బుజ్జగింపు బురద ఎంత అంటించుకున్నా కాంగ్రెస్‌ పార్టీకి తృప్తినివ్వడం లేదు. ఇంకా ఇంకా ఆ బురదే పూసుకోవాలని అనుకుంటున్నది. ఆ పార్టీ  137వ వ్యవస్థాపక దినోత్సవ (డిసెంబర్‌ 28, 2021) సందేశంలో సోనియా గాంధీ ఏమన్నారు? హిందూ`ముస్లిం సామరస్యాన్ని సౌభ్రాత్రాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయట. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తుంటే, అది మొరాయించింది, జెండా కర్ర నుంచి ఊడి ఆమె చేతిలో పడిన రోజునే సోనియా ఆ మాటలు అన్నారు.

నిజం చెప్పాలంటే స్వాతంత్య్రోద్యమంలో మాదిరిగానే హిందూ ముస్లిం మతాల మధ్య సామరస్యాన్ని నీరసపరిచే పని, అవకాశం కాంగ్రెస్‌ మాత్రమే తీసుకోవాలని ఆమె భావం కావచ్చు. అర్హత లేకున్నా తమకూ దేశ చరిత్రలో స్థానం కల్పించు కునేందుకు చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారట బీజేపీ వారు. ఆ పార్టీ ఇంకొక అడుగు ముందుకేసింది. దేశంలో హిందూ ఆధిపత్య అజెండాను ముందుకు తెచ్చేందుకే మోదీ సర్కార్‌ క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించింది. మదర్‌ థెరిసా సంస్థకు చెందిన మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీస్‌ విదేశీ విరాళాల వివాదంలో చట్టాలను అతిక్రమించిన వాస్తవాన్ని కాకుండా, హిందూ మత ఆధిపత్యాన్ని చూస్తున్న పార్టీ కాంగ్రెస్‌. పార్టీ వ్యాఖ్య కూడా డిసెంబర్‌ 28వ తేదీనే వెలువడిరది. మిషనరీకి సంబంధించిన అనాథాశ్రమాలు, ఆసుపత్రులు, సహాయక శిబిరాలలో రోజువారీ సేవా కార్యక్రమాలు ప్రస్తుతం యథాతథంగా కొనసాగు తున్నాయని మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీస్‌ అధికారులు డిసెంబర్‌ 28న ప్రకటించారు. లైసెన్స్‌ పునరుద్ధరణ గురించి మరొకసారి ప్రభుత్వానికి విన్నవించుకునే అవకాశం ఉందని అధికారులు సూచనప్రాయంగా చెప్పారు. ఆడిటర్లు, నిపుణులతో చర్చిస్తున్నామన్నారు. ఇంత స్పష్టంగా, బీజేపీని పల్లెత్తు మాట అనకుండా చారిటీస్‌ ప్రకటిస్తే, దానిని కాంగ్రెస్‌ ఎంతో దూరం తీసుకుపోవాలని చూస్తున్నది.

భారత్‌లో క్రిస్టియన్లను అణచివేస్తున్నారని అంతర్జాతీయ (న్యూయార్క్‌ టైమ్స్‌) మీడియాలో వచ్చిన వార్తలను ఉటంకిస్తూ మన దేశంలోని పరిణామాలను ప్రపంచం చూస్తోందని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. అవన్నీ కాంగ్రెస్‌, దేశంలో ఉదారవాద మూక, కుహనా సెక్యులరిస్టులు రాయించిన వార్తలే కదా! కాంగ్రెస్‌కీ, సోనియాకి పెంపుడు చిలక వంటి చిదంబరం వ్యాఖ్యలు మరీ దారుణం. డిసెంబర్‌ 29న మాట్లాడుతూ ఈ పెంపుడు చిలక, మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీకి విదేశీ నిధులు నియంత్రణ చట్టం కింద రిజిస్ట్రేషన్‌ పొడిగింపు నిరాకరణ దారుణమని బాధపడి పోయారు. విదేశీ నిధుల స్వీకరణలో పాటించవలసిన నిబంధనలు అనుల్లంఘనీయమని ఈ మాజీ ఆర్థికమంత్రికి తెలియనిదా? హిందుత్వవాదులు ముస్లింల తరువాత ఇప్పుడు క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్నారని కూడా ట్వీట్‌ చేశారు. ఇంత అన్యాయం జరిగిపోతుంటే ప్రధాన మీడియా పట్టించుకోక పోవడం ఎంత ఘోరమో చూశారా అని కూడా వాపోయారు. ప్రభుత్వ వైఖరిక్రైస్తవ సంస్థలపట్ల ఉన్న పక్షపాతాన్ని రుజువు చేస్తున్నదని కూడా అన్నారు.

సరిగ్గా ఏ న్యూయార్క్‌ టైమ్స్‌లో అయితే రాహుల్‌ గాంధీ వార్త చూశానని చెప్పారో, అదే పత్రికను గోవాకి చెందిన ఒక ప్రముఖ జర్నలిస్ట్‌ (క్రైస్తవుడు) చూశారు. అందుకు ఆయన స్పందన వినదగినది. సావియో రోడ్రిగ్స్‌ అనే ఆ జర్నలిస్టు చెప్పిన సమాధానం నుంచి కాంగ్రెస్‌, అందులోని భారత వ్యతిరేక క్రైస్తవ ముఠా చాలా నేర్చుకోవాలి.

(గోవాక్రానికల్‌కామ్‌ వ్యవస్థాపక సంపాదకుడు సావియో రోడ్రిగ్స్‌ డిసెంబర్‌ 28, 2021న రాసిన ఈ వ్యాస రూపఖండన పలు ప్రముఖ ఆంగ్ల వార్తా చానళ్లలో వెలువడిరది)

 ఈ మాటలు చెప్పే ముందు ఒక వాస్తవాన్ని సుస్పష్టంగా, సాధ్యమైనంత మేరకు ఎలాంటి డొంకతిరుగుడు లేకుండా ప్రకటించనివ్వండి! నేనొక భారతీయ క్రైస్తవుడను. భారతదేశం నా మాతృభూమి. అలాగే నేను ఈ దేశంలో అణచివేతకో, అవమానా లకో గురైపోయిన క్రైస్తవుడిని కూడా కాదు.

న్యూయార్క్‌ టైమ్స్‌లో ఇటీవల వెలువడిన ‘అరెస్టులు, భౌతికదాడులు, రహస్య ప్రార్ధనలు: భారత దేశంలో క్రైస్తవుల అణచివేత’ వ్యాసం చదివాను. నా కుటుంబానికి సామాజిక మాధ్యమాల నుంచి, ఇంకా ఫోన్‌ ద్వారా వచ్చిన విషపు దాడులను చవిచూసి ఎక్కువ రోజులేమీ కాలేదు. ‘భారతదేశంలో క్రైస్తవులు ప్రమాదకర పరిస్థితులలో ఉన్నారు’ అంటూ ఢల్లీికి చెందిన ఒక ఆర్చ్‌బిషప్‌ ఇచ్చిన ప్రకటనను నేను వ్యతిరేకించి, నిలదీసినందుకు క్రైస్తవులలోనే ఒక వర్గం నా మీద ఇలాంటి దాడికి పాల్పడిరది. నేను ఆయన ప్రకటనతో విభేదించాను.

గతవారం (2021, డిసెంబర్‌ 3వ వారం)లోనే మరొక ఆర్చ్‌బిషప్‌ అన్నమాటతో కూడా నేను విభేదిం చాను. నా టీవీ కార్యక్రమంలోనే ఆయన ‘కర్ణాటక క్రైస్తవులకు ఇవి మంచిరోజులు కావు’ అన్నారు.

కేథలిక్‌ చర్చ్‌కు చెందిన కొందరు నాయకులు ఇచ్చిన కొన్ని సందేశాలను నేను వ్యతిరేకించడానికి కారణం ఉంది. అదేమిటంటే`దేశంలో క్రైస్తవుల పరిస్థితి గురించి చెప్పదలచుకుంటే, అలాగే చెప్పవచ్చు. కానీ కొందరు క్రైస్తవుల మీద మాత్రమే జరిగిన అణచివేతను మొత్తం ఆ వర్గం మీద జరిగినట్టు చెప్పలేం. అదే అందరి క్రైస్తవుల పరిస్థితి అనలేం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే` ‘భారతదేశంలో క్రైస్తవులు ప్రమాదంలో ఉన్నారు’, ‘కర్ణాటక క్రైస్తవులకు ఇవి మంచిరోజులు కావు’ వంటి ప్రకటనలు క్రైస్తవులకే మంచిది కాదు. అలాంటి ప్రకటనలు వారికి ఏ విధంగాను సాయపడలేవు కూడా. అంతేకాదు, దేశంలో ఉన్న క్రైస్తవుల విశ్వాసాల విషయంలో నిస్సహాయతా భావాన్ని, భయాందోళనలను కలిగిస్తాయి.

ఒక హిందువు భారతమాతకు కుమారుడో, కూతురో ఎలా అవుతారో, ఒక క్రిస్టియన్‌ విషయమూ అంతే. మన జాతీయతను మన మతం నిర్ధారించ లేదు. అసలు మన జాతీయతను మతం నిర్ధారించే పరిస్థితిని రానివ్వకూడదు కూడా.

 నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని హిందువుల ఆధిక్యంలోని పార్టీ ప్రభుత్వమంటూ కొందరు చర్చ్‌ పెద్దలు తమ తమ ప్రకటనలతో చిత్రించడం దురదృష్టకరం. వాస్తవంగా చెప్పాలంటే, అసలు సమస్య ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ కానే కాదు. భారతదేశంలో క్రైస్తవులకీ, హిందువులకీ మధ్య సహిష్ణుత లేకుండా పోవడానికి కారణం ఏదైనా చెప్పాలంటే, అది మత మార్పిడులే.

హిందూ విశ్వాసాలకీ, సంస్కృతికీ తామే దీపధారులమని తమకి తాము చెప్పుకునే కొన్ని మూకలు కొన్ని అవాంఛనీయ చర్యలకూ, ఖండిరచ దగిన పనులకూ దిగారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదో కొద్దిమంది ప్రదర్శిస్తున్న ఇలాంటి మూకస్వామ్య ధోరణిని, క్రైస్తవులు సహా వేర్వేరు మతాల వారితో కలసి మెలసి భారతదేశంలో నివసిస్తున్న మొత్తం హిందువుల మనస్తత్వంగా అభివర్ణించలేం.

దేశంలోని కొన్ని ప్రాంతాలలో హిందువులకీ, క్రైస్తవులకీ మధ్య పెరుగుతున్న ఘర్షణ వాతావరణానికి వెనుక ఉన్న వాస్తవం మతాంతరీకరణలే. మరీ ముఖ్యంగా బలవంతపు లేదా ప్రలోభాలతో సాగుతున్న మతమార్పిడులు కారణం. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌, చత్తీస్‌ఘడ్‌, ఒడిశా, జార్ఖండ్‌, కర్ణాటక` ఈ తొమ్మిది రాష్ట్రాలు మతమార్పిడి నిరోధక బిల్లులు తెచ్చాయి. అంటే దేశంలో ఆందోళన కలిగించే రీతిలో పెరుగుతున్న మతాంతరీకరణలకు అడ్డుకట్ట వేయడానికి ఒక చట్టం వచ్చింది.

మతస్వేచ్ఛ ప్రతి పౌరుని రాజ్యాంగబద్ధ హక్కు. ఇతరుల విశ్వాసాలను గౌరవిస్తున్నంత వరకు కూడా ఎవరి విశ్వాసాలతో వారు ఉండడానికి దేశంలో అవకాశం ఉంది. హిందువులను, హిందూత్వను అవమానిస్తూ క్రైస్తవంలోకి తీసుకురావడం మాత్రం రాజ్యాంగానికి విరుద్ధమే. భారతదేశంలో క్రైస్తవులకు రాజ్యాంగం స్వేచ్ఛను ఇచ్చిందీ అంటే అది అలాంటి స్వేచ్ఛ మాత్రం కాదు.

తమకి తామే హిందూత్వకు దీపధారులమని చెప్పుకుంటూ ఇటీవలి కాలంలో దాడులుకు దిగిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవలసిందే. ఆ దాడులను ఖండిరచవలసిందే. పాశవిక ప్రవృత్తితో, అవతలి వారిని భయపెట్టే విధంగా దాడులు చేస్తే చర్యలు తీసుకోవాలి. అదే విధంగా హిందూధర్మం నుంచి క్రైస్తవంలోకి మార్చడానికి క్రైస్తవ మిషనరీలు చేస్తున్న అకృత్యాల విషయంలో కూడా అధికారులు కఠినంగా వ్యవహరించాలి. బలవంతంగా, ప్రలో భాలతో హిందూమతం నుంచి క్రైస్తవంలోకి మార్చేవారిపై చర్యలు తీసుకోవాలి.

ఒక తోటమాలి పళ్లను ఆశించి ఎలా తోటంతా చెట్ల కోసం విత్తనాలు నాటుతాడో, క్రైస్తవ మత ప్రచారకులు చిరకాలంగా భారతదేశమంతా చర్చ్‌ల ద్వారా క్రైస్తవ విశ్వాసం అనే విత్తనాలు నాటుతూనే ఉన్నారు. భారతదేశంలో పనిచేస్తున్న ఎక్కువ మిషనరీల దృష్టంతా దళితుల మీదే కూడా.

క్రైస్తవం స్వీకరిస్తే మంచి విద్య, ఆరోగ్యరక్షణ, ఉద్యోగభద్రత ఉండగలవన్న ప్రలోభంతో ఆ మత ప్రచారకులు దేశంలో బడుగువర్గాలను, ఉపేక్షిత వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ ప్రపంచంలో ఒక మంచి జీవితం కావాలంటే మొదట కావలసినది క్రైస్తవంలో నమ్మకమని, ఆయన బోధనల మీద విశ్వాసమని చెబుతున్నారు. ఆ విధంగా అంతవరకు వారు నమ్ముతూ వస్తున్న విశ్వాసాలలో అపనమ్మకం కలిగించి, సందేహాలు సృష్టించి, ఇతర మతానికీ, అందులోని విశ్వాసాలతో ప్రాప్తించే సౌభాగ్యానికీ ముడి పెడుతున్నారు.

హిందువుల విశ్వాసాలను అవహేళన చేయడం, అపహాస్యం చేయడమే ఇరుసుగా కొన్ని క్రైస్తవ సంస్థలు పని చేస్తున్నాయి. భారతీయ సమాజంలోని కొన్ని అవకరాలను తమకు అనుకూలంగా మలుచు కుంటున్నాయి. అలాగే ఉపేక్షిత వర్గాల పురోభివృద్ధిలో ఇంతకు ముందు పాలించిన ప్రభుత్వాలు మిగిల్చిన వైఫల్యాలను సైతం క్రైస్తవ సంస్థలు ఆసరా చేసుకుంటు న్నాయి. ఇవన్నీ వాటి దృష్టిలో తమ మత మార్పిడుల అజెండా అమలుకు తోడ్పడేవే.

ఏమైనప్పటికీ ఒకటి వాస్తవం. సామాజిక సమస్యలు మత మార్పిడులతోనో, చర్చ్‌లతోనో పరిష్కారం కావు. ఆ సమస్యలు మంచి పాలనతో, దేశానికి రాజ్యాంగం ఇచ్చిన సమాన హక్కుల అమలు తోనో పరిష్కారమవుతాయి. అంతే తప్ప మత ప్రబోధాలతో కాదు.

క్రైస్తవంలోకి మతాంతరీకరణలు, స్వస్థత కోసమంటూ క్రైస్తవ సంఘాల మత ప్రార్థనలు దేశంలో పుంఖానుపుంఖాలుగా జరుగుతున్నాయి. ఈ పేరుతో కొందరు పాస్టర్లు హిందువుల విశ్వాసాలను బాహాటం గానే పరిహాసం చేస్తున్నారు. మోహన్‌ లాజరస్‌ అనే పేరుపొందిన ఒక క్రైస్తవుడు తన ప్రబోధాలలో హిందూ దేవాలయాలను ‘సైతాను కంచుకోటలు’ అని వ్యాఖ్యానించాడు. ‘సత్యం’ అనే పేరుతో తమిళభాషలో ప్రసారాలు చేసే చానల్‌ ఇతడిదే. హిందూయిజంపైన, హిందూ ఆధ్యాత్మిక గురువులపైన, హిందువులపైన ఇతడి టీవీ చానల్‌ నిరంతరం అవమానకరమైన వ్యాఖ్యలు ప్రసారం చేస్తుంది.

గాస్పెల్‌ ఫర్‌ ఆసియా ఇచ్చిన నివేదికలో భారత్‌ మీద అది ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘అత్యధికులు సైతాను బానిసత్వంలో ఉన్నారు. ప్రభువా! ఎక్కువమంది ప్రజలను అంధకారంలో ఉంచిన ఈ సైతానుకు చెందిన ఈ బలమైన కోటను దయవుంచి బద్దలుకొట్టు.’ హిందువుల దేవతలను, విశ్వాసాలను ఎగతాళి చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు మిషనరీలు ఆ విషయాన్ని దాచుకోవడం లేదు కూడా. అలాగే సైతాను బానిసత్వం నుంచి భారత్‌ను విముక్తం చేస్తామన్న వాదననీ దాచుకోవడం లేదు.

మతమార్పిడులు, హిందువుల విశ్వాసాలను అవహేళన చేయడం ద్వారా వచ్చిన ఘర్షణతోనే, దానితోనే క్రైస్తవులు అణచివేతకు గురి అవుతున్నారని చెప్పడం సరికాదు. ఇలాంటి రొడ్డకొట్టుడు వ్యాఖ్యలతో ఈ రెండు మతాలకు మధ్య దూరం ఇంకా పెరుగుతుంది. క్రైస్తవుల మాదిరిగానే, హిందువుల కూడా తమ మతాన్ని రక్షించుకునే హక్కును ఇక్కడి చట్టాల మేరకు ఈ నేల మీద కలిగి ఉన్నారు.

అలాగే క్రైస్తవం అంటే కేథలిక్‌ చర్చ్‌ చెప్పినదొక్కటే కాదని హిందూ సోదరసోదరీమణులు అర్ధం చేసుకోవాలి. భారతదేశంలో అనేక శాఖల వారు క్రైస్తవాన్ని బోధిస్తూ, ప్రచారం చేస్తున్నారు. వీరంతా కూడా బలవంతపు మత మార్పిడుల పనిలో లేరు. ప్రతి క్రైస్తవ సంస్థకు మత మార్పిడి అజెండా ఉందని చెప్పడం సరికాదు. కేథలిక్‌ చర్చ్‌ ఈ దేశంలో ఎన్నో విద్యా సంస్థలను, సేవా సంస్థలను, ఆసుపత్రులను నిర్వహిస్తున్నది. అక్కడికి వచ్చిన వారందరినీ మతం మారుస్తారని చెప్పడం సరికాదు. అలాగే ఈ విద్యాసంస్థల నుంచి ఎందరో ప్రముఖులు, నాయకులు వచ్చారు. వారెవరూ మతం మార్చుకోలేదు.

అయితే మత మార్పిడి ఒక వాస్తవం. దాని మీద ఒక కన్నేసి ఉంచాలి. ఇదే మన దేశంలో మత సమస్య పరిష్కారం పేరుతో మూకస్వామ్యానికి బాటలు వేస్తోంది. దాని కట్టడికి చట్టాలు ఉండాలి. ఆ చట్టాలకు కట్టుబడి ఉండాలి. హిందూ విశ్వాసాలకు తామే దీపధారులమంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న వారి చర్యలను నేను నిరసిస్తాను. అలాగే క్రైస్తవ విశ్వాసాలకు తాము మాత్రమే రక్షకులమని చెప్పుకుంటూ, భారతీయులను క్రైస్తవంలోకి తీసుకురావడమే తమ జీవితధ్యేయమని అనుకుంటున్నవారి అత్యుత్సాహాన్ని కూడా నేను నిరసిస్తాను.

నేనొక భారతీయ క్రైస్తవుడను. నా దేశం నాకిచ్చిన స్వేచ్ఛతో నేను నా తల్లిదండ్రులతో, నా భార్యతో, నా ఇద్దరు కుమార్తెలతో నివసిస్తున్నాను. ఇటు క్రైస్తవులలో గాని, హిందువులలో గాని ఏ కొందరో అవాంఛనీయ వ్యక్తులు నాకు క్రైస్తవంలో ఉన్న విశ్వాసాన్ని మార్చలేరు. అలాగే భారత్‌ నా దేశం అన్న నా నిబద్ధతను కూడా వారు చెడగొట్టలేరు. హిందూ సోదరసోదరీ మణులంతా కూడా ఎంతో గొప్పదైన భారతమాత కుటుంబానికి చెందిన వారిగానే భావించే నా దృష్టిని కూడా మార్చలేరు.

About Author

By editor

Twitter
YOUTUBE