– ఎం.వి.ఆర్. శాస్త్రి
సుభాస్ చంద్ర బోస్ చివరిలో పెద్ద తప్పు చేశాడు. చెయ్యకూడని దుస్సాహసం చేసి చేజేతులా ప్రాణం పోగొట్టుకున్నాడు – అని నొచ్చుకునేవాళ్లు చాలామంది ఉన్నారు.
శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న రాజనీతిని అనుసరించి రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ శత్రువైన జపాన్‌తో చేతులు కలిపి దేశ స్వాతంత్య్ర లక్ష్యం సాధించాలని బోస్ గొప్ప వ్యూహం పన్నాడు. విమోచన సైన్యాన్ని సమీకరించి అద్భుతంగా పోరాడాడు. ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడి సరెండర్ అయ్యాక పరిస్థితి మారింది. స్వాతంత్య్ర సంగ్రామానికి సైనికపరంగా ప్రధాన ఆలంబనం పోయింది. సొంతంగా బ్రిటిష్ సామ్రాజ్యంతో పోరాటం కొనసాగించేందుకు బోస్ సైనికశక్తి ఎంతమాత్రం చాలదు. రష్యా ఆశ్రయం పొంది బలం పుంజుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఇక చెయ్యగలిగింది ఏమీలేదు. ఆ కఠోర వాస్తవాన్ని గుర్తించి, జపాన్ లాగే బోస్ కూడా సరెండర్ అయి ఉంటే చరిత్ర గతి మరోలా ఉండేది. ప్రజల ఆగ్రహానికి తాళలేక ఆజాద్ హింద్ ఫౌజ్ బందీలను విడిచిపెట్టినట్టే, ఆజాద్ హింద్ ప్రభుత్వ అధిపతి సుభాస్ చంద్ర బోస్‌నూ బ్రిటిష్ సర్కారు వదిలివేయక తప్పేది కాదు. ఐఎన్‌ఎ శౌర్యానికి, త్యాగానికి అనివార్య పర్యవసానంగా స్వాతంత్య్రం సిద్ధించాక బహుశా నేతాజీయే స్వతంత్ర భారత తొలి అధినేత అయి ఉండేవాడు. కాకున్నా కనీసం క్షేమంగా ఉండి తిరుగులేని ప్రజాబలంతో దేశాన్ని నడిపించేవాడు. అలా జరగలేదే అని బాధపడే వాళ్ళు ఇప్పటికీ కోట్ల సంఖ్యలో ఉన్నారు.
బర్మాలో కీలుబొమ్మ ప్రధాని బా మా కూడా తన దేశ విముక్తి కోసం జపాన్ సహాయం ఉపయోగించుకున్నాడు. కాని పరిస్థితితో రాజీపడి జపాన్‌తో పాటు తానూ సరెండర్ అయ్యాడు. సుభాస్ చంద్ర బోస్ కూడా అలా చేయకపోవటం ‘fatal error (ప్రాణాంతకమైన తప్పు) అని The Lost Hero గ్రంథంలో మిహిర్ బోస్ అన్నాడు. మంత్రులతో బాటు తానూ సింగపూర్ లోనే ఉండిపోయి బ్రిటిష్ సేనలను ధైర్యంగా ఎదుర్కొనాలని నేతాజీ మొదట తలచినప్పటికీ, వద్దని వారించి శత్రువుకు చిక్కకుండా పారిపోవాలని మంత్రిమండలి సలహా ఇవ్వటం ‘catastrophic error’ (ఉపద్రవ హేతువైన తప్పిదం) అని ఱ His Majesty’s Opponent గ్రంథంలో సుగతా బోస్ వ్యాఖ్యానించాడు. ఆ సమయాన అక్కడే ఉన్న ఆజాద్ హింద్ ఫౌజ్ కమాండర్ మొహమ్మద్ జమాన్ కియానీ కూడా లొంగిపొమ్మని బోస్‌కు చెప్పాడట. ఆ వైనాన్ని అతడి మాటల్లోనే విందాం:
‘‘1945 ఆగస్టు 15 రోజంతా ఆజాద్ హింద్ ప్రభుత్వం సుభాస్ చంద్ర బోస్ సమక్షంలో పరిస్థితిని విశ్లేషించి భావి కర్తవ్యం గురించి చర్చించింది. జపాన్ కమాండర్ ఇన్ చీఫ్‌తో టచ్‌లో ఉంది. త్వరి తంగా మారుతున్న పరిణామాలను బోస్ ఎప్పటి కప్పుడు తెలుసుకుంటున్నాడు. 16 వ తేదీ తెల్లవార్లూ సమాలోచనలు సాగాయి. తాను బతికి ఉన్నంతవరకు స్వాతంత్య్ర పోరాటాన్ని విరమించి ఆయుధాలు కిందబెట్టే ప్రసక్తే లేదని విప్లవకారుడిగా బోస్ పట్టుదల. బ్రిటిషర్లు మలయాను తిరిగి ఆక్రమించాక కూడా అడవులకు వెళ్లి పోరు కొనసాగించాలని అతడి ఆలోచన. ఆ ప్రతిఘటనకు నాయకత్వం వహించమని నన్ను కోరాడు. నేను మర్యాదగా తిరస్కరించాను.
‘‘యుద్ధం నడిచినంత కాలం మన శత్రువులపై ప్రతిఘటనను దూర ప్రాచ్యం సహా ఎక్కడయినా జరపవచ్చు. కానీ యుద్ధమే ముగిసిపోయాక పరాయి దేశంలో మనం చేసే పోరాటం వల్ల మనదేశ స్వాతంత్య్రానికి ఒనగూడే ప్రయోజనం ఉండదు. ఆయా దేశాలు మళ్ళీ బ్రిటిష్ ఆధిపత్యం కిందికి వెళ్ళాక కూడా పోరాటం కొనసాగిస్తే ఇంతదాకా మన పోరాటానికి మద్దతు ఇచ్చిన స్థానిక భారతీయుల మీద తెల్లవారికి కసి ఇంకా పెరిగి వారిని మరింత సతాయిస్తారు. నా వాదనని బోస్ అంగీకరించాడు. కాని చేతులో ఇన్ని తుపాకులు ఉండీ వాటిని వాడకుండా, లొంగిపోవటం తన వంటి విప్లవ కారుడికి కష్టమని అతడన్నాడు. నేను మీ స్థాయి విప్లవకారుడిని కానని నేను అన్నాను. చాలా చర్చ జరిగిన తరవాత మిగతావారూ నా దారికి వచ్చారు. ఆయుధాలతో సహా లొంగిపోయి, భారత దేశానికి తిరిగివెళ్ళాక పరిస్థితిని బట్టి వేరే రూపంలో పోరాటం కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయమయింది.
‘‘తరవాతి ప్రశ్న, సుభాస్ చంద్ర బోస్ కూడా లొంగిపోవాలా వద్దా అన్నది. ఆంగ్లో అమెరికన్ సేనల చేతికి చిక్కకుండా సింగపూర్ నుంచి, వాటి ఆక్రమణకు గురికాగల దేశాల నుంచి తాను బయటపడదలచానని బోస్ అన్నాడు. రష్యన్ సైన్యం ఆక్రమించటానికి ముందే మంచురియాకు చేరుకోవాలని ఆయన ఉద్దేశం. అక్కడ రష్యన్లకు పట్టుబడి, వారిని ఎలాగో ప్రసన్నం చేసుకుని మాస్కో అండతో స్వాతంత్య్ర పోరాటం కొనసాగించాలని ఆయన ఆలోచన. ప్రపంచ యుద్ధానంతరం ఆంగ్లో అమెరికన్లకూ, రష్యాకూ నడుమ మునుముందు అనివార్యంగా పొడచూపే ఘర్షణను తెలివిగా ఉపయోగించుకుని స్వాతంత్య్ర లక్ష్యం సాధించ దలచినట్టు బోస్ మాకు చెప్పాడు. తన వెంట కొంతమంది మంత్రులను, ఆఫీసర్లను కూడా ఆయన తీసుకువెళ్లదలిచాడు. ముఖ్యంగా నన్ను తనతో రమ్మన్నాడు.
‘‘మళ్ళీ నేను నాయకుడితో విభేదించక తప్పలేదు. రష్యాకు వెళ్ళటం కంటే సింగపూర్లో ఉండిపోవటం వల్లే ఎక్కువ ప్రయోజనం అని నేనన్నాను. ఎందుకంటే సింగపూర్ మన పోరాట కేంద్రం. విప్లవ సైన్యం, విప్లవ ప్రభుత్వం ఇక్కడే స్థాపించబడ్డాయి. మన ఆశయం ఫలిస్తుందన్న ఆశలు మొదట ఇక్కడే చిగురించాయి. యుద్ధం ముగిసింది కనుక అందరం కలిసి ఇక్కడే ఉండి హుందాగా లొంగిపోవటం మంచిది. మన దేశవాసులు సిగ్గుపడవలసిన పని ఏదీ మనం చేయలేదు. యుద్ధం, సెన్సార్షిప్‌ల మంచుతెరలు తొలిగాక మన కార్యకలాపాలు అందరికీ ఎరుకపడతాయి. ప్రజలు మన చర్యలకు గర్వపడి మనకు అండగా నిలుస్తారు- అని నేను అందరి ముందూ చెప్పాను. సుభాస్ చంద్ర బోస్ నేనన్న దానితో కొంతవరకూ ఏకీభవించాడు. కాని – నిజమైన స్వాతంత్య్రం కావాలంటే పోరాటాన్ని ఉద్ధృతం చేసి మరిన్ని త్యాగాలు చెయ్యాలని ఆయన అభిప్రాయపడ్డాడు. అలాగే బ్రిటిషు వాళ్ళ చేతుల్లో పడి అవమానాల పాలవటం తనకు ఇష్టం లేదని ఆయన అన్నాడు. ఒకవేళ అమెరికన్లకు పట్టుబడినా వారు తనను బ్రిటిషు వారికే అప్పగిస్తారు కనుక అవమానం తప్పదు. దానికి తానూ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించనని బోస్ గట్టిగా చెప్పాడు. కొంతమంది ముఖ్య సహచరులతో బాటు బోస్ సింగపూర్ వదిలి పోవాలని 16వ తేదీ సూర్యోదయ సమయానికి తుది నిర్ణయం జరిగింది.’’
[Indiaµs Freedom Struggle and The Great INA, Maj. Gen. M.Z. Kiyani, pp. 161-163 ]
తాను లేని సమయంలో మేజర్ జనరల్ ఎం.జెడ్. కియాని ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రాతినిథ్యం వహిస్తాడని 16న సింగపూర్ వదిలి వెళ్ళేముందు నేతాజీ ఉత్తర్వు జారీ చేశాడు. అక్కడి ఆజాద్ హింద్ బ్యాంకులో దాచిన ఐదు లక్షల రూపాయలు విలువచేసే బంగారాన్ని ఎమర్జెన్సీ అవసరాల నిమిత్తం హెడ్ క్వార్టర్స్‌కు అందుబాటులో ఉంచాడు.
రష్యా వెళ్లి బావుకునేదేమిటి? ఎక్కడికీ పారి పోకుండా సింగపూర్ లోనే ఉండిపోయి బ్రిటిషు వారికి పట్టుబడటం మేలు అని కదా కియానీ సలహా? ఆ హితవును పాటించక ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాలన్న ఆత్రంలో పారిపోయినందువల్లే నేతాజీ ప్రాణం పోగొట్టుకున్నాడు అని కదా ఇప్పటికీ చాలామంది అభిమానుల బాధ? కియానీకి ఉన్నపాటి సమయస్ఫూర్తి నేతాజీకీ ఉండి అతడి లాగే సింగపూర్‌లో బ్రిటిష్ సేనలు వచ్చి పట్టుకునేదాకా వేచి ఉన్నట్టయితే ఏమయ్యేది? కియానికి జరిగిన సన్మానమే సుభాస్ బోసుకూ జరిగేది! ఏమిటా సన్మానం? కియానీయే చెపుతాడు వినండి:
‘‘బ్రిటిష్ సైన్యం సింగపూర్ చేరాక ఒకరోజు ఒక ఆస్ట్రేలియన్ కెప్టెన్ నా నివాసానికి వచ్చి ‘జనరల్! తమరిని పర్లస్ హిల్ జైలుకు తీసుకు వెళ్లమని నాకు ఆర్డర్స్. మీ వెంట మీకు కావలసిన దుస్తులు, వస్తువులు తెచ్చుకోవచ్చు.’ అన్నాడు. నేను నా స్టాఫ్ కారులో వెళ్ళాను. కాసేపు వరండాలో వెయిట్ చేయించాక జైలు సూపర్నెంటు నన్ను లోపలికి పిలిచాడు. అప్పటిదాకా జపాన్ చెరలో యుద్ధ ఖైదీలుగా ఉన్న బ్రిటిష్ ఆఫీసర్లు సూపర్నెంటు చుట్టూ చేరి ఉన్నారు. నన్ను ఒళ్ళంతా సోదా చేసి, నా రిస్టు వాచి, ఉంగ రాలు, నా పెట్టెలోని బట్టలు, వస్తువులు, మందులు అన్నీ లాగేసుకుని వారిలోవారు పంచుకున్నారు. తరవాత జైలు లోపలికి నన్ను తీసుకువెళ్లారు.సెల్స్ తెరిపించి ఖైదీలను నెత్తిన చేతులు పెట్టించి బయటకు పిలిచి బారులు తీర్చారు. వారిలో జపాన్ మిలిటరీ జనరల్సు, అడ్మిరల్సు, సీనియర్ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. ఆందరి ముందూ నన్ను నిలబెట్టి సూపర్నెంటు నా యూనిఫాం మీద రాంకును సూచించే బాడ్జిలను కర్రతో లాగేశాడు. తరవాత నాకు కేటాయించిన ఇరుకు సెల్‌లోకి నెట్టారు. అందులో పడుకునేందుకు ఒక ఇరుకు చెక్క బల్ల, మూలన రెండు బకెట్లు ఉన్నాయి. ఒకటి కాలకృత్యాలకు. రెండోదానిలో తాగేందుకు నీళ్ళు. రోజూ పొద్దున్నే రెండు బకెట్లూ చేత్తోపట్టుకుని లైనులో వెళ్ళాలి. ఒక దానిని ఖాళీ చేయించుకుని, రెండోది నీటితో నింపి తెచ్చుకోవాలి. రోజుకు నాలుగు ఔన్సుల బియ్యం మాకు రేషను. అందులో ఒక ఔన్సు గంజి నీళ్ళు వేడి చేసి ఉదయం టీ లాగా ఇస్తారు. మూడు ఔన్సులతో అన్నాన్ని చేసి సగం ఉదయం, సగం సాయంత్రం కంచంలో పడేస్తారు. వట్టి అన్నమే తప్ప కనీసం ఉప్పు కూడా వెయ్యరు.
‘‘నేను వెళ్ళిన మరునాడు మా ఆందరి గదుల్లో పడుకునే బల్లలు తీసేశారు. మా ఒంటి మీద బట్టలన్నీ తీసేయించి సిగ్గు దాచుకోవటానికి తలా ఒక గుడ్డ పేలికను ఇచ్చారు. రోజూ ఉదయం 10 గంటలకు అందరినీ అలా దాదాపు నగ్నంగా ఆరుబయట గంటల తరబడి నెత్తిన చేతులు పెట్టించి నిలబెట్టే వారు. సింగపూర్‌లో చాలా తరచుగా వాన పడేది. ఎండలో, వానలో గంటలపాటు నిలబడ్డాక తడి ఒంటితో గచ్చు నేల మీద పడుకోవలసి రావటంతో దోమల బాధ విపరీతంగా ఉండేది. ఒంటి మీద చర్మం ఊడిపోయేది. తిండి లేక నకనకలాడి చాలామంది బెరిబెరి జబ్బు బారిన పడ్డారు.
‘‘కొన్నాళ్ళకు జైలరు ఇంకో డ్రిల్లు కనిపెట్టాడు. అర్ధరాత్రి గాని, తెల్లవారక ముందు గాని ఖైదీలను వారివారి సెల్సు బయట మోకాళ్ళ కిందినుంచి చేతులతో చెవులు పట్టించి గొంతుకు కూచోబెట్టేవారు. దుడ్డుకర్రతో వెనకనుంచి గొడ్లను కొట్టినట్టు కొట్టేవారు. కాళ్ళతో తన్నేవారు. చెప్పిన పని చెయ్యటంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా వొంగోబెట్టి బూటు కాళ్ళతో బలంగా తన్నేవారు. వయసు మళ్ళి, తిండి లేక అవస్థ పడే ఆర్మీ జనరల్స్‌ను, ఎగిరి అవతల పడి మొహం పగిలేలా తన్నటం నేను చాలా సార్లు చూశాను.ఒక్కోసారి రాత్రివేళ సెల్ తలుపులు తీసి ఖైదీలను బిల్డింగు వెనక్కి లాక్కుపోయే వారు. ఖైదీల నోట్లో గుడ్డలు కుక్కి ఒళ్ళు హూనమయ్యేట్టు కొడుతున్నారని చప్పుళ్ళను బట్టి అర్థమయ్యేది. ఒక రోజు మేము సెల్స్ బయటికి వచ్చేసరికి బయట నే•ల మీద ఒక శవం కనిపించింది. ఒంటి నిండా దెబ్బలు ఉన్నాయి. మరణించిన వ్యక్తి కొద్దిరోజుల కిందటి వరకూ సింగపూర్ నగరంలో పోలీసు శాఖ అధిపతి అని తరవాత తెలిసింది. అతడి శవాన్ని ఈడ్చి మార్చురీలో వేశారు.
‘‘కొన్నాళ్లకు సుప్రీం కమాండర్ లార్డ్ మౌంట్‌బాటెన్ మా జైలు తనిఖీకి వచ్చాడు. ఒంటి మీద వట్టి గోచీలతో, చేతులు నెత్తిన పెట్టుకుని మేమందరం అతడి ఎదుట లైన్లలో నిలబడ్డాం…’’
[అదే గ్రంథం,పే. 171-176]
చాలా? ఆజాద్ హింద్ ఫౌజ్‌కు, ఆజాద్ హింద్ ప్రభుత్వానికి ఇంచార్జి అధినేతగా ఉన్న మేజర్ జనరల్ కియానీకి జరిగిన అవమానాలే అసలు అధినేత సుభాస్ చంద్ర బోస్‌కూ సింగపూర్ లో ఉండిపోయి తెల్ల మూకల పాలబడి ఉంటే తప్పక – బహుశా అంతకంటే ఎక్కువ – జరిగేవి అనటంలో సందేహమా? సింగపూర్ చేరీ చేరగానే తన సైన్యం చేత ఐఎన్‌ఎ అజ్ఞాతవీరుల స్మారక చిహ్నాన్ని డైనమైట్లు పెట్టి బద్దలు కొట్టించిన మౌంట్ బాటెన్ సాక్షాత్తూ ఐఎన్‌ఎ సుప్రీం కమాండరే తన కంట పడితే ఏమి చేసేవాడో ఊహించలేమా? అసలు మౌంట్‌బాటెన్ అనే తెల్లతోలు జాత్యహంకారి ఎదుట అశేష భారతీయుల ఆరాధ్య నాయకుడైన నేతాజీ సుభాస్ చంద్ర బోస్‌ను ఒంటిమీద వట్టి గోచీగుడ్డతో నెత్తిన చేతులు పెట్టుకుని నిలబడే దారుణ దృశ్యాన్ని ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరించదా? ప్రాణం కంటే జాతిగౌరవం మిన్నగా తలచే బోస్ అటువంటి – ఆత్మహత్యకంటే హీనమైన- పరాభవానికి లోనవకుండా తప్పించుకుని, తాను ఎప్పుడూ కోరుకున్నట్టుగా పోరాడుతూనే మరణించటం ఆయనకూ, భారత జాతికీ గౌరవప్రదం కాదా?
పట్టుబడ్డ ఐఎన్‌ఎ సైనికులను, ఆఫీసర్లను ఏమి చేయటానికీ ధైర్యం చాలక బ్రిటిషు సర్కారు వదిలిపెట్టింది. కాబట్టి ఒకవేళ నేతాజీ వారి చేతికి చిక్కినా వారిలాగే ఆయననూ వదిలివేసి ఉండేది అని ఊహించటం తప్పు. అలా వదిలివేయవలసి వస్తుందనే బ్రిటిషు ప్రభుత్వం హడలిపోయింది. అలాంటి అగత్యాన్ని నివారించటానికి తాను చేయగలిగింది తాను పాపభీతి లేకుండా తప్పక చేసేది. ఈ సంగతి అర్థం కావాలంటే ఈ విషయమై అత్యున్నత స్థాయిలో బ్రిటిషు సర్కారు పడిన మల్లగుల్లాలను గమనించాలి.
వైస్రాయ్ వేవెల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో హోమ్ మెంబరు ఆర్.ఎఫ్.ముడీ వైస్రాయ్ ప్రైవేట్ సెక్రెటరీ సర్ ఇవాన్ జెన్కిన్స్ కు 1945 ఆగస్టు 23న అంటే సరిగ్గా బోస్ మరణవార్తను జపాన్ వార్తాసంస్థ ప్రపంచానికి చాటిన రోజున రాసిన టాప్ సీక్రెట్ లేఖను ఇంతకు ముందు అధ్యాయంలో ప్రస్తావించాం. ఆ లేఖ, దానికి జతపరచిన నోట్ ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం:
టాప్ సీక్రెట్ నెం. 57 హోమ్ డిపార్ట్ మెంట్, 23 ఆగస్టు 1945
మై డియర్ జెన్కిన్స్,
లండన్ లో చర్చించటం కోసం వైస్రాయ్ గారు కోరిన ప్రకారం బోస్‌ను ఏమి చేయదగునన్న దానిపై నా నోట్‌ను దీనితో జతపరుస్తున్నాను. బోస్ కేసులో ఏ నిర్ణయం చేసినా దానికి మహారాజావారి ప్రభుత్వం మద్దతు తప్పనిసరిగా కావాలి.
బోస్‌ను ‘వార్ క్రిమినల్’ గా పరిగణించాలన్న మీ సూచనను నేను పరీక్షించాను. యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన విస్తృత నిర్వచనం ప్రకారం చూసినా అతడు ‘వార్ క్రిమినల్’ కాడు.
ఇట్లు, ఆర్.ఎఫ్.ముడీ
పై లేఖకు జతపరచిన నోట్ లోని అంశాలు:
సమీప భవిష్యత్తులో హోమ్ డిపార్టుమెంటు ఎదుర్కోబోయే బహు క్లిష్ట సమస్యల్లో సుభాస్ చంద్ర బోస్‌ను ఏమి చేయాలన్నది ఒకటి.
* * *
- ఇండియాలో కనుక బోస్ విచారణ జరిగితే అతడిని ఉరి తీయటం సాధ్యపడదు. అతడిని విడిచి పెట్టాలని గొప్ప వత్తిడి వస్తుంది. అతడి కార్య కలాపాలకు విపరీతమైన పబ్లిసిటీ వస్తుంది. అయితే ఇండియాలో విచారణ జరపటమే సరైన పని. మరణ శిక్ష అమలు చేయటం సాధ్యం కాదనుకుంటే, శిక్ష విధించిన వెనువెంటనే, ఆందోళన లేవటానికి ముందే అతడికి క్షమాభిక్ష పెట్టటం ఉత్తమం.
- విచారణ సింగపూర్‌లో జరిపితే ఇక్కడ లేచేంతటి ప్రజాందోళన అక్కడా తప్పదు. విచారణ అతిరహస్యంగా చేసి, మరణ శిక్ష అమలయ్యేవరకూ ఆ విషయం గోప్యంగా ఉంచగలిగితే ఏమో! అప్పుడు మనం న్యాయపరంగా హత్య చేశామన్న అపవాదు వస్తుంది. అదీ కాక ఐఎన్‌ఎ నాయకులందరినీ ఇండియాలో బహిరంగంగా విచారించి బోస్‌ను మాత్రం దేశం వెలుపల ఎందుకు విచారించారని అడిగితే ఏమి కారణం చెపుతాం? దానివల్ల దీర్ఘకాలంలో రాజకీయ పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.
- ఇండియా వెలుపల మిలిటరీ కోర్టు విచారణ జరిపి మరణశిక్ష అమలు చేసినా ఇదే సమస్య వస్తుంది. అలాంటి శషభిషకు మిలిటరీ ఎంతవరకు కలసివస్తుందన్నది ఆలోచించాలి.
- ఇండియాలో బోస్ ను నిర్బంధంలో ఉంచితే, జనాందోళన మూలంగా కొద్దికాలానికే అతడిని వదిలి వేయక తప్పదు. 1940 లో లాగా అతడు మళ్ళీ ఏ రష్యాకో పారిపోవచ్చు.
- బోస్‌ను నిర్బంధించకుండా ఉన్నచోటనే ఉండనివ్వటం అన్నిటికంటే సులభం. కొన్ని రకాల పరిస్థితుల్లో అతడిని రష్యా స్వాగతించవచ్చు. అతడు రష్యా చేరితే దీర్ఘకాలంలో పెను ప్రమాదం దృష్ట్యా అసలు అలాంటి ఆలోచననే తలపెట్టవద్దని సెక్యూరిటీ వర్గాల అభిప్రాయం.
- వేరే దేశానికి డిపోర్ట్ చేసి నిర్బంధంలో ఉంచటమా? లేక ఇండియాలో విచారణ జరిపి మరణ శిక్షను కమ్యూట్ చేయటమా? మనముందు నికరంగా ఉన్న చాయిస్ ఇంతే అని నాకు అని పిస్తున్నది.
[Wavell Papers, Official Correspondence : India, Jan-Dec 1945, pp.273-275]
నిజానికి హోమ్ మెంబరు చివరికి తేల్చిన రెండు ప్రత్యామ్నాయాలూ బ్రిటిషు ప్రభుత్వానికి ఆమోద యోగ్యం కాదు. సుభాస్ చంద్ర బోస్‌కు ఉన్న ప్రపంచ ఖ్యాతి, అపార ప్రజాబలం వల్ల అతడిని భూమండలంలో ఏ దేశాన నిర్బంధించినా పెద్ద అలజడి తథ్యం. ఇండియాలో విచారణ జరిపాక మరణ శిక్షను తగ్గించి అతడిని జైల్లో పెడితే జనం ఆ జైలును బద్దలుకొట్టయినా తమ నాయకుడిని విడిపించుకునే ఊపులో ఉన్నారు. దానికి వెరచి ప్రభుత్వమే అతడిని విడిచిపెడితే దాని నాశనాన్ని అది కోరి కొనితెచ్చుకున్నట్టే.
సూటిగా ఆలోచిస్తే తట్టే ప్రత్యామ్నాయాలేవీ పనికి రావనుకుంటే వక్రంగా ఆలోచించి చికాకును తొల గించుకోవటం ఒక్కటే ఉపాయం. వంకర బుద్ధులలో బ్రిటిషు వలస పాలకులను మించినవారు లేరు. చడీచప్పుడు కాకుండా మూడో కంట పడకుండా సుభాస్ చంద్ర బోస్‌ను మట్టుపెడితే ఏ గొడవా ఉండదు. అది ఎలాగో తెల్లవారికి ఒకరు నేర్పనవసరం లేదు. సింగపూర్ జైలులో కియానీతో పాటు బోస్ ఉండి ఉంటే సింగపూర్ పోలీసు బాస్ తెల్లవారేసరికి జైల్లో శవమైనట్టే – బోస్‌ను కూడా గుటుక్కుమనిపించి గుట్టు రట్టుకాకుండా నాటకమాడటం తెల్లదొరతనానికి వెన్నతో పెట్టిన విద్య. బోస్ లాగే జపాన్ సహాయంతో బ్రిటిషు వారితో పోరాడి బర్మాకు స్వాతంత్య్రం సాధించిన బర్మా జాతీయ నాయకుడు, ప్రధాన మంత్రి జనరల్ ఆంగ్ సాన్‌ను మంత్రివర్గ సమావేశం మధ్యలో ఆరుగురు మంత్రులతో బాటు 1947 జూలైలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపలేదా? తెల్ల దొరతనం తలచుకుంటే-తూర్పు ఆసియా తిరిగి దాని వశమ య్యాక కూడా బోస్ గువ్వపిట్టలా అక్కడే ఉన్నపక్షంలో – తన చేతికి మట్టి అంటకుండా సీక్రెట్ ఆపరేషన్ ద్వారా అతడిని మట్టు పెట్టలేదా?
అలాంటి అవకాశం అధర్ములకు ఇవ్వకూడదనే ధర్మవీరుడు సుభాస్ చంద్ర బోస్ వారిని తలదన్నిన తెలివితో దర్జాగా తప్పించుకు పోయాడు. అంతేగాని పిరికి పందలా పారిపోలేదు. చివరికి అతడు చిక్కింది కూడా మృత్యువుకే తప్ప శత్రువుకు కాదు. ఆ విధంగా మరణం లోనూ నేతాజీ జాతికి గర్వ కారణం కాలేదా? దేశం కోసం బలిపీఠంపై నిలబడి నిస్వా ర్థంగా, మహోగ్రంగా పోరాడిన విప్లవనాయకుడి ఉజ్జ్వల గాథకు దీనికి మించిన ముగింపు ఏమిటి?
మిగతా వచ్చేవారం