జాతీయోద్యమంలో కవులు, రచయితలు స్పందించి తమ రచనల ద్వారా ప్రజల్లో జాతీయోద్యమ భావాలను రగిలించారు. దేశభక్తిని ప్రబోధించారు. కవిత్వం, నవల, కథానిక పక్రియ లన్నింటికంటే దృశ్య కళా రూపకమైన నాటకం భావప్రచారానికి శక్తిమంతమైంది. నాటకంలో ప్రదర్శించే దృశ్యాన్ని వెంటనే ప్రజలు గ్రహించి స్పందించడానికి వీలవుతుంది. ఏ ఉద్యమంలోనైనా నాటకం చురుకైన పాత్ర పోషించడానికి అవకాశం ఎక్కువ. గురజాడ కన్యాశుల్కం మొదటి కూర్పు పీఠికలో (1897) ఇదే అభిప్రాయాన్ని ఉటంకించారు. “until reading habits prevail among the mass, one must look only the stage to exert such healthy influences” – క్రీ.శ. 19 శతాబ్ది నాటికి సమాజంలో అక్షరాస్యులు రెండు శాతం మాత్రమే. నిరక్షరాస్య సమాజానికి నాటకమే సరైన భావ ప్రసార సాధనమన్న గురజా వారి అభిప్రాయం సమంజసమైందే.

జాతీయోద్యమంలో ప్రజలకు ప్రబోధించే లక్ష్యంతో నాటకాలు విరివిగానే వచ్చాయి. వాటిని 1. పౌరాణికాలు, 2. చారిత్రకాలు, 3. సమకాలీన సాంఘిక నాటకాలుగా వర్గీకరించి విశ్లేషించడం సమంజ సంగా వుంటుంది.

 పౌరాణిక నాటకాలు: పౌరాణిక నాటకాల్లో భారత ఇతివృత్తాలే ఎక్కువ. రచయితలు పాండవుల జీవితాలను భారతీయుల జీవితాలకు సంకేతంగా భావించి ప్రజల్లో జాతీయోద్యమ స్ఫూర్తినీ, చైతన్యాన్ని రగిలించే ప్రయత్నం చేశారు. పౌరాణిక నాటక రచయితలు భారతదేశాన్ని ద్రౌపదిగా భావించి పరాయిపాలకుల వల్ల ఆమెకు అవమానం జరుగుతున్నట్లు నాటకాలు రాశారు. వాటిలో ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన ‘పాంచాలీ స్వయంవరం’ (1926) ప్రధాన మైంది. అందులో ద్రుపదుని పాత్ర ద్వారా విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తు వినియోగం వంటి గాంధేయ సిద్ధాంతాలను సన్నివేశాలుగా కల్పించారు. మొక్కపాటి వెంకటరత్నం ‘ద్రౌపదీమాన సంరక్షణం’ (1921) నాటకంలో అశ్వత్థామ పాత్ర ద్వారా తెల్లదొరలకు ఊడిగంచేసే స్వదేశీ ద్రోహులను అధిక్షేపించే సన్నివేశం కల్పించాడు. ‘తిరుపతి వేంకటకవులు’ పాండవోద్యోగ విజయం (1911) నాటకంలో స్వాతంత్య్ర కాంక్షను ధ్వనిస్తూ ‘‘అలుగుటయే యెఱుంగని మహా మహితాత్ముడజాత శత్రుడలిగిన నాడు సాగరము లన్నియు నేకము కాక పోవునే!….’’ అనే పద్యంలో స్వాతంత్య్ర కాంక్ష ధ్వనిస్తుంది. సోమరాజు రామానుజరావు రచించిన ‘పద్మవ్యూహం’ (1926)లో అశ్వత్థామ పాత్ర ద్వారా ‘‘భరతమాత దాస్యశృంఖలాలు విదిల్చి తల్లి ఋణము తీర్చుకున్నవాడే నిజమైన కుమారుడు’’ అనిపిస్తాడు.

బుద్ధవరపు పట్టాభి సీతారామయ్య పరాయి పాలనలో బానిసత్వపు బాధలను చిత్రిస్తూ మహా భారతంలో కద్రూ వినతల ఇతివృత్తం ఆధారంగా ‘మాతృదాస్య విమోచనం’ (1924) నాటకాన్ని రచించాడు. ఇందులో గాంధీజీ ప్రబోధించిన శాంతి, అహింసా సిద్ధాంతాలను ప్రవేశపెట్టి ప్రచారం చేశారు..

చారిత్రక నాటకాలు : జాతీయోద్యమంలో రచయితలు చరిత్రను వర్తమానానికి అవసరమైనంత వరకు ఉపయోగించి ప్రజలను చారిత్రక నాటకాల ద్వారా జాగృతం చేశారు. ఉత్తర భారతదేశ వీరులైన శివాజీ, రాణాప్రతాప్‌ ‌సింగ్‌, ‌ఝాన్సీరాణి, రాణీ సంయుక్తల వీరోచిత సాహసగాథలను ఇతివృత్తాలుగా చారిత్రక నాటకాలుగా రచించి ప్రజలను ప్రభావితులను చేసేందుకు ప్రయత్నించారు.

తెలుగునాట వీరులైన పల్నాటి యోధులు, బొబ్బిలి వీరులు, విజయనగర రాజులు, అల్లూరి సీతారామరాజు, కన్నెగంటి హనుమంతు వంటి వారి చరిత్రలను ఇతివృత్తాలుగా నాటకాలు రాసి ప్రజలను జాతీయోద్యమం వైపు ప్రేరేపించారు.

అహమ్మద్‌నగర్‌ను పాలించిన ‘సుల్తానాచాంద్‌’ ‌శౌర్య పరాక్రమాలను, వీరోచిత గాథలను అదే పేరుతో కోలాచలం శ్రీనివాసరావు నాటకంగా రాసి (1900) ప్రదర్శించి ప్రజల్లో జాతీయోద్యమ స్ఫూర్తిని నింపారు. జాతీయోద్యమంలో మహిళల వీరోచిత గాథను గుర్తుచేసిన తొలినాటకమిది. అదేవిధంగా బాలాంత్రపు వెంకటరావు, చాగంటి శేషయ్యలు కలిసి రచించిన ‘రాణీ సంయుక్త (1909), వేమూరి వెంకటరామనాథం ‘సంయుక్త (1924); కొప్పరపు సుబ్బారావు ‘రోషనార’ (1930)లో మహిళల మహోన్నత సాహస గాథలను ప్రదర్శించారు. ముత్తరాజు సుబ్బారావు రచించిన ‘చంద్రగుప్త నాటకంలో (1932) భరతమాత విలపిస్తూ తన దైన్యాన్ని వినిపిస్తే చాణుక్యుడామెను ఓదార్చే సన్నివేశం ప్రజలను కోపోద్రేకంతో జాతీయోద్యమంవైపు పరుగులు తీయించింది.

జాతీయోద్యమ సాహిత్యంలో భారతీయ భాషలన్నింటిలోను రాణాప్రతాపసింగ్‌, ‌శివాజీలకు ఉన్నత స్థానం దక్కింది. తెలుగు సాహిత్యంలో కూడా వారి చరిత్రలను రచయితలు నాటకాలుగా మలిచారు. జంధ్యాల శివన్న శాస్త్రి ‘రాణా ప్రతాపసింహ’ (1920)  కేతవరపు రామకృష్ణ ‘శివాజీ విజయము’ (1921) ప్రసిద్ధమైనవి. కొండపల్లి లక్ష్మణ పెరుమాళ్ళు ‘రసపుత్ర కదనము’ (1922). ఇచ్ఛారపు యజ్ఞనారాయణశాస్త్రి ‘రసపుత్ర విజయము’ (1929) వంటి నాటకాల్లో సంభాషణలు ప్రేక్షకులకు రోమాంఛం కలిగించి ఉద్యమోన్ముఖులను చేశాయి.

యుద్ధమనగానే తెలుగువారికి ‘పల్నాటి యుద్ధం’ స్ఫురిస్తుంది. ఆ ఇతివృత్తం ఆధారంగా కన్నెగంటి ప్రభులింగాచార్యులు రచించిన ‘పల్నాటి వీరచరిత్రము’ (1928); ఉన్నవ లక్ష్మీనారాయణ ‘నాయకురాలు’ (1926) ప్రసిద్ధమైనవి. ఈ నాటకాల్లో బ్రహ్మ నాయుడు గాంధీజీకి ప్రాతినిధ్యం వహించినట్లు రచయితలు చిత్రించారు. ప్రజల్లో అనైక్యతను పోగొట్టి సమైక్యతను తీసుకురావడం, అమరవీరుల త్యాగాలను స్ఫురింపజేయడం వంటి విశేషాలు ఈ నాటకాల్లో కనిపిస్తాయి.

నండూరి బంగారయ్య ‘ఆంధ్ర తేజము’ (1938) నాటకంలో ప్రజల్లో ఉన్న అంతఃకలహాలను అధిక్షేపించి ‘‘ఆంధ్ర సేవా పరాయణులగునో మహా వీరులారా! / జయపతాకములపై జాతీయనిర్ణిద్ర తేంబునృత్యమాడ / ధర్మసంస్థాపనార్థమై దైన్య వాటి నాంధ్ర పుత్రులు రణసీమకరుగుడయ్య’’ అని తెలుగు ప్రజలను రచయిత గొప్పగా ప్రబోధించాడు. గుర్రం జాషువా ‘వీరాబాయి’ (1926); జాస్తి వెంకట నరసయ్య ‘ప్రజారాజ్యం’ (1940) వంటి నాటకాల్లో జమిందారీ వ్యతిరేక పోరాటాన్ని ఆవిష్కరించారు.

సమకాలీన ఉద్యమ స్ఫూర్తిగా నాటకాలు

జాతీయోద్యమ కాలంలో ఉద్యమ నాయకులను, ఉద్యమ సంఘటనలను ఇతివృత్తాలుగా చేసుకొని వచ్చిన ప్రత్యక్ష రాజకీయ నాటకాలు ఎంతో కీలకమైనవి. వీటిలో రచయితలు అవసరమైన మేరకే సాంఘికాంశాలను ప్రస్తావించారు. ఈ నాటకాల్లో తిలక్‌, ‌గాంధీజీ జీవితాలను వస్తువులుగా చేసుకొని వచ్చినవే ఎక్కువ. కొన్ని నాటకాల్లో హిందూ దేవతలు పాత్రలుగా కనిపిస్తాయి. వీటిలో ఆంధ్రోద్యమ స్ఫూర్తితో వచ్చిన నాటకాలు కూడా కొన్ని ఉన్నాయి.

జాతీయోద్యమ నాటక పితామహుడనదగిన దామరాజు పుండరీకాక్షుడు నవయుగారంభం, స్వరాజ్యసోపానము, గాంధీ మహోదయము, పాంచాలీ పరాభవము, కలియుగ భారతము, సంస్కారాణి, రణభేరి, కమాల్‌పాషా వంటి నాటకాలు రాశారు.

తిలక్‌ ‌మరణానంతరం ఆయన ఆశయాలను నెరవేర్చడానికి పుట్టుకొచ్చిన మహానుభావుడిగా గాంధీజీని దామరాజువారు ‘నవయుగారంభము’లో చిత్రించారు. దేవసభలో దేవుడి దశావతారాల్లో క్రీస్తు, మహమ్మద్‌ను కలిపి పన్నెండవతారాలతో సమావేశాన్ని ఏర్పాటుచేసి ప్రపంచ రాజకీయాలను చర్చిస్తాడు. దేవుడి ఆహ్వానం మేరకు భరతమాత వెళ్ళి అందరిముందు తన దీనావస్థను వివరిస్తుంది. అప్పుడు దేవుడు మొదట తిలక్‌ను, తర్వాత గాంధీజీ భారతదేశ పారతంత్య్రాన్ని పారద్రోలడానికి సృష్టించి పంపిస్తానని వరమిస్తాడు. తిలక్‌ ‌మరణానంతరం కృష్ణుని కోరిక మేరకు గాంధీ దేవలోకానికి వెళ్ళి భూలోకానికి వస్తాడు. షాకతాలీ, లాల లజపతిరాయ్‌ ‌లను అనుసరించాలని గాంధీజీని భరతమాత కోరుతుంది. ఈ ఔచిత్యమైన కల్పనతో నవయుగా రంభము ముగుస్తుంది.

దామరాజు పుండరీకాక్షుడు జలియన్‌ ‌వాలాబాగ్‌ ‌దురంతాలమీద రాసిన నాటకం ‘పాంచాలీ పరాభవం’, వేలాదిమంది జలియన్‌ ‌వాలాబాగ్‌లో సమావేశమైన సభలో జనరల్‌ ‌డయ్యర్‌ ‌దారుణంగా కాల్పులు జరిపి పాంచాలీమాతను వస్త్రా పహరణతో అవమానించే సందర్భంలో గాంధీజీ రాట్నంతో ప్రత్యక్షమై ఆమెకు మాన సంరక్షణ చేస్తానని, ఆ దివ్యాయుధంతో కార్యరంగంలోకి దూకుతానని ఓదార్చిన కల్పన సమంజసంగా వుంది.

భరతమాత మొర విని శ్రీకృష్ణుడు గాంధీగా అవతరిస్తానని వరమిచ్చాడన్న రచయిత కల్పన గాంధీజీని అవతార పురుషుడిగా ఉదాత్తీకరించడమే. గాంధీజీ కృష్ణుని కోరిక మేరకు దేవలోకానికి వెళ్ళి భూలోకానికి వస్తాడు. ఇందులో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం, చీరాలపేరాల ఉద్యమం, రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశం, క్విట్టిండియా ఉద్యమం, స్వతంత్ర ప్రకటన వంటి అంశాలు ప్రదర్శించబడ్డాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు భజన పాటల బాణీలో గాంధీజీ వ్యక్తిత్వాన్ని కీర్తించినట్లు చిత్రించాడు.

దామరాజు వారు స్వరాజ్య సౌధం నాటకంలో క్విట్టిండియా ఉద్యమం మొదలు దేశ విభజన దాకా జరిగిన చరిత్రను నాటకీ కరించాడు. ఇందులో గాంధీ, నెహ్రూ, పటేల్‌, ‌బోస్‌, ‌మదనమోహన్‌, ‌మాలవ్యా, సరోజినీ నాయుడు, కస్తూరిబా వంటి పాత్రలున్నాయి.

‘రణభేరి’ నాటకంలో రెండో ప్రపంచ యుద్ధం ఇతివృత్తంగా ‘గాంధీ పాత్రను’ చిత్రించాడు. ‘నవ్యనారదుడు’ అనే పాత్ర ఈ నాటకంలో గాంధీజీ ఆశయాలను ప్రచారం చేసేందుకు యూరప్‌ ‌వెళతాడు. కలియుగ భారతంలో సామాజిక రుగ్మతలన్నింటికీ గాంధేయవాదమే పరిష్కారమని అందరూ గాంధీజీ ఆశ్రమానికి వచ్చి దేశసేవకు అంకితం కావాలన్న సందేశంతో నాటకం ముగుస్తుంది.

‘సంస్కారిణి’ నాటకంలో ‘మద్య పానం’, బాల్య వివాహాలు, వేశ్యాలోలత్వం, అస్పృశ్యత వంటి సాంఘిక దురాచారాలకు గాంధీజీ ప్రకటించిన నిర్మాణాత్మక కార్యక్రమాలే పరిష్కార మార్గాలని రచయిత దామరాజువారు ప్రతిపాదించారు.

‘స్వరాజ్య సోపానం’ నాటకంలో దామరాజు వారు అప్పటిదాకా నడిచిన జాతీయోద్యమాన్ని బుర్రకథ రూపంలో గానంచేసి ప్రజలను ఉద్యమోన్ము ఖులుగా ప్రేరేపించాడు. అప్పటి సమాజంలో నిరక్షరాస్యులైన గ్రామీణ ప్రజానీకాన్ని బుర్రకథ గొప్పగా ప్రభావితం చేసింది.

‘‘వినరా ఆంధ్ర విశాల విహారా విజయమనదేరా!

అసహాయోద్యమ వీరులు మీరే పస జూపించండీ!

రైతులందరూ పన్ను లివ్వమని ప్రతిజ్ఞ సేయండీ!

పట్నవాసులూ వన్నులనన్నిటి సున్నా చుట్టండీ

పెదనందిపాడున వీర రైతులే పేరు నిల్పిరండీ!’’

అనే బుర్రకథ పంక్తులు గాంధీజీ ఆశయపరమైన పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని గొప్పగా ప్రేరేపించాయి.

వేదాంతకవి ‘విశ్వస్వరాజ్యం’ నాటకంలో (1945) భరతమాత అయిదుగురు పుత్రులను అయిదువర్ణాలకు ప్రతినిధులుగా చిత్రించాడు. సోమరాజు రామానుజరావు ‘స్వరాజ్య రథము’ (1945) నాటకంలో తిలక్‌ ‌తర్వాత గాంధీ అవతరించి జాతీయోద్యమంలో ప్రజలను చైతన్యపరచి స్వాతం త్య్రాన్ని సాధించడం ఇందులో ఇతివృత్తం. ఇందులో పాంచాలి, దేవేంద్రుడు, తిలక్‌, ‌గోఖలే, విక్టోరియారాణి, రత్నదేవి వంటి పాత్రలున్నాయి. ఈ ఇతివృత్తంపై దామరాజువారి నాటకాల ప్రభావం ఉంది.

శ్రీ పాద కృష్ణమూర్తి శాస్త్రి రాసిన పెద్ద నాటకం ‘తిలక్‌ ‌మహారాజు’ (1921). ఇది తిలక్‌ ‌రాజకీయ జీవితాన్నంతా నాటకీకరించింది. శాస్త్రిగారు రాసిన ‘గాంధీ విజయధ్వజ నాటకం’లో గాంధీజీ దక్షిణాఫ్రికా ఉద్యమ జీవితం మొదలు నాగపూర్‌, ‌కాంగ్రెస్‌, ‌సహాయ నిరాకరణోద్యమం, గాంధీజీ అరెస్ట్, ‌తిలక్‌ ‌మరణం వంటి సన్నివేశాలు ఉన్నాయి. ‘తంబూరపాట’ రూపంలో శ్రీపాదవారు రాసిన సీస పద్యం తిలక్‌ ‌రాజకీయ జీవిత చిత్రణం

‘‘వినరయ్య తిలకుని వృత్తాంతమంతయు

వినిపింతు జనులార! విశదమగును

షష్టిపూర్త్యుత్యవ సమయంబునన్‌ ‌తిల

కునకు సమనువచ్చె కోర్టు నుండి’’.. అంటూ సాగిన సీసమాలిక పాడేందుకు అనువైంది. విన్న శ్రోతలు ఉత్సాహంతో ఉర్రూతలూగి పులకించే వారట.

భరతమాత అవస్థలను చూసి మంగళపాండే ఆవేదనాభరితమైన మానసిక సంఘర్షణను రామచంద్రుని వెంకటప్ప ‘చిచ్చురపిడుగు’ (1929) ఏకాకిగా రూపొందించాడు. రెండు ప్రపంచ యుద్ధాల నడుమ భారతదేశ రాజకీయ స్థితిగతులతో అచ్చిరాజు రంగారావు ‘స్వాతంత్య్ర సమరం’ (1940) నాటకంగా రచించాడు. అందులో ఆంగ్లేయుల కుటిలనీతి, దమనకాండ, భారతీయుల శాంతియుత పోరాటాన్ని, గాంధీజీ నాయకత్వాన్ని రచయిత బలీయంగా చిత్రించారు. ఖాన్‌ అబ్దుల్‌ ‌గఫార్‌ఖాన్‌, ఆచార్య రంగా, టంగుటూరి ప్రకాశం, నెహ్రూ, పటేల్‌, ‌జయక్రాశ్‌నారాయణ్‌, ‌రాజాజీవంటి పాత్రలు ఈ నాటకంలో ఉన్నాయి.

బోయి భీమన్న ‘పాలేరు’, ‘కూలిరాజు’ వంటి నాటకాల్లో గాంధేయ మార్గంలో దళిత సాంఘిక రాజకీయాభివృద్ధి జరిగే తీరును ప్రదర్శించారు.

సుంకర వాసిరెడ్డి సంయుక్తంగా రచించిన ‘మా భూమి’ నాటకం తెలంగాణాలోని నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలంతా సమైక్యంగా కులమతాలకు అతీతంగా సమష్టి పోరాటాన్ని నిర్వహించే విధంగా ప్రేరేపించింది. తెలుగు నాటక చరిత్రలో ‘కన్యాశుల్కం’ తర్వాత పేర్కొనదగిన గొప్ప రాజకీయ నాటకంగా విమర్శకులు పేర్కొన్నారు.

సాహితీ పక్రియలన్నింటికంటే నాటకం ప్రజల్లోకి నేరుగా చొచ్చుకుపోతుందన్న వాస్తవాన్ని గ్రహించి బ్రిటీషు ప్రభుత్వం జాతీయోద్యమంలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన నాటకాలను నిషేధించింది. వాటిలో దామరాజు పుండరీకాక్షుడు రాసిన నవయుగారంభం, పాంచా పరాభవం, స్వరాజ్య సోపానం, స్వరాజ్య సౌధం, రణభేరి, సోమరాజు రామానుజరావు ‘స్వరాజ్య రథం’ శ్రీపాద వారి ‘తిలక్‌ ‌మహారాజు’, సుంకర వాసిరెడ్డి ‘మా భూమి’ వంటివి నిషేధిత జాబితాలో ఉన్నాయి.

జాతీయోద్యమ నాయకుల మహోన్నతమైన త్యాగనిరతి, కవులు, రచయితల రచనల ప్రేరణ, భారతదేశ పౌరుల్లో అకుంఠిత దేశభక్తి తత్పరతల వల్ల స్వాతంత్య్రాన్ని సాధించుకోగలిగాం.

– డా।। పి.వి.సుబ్బారావు 9849177594 రిటైర్డ్ ‌ప్రొఫెసర్‌ & ‌తెలుగు శాఖాధిపతి, సి.ఆర్‌. ‌కళాశాల, గుంటూరు.

About Author

By editor

Twitter
YOUTUBE