– జాగృతి డెస్క్‌

2021 డిసెంబర్‌ 28వ తేదీన భాగ్యనగర్‌, నారాయణమ్మ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘచాలక్‌ శ్రీ మోహన్‌జీ భాగవత్‌ పురప్రముఖల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఆ ఉపన్యాసంలోని భాగాలు :

హిందుత్వం గురించి ఇవాళ పెద్ద చర్చే జరుగుతున్నది. రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. మాకు హిందు అనేది అవసరమే, హిందూత్వం వద్దని కొందరు. మరికొందరు, హిందుత్వం సరైనది, కాకపోతే ‘హిందూవాదము’ సరైనది కాదని అంటున్నారు. అయితే వివేకానంద, గాంధీజీ చెప్పిన హిందూత్వ మంచిదని అంగీకరిస్తున్నారు. ఇదంతా సామాన్య హిందువులలో గందరగోళం సృష్టిస్తున్నది. ఫలితంగా రాజకీయ వాతావరణం మారిపోతున్నది. ఈ మార్పులో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర ఉందన్న భ్రమలో ఉన్నవారూ లేకపోలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ మీద ఉన్న భ్రమల్లో ఇదొకటి. అందుకే ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యంగా ఇలాంటి చర్చ లేవదీస్తున్నారు. హిందూ తీవ్రవాదం అనే చర్చనూ లేవదీశారు. దీన్ని యావత్‌ హిందూ సమాజం వ్యతిరేకించడంతో తిరిగి వారి మెడకే చుట్టుకొంది. హిందూత్వం సరైనదే కానీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పే హిందూత్వం సరైనది కాదని ఒక కొత్త ప్రతిపాదన మొదలుపెట్టారు. అపుడు ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు ఆలోచించి, సమాజంలో అభిప్రాయం నిర్మాణం చేయగలిగే ప్రముఖులను, మేధావులను అక్కడక్కడ సమావేశపరచారు. అందులో హిందూత్వం గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ చెబితే తప్పేమిటి అనే అభిప్రాయం వ్యక్తమైంది.

హిందువు, హిందూత్వం గురించి స్పష్టంగా చెప్పడం కష్టమే. ఆ రెండిరటిని అర్థం చేసుకోవడం ఇతర దేశాలవారికి మరీ కష్టం. నాగపూర్‌లో సర్వోదయ నాయకుడు దాదా ధర్మాధికారి ఉండేవారు. హిందూ పదాన్ని వర్ణిస్తూ, ‘స్టేషనరీ దుకాణంలో స్టేషనరీ పేరుతో ఏ వస్తువు లభించదు. పెన్సిల్‌, పెన్ను, పాడ్‌, పేపర్స్‌ దొరుకుతాయి. హిందుత్వం కూడా అంతే’ అనేవారు. అందుకని బయటివారు గజిబిజి అవుతారు. ప్రాచీనకాలం నుండి ఈ దేశ ఉన్నతి కోసం శ్రమించిన వారి భావధార నుండి ఉద్భవించిన భావాలను భారతీయ భాషలోనే వ్యక్తం చేయగలం. ఇతర భాషల్లో చేయలేం. మన భాషను వదలిపెట్టి ఇంగ్లిష్‌లో మనలను మనం అర్థం చేసు కోవడం ప్రారంభించాం. దానితోనే ఈ భ్రమలన్నీ.

ప్రాచీనకాలం నుండి హిందూ పదం వాడుకలో లేదు. తర్వాత వచ్చింది. రామాయణ, మహాభారతా లలో ఆ పదం లేదు. హిందు పదాన్ని నిర్వచించడం కష్టమని సుప్రీంకోర్టు చెప్పింది. ఇటీవలి కాలంలో అనేకమంది మహానుభావులు, సాధుసంతులు దీనిని శోధించి చెబుతున్నారు. ‘మధు చరంతి హిందవాః’ (సర్వత్ర ఆనందాన్ని కురిపించేవాడే హిందువు) అని పెద్దలు అంటారు. ఈ పేరు బయటివారు పెట్టారు. దానిలో మనకు ఇబ్బంది లేదు. దీనిని గురించి చర్చించాల్సిన అవసరమూ లేదు. మన తల్లిదండ్రులు మనకు పేరు పెట్టినపుడు మనలను అడిగి పెట్టలేదు గదా! కాని ఆ పేరుతోనే మనం పరిచయమ వుతున్నాం. హిందూపదం కూడా అంతే. సింధూనది ఇవతలి తీరంలో నివసిస్తున్నవారం కనుక హిందూ అన్నారు. మొత్తం భువన త్రయాన్ని (ముల్లోకాలను) స్వదేశంగా భావించేవారు హిందువులు.

‘ఉత్తరం యత్‌ సముద్రస్య ….. భారతీయత్ర సంతతిః’ సముద్రానికి ఉత్తరాన హిమాలయాలకు దక్షిణాన వ్యాపించి ఉన్న భూమి భారత వర్షము, దాని సంతానం భారతీయులు. ‘హిమాలయం సమారభ్య… హిందూస్థానం ప్రచక్ష్యతే॥ హిమాలయాలు మొదలుకొని హిందూ మహాసముద్రం వరకు దేవతలచే నిర్మితమైన ఈ భూభాగాన్ని హిందుస్థానం అంటారని మన పురాణాల్లో చెప్పబడిరది. అయితే ఈ భావన కేవలం బుద్ధిజీవులలోనే ఉంది. సాధారణ ప్రజలకు చేరలేదు. సాధుసంతులు చెప్పినదే సాధారణ ప్రజల్లో నాటుకొంటుంది. ఇస్లాం ఆక్రమణల తరువాతే హిందూపదం వాడుకలోకి వచ్చింది. ఇస్లాం ఆక్రమణ ఇతరుల ఆక్రమణల కన్నా భిన్నమైనది. ఇస్లాంది ఆక్రమణ ప్రవృత్తి. వారు మన దేశంపై దాడిచేసి చంపడం ప్రారంభించారు. సంపదను లూటీ చేశారు. పూజాపద్ధతిని వేరు చేశారు. ఇస్లాంకు చెందనివారిని కాఫిర్ల పేరుతో నిర్మూలించడం ఆరంభించారు. ముస్లింల ఆక్రమణల నుండే సాధు మహాత్ములు కూడా హిందూ అనే పదాన్ని వాడుకలోకి తెచ్చారు. పంజాబ్‌లో బాబర్‌ నరమేధం సాగిస్తుంటే, గురునానక్‌ ‘బాబరు అనే ఈ పాపి తుర్కిస్థాన్‌ను నాశనం చేశాడు. హిందూస్థాన్‌లో నరమేధం చేస్తున్నాడు. ఇటు హిందువుల మానం పోయింది, అటు ముస్లింలు ఉనికి కూడా కోల్పోయారు. అందరినీ చంపుతున్నాడు. శరీరం మీద అక్కడక్కడ గుడ్డపేలికలు తగులుకొని ఉన్నట్లు నేటి ప్రజల పరిస్థితి ఉన్నది. ఈశ్వరేచ్ఛ కాబోలు. బాబర్‌ వచ్చాడు, అలాగే వెళ్ళిపోతాడు’ అని నానక్‌ భవిష్యవాణి చెప్పారు. ఆ విధంగా మొదటిసారిగా హిందూ అనే పదాన్ని గురునానక్‌ పలికినారు. మన దేశంలో ఏ దేవుని పూజించినా హిందువు అనే అంటాం. కాని గత అనేక సంవత్సరాలుగా హిందువులైన మనం పూజ పేరుతో పూజా గదిలో, భోజనం పేరుతో భోజన పళ్లెంలో హిందువును బంధించాం. ఫలానా విధంగా భోజనం చేసేవాడు హిందువు అని ఫలానా విధంగా పూజ చేసేవాడు హిందువు అని, మిగతావారు హిందువులు కాదని అనసాగాం. ఇది సరిjైున పద్ధతి కాదు.

హిందుత్వం మన గుర్తింపు. ఇది మన జాతీయత. ప్రస్తుత ఇమాం బుఖారీ తండ్రి ఒకసారి మక్కా వెళ్లి తిరిగి వస్తున్నపుడు ఖాజీ అతనిని మీరు ఎవరని అడిగారు. ముస్లిం అని జవాబు చెప్పాడు. ఇక్కడ అందరము ముస్లింలమే. మీరు ఎక్కడి నుండి వచ్చారు అని ఖాజీ మరల ప్రశ్నించారు. ఇండియా నుండి అని చెప్పాడు. ‘మీరు హిందువే అన్నమాట. జాతిపరంగా మీరు హిందువే’ అన్నారు ఖాజీ. కొందరు హిందుత్వాన్ని జాతీయతగా గుర్తించి గర్విస్తున్నారు. కొందరు జాతీయతగా గుర్తిస్తున్నారు, కాని గర్వకారణంగా భావించడం లేదు. కొందరైతే స్వార్థంతో హిందువని చెప్పుకోవడం లేదు. ఏది ఏమైనా అది మనకు గుర్తింపునిచ్చేదే.

మన దేశంలో ఉన్న విశేషమేమంటే సత్యాన్ని పొందేవరకు విడవకుండా తపస్సు చేశారు పెద్దలు. ఇతర దేశాలలో ఇలా జరగలేదు. సర్వస్వం నేనే అనే భావాన్ని ఈనాడు మనం సరిగా అర్థం చేసు కోకుండా వ్యవహరిస్తున్న కారణంగా పర్యావరణం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

అస్తిత్వం (ఉనికి) ఒక్కటే. కాని భేదాలున్నాయి. ఆ వైవిధ్యంలోనే ఏకత్వం ఉందని మన పూర్వుల అభిప్రాయం. ఒకటే అనేకం. అనేకుల్లో, అన్నింటిలో నేనున్నాను. ఆత్మవత్‌ సర్వభూతాని అనే భావన మనది. బలవంతుడే మనగలడు అనే భావన మన దగ్గర లేదు. సహకారమందిస్తూ, కలుపుకొని పోయే తత్త్వం మనది. ఎవరూ నష్టపోకూడదు. అందరి అభివృద్ధిలో నా వికాసం ఉందనే భావన మనది. అందరికోసమే నా వికాసం అనే భావన లేకపోతే అది వికాసమే కాదనే సత్యాన్ని మన రుషులు తెలుసున్నారు. మనం భ్రమలో మునిగి పరస్పరం విరోధులమవుతున్నాం. అందరినీ కలుపుకు పోవాలంటే మన రుషులు అందించిన జ్ఞానాన్ని పంచాలి. ఇది ఒకరిద్దరితో అయ్యే పని కాదు. సమాజం మొత్తం సిద్ధం కావాలి. ఈ భావనతోనే మన రాష్ట్రాన్ని (దేశాన్ని) నిలబెట్టారని ‘‘ఓం భద్రమిచ్చంతురుషయః…. తదస్మైదేవా ఉపసన్నమస్తు’’ (విశ్వకళ్యాణాన్ని కోరుకొన్న మన రుషులు తమ సుఖాలను త్యజించి ఈ దేశాన్ని బలోపేతంగా, ఓజస్సంపన్నంగా చేశారు) అనే వేదమంత్రం సూచిస్తున్నది.

ప్రాచీన కాలం నుండి ఈ సత్యాన్ని ఆధారం చేసుకొని సంచార జాతులవారు మన సమాజంలో జ్ఞానాన్ని పంచుతున్నారు. వీరు ఒకచోట ఉండకుండా సమాజంలో సంచరిస్తూ మన సంస్కృతిని ప్రచారం చేస్తుంటారు. వీరు గృహ వైద్యం చేస్తారు. కొందరు బలోపాసనను ప్రచారం చేస్తూ వీధుల్లో శారీరక విన్యాసాలు చేస్తారు. ప్రస్తుతం వీరు చాలా పేదిరకంలో మగ్గుతు, పీడనకు గురి అవుతున్నారు. ఈ సంస్కృతిని నిలబెట్టాలనే వ్రతాన్ని పూని, దాన్ని ఒక ఉద్యమంగా మలచుకొని, సత్యంపై ఆధారపడిన జీవనాన్ని మనందరం గడపాలని ప్రచారం చేస్తూ వారు ఈ దేశాన్ని నిలబెట్టారు. సమయం, స్థలం, అవసరాలు రకరకాలుగా మారుతుంటాయి. రంగు వేరు కావచ్చు. కాని శాశ్వత సత్యం మారదు.

మనుగడ కోసం కాదు, సత్యాన్వేషణ కోసం పోరాడాలి. భౌతికవాదం, వినియోగవాదం పనికిరావు. సంయమనంతో బ్రతకాలి. అందరి సుఖంలోనే మన సుఖముందని భావించాలి. ఉదాహరణకు: ఒక డేగ పావురాన్ని తినడానికి వెంట పడిరది. పావురం శిబి చక్రవర్తి దగ్గరకు వచ్చి ప్రాణాలు కాపాడమన్నది. డేగ, పావురాన్ని నాకు అప్పగించు ` అది నా ఆహారం అని అడిగింది. అందుకు శిబి పావురాన్ని కాపాడటం నా ధర్మం అన్నాడు. పావురాన్ని తినడం నా ధర్మం. నేను మాంసం తప్ప వేరే ఆహారం తినను. ప్రకృతి సహజమైన నా ధర్మాన్ని నీవు నిరోధించి, నీ ధర్మాన్ని ఎలా పాటిస్తావు. ఇదేమి ధర్మం? ‘ధర్మం ఒకటే ఉంటుంది. అందరికి సుఖాన్నిస్తుంది అని డేగ అన్నది. అప్పుడు శిబి అందరి సుఖమే తన సుఖంగా భావించి డేగతో నీవు నా మాంసాన్ని తిని, పావురాన్ని వదలివేయి అని తన తొడ మాంసాన్ని డేగకు కోసి ఇచ్చాడు.

అందరినీ సుఖపెట్టేదే శాశ్వత తత్త్వం. అదే ధర్మం. ఆ సత్యం కోసం, ఆ లక్ష్యం కోసం సామాజిక జీవనం అవసరం. అందరిని కలపాలి. నీ అవసరాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నించు. ఆ అధికారం నీకుంది. కాని అందరి అవసరాల్ని కాలరాయకు. అందరి సుఖాన్ని కోరేదే హిందూధర్మం.

నా విశ్వాసం ప్రకారం ధర్మబద్ధంగా ఉంటాను ` నీ విశ్వాసం ప్రకారంగా ధర్మంగా ఉండు, దానితో పరస్పర సహకారంతో అందరి అభివృద్ధి సహజం. సృష్టిలో సహకార సంబంధముంది. సంవేదనతో సమాజం నడుస్తుంది. కరుణ, సమన్వయం సహకారంతో సంవేదన కలిగి ఉండటమే మనిషి గొప్పతనం. సత్యం, కరుణ, అంతఃకరణ, ఆంతరిక శుద్ధి, బాహ్యశుద్ధి అవసరం. మన అంతఃకరణ నుండి క్రామ, క్రోధ, భయాలను తొలగించాలి. అందుకే మానవ జీవితం ఒక తపస్సు.

అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ ` ఇవి ధర్మంలోని శాశ్వత తత్త్వాలు. ఇదొక జీవనయాత్ర. ఈ ఆలోచనా విధానమే మన తత్త్వానికి ఆధారం.

అనేక యుగాల నుండి చిన్న చిన్న ఆచారాలను పాటిస్తూ వస్తున్న పరంపర మనది. బజారులో ఏదైనా కొన్నప్పుడు కొసరు వేసే పద్ధతి, ఏదైనా కార్యక్రమం ప్రారంభించే ముందు పూజ చేసే పద్ధతి అఖండ భారతమంతటా ఉంది. ప్రతిచోట దైవత్వాన్ని, చైతన్యాన్ని చూడటం మన పరంపర. ఇది అనేక తరాల నుండి వస్తున్నది.

మన దేశంలో ఇన్ని ప్రాంతాలు, భాషలు ఉన్నప్పటికి మన సంస్కృతి మనలను కలుపుతుంది. అనేక సంప్రదాయాలున్నప్పటికి మనమంతా ఒక దేశంగా భావించి ముందుకు నడుస్తున్నాం. దానికి కారణం సంస్కృతి` మన మాతృభూమి. భారత్‌లో సికిందరు కంటే ముందు ఆక్రమణలు జరుగలేదు. అన్ని రకాలుగా సమృద్ధిలో ఉన్నాం. లోటు లేదు, సత్యముంది.

దేవీదేవతలు వేరు, భాషలు వేరు. అయినప్పటికి, అన్నింటిని స్వీకరిస్తాం. ధర్మం ఆధారంగా ఉంటున్నాం.

‘‘సహస్ర ధారలతో పాలిచ్చే గోమాత మాదిరిగా భూమాత మాకు, అన్ని సంప్రదాయాల వారికి, అన్ని భాషల వారికి, సస్యశ్యామలత్వాన్ని ఇవ్వు తల్లి’’ అనేది మన సనాతన ప్రార్థన. వివిధత్వం అనే ధర్మం లేదు` మన చరిత్రలో ఎన్నో సంఘటనలు ` ఎత్తు పల్లాలు సంభవించాయి. మార్పులు జరిగాయి. మనం మన అస్తిత్వం కోల్పోలేదు. ‘‘యూనాన్‌ రోమ్‌ మిశ్ర ` సబ్‌ మిట్‌గయే జహాసే ` కుఛ్‌ బాత్‌ హై హస్తీ ` మిటితీ హమారీ నహీ ` ఎన్నో బలిదానాలతో మనం మన అస్తిత్వాన్ని కాపాడుకున్నాం. మన జ్ఞాననిధి రక్షణ కోసం చేసిన ప్రయత్నం గొప్పది. ఇదంతా మన పూర్వీకుల గాథ. రాముడు మన జీవితానికి ఆదర్శం. మన మాతృభూమి పట్ల అనన్య భక్తి నింపుకోవాలి. మన పవిత్ర హిందూధర్మం, హిందూ సంస్కృతిని ఆచరించాలి. దీని రక్షణ కోసం హిందువులు సిద్ధంగా వుండాలి. అహింసను ధర్మ మంటారు. హిందుత్వాన్ని కాపాడుకోవడానికి శక్తి అవసరం. దుర్బలత్వం మహాపాపం. సమాజాన్ని దుర్బలంగా ఉంచకూడదు. శక్తితోపాటు కరుణ, స్వచ్ఛత చాలా ముఖ్యం. ఇదం బ్రాహ్యం ` ఇదం క్షాత్రం। శస్త్రేణ రక్షతేరాజ్యే। శస్త్రాలతోనే శాస్త్రాలకు రక్షణ ఉంటుంది. అందుకే హిందుత్వాన్ని రక్షించడం అవసరం, మనం ప్రపంచంలో ఎవరిని చంపం. బలవంతంగా మతమార్పిడి చేస్తే, మరలా హిందువులను మన ధర్మంలోనికి తీసుకొని వస్తాం. ఇది న్యాయం. అన్యాయం కాదు. హిందుత్వం ఎవరిని భయపెట్టదు, ఎవరికి భయపడదు. అలాగే హిందూ సమాజం ఎవరిని భయపెట్టదు, ఎవరికి భయపడదు. ధర్మ సంస్కృతికి సంబంధించిన అన్ని విషయాలు హిందూ సమాజంలో సజీవంగా ఉన్నాయి. వీటిని ఆచరించే వాడు వ్యక్తి, సమాజం.

హిందూత్వం గురించి మాట్లాడనివాడే కమ్యూనల్‌. సంపూర్ణ దృష్టి హిందుత్వంలో వుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూ సంఘటన చేస్తుందంటే సంపూర్ణ దృష్టితో సమానంగా ఆలోచింప చేస్తుంది. భారతదేశంలో నివసించే 130 కోట్ల మందీ హిందువులే. హిందూ త్వాన్ని వ్యతిరేకించడం భారతదేశం బయటవున్న వారి లక్షణం. హిందూ సంస్కారాలు నశించవు. హిందుత్వాన్ని అందరు స్వీకరించాలి ` స్వార్థ రహితంగా, ద్వేష రహితంగా వసుధైక కుటుంబకం కోసం బ్రతికే అలవాటు హిందువులది కావాలి. ఆ పనిచేసే వారు విశ్వ కల్యాణం కోసం పనిచేస్తున్నట్లే. అంటే హిందూత్వం మంటే విశ్వకల్యాణమే.

ఈ విషయాలు అందరికీ చెప్పాలి.

About Author

By editor

Twitter
YOUTUBE