విడిచి ఐఎన్‌ఎలో చేరిన విధేయులు ‘వైట్‌’. ‌వారిని సర్వీసులోకి తీసుకుని తిరిగి జీతం బకాయిలు, అలవెన్సులు అన్నీ చెల్లిస్తారు. తప్పుడు ప్రచారానికి మోసపోయి అమాయకంగా ఐఎన్‌ఎ ‌పంచన చేరిన వారు ‘గ్రే’. వారిని సర్వీసు నుంచి డిస్మిస్‌ ‌చేస్తే సరి. ఇక బుద్ధిపూర్వకంగా బ్రిటిషు సర్కారుపై తిరగబడిన వారు ‘‘బ్లాక్‌’. ‌మళ్ళీ ఇంకొకరు అటువంటి నేరానికి సాహసించలేనంత కఠినాతికఠినంగా ఆ ద్రోహులను శిక్షించాలి. దానికి ఊరకే కోర్ట్ ‌మార్షల్‌ ‌చేసి శిక్షిస్తే సరిపోదు. బహిరంగ విచారణ జరిపి వారు చేసింది ఎటువంటి పాపిష్టి పనో అందరూ ఏవగించుకునేలా పబ్లిగ్గా చాటాలి. అటువంటి నీచానికి పాల్పడితే ఎవరి గతి అయినా ఏమవు తుందో కూడా బహిరంగంగా చూపించి అలగా జనాలను ఠారెట్టించాలి. ఇంగ్లిషువారి తడాఖా ఏమిటో చూపించాలి.

 ప్లాను బాగానే వేశారు. కాని దొరవార్లు కలనైనా ఊహించని రీతిలో కథ అడ్డం తిరిగింది.

 మిగతా వచ్చేవారం

About Author

By editor

Twitter
YOUTUBE