తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్లుండగానే రాజకీయ పార్టీల కార్యాచరణ, నేతల పరస్పర విమర్శలు, ఎత్తుగడలు, వ్యూహాలు తారస్థాయికి చేరుకున్నాయి. ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. బీజేపీ నేతలే లక్ష్యంగా కేసీఆర్ తనదైన వ్యూహాలను అమలు చేస్తుండగా.. కమలనాథులు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా తామేమీ తక్కువ తినలేదని, రెండాకులు ఎక్కువే చదివామని నిరూపించే కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు.
రాజకీయాలంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఒక్క రోజులోనే, ఒక్క సంఘటనతోనే పరిస్థితులు తారుమారు కావొచ్చు. అది ప్రత్యర్థి పార్టీ పుంజుకునేందుకూ.. అధికార పార్టీ వేగానికి కళ్లెం వేసేందుకూ కారణం కావొచ్చు. ప్రస్తుతం తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జైలుకు వెళ్లి రావడంతో ఒక్కసారిగా పార్టీలో జోష్ మరింత పెరిగిందని చెబుతున్నారు. ఇక టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై బీజేపీ పోరాటం మరో స్థాయికి చేరబోతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.
వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌కు రాష్ట్రంలో ఇక తిరుగే లేదని అంతా అనుకున్నారు. కానీ ఏడేళ్లుగా ఆధిపత్యం చలాయించిన ఆ పార్టీకి దాదాపు రెండేళ్ల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఊహించని ఆటుపోట్లు, ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మార్చి, 2020లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ తనదైన దూకుడుతో కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ సాగుతున్నారు. శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపి పార్టీ బలోపేతం కోసం కృషిచేస్తున్నారు. దానికి తోడు దుబ్బాక ఉపఎన్నికలో, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్‌కు బీజేపీ షాక్ ఇచ్చింది. ఆ విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో సంజయ్ మరింత వేగం పెంచారు. నిరసనలు, ఆందోళనలతో పార్టీని పరుగులు పెట్టిస్తూ కేసీఆర్‌కు దడ పుట్టిస్తున్నారు. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలవడంతో ఇక కమలానికి ఎదురు నిలిచేవాళ్లే లేకుండా పోయారు అన్నట్లుగా మారింది పరిస్థితి.
జీవో 317కి వ్యతిరేకంగా ఉద్యమం..
ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీల కోసం తెచ్చిన 317 జీవోను సవరించా లని డిమాండ్ చేస్తూ జాగరణ దీక్షకు పూనుకున్న బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి 14 రోజుల రిమాండ్‌కు జైలుకు తరలించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన సంజయ్ జైలునుంచి బయటికి వచ్చారు. ఈ వ్యవహారం మొత్తం బీజేపీకి లాభాన్ని చేకూరిస్తే.. టీఆర్‌ఎస్‌ను మరింత ఇబ్బంది పెట్టిందని విశ్లేషకులు అంటున్నారు. సంజయ్‌ను కక్ష పూరితంగానే కేసీఆర్ జైల్లో పెట్టించారనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ సఫలమైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల కోసమే తాను జైలుకు వెళ్లానన్న సంజయ్‌కి ఆ వర్గంలో ఆదరణ పెరుగుతోంది. దీంతో కేసీఆర్‌పై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని పార్టీ భావిస్తోంది.
కీలక నేతలంతా రాష్ట్రానికి..
అంతేకాదు, సంజయ్‌కి జాతీయ నాయకత్వం పూర్తి స్థాయిలో అండదండలు కూడా అందిస్తోంది. సంజయ్ పోరాట కార్యాచరణలో జాతీయ స్థాయి నేతలను కూడా భాగస్వామ్యం చేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఛత్తీస్‌ఘడ్ సీఎం, మధ్యప్రదేశ్ సీఎం, అస్సాం సీఎం వంటి కీలక నేతలను తెలంగాణకు రప్పించింది. మరికొందరు ముఖ్యనేతలు సైతం ఆందోళనల్లో పాల్గొనేలా ప్రణాళిక రూపొందించింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. అసెంబ్లీలో పెద్దగా బలం లేక పోయినా కేంద్రం అండతో 2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. పార్జీ జాతీయ నేతలంతా రాష్ట్రంలో పర్యటిస్తూ టీఆర్‌ఎస్‌ని విమర్శిస్తున్నారు. నియంత పాలన చేస్తున్న కేసీఆర్ విధానాలను ఖండిస్తున్నారు.
హైదరాబాద్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ సమావేశా లకు హాజరయ్యేందుకు వచ్చిన నడ్డా.. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా జరగనున్న ర్యాలీలో పాల్గొంటా రని అంతా భావించారు. అయితే, కరోనా పరిస్థితుల దృష్ట్యా క్యాండిల్ ర్యాలీనీ స్వచ్ఛందంగా రద్దు చేసుకు న్నారు. కొవిడ్ నిబంధనలతో నిర్వహించిన సికింద్రా బాద్‌లో జరిగిన నిరసన కార్యక్రమానికి నడ్డా హాజర య్యారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ప్రజాస్వా మ్యాన్ని హత్య చేసిందని మండిపడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చివరి వరకూ బీజేపీ పోరాడుతుందని నడ్డా స్పష్టంచేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కేసీఆర్‌ని ఢీకొట్టేది కేవలం బీజేపీయేనని అన్నారు. త్వరలోనే కేసీఆర్ ముసుగు తీస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ టీఆర్‌ఎస్‌పై తనదైన శైలిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, అన్యాయంపై ధర్మయుద్ధంలో టీఆర్‌ఎస్‌ను ఓడించి బీజేపీ అధికారం లోకి వస్తుందని అన్నారు. ఈ సంఘర్షణ పోరాటాన్ని ప్రకటించడానికే తాను ఇక్కడకు వచ్చానన్నారు. కేసీఆర్ భయకంపితులై ఉన్నారని, ఇంతగా భయపడే పిరికి సీఎంను తానెక్కడా చూడలేదని చౌహాన్ పేర్కొన్నారు. కేసీఆర్ పాలనను అంతమొందించేవరకు పార్టీ విశ్రమించే ప్రసక్తే లేదని శివరాజ్‌సింగ్ స్పష్టం చేశారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాలు, కేజీ టు పీజీ తదితర హామీల అమలు ఏమైందని ప్రశ్నించారు. వీటన్నింటిపై సమాధానాలు చెప్పకపోతే ప్రజలే కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తారన్నారు.
అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ వరంగల్‌లో బండి సంజయ్‌తో కలిసి ధర్ణాలో పాల్గొన్నారు. కమ్యూనిస్టులకు కేసీఆర్ విందు భోజనాలు ఏర్పాటు చేయడం చూస్తుంటే, కనుమరుగై పోయే పార్టీలన్నీ ఒక్కదగ్గర చేరుతున్నట్టు కనిపి స్తోందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన కమ్యూనిస్టులతో కేసీఆర్ దోస్తీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక సంవత్సరంలో లక్ష మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే సమగ్రమైన కార్యాచరణను అస్సాంలో తమ ప్రభుత్వం అమలు చేయబోతోందని.. ఇక్కడ సీఎం కేసీఆర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా, ఉన్న ఉద్యోగులను చెట్టుకొకరిని, పుట్టకొకరిని పంపి ఇబ్బందుల పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2023లో టీఆర్‌ఎస్‌ను నిరుద్యోగులు, ఉద్యోగులే పాతర పెడతారని హిమంత హెచ్చరించారు.
బెంగాల్ తరహా వ్యూహం!
గతంలో జరిగిన బెంగాల్ ఎన్నికల్లో కూడా బీజేపీ జాతీయ నాయకత్వం ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేశారు. ప్రతి వారం ఢిల్లీ నుంచి ముఖ్య నేతలు వెళుతూ కార్యకర్తల్లో జోష్ నింపేవారు. బీజేపీ అక్కడ సర్వశక్తులు ఒడ్డినా మమతా బెనర్జీని అధికారం నుండి దింపలేకపోయారు. కానీ మూడు స్థానాల నుండి 77 స్థానాలకు బీజేపీ ఎదిగింది. ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించింది. రెండుసార్లు ముఖ్య మంత్రిగా చేసిన మమతా బెనర్జీని ఆమె సొంత నియోజకవర్గంలో ఓడించారు. ఇప్పుడు తెలంగాణలోనూ బీజేపీ అదే రకమైన ప్రణాళిక అవలంబిస్తూ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. రాబోయే ఎన్నికల నాటికి రాష్ట్రంలోని పలువురు కీలక నేతలు బీజేపీలో చేరేందుకు క్యూ కట్టనున్నట్లు సమాచారం. దీంతో విజయం ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాష్ట్ర బీజేపీ నేతల్లో ఎప్పటికప్పుడు ఉత్సాహం నింపేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనా వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర బీజేపీకి మరింత బలం చేకూర్చాలని జాతీమ నాయకత్వ చూస్తున్నట్లు తెలుస్తోంది.
– సుజాత గోపగోని, 6302164068, సీనియర్ జర్నలిస్ట్