గత ఏడాది అక్టోబర్ 30న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వాటికన్ సిటీని సందర్శించారు. ఈ సమావేశం పట్ల ఇరువురూ ఎవరికివారు తమకు తోచిన విధంగా ట్వీట్‌లు చేసుకున్నారు. పోప్‌ను కలుసుకున్నానని, భారతదేశానికి ఆహ్వానించినట్లు ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేయగా.. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగిందని వాటికన్ సిటీ అధికార యంత్రాంగం వ్యాఖ్యానించింది. ఏది ఏమైనా పోప్ అతి త్వరలోనే భారతదేశం రావటానికి అంగీకరించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పోప్ ఇప్పుడే కాదు గతంలోనూ చాలాసార్లు భారత దేశాన్ని సందర్శించటం, ఆ సందర్భంగా వివాదాస్పద పిలుపులను ఇవ్వటం మనందరికీ తెలిసిందే. కాని ఈసారి పోప్‌ను మోదీ కలుసుకోవటాన్ని కొంతమంది పనిగట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నాలు జరిగాయి. కాదేది విష ప్రచారానికి అనర్హం అన్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎవరిని కలుసుకున్నా.. ఎవరితో సమావేశమైనా రాజకీయ దురుద్దేశాలను ఆపాదించి ప్రచారం చేయటం పరిపాటిగా మారిపోయింది.
ఈ సమావేశాన్ని భారత ప్రధాని మోదీ, కోట్లాది మంది క్రైస్తవ అనుచరులు కలిగిన ఒక పెద్ద మతాధికారి మధ్య జరిగిన సమావేశంగానే మనం చూడాల్సి ఉంది. వాస్తవానికి పోప్ ఆ దేశాధినేత కాదు. దీన్ని అగ్రరాజ్యాలు అమెరికా, రష్యాలూ సైతం అంగీకరిస్తుంటే.. మన దేశంలో ప్రతి చిన్న విషయాన్ని రాజకీయ భూతద్దంలో చూసే కొన్ని రాజకీయ శక్తులు పనిగట్టుకుని ఈ సమావేశంపై లేనిపోని అంశాలను ముందుకు తీసుకువచ్చి రాజకీయ లబ్ధికి ప్రయత్నించటం దురదృష్టకరం. 1929లో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఇటలీ దేశ రాజు విక్టర్ ఎమాన్యూల్ వాటికన్ సిటీకి ప్రత్యేక హోదాను మాత్రమే ఇచ్చారు. అంతేకాని వాటికన్ సిటీ పౌరులకు ప్రత్యేక పౌరసత్వం ఇవ్వలేదు. అధికారికంగా ప్రత్యేక ప్రభుత్వం లేదు. అగ్రరాజ్యం అమెరికా సైతం పోప్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ చర్చ్‌లకు సర్వోన్నత పాలనాధికారిగానే పరిగణిస్తోంది. వాటికన్ సిటీని సామంత భూభాగం గానే పరిగణిస్తోంది. పవిత్రమైన మతాధికారిగానే పరిగణించటం గమనార్హం. కాబట్టి ఈ ఇరువురు అంటే, ఓ పెద్ద ప్రజాస్వామ్య దేశాధినేత, గొప్ప మతాధికారి మధ్య జరిగిన సమావేశంగానే చూడాల్సిన ఆవశ్యకత ఉంది. రాజకీయ కోణంలో చూడటం తగదు.
నరేంద్ర మోదీనే కాదు గతంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు జూన్ 2000లో వాటికన్ సిటీని సందర్శించారు. అంతకుముందు సంవత్సరంలోనే పోప్ జాన్‌పాల్ భారతదేశాన్ని సందర్శించటానికి వచ్చినపుడు అవసరమైన అన్ని ఏర్పాట్లు సైతం ఆనాటి వాజ్‌పేయి ప్రభుత్వం కల్పించింది. కాని అప్పటి పోప్ జాన్‌పాల్ భారతదేశానికి వచ్చినపుడు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘తొలి సహస్రాబ్ది కాలంలో యూరప్ ఖండం మట్టిలో ఏసు శిలువకు గట్టి పునాది వేశారు. అమెరికా, ఆఫ్రికా ఖండాలలో సైతం శిలువ ప్రాబల్యం పెరిగింది. ఈ ఖండంలో కూడా మూడవ క్రైస్తవ సహస్రాబ్ది బలంగా పాదుకోవాలని’ పిలుపు నివ్వటం జరిగింది. అంటే భారతదేశంలో మత మార్పిడులను ప్రోత్సహించే చర్యలకు ఆయన పిలుపు ఊతం ఇచ్చే విధంగా ఉందనేది జగమెరిగిన సత్యం. ఇక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే వాటికన్ సిటీకి చెందిన ఈ పోప్‌ను రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎనిమిది సంవత్సరాలలో మూడుసార్లు కలిశారు. కాని ఆయనను ఏనాడు తమ దేశానికి రమ్మని ఆహ్వానించ లేదు. రష్యాకు చెందిన సనాతన చర్చ్ పోప్‌కు ఇక్కడ స్వాగతం లేదు అని తెగేసి చెప్పింది. రష్యా, ఇంకా ఇతర దేశాలలో క్యాథ లిక్కులు ‘గొర్రెలను దొంగిలిం చటం’ మాకోవాలని హితవు పలికింది. అంటే మతమార్పిడులకు పాల్పడవద్దనే గట్టి హెచ్చరిక.
నెహ్రూ నుంచి మోదీ వరకు..
ప్రధాని నెహ్రు దగ్గర నుంచి మోదీ వరకు ప్రధానులందరూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అన్ని మతాల పట్ల సమదృష్టినే ప్రదర్శించారు. అదే భారతీయతత్వం అని వేరే చెప్పనక్కర్లేదు. మన రాజ్యాంగం ‘మతస్వేచ్ఛ’ను అందించింది. మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా చేయటంతో దీన్ని అవకాశంగా తీసుకుని క్రైస్తవ మిషనరీ సంస్థలు విచ్చలవిడిగా దేశంలో మతమార్పిడులకు పాల్పడ్డాయి. మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా అన్ని పార్టీలతో పాటు బీజేపీ సైతం గౌరవించింది. ఇదే సందర్భంలో తెలిసో, తెలియకో ప్రలోభాలకు లోనై మతాన్ని మార్చుకున్నవారు తిరిగి తమ మతాన్ని స్వీకరించ టానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మత మార్పిడులు చట్టబద్ధమైనపుడు పునః మార్పిడులను కూడా చట్టబద్ధమైనవిగానే భావించాలి. కాని ఈ పునఃమార్పిడులు జరుగుతున్నపుడు కొందరు అత్యుత్సాహవంతులు క్షమాపణల పేరుతో హుషారు ప్రదర్శిస్తూ నానా రాద్ధాంతం చేస్తున్నారు.
అత్యుత్సాహంతో కొంతమంది చేసే ఇలాంటి క్షమాపణ రాజకీయాలు మిషనరీలకు ఇంకా ఊతం ఇచ్చినట్లే. ఇలా తమ మతంలోకి తిరిగివచ్చే సందర్భంలో ఇదే చట్టబద్ధతను ప్రదర్శించాలని అంటే మిషనరీ సంస్థలు ‘దేశంలో క్రైస్తవం ప్రమాదంలో పడింది’ అని ప్రకటనలు ఇస్తూ.. ఏదో తమ ఉదారతను ప్రదర్శించటం మనం చూస్తున్నాం.
రగులుతున్న తాజా వివాదం..
తాజాగా మరో వివాదాన్ని ముందుకు తీసుకు వచ్చారు. అదే విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టాన్ని మిషనరీ సంస్థలకు పొడిగించే అంశంపై చిలువలు పలువలుగా చేసి వివాదాలను రాజేస్తు న్నారు. ఈ వివాదంలో ఎన్నో వాస్తవాలు దాగి ఉన్నాయి. కాని వాటిని బయటకు రానివ్వటం లేదు. ఈ చట్టాన్ని కేవలం మిషనరీ సంస్థలపైనే అస్త్రంగా ప్రచారం చేయటం అనైతికం. ఎందుకంటే ఈ చట్టాన్ని ఉపయోగించుకుని వ్యక్తిగతంగా ఎంతోమంది విదేశీ నిధులను అప్పనంగా కాజేస్తున్నారు. ఇలా అక్రమంగా లబ్ధి పొందుతున్న ఎన్నో ఎన్‌జీఓలకు వచ్చే విదేశీ నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయటం జరిగిందనే నిజాన్ని కావాలనే నొక్కిపెట్టేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం క్రైస్తవ మిషనరీ సంస్థలకే ఈ విదేశీ నిధులు రాకుండా ఆపేసిందనే ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పలు హిందూ ధార్మిక సంస్థలకు సైతం ఎఫ్‌సిఆర్‌ని పొడిగించలేదు. సంఘ పరివార్ ఆధ్వర్యంలో నడిచే సేవాభారతి అనే సంస్థకు సైతం నిధులు ఆగి పోయాయి. సంఘ పరివార్ కూడా ఎన్నోసార్లు కేంద్రాన్ని కోరింది. క్రైస్తవ మిషనరీ సంస్థకు అడగక ముందే దాని చట్టబద్ధతను పొడిగించారు. కాని బ్రిటీషు కాలం నుంచి ఒకే పంథాను అనుసరిస్తున్న మీడియా సంస్థలకు కేంద్రం చర్యలు కనిపించవు. అవి విషప్రచా రాన్ని చేస్తూనే ఉంటాయి. ఈ విషయంలో కొన్ని మీడియా సంస్థలు ఇంకా శక్తిమంతంగా పని చేస్తున్నాయి. దీంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వివాదా లకు తావులేకుండా, శ్రద్ధగా పరిశీలిస్తూ దుష్ప్ర చారానికి అడ్డుకట్టవేసే చర్యలకు ఉపక్రమించింది.
చట్టాలను గౌరవించాల్సిన అవసరం లేదా?
మన దేశంలో పనిచేసే సేవాసంస్థలు ఒక విషయాన్ని మరువకూడదు. దేశ చట్టాలను గౌరవిస్తూ ఆ చట్టాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అంతేకాని మత ప్రాతిపదికన పనిచేయ కూడదు. దేశవ్యాప్తంగా మూసివేసిన దాదాపు 50 వేల ఎన్‌జీఒలు ఎఫ్‌సిఆర్‌ను పొడిగించాలని దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో అత్యధిక శాతం క్రైస్తవ మిషనరీ సంస్థలే. కాని క్రైస్తవ ఎన్జీఓలు విదేశాల నుంచి వచ్చే నిధులను పక్కదారి పట్టిస్తున్నాయి. విదేశీ నిధులను విచ్చల విడిగా వ్యక్తిగతంగా వినియోగించుకుంటు న్నారు. అది ఎలా అంటే సొంత పేర్లుతో లక్షలాది రూపాయలు విలువచేసే వాహనాలు కొనుగోలు చేయటం, వారం వారం నిర్వహించే చర్చ్ సమావేశా లకు డబ్బులిచ్చి జనాలను పోగెయ్యటం పరిపాటి. దీంతో నిజమైన బాధితులకు ఈ విదేశీ నిధులు అందటం లేదు. పరిపాలనాపరమైన పనులకే ఈ సంస్థలు ఖర్చు చేసుకుంటాన్నాయి. ఇలా విదేశీ నిధులను దుర్వినియోగం చేస్తున్న ఎన్జీఓల్లో క్రైస్తవ మిషనరీ సంస్థలే ముందుభాగాన ఉన్నాయి.
దాతృత్వం మన సంస్కృతిలో భాగమే..
దాతృత్వం అనేది మనకు సాంస్కృతిక వార సత్వంగా వస్తున్న సంపద. ఎన్నో దాతృత్వ సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు ఎక్కడా కూడా మతంపై ఒత్తిడి చేసి బాధితులను ఇబ్బందులకు గురిచేయలేదు. సంఘ పరివార్ దాదాపు రెండు లక్షల సేవా ప్రాజెక్టు లను మురికివాడల్లో నిర్వహిస్తోంది. కాని ఎక్కడా మత ప్రచారానికి ఈ ప్రాజెక్టులు పూనుకోవటం లేదు. క్రైస్తవ మిషనరీ సంస్థలు కూడా సిక్కు, జైన, బుద్ధ, ముస్లిం సంస్థల వలె విద్యా సంస్థలను, ఆసుపత్రులను నిర్వహిస్తున్నాయి. కాని ఈ సంస్థల్లో మతమార్పిడులకు పాల్పడుతుంటాయి. ఇలా మతమార్పిడులకు పాల్పడినప్పుడల్లా సంఘ పరివార్ వెళ్లి నిల దీయటం.. వెంటనే ఈ క్రైస్తవ మిషనరీ సంస్థలు క్షమాపణలు చెప్పేసి, ఇకపై ఇలా చేయం అని హామీ ఇవ్వటం, మళ్లీ కొన్ని రోజులకు యథావిధిగా మత మార్పిడులకు గుంభనంగా పాల్పడటం దేశంలో పరిపాటైంది. ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలపై మత పరమైన ఒత్తిడి తీసుకురావటం, సంఘ పరివార్‌ను దూషించటం పరిపాటిగా మారింది. కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఇలాంటి మత మార్పిడులకు అండదండలు ఇవ్వటం సిగ్గుచేటు. ఇలాంటి సంకుచిత రాజకీయాల వల్ల దేశంలో కొన్ని ఎన్జీఓలను మత ప్రచారానికి వేదికలుగా చేసుకుంటున్నాయి. దురదృష్టవశాత్తు మిషనరీ సంస్థలు చేసే మంచి పనులు కూడా దుర్వినియోగం అవ్వటం, వాటిని వివాదాలు చుట్టుముట్టినపుడు కొన్ని రాజకీయ పార్టీలు భుజాలకెత్తుకుని కీర్తించటం పరిపాటైంది. మదర్ థెరిస్సా నిర్వహించే చారిటబుల్ ట్రస్ట్‌పై ఎన్ని విమర్శలు, వివాదాలు వచ్చినా.. ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంస్థలు పనిగట్టుకుని మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్‌కు అండదండలు ఇస్తుంటాయి. దేశంలోని క్రైస్తవులు కొందరి చేతుల్లో హింసకు గురి అవుతున్నారనే ప్రచారాన్ని ముందుకు తీసుకువచ్చి అపకీర్తిని మూటగట్టుకుంటున్నాయి.
– రామ్ మాధవ్, అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు ఆర్‌ఎస్‌ఎస్