ఒమిక్రాన్‌… ఇప్పుడు ఈ నాలుగక్షరాలు యావత్‌ ‌ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. నిన్నమొన్నటి దాకా కరోనా తొలి, రెండో దశలతో అంతర్జాతీయ సమాజం అతలాకుతలమైంది. దాని ప్రభావం నుంచి క్రమంగా కోలుకుంటున్న తరుణంలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌తో ఇప్పుడు కలవరం చెందుతోంది. తొలుత దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించింది. అనేక ఐరోపా దేశాలు ఇప్పటికే ఒమిక్రాన్‌ ‌ప్రభావంతో ఇబ్బంది పడుతున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఈ నేపథ్యంలో తగిన ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ‌ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. కరోనా అనుభవంతో ఒమిక్రాన్‌ ఆటకట్టుకు సమర్థ నివారణ చర్యలు చేపట్టాలని సూచించింది.


మనదేశంలోనూ రోజురోజుకి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా నుంచి ప్రజలు కుదుట పడుతున్న తరుణంలో మళ్లీ ఒమిక్రాన్‌ ‌రూపంలో మహమ్మారి ప్రజలపై విరుచుకు పడుతోంది. గతంలో కరోనా కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా పెద్దగా ప్రభావం చూపించలేదు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈశాన్య భారతంతోపాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ‌తమిళనాడు, కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ‌తదితర రాష్ట్రాల్లో నానాటికీ పెరుగుతున్న కేసులు ఇందుకు నిదర్శనం. ఒకరి నుంచి నలుగురికి ఒమిక్రాన్‌ ‌విస్తరిస్తున్నట్లు మద్రాస్‌ ఐఐటీ గుర్తించింది. వైరస్‌ ‌తీవ్రతను అంచనా వేసేందుకు ఆర్‌ ‌నాట్‌ ‌విలువను లెక్కించగా 4గా నమోదైంది (జనవరి 9 నాటికి). దీని ప్రకారం చూస్తే ఫిబ్రవరి రెండో వారంలో తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్‌ ‌నాట్‌ ‌విలువ 2.69గా ఉన్నట్లు అంచనా వేసింది. కరోనా రెండోదశలో ఇది 1.69గా నమోదైంది. ఒకపక్క ఒమిక్రాన్‌తో సతమత మవుతండగా సైప్రస్‌లో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ ‘‌డెల్టాక్రాన్‌’ ‌మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇందులో డెల్టా, ఒమిక్రాన్‌ ‌లక్షణాలు ఉండటంతో దీనికి డెల్టాక్రాన్‌ అని పేరు పెట్టారు. అయితే దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

మహారాష్ట్రలో ముమ్మరం..

దేశవ్యాప్తంగా ఈనెల 9న ఒక్కరోజే 1,59,632 కేసులు వెలుగు చూశాయి. గత ఏడాది మే 29న 1,65,553 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మళ్లీ దాదాపు అదే స్థాయిలో కేసులు నమోదవడం ఆందోళన కలిగించే అంశం. అత్యధికంగా మహా రాష్ట్రలో 1009 ఒమిక్రాన్‌ ‌కేసులు (మొత్తం కేసులు 41,434) నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాయామ, సౌందర్య శాలలు 50 శాతం సామర్థ్యంతో పనిచేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు ప్రార్థనా స్థలాలు, మద్యం దుకాణాలకూ వర్తిస్తాయి. ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడకుండా ఆంక్షలు విధించింది. ఆసుపత్రుల్లో పడకలకు, ఆక్సిజన్‌ ‌సిలిండర్లకు కొరత రాకుండా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరుపై నిబంధనలు విధించింది. ఉదయం 5 నుంచి రాత్రి 11 గంటల వరకూ అయిదుగురుకి మించి గుమిగూడరాదని ఆదేశించింది. రాజస్తాన్‌ ‌సర్కారు సైతం ఇదే దిశగా చర్యలు చేపట్టింది. ముందు జాగ్రత్తగా ఈనెల 30 వరకు ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పుదుచ్చేరి ప్రభుత్వం కూడా విద్యార్థులకు తరగతులను రద్దు చేసింది. తమిళ నాడులో ఆదివారాల్లో లాక్‌డౌన్‌ ‌విధించింది. పలు రాష్ట్రాలు వారాంతపు, రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. ఈనెల 16 వరకు ఉత్తరాఖండ్‌ ‌ప్రభుత్వం రాజకీయ పార్టీల ర్యాలీలు, నిరసన కార్యక్రమాలపై నిషేధం విధించింది. ఈ రాష్ట్రంలో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్‌ ‌తీసుకున్నట్లు ధ్రువపత్రం చూపించాలని, కొవిడ్‌ ‌పరీక్షలో నెగెటివ్‌ ‌ఫలితం వచ్చినట్లు ధ్రువీకరణ పత్రాలను చూపిస్తేనే తమ రాష్ట్రంలోకి ఇతరులను అనుమతిస్తామని ఉత్తరాఖండ్‌ ‌స్పష్టం చేసింది. ఎన్నికలు జరగనున్న మరో రాష్ట్రం గోవాలోనూ ఆంక్షలు అమలు కానున్నాయి. ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు గరిష్టంగా వంద మందికి మించి అనుమతించబోమని సర్కారు పేర్కొంది. పార్టీల ర్యాలీలు, సభలు, సమావేశాలపై నిషేధం విధించ డాన్ని ప్రజలు సమర్థించారు. ‘లోకల్స్ ‌సర్కిల్స్’ ‌సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. పాజిటివిటీ రేటు ఢిల్లీలో 19.60 శాతం, బెంగ ళూరులో 10 శాతం దాటింది. ఒమిక్రాన్‌తో భయ పడుతున్న అహమ్మదాబాద్‌, ‌సూరత్‌ల్లోని వలస కార్మికులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఒమిక్రాన్‌ ‌ప్రభావం అంతర్జాతీయ సరిహద్దులకూ విస్తరించింది. సుచేత గఢ్‌ ఔట్‌ ‌పోస్టు వద్ద సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌… ‌బోర్డర్‌ ‌సెక్యూరిటీ ఫోర్స్) ‌నిర్వహించే ‘బీటింగ్‌ ‌రిట్రీట్‌’ ‌కార్యక్రమాన్ని తాత్కా లికంగా రద్దుచేశారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు గత ఏడాది అక్టోబరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

విస్తరిస్తున్న వైరస్‌…

ఒమిక్రాన్‌ ‌వేగంగా విస్తరిస్తోంది. పార్లమెంటు భవన్‌లో పనిచేస్తున్న సిబ్బందిలో 400 మందికి వ్యాధి విస్తరించింది. వీరిలో 200 మంది లోక్‌సభ, 65 మంది రాజ్యసభ సిబ్బంది ఉన్నారు. మిగిలినవారు ఉభయ సభల అనుబంధ విభాగాల సిబ్బంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్‌ ‌ముప్పవరపు వెంకయ్య నాయుడు పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇది మున్ముందు ఎంతమందికి సోకుతుందోనన్న భయం సిబ్బందిలో నెలకొంది. దీంతో అండర్‌ ‌సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్‌ అధికారి కంటే కింది స్థాయి సిబ్బందిలో సగంమంది ఇంటి నుంచే పని చేయాలని ఉన్నతాధి కారులు ఆదేశించారు. గర్భిణులు, దివ్యాంగులు కార్యా లయానికి రానక్కర్లేదని ఇంటినుంచే పనిచేయాలని సూచించారు. వీలైనంతవరకు అధికారిక సమా వేశాలను రద్దు చేయాలని, అత్యవసరమైతే వీడియో కాన్ఫరెస్స్‌లు వంటి ప్రత్యామ్నయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు. ఈ నెలాఖరు వరకూ ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. ముంబయిలోని సీబీఐ కార్యాలయంలో పనిచేస్తున్న 235 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా 68మందికి పాజిటివ్‌ ‌ఫలితం వచ్చింది. సుప్రీంకోర్టుకూ వైరస్‌ ‌వ్యాపించింది. నలుగురు న్యాయమూర్తులు కరోనా బారిన పడ్డారు. సర్వోన్నత న్యాయస్థానంలోని అయిదు శాతం మంది సిబ్బందికి వ్యాధి సోకింది. ఇక్కడ 32 మంది న్యాయమూర్తులు, దాదాపు 3000 మంది సిబ్బంది పని చేస్తున్నారు. దీంతో న్యాయస్థానం కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది.

ఆందోళన అక్కర్లేదు…

ఒమిక్రాన్‌ ‌వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే భారత్‌లో వ్యాధి విస్తరణ వేగంగా ఉంటుందని వారు చెబుతు న్నారు. అందువల్ల వచ్చే నెలలో రోజుకు దాదాపు అయిదు లక్షల కేసులు నమోదయ్యే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని మాస్కుల ధారణ, భౌతిక దూరం పాటించడం, ప్రయాణాలను తగ్గించుకోవడం, సామూహిక కార్యక్రమాలను తగ్గించుకోవడం వంటి కనీస జాగ్రత్తలతో ఒమిక్రాన్‌ను అధిగమించవచ్చని వారు విశ్లేషిస్తున్నారు. ఇది ప్రజలకు భరోసా కలిగించే అంశం.

ఒమిక్రాన్‌ను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్‌ ‌మాండవీయ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో పరిస్థితులను సమీక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా స్థాయి ఆసుపత్రుల వరకూ సన్నద్ధం చేయాలని, వాటిల్లో మౌలిక వసతుల కల్పనకు రాజీపడవద్దని, ఈ విషయంలో నిధుల కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఈ విషయంలో కేంద్రం తనవంతుగా తగిన మద్దతు అందిస్తుందని భరోసా ఇచ్చారు. గతానుభవాల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. త్వరలో ముఖ్య మంత్రులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. బూస్టర్‌ ‌డోసు కార్యక్రమాన్ని ప్రారంభిం చింది. 60 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, వైద్య ఆరోగ్య శాఖలోని ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వారియర్స్‌కు, పోలీసులకూ ఈ బూస్టర్‌ ‌డోస్‌ ఇవ్వనున్నారు.

ఎన్నికలు జరగనున్న యూపీ, ఉత్తరాఖండ్‌, ‌పంజాబ్‌, ‌గోవా, మణిపూర్‌ ‌రాష్ట్రాల ఎన్నికల సిబ్బందికి కూడా బూస్టర్‌ ‌బోస్‌ అం‌దివ్వనున్నారు. వీరిని కూడా ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వారియర్స్‌గా పరిగణిస్తారు. 1.05 కోట్ల ఆరోగ్య కార్యకర్తలకు, 1.9 కోట్ల ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వర్కర్లు, 2.75 కోట్ల సీనియర్‌ ‌సిటిజన్లకు బూస్టర్‌ ‌డోస్‌ ‌ముందుగా ఇస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి మనసుఖ్‌ ‌మాండవీయ వివరించారు. రెండో డోసుకు, బూస్టర్‌ ‌డోసుకు 9 నెలల విరామం ఉండాలి. అర్హులందరినీ అప్రమత్తం చేస్తూ కొవిన్‌ ‌పోర్టల్‌ ‌నుంచి ఫోన్లకు సంక్షిప్త సందేశాలు వస్తాయి. టీకా ఇచ్చాక ఆ మేరకు డిజిటల్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌సర్టిఫికెట్‌లో నమోదు చేస్తారు. బూస్టర్‌ ‌డోసుకు ఇప్పటికే నమోదు ప్రారంభ మైంది. కొవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌కేంద్రాలుగా వ్యవహ రిస్తున్న ప్రైవేట్‌ ఆసుపత్రులు సైతం తమ సిబ్బందిలో అర్హులైన వారికి బూస్టర్‌ ‌డోసు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. 60 ఏళ్లు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు బూస్టర్‌ ‌డోసు కోసం వైద్యుల ధ్రువీకరణ పత్రాలు చూపించాల్సిన అవసరం లేదు. ముందు జాగ్రత్తగా 15-18 ఏళ్ల వయసు గల రెండు కోట్ల మంది పిల్లలకు తొలి దశ వ్యాక్సినేషన్‌ ‌పూర్తయింది. వారం లోనే ఈ పక్రియను పూర్తి చేయడం విశేషం. ఈనెల 8వ తేదీ నాటికి 151.47 కోట్ల డోసులను పూర్తి చేశారు. ఇందులో టీనేజర్లకు 2,27,33,154 డోసులు వేశారు. మరోపక్క కరోనాపై పోరాటంలో భాగంగా వ్యాధినిరోధక శక్తిని పెంపొందించేందుకు కేంద్ర ఆయుష్‌ ‌శాఖ ‘ఆయురక్ష కిట్‌’‌ను తయారు చేసింది. ఇది వ్యాధి నిరోధక శక్తిగా బాగా పని చేస్తుందని కేంద్ర ఆయుష్‌ ‌మంత్రి సర్బానంద సోనోవాల్‌ ‌తెలిపారు.

కేసుల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. విపత్తు నిర్వహణ చట్టం కింద విధించిన ఆంక్షలను ఈనెల 20 వరకు పొడిగిం చింది. ఈ మేరకు జీవో 20 విడుదల చేసింది. ఈ మేరకు ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, మతపర మైన, రాజకీయ కార్యకలాపాలను నిషేధించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌కార్యాలయాల్లో మాస్క్ ‌ధారణను కఠినతరం చేసింది. వ్యక్తుల మధ్య భౌతిక దూరం తప్పనిసరి చేసింది. పరీక్షల సంఖ్యను పెంచింది. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొ నేందుకు అన్ని ప్రభుత్వ శాఖలను ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది. కరోనా రెండు దశలను ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా ఎదుర్కొన్నాయో ఇప్పుడూ అదేరీతిని కలసి పని చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి సమష్టిగా ముందకు సాగాలి. భారత్‌ ‌సంకల్పబలాన్ని, విజయాన్ని ప్రపంచం గర్తించేటట్లు చేయాలి.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE