‘గతులన్నీ ఖిలమైన కలియుగమందును
గతి ఈతడే చూపె ఘన గురుదైవము’
అని కీర్తించారు తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ మాటలాడే దైవమే రామానుజాచార్యులు, విశిష్టాద్వైత సిద్ధాంత ప్రధాన ప్రచారకర్త. ‘నన్ను నడిపించే విష్ణువే నిన్నూ, సమస్త జీవజాలాన్ని నడిపిస్తున్నాడు. అణువణువులోనూ విష్ణువు ఉన్నాడు. అందుకే జగత్తు వైష్ణవం అయింది. సర్వం విష్ణుమయం జగత్. భగవంతుడి దృష్టిలో అంతా సమానమే. మనిషికి గుణమే కొలమానం తప్ప ఇతర అంశాలు కావు’ అంటూ సమతావాదాన్ని చాటారు ఆధ్యాత్మిక నాయకులు భగవద్రామానుజులు.
‘ప్రథమో అనంత రూపశ్చ ద్వితీయో లక్ష్మణస్థతా
తృతీయో బలరామశ్చ కలౌ రామానుజో ముని:’…
త్రేత,ద్వాపరయుగాలలో లక్ష్మణ, బలరాములుగా అవతరించిన ఆదిశేషువు ఈ యుగంలో రామానుజ యతిగా ఆవిర్భవించారని ఆరాధకుల విశ్వాసం. తమిళనాడులోని ‘భూతపురి’ అనే శ్రీపెరంబూ దురులో ఆసూరి కేశవాచార్యులు, కాంతిమతి దంపతులకు తిరువల్లిక్కేణి (చెన్నై) పార్థసారథిస్వామి వరప్రసాదితంగా జన్మించిన రామానుజులు విశిష్ట ఆచార్యులుగా, ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. సమసమాజ స్థాపన కోసం పరితపిస్తూ ఆయన అహరహం పాటుపడ్డారు.
కొందరికే పరిమితమైన మంత్రరాజం అందరి సొంతం కావాలనుకున్న ‘మానవతా హక్కుల మూర్తి’. అనుకున్నది సాధించడమే తప్ప వెనకడుగు తెలియని ధీశాలి. తిరుమంత్రంలోని ‘సర్వధర్మాన్ పరిత్యజ్య..’ అనే చరమ శ్లోకం అర్థం తెలుసుకునేందుకు వెళ్లిన ఆయనను గురువు తిరుక్కోటియూర్ నంబి (గోష్ఠ్ఠిపూర్ణులు) శ్రీరంగం నుంచి 125 మైళ్ల దూరాన గల తిరుక్కోటియూర్‌కు పద్దెనిమిది మార్లు తిప్పుకున్నా విసుగు విరామం లేకపోగా మరింత పట్టుదల పెరిగింది. ఎన్నో ప్రతిజ్ఞలు చేసి మంత్రార్థాన్ని సాధించారు. అయితే ‘తిరుమంత్రం అసాధారణ మైనది. విన్నంతనే విష్ణుపథం చేర్చే ఇది అన్యుల చెవిన పడకూడడు. అందుకు భిన్నంగా, మంత్రాన్ని వెల్లడిస్తే రౌరవాది నరకాలకు పోతావు’ అని గురువు హెచ్చరించారు. మంతప్రాప్తి ఎంత శ్రమతో కూడినదో అవగతం కావడంతో, తనలాంటి వారికే ఇలాంటి అనుభవం ఎదురైతే సామాన్యుడి పరిస్థితేమిటనే ఆలోచనలో పడ్డారు రామానుజులు. ‘అందరివాడైన నారాయణుడు కొందరికే పరిమితమా? వ్యక్తిగత స్వార్థం కన్నా సమాజ శ్రేయస్సు మిన్న. సమాజ హితం కోరే క్రమంలో నాకు కీడు కలిగినా, నేను నరకానికి పోయినా ఫర్వాలేదు. జనుల తరిస్తారు’ అని తీర్మానించుకొని మూఢత్వానికి తెరదించి ఆధ్యాత్మిక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. శ్రీసౌమ్యనారాయణ పెరుమాళ్ కోవెల పైభాగం నుంచి తిరుమంత్రార్థాన్ని ఉద్ఘోషించారు. ఆయన ధర్మదృక్పథం, అంకితభావం, సమాజ హితానికి ముగ్ధుడైన గురువు గోష్ఠిపూర్ణులు ‘నాకంటే, చాలామంది కంటే గొప్పవాడివి’ (ఎమ్బెరు మానార్) అని అక్కున చేర్చుకోవడమే కాదు తన కుమారుడి భవితను శిష్యునికి అప్పగించారు.
ఫిబ్రవరి 5న ఆవిష్కరణ
హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ శ్రీరామ నగరంలో ‘సమతామూర్తి’ భగవద్రామానుజుల విగ్రహావిష్కరణకు సుమూహూర్తం నిర్ణయమైంది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి పన్నెండురోజుల పాటు జరిగే రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా 5వ తేదీన ‘సమతామూర్తి’ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తారు.
మహాపూర్ణాహుతి (14వ తేదీన) కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరవుతారు. ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు అమిత్‌షా, నితిన్ గడ్కరీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సహా వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు హాజరవుతారు.
‘సమతామూర్తి’ విగ్రహం మూడంచెలుగా నిర్మితమైంది. మొదటి అంచెలో రామానుజులు ఆశీనులైన 54 అడుగుల ఎత్తు పీఠాన్ని భద్రవేది అంటారు. రెండవ అంతస్తుగా భద్రవేదిపై 27 అడుగుల ఎత్తు, 108 అడుగుల వెడల్పుతో పద్మపీఠం, దాని చుట్టూ 36 ఏనుగుల విగ్రహాలను అమర్చారు. వాటి తొండాల నుంచి జలాలు జాలువారు తాయి. మూడవ అంతస్తులో పద్మాకార వృత్తంపై రామానుజాచార్యుల మూర్తి కొలువుదీరింది. దీని చుట్టూ నిర్మించిన 108 దివ్య క్షేత్రాల నమూనా ఆలయాలలో ఆయా దేవతామూర్తులు దర్శనమిస్తారు.
రామానుజాచార్యుల సమాజసేవ గురించి భావితరాలకు తెలియచెప్పేలా ‘సమతామూర్తి’ పేరిట 216 అడుగుల ఎత్తుతో ఈ భారీ విగ్రహం రూపొందించి నట్లు శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి వెల్లడించారు. విగ్రహావిష్కరణలో భాగంగా 120 యాగశాలల్లోని 1,035 కుండాలలో హోమం నిర్వహిస్తారు.
ఇందుకోసం రెండు లక్షల కిలోల దేశవాళీ ఆవు నెయ్యి సేకరించారు.ఈ యాగధూమం వల్ల వాతావరణంలోని ప్రమాదకరమైన వైరస్ అంతరిస్తుందని విశ్వసిస్తున్నట్టు జీయర్ స్వామి వెల్లడించారు. ఐదు వేల మంది రుత్త్విక్కులు హోమాల్లో, పారాయణంలో, పరిచారకంలో పాల్గొంటారు. పండితులు రోజుకు కోటి సార్లు అష్టాక్షరి మహామంత్రాన్ని జపిస్తారు.
సంస్కరణ పథికుడు
రామానుజులు వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించారు. సమాజంలోని వివక్షను ప్రశ్నించి, సమతా సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. భగవంతుడి దృష్టిలో అంతా సమానమని, గుణమే మనిషి కొలమానమన్నారు. తాను అందరివాడినని భగవానుడే భగవద్గీతలో బోధించినప్పుడు మానవుల మధ్య తేడాలు మన్నింపరానివనే భావనతో ఆధ్యాత్మిక సంస్కరణలు చేపట్టారు. సమాజంలోని అన్ని వర్గాల వారిని ఆలయసేవల్లో భాగస్వాములను చేశారు. పల్లకీ• మోయడం, వింజామరలు వీయడం, దివిటీలు పట్టడం లాంటి సేవలు కల్పించారు. ఆయన చొరవ కొందరు ఛాందసవాదుల్లో అక్కసు రేపి అంతమొందించే ప్రయత్నాలకు దారి తీసింది. అయినా వెరవలేదు. ఏ విషయాన్ని అయినా గుడ్డిగా నమ్మవలసిన పనిలేదనీ, తర్కానికి నిలబడితేనే ఆహ్వానించాలనీ బోధించారు.
ఆధ్యాత్మిక సమానత్వం, జనహితం కోసం చేసే క్రియల వల్ల వ్యక్తిగతంగా నష్టం కలిగించినా వెరవవలసిన అవసరంలేదన్న భావన శ్రీరంగంలోని విశిష్టాద్వైత ప్రవక్తలో ఒకరు, ఆచార్య ప్రముఖులు యామునాచార్యుల వారిని ఆకర్షించింది. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చగల సమర్థులని విశ్వాసం కలిగి తమ దగ్గరకు రావలసిందిగా వర్తమానం పంపారు. అయితే రామానుజులు శ్రీరంగం చేరేసరికి యామునాచార్యులు దేహత్యాగం చేశారు. అంతిమ సంస్కారానికి సిద్ధంగా ఉన్న ఆయన దేహం నుంచి రామానుజులకు సందేశం అందింది. ఆ స్ఫూర్తితో అనితరసాధ్యమైన రీతిలో ఆయన ఆధ్యాత్మిక ప్రస్థానం కొనసాగింది. శ్రీభాష్యం, గీతాభాష్యం, నిత్యగ్రంథం, వేదాంత దీపిక, వేదాంతసారం, వేదార్థ సంగ్రహం, వైకుంఠ గద్యం, శ్రీరంగ గద్యం, శరణాగతి గద్యం తదితర రచనలతో విశిష్టాద్వైతాన్ని విశిష్ట స్థానానికి తీసుకువెళ్లారు. శ్రీరంగంలో వెలయించిన గద్యత్రయానికి (శరణా గతి, శ్రీరంగ, వైకుంఠ) సంతసించిన రంగనాథ పెరుమాళ్ వరం అనుగ్రహించబోగా, ‘నేను శరణాగతి చేశాను కనుక నా సంబంధీకులందరికీ పరమపదాన్ని అనుగ్రహించండి’ అన్న విన్నపం సర్వమానవ హితానికి తార్కాణం.
ఆదర్శ ఆచార్యులు
‘అనంతుడే మీకు పుత్రుడిగా అవతరిస్తాడు’ అన్న పార్థసారథిస్వామి వరప్రసాది అనంతర కాలంలో తిరుమలేశుడికి ఆచార్యత్వం వహించారు. అందుకే తిరుమల తిరుక్కురం గుడిలోనే ఉపదేశ ముద్రలో ఉంటారు. మిగిలిన అన్ని చోట్ల అంజలి ముద్రలో దర్శనమిస్తారు. అన్ని విషయాలను సానుకూల దృక్పథంతో వీక్షించిన రామానుజులు భగవత్ భాగవతాచార్య, భాగవతోత్తములను దూషించిడాన్ని, తక్కువ చేయడాన్ని సహించలేరు. అలా వేదవాక్యాలను విపరీతార్థంలో వ్యాఖ్యానించిన గురువు యాదవ ప్రకాశకులతోనే విభేదించారు. అభిప్రాయభేదాలు పెరిగి, శిష్యుని ప్రతిభా సంపత్తి గురువుకు కంటగింపుగా మారింది. ఈర్ష్యా భావం రామానుజులకు హాని కలిగించే స్థాయికి చేరింది. ఆ చేదు అనుభవంతోనే కాబోలు, ఎందరో శిష్యులను తీర్చిదిద్ది ‘ఆదర్శ ఆచార్యులు’గా మన్ననలు అందుకున్నారు. రామానుజులు గురువుకే గురువు. ఆయన గోష్ఠి నిర్వహించినప్పుడు తమ ఆచార్యులు స్వామి పెరియనంబి సాష్టాంగ నమస్కారం చేమడమే అందుకు నిదర్శనం. ‘శ్రీరామ, శ్రీకృష్ణులకు విశ్వా మిత్ర, సాందీపుల మాదిరిగా నేను రామానుజులకు ఆచార్యుడనే. కానీ వారికి తెలియకకాదు. నాకు అంతా తెలిసీకాదు’ అనడంలోనే రామానుజుల ఉన్నతి విదితమవుతుంది. తన ‘గురు’ ఔన్నతీ సంప్రదాయాన్నే ఆయనా పాటించినట్లున్నారు. రామానుజులే అందరికి మోక్షం చూపగలరని భావించే సందర్భంలో, తనకు శిష్య సంబంధం వల్ల మోక్షం ఉందని కాషాయ వస్త్రాన్ని ఎగురువేసి ఆనందాన్ని వ్యక్తీకరించిన ‘శిష్య పక్షపతి’. ఏడు వందల మంది జీయర్లు, 12 వేల మంది భాగవతోత్త ములు, వేలాదిగా మహిళలు ఆయనను ఆశ్రయించి శిష్యులయ్యారని చరిత్ర చెబుతోంది. ‘పూర్యాచార్యులు తమకు గల అధికారాన్ని బట్టి కొందరినే తరింప చేయగా, భగవద్రామానుజులు అనే నది అందరిని తరింపచేసినది’ అని శ్రీమన్నాథముని స్వామి వ్యాఖ్యానించారు. ‘అంత్యజుల నుంచి బ్రాహ్మణుల వరకు అందరికి భక్తి మార్గం సమానమేనని ప్రబోధించిన ఆధ్యాత్మిక సారథి భగవద్రామానుజులు’ అని స్వామి వివేకానంద, ‘ధార్మికంగా, సామాజికంగా విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టిన మహాస్రష్ట. ధైర్యంతో కూడిన ప్రేమ, వెన్నుచూపని నైతిక యుద్ధ కౌశల్యం, ఎంచరానంత బలమైన ఆత్మబలం, భావితరాలపై ప్రేమ లాంటి విశేష గుణాలు ఆయన సొంతం’ అని సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు, ‘ఒక వర్గానికి పరిమితమైన మోక్షద్వారాలను సర్వులకూ తెరిచిన సమతామూర్తి రామానుజులు’ అని తమిళ ప్రసిద్ధ కవి భారతీదాసన్ శ్లాఘించారు.
‘కేవలం జ్ఞానార్జనతోనే సరిపోదు. ధర్మాను ష్ఠానంతోనే జ్ఞానం సార్థకమవుతుంది. సామాజిక బాధ్యతలు గుర్తెరిగి న్యాయదృష్టితో కర్మాచరణ చేయడంతోనే జీవితం సార్థకమవుతుంది’అని ఉద్బోధించిన రామానుజులు, తాము ప్రారంభించిన ‘జ్ఞాన ఉద్యమం’ కొనసాగింపు బాధ్యతను 74 మంది శిష్యులకు అప్పగించారు.శిష్యప్రశిష్య పరంపరంతో భగవద్రామానుజ ఆశయం కొనసాగుతూనే ఉంది, ఉంటుంది.
‘రామానుజాచార్య దివ్యాజ్ఞా వర్థతాం అభివర్థతాం’
– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్ జర్నలిస్ట్