– డా।। చింతకింది శ్రీనివాసరావు
జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన
‘‘కథ అయిపోవొచ్చింది. ఇక్కడే అసలు విషయ మంతా ఉంది. పడుక్కోకు. విను. బాగుంటుంది.’’ బిడ్డ తలరాస్తూ చెప్పింది.
‘‘లేదమ్మా! వినలేను. నిద్ర పారొస్తోంది. వాలి పోతాను. మిగిలిన కథ ఏదో రేపు నువ్వే చెప్పు. ఆలకిస్తాను.’’ అంటూనే జోగిపోతూ అమ్మ ఒళ్లోకి దూరిపోయింది. వెనువెంటనే నిద్దరలోకి జారి పోయింది.
‘సరేలే పడుక్కోనీ.’ రేక అనుకుంటుండగానే కోలన్న నోరు తెరిచి,
‘‘పిల్లని ఇంటికి పట్టుకుపోనా. నువ్వు కథంతా అయ్యాక మెల్లగా రా. నేనిప్పటికి చాలా సార్లు విన్నానులే.’’ అన్నాడు భార్యతో.
‘‘వద్దు. వద్దు. ఇంకెంతసేపు. అందరం కలిసే వెళదాం.’’ పెనిమిటికి రేకమ్మ బదులిస్తుండగానే లెంకలు వేదిక ఎక్కారు. గొంతు సవరించారు. పునఃప్రారంభించారు. చకచకా చెప్పుకుంటూ వెళ్లారు. అనుకున్న సమయానికే కథావివరణ పూర్తిచేశారు.
‘శరణు శరణు దుర్గాండ్లమ్మలు – మీ చరణాలు తప్పలేము
మీ చరణాలు తప్పినగాని – మీ కరుణాలు తప్పలేము
మీలాంటి కాలమురాగ – తుమ్మెదీరో మిమ్ము తలచి పాడుతాము
ఇంటి ఇలవేలుపులార – తుమ్మెదీరో మాయం దున సాయముండుడు
శరణుబాబు దేశిరాజులు – తుమ్మెదీరో శరణుబాబు శరణుబాబు..’
మంగళగీతమూ పాడేశారు. అప్పుడిక తూర్పు రేఖలు ప్రసరిస్తుండగా మండివలసజనం ఎవరి ఇళ్లకు వారు మెల్లమెల్లగా చేరిపోయారు.
*******
మధ్యాహ్నం పన్నెండు గంటల ఎడగీత వేళకు గానీ నిద్రలేవలేదు గంగమ్మ. కథాగానం నుంచి వస్తూనే గ్రామంలో దండోరా బాధ్యత ఏదో ఉంటే తలారి హోదాలో కోలన్న వెళ్లిపోయాడు. కట్టెలు తేవడానికి కొండకు పోయింది రేక. గంగు లేచే సమయానికి కాస్తంత ముందుగానే తల్లిదండ్రులు ఇల్లు చేరారు. ఆకలి దహిస్తుండటంతో రాగిరొట్టె తిన్నారు. అంబలి తాగి కూర్చున్నారు. అప్పుడే కళ్లు నులుము కుంటూ లేచిన గంగు పళ్లు కడుక్కుని అంబలికి ఎగబడింది. ఆ పిల్ల వెన్ను రాస్తూనే దిప్ప అందిం చింది తల్లి. గుటుకూ గుటుకూమని గంగు అంబలి తాగుతుంటే మహదానందపడ్డాడు కోలడు.
‘‘చూడవే! నా తల్లి చేతుల్లో దిప్ప ఉంటే ఆ దిప్పకే కొత్త అందం వచ్చింది. జాకరమ్మ చేతిలో పూర్ణకుంభం ఉన్నట్టే ఉంది కదే!’’ సంబరపడుతూ పలికాడు.
‘‘చాల్లే గొప్పలు. నువ్వూ నీ కూతురూ పెద్ద టెంకలు.’’ లేని కోపాన్ని ప్రదర్శించింది రేక.
ఆకలితీరిన గంగు దిప్ప కిందకి దించి గోడకి చేరబెట్టింది. నాన్న పై గుడ్డతో ముఖమంతా తుడుచు కుంది. ఏదో గుర్తుకువచ్చినట్టుగా,
‘‘అమ్మా! నేను పడుక్కుండిపోయాక జరిగిన దేశిరాజుల కథేంటే?’’ ఆసక్తిగా అడిగింది. వెదురు గొట్టంతో పొయ్యి ఊదుకుంటూ దుంపలు ఉడికించే ప్రయత్నంలో పడిన రేక కొంచెం చీకాగ్గా,
‘‘మీ నాన్నను చెప్పమను. అంత వినాలని ఉన్నప్పుడు ఎందుకు నిద్దరపోయావు?’’ అనేసింది. పొగలు రేగిపోతున్న పొయ్యి దెబ్బకి కళ్లవెంట నీళ్లు ధారగా కారిపోతుండటంతో ఈ మాటల్ని కాసింత గగ్గోలుగానే అంది. కోలడు జోక్యం చేసుకోక తప్పలేదు.
‘‘పోనీలేవే. నువ్వయితే కథ బాగా చెబుతావని అడుగుతోంది. చెప్పుమీ. మురిపించుకోకు. ఆ దుంపల సంగతి నే చూస్తానులే.’’ పొయ్యి దగ్గరసా వెళ్లి పెళ్లాం చేతుల్లోంచి ఊదుకర్ర లాక్కున్నాడు. వం• బాధ్యత పెనిమిటి తీసుకోవడంతో కొంగుతో కళ్లుతుడుచుకుంటూ పక్కనే ఉన్న గోడకి వీపు దాపు చేసుకున్న రేక,
‘‘అసలు నువ్వెక్కడ వరకూ విన్నావో. నీకు కథ ఎంతవరకూ గుర్తుందో ముందర అది చెప్పు.’’ కూతుర్ని అడిగింది. ఉత్తరక్షణంలోనే గంగు అందుకు పోయింది.
‘‘దేశిరాజులు, దుర్గాండ్లు అనుకోకుండా విష్ణు భైరవస్వామి కోవెల్లో కలుసుకున్నారు. ఒకళ్లకొకళ్లు నచ్చుకున్నారు. కల్యాణపులోవకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ సంగతి వడ్డాదిరాజు దేవేంద్రుడికి తెలిసింది.’’ గబగబా చెప్పేసింది.
ఆ మీదట గళం సారించింది రేక. ‘జాగ్రత్తగా విను..’ అన్నట్టుగా గంగును మరింత దగ్గరగా లాక్కుంటూ,
‘‘కోపంతో ఊగిపోయిన దేవేంద్రుడు కల్యాణపు లోవకి సైనికుల్ని పంపించాడు. దేశిరాజుల్ని బంధించి తనవద్దకు తీసుకురమ్మనమని ఆదేశించాడు. ముందుగానే అపాయాన్ని పసికట్టిన యువరాజుల కడతమ్ముడు కొత్తలింగడు, అతని భార్య మువ్వలమ్మ తెలివిపడ్డారు. దేవేంద్రుడు మంచివాడు కాదని, చంపేస్తాడని చెబుతూ దూరంగా ఉన్న జాలంపల్లి ఊరికి పరుగు తీసేశారు. మిగిలిన ఆరు జంటలు మాత్రం తెంపుగా అక్కడే ఉండిపోయాయి. ఈ లోగానే వడ్డాది బలగాలు దాడి చేసి ఈ జంటలను అదుపులోకి తీసుకున్నాయి. రాచసభకు తీసుకువెళ్లి దోషులుగా నిలబెట్టాయి. రాచగన్నియ రోదనకు అంతులేకుండా పోయింది. పూర్ణిమాదేవి అయితే మింటికీ మంటికీ ఏకధారగా ఏడ్చింది. నందరాజ్యపు ప్రభువు వెంకటేశుడూ, దేవేంద్రాలూ వడ్డాది రాజమందిరానికి వచ్చారు. పిల్లల్ని వదిలిపెట్టమని దేవేంద్రుని వేడుకున్నారు. కన్నకూతుళ్లూ ప్రాధేయ పడ్డారు. తమ భర్తలను వదిలిపెట్టమని కాళ్లావేళ్లా పడ్డారు. అయినా అతగాడి మనసు కరగలేదు. అడవి మనుషులు తనకు అల్లుళ్లెలా అవుతారని విరుచుకు పడ్డాడు. చేసిన తప్పుకుగాను శిక్ష తప్పదన్నాడు. మేనల్లుళ్లు ఆరుగురికీ నిండుసభ లోనే చెరసాల శిక్ష విధించేశాడు. మానాభిమానాలు మెండుగా ఉన్న దేశిరాజులు ఆ తీర్పు విని పరువుపోయిందని తలపోశారు. తమవల్ల నందరాజ్యమంతా తలవంచు కోవలసివచ్చిందనీ బాధపడ్డారు. అవమానభారం తట్టుకోలేక అందరూ చూస్తుండగానే ఒరలోంచి కత్తులు తీసి తమను తామే పొడుచుకుని అక్కడికక్కడే చచ్చిపోయారు. దుర్గాండ్ల ఏడ్పులకు అవధిలేదు. కాళ్ల పారాణి ఆరకుండానే వాళ్లంతా వితంతువులై పోయారు. వడ్డాది, నందరాజ్యాల ప్రజలందరూ గగ్గోలు పెట్టారు.’’ టకటకా చెబుతూనే ఆయాసం అధికం కావడంతో ఇక చెప్పలేనన్నట్టుగా ఆపేసింది. కథ ఆపేసినప్పటికీ రేకమ్మ నేత్రాల నుంచి ధారా పాతంగా కురుస్తున్న కంటి నీరు ఆగడం లేదు. అంతకుముందు పొయ్యి నుంచి ఎగసిపడిన పొగల వల్ల ఆమె కళ్లు తడిసి ముద్దయితే, ఇప్పుడు దేశిరాజుల ఆత్మహననం మూలంగా హృదయంలో రేగిన మంటల కారణంగా నేత్రాలు కరిగి కన్నీరయ్యాయి.
కోలడి పరిస్థితీ అచ్చం అలానే ఉంది. గంగు కూడా ఏడుస్తూనే,
‘‘మరి దేశిరాజుల ప్రాణాలు పోతే, వారి భార్యల స్థితి ఏంటి.’’ అంతులేని వేదనతో అడిగింది.
ఈ ప్రశ్నకు ఇప్పటి స్థితిలో భార్య వివరణ ఇవ్వగలదో లేదోనన్న శంక కోలన్నను పీడించింది. అందుకే అతను చెప్పడం మొదలుపెట్టాడు. ఆలకించ మన్నట్టుగా గంగమ్మ వైపు చూస్తూ,
‘‘భర్తల చావు కళ్లారా చూసిన వడ్డ్దాది యువరాణు లందరూ తండ్రిని అసహ్యించుకుని రాజసభ దాటేశారు. తోచిన తావుకు పోనేపోయారు. అదే సమయంలో నందసైనికులు వడ్డాది మీద కోపంతో దండయాత్రకు దిగబోయారు. కలవరపడింది మోదమ్మ. ఆమె అప్పటికే గర్భవతి. స్వయంగా నందపురం వెళ్లింది. అత్తమామలను బతిమలాడింది. మాకలిశక్తితో మాట్లాడింది. నంద యువరాజు లందరూ కన్నుమూయగా యువరాణులు విధవలై ఉన్నారని, ఇలాంటి స్థితిలో యుద్ధంచేసి మరింతగా నష్టపోవద్దని వేడుకుంది. తన కడుపున పెరుగుతున్న వంశాంకురం ఇరు రాజ్యాలకూ సంబంధించినదే గనక కని, పెంచి, పెద్దచేసి• తీసుకువస్తాననీ నచ్చ చెప్పింది. పుట్టబోయే పసిగుడ్డు కోసమైనా పోరు చేయవద్దని అభ్యర్థించింది. మాకలిశక్తికి మోదమ్మ మాట కొంతలో కొంత నయమే అనిపించింది. జోడు మహారాజ్యాలకు కాబోయే వారసుడో, వారసురాలో ఈడుకు వచ్చేవరకూ సంయమనమే శరణ్యమని కొడుకుతో చెప్పింది. కోడలిని ఒప్పించింది. ఆ మీదట అటు వడ్డాదిలోనూ, ఇటు నందపురం లోనూ తానుండజాలనని, ఈ రెంటికీ సరి హద్దుల్లో ఉన్న దోరశి కొండల మినుములూరులో కాలం వెళ్లదీస్తానని చెబుతూ మోదమ్మ వెడలి పోయింది.’’ కళ్లకు కట్టినట్టే కథ వినిపించేశాడు.
అప్పటికి కొంత తేరుకున్నట్టుగా అయింది రేక. ఎప్పుడయితే తల్లి కొంచెం తెరిపినపడిందో గంగమ్మ తన మనసులోని మరికొన్ని సందేహాలను నింపాదిగా బయటపెడుతూ వచ్చింది.
‘‘మరి మోదమ్మకు బాబు పుట్టాడా, పాప పుట్టిందా? పుట్టినవాళ్లకి ఇప్పుడు వయస్సెంత? దేవేంద్రుడేమయ్యాడు. రాచగన్నియస్థితి ఏమిటి? దేవేంద్రాలూ, వెంకటేశ ప్రభువూ ఎక్కడున్నారు?’’ ప్రశ్నలమీద ప్రశ్నలు కురిపించేసింది. ఆలకించిన కోలన్న, రేకమ్మ వీటికి కూడబలుక్కున్నట్టుగా ఏకకంఠంతోనే సమాధానమిస్తూ,
‘‘మోదమ్మకి కొడుకే పుట్టాడు. పేరు సంజీవ రాజు. పిల్లలంతా దూరమయ్యారన్న బాధలో నందరాజ దంపతులు వెంకటేశుడూ దేవేంద్రాలూ వైరాగ్యంలో పడిపోయి భక్తిమార్గం పట్టేశారు. ఎవరి కంటికీ కనబడకుండా కోనలు పట్టి పోనేపోయారు. జనమంతా ఛీకొడుతుండగా దేవేంద్రుడు కలవర పడ్డాడు. తాను మత్స్యరాజునని, తనకు తిరుగులేదని పదేపదే చెప్పుకుంటూ పిచ్చివాడిగా మారిపోయాడు. సముద్రతీరాల వెంటఎక్కడికో పోయాడు. భర్త, పిల్లలు దూరం కావడంతో రాచగన్నియ, తన వారంతా కళ్లముందే నాశనం కావడంతో పూర్ణిమా దేవి, ఆథ్యాత్మిక భావాలతో దివ్యతిరుపతులకు తరలి వెళ్లిపోయారు. వడ్డాది రాజ్యానికి కావలిగా ఉండమని ప్రణవశర్మని, నందరాజ్యాన్ని కాపాడమని మాకలిశక్తిని నియోగించి కొడుకుతో సహా మినుములూరులోనే ఉండిపోయింది మోదమ్మ. మాకలిశక్తి, ప్రణవశర్మ వయోభారం మీదపడి ప్రస్తుతం కుంగిపోతున్నారు. ఎప్పుడు సంజీవరాజు సింహాసనానికి చేరుతాడోనని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అతగాడికి బాధ్యతలు అప్పగిస్తే తమ జీవితాలకు పరమార్థం చేకూరు తుందని నిరీక్షిస్తున్నారు.’’ ముఖ్యమైన విషయాలన్నిం టినీ క్లుప్తంగా వివరించి ముగించేశారు. అంతా అర్థమైనట్టుగానే అనిపించినా ఇంకా ఏదో అడగాలని గంగు భావించింది. అందుకనే,
‘‘మరి సంజీవరాజు ఎప్పుడు రాజవుతాడు? మనం అతగాణ్ణి చూడొచ్చునా? మోదమ్మను కలవ గలమా?’’ అదోలా మొహం పెట్టి అమ్మని అడిగేసింది. ఉడికిన దుంపల్ని పొయ్యి మీద నుంచి దింపి మట్టి పాత్రలోకి తొరుపుతూనే,
‘‘సంజీవరాజుకి ఇప్పుడు ఇరవైయ్యేళ్లు ఉండ వచ్చునేమో. ప్రభుస్థానానికి అతను చేరాలంటే దాదాపుగా మరో మూడేళ్లు పట్టవచ్చునేమో. సంజీవుడు, మోదమ్మ ఉండేది మన మండివలసకి ఆనుకుని ఉన్న మండేబు పర్వతం దిగువనే. పర్వతం దిగివెళితే పూలగండువనం వస్తుంది. అది దాటితే మినుములూరు. అక్కడుంటారు వాళ్లిద్దరూను. అయినా వాళ్లని మనం చూడటం కుదరదు.’’ ఖణీగా చెప్పుకొచ్చింది. ‘‘ఎందుకు కుదరదు?’’ తల్లిమాటలతో సంతృప్తి చెందని గంగు అమాయకంగా అడిగింది.
‘ఠళాయిస్తున్నావెందుకే.’ అన్నట్టుగా కూతురివైపు తీవ్రంగా చూసింది తల్లి. కోలన్న కలుగజేసుకున్నాడు.
‘‘మనం కోలగాళ్లవమ్మా. చిన్నకులం వాళ్లం. అందుకనే పాటలు పాడటానికి తప్పనిచ్చి నిన్ను ఊళ్లో దేనికీ పిలవరు. మనలాంటి తక్కువ మనుషులం అగ్రజాతి వాళ్లయిన మోదమ్మ వంటి వారిని ఎలా చూడగలం చెప్పు?’’ బుజ్జగిస్తున్నట్టుగా అన్నాడు. అయినప్పటికీ గంగు ఆగలేదు.
‘‘అందరం మనుషులమే కదూ నాన్నా. చిన్న ఏమిటి? పెద్ద ఏమిటి?’’ బేలగా మాట్లాడింది. తల తిరిగిపోయినట్టయింది కోలడికి. ఆ గాభరాలోనే పెదాలు కదుపుతూ,
‘‘అది నిజమే అనుకో తల్లీ. కానీ, కొండల్లో కట్టుబాట్లు అలాంటివి. ఏం చెయ్యగలం? మన కోలగాళ్లందరూ పల్లాల నుంచి అప్పుడెప్పుడో మీదికి వచ్చారట. అందుకే గ్రామ సేవకులుగానే ఎప్పటికీ ఉండాలట. దిగువవాళ్లు ప్రమాదకరమంటూ మనందరినీ ఈ కొండల మీద చిన్నజాతిగా చేసి పారేశారు. అందుకే కదా, ఎవరినీ అంటు చెయ్యకుండా దూరంగా పులిబరుకుడుమాను రాళ్ల మీద కూర్చుని దేశిరాజుల కథ విన్నాం. సరేలే! ఇప్పుడు ఇవన్నీ నీకెందుకు. మరికొంతగా వయసు వస్తేనే గానీ పూర్తిగా ఈ గొడవలన్నీ నీకు అర్థం కావు.’’ చెప్పవలసిందేదో చెప్పేసినట్టుగా గబగబా లేచి గ్రామ కచేరీకి పోవడానికి సిద్ధపడిపోయాడు.
మొత్తానికి విషయమంతా చాలావరకూ బోధ పడినట్టయింది గంగుకి. నిస్త్రాణ ఆవరించినట్టూ అయింది. అప్పటికి మరేం ప్రశ్నలు లేవన్నట్టుగానూ, శిరసున ఏవేవో ఊసులు కదలాడుతుండగానూ కూర్చున్న చోటును వదిలిపెట్టేసి అడ్డనార మంచానికి అతుక్కుపోయింది.
*******
మండివలస ముఠాదారు గుణరాజు ఇంటి ఆవరణ తగవు చెప్పడం కోసం సిద్ధమవుతోంది. ఆ ప్రదేశమంతా ఎప్పుడూ శుభ్రంగానే ఉంటుంది. ముఠాదారు తల్చుకుంటే కొండచీపుళ్లకు కొదవా. వాటిని పట్టి కదిలించే వెట్టివాళ్లకు కొదవా. చెత్త ఎత్తిపోసే చాకిరీకత్తెలకు కరవా. అందుకే రాజు కొంప చుట్టుపక్కలంతా ఆ వేళ మరింతగా శుభ్రం చేస్తు న్నారు కోలకుటుంబాలవారు. అంతటితో వదిలి పెట్టడం లేదు. అందరూ కలిసి కొండరాళ్లను ఏరేరి తీసుకువస్తున్నారు. అప్పటికే అక్కడ ఎప్పటినుంచో పడి ఉన్న కొన్నిరాళ్లను తీసి కుప్పగా పెడుతున్నారు. ఈ వ్యవహారమంతా కోలన్నే పర్యవేక్షిస్తున్నాడు.
ఆ ఊళ్లో కిందజాతిగా ముద్రపడ్డ కుటుంబాలు పదో పదిహేనో ఉంటాయి. వాళ్లందరికీ ఊరి తలవరి కోలడే పెద్దదిక్కు. కాబట్టే తనవారెవరూ తప్పి పోకుండా తీసుకువచ్చి ఆ రోజు పనిలో పెట్టాడు. ఆఖరికి భార్యాపిల్లల్నీ వదిలిపెట్టలేదు. కూతురు గంగును, భార్య రేకనూ ఇక్కడే నియోగించాడు.
ఎక్కడెక్కడి రప్పలూ చుట్టుపక్కలనుంచీ వచ్చి పడుతున్నాయి. బొడ్డూడని గుంటలు పనసపిక్కల ప్రమాణంలోని పిల్ల శిలల్ని ఏరుకొస్తుంటే, పెద్ద వాళ్లు మోయగలిగినంతటి పెద్దరాళ్లను పట్టుకు వస్తున్నారు. ముఠాదారు ఆవాసం చుట్టూ వాటిని ఒకదాని మీద ఒకటిగా పేరుస్తున్నారు. అవి నిలవ కుండా పడిపోతుంటే, వాటంగా వాటి ఆకారాలను బట్టి సర్దుబాటు చేస్తూ మీదిమీదికి నిలుపుతున్నారు.
రాయీ రప్పా ఏరుకుని రాగలుగుతోందిగానీ వీటిని నిలబెట్టే పని గంగు చేయలేకపోతోంది. దానికి పెద్దగా చేతకావడం లేదు. ఇందువల్లే తెచ్చిన రాళ్లను తెచ్చినట్టుగా తల్లి దగ్గరసా కుప్పగా పోస్తోంది. అలా పోస్తూనే,
‘‘అమ్మా! పడిపోతున్న రాళ్లను అలా మీదికి పేర్చే ప్రయత్నం ఎందుకు చేయడం. ఇప్పుడవి నిలబడ్డా పెద్దగాలి వేస్తే కూలిపోతాయి కదూ!’’ అమాయకంగా అమ్మని అడిగింది. అందుకు రేక సమాధానం చెప్పలేదు. చెప్పకపోగా ప్రశ్నకు ప్రశ్నే సమాధాన మన్నట్టుగా తనో ప్రశ్న వేసింది.
‘‘రాజుగారి కోట వేటితో కడతారు?’’ అమ్మ అలా అడిగేసరికి అసహనంతో నొసలు చిట్లించింది గంగు. విసుగు కనబరుస్తూనే, ‘‘వేటితో కడతారా. రాళ్లతో కడతారు. అదీ తెలీదా.’’ ఫెడీమని పలికింది.
‘‘ఇప్పుడు మనం చేస్తున్న పనీ అదే. దుర్గ నిర్మాణం.’’ రేక బదులిచ్చింది.
(ఇంకా ఉంది)